ఈమె.. డ్రోనాచార్యులే | One Woman Mission To Create 150000 Village Level Entrepreneurs With Drone Technology: Preet Sandhu | Sakshi
Sakshi News home page

ఈమె.. డ్రోనాచార్యులే

Published Wed, Sep 11 2024 12:13 AM | Last Updated on Wed, Sep 11 2024 12:13 AM

One Woman Mission To Create 150000 Village Level Entrepreneurs With Drone Technology: Preet Sandhu

‘నేను బాగుండాలి’ అని ఎంతోమంది అనుకుంటారు. కొందరు మాత్రం ‘అందరూ బాగుండాలి... అందులో నేనుండాలి’ అనుకుంటారు. ప్రీత్‌ సంధూ రెండో కోవకు చెందిన మహిళ.అగ్రీ–డ్రోన్‌ స్టార్టప్‌ ‘ఏవీపీఎల్‌’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన కలను నెరవేర్చుకోవడమే కాదు వందలాదిమందికి ఉద్యోగావకాశాలను కల్పించింది. ఎంతో మందికి మైక్రో–ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా కొత్త జీవితాన్ని ఇచ్చింది.

   హరియాణాలోని హిస్సార్‌కు చెందిన జ్యోతి మాలిక్‌ ఆదర్శవాద భావాలతో పెరిగింది. స్వతంత్రంగా ఉన్నతస్థాయికి ఎదగాలనేది ఆమె కల. ముంబైలో చదువుకోవడంతో ఆమె కలలకు రెక్కలు వచ్చాయి. ఉద్యోగంలో చేరింది. అయితే తన సంతోషం ఎంతోకాలం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండేళ్ల తరువాత ఉద్యోగం కోసం వస్తే నిరాశే ఎదురైంది. ‘ఈ జీవితం ఇంతేనా!’ అనే నిరాశామయ కాలంలో ‘ఏవీపీఎల్‌’ జ్యోతి మాలిక్‌కు మైక్రో–ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్త జీవితాన్ని ఇచ్చింది.

‘ఇప్పుడు నేను ఇండిపెండెంట్‌. ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తమ కలను నిజం చేసుకోవచ్చు’ అంటుంది ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో జ్యోతిమాలిక్‌.అమృత్‌సర్‌లోని ఖాల్సా కాలేజిలో చదువుకున్న ప్రీత్‌ సంధూకు కల్పనా చావ్ల రోల్‌ మోడల్‌. రాకెట్‌లు అంటే ఆసక్తి. కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అగ్రి–డ్రోన్‌ స్టార్టప్‌ ‘ఏవీపీఎల్‌’ను మొదలుపెట్టింది.వ్యాపార, వ్యవసాయ రంగాలకు అవసరమైన డ్రోన్‌ ఆపరేషన్‌లలో నైపుణ్యం కోసం గ్రామీణ ప్రాంతాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది ఏవీపీఎల్‌. ది రిమోట్‌ పైలట్‌ సర్టిఫికెట్‌(ఆర్‌పీసీ), అగ్రికల్చర్‌ స్ప్రే కోర్సులు గ్రామీణ ప్రాంతాలలో ఎంతోమందికి ఉపకరించాయి.

 ఈ కోర్సులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడానికే పరిమితం కాలేదు. విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేశాయి. మైక్రో–ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగు వేయడానికి ఉపకరించాయి. ‘ఫీట్‌ ఆన్‌ ది స్ట్రీట్‌’ నినాదంతో ‘ఏవీపీఎల్‌’ 12 రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాయి. ప్రీత్‌ సంధూ నాయకత్వంలో ‘ఏవీపీఎల్‌’ అగ్రికల్చరల్‌ ఇన్నోవేషన్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. ‘ఏవీపీఎల్‌’ శిక్షణా కార్యక్రమాల వల్ల ఒక్క హరియాణాలోనే 800 మంది డ్రోన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా మారారు.

‘ఆశావాదమే కాదు అవసరమైన సమయంలో ఆత్మవిశ్లేషణ కూడా అవసరం’ అంటుంది ప్రీత్‌.ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో తమ స్కిల్లింగ్‌ వెంచర్‌లోని లోపాలను విశ్లేషించింది.‘మా కంపెనీ తరఫున ఎంతోమందికి శిక్షణ ఇచ్చాం. ఇక అంతకుమించి ఆలోచించలేదు. అయితే చాలామందికి గ్రామీణ నేపథ్యం ఉండడం వల్ల పట్టణాల్లో ఉండలేక తిరిగి సొంత ఊళ్లకు వెళ్లి΄ోయేవారు. ఈ నేపథ్యంలో అసలు వారు పట్టణం ఎందుకు రావాలి? గ్రామాల్లోనే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది ప్రీత్‌.

‘మన దేశంలో పట్టణాల్లోనే కాదు ఎక్కడైనా సరే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు’ అనే ఆమె నమ్మకం నిజమైంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన నవీన సాంకేతిక పరిజ్ఞానంతో రూ΄÷ందించిన శిక్షణ కార్యక్రమాలు, రిమోట్‌ పైలట్‌ సర్టిఫికెట్, అగ్రికల్చర్‌ స్ప్రే కోర్సుల ద్వారా యువతరం ఊరు దాటి పట్టణం వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది.‘1.5 లక్షల విలేజ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌లను తయారు చేయాలనేది మా లక్ష్యం. డ్రోన్‌లు వారి జీవితాలను మార్చివేస్తాయి అనే నమ్మకం నాకు ఉంది’ అంటుంది ‘ఏవీపీఎల్‌’ కో–ఫౌండర్,  సీయీవో ప్రీత్‌ సంధూ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement