అనిషా పదుకోన్‌: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.. | Anisha Padukone: We Shouldn't Neglect Mental Health Of Women. It should Be Treated In Time | Sakshi
Sakshi News home page

అనిషా పదుకోన్‌: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..

Published Wed, Mar 27 2024 8:24 AM | Last Updated on Wed, Mar 27 2024 11:34 AM

Anisha Padukone: We Shouldn't Neglect Mental Health Of Women. It should Be Treated In Time - Sakshi

పట్టణాలలో, నగరాలలో మానసిక సమస్యలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. పల్లెల్లో ఎలా? ముఖ్యంగా మహిళలకు మానసిక సమస్యలు వస్తే? డిప్రెషన్‌తో బాధ పడ్డ నటి దీపికా పదుకోన్‌ గ్రామీణ మహిళల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ అనే సంస్థను స్థాపించింది. దాని బాధ్యతను చెల్లెలు అనిషా పదుకోన్‌కు అప్పజెప్పింది. అనిషా నిర్వహణలో ఆ సంస్థ ఆరు రాష్ట్రాలలో గ్రామీణ మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది.

చెన్నైకి గంటన్నర ప్రయాణ దూరంలో ఉండే తిరువళ్లూరులో శశికళ అనే మహిళకు మతి చలించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెను తీసుకొచ్చి చెన్నైలో చూపిస్తే మందులు వాడాలన్నారు. చెకప్‌ల కోసం, మందుల కోసం నెలకోసారి చెన్నై రావాలంటే డబ్బులు ఖర్చవుతాయి. ఆమె అంత డబ్బు ఖర్చు పెట్టలేని పేద మహిళ. మందులు మానేసింది. మానసిక స్థితి ఇంకా దెబ్బ తిని ఊళ్లో దిమ్మరిగా తిరగడం మొదలెట్టింది.

గ్రామీణ స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్న ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ సంస్థ ప్రతినిధులకు ఈ సంగతి తెలిసింది. తమతో కలిసి పని చేస్తున్న చెన్నైకి చెందిన వసంతం ఫౌండేషన్‌కు ఈ సంగతి తెలియపరిచారు. ఆ ఫౌండేషన్‌ వారు ఆమెను తరచు వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. కావలసిన మందులు కొనిచ్చారు. కేర్‌గివర్‌గా పని చేస్తున్న తల్లికి దారి ఖర్చులు సమకూర్చారు. శశికళకు పూర్తిగా నయమైంది. ఆ తర్వాత ఆమె చిన్న చిల్లరకొట్టు నడుపుకోవడానికి 5000 రూపాయల సహాయం అందించారు. శశికళ ఇప్పుడు తన పిల్లలను చూసుకుంటూ జీవిస్తోంది.


‘ఇలా సహాయం అందాల్సిన వారు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అంటుంది అనిషా పదుకోన్‌. ఆమె ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ సంస్థకు సి.ఇ.ఓ.


దీపిక స్థాపించిన సంస్థ

తాను డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్టు దీపికా పదుకోన్‌ 2015లో లోకానికి వెల్లడి చేసింది. స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చింది. అంతే కాదు తన బాధ్యతగా 2016లో బెంగళూరు కేంద్రంగా స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’ను స్థాపించింది. దానికి తన చెల్లెలు అనిషా పదుకోన్‌ను సి.ఇ.ఓగా నియమించింది. అనిషా ఈ సంస్థ కోసం చురుగ్గా పని చేస్తోంది. ఇప్పటికి ఈ ఫౌండేషన్‌ సేవలను ఆరు రాష్ట్రాలకు విస్తరించింది. ఆ ఆరు రాష్ట్రాలలోని 13 జిల్లాల్లో ఈ సంస్థ వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరివల్ల 15,000 మంది గ్రామీణ మహిళలు ఇప్పటి వరకూ మానసిక చికిత్స పొందారు. అంతే కాదు 26,000 మంది సంరక్షకులు, అంగన్‌వాడి కార్యకర్తలు మానసిక చికిత్సలో ప్రాథమిక అవగాహనకై ట్రయినింగ్‌ కూడా ఈ సంస్థ వల్ల పొందారు.


గోల్ఫ్‌ ప్లేయర్‌

అనిషా పదుకోన్‌ తండ్రి ప్రకాష్‌ పదుకోన్‌ ప్రఖ్యాత బాడ్మింటన్‌ ప్లేయర్‌ కావడం వల్ల అనిషా స్పోర్ట్స్‌ పట్ల ఆసక్తి కనపరిచింది. ఆమె గోల్ఫ్‌ క్రీడను ప్రొఫెషనల్‌ స్థాయిలో నేర్చుకుని మన దేశం తరఫున అమెచ్యుర్‌ లెవల్‌లో ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ ఆటను కొనసాగించే సమయంలోనే దీపికా పడుకోన్‌ సూచన మేరకు ఫౌండేషన్‌ బాధ్యతలు తీసుకుంది. ‘ఇక్కడ పని చేయడం మొదలెట్టాక మానసిక సమస్యల తీవ్రత అర్థమైంది. మన దేశంలో 20 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో గ్రామీణ స్త్రీలు ఎక్కువ శాతం ఉన్నారు. వీరి కోసం మందులు, వైద్యం, పెన్షన్, సంరక్షకుల ఏర్పాటు, ఉపాధి... ఇవన్నీ సాధ్యం కావాలంటే పెద్ద ఎత్తున సాయం కూడా అందాలి. వాలంటీర్లు ముందుకు రావాలి. కలిసి పని చేయాలి’ అంటుంది అనిషా.

స్త్రీలు వ్యాయామం చేయడంతో పాటు పోషకాహారం తీసుకుంటూ తగినంత నిద్ర పోవడం అవసరం అంటుందామె. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని పిలుపునిస్తోంది.

ఇవి చదవండి: చదువు శక్తినిస్తుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement