
సంపూర్ణ ప్రకృతి సేద్యం!
పొలాన్ని దున్నకుండా, రసాయనిక ఎరువులు,
పురుగుమందులు వాడకుండా, కలుపు తీయకుండా వ్యవసాయం
మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త దివంగత రాజు టైటస్ కృషి ఆదర్శప్రాయం
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడెవరూ ఆశ్చర్యపోవడం లేదు. కానీ.. ఎద్దులతోనో, ట్రాక్టరుతోనో దున్నే పనే లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చంటే.. నమ్మలేం. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన దివంగత రైతు శాస్త్రవేత్త రాజు టైటస్ మాత్రం 30 ఏళ్ల పాటు ఇలాగే వ్యవసాయం చేసి సత్ఫలితాలు సాధించారు. ‘ప్రకృతి వ్యవసాయం వెనుకబడినదో లేదా ప్రాచీనమైనదో కాదు. ఆధునికమైనది, వినూత్నమైనది అని రాజు టైటస్ రుజువు చేశారు’ అని ఐసిఎఆర్ ప్రశంసించింది. ఆరేళ్ల క్రితం కన్నుమూసినా.. ఆయన కృషి రైతులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన ‘రాజు టైటస్’ ప్రభుత్వోద్యోగి. అయినా కుటుంబ వారసత్వంగా వచ్చిన 13 ఎకరాల పొలాన్ని సాగు చేయటం మానలేదు. 70వ దశకంలో అందరిలానే ఆయనా ‘హరిత విప్లవం’ ఒరవడిలో రసాయన ఎరువులు, కీటకనాశనులు వాడటం మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడులు పెరిగి ఆదాయం వచ్చినా పదిహేనేళ్లు తిరిగేసరికి పంట భూమి నిస్సారమయింది. దిగుబడులు తగ్గి నష్టాల పాలై పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు. ఇది జరిగింది 1984లో. రాజు నిర్ణయంతో తల్లి హతాశురాలయింది. గాంధేయవాదులు నడిపే స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రెండ్స్ రూరల్ సెంటర్’ కార్యకర్తలతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమె చెప్పినదంతా విని జపాన్ దేశానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ (వన్ స్ట్రా రివల్యూషన్) పుస్తకాన్నిచ్చి మీ సమస్యకు ఈ పుస్తకం పరిష్కారాన్ని చూపుతుందని చెప్పారు. కలుపు తీయకుండా.. దుక్కిదున్నకుండా.. ఎరువులు వేయకుండా.. పురుగు మందులు పిచికారీ వంటి పద్ధతులు అనుసరించకుండానే పంటలను సాగు చేసే పద్ధతుల గురించి పుకుఒకా ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన రాజు తను సాగులో తను అనుసరిస్తున్న పద్ధతులు అనర్థ హేతువులని అర్థం చేసుకున్నారు.
అడ్డంకులను అధిగమించి..
15 ఏళ్లుగా రసాయన ఎరువులు వేస్తూ పంటభూమిని ధ్వంసం చేస్తున్నానని అర్థం చేసుకున్న రాజు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 1985 నుంచి పుకుఒకా చెప్పిన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేలను దున్నటం, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆపేశారు. రకరకాల గడ్డి, చెట్ల విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగాక కత్తిరించి ఆచ్ఛాదనగా వాడేవారు. దీనివల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా పొలంలోనే ఇంకి.. నేల గుల్లబారటంతో పాటు తేమను పట్టి ఉంచింది. తొలుత గ్రామస్తులు అవహేళన చేసినా అడ్డంకులను అధిగమించి రాజు ప్రకృతిసేద్యం దిశగా వడివడిగా అడుగులు వేశారు.
సోయా విత్తన బంతులు!
అంకితభావంతో రాజు టైటస్ చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. 1988లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనటానికి ఇండియా వచ్చిన ఫుకుఒకా ప్రకృతిసేద్యం చేస్తున్న రాజు గురించి తెలుసుకొని ఆయన పొలాన్ని సందర్శించారు. ఫుకుఒకా సలహాలు సూచనలను అనుసరించి రెట్టించిన ఉత్సాహంతో రాజు పనిచేశారు. పుకుఒకా సూచన మేరకు పంటను విత్తుకోవటానికి బదులు.. ఒక పాలు సోయా విత్తనం, ఏడు పాళ్లు మట్టి కలిపి క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండే ‘విత్తన బంతుల’ ను తయారు చేశారు. భార్య శాళిని సహకారంతో.. అడుగుకో బంతి చొప్పున.. పొలంలో వేశారు. దీనివల్ల మొలకెత్తినప్పటి నుంచే మొక్కలు పోషకాలను, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి ఏపుగా ఎదిగాయి. ఆ ఏడాది దిగుబడి బావుండటంతో పాటు నాణ్యమైన పంట వచ్చింది.
సోయా మొక్కల మధ్య ఎత్తుగా పెరిగిన గడ్డిని కత్తిరించి భూమిపైన ఆచ్ఛాదనగా వేశారు. దీనివల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు ఆశ్రయం లభిస్తుంది. పంటలకు హానిచేసే శతృ పురుగులను ఇవి నిర్మూలిస్తాయి. దీనివల్ల రసాయనిక ఎరువులు, కీటకనాశనుల అవసరం తప్పుతుంది. ఇవి నేలలో చేసే బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వేర్లు లోతుకంటా చొచ్చుకు΄ోయి తేమను ΄ోషకాలను గ్రహిస్తాయి. నేల గుల్లబారి భూ సారం పెరిగి మంచి పంట దిగుబడులు వస్తాయి. నేలను దున్నాల్సిన అవసరం లేకపోవటం వల్ల ట్రాక్టరు.. ఎద్దుల కోసం అప్పు చేయాల్సిన అగత్యం తప్పింది.
రాజు తన పొలంలో నత్రజనిని స్థిరీకరించేందుకు సుబాబుల్ చెట్లను సాగు చేశారు. దీనివల్ల యూరియా రూపంలో రసాయన ఎరవును అందించాల్సిన అవసరం ఉండదంటారాయన. సుబాబుల్ ఆకులు మేకలకు మంచి మేతగా ఉపయోగపడ్డాయి. ఈ చెట్ల కలపతో పాటు మేకల విక్రయం ద్వారా ఆదాయం లభిస్తోంది. ఆ విధంగా 30 ఏళ్లకు పైగా పొలాన్ని దున్నకుండానే సమృద్ధిగా పంటలు పండిస్తూ పేరు΄ పొందారు. వినియోగదారులు అడిగితేనే రైతులు పండిస్తారు!
వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిమాండ్ చేసినప్పుడే రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం మానేస్తారు. ఆరోగ్యకరమైన నేల ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి సాధ్యమనే విషయాన్ని గుర్తిస్తారు’ అనేవారు రాజు టైటస్. మన దేశంలో ప్రజలకు సోకుతున్న పలు జబ్బులకు మూలకారణం ఆహార పంటల సాగులో వాడుతున్న రసాయనాలు. వీటి వల్ల తొలుత మధుమేహం సోకి పలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నాకు పక్షవాతం వచ్చింది. నా భార్య గుండెజబ్బు వ్యాధిగ్రస్తురాలు. అయినా మేం కోలుకోవటానికి ప్రకృతి సేద్య పంట ఉత్పత్తులే కారణం అన్నారాయన.
ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం
మా కుటుంబ అవసరాల కోసం ప్రస్తుతం ఎకరా పొలంలో ధాన్యం, పండ్లు, పాలు, కూరగాయలను సాగు చేస్తున్నాం. ఖరీఫ్‌లో గోధుమ, వరి, మొక్కజొన్న, రబీలో పెసరను సాగు చేస్తున్నాం. రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులే రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఫుకు ఒకా విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేద్యం మూలసూత్రాలను ఒంటబట్టించుకుంటే ఏ రైతైనా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేయవచ్చు అంటారు రాజు టైటుస్!
Comments
Please login to add a commentAdd a comment