
వ్యవసాయ పనులకు ఆధునిక డ్రోన్ల వినియోగం
సంగారెడ్డి జిల్లాలో 54 మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు శిక్షణ
రైతులకు అందించనున్న పిచికారీ సేవలు
ఆర్థిక స్వావలంబనతోపాటు, రైతులకు మేలంటున్న మహిళలు
ఇంతకాలం పంటలకు పురుగు మందులు పిచికారీ చేయడం, నానో యూరియా వంటి ఎరువులు చల్లడం వంటి క్లిష్టతరమైన పనులను పురుషులే చేస్తున్నారు. అయితే ఇలాంటి పనులను కూడా ఇకపై మహిళలే చేయనున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్‌లతో వ్యవసాయ పనులను చేయడంపై గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 54 మంది ఎస్‌హెచ్‌జీ మహిళలను ఎంపిక చేశారు. తొమ్మిది రోజుల పాటు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి ఈ డ్రోన్లను అందించనున్నారు. బెంగుళూరుకు చెందిన ఫ్లైయింగ్ వెడ్జ్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.
80 శాతం సబ్సిడీపై...
కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం కింద ఈ డ్రోన్లకు 80 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ డ్రోన్ తోపాటు, సంబంధిత మెటీరియల్‌తో కలిపి యూనిట్ వ్యయం రూ.పది లక్షలు. ఇందులో లబ్ధిదారులు 20 శాతం (రూ.రెండు లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.ఎనిమిది లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమో దీదీ, కిసాన్ దీదీ పథకాల కింద సబ్సిడీ ఇస్తున్నాయి.
ఈ డ్రోన్ సేవలను తమ వ్యవసాయ పొలాలకు వినియోగించడంతోపాటు, గ్రామంలో ఇతర రైతుల పొలాలకు సేవలందించనున్నారు. ఇందుకోసం నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇలా ఎస్‌హెచ్‌జీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతోపాటు, రైతులకు తమ పంట పొలాలకు పురుగుమందుల పిచికారీ కష్టాలు తప్పనున్నాయి.
పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మేలు..
డ్రోన్ స్ప్రేపై మాకు శిక్షణ ఇస్తున్నారు. వీటిని వినియోగించడం ద్వారా మేము ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. అలాగే రైతులకు తక్కువ ఖర్చుతో పురుగు మందుల పిచికారీ చేసే సేవలు అందుబాటులోకి వస్తాయి. మా లాంటి మహిళా సంఘాలకు ఈ అవకాశాన్ని కల్పించడం పట్ల సంతోషంగా ఉంది.
– అనిత, ఎస్‌హెచ్‌జీ మహిళ,అల్మాయిపేట, సంగారెడ్డి జిల్లా.
డ్రోన్‌లను వినియోగించి పంటలకు పురుగుమందులు ఎలా పిచికారీ చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. రైతులకు ఈ సేవలు అందించడం ద్వారా మాకు ఆర్థికంగా కలిసొస్తుందని భావిస్తున్నాము. అలాగే రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. మాకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నారు. డ్రోన్ల సేవలు అందించేలా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది.
– లక్ష్మి, ఎస్‌హెచ్‌జీ మహిళ, అన్నాసాగర్, సంగారెడ్డి జిల్లా
(చదవండి: లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన)
Comments
Please login to add a commentAdd a comment