ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో పచ్చిగడ్డి లభ్యత 11 శాతం తక్కువగా ఉందని భారతీయ గడ్డి నేలలు, పశుగ్రాస పరిశోధనా సంస్థ లెక్కగట్టింది. భూతాపం ప్రమాదకరమైన రీతిలో పెరుగుతున్న ప్రస్తుత కాలంలో పచ్చి గడ్డి సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి చక్కని ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ పద్ధతిలో తక్కువ స్థలంలో, పది శాతం నీటితోనే ఏడాది పొడవునా మొలక గడ్డిని పెంచుకోవచ్చు.
మొలక గడ్డిని పాడి ఆవులు, గొర్రెలు, మేకలకు మేపటం మన రాష్ట్రాల్లోనే కాదు.. రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంత పశుపోషకులను సైతం ఆకర్షిస్తోంది. అక్కడ ఏడాదిలో రెండు నెలలే వర్షం పడుతుంది. మండు వేసవిలో ఎండ వేడి 120 డిగ్రీల సెల్షియస్‌కు చేరుతుంటుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జీవించే థార్ ప్రాంత రైతులు, సంచార పశుపోషకులు స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌ల తోడ్పాటుతో ఇటీవల హైడ్రోపోనిక్ మొలక గడ్డి సాగు చేపట్టారు. సునాయాసంగా నాణ్యమైన పాల దిగుబడితో పాటు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.
స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌లు ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకుల కోసం హైడ్రోపోనిక్ మొలక గడ్డిని పెంచే షెడ్లను నెలకొల్పుతున్నాయి. రైతులే వాటిలో మొక్కజొన్నలు, గోధుమలను నానబెట్టి, వర్టికల్ గార్డెన్ మాదిరిగా అనేక దొంతర్లలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్రేలలో మొలక గడ్డిని పెంచుతున్నారు. సాధారణంగా పొలంలో పచ్చి గడ్డిని పెంచడానికి 2 నెలలు పడుతుంది. మొలక గడ్డి 8 రోజుల్లో పెరుగుతుంది. ముఖ్యంగా పది శాతం నీటితోనే ఈ గడ్డి పెరగటం థార్ ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకులకు ఉపయుక్తంగా మారింది.
ఏడాది పొడవునా ఆదాయం
స్వచ్ఛంద సంస్థ ఉర్ముల్ సీమంత్ సమితి, డిజర్ట్ రిసోర్స్ సెంటర్‌తో కలసి హైడ్రోగ్రీన్స్, బహుళ నేచురల్స్ స్టార్టప్‌లు మొలక గడ్డి ఉత్పత్తి యూనిట్లను థార్ ఎడారి గ్రామాల్లో ఏర్పాటు చేస్తుండటంతో కొందరు మహిళా రైతులు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. బహుళ నేచురల్స్ వీరి వద్ద నుంచి దేశీ ఆవు పాలను, ఒంటె పాలను సేకరించి, విలువ జోడించి ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. వెయ్యి మంది పాడి రైతులు, 4 వేల మంది పశుపోషకులు తమ ఆవులు, మేకలకు మొలక గడ్డిని మేపుకుంటూ ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం పొందుతున్నారు.
పశుపోషణ కోసం గొడ్డు చాకిరీ చేసే మహిళా రైతులకు మొలక గడ్డి అందుబాటులోకి రావటం గొప్ప ఊరటనిస్తోంది. మొలక గడ్డి మేపుతో దేశీ ఆవు పాల దిగుబడి మూడింట ఒక వంతు పెరగడంతో పాటు, నాణ్యత కూడా పెరిగిందని రాజస్థాన్‌లోని ఘంటియాలి గ్రామానికి చెందిన దళిత మహిళా పశుపోషకురాలు ‘పలు’, ఆమె భర్త హెమారామ్ సంతోషంగా చెబుతున్నారు. వీరికి 8 ఆవులు, మేకలు ఉన్నాయి. 4 మైళ్ల దూరంలో ఉన్న పొలానికి వెళ్లి గడ్డి కోసుకొని, ఎండలో నెత్తిన పెట్టుకొని మోసుకు రావటం ఆమెకు కనాకష్టంగా ఉండేది. రెండేళ్ల క్రితం ఇంటి పక్కనే మొలకగడ్డి ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాక ఆ బాధ తప్పింది. మిగులు గడ్డిని, గోధుమ గడ్డి పొడిని అమ్ముతూ ఆదాయం పొందుతుండటం విశేషం.
హైడ్రోపోనిక్స్.. ఎంత ఖర్చవుతుందంటే..
దూడలకు పెట్టే కాన్సంట్రేట్ మిక్చర్ దాణాను 75% తగ్గించి మొక్కజొన్న మొలక గడ్డిని మేపటం వల్ల మంచి ఫలితం కనిపించిందని బికనెర్ వెటరినరీ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.కె. ధురియా అన్నారు. హైడ్రోపోనిక్ మొలక గడ్డి వల్ల మేకల్లో జీర్ణశక్తి, పెరుగుదల బాగుందని సౌదీ అరేబియాలోని కింగ్ సౌద్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. మొలకగడ్డి యూనిట్ ఏర్పాటుకు రూ. 18 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చవుతోంది. అయితే, ఇసుక తుఫాన్లకు మొలకగడ్డి షెడ్లు దెబ్బతినటం వల్ల నష్టం జరుగుతోంది.
అందుకని, మున్ముందు షిప్పింగ్ కంటెయినర్లలో మొలకగడ్డి ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయటమే దీనికి పరిష్కారమని బహుళ నేచురల్స్ భావిస్తోంది. లక్షల ఖర్చుతో కూడిన పని కావటంతో రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి మొలకగడ్డి యూనిట్లను నెలకొల్పితే మేలు. అయితే, రూ. 17.500 ఖర్చుతో చిన్నపాటి మొలకగడ్డి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని హైడ్రోగ్రీన్స్ స్టార్టప్ చెబుతోంది.
బయోచార్‌తో సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణ
సేంద్రియ ఇంటిపంటల సాగుపై పట్టణ/నగర వాసులపై ఆసక్తి పెరుగుతోంది. బయోచార్ (బొగ్గుపొడి) కలిపిన మట్టి మిశ్రమంతో టెర్రస్ గార్డెన్లు, పెరటి తోటలు, బాల్కనీలలో కూరగాయల పెంపకంపై ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ మలక్‌పేటలోని న్యూలైఫ్ ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. మిగులు పంట దిగుబడులను సోలార్ డ్రయ్యర్‌తో ఎండబెట్టే విధానం కూడా వివరిస్తామని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ షిండే తెలిపౠరు. వివరాలకు.. 81210 08002.
17న అమలాపురంలో ప్రకృతి సేద్యంపై శిక్షణ
శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 17న కోనసీమ జిల్లా అమలాపురంలోని (ముక్తేశ్వరం– కొత్తపేట రోడ్డు) శ్రీసత్యనారాయణ గార్డెన్స్‌లో ప్రకృతి వ్యవసాయంపై నిపుణులు విజయరామ్ రైతులకు అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు నిమ్మకాయల సత్యనారాయణ తెలిపౠరు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 64091 11427 (సా. 3 గం. నుంచి 6 గం. వరకు మాత్రమే).
Comments
Please login to add a commentAdd a comment