తినే పదార్థాల్లో భిన్న రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి
ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ నిపుణుల కమిటీ సూచనలు
‘డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో పలు సూచనలు
జీవనశైలి అలవాట్లలో పెద్ద ఎత్తున వచ్చిన మార్పులతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మారిన, మారుతున్న ఆహార అలవాట్లతో ఎక్కువ మందిలో పోషకాహార లోపాలు, రక్తలేమి, ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం కూడా పెరగడంతో ఊబకాయం వంటి సమస్యలకు అనేక మంది గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్–హైదరాబాద్, ఎన్‌ఐఎన్ నిపుణుల కమిటీ ‘డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో పలు సూచనలు చేసింది. అన్ని వయసుల వారిలో ఆరోగ్య పరిరక్షణకు 17 డైటరీ గైడ్‌లైన్స్ సూచించింది. సమతుల ఆహారంలో వెరైటీలు (భిన్నరకాల ఆహార పదార్థాలు) ఉండేలా చూసుకోవడం ముఖ్యమని చెప్పింది.
ఐసీఎంఆర్–ఎన్‌ఐఎన్ గైడ్‌లైన్స్‌లో ముఖ్యమైనవి..
మనం తీసుకునే ఆహారంలో తాజా కూరలు, పండ్లు, 50 శాతం ధాన్యం (సిరియల్స్) పోషకాలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. చిక్కుళ్లు, గింజలు, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవాలి.
ఆరునెలల వయసు పైబడిన పిల్లలకు ఇళ్లలోనే తయారు చేసిన సెమీ–సాలిడ్ సప్లిమెంటరీ ఫుడ్‌ను ఇవ్వాలి.
చిన్నపిల్లలు, పెరిగే వయసున్న పిల్లలకు తగిన ఆహారం అందించి వారు అనారోగ్యం బారిన పడకుండా చూడాలి.
నూనె/కొవ్వుపదార్థాలు పరిమితంగా వాడాలి, తగినంతగా పోషకాలు, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్‌ను వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా లభించేలా చూడాలి.
కండలు పెంచేందుకు ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోరాదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుని ఊబకాయం వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, చక్కె ర, ఉప్పు ఎక్కువ ఉన్న వాటిని నియంత్రించాలి.
శారీరకంగా చురుకుగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్నే తీసుకోవాలి. మంచినీళ్లు తగినంతగా తాగాలి.
ప్రస్తుతం ఆహార పదార్థాలు ఎక్కువగా ప్యాకేజ్డ్ రూపంలో వస్తున్నందున ఆ ప్యాకెట్లపై ఉన్న వివరాలను పూర్తిగా చదివాకే కొనుగోలు చేయాలి.
గంటల తరబడి టీవీలు చూస్తున్నపుడు మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగాలి.
బిజీ షెడ్యూళ్లలో పనిచేస్తున్నా గంటకు ఒకసారైనా 5 నుంచి 10 నిమిషాలు నడవాలి.
ఇవి చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
Comments
Please login to add a commentAdd a comment