మహిళలకు ఉపాధి దానివల్ల వారికి ఆర్థిక స్వావలంబన సమాజంలో లైంగిక వివక్షను చెరపగలదు. కాని స్త్రీ, పురుషులకు ఉపాధి కల్పించడంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. తమ జీతభత్యాల బేరసారాల్లో స్త్రీల గొంతు బలపడుతున్నా వారు పొందుతున్నది తక్కువే. ఇక పనిచోట వారి శ్రమదోపిడి తీవ్రం. తమిళనాడులో విస్తారంగా ఉన్న రెడిమేడ్ దుస్తుల రంగంలో స్త్రీల పని పరిస్థితులు ఒక నమూనా. శ్రమ తప్ప ఆదాయం లేని ఉపాధి స్త్రీలకు కొనసాగాల్సిందేనా?
స్త్రీలు ఉపాధి పొందాలంటే అంత సులభమా? చెంగల్పట్టులో ఉన్న అనేక ఎక్స్‌పోర్ట్ గార్మెంట్స్ మాన్యుఫ్యాక్చర్ కంపెనీల్లో ఆ చుట్టుపక్కల పల్లెల్లోని స్త్రీలు వేలాదిగా పని చేస్తారు. వారంతా ఉదయం నాలుగున్నరకే లేచి ఇంట్లో వంట చేసి పిల్లలకు క్యారేజీలు కట్టి తాము టిఫిన్, లంచ్ కట్టుకుని ఏడూ ఏడున్నరకంతా కంపెనీ బస్సు కోసం నిలుచోవాలి. 9 గంటలకు ఫ్యాక్టరీలో డ్యూటీ ఎక్కితే తిరిగి సాయంత్రం 6 గంటల వరకూ నిలుచునే పని చేయాలి. మళ్లీ బస్సెక్కి ఇల్లు చేరి రాత్రి వంటకు పూనుకోవాలి. ఇంతా చేసి వారికి నెలకు దక్కేది ఎంతో తెలుసా? 9,500 రూపాయలు. సీనియర్లకైతే 10,500 రూపాయలు. ట్రాన్స్‌పోర్ట్ కటింగు, ఫ్యాక్టరీలో ఇచ్చిన టీ, బిస్కెట్ల కటింగు పోను వచ్చే జీతం ఇంతే. కాని వీరు తయారు చేసిన బట్టలు పోలో, ఇండియన్ టెరైన్ వంటి బ్రాండ్లుగా యూరప్, జపాన్, కెనడా, అమెరికాల్లో ఖరీదైన వెలకు అమ్ముడుపోతాయి.
తమిళనాడులో గార్మెంట్ ఫ్యాక్టరీల్లో 5 లక్షల మంది స్త్రీలు పని చేస్తున్నారు. మొత్తం ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది టైలరింగ్ ఉపాధిలో ఉంటే వారిలో 60 శాతం మంది మహిళలు. తమిళనాడులో వ్యవసాయం తగ్గాక రైతు కూలీలుగా పని చేసే స్త్రీలు ఫ్యాక్టరీల వైపు అడుగులు వేస్తున్నారు. కాని వారి శ్రమను దోచుకునే సమస్త ఏర్పాట్లు ఇదివరకే జరిగిపోయి ఉన్నాయి. అందుకే ఇటీవల చెన్నైలో ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. కోర్టులు కూడా వీరి జీతం పెంచమని చెప్పినా తమిళనాడులోని 500 మంది గార్మెంట్ ఫ్యాక్టరీల యజమానులు జీతాలు పెంచితే ఖర్చు పెరిగి ఆర్డర్లు తగ్గుతాయని, దుస్తుల కంపెనీలు ఆర్డర్లను శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలకు చీప్ కూలీల కోసం తరలిస్తాయని అభ్యంతరం చెబుతున్నారు. అయితే ఆ మాటలన్నీ సాకులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త జీతాలైనా ఎంతని? 15,000 మాత్రమే. ఆ 15 వేలు కూడా ఇవ్వం అంటున్నారు.
స్త్రీలు ఉపాధి పొందితే ఆ ఆర్థిక స్వావలంబనతో వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు వారి అభిలాషల మేరకు నెరవేర్చుకోవచ్చు. భర్తమీద ఆధారపడవలసిన పని లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని వారికి లభిస్తున్న ఉపాధి వారికి ఏ ఆదాయమూ మిగల్చనిది అయితే ఆ శ్రమకు అర్థం లేదు. జీతాలు ఎప్పుడూ పురుషుల కోసమే అనే మైండ్‌సెట్ సమాజంలో పోలేదు. స్త్రీల జీతం కోసం పెంపునకు యోగ్యమైనదే అని గ్రహించినప్పుడే పరిస్థితిలో కొద్దిగానైనా మార్పు వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment