Tailoring
-
స్రీల శ్రమకు అర్థం లేదా..!
మహిళలకు ఉపాధి దానివల్ల వారికి ఆర్థిక స్వావలంబన సమాజంలో లైంగిక వివక్షను చెరపగలదు. కాని స్త్రీ, పురుషులకు ఉపాధి కల్పించడంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. తమ జీతభత్యాల బేరసారాల్లో స్త్రీల గొంతు బలపడుతున్నా వారు పొందుతున్నది తక్కువే. ఇక పనిచోట వారి శ్రమదోపిడి తీవ్రం. తమిళనాడులో విస్తారంగా ఉన్న రెడిమేడ్ దుస్తుల రంగంలో స్త్రీల పని పరిస్థితులు ఒక నమూనా. శ్రమ తప్ప ఆదాయం లేని ఉపాధి స్త్రీలకు కొనసాగాల్సిందేనా? స్త్రీలు ఉపాధి పొందాలంటే అంత సులభమా? చెంగల్పట్టులో ఉన్న అనేక ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ మాన్యుఫ్యాక్చర్ కంపెనీల్లో ఆ చుట్టుపక్కల పల్లెల్లోని స్త్రీలు వేలాదిగా పని చేస్తారు. వారంతా ఉదయం నాలుగున్నరకే లేచి ఇంట్లో వంట చేసి పిల్లలకు క్యారేజీలు కట్టి తాము టిఫిన్, లంచ్ కట్టుకుని ఏడూ ఏడున్నరకంతా కంపెనీ బస్సు కోసం నిలుచోవాలి. 9 గంటలకు ఫ్యాక్టరీలో డ్యూటీ ఎక్కితే తిరిగి సాయంత్రం 6 గంటల వరకూ నిలుచునే పని చేయాలి. మళ్లీ బస్సెక్కి ఇల్లు చేరి రాత్రి వంటకు పూనుకోవాలి. ఇంతా చేసి వారికి నెలకు దక్కేది ఎంతో తెలుసా? 9,500 రూపాయలు. సీనియర్లకైతే 10,500 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ కటింగు, ఫ్యాక్టరీలో ఇచ్చిన టీ, బిస్కెట్ల కటింగు పోను వచ్చే జీతం ఇంతే. కాని వీరు తయారు చేసిన బట్టలు పోలో, ఇండియన్ టెరైన్ వంటి బ్రాండ్లుగా యూరప్, జపాన్, కెనడా, అమెరికాల్లో ఖరీదైన వెలకు అమ్ముడుపోతాయి. తమిళనాడులో గార్మెంట్ ఫ్యాక్టరీల్లో 5 లక్షల మంది స్త్రీలు పని చేస్తున్నారు. మొత్తం ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది టైలరింగ్ ఉపాధిలో ఉంటే వారిలో 60 శాతం మంది మహిళలు. తమిళనాడులో వ్యవసాయం తగ్గాక రైతు కూలీలుగా పని చేసే స్త్రీలు ఫ్యాక్టరీల వైపు అడుగులు వేస్తున్నారు. కాని వారి శ్రమను దోచుకునే సమస్త ఏర్పాట్లు ఇదివరకే జరిగిపోయి ఉన్నాయి. అందుకే ఇటీవల చెన్నైలో ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. కోర్టులు కూడా వీరి జీతం పెంచమని చెప్పినా తమిళనాడులోని 500 మంది గార్మెంట్ ఫ్యాక్టరీల యజమానులు జీతాలు పెంచితే ఖర్చు పెరిగి ఆర్డర్లు తగ్గుతాయని, దుస్తుల కంపెనీలు ఆర్డర్లను శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు చీప్ కూలీల కోసం తరలిస్తాయని అభ్యంతరం చెబుతున్నారు. అయితే ఆ మాటలన్నీ సాకులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త జీతాలైనా ఎంతని? 15,000 మాత్రమే. ఆ 15 వేలు కూడా ఇవ్వం అంటున్నారు. స్త్రీలు ఉపాధి పొందితే ఆ ఆర్థిక స్వావలంబనతో వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు వారి అభిలాషల మేరకు నెరవేర్చుకోవచ్చు. భర్తమీద ఆధారపడవలసిన పని లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని వారికి లభిస్తున్న ఉపాధి వారికి ఏ ఆదాయమూ మిగల్చనిది అయితే ఆ శ్రమకు అర్థం లేదు. జీతాలు ఎప్పుడూ పురుషుల కోసమే అనే మైండ్‌సెట్ సమాజంలో పోలేదు. స్త్రీల జీతం కోసం పెంపునకు యోగ్యమైనదే అని గ్రహించినప్పుడే పరిస్థితిలో కొద్దిగానైనా మార్పు వస్తుంది. ఇవి చదవండి: మీ అమ్మాయికి చెప్పండి! -
ఆ ఊళ్లో అందరూ ‘లచ్చుమమ్మను చూసి నేర్చుకోవాలె’ అంటుంటారు
‘ఏ వయసులో అయినా సరే ఎవ్వరిపైనా ఆధారపడకూడదు’ అని టైలరింగ్ చేస్తూ తన రెక్కల కష్టం మీదే బతుకుతోంది 70 ఏళ్ల లచ్చుమమ్మ. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంధర్మారావు పేట గ్రామంలో ఉండే లచ్చుమమ్మ ఐదు దశాబ్దాలుగా పాత కాలం నాటి రవికల నుంచి నేటి మోడ్రన్ డ్రెస్సుల వరకు తన కుట్టుపనితనంతో మెప్పిస్తోంది. ఆ ఊళ్లో అందరూ ‘లచ్చుమమ్మను చూసి నేర్చుకోవాలె’ అని అంటుంటారు. ఏడు పదుల వయసులో కూడా లచ్చుమమ్మ ఆధునిక డిజైన్లలో బ్లౌజులు, డ్రెస్సులు కుట్టడం చూసి కాలానికి తగినట్టు పని తనాన్ని మెరుగుపరుచుకుంటుంది అని కూడా అంటుంటారు. యాబై ఏళ్లుగా అలుపెరగకుండా బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్న లచ్చుమమ్మ అసలు పేరు గజవాడి లక్ష్మి. ధర్మారావుపేట గ్రామంలో అందరూ లచ్చుమమ్మ అని పిలుస్తారు. లచ్చుమమ్మకు 14వ ఏట ధర్మరావుపేటకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిగింది. వాళ్లకు ఐదుగురు కూతుళ్లు. ఉన్న ఊళ్లో ఉన్నంతలో చదివించారు. వాళ్లను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి, అత్తవారిళ్లకు పంపించారు. వాళ్లకు పిల్లలు. లచ్చుమమ్మకు పన్నెండు మంది మనుమలు, మనుమరాళ్లు. వాళ్లు కూడా పెద్దోళ్లయ్యారు. నాటి విషయాల గురించి ప్రస్తావిస్తూ ‘ఐదుగురు ఆడపిల్లల్ని పెంచి, పెళ్లిళ్లు చేయడం అంటే సవాలే..’ అంటూ తమ కష్టాన్ని వివరిస్తుంది. లచ్చుమమ్మ భర్త బాలవీరయ్య చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. భర్త కష్టానికి చేదోడుగా ఉంటుందని యాబై ఏళ్ల కిందటే లచ్చుమమ్మ సొంతంగా బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ ఊళ్లోకి ఇంకా టైలరింగ్ మిషన్లు రాలేదు. దాంతో బట్టలు కత్తిరించి సూదీదారంతోనే కుట్టేది. గ్రామంలో నాటి తరం మహిళలు ధరించే రవికలను బాగా కుడుతుందనే పేరు లచ్చుమమ్మకి. ఆడపిల్లలకు గౌన్లు, లంగా, జాకెట్లు కుట్టడమూ సొంతంగానే నేర్చుకుంది. అందరి ఇళ్లల్లోనూ ఆమె కుట్టిన బట్టలు ఉంటాయి. ఆధునిక డిజైన్లు సైతం లచ్చుమమ్మ చేతికుట్టు బాగుంటుందని చాలా మంది ఆమె దగ్గరే కుట్టించుకునేవారు. నిన్న మొన్నటి వాళ్లే కాదు, ఈ తరం అమ్మాయిలు కూడా లచ్చుమమ్మ దగ్గరకు వచ్చి బ్లౌజులు కుట్టించుకుంటారు. మొదట్లో సాదా రవిక కుట్టడానికి 30 పైసలు, గుండీల రవిక కుట్టడానికి 50 పైసలు తీసుకునేదట. ఇప్పుడు సాధారణ బ్లౌజ్‌కు రూ. 65, లైనింగ్ బ్లౌజ్‌కు రూ.130 తీసుకుంటుంది. ‘అప్పట్లో రోజుకు పది నుంచి ఇరవై దాకా బ్లౌజులు, గౌన్లు కుట్టేదాన్ని. పండుగల సీజన్లో అయితే రాత్రి, పగలు తేడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా రోజూ రెండు మూడు బ్లౌజులు కుడతా’ అని చెబుతోంది లచ్చుమమ్మ. పదేళ్ల క్రితం భర్త వీరయ్య చనిపోయాడు. ఇప్పుడు లచ్చుమమ్మ ఒక్కత్తే ఉంటుంది. తన పోషణార్థం కుట్టుపనినే నమ్ముకుంది. ఏళ్లుగా ఆమె దగ్గర రవికలు కుట్టించుకున్న నాటి తరం వాళ్లంతా ఇప్పటికీ లచ్చుమమ్మ దగ్గరికే వస్తుంటారు. వయసు మీద పడి, నెమ్మదిగా కుట్టినా చెప్పిన మాట ప్రకారం కుట్టి ఇస్తుందని నమ్మకం ఎక్కువ. ఏ సమయంలో ఆమె ఇంటికి వెళ్లినా.. కూర్చుని బట్టలు కత్తిరించడమో, లేదంటే మిషన్ మీద కుట్టడమో చేస్తూ కనిపిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. యాబై ఏళ్లుగా కుడుతున్నా.. పద్నాలుగేళ్ల వయసులో పెళ్లయ్యి ఈ ఇంటికి వచ్చా. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తరువాత కుటుంబ అవసరాల కోసం ఏదైనా పని చేయాలనుకున్నా. మా అమ్మ మాకు చిన్నప్పుడు చేతితోనే బట్టలు కుట్టేది. ఇంటి అవసరాలు పెరిగిన ప్పుడు నేను కూడా బట్టలు కుట్టాలని, చేతికుట్టుతో రవికలు కుట్టడం మొదలుపెట్టాను. ఒక్కొక్కరుగా రావడం మొదలై ఊళ్లో ఉన్న ఆడవాళ్లందరూ రవికలు కుట్టించుకునేవారు. ముప్పయి ఏళ్ల పాటు చేతికుట్టుతోనే కుట్టేదాన్ని. కుట్టు మిషన్లు వచ్చిన తరువాత ఓ మిషన్ తీసుకున్నా. కొన్ని రోజుల్లోనే మిషన్ కుట్టు నేర్చుకొని, సొంతంగానే కుట్టడం మొదలుపెట్టిన. పిల్లలు వద్దంటరు కానీ, చేతనైనన్ని రోజులు పనిచేసుకొని బతకాలి, ఎవరి మీదా ఆధారపడవద్దని ఈ పని వదలడం లేదు. – గజవాడ లక్ష్మి – ఎస్.వేణుగోపాల్ చారి, సాక్షి, కామారెడ్డి -
ఇల్లే సేవా కేంద్రం
కావల్సినన్ని వనరులు సమకూరినప్పుడు కూర్చుని సేద తీరుదామనుకుంటారు చాలామంది. తమ చుట్టూ ఉన్న నలుగురికైనా వారి స్వశక్తిని నమ్ముకునేలా చేయూతనిద్దాం అనుకుంటారు అతి కొద్దిమంది. అలాంటివారిలో కొత్తమాసు కృష్ణవేణి ఒకరు. సికింద్రాబాద్‌లోని టెలికాం కాలనీ, కానాజీగూడలో ఉంటున్న ఈ గృహిణి తన ఇంటినే సేవాకేంద్రంగా మలిచి పదేళ్లుగా మహిళలకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందిస్తున్నారు. మహిళలకు శిక్షణ ఇస్తూ బిజీగా ఉన్న కృష్ణవేణిని కలిసినప్పుడు, ఆమె సేవామార్గం వివరాలను ఇలా పంచుకున్నారు.. ‘‘పదిహేనేళ్ల క్రితం మావారు రంగారావు సత్యసాయి సేవాకార్యక్రమాలలో పాల్గొనేవారు. నేనూ ఆ కార్యక్రమాలకు వారి వెంట వెళ్లేదాన్ని. ఆ సమయంలోనే గ్రామాలలోని మహిళలకు స్వయం ఉపాధికి పనికి వచ్చే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనుకున్నాను. అప్పుడే మల్లాపూర్ గ్రామంలో మొట్ట మొదటిసారిగా నాకు వచ్చిన కుట్టు పనులను అక్కడి మహిళలకు నేర్పించి, వారికి ఆదాయ మార్గం చూపటం సంతృప్తినిచ్చింది. ఇంటి వద్ద నుంచి.. సేవా కార్యక్రమాలు ఎలా చేయచ్చో ఆ ఆడుగులు ఎలాగూ నేర్పించాయి. ఇంట్లో మా వారికి చెప్పి పైన ఓ గదిని ఏర్పాటు చేశాను. ఇంట్లోనే ఉంటాను కాబట్టి మహిళలకు టైలరింగ్, సాయంకాలాలు పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. ఇక్కడ ఒక్కచోటే సేవ చేస్తూ ఉంటే కాదు, మరికొందరికి ఉపాధిని అందిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో గ్రామాలకి వెళ్లడం ్రపారంభించాను. వెళ్లిన ఊళ్లో ముందుగా అక్కడ అనువైన స్థలం చూసుకొని, ఒక టీచర్ని ఏర్పాటు చేసి, నేర్చుకునేవారిని ఎంపిక చేసేదాన్ని. సాయిసంస్థ ద్వారానే రెండు నెలల పాటు 200 మందిని 10 బృందాలుగా చేసి, స్వయంగా శిక్షణ ఇచ్చాను. గృహిణిగా ఇంటి పనులు చేసుకుంటూ ఉండే నేను అలా ఒక్కో ఏడాది దాటుతూ సేవాకార్యక్రమాల్లో తీరికలేకుండా అయిపోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. ఈ 10 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని 300 గ్రామాలలో దాదాపు çపన్నెండు వేల మంది గ్రామీణ మహిళలకు కుట్టు మిషను, మెహెందీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పేపర్ వర్క్, ఫ్యాషన్ జ్యువెలరీ తయారీ, బ్యూటీషియన్ .. వంటి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహించాం. ఆ తర్వాత ఈ సేవామార్గంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్లు పరిచయమయ్యారు. అలా మేధా చారిటీ, అభయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి గ్రామీణ మహిళలకు ఎనిమిది వేల కుట్టుమిషన్లు, ఇతర ఉపాధులకు అవసరమయ్యే పని ముట్లను ఏర్పాటు చేశాం. పిల్లలకు ఫ్రీ ట్యూషన్లు కరోనా తర్వాత పిల్లలకు చదువులు బాగా తగ్గిపోయాయి. డల్‌గా ఉన్న స్టూడెంట్స్ మరీ వెనకబడిపోకుండా ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్స్ ఏర్పాటు చేశాం. ఇందుకు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులనే ఎంచుకుంటాం. ఉపాధికి దారులు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో తెలిసినవారి నుంచి ఇక్కడి మహిళలకు ఆర్డర్ మీద వర్క్స్ ఇప్పిస్తుంటాను. ఈ ఆర్డర్లు తెచ్చుకోవడానికి ఈ బృందంలోని వారి నుంచి కొందరిని నియమిస్తాను. అమెరికాలో, దూర్రపాంతాల్లో తెలిసినవారుంటే వారికి మావాళ్లు చేసిన వర్క్స్ ఫోన్ల ద్వారా చూపించి, ఆర్డర్స్ తెప్పిస్తుంటాం. వారికి కొరియర్ ద్వారా పంపిస్తుంటాం. దీని ద్వారా ఈ మహిళలకు కొంత ఆదాయం లభిస్తుంది. కోర్సు తర్వాత వారి ఇంటి వద్దనే నేర్చుకున్న పనిని కొనసాగించేలా కూడా చూస్తున్నాం’’ అని కృష్ణవేణి వివరించారు. – నిర్మలారెడ్డి -
కెమెరా ముందు కుడితే లక్షలు వస్తున్నాయి
‘నీ విద్య నువు సరిగా నేర్చుకో... డబ్బు, గుర్తింపు అవే వస్తాయి’ అంటోంది ఈ టైలరమ్మ. బట్టలు కొత్తగా కుట్టడం కూడా లక్షలు తెచ్చి పెడతాయా? .. పెడతాయి. పల్లెటూళ్లో వ్యవసాయం చేసుకుంటూ రాత్రిళ్లు కుట్టు పని చేసిన ధోలీ యూ ట్యూబ్‌లో అందరూ టాలెంట్ ప్రదర్శించడం చూసి తను కూడా టైలరింగ్‌ను యూ ట్యూబ్‌లో చూపెట్టింది. రకరకాల స్త్రీల దుస్తులను కట్ చేసి కెమెరా ముందు కుడుతుండేసరికి లక్షల మంది ఫాలోయెర్లు ఏర్పడ్డారు. కుట్టడానికి ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. యూ ట్యూబ్ నెల తిరిగే సరికి చెక్ పంపుతోంది. అవార్డులు కూడా మొదలయ్యాయి. కత్తెర, టేప్‌తో ఒక మహిళ సాధించిన విజయం ఇది. నవ్యమైన ఐడియానే ఆమె విజయానికి కారణం. ‘కొందరు విధిని నమ్ముకుని కూచుంటారు. కొందరు మాత్రం తమ విధిరాతను తామే రాసుకుంటారు’ అంటుంది ధోలి. ఈమె ఇప్పుడు రాజ్ మసంద్లో ఉంటుంది. ఇది రాజస్థాన్‌లోని ఒక మోస్తరు సిటీ. కాని అక్కడి నుంచే దేశం మొత్తానికి తెలిసింది. ఇంకా చెప్పాలంటే ఎక్కడెక్కడైతే భారతీయులు ఉన్నారో అక్కడి వారికి కూడా తెలిసింది. దానికి కారణం బట్టలు కుట్టడంలో ధోలికి ఉండే విశేష ప్రతిభ, సృజనాత్మకత. వేగం. కొత్తదనం. స్త్రీలు ధరించే అన్ని రకాల వస్త్రాలను మరింత కొత్తగా ఎలా చేయవచ్చో, ఎలా ఆకర్షణీయంగా మలచవచ్చో ధోలి చేసే వీడియోల్లో చూడొచ్చు. కొందరు విద్యను దాచుకుంటారు. కాని ధోలి తనలాంటి స్త్రీలు టైలరింగ్ నేర్చుకుని తమ కాళ్ల మీద తాము నిలబడాలని తెలిసిందంతా చెప్పేస్తుంది. అందుకే ఆమెకు అంత ప్రచారం. మన్నన. బాల్య వివాహం చేసుకుని ధోలిది రాజస్థాన్‌లోని భరత్పూర్. తండ్రి వ్యవసాయం చేసేవాడు. వెనుకబడిన ్రపాంతం కావడంతో 10 సంవత్సరాలకే పెళ్లి చేసి ఈడేరాక అత్తారింటికి పంపాడు. 18 ఏళ్లు వచ్చేసరికి ధోలి ముగ్గురు పిల్లల తల్లి. అత్తారింటిలో పెద్ద కోడలు కావడం వల్ల బండెడు చాకిరీ ఉండేది. పగలు పొ లంలో కూలి పని చేసేది. పాలు పితికి అమ్మేది. చిన్నప్పటి నుంచి టైలరింగ్ అంటే ఆసక్తి ఉండటం వల్ల నేర్చుకోవడంతో రాత్రిళ్లు కరెంటు లేని ఇంట్లో కిరోసిన్ దీపం కింద కుట్టేది. కాని బతుకు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగానే ఉండేది. సిటీకి మారాక కొన్ని కారణాల వల్ల పట్నమైన రాజ్ మసంద్‌కు ధోలి కాపురం మార్చింది. అక్కడ టైలరింగ్ మొదలెట్టింది. 2016లో యూట్యూబ్ ఆమె దృష్టికి వచ్చింది. అందులో రకరకాల వ్యక్తులు తమకు తెలిసిన విద్యలు వీడియోలు చేసి పెట్టడం గమనించింది. ‘నేనెందుకు నా టైలర్ విద్యను ప్రదర్శించకూడదు’ అని వీడియోలు చేసి పెట్టింది. రోడ్డు మీద ఉండే తన ఇంటిలో రోడ్డు రణగొణ ధ్వనుల మధ్య ఆ వీడియోలు చేసి అప్లోడ్ చేసింది. కాని అంతగా గుర్తింపు రాలేదు. ధోలి ఆగలేదు. వీడియోలు బాగా గమనించి ఎలా చేయాలో తెలుసుకుని 2017లో ‘ఘోరి ఫ్యాషన్ డిజైనర్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది. 27 కోట్ల వ్యూస్ టైలరింగ్ పని నేర్చుకోవాలని చాలా మంది స్త్రీలకు ఉంటుంది. కొత్త కొత్త ఫ్యాషన్స్ ఫాలో కావాలని మరికొంత మంది స్త్రీలకు ఉంటుంది. వీరంతా వెంటనే ధోలి చేస్తున్న వీడియోలను ఇష్టపడి చానల్‌కు సబ్స్క్రయిబ్ చేశారు. ఏ బట్టను ఏ మోడల్‌తో ఎలా కుట్టాలో ధోలి చకచకా చెప్తూ కుట్టి చూపుతుంది కాబట్టి వాటిని ఫాలో కాసాగారు. కుర్తీలు, అనార్కలి డ్రస్సులు, బ్లౌజ్‌లు... ఒకటని ఏముంది చాలా కొత్తరకంగా ధోలి డిజైన్లు ఉంటాయి. యూ ట్యూబ్ నుంచి తొలి పారితోషికంగా 11 వేల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ఆమెకు 16 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఇప్పటికి 700 వీడియోలు చేసి అప్లోడ్ చేసింది. వీటికి 27 కోట్ల వ్యూస్ వచ్చాయి. యూ ట్యూబ్ నుంచి నెలకు లక్షకు పైగా పారితోషికం అందుతోంది. అంటే ధోలి ఎంత సక్సెస్ఫుల్ టైలరమ్మో అర్థం చేసుకోవచ్చు. తన ప్రచారం కోసం ఫేస్‌బుక్‌లోనూ ఇన్‌స్టాలోనూ అకౌంట్లు తెరిచింది. రోజుకు 20 రూపాయల నుంచి ఒకప్పుడు పల్లెటూళ్లో రాత్రిళ్లు బట్టలు కుడితే అతి కష్టమ్మీద రోజుకు 20 రూపాయలు వచ్చేవి. ఇవాళ ధోలి కేవలం తన ప్రతిభ, సృజనాత్మకతతో పాటు సోషల్ మీడియా సహాయంగా పెద్ద సంపాదన చూస్తోంది. రాజ్ మసంద్లో మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుంది. ఆమెను పిలిచి అవార్డులు ఇచ్చి గౌరవిస్తున్నారు. ‘ఎదుటి వారిని ఓడించడం కంటే మనం గెలవడం ముఖ్యం అనుకోవాలి. మనలోని ప్రతికూల భావాలను తీసేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం’ అంటుంది ధోలి. -
టైలరింగ్ ట్రైనింగ్కని వెళ్లింది.. కుష్బూ జాడేది..?
సాక్షి, హైదరాబాద్: టైలరింగ్‌కు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన ఆదివారం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కిషన్‌గంజ్ ఉస్మాన్‌షాహి ప్రాంతానికి చెందిన కుష్బూ కుమారి అశోక్ బజార్‌లోని టైలరింగ్ సెంటర్‌కు ట్రైనింగ్ నిమిత్తం వెళ్లేది. శుక్రవారం టైలరింగ్‌కు వెళ్లిన కుష్బూ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Shocking: పట్టపగలు ఇంట్లో ప్రవేశించి.. మహిళను..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): పట్టపగలు ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఒంటరి మహిళను కత్తెరతో పొడిచి చంపాడు. ఈ ఘటన బనశంకరిపోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యారబ్నగర 16 వ క్రాస్ నివాసి టైలరింగ్ చేస్తున్న అఫ్రినా ఖానం (28) హతురాలు. భర్త లాలూఖాన్ తో జీవిస్తోంది. ఆమెకు ఐదు, మూడేళ్లు వయసు గల ఇద్దరు పిల్లలు ఉండగా వీరిని తమ పుట్టింటికి పంపించింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త గొడవపడేవాడు. ఇతడు ఒక టింబర్డిపోలో పనిచేసేవాడు. మంగళవారం సైతం గలాటా జరిగింది. భర్త పనికి వెళ్లిపోయిన కొంతసేపటికి ఒక వ్యక్తి వచ్చి అఫ్రినాతో గొడవకు దిగాడు. కొంతసేపటికి అక్కడే ఉన్న కత్తెర తీసుకుని ఆమె పొడవడంతో తీవ్రగాయాలతో చనిపోయింది. దుండగుడు ఆమె మృతదేహంపై బట్టలు కుప్పగా వేసి నిప్పంటించి వెళ్లిపోయాడు. మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి పొగలు వస్తుండగా స్థానికులు చూసి ఆమె సోదరికి, భర్తకు ఫోన్ చేశారు. వారు వచ్చి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లగా పరుపు, మృతదేహంపై బట్టలు కాలిపోయాయి. బనశంకరి పోలీసులు చేరుకుని పరిశీలించారు. హంతకుని ఆచూకీ లభించిందని త్వరలోనే అరెస్ట్‌చేస్తామని దక్షిణ డీసీపీ హరీశ్ పాండే తెలిపారు. -
రిలయన్స్ చీరలు కూడా వచ్చేస్తున్నాయ్...
సంప్రదాయ దుస్తులు, చీరల విభాగంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్), టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ తదితర సంస్థలకు పోటీగా రిలయన్స్ రిటైల్ కూడా రంగంలోకి దిగుతోంది. కొత్తగా అవంత్రా పేరిట స్టోర్స్ చెయిన్‌ను ప్రారంభించనుంది. ప్రైవేట్ లేబుల్స్‌ను విక్రయించడంతో పాటు ప్రాంతీయంగా వీవర్ క్లస్టర్లతో పాటు నల్లి సిల్క్స్ .. పోతీస్ వంటి థర్డ్ పార్టీ బ్రాండ్లతో కూడా అవంత్రా జట్టుకట్టనుంది. ఆభరణాలు, యాక్సెసరీలు, టైలరింగ్ సరీ్వసులు కూడా అందించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలి స్టోరు బెంగళూరులో ఏర్పాటవుతుందని, ఆ తర్వాత కర్ణాటకలోని మిగతా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించవచ్చని వివరించాయి. ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్ సంప్రదాయ దుస్తుల్లోకి అడుగుపెట్టడం, ఏబీఎఫ్ఆర్ఎల్ కూడా సవ్యసాచి, తరుణ్ తహిలియాని వంటి దేశీ డిజైనర్ వేర్ బ్రాండ్స్‌లో వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో రిలయన్స్ అవంత్రా స్టోర్స్ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. -
తన లైఫ్‌ని తనే కుట్టుకుంది
షబ్నమ్. వయసు 17. ఈ వయసు పిల్లలు అడిగినట్లు ‘నాన్నా! పండక్కి నాకు కొత్త బట్టలు కొనివ్వు, నాన్నా పది రూపాయలివ్వు జడ పిన్నులు కొనుక్కుంటాను’ అని అడగడంలేదీ అమ్మాయి. రివర్స్‌లో ఆ తండ్రే ‘నువ్వు నా కంటే ఎక్కువ సంపాదిస్తున్నావు బిడ్డా’ అని మురిసిపోతున్నాడు. ఆ తండ్రి.. కూతుర్ని పెద్ద ముందుచూపుతో నడిపించిన దార్శనికుడేమీ కాదు. ‘ఆడపిల్లవు ఊరు దాటి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకుంటావా, వద్దే వద్దు. ఊళ్లో బడిలో ఉన్నంత వరకు ఏడు తరగతులు చదివావు ఇక చాలు’ అనేశాడు ఐదేళ్ల కిందట. ఆడపిల్లకు వంట వండటం నేర్పించి పెళ్లి చేయడమే అమ్మానాన్నల బాధ్యత అన్నట్లు రెండేళ్ల కిందట ఓ పెళ్లి సంబంధం కూడా తెచ్చాడు. కూతురు తల వంచలేదు! బడి మాన్పిస్తే చేసేదేమీ లేక ఊరుకుంది. కానీ పెళ్లి చేసి పంపించేస్తానంటే ఊరుకోనంటే ఊరుకోనని మొండికేసింది షబ్నమ్. ‘ఆడపిల్లలు 18 ఏళ్లకంటే ముందు పెళ్లి చేసుకోకూడదట’ అని కూడా వాదించింది. పిల్ల సంతోషంగా తల వంచితే తాళి కట్టించాలి తప్ప మెడలు వంచి కట్టించకూడదని షబ్నమ్ నానమ్మ నచ్చచెప్పడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడా తండ్రి.కూతురికి లోకజ్ఞానాన్నంతా నూరిపోశాడని టైలరింగ్ టీచర్‌ను మాత్రం బాగానే తిట్టుకున్నాడు. తండ్రి తల ఎత్తుకున్నాడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరైచ్ జిల్లా, రాయ్‌పూర్ షబ్నమ్ ఊరు. అక్కడ ఓ ఎన్జీవో నిర్వహించిన టైలరింగ్ సెంటర్లో మూడు నెలలపాటు దుస్తులు కుట్టడం నేర్చుకుంది. అదే ఆమె జీవితానికి పెద్ద మలుపు అవుతుందని అప్పట్లో ఎవరూ అనుకోలేదు. కానీ ఇప్పుడామె నెలకు రెండు మూడు వేలు సంపాదిస్తోంది. రంజాన్, దసరా వంటి పండుగ సీజన్లలో నాలుగైదు వేలు సంపాదిస్తోంది. ఇంట్లో కొంత ఇచ్చి మిగిలిన డబ్బును బ్యాంకులో దాస్తోంది. ఆమె బ్యాంకు అకౌంట్లో డబ్బుని చూసి ఆ తండ్రి పుత్రికోత్సాహంతో ఇప్పుడు మురిసిపోతున్నాడు. రాయ్‌పూర్ ‘రోల్ మోడల్’! షబ్నమ్ తాను టైలరింగ్ క్లాస్‌లో నేర్చుకున్న మోడల్స్ దగ్గర ఆగిపోలేదు. అదే బ్లవుజ్‌లు, లెహెంగాలు కుడుతూ ఉంటే ఈ రోజు ఇంతలా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండకపోయేది. ఆమె వాల్‌పోస్టర్ మీద హీరోయిన్ డ్రస్ చూస్తే అది ఏ ప్యాటర్న్ అయి ఉంటుందో ఊహించగలుగుతుంది. సినిమాకు వెళ్తే హీరోయిన్ వేసుకున్న డ్రస్‌లు మైండ్‌లో ప్రింట్ అయిపోతాయి. సినిమా నుంచి వచ్చాక వాటిని పేపర్ మీద గీసుకుంటుంది. అలా పెద్ద నోట్స్ తయారు చేసుకుంది. ఆ మోడల్స్‌ని రాయ్‌పూర్ వాసులకు అందుబాటులోకి తెచ్చింది. తండ్రి స్నేహితుని కూతురికి పెళ్లి డ్రస్ కుట్టిచ్చింది. ఆ పెళ్లిడ్రస్ షబ్నమ్ పనితీరుకు ఓ ప్రచారాస్త్రంగా మారింది. చదువుకుంటూ, నేర్పిస్తోంది షబ్నమ్ సాధించిన మరో విజయం ఏమిటంటే.. ఏడవ తరగతి తర్వాత ‘చదువు కోసం మరొక ఊరికి పోవడమా... వీల్లేదంటే వీల్లేదు’ అన్న తండ్రిని ఒప్పించి కాలేజ్‌లో చేరడం. నాన్ఫార్మల్ ఎడ్యుకేషన్‌లో బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి నిషార్ షరీఫ్ అహ్మద్ ఇంటర్ కాలేజ్‌లో చేరింది. తానింకా పెద్ద చదువులు చదువుతానంటున్న షబ్నమ్ టైలరింగ్‌ను కొనసాగిస్తూనే ఉంది. కొత్త మోడల్స్ నేర్పించమని వచ్చిన తోటి అమ్మాయిలకు మెళకువలు నేర్పిస్తోంది. – మంజీర -
చేతులు లేకపోతేనేం....
చండీగఢ్: చేతులు లేనివారు కాళ్లతోని ఇంటి పనులు, వంట పనులు చేసుకోవడం, కాళ్లతోనే పరీక్షలు రాయడం, కాళ్లతోని బొమ్మలు గీయడం లాంటివి మనం అప్పుడప్పుడు పత్రికల్లో చూస్తుంటాం. కానీ హర్యానాలోని మదన్‌లాల్ అనే 45 ఏళ్ల వ్యక్తి కాళ్లతోని టైలరింగ్ చేయడం ఎక్కడా చూసి ఉండం. బట్టల కొలతలు తీసుకోవడం, వాటిని పొందికగా కావాల్సిన తీరులో కత్తిరించడం, కుట్టు చెదరకుండా వాటిని కుట్టడం చేతులున్న వారికే కష్టమైన పని. ఈ మూడు పనులను అతి నైపుణ్యంతో చేస్తూ గ్రామ ప్రజల మనసులను, మన్ననలను దోచుకుంటున్నారు మదన్‌లాల్. ఆయన రెండు చేతుల్లేకుండానే పుట్టారు. ఏ బడికెళ్లిన దివ్యాంగుడివి, చదువు నేర్చుకోవడం రాదంటూ తిప్పి పంపించారట. దివ్యాంగులను కూడా చేర్చుకునే పట్నం బడులకు వెళ్లేంత స్థోమత ఆయన కుటుంబానికి లేకపోవడం వల్ల ఇక చదువుకోవలనే ఆశను చంపుకున్నారు. నానమ్మ, తాతయ్యలకు చేదోడు, వాదోడుగా ఇంట్లో పనులు చేస్తూ వచ్చారు. 23 ఏళ్ల ప్రాయంలో ఏదైనా వృత్తిలో స్థిరపడి సంపాదించాలనుకున్నారు. అందుకు టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నారు. ఊరు, వాడా తిరిగారు. టైలరింగ్ నేర్పేందుకు ఎవరూ ఒప్పుకోలేదు. పైగా గేలిచేసి పంపించారు. చివరకు పొరుగునున్న ఫతేహబాద్కు వెళ్లారు. ఎంతో నచ్చచెప్పగా అక్కడ ఓ టైలర్ శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆయన వద్ద టైలరింగ్ నేర్చుకొని కొంతకాలం అక్కడే గడిపిన మదన్‌లాల్ చివరకు తన ఊరుకు వచ్చి ఓ టైలరింగ్ షాపు పెట్టుకున్నారు. వచ్చేవారికి, పోయే వారికి తన నైపుణ్యం గురించి చెబుతూ వచ్చారు. మొదట ఎవరూ నమ్మలేదు. ఆయన వద్ద బట్టలు కుట్టించుకునేందుకు ధైర్యం చేయలేదు. తాను ఎలా కుడతానో ప్రాక్టికల్‌గా కుట్టి చూపించగా అప్పటి నుంచి గిరాకీ రావడం మొదలైంది. ఇప్పుడు ఆయన టైలరింగ్ షాపు సంతప్తికరంగా నడుస్తోంది. మదన్‌లాల్ తన వంట తానే చేసుకోవడంతోపాటు తీరక వేళల్లో కాళ్లతోనే చీట్ల పేక ఆడతారు. ఆత్మవిశ్వాసం, అందుకుతగ్గ కషి ఉండాలిగానీ అనుకున్నది దేన్నైనా సాధించవచ్చని మదన్‌లాల్ తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. -
వయసు 86 వేషాలు 365
డాక్టరా? టైలరా? రెండూ! మిస్టర్ అలినీ కలిస్తే మీరు ఈ ఇద్దరినీ కలిసినట్టే. ఇద్దర్నే కాదు. ఇంకా చాలామందిని కలిసినట్టు. అంతేకాదు, దేశదేశాల వాళ్లని కలిసినట్టు. అలీ మొదట డాక్టర్. నాడి చూడ్డం, మందు చీటీలు రాయడం బోర్ కొట్టేసి, టైలరింగ్లోకి వచ్చేశారు. వయసు 86. వేషాలు 365. అలీ ఏడాదంతా రోజుకో డ్రెస్‌తో స్టెయిల్‌గా కనిపిస్తారు. ఆ డ్రెస్ చూసి అదిరిపోయి, అపరిచితులు కూడా ఆయనకు విష్ చేస్తుంటారు. అంత రిచ్‌గా ఉంటుంది అలీ లుక్. ఈయన్ది జర్మనీ. నాలుగేళ్ల క్రితం జో స్పాటన్ అనే లేడీ ఫొటోగ్రాఫర్ అలీని గమనించి, ‘వావ్’ అనుకుని, ‘వండర్ఫుల్’ అనుకుని ఫొటోలు తీసుకుంది. వాటిని తన బ్లాగులో పెట్టుకుంది. అలీ ఫేమస్ అయిపోయారు. అంతకన్నా కూడా ఆయనలోని ఉత్సాహం ఫేమస్ అయిపోయింది. జర్మనీ నుంచి టర్కీ వరకు అలీ నాలుగు దశాబ్దాల పాటు దేశాలన్నీ తిరిగారు. రోజుకో డ్రెస్‌లో ఆయన్ని చూస్తే, రోజుకో దేశాన్ని చూసినట్టు ఉంటుంది. ఎనర్జిటిక్ కదా! -
బిడ్డలకు భారం కాకూడదని..
► ప్రాణ త్యాగానికి పాల్పడిన ఓ మాతృమూర్తి ► పట్టెడన్నం కూడా పెట్టలేమన్న ప్రబుద్ధులు వినుకొండ రూరల్ : కన్న కొడుకులకు భారంగా మారానన్న ఆవేదనతో ఓ మాతృమూర్తి ప్రాణ త్యాగానికి పాల్పడింది. రెండస్థుల మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వినుకొండ 21వ వార్డులోని సట్టు బజారుకు చెందిన షేక్ బషీరూన్ (55) కు ఇద్దరు కొడుకులు. భర్త చనిపోయి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి ఇద్దరు కొడుకుల వద్ద వంతులవారీగా ఉంటూ రోజులు నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో కొడుకులు రెండు రోజులుగా.. నేను చూడనంటే, నేను చూడనంటూ వాదనకు దిగారు. దీంతో ఆ తల్లి హృదయం గాయపడింది. తాను చనిపోవడమే సమస్యకు పరిష్కారం అనుకుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఒక్క ఉదుటున పరుగు పరుగున వెళ్లి ఎదురుగా ఉన్న రెండస్థుల భవనంపైకి ఎక్కి దూకేసింది. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్న తల్లికి పట్టెడన్నం కూడా.. నవమాసాలు మోసి ప్రాణాలు ఫణంగా పెట్టి బిడ్డలకు జన్మనిచ్చిన తల్లికి పెరిగి పెద్దయిన కొడుకులు పట్టెడన్నం కూడా పెట్టకుండా రోజులు, నెలలు అంటూ వంతులు వేసుకోవటం ఆ మాతృమూర్తి మనస్సును కలచివేసింది. ఇంట్లో ఒక్కరికే అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు.. అని చెప్పే తల్లి మాటలు ఒక్కసారి కూడా గుర్తుకు తెచ్చుకోలేని కొడుకులు ఉన్నా లేనట్లేనని చుట్టుపక్కల వారు చీత్కరించుకుంటున్నారు. బషీరూన్కు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు కరిముల్లా వాటర్ సర్వీసింగ్ పని చేస్తుంటాడు. చిన్న కుమారుడు కాలేషా టైలరింగ్ చేస్తుంటాడు. భర్త మృతి చెందటంతో బషీరూన్ పూర్తిగా కొడుకుల సంపాదనపైనే ఆధారపడాల్సిన స్థితి ఏర్పడింది. అప్పటి నుంచి కొడుకులు ఇద్దరూ తల్లికి అన్నం పెట్టేందుకు వంతులు వేసుకున్నారు. నెలకు ఒకరు చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇటీవల ఒప్పందం ప్రకారం కూడా అన్నం పెట్టలేమని తేల్చటంతో విరక్తి చెందిన ఆ మాతృమూర్తి ప్రాణ త్యాగానికి పాల్పడింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. -
సాక్షి మైత్రి ఆధ్వర్యంలో టైలరింగ్‌లో శిక్షణ
గుంటూరు : సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బుధవారం నుంచి వచ్చే నెల 9 వరకు చిలకలూరిపేటలోని న్యూ ఏంజెల్స్ బ్యూటీ క్లినిక్ ఎన్ఆర్టీ సెంటర్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శిక్షణ కొనసాగుతుంది. మంగళవారం వరకు అభ్యర్థుల నుంచి శిక్షణకు రిజిస్ట్రేషన్స స్వీకరిస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు : బేబి ఫ్యాబ్రిక్, అంబ్రెల్లా ఫ్రాక్స్, శారీ పెట్టీకోట్, డ్రెస్ పెట్టీకోట్, ప్లెయిన్ బ్లౌజ్, క్రాస్ కటింగ్ బ్లౌజ్, సింగిల్ కటోరి బ్లౌజ్, స్మాకింగ్ ప్యాచ్ బ్లౌజ్, కాలర్ బ్లౌజ్, ప్యాటర్న బ్లౌజ్, నెక్ డిజైన్స, స్లీవ్ డిజైన్స, కుర్తీ, సల్వార్, సెమి పటియాల, చుడిదార్, కలీస్ డ్రెస్, లాంగ్ టాప్, మెథడ్ ఆఫ్ కటింగ్, మెథడ్ ఆఫ్ స్టిచింగ్ చేర్పిస్తారు. వివరాలకు ఫోన్ నెంబరు 9666372301లో సంప్రదించాలి. శిక్షణకు వచ్చే వారు తమ వెంట పెద్ద స్కేల్, టేప్, కత్తెర, మార్కర్, దారం రీలు, సూదులు, క్లాత్, (2మీ), న్యూస్ పేపర్సు, నోట్‌బుక్స్ పెన్ వెంట తెచ్చుకోవాలి. శిక్షణలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. -
రసీదు
వెంగళ్రావ్ పెట్టె సర్దుకుంటుంటే అడుగున ఒక స్లిప్పు కనిపించింది. అది ఐదు సంవత్సరాల క్రితం టైలరింగ్ షాపులో బట్టలు కుట్టడానికి ఇచ్చిన బట్టల తాలూకు రసీదు. ఆ స్లిప్పు తీసుకుని టైలర్ దగ్గరకు వెళ్లి, తన బట్టలు ఇమ్మని అడిగాడు వెంగళ్రావ్. టైలర్ ఆ స్లిప్పు పట్టుకుని లోపలికి వెళ్లి, అరగంట తర్వాత తిరిగొచ్చి చెప్పాడు... ‘‘సార్.. మీ బట్టలకు ఇంకా చిన్న చిన్న పనులున్నాయి. రెండ్రోజుల్లో రండి’’. -
మహిళా ప్రగతికి బాటలు
నెల్లూరు (పొగతోట) : జిల్లా పరిషత్ తరఫున స్త్రీ,శిశు సంక్షేమ నిధులతో రాబోయే ఐదేళ్లలో 50 వేల మంది మహిళలకు టైలరింగ్‌పై ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి చెప్పారు. మంగళవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. టైలరింగ్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు. టైలరింగ్ శిక్షణ కోసం గ్రామీణ మహిళలు జిల్లా కేంద్రానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. శిక్షణకు వచ్చే మహిళలు 3 నెలల పాటు జిల్లా కేంద్రంలోనే ఉండాల్సి వస్తుందన్నారు. ఆ సమయంలో మహిళలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ప్రతి మండల కేంద్రంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కొక్క కేంద్రంలో 5 నుంచి 10 కుట్టుమిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు బ్యాంకర్లతో సంప్రదించి కుట్టుమిషన్లు కొనుగోలుకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుపేద మహిళలకు కుట్టుమిషన్ కొనుగోలుకు జెడ్పీ నిధుల్లో రూ.1000 మంజూరు చేస్తామన్నారు. మిగిలిన మొత్తం బ్యాంక్‌ల ద్వారా రుణంగా మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తొలివిడతగా వచ్చే నెలలో 10 మండలాల్లో టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. దశల వారీగా జిల్లాలోని అన్ని మండలాల్లో కేంద్రాలు ప్రారంభిస్తామమన్నారు. శిక్షణ తరగుతుల నిర్వహణ, కుట్టు మిషన్ల కొనుగోలు తదితర కార్యక్రమాలకు రూ.కోటి ఖర్చవుతుందన్నారు. శిశుగృహకు సొంత భవనం నిర్మించేందుకు రూ.10 లక్షలు కేటాయించామన్నారు. నగరంలోని మహిళ ప్రాంగణానికి ప్రహరి నిర్మించేందుకు నిధుల కేటాయించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నూతన జిల్లా పరిషత్ భవానాన్ని అధునాతన హంగులతో డిసెంబర్ లేదా జనవరిలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా పరిషత్ అనుబంధ శాఖలన్నీ ఒకే ప్రారంగణంలో ఉంటాయన్నారు. రూ. 20 లక్షల ఖర్చుతో జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ హస్టల్స్, పాఠశాలల దత్త ప్రక్రియ వేగంగ జరుగుతుందన్నారు. -
ప్రేమ పేరిట వంచించి ప్రాణం తీశాడు...
* పెళ్లి చేసుకుంటానని మోసం * గర్భిణి అని తెలియడంతో తప్పించుకునే యత్నం * గర్భస్రావం చేసుకుంటేనే పెళ్లంటూ ఒత్తిడి * చివరికి ప్రాణాలు కోల్పోయిన బాలిక విజయవాడ, న్యూస్‌లైన్ : ప్రేమించానని వెంటబడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడు.. తీరా ఆమె ఐదు నెలల గర్భిణి అని తెలియడంతో ముఖం చాటేశాడు. అదేమంటే ముందు గర్భస్రావం చేయించుకో.. అప్పుడు పెళ్లి చేసుకుంటానన్నాడు. దీంతో సరేనని అతనిచ్చిన మాత్రలు మింగిన ఆమె అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయింది. విషాదకరమైన ఈ ఘటనపై పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలివీ... స్థానిక రామరాజ్యనగర్ కొండ ప్రాంతానికి చెందిన బోయి అప్పలస్వామి రిక్షా నడుపుతుండగా, భార్య మణి షాపుల్లో చిన్నపాటి పనులు చేస్తుంది. వీరి కుమార్తె నందిని (17) టైలరింగ్ నేర్చుకొని ఇంటివద్దే ఉంటుండగా.. కుమారుడు దుర్గారెడ్డి (15) పదో తరగతి చదువుతున్నాడు. భార్యాభర్తలు ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వస్తుంటారు. కొడుకు చదువుకునేందుకు వెళ్లి సాయంత్రం వస్తాడు. దీన్ని అవకాశంగా చేసుకుని సమీపంలో నివాసముండే ఆటో డ్రైవరు నెర్సు దుర్గారావు (23) ఆమెను లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి కోసం ఒత్తిడి తెస్తుండటంతో తనకు రూ.3 లక్షల కట్నం ఇచ్చేందుకు సంబంధం వచ్చిందని దుర్గారావు చెప్పాడు. ఈ వ్యవహారంలో వారి మధ్య కొద్దిరోజులుగా ఘర్షణ జరుగుతోంది. గర్భస్రావం చేయించుకుంటే.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. వివాదం పెరుగుతుండటంతో ఇక లాభం లేదనుకున్న దుర్గారావు గర్భస్రావం చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతని మాటలను మరోసారి విశ్వసించిన నందిని గురువారం రాత్రి దుర్గారావు తెచ్చిన మాత్రలు వేసుకుంది. ఉదయం లేచేసరికే తీవ్ర అస్వస్థతకు లోనైంది. కంగారుపడిన తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళతామన్నారు. విషయం బయటపడితే కుటుంబ సభ్యులు ఏమంటారోననే ఆందోళనతో ఆమె నిరాకరించింది. దీంతో మందుల షాపులో మాత్రలు తెచ్చిచ్చారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అతను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడినుంచి పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలిపింది. ఆస్పత్రిలో ఆమెను పరీక్షించిన వైద్యులు ఐదు నెలల గర్భిణిగా తేల్చారు. ఆమెను బతికించేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నందిని మృతితో హతాశులైన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి న్యాయం చేయాలంటూ అక్కడే బైఠాయించారు. న్యాయం చేస్తామని వారు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నెలసరి నొప్పి అని సరిపెట్టుకున్నా... అప్పుడప్పుడు కడుపు నొప్పి అనేది. నెలసరి నొప్పేమో అని మందుల షాపు నుంచి బిళ్లలు తెచ్చిచ్చేవాళ్లం. మరీ నొప్పి అంటే ఆస్పత్రికెళదామన్నా ఒప్పుకొనేది కాదు. ముందే చెప్పి ఉంటే ఇంతవరకు రానిచ్చేవాళ్లం కాదు. చెప్పి మమ్మల్ని బాధపెట్టకూడదని.. తాను మాత్రం ప్రాణాలు తీసుకుంది.. అంటూ నందిని తల్లి మణి పడే వేదన చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. వేణ్ణీళ్లెవరు పెడతారు... ఉదయం వెళితే రాత్రికి గాని ఇంటికి రాను. రాగానే ఆప్యాయంగా పలకరించేది. వెంటనే స్నానానికి వేణ్ణీళ్లు పెట్టేది. స్నానం చేసిన తర్వాత ‘కష్టపడి వచ్చావు నాన్నా’ అంటూ ఒళ్లంతా కొబ్బరి నూనె రాసి మర్దనా చేసేది. ఇకపై నాకు వేణ్ణీళ్లు ఎవరు పెడతారంటూ అప్పారావు కన్నీరుమున్నీరుగా రోదించడం పోలీసులను సైతం చలింపజేసింది. -
తవ్విన కొద్దీ అక్రమాస్తులే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉప్పు దగ్గర నుంచి సబ్బు వరకు దేన్నీ ఆమె వదల్లేదు.. సరుకులను రవాణా చేసే కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. సరఫరా చేసిన సరుకులు తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నట్లు నకిలీ రికార్డులు సృష్టించి.. ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. దోచిపెట్టిన సొమ్ములో వాటాలు దండుకుని కోట్లకు పడగలెత్తారు. విద్యార్థుల నోళ్లు కొట్టి.. విలాసాలకు మరిగారు. కోట్లకు పడగలెత్తిన ఆ అక్రమాధికారిణే సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ అరుణకుమారి. అవినీతి నిరోధకశాఖ దర్యాప్తులో అరుణకుమారి అక్రమాల బాగోతం మొత్తం బహిర్గతమవుతోంది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తులో రూ.నాలుగు కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూడగా.. మరో రూ.ఎనిమిది కోట్ల విలువైన అక్రమాస్తులు బహిర్గతమయ్యే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. హిందూపురంలో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తోన్న అరుణకుమారి.. జిల్లాలో ఉన్న 13 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలకు కన్వీనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టైలరింగ్ పనుల కాంట్రాక్టర్ సుస్మిత తరఫున లక్ష్మిరెడ్డి నుంచి రూ.ఐదు వేలు లంచం తీసుకుంటుండగా అక్టోబరు 26న ఏసీబీ అధికారులు దాడి చేసి, ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అదే రోజున ఆమె నివాసంలో జరిపిన సోదాల్లో రూ.4.47 లక్షల నగదు, 18 తులాల బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సోదాల్లో ఆమెకు రెండు బ్యాంకుల్లో ఉన్న లాకర్లకు సంబంధించిన తాళాలు, విలువైన డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి. వాటి ఆధారంగా వారం రోజులుగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శనివారం అనంతపురంలో కరూర్ వైశ్యా బ్యాంకులో ఆమెకు సంబంధించిన లాకర్‌ను తెరిచారు. ఇందులో రూ.40 లక్షల నగదు, ఆరు తులాల బంగారం ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హిందూపురం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మరో లాకర్‌ను తెరిచారు. అందులోంచి రూ.పది లక్షలు, రూ.27 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటూ అనంతపురంలో 17 పోర్షన్లతో కూడిన ఐదు భవనాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంతపురం, హిందూపురం, బెంగళూరులలో విలువైన ఇంటి స్థలాలు ఉన్నట్లు తేల్చారు. వాటి విలువ రూ.నాలుగు కోట్లకుపైగానే ఉంటుందని ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి చెప్పారు. మరో రూ.ఎనిమిది కోట్ల ఆస్తులు అత్యంత విలువైన ఇళ్లు, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, భారీ ఎత్తున బంగారు అభరణాలు నిల్వ చేసిన బ్యాంకు లాకర్ తాళం అరుణకుమారి తన సమీప బంధువుల ఇళ్లలో దాచినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. అనంతపురంలో ప్రస్తుతం వెలుగుచూసిన ఐదు భవనాలు కాకుండా మరో ఎనిమిది భవంతులు ఉన్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతపురంలోని ఓ జాతీయ బ్యాంకులో అరుణకుమారికి లాకర్ ఉందని.. అందులో భారీ ఎత్తున బంగారు అభరణాలు దాచారని కూడా ఆ ఫిర్యాదులో స్పష్టం చేస్తూ వివరాలను పొందుపరిచారు. ఈ ఫిర్యాదు అరుణకుమారి సమీప బంధువులే చేయడంతో ఏసీబీ అధికారులు దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న ఆస్తుల విలువను పరిగణనలోకి తీసుకుంటే మరో రూ.ఎనిమిది కోట్లు ఉంటుందని లెక్క వేస్తున్నారు. అరుణకుమారి సమీప బంధువులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రెండు రోజులుగా ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆమె అక్రమాస్తులపై వారం రోజుల్లోగా స్పష్టమైన ప్రకటన చేస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అరుణకుమారి భారీ ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టడం అధికారవర్గాల్లో కలకలం రేపింది. గతంలో అరుణకుమారి అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా చూసీచూడనట్లు వ్యవహరించారని సాంఘిక సంక్షేమశాఖ వర్గాలు వెల్లడించాయి. సంపాదించిన ప్రతి పైసాలోనూ ఉన్నతాధికారులకు ఆమె వాటాలు అప్పగించడం వల్లే.. ఆ శాఖలో ఆమె మాటకు ఎదురులేకుండా పోయిందని సిబ్బంది వాపోతున్నారు.