
మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇవ్వలేదుగానీ నిధులిచ్చేశారు
లబ్దిదారుల ఎంపిక పేరుతో రూ.60 లక్షలు విడుదల.. మిషన్ల కొనుగోలులో రూ.వంద కోట్ల గోల్‌మాల్
రూ.60 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సు విడుదలకు రంగం సిద్ధం
అత్యధిక మొత్తానికి కోట్ చేసిన సంస్థలకు కట్టబెట్టేసిన వైనం.. నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీ అంటూ ఆర్భాటం
సాక్షి, అమరావతి: స్కీముల పేరుతో స్కామ్‌లకు కూటమి ప్రభుత్వం తెర తీసింది. అసలు ఇంతవరకు లబ్దిదారుల ఎంపికే జరగలేదు. కానీ శిక్షణ పూర్తైనట్లు రూ.60 లక్షలు నిధులు మాత్రం విడుదల చేసేశారు. కుట్టు పనుల్లో శిక్షణ (టైలరింగ్), మిషన్ల పంపిణీ పేరుతో రూ.255 కోట్లతో చేపట్టిన స్కీమ్‌లో రూ.వంద కోట్లకుపైగా కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. వాటాలు కుదరడంతో నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ఖరారు చేశారు. అసలు శిక్షణ ప్రక్రియే చేపట్టకుండా 1.02 లక్షల మంది మహిళలకు సీఎం చంద్రబాబు నేడు కుట్టు మిషన్లు పంపిణీకి సిద్ధమయ్యారు. బీసీ సంక్షేమ శాఖలో అవినీతి బాగోతం ఇదీ!
మూడేళ్లలో రూ.300 కోట్లు!
మార్కెట్‌లో కుట్టు మిషన్లు రూ.5 వేల నుంచి రూ.13 వేల లోపే దొరుకుతున్నాయి. నాణ్యమైన మిషన్ అందచేసినా రూ.13 వేలు లెక్కన రాష్ట్రంలో 1,02,832 మంది మహిళా లబ్దిదారులకు అందించాలంటే రూ.1,33,68,16,000 వ్యయం అవుతుంది. కానీ ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్ లెక్కలో మాత్రం మిషన్ల కొనుగోలుకు రూ.224,05,03,616 ఖర్చు చూపించారు.
అంటే రూ.133.68 కోట్లు వ్యయం అయ్యే వాటిని ప్రభుత్వం రూ.224.05 కోట్లకు కట్టబెట్టింది. ఈ స్కామ్‌లో ఈ ఏడాది దాదాపు రూ.వంద కోట్లు స్వాహా చేసేలా పథకం రూపొందించారు. మూడేళ్లలో రూ.300 కోట్లకుపైగా ప్రజా ధనాన్ని కాజేసేందుకు ప్లాన్ వేశారు.
వ్యయం పెంచేసి..
నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్) అనే విభాగం ఉంది. దాన్ని కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార ఆర్థిక సంస్థ (ఏపీబీసీసీఎఫ్‌సీఎల్) ద్వారా కుట్టు మిషన్ల స్కామ్‌కు శ్రీకారం చుట్టారు.
మొదట రూ.వంద కోట్లతో చేసిన ప్రతిపాదనలను కొనుగోలు, శిక్షణ, పంపిణీ పేరుతో రూ.255 కోట్లకు పెంచారు. మొత్తం 46,044 మంది బీసీ మహిళలు, 45,772 మంది ఈడబ్ల్యూఎస్, 11,016 మంది కాపు మహిళా లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చాక ఉచితంగా కుట్టు మిషన్ అందించాల్సి ఉంటుంది.
ముందస్తు ఒప్పందంతోనే టెండర్ ఖరారు..
ఏ టెండర్ పిలిచినా తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థకు ఖరారు చేయాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచిత శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీకి గతేడాది డిసెంబర్ 18న ఆన్‌లైన్ బిడ్‌లను పిలిచారు. అదే నెల 31న టెక్నికల్ బిడ్‌లను తెరిచి మూడు సంస్థలకు అర్హత ఉన్నట్లు ఖరారు చేశారు. తాజాగా ఆ మూడు సంస్థలకు ఫెనాన్షియల్ బిడ్‌లలో టెండర్ కట్టబెడుతూ ఆమోద ముద్ర వేశారు.
యూనిట్ (ఒక్కో కుట్టు మిషన్) రూ.21,788 చొప్పున సరఫరాకు శ్రీటెక్నాలజీ ఇండియా (ఎల్‌ఎల్‌పి, హైదరాబాద్) ముందుకు రాగా సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్ ఎంపవర్‌మెంట్ రూ.23,400 చొప్పున సమకూర్చనున్నట్లు తెలిపింది. సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ రూ.23,500 చొప్పున సరఫరా చేస్తామని బిడ్‌లు దాఖలు చేసింది. ఈ మూడు సంస్థలకు ఎంపానల్‌మెంట్ చేస్తూ ప్రభుత్వం టెండర్ ఖరారు చేయడం గమనార్హం.
తక్కువ ధరకే కుట్టు మిషన్ సరఫరా చేస్తామని బిడ్ వేసిన సంస్థకు టెండర్ ఇవ్వాల్సి ఉండగా, ఎక్కువ ధర కోట్ చేసిన మరో రెండు సంస్థలకు కూడా అవకాశం ఇవ్వడం వెనుక ఏం జరిగిందనేది బహిరంగ రహస్యమే! మరో చిత్రం ఏమిటంటే ఎక్కువ మొత్తానికి బిడ్స్ వేసిన రెండు సంస్థలు ఒకే సిండికేట్ కావడం గమనార్హం.

శిక్షణ ఇవ్వలేదుగానీ నిధులిచ్చేశారు..
ప్రభుత్వం టెండర్‌లో పొందుపరిచిన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో కుట్టుమిషన్ కేవలం రూ.5 వేల నుంచి రూ.13వేల లోపు మాత్రమే పలుకుతోంది. కుట్టు మిషన్‌తోపాటు శిక్షణ కూడా అందించేలా ఒక్కో యూనిట్‌కు రూ.25 వేలు చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఎక్కడైనా సరే టెండర్ దక్కించుకున్నవారు పనులు మొదలుపెట్టి తరువాత బిల్లులు సమర్పిస్తారు.
కానీ ఇక్కడ మాత్రం టెండర్ ఖరారు కాగానే ఆర్డర్ ఇవ్వకముందే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో రూ.60 కోట్లు (టెండర్ మొత్తంలో 25 శాతం) ఇచ్చేలా ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లోనే ఆగమేఘాలపై ఫైల్ కదిలింది. లబ్దిదారుల ఎంపిక, శిక్షణ కార్యక్రమాలను చేపట్టకుండానే ఎంటర్‌ప్రైజర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఈడీపీ) పేరుతో ఏకంగా రూ.60 లక్షలను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) సంస్థకు ఇచ్చేయడం అనుమానాలకు తావిస్తోంది.
టెండర్ ఖరారయ్యాక జిల్లాల వారీగా లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి శిక్షణ పూర్తయ్యాక ఇవ్వాల్సిన నిధులను ముందుగానే విడుదల చేయడంతో అవి ఎవరి జేబులోకి చేరాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.