సుస్థిర సాగు విధానాలు, టెక్నాలజీ అవసరం
ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయని ఐటీసీ చైర్మన్ సంజీవ్‌పురి అన్నారు. సుస్థిర సాగు విధానాలు, టెక్నాలజీ సాయంతో ఇందుకు అనుకూలమైన పరిష్కారాలు అవసరమన్నారు. ఈ రంగంలో ఉత్పాదకత, నాణ్యత పెరగాలంటూ, అదే సమయంలో వాతావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ పురి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార, పోషకాహార భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందంటూ.. ఆహార ద్రవ్యోల్బణం కొండెక్కి కూర్చోవడానికి ఇలాంటి అంశాలే కారణమని వ్యాఖ్యానించారు.
‘‘భారత్‌లో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులున్నారు. వారితో మనం ఏ విధంగా కలసి పనిచేయగలం? వారిని ఉత్పాదకత దిశగా, భవిష్యత్‌కు అనుగుణంగా ఎలా సన్నద్ధులను చేయగలం? ఈ దిశగా వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయి’’అని సంజీవ్‌పురి చెప్పారు. సాగు విధానాలు పర్యావరణ అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు. ఈ తరహా సుస్థిర సాగు విధానాలు అవసరమన్నారు. నూతన తరం టెక్నాలజీల సాయంతో, వినూత్నమైన, సమగ్రమైన పరిష్కారాలను రైతులకు అందించాలన్నారు. ఈ దిశగా కొంత పురోగతి సాధించినప్పటికీ, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment