వీల్‌ పవర్‌ | Sakshi Special Story About D-Hub Founder Handicapped Vasundhara | Sakshi
Sakshi News home page

వీల్‌ పవర్‌

Published Sat, Mar 15 2025 6:25 AM | Last Updated on Sat, Mar 15 2025 6:25 AM

Sakshi Special Story About D-Hub Founder Handicapped Vasundhara

ఆమె పేరు వసుంధర.. విధి పెట్టిన అన్ని  పరీక్షల్లో నెగ్గింది..  వీల్‌ చెయిర్‌తోనే  విజయానికి  అడుగులు వేసింది!  మాతృత్వాన్నీ సాధించింది! డేరెస్ట్‌ ఉమన్‌గా మన్ననలు  అందుకుంటున్నారు  హైదరాబాద్‌కు  చెందిన వసుంధర.  ఈ విజేత గురించి  ఆమె మాటల్లోనే..

‘మన దగ్గర ఫిజికల్లీ చాలెంజ్డ్‌ వాళ్లకు అనువైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇప్పటికీ లేదు. అంటే నా చిన్నప్పటి పరిస్థితి ఊహించుకోండి.. ర్యాంప్స్, సపరేట్‌ వాష్‌ రూమ్స్‌ అనే ఊసే ఉండేది కాదు. ఫిజికల్లీ చాలెంజ్డ్‌ పిల్లలు చదువుకోవాలన్నా.. ఏదైనా యాక్టివిటీ నేర్చుకోవాలన్నా వాళ్లతో ఒక మనిషి ఉండాల్సిందే పనులన్నీ మానుకొని! అందుకే సాధారణంగా దిగువ, మధ్యతరగతి కుటుంబాల్లో వైకల్యం ఉన్న పిల్లలను ఇంట్లోనే ఉంచేస్తారు. 

కానీ నన్ను మా అమ్మ చదివించింది. ఆవిడ సింగిల్‌ పేరెంట్‌. పెద్దగా చదువుకోలేదు. కానీ బ్రహ్మాండమైన లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌తో నెగ్గుకొచ్చింది. టైలరింగ్‌ చేసేది అమ్మ. వీల్‌ చెయిర్‌ కొనేంత స్తోమత లేదు. అయినా నా చదువు విషయంలో వెనకడుగు వేయలేదు. స్కూల్‌కి, కాలేజ్‌కి తమ్ముడే నన్ను ఎత్తుకుని తీసుకెళ్లేవాడు. కాలేజ్‌లో క్లాసెస్‌ మారాల్సి వచ్చినప్పుడు ఫ్రెండ్స్‌ హెల్ప్‌ చేసేవారు.

→ కలాం గారిని అడిగాను కానీ...
నేను సీఏ చదువుతున్నప్పుడు అబ్దుల్‌ కలాం గారిని కలిశాను. ఫిజికల్లీ చాలెంజ్డ్‌ పర్సన్స్‌ నడుపుకోగలిగే వెహికిల్స్‌ని సమకూర్చొచ్చు కదా అని అడిగాను. అడిగాక ఆలోచించాను.. వాళ్లకోసం నేను కూడా ఏమైనా చేయొచ్చు కదా.. మాకున్న సమస్యల గురించి మనమే పోరాడాలి.. ఒకరికొకరం సపోర్ట్‌ చేసుకోవాలనిపించింది. అది మీడియాలో ఉంటేనే సాధ్యమవుతుందని గ్రహించాను. దాంతో సీఏ డ్రాప్‌ అయిపోయి, పీజీ మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం చదివాను.  

→ చాలా నేర్చుకున్నాను.. 
జర్నలిస్ట్‌గా నా పయనాన్ని ఆరంభించాను. చాలెంజింగ్‌గా ఉండిందా జాబ్‌. నేనొక డిజేబుల్డ్‌ పర్సన్‌ని అన్న విషయమే మర్చిపోయాను. సమీ„ý కురాలిగా... కంటెంట్‌ రైటర్‌గా, కొన్నిసార్లు న్యూస్‌ రీడర్‌గా,ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌గా.. ఇలా అన్ని బాధ్యతలూ తీసుకున్నాను. రిపోర్టర్‌ లేకుండా అరగంట విమెన్‌ బులెటిన్‌ని ఆరునెలల పాటు రన్‌ చేశాను. దాంతో చాలా నేర్చుకున్నాను. అయితే పది గంటలపాటు అలా ఒకేచోట కూర్చోవడం వల్ల హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చాయి. దాంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. 

కానీ దివ్యాంగుల సమస్యలను తెలపడానికి ఒక వేదికైతే ఉండాలి కదా! అందుకే వేవ్‌ మీడియాను స్టార్ట్‌ చేశాను. దివ్యాంగులకు అన్నిరకాల అవకాశాలను అందించడానికి ‘గుర్తింపు ఫౌండేషన్‌’ను మొదలుపెట్టాను. దివ్యాంగుల్లోని ఆంట్రప్రెన్యూర్‌ స్కిల్స్‌ని వెలికి తీసి, వాళ్లను ఆంట్రప్రెన్యూర్స్‌గా తయారుచేయడానికి ‘డీ హబ్‌’నుప్రారంభించాను. రీసెంట్‌గా ఇంటర్నేషనల్‌ లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ పూర్తి చేసుకున్నాను. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి నేనొక్కదాన్నే సెలెక్ట్‌ అయ్యాను.

→ వైవాహిక జీవితానికి వస్తే..
డిజేబుల్డ్‌ పర్సన్స్‌ వైవాహిక జీవితానికి పనికిరారనే అపోహ, ఆరోగ్యవంతుడు డిజేబుల్‌ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడంటే అతనిలో ఏం లోపం ఉందో అనే కామెంట్ల మధ్య.. నన్నర్థం చేసుకొనే స్నేహితుడు నరేందర్‌ని పెళ్లి చేసుకున్నాను. తల్లిని కావాలనీ ఆశపడ్డాను. కానీ నా ఆరోగ్యం అందుకు సహకరిస్తుందో లేదో అనే భయం ఉండేది నరేందర్‌కి. దాంతో ఆయన్ని కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లాల్సి వచ్చింది!

ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అయ్యే వరకు చాలా కాన్ఫిడెంట్‌గానే ఉన్నాను కానీ.. తర్వాతే చాలా ఒత్తిడి ఫీలయ్యాను. నాలాగే నా బిడ్డకూ వైకల్యం వస్తుందేమోననే భయం. పోలియో తప్ప జెనెటికల్‌గా నాకెలాంటిప్రాబ్లం లేదు. అయినా టెస్ట్‌లు చేయించుకున్నాను. బ్యాక్‌ బోన్‌ పెయిన్‌ వల్ల ఒకసారి ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ దగ్గరికీ వెళ్ళాను. అప్పుడే నాకు సివియర్‌ స్కోలియోసిస్‌ ఉందని తేలింది. 150 డిగ్రీల వంపు తిరిగినట్లు ఉంటుంది నా బాడీ. దీనివల్ల నాకు ఒక లంగ్‌ చిన్నగా.. ఒక లంగ్‌ పెద్దగా, ఒక కిడ్నీ చిన్నగా.. ఒక కిడ్నీ పెద్దగా ఉంటుంది. అలాగే నా గర్భాశయంలో కూడా బిడ్డ ఒక సైడ్‌కు పెరుగుతోందని తెలిసింది.

→ ఎన్నో పరీక్షలను తట్టుకుని...
డీ హబ్‌ని డెవలప్‌ చేస్తున్న సమయంలోనే ప్రెగ్నెన్సీ రావడంతో ఫైనాన్సియల్‌గా కూడా స్ట్రగుల్‌ అయ్యాం. ఫ్యామిలీ సపోర్ట్‌ ఎక్కడా లేదు. ముందు జాగ్రత్తగా ఏడోనెలలోనే ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకున్నారు డాక్టర్‌. ఆసుపత్రిలోంచే వర్క్‌ చేశాను డెలివరీ ముందు రోజు వరకు. లక్కీగా ఏ కాంప్లికేషన్స్ లేకుండా తొమ్మిదోనెల వరకు రాగలిగాను. సిజేరియన్‌ డెలివరీతో బాబు పుట్టాడు. కానీ జాండీస్‌తో ఐసీయూలో పెట్టారు. వాడు ఇంటికి రావడానికి  27 రోజులు పట్టింది.  వచ్చాక అనిమియా .. వీక్లీ చెకప్‌ అన్నారు. అది జ నరల్‌ కండిషన్‌నే అని తెలిసినా... తలసేమియానా? నా డిజేబిలిటీ వల్లే ఇలా అవుతోందేమో అనే భయం. ఆ మానసిక వేదనను మాటల్లో చెప్పలేను. అన్ని అవాంతరాలు దాటి బిడ్డ ఆరోగ్యంగా కేరింతలు కొడుతుంటే అన్నీ మరచిపోయాను. ఇప్పుడనిపిస్తుంటుంది.. నేనేనా అంతలా భయపడ్డది అని! నాకున్న కండిషన్‌లో మాతృత్వమనేది నిజంగానే నేను సాధించిన అతిపెద్ద అచీవ్‌మెంట్‌ అనిపిస్తుంది’’ అంటూ తన విజయగాధను వివరించారు వసుంధర.

నేనొక డిజేబుల్డ్‌ పర్సన్‌ని అన్న విషయమే మర్చిపోయాను. సమీక్షకురాలిగా... కంటెంట్‌ రైటర్‌గా, కొన్నిసార్లు న్యూస్‌ రీడర్‌గా,ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌గా.. ఇలా అన్ని బాధ్యతలూ తీసుకున్నాను. రిపోర్టర్‌ లేకుండా అరగంట విమెన్‌ బులెటిన్‌ని ఆరునెలల పాటు రన్‌ చేశాను.

 – శిరీష చల్లపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement