Farming
-
డ్రోన్ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయం
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేలా కేంద్రం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకంలో నమోదు చేసుకున్న ఒక్కో సంఘానికి రూ.8 లక్షలు మేర సాయం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2024-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకంలో భాగంగా సుమారు 14,500 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్నది. టెక్నాలజీ సహాయంతో వ్యవసాయాన్ని సులువుగా చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలను భాగం చేస్తోంది. వారికి డ్రోన్లు అందించి సరైన శిక్షణ ఇవ్వడంతో ఉపాధి కల్పిస్తోంది. అదే సమయంలో రైతులపై పనిభారం తగ్గినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకోసం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని గతంలోనే ప్రారంభించింది.ఇదీ చదవండి: 171.6 టన్నుల బంగారు ఆభరణాలు!ఈ పథకానికి సంబంధించి కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులోని అంశాలను అమలు చేసేందుకు రూ.1,261 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. డ్రోన్ కొనుగోలులో 80 శాతం వరకు కేంద్రమే భరించనున్నట్లు చెప్పింది. లేదంటే రూ.8 లక్షలు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ ధరతో డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే స్వయం సహాయక సంఘాలకు అదనంగా అవసరమయ్యే డబ్బును నేషనల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద 3 శాతం వడ్డీరాయితీతో అందించనున్నట్లు పేర్కొంది. -
గుళి సామ.. ఎకరానికి 11 క్వింటాళ్లు!
ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంట విస్తృతంగా సాగవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతర చిరుధాన్యాలతో పాటు సామలకు మంచి గిరాకీ ఏర్పడటంతో గిరిజన రైతుల్లో ఈ పంట సాగుపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈ పంట విస్తీర్ణం కూడా విస్తరిస్తోంది. సేంద్రియ పద్ధతిలో పండించడానికి శ్రమ, పెట్టుబడి పెద్దగా అవసరం లేనిది సామ. అందువల్ల గిరిజనులందరూ ఎంతోకొంత విస్తీర్ణంలో ఈ పంటను పండించి, తాము తింటూ, మిగతా సామలు అమ్ముకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. పూర్వం సామ ధాన్యాన్ని తిరగలిలో మరపట్టి బియ్యంలా మార్చుకొని సామ అన్నం, ఉప్మా, జావ వంటి సాంప్రదాయ వంటలు వండుకునే వారు. ఈ మధ్య మైదాన ప్రాంతాల ప్రజల్లో కూడా చిరుధాన్యాల వినియోగం పెరగడం, వీటితో బిస్కట్లు, కేక్ వంటి వివిధ రకాల చిరు తిండి ఉత్పత్తులను తయారుచేసి అమ్మడం వల్ల చిరుధాన్యాల ధరలు పెరిగి రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి.అప్పుడు చోడి, ఇప్పుడు సామ ఈ క్రమంలో వికాస స్వచ్చంద సంస్థ 2016లో చోడి /రాగి పంటలో గుళి సాగు పద్ధతిని ప్రవేశపెట్టింది. సాధారణంగా రైతులు చిరుధాన్యాల విత్తనాలను వెదజల్లే పద్ధతిలో పండిస్తుంటారు. నారు పెంచి, పొడి దుక్కిలో వరుసల్లో గుంతలు తీసి నాట్లు వేసుకునే పద్ధతిలో పండించడాన్నే ‘గుళి’ (గుళి అంటే గిరిజన భాషలో గుంట అని అర్థం) పద్ధతిగా పిలుస్తున్నారు. గుళి చోడిని పద్ధతిలో పండిస్తూ గిరిజన రైతులు దిగుబడిని ఎకరాకు 400 కేజీల నుంచి దాదాపు 1000 కేజీల వరకు పెంచుకోగలిగారు. ఈ క్రమం లోనే వికాస సంస్థ 2024 ఖరీఫ్ పంట కాలంలో గుళి పద్ధతిలో సామ పంటను సాగు చేయటానికి 54 మంది గిరిజన రైతులకు తోడ్పాటునందించింది.30–35 రోజుల మొక్క నాటాలిప్రధాన పొలం చివరి దుక్కిలో 200 కేజీల ఘన జీవామృతాన్ని చల్లడం వల్ల భూమికి బలం చేకూరి, రైతులు మంచి దిగుబడి సాధించారు. సామ పంట ముఖ్యంగా పెద్ద సామ రకం బాగా ఎత్తు పెరుగుతుంది. అందువల్ల మొక్కలు నాటిన తర్వాత 30 నుండి 35 రోజుల మధ్య వెన్ను రాక ముందే తలలు తుంచాలి. దీని వల్ల పంట మరీ ఎత్తు పెరగకుండా, దుబ్బులు బలంగా పెరుగుతాయి. గాలులకు పడిపోకుండా ఉంటుంది. దుంబ్రీగూడ మండలం లోగిలి గ్రామంలో కొర్రా జగబంధు అనే గిరిజన రైతు పొలంలో గుళి పద్ధతిలో పండించిన పెద్ద సామ పంటలో క్రాప్ కటింగ్ ప్రయోగాన్ని నిర్వహించారు. రైతులు, వికాస సిబ్బంది, నాబార్డ్ జిల్లా అధికారి చక్రధర్ సమక్షంలో సామలను తూకం వేసి చూస్తే.. ఎకరాకు దాదాపు 1,110 కేజీల (11.1 క్వింటాళ్ల) దిగుబడి నమోదైంది. ఈ పొలానికి పక్కనే రైత్వారీ పద్ధతిలో వెదజల్లిన సామ పొలంలో దిగుబడి ఎకరాకు 150 కేజీల నుంచి 200 కేజీలు మాత్రమే! గుళి సాగు ప్రత్యేకత ఏమిటి?రైత్వారీ పద్ధతిలో ఎక్కువ విత్తనం వెదజల్లటం, నేలను తయారు చేసే సమయంలో ఎటువంటి ఎరువు వేయక΄ోవడం, ఒక ఎకరాకు ఉండాల్సిన మొక్కల కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ సాంద్రతలో మొక్కలు ఉండటంతో పంట బలంగా పెరగలేకపోతోంది. గుళి పద్ధతిలో లేత నారును పొలంలో వరుసల మధ్య అడుగున్నర దూరం, మొక్కల మధ్య అడుగు ఉండేలా నాటుతారు. రైత్వారీ వెద పద్ధతిలో ఎకరానికి 3 నుంచి 4 కేజీల విత్తనం అవసరం. దీనికి బదులు మొక్కలు నాటడం వల్ల ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం (దాదాపు పది శాతం మాత్రమే) సరిపోతుంది. నారు పెంచుకొని 15 నుంచి 20 రోజుల వయసు మొక్కల్ని పొలంలో నాటుకోవడం వల్ల విత్తన ఖర్చు దాదాపుగా 90 శాతం తగ్గుతోంది. మొక్కల సాంద్రత తగినంత ఉండి, మొక్కలు పెరిగే సమయంలో ప్రతి మొక్కకూ చక్కగా ఎండ తగలుతుంది. ఘన జీవామృతం వల్ల నేల సారవంతమై సామ మొక్కలు బలంగా పెరిగి, మంచి దిగుబడి వస్తున్నట్టు గమనించామని వికాస సిబ్బంది వెంకట్, నాగేశ్వర రావు, తవుడన్న చెబుతున్నారు. దూరంగా నాటడం వల్ల దుక్కి పశువులతో కానీ, సైకిల్ వీడర్‌తో కానీ కలుపు తొందరగా, సులభంగా తియ్యవచ్చు. మొక్కలు బలంగా , ఏపుగా పెరగటం వల్ల కోత సమయంలో వంగి మొదలు నుంచి కోసే బదులు, నిలబడి వెన్నులు కొయ్యడం వల్ల సమయం ఆదా అవడమే కాక సులభంగా పంట కోత జరుగుతుండటం మరో విశేషం. మున్ముందు వరిగ, ఊద కూడా..అల్లూరి సీతారామ జిల్లాలో సామ పంటను ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా గుళి పద్ధతిలో పండించిన గిరిజన రైతులకు ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రైత్వారీ వెద పద్ధతిలో 2 క్వింటాళ్లకు మించలేదు. కనువిందు చేస్తున్న ఈ పొలాలను చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులను, మహిళలకు చూపిస్తున్నాం. వారు కూడా వచ్చే సంవత్సరం నుంచి మొక్కలు నాటే పద్ధతిని అనుసరించేలా ్ర΄ోత్సహిస్తున్నాం. ఇప్పటికే గిరిజన రైతులు చోడి సాగులో గుళి పద్ధతిని ΄ాటిస్తున్నారు. దీని వల్ల తక్కువ సమయంలోనే సామ రైతులు గుళి పద్ధతికి మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వరిగ, ఊద పంటల్ని కూడా గుళి పద్ధతిలో సాగు చేయిస్తాం. – డా. కిరణ్ (98661 18877), వికాస స్వచ్ఛంద సంస్థ, అల్లూరి సీతారామరాజు జిల్లా -
మట్టి + ఆముదం + కుంకుడు ద్రావణం: పంటలు పచ్చగా, నిండుగా!
పొలంలోని మట్టినే సేంద్రియ ఎరువుగా, పురుగులనునియంత్రించే ద్రావణం వాడి సత్ఫలితాలు పొందటం ద్వారా ఆరోగ్య దాయకమైన ద్రాక్ష, వరి తదితర పంటలు పండించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సివిఆర్) మరో ద్రావణాన్ని రూ పొందించారు. మట్టి+ఆముదంతో పాటు కుంకుడు రసం కలిపి చల్లితే పంటలకు చీడపీడల నియంత్రణతోపాటు పెరుగుదల బాగుందని గుర్తించారు. ఈ ద్రావణాన్ని తయారు చేసి మొదట తన పెరట్లోని టొమాటో, మొక్కజొన్న పంటలపై ఆయన ప్రయోగించి చూశారు. కేవలం వారం నుండి 10 రోజుల్లోనే పంటలో విపరీతమైన మార్పును గమనించారు. అంతకు ముందు మొక్కజొన్న ఆకులను పురుగులు తినటం, పంట పసుపు పచ్చగా ఉన్నపుడు ఈ ద్రావణం పిచికారీ చేశారు. కేవలం వారం నుంచి పది రోజుల్లోనే ఆ పంట పచ్చదనంతో కళకళలాడుతూ, ఆకులు కూడా వెడల్పుగా రావటం అంటే పంటలో మంచి ఎదుగుదలను గమనించారు. మరి కొందరు రైతులు కూడా సత్ఫలితాలు సాధించటంతో ఈ ద్రావణం సామర్థ్యంపై సివిఆర్ నిర్థారణకు వచ్చారు.మట్టి, ఆముదం, కుంకుడు ద్రావణం తయారీ విధానంలోపలి మట్టి (బాగా జిగటగా ఉండే మట్టి) 10 కిలోలు (ఒక తట్టెడు) తీసుకొని, గడ్డలు చిదిపి మెత్తని మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఆ మట్టిలో 250 మి.లీ. నుంచి 500 మి.లీ. వరకు ఆముదం కలపాలి. 250 నుండి 500 గ్రా. కుంకుడు కాయలు తీసుకొని కొంచెం నీటిలో వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో పిసికి, విత్తనాలు తీసివేసి, పేస్టులాగా తయారు చెయ్యాలి. అలా తయారైన పేస్టును అంతకు ముందు రోజు ఆముదం కలిపి పక్కన పెట్టిన మట్టిలో వేసి, బాగా కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటి డ్రమ్ములో వేసి కర్రతో బాగా కలపాలి. మట్టి మిశ్రమం అంతా నీటిలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి నీటిలోని మట్టి రేణువులు నీటి అడుగుకు పేరుకుంటాయి. పైకి తేరుకున్న ద్రావణాన్ని వడకట్టి స్ప్రేయర్లలో పోసుకొని పంటపై పిచికారీ చెయ్యాలి. రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మట్టి ద్రావణం నీటిలో కలిపిన తర్వాత 4 గంటల్లోగా వంటపై పిచికారీ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ఆలన్యం అయితే ఆముదం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. కుంకుడుతో పచ్చదనం వస్తోంది!పైకి పురుగు కనిపిస్తూ ఉంటే గతంలో చెప్పినట్లు మట్టి 20 కిలోలు, ఆముదం పావు కిలో నుంచి అర కిలో వరకు కలిపిన ద్రావణం చల్లితే పురుగుల నియంత్రణ బాగుంటుంది. అయితే, పెరుగుదల ఉండేది కాదు. మొలకల ద్రావణం చల్లాల్సి వచ్చేది. ఇప్పుడు కుంకుడు రసం కలపటం వల్ల ఆ కొరత తీరి పచ్చదనం వస్తోంది. తెగుళ్లు నివారిస్తుంది. పురుగులను గుడ్లు పెట్టనివ్వదు. అనేక పంటల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇది చల్లిన వారం, పది రోజుల్లోనే పంటలు ఆకుపచ్చని రంగులోకి మారి, గ్రోత్ వేగాన్ని అందుకుంటున్నది. మల్బరీ తప్ప ఏ పంటలోనైనా చల్లొచ్చు. పత్తి రైతులు కాయ పగలటానికి ముందు దశలోనే ఈ ద్రావణం వాడాలి. టొమాటోలో ఏ తెగుళ్లు, పురుగులూ రాలేదు. మిర్చిలో తామర పురుగు నియంత్రణకు మట్టి, ఆముదం, కుంకుళ్లతో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా కలిపి తయారు చేసిన ద్రావణం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ద్రావణాన్ని వర్షాలు బాగా పడే రోజుల్లో వారానికోసారి చల్లాలి. ఇప్పటి నుంచి పది రోజులకోసారి చల్లితే సరిపోతుంది. ఇది చల్లిన 2 గంటల వరకు వర్షం పడకపోతే చాలు, పనిచేస్తుంది. – చింతల వెంకటరెడ్డి (98668 83336), పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆల్వాల్, సికింద్రాబాద్చాలా పంటలపై చల్లా.. రిజల్టు బాగుంది!మట్టి, ఆముదం, కుంకుడు రసం ద్రావణం వాడిన వారం రోజుల్లోనే చీడపీడల నియంత్రణతో పాటు పంటల్లో పెరుగుదల బాగా కనిపించింది. 10 కిలోల లోపలి మట్టికి 250 ఎంఎల్ ఆముదం కలిపి పెట్టుకోవాలి. కుంకుడు కాయలను గింజలతో ΄ాటు నలగ్గొట్టి, ఉడక బెట్టాలి. నానబెట్టిన దానికన్నా, కుంకుడు విత్తనాలు కూడా పగులగొట్టి ఉడకబెడితే మరింత ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించింది. ఆ తెల్లారి కుంకుళ్లను పిసికి రసం తీసుకోవాలి. ఆముదం కలిపిన మట్టిలో ఈ కుంకుడు రసం కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. పసుపు, మామిడి, నిమ్మ, అవకాడో, అరటి తదితర పంటలన్నిటిపైనా ఈ ద్రావణాన్ని పిచికారీ చేశాను. వారంలోనే గ్రోత్ చాలా కనిపించింది. నూనెలు చల్లితే గ్రోత్ వస్తుంది. ఇక్కడ ఆముదం వాడుతున్నందున గ్రోత్తోపాటు చీడపీడల నియంత్రణ కూడా జరుగుతుంది. మట్టి ద్వారా మినరల్స్ కూడా పంటకు అందుతున్నాయి. 12–15 రోజులకోసారి అన్ని పంటలపైనే పిచికారీ చేస్తున్నా. ఈ రెండు పిచికారీల మధ్య ఒకసారి వేపనూనె పిచికారీ చేస్తే పురుగుల గుడ్లు నశించి మరింత మెరుగైన ఫలితాలుంటాయి. – పడాల గౌతమ్ (98497 12341), ఎస్టేట్ మేనేజర్, రుషి వ్యాలీ స్కూల్, మదనపల్లిదివంగత సంజీవరెడ్డి సూచనలతో 2007 నుంచి మా 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. 2014లో ‘సాక్షి సాగుబడి’లో సివిఆర్ మట్టి ద్రావణం గురించి చదివినప్పటి నుంచి వంగ, సాంబారు దోస, పూల తోట, వేరుశనగ వంటి అన్ని పంటలకూ లోపలి మట్టి+ ఆముదం ద్రావణం వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. సివిఆర్ కొత్తగా చెప్తున్నట్లు మట్టి, ఆముదంతోపాటు కుంకుడు రసం కూడా కలిపి పత్తి పంట 20 రోజుల దశలో రెండు నెలల క్రితం ఒకసారి, ఆ తర్వాత మరోసారి పిచికారీ చేశాను. పంట ముదురు ఆకుపచ్చగా బలంగా పురుగుల బెడద లేకుండా పెరిగింది. ఇప్పుడు పత్తి తీస్తున్నాను. ఇతర రైతులతో కూడా మట్టి ద్రావణం వాడిస్తున్నాం. – పి. గిరీష్ గౌడ్ (80732 45976), ఇనగలూరు,అగళి మండలం, సత్యసాయి జిల్లా -
బంజరు భూమిని బంగరు భూమి చేసింది
‘కలిసి ఉంటేనే కాదు కష్టపడితే కూడా కలదు సుఖం’ అని అనుభవపూర్వకంగా తెలుసుకుంది సంతోష్ దేవి.తన రెక్కల కష్టంతో బంజరు భూమిని బంగరు భూమిగా మార్చింది. ఎంతోమంది రైతులను తన మార్గంలో నడిపిస్తోంది.రాజస్థాన్‌లోని సికార్ జిల్లా బేరి గ్రామంలో... 1.25 ఎకరాల బంజరు భూమితో సంతోష్ దేవి ఖేదార్ ప్రయాణం ప్రారంభమైంది. కుటుంబం వీడిపోవడంతో తన భర్త వాటాగా 1.25 ఎకరం భూమి వచ్చింది. భర్త రామ్ కరణ్ హోంగార్డ్. చాలీచాలని జీతం. దీంతో వ్యవసాయం వైపు మొగ్గు చూపింది సంతోష్‌దేవి.‘పది, ఇరవై ఎకరాలు ఉన్నవారికే దిక్కు లేదు. ఎకరంతో ఏం సాధిస్తావు? అప్పులు తప్ప ఏం మిగలవు!’ అన్నారు చాలామంది. ఈ నేపథ్యంలో ‘వ్యవసాయం లాభసాటి వ్యాపారం’ అని నిరూపించడానికి రంగంలో దిగింది సంతోష్ దేవి.‘నేను చదువుకోవాలని మా నాన్న కోరుకున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడే నాకు చదువుల కంటే వ్యవసాయం అంటేనే ఇష్టం’ అంటుంది సంతోష్‌దేవి. తాతగారి పొలంలో ఎప్పుడూ రసాయనిక ఎరువులు వాడకున్నా మంచి దిగుబడి వచ్చేది. ఇక్కడ మాత్రం భిన్నమైన పరిస్థితి. చాలా ఏళ్లుగా రసాయనాలు వాడడం వల్ల పొలం నిస్సారంగా మారింది. చుట్టు పక్కల నీటి వనరులు లేకపోవడంతో జొన్న, సజ్జలాంటి సంప్రదాయ పంటలే పండించేవారు.కలుపు మొక్కలతో గందరగోళంగా ఉన్న పొలాన్ని ఒక దారికి తేవడంతో మొదటి అడుగు వేసింది. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు వాడాలని నిర్ణయించుకుంది. దానిమ్మ పండించమని, తక్కువ భూమిలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని సికార్ వ్యవసాయ అధికారి సలహా ఇచ్చాడు. ఆ సలహా వారి జీవితాన్నే మార్చేసింది.220 దానిమ్మ మొక్కలను కొనడానికి గేదెను అమ్మేయాల్సి వచ్చింది. మొక్కలు కొనగా మిగిలిన డబ్బుతో పొలంలో గొట్టపు బావిని వేయించింది. నీటి ఎద్దడి ఉన్న ఆప్రాంతంలో బిందు సేద్య పద్ధతిని నమ్ముకుంది. చుక్క నీరు కూడా వృథా చేయవద్దని నిర్ణయించుకుంది. జనరేటర్‌ను అద్దెకు తీసుకుంది. గ్రామంలోని ఎంతోమంది రైతుల సలహాలు తీసుకొని సేంద్రియ ఎరువు తయారీ మొదలుపెట్టింది. లేయర్ కటింగ్, సేంద్రియ పురుగు మందులకు బెల్లం కలపడంలాంటి రకరకాల టెక్నిక్‌ల గురించి తెలుసుకుంది. మూడేళ్ల కఠోర శ్రమ ద్వారా దానిమ్మ పండ్ల తొలి దిగుబడితో మూడు లక్షల లాభం వచ్చింది. సేంద్రియ ఎరువును ఎక్కువగా వాడడం వల్ల నేల సారవంతంగా మారింది.భర్త పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన తరువాత, పిల్లలు స్కూలు నుంచి వచ్చిన తరువాత నేరుగా పొలానికే వెళ్లేవాళ్లు. ‘ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదు. కాని బాగా కష్టపడాలనుకున్నాం’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంది సంతోష్‌దేవి. పండ్లతోటను నిర్వహించే అనుభవం రావడంతో యాపిల్‌లాంటి ఇతర పండ్లను పండించడంపై దృష్టి పెట్టింది.దానిమ్మ మొక్కల మధ్య నిర్దిష్టమైన దూరం ఉండాలి. ఆ ఖాళీ స్థలంలో కలుపు లేకుండా చూడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీల మధ్య మోసంబి మొక్కలు నాటింది. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత నిమ్మ నుంచి బెల్‌లాంటి ఎన్నో మొక్కలను నాటింది. పొలంలో సోలార్ ΄్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడంతో ఖర్చు తగ్గింది.‘మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలకు కారణం వారు పండిస్తున్న దానికి సరైన ధర లభించకపోవడమే. దళారులు లాభాలన్నీ అనుభవిస్తున్నారు’ అంటున్న సంతోష్‌దేవి ఒక్క పండును కూడా దళారులకు అమ్మదు. అన్ని పండ్లూ నేరుగా పొలంలోనే అమ్ముతారు.సంతోష్ సాధించిన విజయాన్ని చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా దానిమ్మ మొక్కలను పెంచడంప్రారంభించారు. అయితే చాలామంది విఫలమయ్యారు. అలాంటి వారు సంతోష్‌దేవిని సలహా అడిగేవారు. నాణ్యమైన మొక్కల కొరత వల్లే వారు విఫలమవుతున్నారు అని గ్రహించిన సంతోష్ దేవి ఆ లోటును భర్తీ చేయడానికి కొత్త మొక్కల కోసం ‘షెకావది కృషి ఫామ్ అండ్ నర్సరీ’ప్రారంభించింది.కష్టఫలంనేను, నా భర్త, పిల్లలు మాత్రమే పొలంలో పనిచేసేవాళ్లం. కూలీలతో పనిచేయించే స్థోమత మాకు లేదు. అయితే ఎప్పుడూ కష్టం అనుకోలేదు. ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటామో, పొలంలో అలాగే ఉండేవాళ్లం. కబుర్లు చెప్పుకుంటూనే కష్టపడేవాళ్లం. మా కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉంది.– సంతోష్‌దేవి -
వ్యవసాయ కుటుంబాలు వెరీ స్మార్ట్!
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాలతో పోలిస్తే వ్యవసాయ కుటుంబాలకే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లున్నాయని నాబార్డు సర్వే వెల్లడించింది. గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, ఆయా కుటుంబాలకు గల గృహాపకరణాలు, వారి జీవన ప్రమాణాల స్థాయిని తెలియజేసేందుకు నాబార్డు 2021–2022 వ్యవసాయ సంవత్సరంలో సర్వే నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కుటుంబాల్లో 98.3 శాతం వ్యవసాయ కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లుండగా.. వ్యవసాయేతర కుటుంబాల్లో 96.8 శాతమే స్మార్ట్ ఫోన్లున్నాయి. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో టెలివిజన్ సౌకర్యం కూడా వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాలకే అత్యధికంగా ఉండటం గమనార్హం. స్కూటర్, మోటార్ సైకిళ్లు కూడా వ్యవసాయ కుటుంబాలకే అత్యధికంగా ఉన్నాయి. కార్లు మాత్రం వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాలకు తక్కువగా ఉన్నాయని సర్వే తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఉన్న గృహోపకరణాలు వారి జీవన శైలిని మార్చేందుకు దోహదపడుతు న్నాయని సర్వే వెల్లడించింది. – సాక్షి, అమరావతి -
ఎక్కువ పొదుపు చేస్తుంది.. వ్యవసాయ కుటుంబాలే
దేశంలోని గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాలే అత్యధికంగా పొదుపు చేస్తున్నాయి. మొత్తం పొదుపు చేస్తున్న కుటుంబాల్లో... 71% వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి. వ్యవసాయేతర కుటుంబాల్లో 58% మాత్రమే పొదుపు చేస్తున్నాయి. ఈ విషయాన్ని నాబార్డు వెల్లడించింది. 2021 జూలై నుంచి 2022 జూన్ (వ్యవసాయ సంవత్సరం) వరకు ఆల్–ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వేను నాబార్డుకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. భారత్‌లోని గ్రామీణ జనాభా ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థపై నాబార్డు చేసిన ఈ సర్వే ప్రకారం దేశంలో అత్యధిక శాతం గ్రామీణ కుటుంబాలు వాణిజ్య బ్యాంకుల్లోనే పొదుపు చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి -
జీవితాలను పండించుకుంటున్నారు! సలాం!
ప్రస్తుతం వ్యవసాయంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనాల వల్ల పంటలు కలుషితమవడంతో పాటు మట్టిలో సూక్ష్మజీవులు నశించి΄ోతున్నాయి. పర్యావరణానికి హాని కలగటమే కాకుండా మానవాళి అనారోగ్యానికి ఆహారంలోని రసాయనాల అవశేషాలు కారమణవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావు పేటకు చెందిన మహిళా రైతులు కొందరు ఈ ముప్పును గుర్తించారు. విషపూరిత ఆహార పదార్థాల నుంచి కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ప్రకృతి సాగుకు నడుం బిగించారు. ఒకవైపు భూసారాన్ని పెంచుతూ మరోవైపు అధిక దిగుబడులు సాధిస్తూ తమ జీవితాలను పండించుకుంటున్నారు.ప్రకృతి వ్యవసాయ విభాగం మహిళలకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ద్వారా మహిళా రైతులను గుర్తించి గ్రామాల వారీగా అవగాహన కల్పించి, ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమని నమ్ముతున్న మహిళా రైతులు ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. మహిళా సంఘాల్లోని ప్రతి మహిళా కనీసం తన ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలనైనా పెరటి తోటల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించుకునే విధంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిపుణులు, అధికారుల కృషి ఫలిస్తోంది. గత నాలుగేళ్లలో జిల్లాలో ప్రకృతి సాగు అంచనాకు మించి విస్తరించింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని కూడా వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికెల) పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో సిబ్బంది ఆర్బీకేల్లోనే రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయానికి వాడే ఉత్పాదకాలను స్వయంగా రైతులే పొలం దగ్గర తయారు చేసుకొని వాడాలని, బయట కొనకూడదన్నది ఒక నియమం. అయితే, నాటు ఆవు లేక, ఉన్నా వాటిని తయారు చేసుకునే ఓపిక, తీరిక లేని వారు ప్రకృతి సాగుపై ఆసక్తి ఉన్నా ముందడుగు వేయలేక΄ోతున్నారు. అటువంటి వారి కోసం ఒక్కో మండలంలో ఐదు నుంచి పది వరకు ఎన్‌పీఎం (నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్) షాపులను ప్రకృతి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతుల ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా 10 నుంచి 15 శాతం అధిక మద్దతు ధర చెల్లించేలా ప్రకృతి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. అ మేరకు రైతులతో ముందస్తుగా ఒప్పందం చేసుకొని ఉత్పత్తులను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా పండించిన ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. వినియోగదారులే రైతుల వద్దకు వచ్చి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీనితోపాటు.. టీటీడీతోపాటు మరో 11 ప్రధాన దేవస్థానాలు మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ దిగుబడులు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు లభిస్తోంది. – పుట్లూరి శివకోటిరెడ్డి, సాక్షి, నరసరావుపేట రూరల్ ఉద్యమంగా ప్రకృతి వ్యవసాయంప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నైవేద్యాల తయారీకి వాడేందుకు టీటీడీతో ΄ాటు మరో 11 దేవస్థానాలు మూడేళ్లుగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు. సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నాం. – కె.అమలకుమారి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, నరసరావుపేట పెట్టుబడి తక్కువ.. ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో మెట్ట పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గింది. దిగుబడి బాగుంది. ఈ ఉత్పత్తులకు అధిక ధర వస్తుండటంతో లాభదాయకంగా ఉంది. – శివలక్ష్మి, మహిళా రైతు, ఏనుగు΄ాలెం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లాదిగుబడి బాగుంది.. మా రెండు ఎకరాల్లో పంట సాగు చేసేందుకు గతంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయాం. కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో వరి పంటను పండిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించారు. ఖర్చులు తగ్గాయి. దిగుబడులు పెరిగాయి. – లక్ష్మీదుర్గ, మహిళా రైతు, కారుమంచి, శావల్యాపురం మండలం ఇదీ చదవండి: తాతల నాటి నత్త మాంసం కూర తిన్నారా? అనేక రోగాలకు మందు! -
దారి చూపగలది వ్యవ‘సాయమే’!
దేశ జనాభాలోని అత్యధికులు ఇంకా వ్యవసాయ రంగంలోనే ఉండిపోవడం, వారి ఆదాయాలు నామమాత్రం కావడం దురదృష్టకరం. కానీ, ఈ ప్రతికూ లతలోనే, మెరుగైన ఉపాధి కల్పనకు, డిమాండ్ పెంపుదలకు అవకాశాలను వెతుక్కోవచ్చు. 60 శాతం వ్యవసాయ ఆధారిత గ్రామీణ జనాభా ఆదాయా లను పెంచగలిగితే, అది దేశీయంగా మెజారిటీ జన సామాన్యం కొనుగోలు శక్తిని పెంచుతుంది. ఉదాహరణకు బాగా ఆదాయం వచ్చిన ఒక పసుపు రైతు... కారు, బైకు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తే, ఆ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. గ్రామీణ కొనుగోలు శక్తి పెరుగుదల దేశంలోని నగర ప్రాంతాలలో కూడా పారిశ్రామిక రంగానికి ఊతాన్నిచ్చి, తద్వారా నగరాలలో కొత్త ఉపాధి కల్పనకూ, డిమాండ్ పెరుగుదలకూ కారణం కాగలదు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. 2018 డిసెంబర్ నాటికే 45 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉందని జాతీయ నమూనా సర్వే గణాంకాలు వెలుగు చూశాయి. ఈ కారణాల చేతనే 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 22 శాతం (అంతకు ముందటిసంవత్సరం కంటే) అంటే, 46 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అదే కాలంలో స్టాక్ మార్కెట్లోకి వచ్చిన పెట్టుబడులను కూడా కలి పితే, దేశంలోకి వచ్చింది 70.97 బిలియన్ డాలర్లు.అంతకు ముందరి సంవత్సరంలో ఈ మొత్తం 84.83 బిలియన్ డాలర్లు. ఇది, దేశీయంగా డిమాండ్ తగ్గుదలను సూచిస్తోంది. మరో పక్కన, భారతదేశం నుంచి విదేశాలకు పెట్టుబడులుగా వెళ్ళిన మొత్తం 2023లో, దానికి ముందరి సంవత్సరం కంటే 50 శాతం మేరన అంటే, 23.50 బిలియన్ డాలర్లకు మందగించింది. ఇది, అంతర్జాతీయంగా డిమాండ్ పతనాన్ని సూచి స్తోందని రిజర్వు బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. స్థూలంగా మనం గమనించవలసిన మరో అంశం కూడా ఉంది. అంతర్జాతీయంగా ప్రజల కొనుగోలు శక్తి పతనం కంటే, మన దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి పతనం మరింత అధికం. దీనికి తార్కా ణం, 1992 – 2012 కాలంలో, సరుకుల వ్యాపారంలో మన దేశం తాలూకు లోటు (ఎగుమతి, దిగుమతుల మధ్యన వ్యత్యాసం) సాలీన సగటున కేవలం 11 బిలియన్ డాలర్లు ఉండగా, అది ప్రస్తుత దశాబ్ద కాలంలో సాలీన సగటున 150 బిలియన్ డాలర్లకు పెరిగింది. దేశం ఎగుమతి చేస్తోన్న దాని కంటే, దిగుమతి చేసుకుంటోన్న సరుకుల విలువ పెరిగిపోయింది. దేశ స్థూలజాతీయ ఉత్పత్తిలో సరుకు ఉత్పత్తిరంగం వాటాను పెంచడం కోసం, 2014 సెప్టెంబర్‌లో ఆరంభమైన ‘మేకి¯Œ ఇండియా’ కార్యక్రమం విఫలం అయ్యింది. ఈ పథకం ఆరంభం తర్వాత,దేశంలో సరుకు ఉత్పత్తిరంగం ఎదగకపోగా, మరింత కుంచించుకుపోయింది. 2019లో ఉత్పత్తిని పెంచేందుకు కార్పొరేట్లకు ప్రోత్సాహకం పేరిట, 32 నుంచి 22% మేరకు తగ్గించిన కార్పొరేట్ పన్ను రేటు కూడా పెట్టుబడులను పెంచ లేకపోయింది. దీనితో పాటుగా 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పేరిట పి.ఎల్.ఐ. పథకాన్ని తెచ్చింది. 14 రంగాల కార్పొరేట్ ఉత్పత్తి సంస్థలకు ఈ పథకం కింద రాయితీలు ఇస్తోంది. అయినా, కేవలం 2, 3 పారిశ్రామిక రంగాలలో మాత్రమే కొద్ది మేరకు పెట్టుబడులు పెరిగాయి. ఈ పథకం కాస్తంత సానుకూల ఫలితాన్ని సాధించింది అనుకున్న స్మార్ట్ ఫోన్ల రంగంలో కూడా 2023 జూలై నాటికి వరుసగా రెండు త్రైమాసికాలలో ఎగు మతులు పతనం అయ్యాయి. మరో పక్కన దేశీయ సేవారంగం పరిస్థితి కూడా అంతంత మాత్రమే. సేవా రంగంలోని కీలక విభాగాలైన ఐటీ, బీపీఓ రంగా లలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలలో, 2024 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటికి ఉద్యో గుల సంఖ్య, అంతకు ముందరి కాలం కంటే తగ్గిపోయింది. ఇక, మిగిలింది దేశీయ వ్యవసాయ రంగం. నేడు, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్న వారి సంఖ్య 48.3%.ఎంతో కొంత వ్యవసాయం ఆధారంగా జీవించే వారిని కూడా కలిపితే ఇది 60% అవుతుంది. ప్రస్తుతం, గ్రామీణ రైతు కుటుంబ నెలవారీ సగటు ఆదాయం 10,218 రూపాయలు మాత్రమే. ఇది జాతీయ తలసరి సగటు ఆదాయం అయిన 10,495 రూపాయలకంటే తక్కువ. ఈ 60% జనాభా ఆదాయాలను పెంచగలిగితే, అది దేశీయంగా మెజారిటీ జన సామాన్యం కొనుగోలు శక్తిని పెంచుతుంది. మరి వ్యవసాయ ఆదాయాల పెంపుదలకు చేయవలసింది ఏమిటి?దీనికి ఒకటే జవాబు. వ్యవసాయదారులకు, వారి ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం. ‘గ్లోబల్ డెవలప్మెంట్ ఇ¯Œ క్యుబేటర్’ సంస్థ ఇచ్చిన నివేదిక మేరకు, మన దేశ గ్రామీణ యువ జనులలోని 70– 85% మంది తక్కువ నిపుణతలు అవసరమైన చిన్న సరుకు ఉత్పత్తి రంగంలోనూ లేదా రిటైల్ రంగంలోనూ ఉపాధిని కోరుకుంటున్నారు. అంటే, వారు లాభసాటిగా లేని వ్యవసాయం నుంచి బయట పడాలనుకుంటున్నారు. కానీ, వారిలోని 60% మంది ఉపాధి కోసం తమ గ్రామాన్ని విడిచి వెళ్ళాలని కోరుకోవడం లేదు. కోవిడ్ అనంతర కాలంలో నగర ప్రాంత కార్మికులలోని పెద్ద విభాగం తిరిగి తమ గ్రామాలకు వెళ్ళిపోయింది. నేడు నగర ప్రాంతా లలో ఉపాధి అవకాశాలు బలహీనంగా ఉండడంతో, వీరిలోని అత్య ధికులు తిరిగి నగరాలకు వచ్చేందుకు సిద్ధంగా లేరు.గ్రామీణ రైతాంగ ఆదాయాలు పెరిగితే, అది దేశీయంగాడిమాండ్ కల్పనను ఏ విధంగా తేగలదనేదానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. 2006–07లో నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట బాగా పండింది. ఆ సంవత్సరంలో అంతర్జాతీయంగా కూడా భారీగా ధర పలికింది. ఫలితంగా, పసుపు రైతులు చాలామంది సొంతిళ్లు నిర్మించుకున్నారు. కార్లు, బైకులు కొనుక్కున్నారు. టీవీలు, ఫ్రిజ్లవంటి గృహోపకరణాలు కొనుగోలు చేశారు. ఇక్కడ గమనించవలసింది, రైతుకు గనుక మంచి ఆదాయం ఉంటే... సిమెంట్, స్టీలు, వాహనాలు, గృహోపకరణాల వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగు తుంది. ఈ పారిశ్రామిక సరుకుల ఉత్పత్తి కేంద్రాలుగా నగరాలుఉంటాయి. కాబట్టి, గ్రామీణ కొనుగోలు శక్తి పెరుగుదల దేశంలోని నగర ప్రాంతాలలో కూడా పారిశ్రామిక రంగానికి ఊతాన్నిచ్చి, తద్వారా నగరాలలో కొత్త ఉపాధి కల్పనకూ, డిమాండ్ పెరుగుదలకూ కారణం కాగలదు. ప్రస్తుత స్థితిలో దేశ జనాభాలోని కేవలం 20–30% మంది కొనుగోలు శక్తిపై ఆధారపడి ఉన్న మార్కెట్ కంటే, 60%మంది జనాభా తాలూకు కొనుగోలు శక్తి దేశీయ మార్కెట్‌కూ, ఉపాధి కల్పనకూ అత్యుత్తమమైన స్థితిగా ఉండగలదు. కానీ కేంద్ర ప్రభుత్వం కనీస మద్ధతు ధరకు చట్టబద్ధతను కల్పించేందుకు సిద్ధంగా లేదు. 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత, గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకమైన, నగర ప్రాంత కార్పొ రేట్లకు అనుకూలమైన విధానాలు అమలయ్యాయి. ఈ విధానాల సారాంశం: రైతాంగ ఉత్పత్తులకు ధరలను తక్కువ స్థాయిలోనేఉంచడం. ఎందుకు? తద్వారా నగర ప్రాంతాలలో నిత్యావసర ధర లను తక్కువ స్థాయిలో ఉంచొచ్చు. దీని వలన, ఈ కార్పొరేట్లపై నగర ప్రాంతాల ఉద్యోగులు, కార్మికుల నుంచి అధిక వేతనాల కోసం డిమాండ్లు ఉండవు. వ్యవసాయం లాభసాటిగా ఉంటే, గ్రామీణ యువజనులు ఉపాధి కోసం నగరాల బాట పట్టరు. అంటే, నగర ప్రాంతాలలో కార్మికుల సప్లై తగ్గి కొరత ఏర్పడుతుంది. దాని వలన, వారికి డిమాండ్ పెరిగి కార్పొరేట్లు ఎక్కువ జీతాలతో పనిలో పెట్టు కోవాల్సి వస్తుంది. నగరాలకు నిరంతర కార్మికుల సరఫరా కోసం వ్యవసాయాన్ని నష్టాలలోనే ఉంచాలి. ఇప్పుడిప్పుడే కనీసం ఆలోచనల రూపంలో భిన్నమైన వాదనలు వినపడుతున్నాయి. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహా దారు అనంత నాగేశ్వర¯Œ ఇలా పేర్కొన్నారు: అంతర్జాతీయంగా వృద్ధి మందగిస్తోన్న దృష్టా ్య మనం ఏ రంగాన్ని కూడా తక్కువగా చూడగల స్థితిలో లేము. వ్యవసాయం కూడా ఆర్థిక వృద్ధికి చోదకశక్తిగా ఉండాలి. అంటే, వ్యవసాయాన్ని తిరిగి మరలా ‘ఆకర్షణీయంగా’ చేయగలగాలి. ఉదాహరణకు, నేడు బ్రెజిల్లో యువజనులు, గతంలో కంటే ఎక్కు వగా వ్యవసాయంలో భాగం పంచుకుంటున్నారు. కాబట్టి, ప్రస్తుత ఆర్థిక సంక్షోభ కాలంలో వ్యవసాయ ఆధారిత సరికొత్త నమూనాని విస్తృతంగా ప్రజల్లో చర్చకు పెట్టాలి. ఇది మాత్రమే దేశీయ నిరు ద్యోగం, కొనుగోలు శక్తి పతనాలకు పరిష్కారంగా ఉండగలదు.- వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు , మొబైల్: 98661 79615- డి. పాపారావు -
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి
రోమ్: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడినట్లు ఇటలీ పోలీసులు తెలిపారు. శనివారం ఉత్తర వెరోనా ప్రావిన్స్‌లో 33 మంది భారత కార్మికులను ఇద్దరు వ్యక్తుల నుంచి విడిపించినట్లు చెప్పారు. నిందితుల నుంచి అర మిలియన్ యూరోలు (సుమారు రూ. 45 లక్షలు) స్వాధీనం చేకున్నామని పేర్కొన్నారు.ఇటలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఈ ముఠా ఇండియా నుంచి సీజనల్ వర్క్ పెర్మిట్‌తో ఇక్కడి వ్యవసాయ కార్మికులను తీసుకువస్తారు. వారికి మంచి ఉపాధి చూపిస్తాని చెప్పి.. 17000 యూరోలు (సమారు రూ.15లక్షలు) కట్టమని చెబుతారు. వారానికి 7 రోజులు, రోజు 10-12 గంటలు పని. ఒక్క గంటకు నాలుగు యూరోలు ఇస్తామని ఒప్పందం చేయించుకుంటారు. కానీ, అలా చేరిన కార్మికులను బానిసలు పని చేయించుకుంటారు. .. మరికొంత డబ్బు ఇస్తే.. శాశ్వత వర్క్ పర్మిట్ ఇస్తామని నమ్మిస్తారు. కానీ, అది కూడా ఎప్పటికీ జరగదు. బాధిత కార్మికులు ఈ ముఠా సభ్యులు ఇటలీలో భద్రత, ఉపాధి అవకాశాలు, చట్టబద్ధమైన నివాస పత్రాలు అందిస్తామని మోసం చేస్తూ పని బానిసత్వంలోకి దించుతారు’అని పోలీసులు తెలిపారు. ఇతర యూరోపియన్ దేశాలతో పోల్చితే.. ఇటలీలో తీవ్రమైన కార్మికుల కొరత నెలకొంది. దీంతో ఇక్కడికి పని చేయడానికి వచ్చే వారికి కొన్ని ముఠాలు తక్కువ వేతనంతో ఇతర దేశాల వ్యవసాయ కార్మికులను మోసం చేస్తారు. లేబర్ చట్టాల ఉల్లంఘనలను ఇటలీ తీవ్రంగా ఎదుర్కొంటోంది. -
ఒకసారి నాటితే 80 ఏళ్ల వరకు దిగుబడి..
-
‘గ్యాప్’ పంటలకు ధరహాసం
సాక్షి, అమరావతి: మంచి వ్యవసాయ పద్ధతులు (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్–గ్యాప్) సర్టిఫికేషన్ రైతులకు రెట్టింపు కంటే ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పండించిన పంటలకు మార్కెట్లో ప్రీమియం ధర లభిస్తోంది. పంట ఉత్పత్తుల్ని నచ్చినచోట నచ్చిన వారికి అమ్ముకునే వెసులుబాటు లభించడంతో రైతుల ఆనందం అవధులు దాటుతోంది. నాణ్యమైన ధ్రువీకరణ వ్యవస్థ ఏర్పాటు సమగ్ర పంట నిర్వహణ పద్ధతుల్ని పాటించడం ద్వారా సాగు వ్యయాన్ని నియంత్రిస్తూ నాణ్యమైన ఉత్పాదకతను పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా కృషి చేస్తోంది. ఇందుకోసం పొలం బడులు, తోట బడులæను నిర్వహిస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతుల్ని రైతుల ముంగిటకు చేరుస్తోంది. ఫలితంగా సాగు వ్యయం 6 నుంచి 17 శాతం ఆదా అవుతుండగా.. దిగుబడులు 9 నుంచి 20 శాతం పెరిగి రైతులకు గణనీయమైన ఆదాయాన్ని ఇస్తోంది. పంట ఉత్పత్తుల నాణ్యతను ధ్రువీకరించేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి అనుబంధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని ఏర్పాటు చేసింది. తొలి దశలో పొలం బడులు, తోట బడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గ్యాప్ సర్టిఫికేషన్, రెండో దశలో సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకల్పించింది. క్వాలిటీ కౌన్సిల్ గుర్తింపుతో గ్యాప్ సర్టిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహనా ఒప్పందం మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా దేశంలోనే తొలి అక్రిడిటేషన్ జారీ చేసింది. సర్టిఫికేషన్ పొందేందుకు సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ అధికారులను టెక్నికల్ అడ్వైజర్లుగా, వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఫీల్డ్ ఆఫీసర్లుగా, తనిఖీలు చేసేందుకు అగ్రికల్చర్ డిప్లమో చేసిన వారిని ఇంటర్నెల్ ఇన్‌స్పెక్టర్స్‌గా ప్రభుత్వం నియమించింది. సర్టిఫికేషన్ జారీ కోసం అనుసరించాల్సిన పద్ధతులపై అధికారులు, సిబ్బందికి రైతులు పాటించాల్సిన ప్రమాణాలపై ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సౌజన్యంతో శిక్షణ ఇచ్చారు. క్వింటాల్‌కు రూ.7,500 లభించింది రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశా. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి తగిన మోతాదులో ఎరువులు వినియోగించాను. ఒకే ఒక్కసారి పురుగు మందులు పిచికారీ చేశాను. ఎకరాకు రూ.19,400 పెట్టుబడి అయ్యింది. రెండెకరాలకు 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గ్యాప్ సర్టిఫికేషన్‌తో వేరుశనగ క్వింటాల్‌కు రూ.7,500 చొప్పున ధర లభించింది. పెట్టుబడి పోగా రూ.66 వేల నికర ఆదాయం వచ్చింది. – బి.రామ్మోహన్, ఎం.వేముల, అన్నమయ్య జిల్లా నంద్యాల జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎస్.లక్ష్మీదేవి నాలుగేళ్లుగా పొలంబడుల ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన పంటల్ని పండిస్తోంది. ఖరీఫ్–2023 సీజన్లో రెండెకరాల్లో కొర్రలు సాగు చేసింది. ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ కోసం శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన మేలైన యాజమాన్య పద్ధతుల్ని పాటించింది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల ఎకరాకు 4 క్వింటాళ్ల చొప్పున మాత్రమే దిగుబడులొచ్చాయి. కానీ.. ఈమె గ్యాప్ సర్టిఫికేషన్ పొందటం వల్ల క్వింటాల్ కొర్రలకు రూ.7 వేలకు పైగా ధర లభించిందని సంతోషంతో చెబుతోంది. ఇప్పటికే 1,673 మంది రైతులకు లబ్ధి ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 20 జిల్లాలో గ్యాప్ క్లస్టర్స్ ఎంపిక చేశారు. ఆయా క్లస్టర్లలో 990 ఎకరాల్లో వరి, కొర్రలు, రాగులు, వేరుశనగ వంటి వ్యవసాయ.. 2,534 ఎకరాల్లో మామిడి, అరటి, పసుపు, మిరప, కూరగాయల వంటి ఉద్యాన పంటలను గుర్తించారు. 1,673 మంది రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఇండిగ్యాప్ సరి్టఫికేషన్కు అనుసరించాల్సిన విధి విధానాలు, ఆహార ప్రమాణాలపై కృషి గ్యాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎంపిక చేసిన రైతులకు శిక్షణ ఇచ్చారు. నాణ్యత పర్యవేక్షణకు సాంకేతిక బృందం ద్వారా దశల వారీగా తనిఖీలు, అంతర్గత ఆడిట్ నిర్వహించారు. సేకరించిన నమూనాలను పరీక్షించి పురుగు మందుల అవశేషాల గరిష్ట పరిమితికి లోబడి ఉన్నట్టుగా నిర్ధారించిన పంట ఉత్పత్తులకు ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేశారు. సర్టిఫికేషన్ పొందిన రైతులు వారి పంట ఉత్పత్తులను మార్కెట్ ధరల కంటే మిన్నగా ప్రీమియం ధరకు విక్రయించుకుని అదనపు ఆదాయాన్ని ఆర్జించగలిగారు. గ్యాప్ సర్టిఫికేషన్‌తో వ్యాపారులూ పోటీపడి రైతు క్షేత్రాల నుంచే కొనుగోలు చేయడంతో కోతకొచ్చిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరల కంటే అధిక ధరలకు రైతులు అమ్ముకోగలిగారు. కొర్రలకు మద్దతు ధర రూ.2,500 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్ కొర్రల్ని ధర రూ.7 వేలకు అమ్ముకోగలిగారు. వరి ధాన్యానికి మద్దతు ధర రూ.2,203 కాగా.. రైతులు రూ.4 వేలకు పైగా పొందగలిగారు. వేరుశనగ మద్దతు ధర రూ.5,850 ఉండగా.. గ్యాప్ సర్టిఫికేషన్‌తో రూ.8,300కు పైగా ధర లభించింది. రాగుల మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,846 ఉండగా.. సర్టిఫికేషన్ పొందిన రైతులు క్వింటాల్‌కు రూ.5 వేలకు పైగా ధర పొందగలిగారు. -
రూ. 450తో వ్యాపారం.. నెలల వ్యవధిలో రోజుకు రెండు వేల ఆదాయం!
దేశంలోని చాలామంది రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ రకాల వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రైతులు ఆవులు, గేదెల పెంపకాన్ని వదిలి కోళ్ల పెంపకంవైపు దృష్టి సారిస్తున్నారు. ఇది వారికి లాభదాయకమైన వ్యాపారంగా మారుతోంది. ప్రస్తుతం దేశీ కోడి మాంసానికి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చిన్న, సన్నకారు పశుపోషకులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా భగవాన్‌పూర్ బ్లాక్‌కు చెందిన ముఖేష్ పాశ్వాన్ భార్య సంగీతా దేవి గతంలో గేదెలను పోషిస్తూ ఆదాయాన్ని ఆర్జించేవారు. దీనిలో అంతగా లాభాలు లేకపోవడంతో ఆమె దేశవాళీ కోళ్లను వాణిజ్యపరంగా పెంచడం ప్రారంభించారు. బీహార్ ప్రభుత్వం అందించే జీవిక ఐపీడీఎస్ థర్డ్ ఫేజ్ పథకం కింద రూ.450 వెచ్చించి, 25 దేశీకోళ్లను కొనుగోలు చేసి వాటి పెంపకాన్ని చేపట్టినట్లు సంగీత మీడియాకు తెలిపారు. ఆమె దేశవాళీ కోళ్లతో పాటు కడక్‌నాథ్, సోనాలి, ఎఫ్‌ఎఫ్‌జీ జాతుల కోళ్లను కూడా పెంచసాగారు. కోడి మాంసంతో పాటు గుడ్లు, కోడిపిల్లలను సిద్ధం చేయడం ద్వారా ఆమె వ్యాపారాన్ని మరింత వృద్ధి చేశారు. ఇప్పుడు గ్రామానికి చెందిన పలువురు మహిళలు సంగీత దగ్గర దేశీ కోళ్ల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు వస్తున్నారు. 25 కోళ్లతో వ్యాపారం ప్రారంభించిన ఆమె దగ్గర ప్రస్తుతం 100 కోళ్లు ఉన్నాయి. స్థానికంగా కోడి గుడ్డు ధర మార్కెట్లో రూ.20 వరకూ ఉంది. ప్రస్తుతం ఆమె పెంచుతున్న కోళ్ల నుంచి ప్రతిరోజూ రూ. 200 విలువైన గుడ్లు వస్తున్నాయి. అలాగే రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోల కోడి మాంసం సిద్ధమవుతోంది. వీటిని విక్రయిస్తూ ఆమె రోజుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఆదాయాన్ని అందుకుంటోంది. -
సాగుబడి: ఆంధ్రా వర్సిటీలో ఆర్గానిక్ పంటలు!
'నగరవాసులకు ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలను, ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడానికి విశాఖ నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థతో కలిసి యూనివర్సిటీ ఆవరణలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. అనేక రకాల ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నగరంలోనే పండించి తాజాగా నగరవాసులకు అందిస్తోంది. నగరంలో పుట్టి పెరిగే విద్యార్థులకు మట్టి వాసనను పరిచయం చేయటం.. సేంద్రియ ఇంటిపంటల సాగు పనులను చేస్తూ నేర్చుకునే వినూత్న అవకాశాన్ని నగరవాసులకు కల్పించటం ప్రశంసనీయం. ఈ సామాజిక కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తున్న ‘ఎయు– అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్’ నిర్వాహకులు ఉషా రాజు, హిమబిందు కృషిపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రత్యేక కథనం'. పదిహేనేళ్లుగా సేంద్రియ టెర్రస్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న పౌష్టికాహార నిపుణురాలు ఉషా రాజు, హిమబిందు ఆంధ్రా యూనివర్సిటీతో కలసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మన మన్యం రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వాహకులు కూడా అయిన వీరు విశాఖపట్నం నగరం మధ్యలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆవరణలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రజలకు ప్రకృతితో కలసి జీవించడం నేర్పుతున్నారు. వాలంటీర్లు పాల్గొనేందుకు అవకాశం ఇస్తూ అర్బన్ కమ్యూనిటీ ఫార్మింగ్‌ని ఆచరించి చూపుతున్నారు. నగర వాసులు తమ ఇంటిపైన కూడా ఆరోగ్యదాయకమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కలిసి వర్సిటీలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌కు అనువైన స్థలం కేటాయించాలని ఉషా రాజు, హిమబిందు కోరారు. ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆకుకూరలు అందుబాటులోకి రావటంతో పాటు ప్రకృతి సేద్యంపై అవగాహన కలుగుతుందన్న ఆశయంతో ఆయన అందుకు అంగీకరించారు. వృక్షశాస్త్రం, ఫుట్ టెక్నాలజీ, ఫార్మసీ విద్యార్థులను ఈ అర్బన్ సాగులో భాగస్వాముల్ని చేయాలని వీసీ సూచించారు. ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం..! మా ‘మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో 4 జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు తదితర ఉత్పత్తులను ‘అవని ఆర్గానిక్స్’ పేరుతో విశాఖ నగరంలోని 4 రైతుబజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే, ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికి కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోనే ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచననుప్రోత్సహించిన ఆంధ్రా యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్ల ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు కలే, లెట్యూస్, బాక్చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను, కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి, ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం. స్థలంతోపాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది. వైర్ ఫెన్సింగ్, డ్రిప్‌లు, సిబ్బంది జీతాలను మా ఎఫ్.పి.ఓ. సమకూర్చుతోంది. నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు, నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటిపంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతి రోజూ ఉదయం 7–9 గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు. నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ల వచ్చు. స్కూలు విద్యార్థులకు ఇంటిపంటలు, ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశమని మేం భావిస్తున్నాం. యూనవర్సిటీలో ఈ పంటలను 2 ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది. – ఉషా రాజు, ఎయు–అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం 80 సెంట్లలో బహుళ పంటల సాగు.. ఆ విధంగా 2023 నవంబర్ చివరి నాటికి ఏయూ ఫార్మ్ టెస్టింగ్ లాబరేటరీ (ఎలిమెంట్) ఎదురుగా ఉన్న సుమారు 80 సెంట్ల ఖాళీ స్థలంలో ఏర్పాటైన అర్బన్ గార్డెనింగ్ హబ్‌లో ప్రకృతి సేద్యం ్రపారంభమైంది. కలుపు మొక్కలను తొలగించి నేలను సాగుకు అనుకూలంగా మార్చటానికి దాదాపు మూడు వారాల సమయం పట్టింది. తొలుత ఆకుకూరల సాగును ్రపారంభించారు. పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలి, గోంగూర, పొన్నగంటి, గలిజేరు, ఎర్రతోటకూర, పుదీనా వంటి పది రకాల ఆకుకూరలను చిన్నమడులుగా చేసుకొని సాగు చేస్తున్నారు. సలాడ్లలో వినియోగించే అరుదైన బాక్చాయ్ వంటి మొక్కలతో పాటు గోధుమ గడ్డి, ఆవ ఆకులు, చేమదుంపలు, కేరట్, బీట్రూట్, చిలగడదుంప వంటి దుంప పంటలనూ ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రాడ బీర, వంగ, బొప్పాయి కాత దశకు వస్తున్నాయి. త్వరలో దొండ పాదులు సైతం నాటబోతున్నారు. ప్రతీ మూడు నెలలకు నాలుగైదు రకాల కూరగాయలు పెంచే విధంగా వీరు ప్రణాళిక చేసుకుని పనిచేస్తున్నారు. ఆకర్షితులవుతున్న ప్రజలు.. పశువుల పేడ తదితరాలతో తయారు చేసిన ద్రవ జీవామృతం, ఘనజీవామృతంతో ఇక్కడ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్, స్ప్రిక్లర్లు ఏర్పాటు చేసుకుని పొదుపుగా నీటిని వాడుతున్నారు. అనేక రకాల పంటలను కలిపి పండించటం వల్ల ఆకుకూరలు, కూరగాయ మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పెద్దగా పురుగు పట్టడం లేదు. తమ కళ్ల ముందే ఆరోగ్యదాయకంగా సాగవుతున్న పంటలు వర్సిటీ ఆవరణలో నిత్యం వాకింగ్‌కు వచ్చే వందలాది మందిని ఆకర్షిస్తున్నాయి. కొద్దిసేపు ఈ ్రపాంగణంలో గడుపుతూ.. ఆకుకూరలు, కూరగాయలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకుంటూ.. కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కమ్యూనిటీ ఫార్మింగ్.. ప్రతీ ఆదివారం కమ్యూనిటీ ఫార్మింగ్నిప్రోత్సహిస్తున్నారు. నగరవాసులు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి కొద్దిసేపు వ్యవసాయం నేర్చుకోవడం కోసం భాగస్వాములయ్యేందుకు అవకాశం కల్పించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడకు వచ్చి కాసేపు పంట మొక్కల మధ్య సరదాగా గడుపుతున్నారు. దీనితో వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం, మానసిక ప్రశాంతత లభిస్తోందని చెబుతున్నారు. వలంటీర్లకు అవకాశం.. అర్బన్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న నగరవాసులకు ఇక్కడ వలంటీర్లుగా పని చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేయడం, ప్రతీ ఇంటిలో టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేసుకునే విధంగాప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్వాహకులు ఉమా రాజు, హిమ బిందు చెబుతున్నారు. ప్రస్తుతం ఏయూలో చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు ఇక్కడ పనిచేస్తున్నారు. మొక్కలపై తమకున్న ఆసక్తితో స్వచ్ఛందంగా ఉదయపు వేళల్లో రెండు గంటల సమయం వెచ్చిస్తున్నారు. విద్యార్థులనుప్రోత్సహిస్తూ వారికి అవని ఆర్గానిక్స్ ప్రత్యేకంగా స్టైఫండ్‌ను అందిస్తోంది. కూరగాయల మొక్కలు, ఇండోర్ ΄్లాంట్స్ను విశాఖవాసులకు అందుబాటులో ఉంచే విధంగా నర్సరీని ్రపారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై ఏయూ ఉన్నతాధికారులతో పాటు అవని ఆర్గానిక్స్ నిర్వాహకులకు శ్రద్ధ ఉండటం, సామాజిక బాధ్యతగా అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ్రపారంభించటం ఆదర్శ్రపాయం మాత్రమే కాదు, ఇతరులకు అనుసరణీయం కూడా! – వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: పి.ఎల్ మోహన్ రావు, సాక్షి, విశాఖపట్నం తిరుపతిలో 9 నుంచి ఆర్గానిక్ మేళా.. తిరుపతి గవర్నమెంట్ యూత్ హాస్టల్ గ్రౌండ్స్ (పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక)లో మార్చి 9,10,11 తేదీల్లో ఉ.6.30– రాత్రి 8 గం. వరకు ‘కనెక్ట్ 2ఫార్మర్’ సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా జరగనుంది. రైతులు తమ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు సహకరించటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్గానిక్ ఆహారోత్పత్తులను అందుబాటులోకి తేవటం తమ ముఖ్య ఉద్దేశమని కనెక్ట్ 2ఫార్మర్ ప్రతినిధి శిల్ప తెలి΄ారు. ప్రతి నెలా రెండో శని, ఆదివారాల్లో తిరుపతిలో ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ నెల ప్రత్యేకంగా 3 రోజుల మేళా నిర్వహిస్తున్నామన్నారు. 9న మొక్కల గ్రాఫ్టింగ్, 5 అంచెల పంట విధానంపై శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు, ఇంటిపంటల సాగుదారులు 63036 06326 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. 11న గృహిణులకు సిరిధాన్యాల వంటల పోటీ ఉంది. 83091 45655 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుండి 12 చేనేత సంఘాలు చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. పిల్లల కోసం భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయిన కలరీ, వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్, పెన్ కలంకారీ పై వర్క్‌షాప్‌లు జరుగనున్నాయి. ఇతర వివరాలకు.. 91330 77050. 7న మిద్దెతోట రైతులకు పురస్కారాలు.. ఈ నెల 7న ఉ. 11 గం.కు హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పట్టణ ప్రాంతాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటలు సాగు చేసుకునే 24 మంది అర్బన్ రైతులకు ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాల’ ప్రదానోత్సవం జరగనుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలి΄ారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ సమాచార కమిషనర్ ఎం. హనుమంతరావు, మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి అతిథులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. ఇవి చదవండి: షేర్ ఎట్ డోర్ స్టెప్: దానానికి దగ్గరి దారి -
నాలుగేళ్లలో రెట్టింపు ఆదాయం.. అదే నూజివీడు సీడ్స్ లక్ష్యం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్న కొత్త ఉత్పత్తుల ఊతంతో వచ్చే నాలుగైదేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని విత్తనాల సంస్థ నూజివీడు సీడ్స్ (ఎన్ఎస్ఎల్) నిర్దేశించుకుంది. ప్రస్తుతం కాటన్ సీడ్స్ మార్కెట్లో దాదాపు 16–17 శాతంగా ఉన్న వాటాను 30 శాతానికి చేర్చుకోవాలని భావిస్తోంది. కంపెనీ నెలకొల్పి 50 ఏళ్లయిన సందర్భంగా మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ ఎం. ప్రభాకరరావు ఈ విషయాలు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో నూజివీడు సీడ్స్ ఆదాయం రూ. 1,100 కోట్లుగా ఉంది. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ కోసం పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై గణనీయంగా వెచ్చిస్తున్నట్లు ప్రభాకరరావు తెలిపారు. తమ ఆదాయాల్లో 5 శాతం పైగా కేటాయిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా 13 ప్రాసెసింగ్ సెంటర్లు, 29 కోల్డ్ స్టోరేజీలు..గిడ్డంగులు ఉన్నట్లు తెలిపారు. 1 లక్ష మంది పైగా రైతుల నుంచి విత్తనాలు సేకరిస్తున్నట్లు, 20 వేల మంది పైచిలుకు రిటైలర్ల ద్వారా దాదాపు 50 లక్షల మంది రైతులకు సేవలు అందిస్తున్నట్లు ప్రభాకరరావు పేర్కొన్నారు. 1973లో మండవ వెంకటరామయ్య ప్రారంభించిన నూజివీడు సీడ్స్‌కి ఒక దశలో కాటన్ సీడ్ మార్కెట్లో మూడో వంతు వాటా దక్కించుకుంది. అప్పట్లో ఏర్పాటైన అనేక విత్తన సంస్థలు కాలక్రమంలో కనుమరుగైనప్పటికీ ఎన్ఎస్ఎల్ పటిష్టంగా నిలదొక్కుకుందని ప్రభాకరరావు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ సీఎస్‌వో శరద్ ఖురానా, డైరెక్టర్ పి. సతీష్ కుమార్, సీఎఫ్‌వో వి. శ్రీకాంత్ పాల్గొన్నారు. -
సేంద్రీయ వ్యవసాయంతో ‘నారియల్ అమ్మ’ కు పద్మశ్రీ
సేంద్రీయ వ్యవసాయంతో పద్మశ్రీ అవార్డు దక్కించుకుని ‘నారియల్ అమ్మ’ వార్తల్లోనిలిచారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని మారుమూల ప్రాంతానికిచెందిన 67 ఏళ్ల కామాచి చెల్లమ్మాళ్ కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. సేంద్రీయ కొబ్బరి తోటల పెంపకంలో విశేషకృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కింది. సాంప్రదాయ వ్యవసాయం, కొబ్బరి సాగుతో 'నారియల్ అమ్మ' గా ఖ్యాతి గడించారు. దక్షిణ అండమాన్‌లోని రంగాచాంగ్‌కు చెందిన చెల్లమ్మాళ్ కొబ్బరి సాగులో విప్లవాత్మకమైన, వినూత్న పద్ధతులను అవలబించారు. స్థిరమైన వ్యవసాయానికి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ను కూడా అలవర్చుకున్నారు. కొబ్బరి ఆకులు, పొట్టును మల్చింగ్గా ఉపయోగించి వర్షానంతర కాలంలో నేల తేమను కాపాడుకుంటూ తేమ నష్టాన్ని తగ్గించడమే కాకుండా కలుపు, తెగుళ్ల బెడదను నివారించారు. అలాగే హానికర రసాయనాలకు దూరంగా 'ట్రాప్ ప్లాంట్స్'తో తెగుళ్ల నివారణలో వ్యూహాత్మక విధానాన్ని అవలంబించారు. ఫలితంగా ఆరోగ్యకరమైన కొబ్బరి దిగుబడిని సాధించారు. అంతేకాదు తనతోపాటు తోటి రైతులు కూడా సేంద్రీయ పద్ధతులను పాటించేలా కృషి చేశారు.. తన 10 ఎకరాల భూమిలో బహుళ జాతుల పంటలను పండిస్తారు చెల్లమ్మాల్. అలాగే ఏనుగు పాదం, అరటి, వేరుశెనగ, పైనాపిల్, బత్తాయి, పచ్చిమిర్చి, ట్యూబ్ రోజ్, గ్లాడియోలస్, ఆకు, కూరగాయలతో వైవిధ్యమైన సాగు ఆమె ప్రత్యేకత. సమీకృత వ్యవసాయ విధానంతో తక్కువ కొబ్బరి మార్కెట్ ధరల సవాళ్లను అధిగమించడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచింది. స్థిర వ్యవసాయ పద్ధతులు, సరికొత్త ఆవిష్కరణలతో మారుమూల గ్రామం నుంచిజాతీయ అవార్డు దాకా సాగిన చెల్లమ్మాళ్ అద్భుత ప్రయాణం భావి తరం రైతులకు, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. చెల్లమ్మాళ్ కొడుకు రామచంద్రన్, ఆమెకు వ్యవసాయంలో ఆసరాగా ఉంటారు. విభిన్న పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపక విశేషాలను స్థానిక విద్యార్థులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ప్రదర్శిస్తూ వ్యవసాయ-పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని యోచిస్తున్నారు. -
చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు!
-
ఇవి నిజంగానే 'గజ' నిమ్మకాయలు!
సాధారణంగా నిమ్మకాయలు ఏ సైజులో ఉంటాయో అందరికీ తెలిసిందే. మహా అయితే బాగా పెరిగితే కోడిగుడ్డు సైజుకి దగ్గరగా ఉండొచ్చు అంతేగానీ బాహుబలి రేంజ్లో నిమ్మకాయలు పెరగడం అనేది జరగదు. దబ్బకాయలాంటి నిమ్మజాతి పండ్లు పెద్దగా ఉంటాయి. అవి కూడా మోస్తారుగా ఓ బత్తాకాయ సైజులో ఉంటాయి అంతే!. కానీ ఈ నిమ్మకాయి మాత్రం అన్నింటిని తలదన్నేలా భారీ సైజులో ఉంది. ఎక్కడంటే..? కర్ణాటకలో కొడుగు జిల్లాలోని పలిబెట్ట ప్రాంతానికి చెందిన విజు సుబ్రమణి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం క్యూ కడుతుండటం విశేషం. ఇవి అరుదుగా ఐరోపా వంటి దేశాల్లోనే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఊరగాయాలు, శీతల పానీయాల తయారీకి ఉపయోగిస్తారని వెల్లడయ్యింది. ఈ మొక్కలు ఆ రైతు వద్దకు ఎలా వచ్చాయంటే..? విజు సుబ్రమణి నాలుగేళ్ల క్రితం మైసూర్ వెళ్లినప్పుడు అక్కడ ఒక మార్కెట్లో ఈ విత్తనాలను కొనుగోలు చేశానని తెలిపారు. ఆ తర్వాత వాటిని తన ఇంటి సమీపంలో ఉన్న గార్డెన్లో పెంచానని అన్నారు. అయితే పెరిగిన మొక్కలను తీసి కాఫీ తోటలో సాగు చేసినట్లు చెప్పుకొచ్చారు. మూడేళ్లకు ఈ నిమ్మచెట్లు పెరిగి పెద్దవయ్యాయని తెలిపారు. అయితే ఆ చెట్లకు నిమ్మ పువ్వులు, కాయలు గానీ రాలేదు. దీంతో ఇది నిమ్మ చెట్టేనా..! అనే అనుమానం వచ్చింది. ఈలోగా కొద్దిరోజులకే పంట రావడం మొదలైంది. చూస్తుండగానే నిమ్మకాయలు పెద్దగా భారీ పరిమాణంలో కాసాయని చెప్పారు రైలు సుబ్రమణి. సాధారణంగా నిమ్మకాయ 60 గ్రాముల బరువు ఉండి, రెండు నుంచి మూడు అంగుళాల పొడవే ఉంటాయి. ఈ నిమ్మకాయ మాత్రం ఒక్కొక్కటి ఏకంగా 5 కిలోల బరువు ఉండి.. ఆరడగులు వరకు పెద్దగా పెరగడం విశేషం. ఇక్కడ కర్ణాటక రైతు ఆ నిమ్మకాయలను ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ నిమ్మకాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల తోపాటు ఔషధ ఉపయోగాలున్నాయని చెబతున్నారు నిపుణులు. (చదవండి: మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పది సేఫ్టీ యాప్‌లు ఇవే..!) -
‘నల్ల తామర’కు ముకుతాడు?
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మిరప రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న నల్ల తామరను తట్టుకునే మిరప రకాలను రూపొందించుకునే పరిశోధనల్లో వరల్డ్ వెజిటబుల్ సెంటర్ గణనీయమైన పురోగతి సాధించింది. తైవాన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సెంటర్ (డబ్ల్యూ.వి.సి.) దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానం పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ ఆవరణలో ఉంది. ఈ కేంద్రంలో సాగులో ఉన్న నల్లతామరను తట్టుకునే గుణాలున్న 9 మిరప రకాలతో కూడిన ప్రదర్శన క్షేత్రాన్ని ఆసియా అండ్ పసిఫిక్ సీడ్ అసోసియేషన్(ఎపిఎస్‌ఎ)కు చెందిన 50 ప్రైవేటు విత్తన కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు. ఆసక్తి కలిగిన విత్తన కంపెనీలతో కలసి త్వరలో చేపట్టనున్న బ్రీడింగ్ ప్రాజెక్టు ద్వారా నల్లతామర, తదితర చీడపీడలను చాలావరకు తట్టుకునే సరికొత్త సంకర వంగడాలను రూపొందించనున్నట్లు డబ్ల్యూ.వి.సి. ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ తెలిపారు. 10 రాష్ట్రాల్లో మిరపకు నల్లతామర ప్రపంచంలో మిరపను అత్యధిక విస్తీర్ణంలో పండిస్తూ, వినియోగిస్తూ, ఎగుమతి చేస్తున్న దేశం భారత్. అంతేకాకుండా, దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న రెండో పెద్ద కూరగాయ పంట మిరప. హెక్టారుకు రూ. 2.5–3 లక్షల వరకు పెట్టుబడి అవసరమైన ఈ పంట దేశంలో సుమారు 7.30 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. తామర పురుగులు గతం నుంచి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. అయితే, ఇండోనేసియా నుంచి బొప్పాయి ద్వారా మన దేశంలోకి ప్రవేశించిన నల్ల తామర 2015లో తొలుత మిరపను ఆశించి విధ్వంసం సృష్టిస్తోంది. గత రెండు–మూడేళ్లుగా ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో మిరప తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. నల్ల తామర తాకిడిని తట్టుకోవడానికి అతి తరచూ పురుగుమందులు పిచికారీలు చేసినా దిగుబడి నష్టం 40–50 శాతం ఉంటుంది. ఏభయ్యేళ్ల పరిశోధన ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో దీన్ని తట్టుకునే వంగడాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కూరగాయ పంటలపై గత ఏభయ్యేళ్లుగా పరిశోధనలు చేస్తూ మెరుగైన వంగడాల అభివృద్ధికి, స్థానిక వంగడాల అభివృద్ధికి దోహదపడుతున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సంస్థ. తైవాన్‌లోని ప్రధాన పరిశోధన స్థానం కలిగిన డబ్లు్య.వి.సి. ప్రధానంగా మిరప, టొమాటో, కాకర, గుమ్మడి, బెండ, పెసర, వెజ్‡సోయాబీన్స్, తోటకూర పంటలకు సంబంధించి చీడపీడలు తట్టుకునే మెరుగైన వంగడాల అభివృద్ధిపై ఈ సంస్థ గత ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. అయితే, పటాన్‌చెరులోని డబ్ల్యూ.వి.సి. కేంద్రంలో ముఖ్యంగా మిరప, టొమాటో, పెసర, వెజ్ సోయాబీన్ పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. మెరుగైన వంగడాలు వాడితే తక్కువ పిచికారీలు చాలు తైవాన్‌లోని డబ్ల్యూ.వి.సి. పరిశోధనా కేంద్రంలో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు 7 రకాల మిరప వంగడాల్లో గుర్తించారు. పటాన్చెరు కేంద్రంలో గుర్తించిన మరో 2 మిరప రకాలను గుర్తించాం. ఈ 9 రకాలపై రెండేళ్లుగా పరిశోధనలు చేయగా, ఇందులో 6 రకాల్లో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలకు కారణమైన జన్యువులను, వాటికి సంబంధించిన మార్కర్లను గుర్తించాలి. ఇందుకు ఆసక్తి గల స్థానిక ప్రైవేటు విత్తన కంపెనీలతో కలసి తదుపరి దశ పరిశోధనలు సాగించాల్సి ఉంది. ఈ పరిశోధనలన్నీ పూర్తయి నల్లతామరను చాలా మటుకు తట్టుకునే మెరుగైన మిరప విత్తనాలు రైతులకు చేరటానికి మరో 3–4 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు చాలా సార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వస్తున్నది. మెరుగైన విత్తనాలు వాడితే తక్కువ పిచికారీలు సరిపోతాయి. ఈ మెరుగైన విత్తనాలను వాడుతూ రైతులు మంచి వ్యవసాయ పద్ధతులను పాటించటం అవసరం. దీర్ఘకాలం పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునేందుకు అనువైన మిరప వంగడాల అభివృద్ధికి దోహదపడటమే మా లక్ష్యం. – డా. నల్లా మనోజ్‌కుమార్, అసిస్టెంట్ సైంటిస్ట్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా పరిశోధనా కేంద్రం, ఇక్రిశాట్ ఆవరణ, పటాన్చెరు -
డ్రాగన్ ఫ్రూట్‌తో దిమ్మతిరిగే లాభాలు, మొదటి పంటలోనే 6లక్షలకు పైగా..
కర్నూలు(అగ్రికల్చర్): కరువులో డ్రాగన్ ఫ్రూట్ సాగు కలసివస్తోంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. గతంలో ఒకరిద్దరి రైతులకే పరిమితమైన తోటలు ఏడాదికేదాది అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 300 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేసే రైతుకు గరిష్టంగా రూ.1.90 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. గతంలో దిమ్మెలు పాతి దానిపై టైర్/బండి చక్రం అమర్చడం ద్వారా మొక్కలు పైకిపాకే ఏర్పాటు చేసేవారు. నేడు ట్రెల్లీస్ విధానంలో(దిమ్మెలపై టైరు/ బండి చక్రం అవసరం లేకుండా తీగలతో ) తోటలు అభివృద్ధి చేస్తున్నారు. మొదటి పంటలోనే రూ.6 లక్షల ఆదాయం దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన కంది రవీంద్రకుమార్ యాదవ్ ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ఈయన కేవలం 10వ తరగతి వరకు చదువుకున్నారు. మొదటి పంటలోనే రూ. 6 లక్షల ఆదాయం పొందారు. నరసరావు పేట నుంచి మొక్క రూ.60 ప్రకారం తెప్పించి 2021లో నాటుకున్నారు. సాలుకు, సాగుకు మధ్య 14 అడుగులు, దిమ్మెకు, దిమ్మెకు మధ్య 14 అడుగుల దారంలో పోల్స్ నాటుకున్నారు. పోల్స్‌కు విద్యుత్ లైన్ తరహాలో 4 వరుసలతో లైన్ వేశారు. పోల్స్ కింద ఒకదానిపైన ఒకటి ప్రకారం మూడు వైర్లు లాగారు. ఈ వైర్ల కింద అడుగు, అడుగు దూరంలో డ్రాగన్ ప్రూట్ మొక్కలు నాటుకున్నారు. మొక్కలు తీగ తరహాలో పైకి పెరుగుతూ... పైన వేసిన నాలుగు లైన్లు వేసి తీగలపై అల్లుకున్నాయి. దిమ్మెలపై టైరు/బండి చక్రం అవసరం లేకుండా పోయింది. ఎకరన్నర భూమిలో ఏకంగా 7వేల మొక్కలు నాటుకోగా.. పెట్టుబడి వ్యయం రూ.16 లక్షల వరకు వచ్చింది. అంతరపంటగా వేరుశనగ సాలుకు, సాలుకు మధ్య 14 అడుగులు ఉండటంతో ట్రాక్టరుతో సేద్యం చేసుకోవచ్చు. ప్రతి ఏటా అంతరపంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడింది. డ్రాగన్‌ప్రూట్ మొక్కలకు ఆకులు రావు. తీగలపైనే అల్లుకుంటాయి. మధ్య ఖాళీగా ఉన్న భూమిలో అంతరపంటగా వేరుశనగ సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. డ్రాగన్‌ప్రూట్ తోటకు మల్చింగ్ సదుపాయం కూడా కల్పించుకున్నారు. దీంతో కలుపు సమస్య లేకుండా పోయింది. తేమ కూడా ఆరిపోదు.. ప్లాస్టిక్ షీట్లకు అడగు, అడుగు దూరంలో రంధ్రాలు వేసి మొక్కలు నాటారు. మల్చింగ్ వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతోంది. ఏపీఎంఐపీ ద్వారా సూక్ష్మ సేద్యం కల్పించుకున్నారు. ఐదేళ్ల నుంచి పెరగనున్న దిగుబడులు పంటకు కేవలం పశువుల ఎరువులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. నాటిని ఏడాదిలోపే 2022 అగస్టులో కాపు మొదలైంది. మొదటి పంటలో కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. 2023లో దిగుబడి బాగా పెరిగింది. ఈ ఏడాది జూన్‌లో మొదలైన పంట నవంబరు నెలతో ముగింపునకు వస్తోంది. ఈ ఏడాది ఏకంగా 60 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. టన్ను రూ.లక్ష ప్రకారం విక్రయించారు. ఇప్పటి వరకు రూ.6 లక్షలకుపైగా ఆదాయం పొందారు. వచ్చే ఏడాది మొక్కకు 20 వరకు పండ్లు వస్తాయి. ఇవి 4 కిలోల వరకు ఉంటాయి. ఈ ప్రకారం 28 టన్నుల వరకు దిగుబడి పెరుగనుంది. నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి గరిష్టస్థాయికి చేరుతుంది. మూడు నెలలు అధ్యయనం చేశా డ్రాగన్న్ఫ్రూట్స్ సాగు చేసే ముందు మూడు నెలలు అధ్యయనం చేశా. ఒక అవగాహనకు వచ్చాక ట్రెల్లీస్ విధానంలో మొక్కలు నాటుకున్నా. మల్చింగ్, పోల్స్, వైర్లు, మొక్కలు తదితర వాటికి పెట్టుబడి కింద రూ.16 లక్షల ఖర్చు వచ్చింది. డ్రాగన్ ప్రూట్స్ సాగుకు ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం రూ.1.90 లక్షల సబ్సిడీ ఇచ్చింది. ఏపీఎంఐపీ కింద డ్రిప్ కూడా మంజూరైంది. – కంది రవీంద్రకుమార్ యాదవ్ సాగును ప్రోత్సహిస్తున్నాం డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు గరిష్టంగా రూ.1.90 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నాం. దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన రవీంద్రకుమార్ డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్నారు. – అమరనాథరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా -
ఈగలతో ప్రొటీన్ల సేద్యం!
సేంద్రియ వ్యర్థాలను ఆహారంగా తిని పెరిగే బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) పిల్ల పురుగు(లార్వా)లు కోళ్లతో పాటు చేపలు, రొయ్యలకు మంచి ప్రొటీన్లతో కూడిన మేతగా ఉపయోగపడుతున్నాయి. విదేశాల్లో విస్తారంగా జరుగుతున్న బిఎస్ఎఫ్ లార్వా సాగు ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ వ్యాపిస్తోంది. కుళ్లిన పండ్లు, కూరగాయలు, వంటింట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలను తిని ఈ పిల్ల పురుగులు దాదాపు నెల రోజుల్లోనే పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బిఎస్‌ఎఫ్‌పై పరిశోధనలు మన దేశంలో శైశవ దశలో ఉన్నాయి. ఐసిఎఆర్ గ్రాంటుతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(పిజెటిఎస్ఎయు) ఏడాది క్రితమే వేస్ట్2వెల్త్ ప్రాజెక్టులో భాగంగా దీనిపై పరిశోధనలు చేపట్టింది. అంతేకాదు, శాస్త్రవేత్తలు, ఎంటర్ప్రెన్యూర్లు, రైతుల శిక్షణకు ఇటీవలే శ్రీకారం చుట్టింది. ఇన్నోవేటివ్ ఇన్సెక్ట్ ఫార్మింగ్ వివరాలతో ఆసక్తికర కథనం... ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన శాకాహార, మాంసాహారోత్పత్తుల్లో 60% మాత్రమే వినియోగమవుతోంది. పొలంలో 8%, మార్కెట్‌కు వెళ్లే దారిలో 14%, రిటైల్ అమ్మకందారుల వద్ద 7%, ఇళ్లలో వినియోగానికి ముందు 11% మేరకు ఆహారం వృథా అవుతోంది. 2021 యుఎన్ఇపి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ ప్రకారం మన దేశంలో ఏటా 6.88 కోట్ల టన్నుల ఆహార వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఈ సేంద్రియ వ్యర్థాలను చెత్తకుప్పల్లో వేసే కంటే పునర్వినియోగించి ప్రయోజనం పొందటం తెలివైన పని. ఈ పనిని ఇతర పురుగుల కన్నా బ్లాక్ సోల్జర్ ఈగలు (బిఎస్ఎఫ్) సమర్థవంతంగా చేయగలవన్నది నిపుణుల మాట. పురుగుల సేద్యం చాలా వినూత్నమైనది, పర్యావరణ హితమైనది, ఆదాయాన్ని అందించేది కూడా. మన దేశంలో కొందరు వ్యాపారవేత్తలు, కోళ్ల రైతులు బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) పిల్ల పురుగుల(లార్వా) ను సాగు చేయటం ఇటీవల ప్రారంభించారు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల ఉత్పతి కాలం వాటికి వేసే ఆహారాన్ని బట్టి మారుతుంది. ఒక బ్యాచ్ 20 రోజుల నుంచి 40 రోజుల వరకు పడుతుంది. ఆహారం మెత్తగా, త్వరగా జీర్ణించుకునే విధంగా ఉండి ప్రొటీన్లతో కూడి ఉన్నప్పుడు తక్కువ రోజుల్లోనే పురుగులు పెరుగుతాయి. లేయర్ కోళ్ల ఫారాల్లో ఇనుప కేజ్‌ల కింద పోగుపడే కోళ్ల పెంటపై బిఎస్ఎఫ్ ఈగల 5 రోజుల పిల్లలను వదిలితే చాలు.. ఆ వ్యర్థాలనే ఆహారంగా తింటూ 25–30 రోజుల్లోనే పిల్ల పురుగులు వృద్ధి చెందుతాయి. బిఎస్ఎఫ్ పెంపకం ద్వారా సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లో 70–80% మేరకు కుదించవచ్చు. అందువల్లనే నగరాలు, పట్టణాల్లో పోగుపడే సేంద్రియ వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణకు ఇవి ఉపయోగపడుతున్నాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) చెబుతోంది. బిఎస్ఎఫ్ లార్వా(పిల్ల పురుగులు) బరువులో 40–45% వరకు ప్రొటీన్లు ఉన్నాయి. అందువల్ల కోళ్ల మేతలో, ఆక్వా మేతల తయారీలో సోయా చిక్కుళ్లు, ఫిష్ మీల్‌తో పాటుగా 10 శాతం వరకు బిఎస్ఎఫ్ పురుగుల పొడిని కలుపుతున్నారు. బతికి ఉన్న పిల్ల పురుగుల (వెట్ లార్వా)ను కోళ్లకు నేరుగా మేతగా వేస్తున్నారు. రోజువారీ మేతలో పది శాతం వరకు ఈ పిల్ల పురుగులను అందిస్తూ సత్ఫలితాలు పొందుతున్న కోళ్ల ఫారాలు తెలుగునాట ఇప్పటికే అనేకం ఉన్నాయి. పిజెటిఎస్‌ఎయులో పైలెట్ ప్రాజెక్టు అయితే, మన దేశంలో దీనిపై పరిశోధనలు ఇంకా శైశవ దశలోనే ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు) ఈ దిశగా ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిగా బిఎస్ఎఫ్ పెంపకంపై పరిశోధన చేపట్టింది. నేషనల్ అగ్రికల్చర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ‘వేస్ట్2వెల్త్’ ప్రాజెక్టును మంజూరు పిజెటిఎస్ఎయుకు గత ఏడాది చేసింది. పిజెటిఎస్ఎయు పీజీ స్టడీస్ డీన్, కీటక శాస్త్ర ఆచార్యులు డా. వి. అనిత ఈ ప్రాజెక్టుకు నోడల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆవరణలో బ్లాక్ సోల్జర్ ఫ్లైల పెంపకం కమ్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, మెస్‌లో మిగిలిన అన్నం, గోధుమ తవుడు మిశ్రమంతో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు పెంచుతున్నారు. పరిశోధక విద్యార్థులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కృషి విజ్ఞాన కేంద్రాల్లోని శాస్త్రవేత్తల మొదటి బ్యాచ్‌కు డా. అనిత ఇటీవలే శిక్షణ ఇచ్చారు. ఎంటర్ప్రెన్యూర్లు, రైతులకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు డా. అనిత ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. నగరాలు, పట్టణాల్లో వెలువడే సేంద్రియ ఆహార వ్యర్థాల కాలుష్యాన్ని తగ్గించడానికి, పనిలో పనిగా మంచి ప్రొటీన్‌ను అందుబాటులోకి తెచ్చుకోవడానికి బిఎస్ఎఫ్ లార్వాల పెంపకం ఉపయోగకరం. అన్నిటికీ మించి, సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లోనే 70–80% మేరకు తగ్గించేంత ఆబగా తినగల శక్తి బిఎస్ఎఫ్ జాతికి వుంది. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకానికి మన దేశపు వాతావరణం చాలా అనువైనదంటున్నారు డా.అనిత. ఎంటర్ప్రెన్యూర్లకు, రైతులకు శిక్షణ ఇస్తున్నాం! బ్లాక్ సోల్జర్ ఈగలు మనకు కొత్తవి కావు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 20వ శతాబ్దం నుంచి ఉన్నదే ఈ జాతి. కొత్త తెగుళ్లు వ్యాప్తి చెందుతాయన్న భయం లేదు. ఆహార వ్యర్థాలు, పశువుల విసర్జితాలను సాధ్యమైనంత మెత్తగా చేసి, సులభంగా జీర్ణించుకునేలా మార్చి ఈ పురుగులకు వేయాలి. అందులో ప్రొటీన్లు ఉండాలి. చిన్న పిల్లల ఆహారం లాగా ఉండాలి. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను సేకరించి, మెత్తగా రుబ్బి.. దానితో పాటు మెస్‌లో మిగిలిపోయిన అన్నం, గోధుమ తవుడు కొంచెం కలిపి మా ప్రయోగశాలలో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను పెంచుతున్నాం. వాటికి వేసే ఆహారాన్ని బట్టి, దానిలో పోషక విలువలను బట్టి, వాతావరణంలో వేడి, గాలిలో తేమను బట్టి.. అవి ఎన్ని రోజుల్లో, ఎంత బరువు పెరుగుతాయన్న విషయం ఆధారపడి ఉంటుంది. సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మార్చుకునే మార్గం ఇది. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. మంచి ఆదాయమూ సమకూరుతుంది. రైతులకు, ఎంటర్ప్రెన్యూర్లకు శిక్షణ ఇస్తున్నాం. సేంద్రియ వ్యర్థాలను తినే అనేక జీవులుండగా బ్లాక్ సోల్జర్ ఫ్లైలనే ఎందుకు ఎంపిక చేసినట్లు? ఇదే ప్రశ్న డా. అనితను అడిగితే ఇలా బదులిచ్చారు... రోజుకు తన బరువుకు రెట్టింపు సేంద్రియ వ్యర్థాలను తిని, సేంద్రియ ఎరువును విసర్జించగల శక్తి బిఎస్ఎఫ్ పిల్ల పురుగులకు ఉంది. దీని అర్థం ఏమిటంటే.. చెత్త కుప్పలకు తరలివెళ్లే సేంద్రియ వ్యర్థాలు తగ్గిపోతాయి. మిథేన్ ఉద్గారాలు ఆ మేరకు తగ్గుతాయి. కుళ్లిన పండ్లు/కూరగాయలు,హోటళ్లు/ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలు వంటి సేంద్రియ వ్యర్థాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకానికి వాడొచ్చు. బిఎస్ఎఫ్ జీవిత చక్రం మొత్తం 42–55 రోజులు. గుడ్లు పెట్టిన 4–5 రోజులకు పిగులుతాయి. అవి 15–25 రోజుల్లో పిల్ల పురుగులా(లార్వా)గా ఎదుగుతాయి. ఈ దశలోనే వాటిని సేకరించి కోళ్లు, ఆక్వా మేతల్లో వాడుతున్నారు. అలాగే ఉంచితే, ప్యూపాగా రూపాంతరం చెంది, 17 రోజుల తర్వాత బ్లాక్ సోల్జర్ ఈగలు పుడతాయి. మగ ఈగ 4 రోజుల్లో ఆడ ఈగను కలిసిన తర్వాత చనిపోతుంది. ఆడ ఈగ 5–8 రోజుల్లో గుడ్లు పెట్టి చనిపోతుంది. గుడ్లను సేకరించి, అతి చిన్న పురుగులను తయారు చేయట కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. 5 రోజుల పిల్లలకు తగిన సేంద్రియ ఆహారం అందిస్తే 15–25 రోజుల్లో పిల్ల పురుగులు(లార్వా)గా పెరుగుతాయి. ఆ దశలో చక్కని ప్రొటీన్లతో కూడిన ఆ పిల్ల పురుగులు కోళ్లు, చేపలు, రొయ్యలకు మేతగా వాడుకోవచ్చు. 5 రోజుల పిల్లలను కొనుక్కొని రైతులు 15–25 రోజుల్లో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను లార్వా దశకు పెంచి, కోళ్లకు, చేపలు, రొయ్యలకు మేతగా వేసుకోవచ్చు లేదా కొనుగోలుదారులకు అమ్ముకోవచ్చు. స్వయం ఉపాధిగా యువకులు బిఎస్ఎఫ్ లార్వా సాగు చేపట్టవచ్చు. ఈ లార్వాను దాణా తయారీ కంపెనీలు, సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. లార్వా దశ దాటి ప్యూపా దశకు పెరిగితే దాణాల్లో వాడకానికి పనికిరాదు. సోయా చిక్కుళ్ల సాగులో సమస్యలు, సముద్రాల్లో చేపల సంతతి తగ్గిపోతుండటం వల్ల కోళ్లు, ఆక్వా మేతలతో పాటు, పెంపకపు కుక్కల మేతల్లో కూడా బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను ప్రొటీన్ సప్లిమెంట్‌గా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. దీంతో బిఎస్ఎఫ్ లార్వా సాగుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పిల్ల పురుగులే అధిక నాణ్యత గల ప్రొటీన్లతో కూడిన దాణాకు ముడి పదార్థం. కోళ్లు, చేపలు, రొయ్యలు, పందులు, పెంపుడు కుక్కలకు వేసే మేతలో బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పొడిని కలపవచ్చు. పిల్ల పురుగుల బరువులో 40–45% ప్రొటీన్‌తో పాటు ఎసెన్షియల్ అమినో యాసిడ్లు ఉంటాయి. సాధారణంగా మేతల్లో ప్రొటీన్లుగా వాడే సోయా చిక్కుడు గింజలు, ఫిష్మీల్ను కొంత తగ్గించి దీన్ని వాడుతున్నారు. కోళ్లకు రోజువారీ మేతలో పది శాతం మేరకు దీన్ని వాడుతున్నారు. పిల్ల పురుగులను బతికి ఉన్నప్పుడే ఫారం కోళ్లకు మేపవచ్చు. నాటు కోళ్లకూ ఇది మంచి ఆహారం. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకం క్రమంలో వెలువడే విసర్జితాలే(ఫ్రాస్) పంటలకు అత్యంత విలువైన సేంద్రియ ఎరువుగా పనికి వస్తుంది. వర్మీకంపోస్టు, పశువుల ఎరువుల్లో కంటే అధిక పోషక విలువలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు. విదేశాల్లో బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పొడిని బర్గర్లు, షేక్‌లలో కలుపుతున్నారు. దీని నుంచి వెలికితీసే నూనెను బయో ఇంధనంగా వాహనాలు, జనరేటర్లలో వాడుతున్నారు. బిఎస్ఎఫ్ లార్వా నుంచి వెలువడే పొలుసులు(కూటిన్) బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ ప్లాస్టిక్ తయారీకి వాడుతున్నారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలున్నందున వైద్య అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు. వర్షాకాలంలో దీపం చుట్టూ చేరే ఉసుళ్లను వేపుకొని శనగపప్పుతో కలుపుకొని తినే అలవాటు మన దేశంలోనూ ఉంది. బిఎస్‌ఎఫ్‌తో పాటు మిడతలు, మీల్ వార్మ్స్, గొల్లభామలు, వంటి 1,900 జాతుల పురుగులను 113 దేశాల్లో 200 కోట్ల మంది తింటున్నారని ఎఫ్ఎఓ చెబుతోంది. --పతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: అంతరించిపోయే స్టేజ్‌లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్) -
పురుగుల నివారణకు జిల్లేడు ఆకుల రసం
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగయ్యే వరి పొలాల్లో పిలక, చిరు పొట్ట దశలో ఏర్పడే సూక్ష్మ పోషకాలు/ పొటాష్ లోపాలతో పాటు రసంపీల్చే పురుగుల నివారణకు జిల్లేడు ఆకుల ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తోందని రైతులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయ దారులు జిల్లేడు ద్రావణాన్ని విస్తృతంగా వాడుతూ ప్రయోజనం పొందుతున్నారు. జిల్లేడు ద్రావణం తయారీకి కావాల్సిన పదార్ధాలు: 200 లీటర్ల నీరు, 20 కేజీల జిల్లేడు ఆకులు, 10 లీటర్ల నాటు ఆవు మూత్రం. తయారీ విధానం: 200 లీటర్ల నీటిలో 20 కేజీల జిల్లేడు ఆకులు వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కల΄ాలి. 3 రోజుల తరువాత వాడకానికి సిద్ధమవుతుంది. మోతాదు: 100 లీటర్ల నీటిలో 10 లీటర్ల జిల్లేడు ద్రావణం కలిపి పిచికారీ చెయ్యాలి. నిల్వ : 7 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. వివరాలకు: రైతు సాధికార సంస్థ ఉత్తరాంధ్ర సాంకేతిక అధికారి హేమసుందర్:80743 20481 -
ప్రకృతి సేద్యంతో తగ్గనున్న నిరుద్యోగం, రైతులకు అధికంగా ఆదాయం
రసాయనిక సేద్యం భూముల్ని బీళ్లుగా మార్చుతుంటే.. ప్రకృతి సేద్యం బీళ్లను సాగులోకి తెస్తుంది. ప్రకృతి సేద్యంతో 2050 నాటికి నిరుద్యోగం రేటు 31 నుంచి 7 శాతానికి తగ్గుతుంది. ప్రకృతి విపత్తులను దీటుగా తట్టుకోవడం ప్రకృతి సేద్యంతోనే సాధ్యం. దీనివల్ల రైతుల ఆదాయం అధికం అవుతుంది. జనాభా పెరుగుదల– ఉపాధి అవకాశాలు, ఆర్థిక పురోగతి– అసమానతలు, నేల వినియోగం, దిగుబడి – ఆహార ఉత్పత్తి తదితర కోణాల్లో రెండు విభిన్న సాగు పద్ధతుల్లో పొందే ఫలితాల్లో వ్యత్యాసాలను అధ్యయనం చేసి ఈ నివేదికలో పొందుపరిచారు. ►రసాయనాలతో కూడిన పారిశ్రామిక వ్యవసాయం ఇలాగే కొనసాగితే 2050 నాటికి రైతుల సంఖ్య సగానికి తగ్గుతుంది. నిరుద్యోగం రేటు 31 శాతం నుంచి 30 శాతానికి తగ్గుతుంది. అయితే, పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేపడితే రైతుల సంఖ్య కోటికి పెరుగుతుంది. నిరుద్యోగం రేటు 7 శాతానికి తగ్గుతుంది. ► ప్రకృతి వ్యవసాయం ద్వారా బంజరు భూములు కూడా సాగులోకి వస్తాయి. అధిక విస్తీర్ణం సాగులోకి వచ్చి అత్యధిక మంది రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా రసాయన రహిత సురక్షిత పంటలు పండిస్తారు. అందువల్ల అధిక మార్కెట్ ధర పొందుతారు. ► ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తనాలు, నీటి వినియోగం, రసాయనాలు, ఇంధనం, అప్పులు, భారీ యంత్ర సామగ్రి తదితర ఖర్చుల విషయంలో రైతులకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది. ఈ రైతులు పంట ఉత్పత్తులను విలువ జోడించి అమ్ముతారు కాబట్టి అధికాదాయం వస్తుంది. ► ప్రకృతి వ్యవసాయంలో నిరుద్యోగం తగ్గి, వ్యవసాయ–వ్యవసాయేతర వేతనాల్లో అంతరం తగ్గటం కారణంగా ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆర్థిక వృద్ధి 6.5%కి చేరుకుంటుంది. ► రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తే 2050 నాటికి ఇది 6.1 పైసలు మాత్రమే ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతు ఉత్పత్తి చేసిన ప్రతి కిలో కేలరీల ఆహారానికి 10.3 పైసల ఆదాయం పొందుతారు. ► రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తే 2019లో 62 లక్షల హెక్టార్లున్న సాగు భూమి విస్తీర్ణం 2050 నాటికి 55 లక్షల హెక్టార్లకు తగ్గుతుంది. కొన్ని పంటలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించే పారిశ్రామిక వ్యవసాయ విధానంలో బీడు భూముల విస్తీర్ణం 2019లో 24 లక్షల హెక్టార్ల నుంచి 2050 నాటికి 30 లక్షల హెక్టార్లకు పెరిగే ప్రమాదం ఉంది. ► ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బీడు భూములు కూడా సాగులోకి వచ్చి 2019లో 62 లక్షల హెక్టార్లున్న సాగు భూమి 2050 నాటికి 80 లక్షల హెక్టార్లకు పెరుగుతుంది. పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగి ప్రస్తుత సవాళ్లను అధిగమించవచ్చు. ► రసాయన సేద్యంలో మొత్తం మీద తక్కువ భూమి, తక్కువ మంది రైతులు, అధిక సాగు ఖర్చులు, అధిక నిరుద్యోగ రేటుతో కలిపి వ్యవసాయ జివిఎ పెరుగుదల రేటు సగటున సంవత్సరానికి 4% నుంచి 3.5%కి తగ్గుతుంది. ► ప్రకృతి వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని పెంపొందించి సారవంతమైన భూములను అందిస్తుంది. అనేక రకాల పంటలతో అధిక పంట సాంద్రత ఏర్పడుతుంది. ► ప్రకృతి వ్యవసాయం అనుసరిస్తున్న రైతులు దిగుబడిలో ఎలాంటి తగ్గుదల లేకపోవడమే కాకుండా, అధిక దిగుబడిని కూడా సాధిస్తున్నారు. వర్షాధార వ్యవసాయ భూముల్లోనూ పలు రకాల పంటల సాంద్రత వల్ల మరింత దిగుబడిని సాధిస్తున్నారు. మొత్తానికి ప్రకృతి వ్యవసాయంలో రైతులు 2019లో హెక్టారుకు రోజుకు 31,000 కిలో కేలరీల ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. 2050 నాటికి అది 36,000 కిలో కేలరీలకు పెరుగుతుంది. ► రసాయనిక వ్యవసాయంలో 2050 నాటికి రైతులు రోజుకు హెక్టార్‌కు దాదాపు 44,000 కిలో కేలరీలు ఉత్పత్తి చేసినా.. ప్రకృతి సేద్యంలో పండే పంట ఉత్పత్తులు స్థూల,సూక్ష్మ పోషకాలు, పీచు పదార్ధంతో కూడిన బలవర్ధకమైన, సమతుల్యమైన ఆహారాన్ని అందిస్తాయి. ► రెండు విభిన్న పద్ధతుల్లో ఆహారోత్పత్తి, సాగు విస్తీర్ణం, వార్షిక దిగుబడులను అంచనా వేసి చూస్తే.. 2050లో ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే ఆహారం రసాయనిక వ్యవసాయం (4050 కిలో కేలరీలు/తలసరి/రోజు)లో కంటే ప్రకృతి వ్యవసాయం (5000 కిలో కేలరీలు/తలసరి/రోజు)లో గణనీయంగా పెరుగుతుంది. అంతేగాక ప్రకృతి సేద్యంలో పండించిన పంట ఉత్పత్తులు రసాయనిక ఉత్పత్తుల కంటే మరింత సమతుల్యంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ► ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తట్టుకొనే విధంగా వ్యవసాయ పంటల జీవ వైవిధ్యం పెరుగుతుంది. సేంద్రియ కర్బనం నేలల్లో వృద్ధి చెందుతుంది. తద్వారా వాతావరణ మార్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► అధిక ఉష్ణోగ్రతలు, కరువు, తుపాన్లు, వరదలు వంటి వాతావరణ విపత్తులను తట్టుకోవడం రసాయనిక సేద్యంతో సాధ్యం కాదని నివేదిక స్పష్టం చేస్తోంది. పెట్టుబడి తగ్గటం, సురక్షిత నీటితో పాటు విస్తృత స్థాయిలో ΄ûష్టికాహారం అందించడం, పర్యావరణ పరిరక్షణ వల్ల రాష్ట్రం ‘రైతు అభివృద్ధి’కి దిక్సూచిగా మారుతుంది. -
మూడేళ్ల పాటు రీసెర్చ్.. ప్రకృతి వ్యవసాయంతోనే అది సాధ్యమవుతుంది
జలమే జీవం జలమే ఆహారం.. అనే నినాదంతో ఎఫ్ఎఓ ప్రపంచ ఆహార దినోత్సవం సోమవారం నిర్వహించింది. ఈ సందర్భంగా వెలువడిన ఓ తాజా నివేదిక ఆసక్తిని కలిగిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం అమలవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2031 నాటికి పొలాలన్నిటినీ పూర్తిగా ప్రకృతి సేద్యంలోకి మార్చాలన్నది సంకల్పం. అయితే, ప్రకృతి వ్యవసాయ ప్రభావం 2050 నాటికి ఎలా ఉంటుంది? రసాయనిక వ్యవసాయంలో కొనసాగితే ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలు. ఈ అంశాలను లోతుగా శోధిస్తూ క్షేత్రస్థాయి ప్రకృతి సేద్య ఫలితాల ఆధారంగా ‘ఆగ్రోఎకో 2050 ఫోర్‌సైట్ ప్రాజెక్టు’లో భాగంగా మూడేళ్ల పాటు విస్తృతంగా అధ్యయనం చేశారు. ఫ్రెంచ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (సిఐఆర్ఎడి)కు చెందిన సీనియర్ ఆర్థికవేత్త బ్రూనో డోరిన్, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) వ్యవసాయ శాస్త్రవేత్త అన్నే సోఫి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖకు చెందిన రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్) ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి. విజయకుమార్ పలువురు శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి 2019 నుంచి 2022 వరకు అధ్యయనం చేశారు. అంతర్జాతీయ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నివేదికను రూపొందించటం విశేషం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో చర్చించిన తదనంతరం ‘ఆగ్రోఎకో 2050: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార వ్యవస్థలపై పునరాలోచన– ప్రకృతి వ్యవసాయం భవిష్యత్తులో ఆహార సమృద్ధిని ఎలా సాధిస్తుంది’ అనే శీర్షికన అధ్యయన నివేదిక సిద్ధమైంది. నీతి అయోగ్ సభ్యులు (వ్యవసాయం) ప్రొఫెసర్ రమేశ్ చంద్ దీన్ని న్యూఢిల్లీలో ఇటీవల విడుదల చేశారు. పారిశ్రామిక (రసాయనిక) వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని పోల్చుతూ రెండు విభిన్న పరిస్థితుల్లో 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం, ఆహారం, పర్యావరణం, ఉపాధి, సంక్షేమం తదితర రంగాల్లో ఎలా ఉండబోతోంది అనే విషయంపై విశ్లేషణను ఈ నివేదిక వెల్లడిస్తోంది. రాష్ట్రంలో విస్తృతంగా అమలవుతున్న ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం సరికొత్త ఆహార వ్యవస్థల స్థాపనలో ఎలాంటి అవకాశాలను కలిగిస్తుంది అనే కోణంలో శోధించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2020–21 నాటికి 7 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2031 నాటికి ఈ రైతుల సంఖ్య 60 లక్షలకు చేరుకోవాలన్నది లక్ష్యం. ఆర్థిక, పర్యావరణ, పోషకాహార, సామాజిక సవాళ్లను సమీకృత పద్ధతిలో పరిష్కరించే హరిత వ్యవసాయానికి ఏపీ రాష్ట్రం నాయకత్వం వహిస్తుందనేది అధ్యయన బృందం అభిప్రాయం. ‘ప్రకృతి’ నేర్పుతున్న అసాధారణ నీటి పాఠాలు! ప్రకృతి వ్యవసాయం సాగు నీటి వినియోగ పద్ధతిని సమూలంగా మార్చివేస్తుంది. ప్రకృతి సేద్యంలో సాగయ్యే పంటలు నీటిని వినియోగించుకోవటం మాత్రమే కాదు, నీటిని ఉత్పత్తి చేసుకుంటాయి కూడా! నదుల్లో ఉండే నీటికి పది రెట్లు నీరు గాలిలో ఉంది. గాలి నుంచి నీటిని సంగ్రహించి ఉపయోగించుకోవడం ప్రకృతి వ్యవసాయంలోనే సాధ్యమవుతుంది. 365 రోజులు ఆకుపచ్చగా పంటలతో పొలాన్ని కప్పి ఉంచటం, అవశేషాలతో ఆచ్ఛాదన కల్పించటం వల్ల నేలలో నుంచి తేమ ఆవిరి కావటం తగ్గుతుంది. నేలలో సేంద్రియ పదార్థం, సేంద్రియ కర్బనం పెరుగుతుంది కాబట్టి నీటిని గాలి నుంచి గ్రహించి పట్టి ఉంచుకునే శక్తి ఈ పంటలకు సమకూరుతోంది. కురిసిన 100 చుక్కల్లో 50 చుక్కలు వాగుల్లోకి పోతున్నాయి లేదా ఆవిరవుతున్నాయి. ప్రకృతి సేద్యంలో ఈ నష్టం బాగా తగ్గి, భూమిలోకి నీరు ఎక్కువగా ఇంకుతుంది.నీటిని భౌతికశాస్త్ర కోణం నుంచి అర్థం చేసుకోవటమే ఇప్పటి వరకు చేశాం. ప్రకృతి వ్యవసాయం జీవశాస్త్ర కోణం నుంచి నీటిని చూడటం నేర్పుతోంది. ఈ అసాధారణ పాఠాలు మేం నేర్చుకుంటూ సరికొత్త పద్ధతులను అమల్లోకి తెస్తున్నాం. వర్షం కురవక ముందే విత్తనాలను గుళికలుగా మార్చి విత్తుతున్నాం. నెల తర్వాత కొద్దిపాటి జల్లులు పడినా పంటలు మొలకెత్తుతున్నాయి. ఒకటికి పది పంటలు వత్తుగా వేయటం వల్ల రైతులకు చాలా లాభాలు చేకూరుతున్నాయి. బంజరు భూములను దున్నే పని లేకుండా సాగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పాదులు చేస్తూ ఒక్కో పాదులో ఐదారు రకాల విత్తనాలు వేస్తూ బంజరు భూములను సైతం రైతులు సాగులోకి తెస్తున్నారు. మన రైతుల అనుభవాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ -
పశువులకు అలాంటి గడ్డి వేస్తున్నారా? కాల్షియం లోపం వస్తుంది!
‘మేపు లోనే సేపు’ అని నానుడి. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పూర్తి సామర్ధ్యం పొందాలంటే మేలైన, నాణ్యమైన పశుగ్రాసాలను పచ్చిమేతగా అందించాలి. దాణా కన్నా పచ్చని పశుగ్రాసాలను మేతగా అందిస్తే అధిక పాల దిగుబడి సాధించడంతో పాటు పాడి పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచినవారమవుతాం. పాడి పరిశ్రమ లాభసాటి కావాలంటే ఖర్చు తగ్గాలి. ఇది తగ్గాలంటే మేలు జాతి పశుగ్రాసాలను పశువులకు మేతగా అందించాలి. దీనితో 40–50 శాతం ఖర్చు తగ్గటంతో పాటు పాల దిగుబడి 20 శాతం పెరుగుతోంది. రైతులు పశుగ్రాసాల్లో ఏదో ఒకటి లేదా రెండు రకాలను పెంచి పాడి పశువులకు మేపుతుంటారు. అలా కాకుండా కొన్ని రకాల పశుగ్రాసాలను పెంచి పశువులకు క్రమపద్ధతిలో మేపితే మరింత మేలు జరుగుతోంది. ఈ విధానాన్ని అమలాపురం ఏరియా పశు వైద్యశాల అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపిస్తున్నారు. ఏరియా పశు వైద్యశాల వెనుక నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని చదును చేసి పదిహేను సెంట్ల స్థలంలో పది రకాల పశుగ్రాసాలను పెంచుతున్నారు. పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు ఎల్.విజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనా క్షేత్రంలో సూపర్ నేపియర్, గిని గడ్డి, కనుమ గడ్డి, రెడ్ నేపియర్, గిని గ్రాస్, మోని, చంగల్ గడ్డి, బొబ్బర గడ్డి, సీవో4, సీవో 5 రకాల గడ్డిని పెంచుతున్నారు. ఔత్సాహికులైన పాడి రైతులకు పశుగ్రాసాల పెంపక విధానాన్ని వివరిస్తున్నారు. ప్రతి గడ్డిలో వైవిధ్యభరితమైన పోషకాలు ఉండటంతో అన్ని రకాలు మేపితే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కేవలం పేరా గ్రాస్ (ఇంగ్లీష్ గడ్డి) మాత్రమే మేపితే పశువుల్లో కాల్షియం లోపించే అవకాశముంది. చెంగల్ గడ్డి ‘రాగి సంగటి’తో సమానం. సూపర్ నేపియర్ ఐదేళ్లు పాటు మేత అందుతోంది. కాండం మెత్తగా ఉండడంతో పాటు ఇందులో అధిక పోషకాలుంటాయి. రెడ్ నేపియర్‌లో ప్రోటీన్, గినీ గడ్డిలో శక్తినిచ్చే పోషకాలు ఎక్కువ. వీటిని కలిపి అందించడం వల్ల అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. దీని వల్ల పాల దిగుబడి పెరగడంతో పాటు పశువులు బలంగా ఉంటాయి. శాస్త్రీయ పద్ధతిలో పశు పోషణలో భాగంగా వివిధ పోషకాలున్న పశుగ్రాసాలను పరిచయం చేయటంతో పాటు వివిధ రకాల నేలలకు అనువైన పశుగ్రాసాల రకాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. గడ్డి విత్తనాలు, కనుపులను ఉచితంగా అందజేస్తున్నారు. రైతులతో పాటు వెటర్నరీ విద్యార్థులకూ అవగాహన కల్పిస్తున్నారు. పదిహేను సెంట్లలో ఏడాదికి సగటున 2.5 టన్నుల పశు గ్రాసాన్ని రైతులు పొందనున్నారు. ఒక ఎకరం భూమిలో ఈ విధంగా పశుగ్రాసాలు పెంచితే 5 నుంచి 6 పాడి పశువులకు ఏడాది పొడవునా మేత అందించవచ్చు. వీటితో పాటు కలబంద, నల్లేరు, పసుపు, రణపాల, తులసి, తిప్పతీగ, ఇన్సులిన్ మొక్క వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతూ, సంప్రదాయ వైద్యంలో వాటి ఉపయోగాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు. ఒకటికి పది రకాల పశుగ్రాసాల పెంపకం వల్ల పాడి రైతుల ఆదాయం పెరుగుతోందంటున్నారు విజయ్‌రెడ్డి (98663 27067). – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం 13 నుంచి సింహపురి సేంద్రియ మేళా గో–ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, సింహపురి సేంద్రియ వ్యవసాయదారుల సంఘం, మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు నెల్లూరులోని వి.ఆర్ కాలేజి గ్రౌండ్స్‌లో సేంద్రియ ఉత్పత్తులతో పాటు చేపలు, రొయ్యలు, పీతల ప్రదర్శన–అమ్మకం మేళా జరగనుంది. ఇతర వివరాలకు.. 81436 32488. 15,16 తేదీల్లో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఆదిగురు భారత్ ఫౌండేషన్ అధ్వర్యంలో జనగాంలోని బానపురంలో గో΄ాల్ గోశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో సేంద్రియ, గోఆధారిత వ్యవసాయంపై శిక్షణ ఉంటుంది. ద్రావణాలు, కషాయాలు, గానుగ నునెలు, నెయ్యి, ధూప్ స్టిక్‌లు తదితర ఉత్పత్తుల తయారీపై నిపుణులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 70953 14226. -
పోట్ల కాయలో 4 రకాలకు డిమాండ్ ఎక్కువ