
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకేలా చదవడం అత్యంత అరుదు. ఎక్కడోగానీ అలా జరగదు. ఒకవేళ్ల ఇద్దరూ మంచి ప్రతిభావంతులైనా కూడా ఒకేలా మార్కులు సాధించడం అనేది అత్యంత అరుదు అనే చెప్పాలి. కానీ ఈ ట్విన్స్ ఇద్దరూ ఒకేలా మార్కులు సాధించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. తమ పుట్టుకే కాదు..ప్రతిభలో కూడా ఒకేలా సత్తాచాటుతామని అంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అంతేకాదండోయ్ పది నుంచి ఎంబీబీఎస్ వరకు దాదాపు ఒకేలా మార్కులు సాధించడం విశేషం.
ఆ కవలలే రహిన్, రిబాలు. సింగిల్ మదర్ పెంపకంలో పెరిగారు ఇద్దరు. తమ కుటుంబంలోని తొలి వైద్యులు కూడా వీరే. తమ మామ ఈ రంగంలోకి రావడానికి ఆదర్శం అని చెబుతున్నారు ఇద్దరు. వీరిద్దరూ వడోదరలోని GMERS మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇద్దరూ ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఒకేలా 66.8% స్కోర్ సాధించి అందర్నీ విస్తుపోయేలా చేశారు.
ఆ కాలేజ్ హాస్టల్ గదిలో ఒకే రూమ్‌లో కలిసి చదువుకున్నారు. తామిద్దరికి ఎంబీబీఎస్ సీటు వేర్వేరు కాలేజీల్లో వచ్చినా..2019లో గోత్రిలోని వైద్య కళాశాలలోనే ఇద్దరం జాయిన్ అయ్యాం అని చెబుతున్నారు ఇద్దరూ. తమ ఇంటికి చేరువలోనే ఆ కాలేజ్ ఉంటుందన్నారు. అలాగే నగరానికి వచ్చి ఒంటరిగా చదవడం కూడా ఇదే మొదటిసారని కూడా చెప్పారు. తమ తల్లి, తాతా, మామల ప్రోద్భలంతో ఈ ఘన విజయాన్ని సాధించామని చెబుతున్నారు.
ఇక రిబా, రహిన్‌లు తమ అమ్మ కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక వారిద్దరి విద్యా నేపథ్యం చూసినా..చాలా ఆశ్యర్యం కలిగిస్తుంది. పదిలో రిబా 99%, రహిన్ 98.5%తో ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్‌లో ఒకరు 98.2%, మరొకరు 97.3% కాగా, NEET-UGలో ఇరువురు 97%, 97.7% మార్కులు సాధించారు. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, ఇతర మెరిట్ ఆధారిత ఆర్థిక సహాయం ద్వారా ఎలాంటి టెన్షన్ పడకుండా హాయిగా చదువుకున్నారు ఇద్దరు.
ఇక రహిన్ ప్రసూతి అండ్ గైనకాలజీ వంటి సర్జికల్ బ్రాంచ్‌లో, రిబా ఇంటర్నల్ మెడిసిన్‌లోనూ కొనసాగాలనుకుంటున్నారు. అంతేగాదు ఇద్దరు అదే కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి అడ్మిషన్ పొందాలనుకుంటున్నారు. తామిద్దరం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ రంగంలోకి వచ్చామని చెబుతున్నారు. తమ కెరీర్ జర్నీ చాలా అద్భుతంగా సాగింది..అదే సక్సెస్‌ని ప్రతి విషయంలోనూ కొనసాగిస్తామంటున్నారు ఈ ట్విన్ సిస్టర్స్.
(చదవండి: మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..)