
గ్రామంలో ఇళ్ల మధ్యన ఖాళీ స్థలాల్లో సేంద్రియ పెరటి తోటల సాగు
పేడ ద్రావణంతో నేలకు సత్తువ, హోమియో మందులతో పురుగుల నివారణ
ఎవరైనా పట్టుదలతో పనిచేస్తే, ప్రకృతి సేద్యం సహా, ఏ రంగంలోనైనా రాణించవచ్చని రుజువు చేస్తున్నారు కందాడి బాల్‌రెడ్డి. హైదరాబాద్ ఐడిపిఎల్‌లో ఉద్యోగం చేస్తూ కార్మిక నేతగా పనిచేసి రిటైరైన తర్వాత ‘మలుపు ప్రచురణలు’ ప్రారంభించి సాహిత్యాన్ని ప్రజలకు అందించే పుస్తక ప్రచురణ రంగంలోనూ విజయం సాధించారు.
ఆయన స్వస్థలం భువనగిరి పట్టణానికి 2 కి.మీ. దూరంలోని బొమ్మాయిపల్లికి మకాం మార్చిన బాల్‌రెడ్డి, శోభారాణి దంపతులు.. నాలుగేళ్లుగా మక్కువతో సేంద్రియ పెరటి తోటలు సాగు చేస్తూ స్ఫూర్తిదాయకమైన సత్ఫలితాలు సాధిస్తున్నారు. పేడ ద్రావణం, హోమియో మందులు, బ్యాటరీతో నడిచే వీడర్/ స్ప్రేయర్లను వాడుతున్నారుఔ 71 ఏళ్ల వయసులో సేంద్రియ సేద్యాన్ని సులభతరం చేసి సరికొత్త పుంతలు తొక్కిస్తున్న బాల్‌రెడ్డి అనుభవాలు ఆయన మాటల్లోనే..!
300 గజాల మా ఇంటి పెరట్లో అంతా సున్నం నేల. మొక్క బతికేది కాదు. రెండేళ్లలో సారవంతమైంది. ఇప్పుడు పండ్ల చెట్లతో అడవిలా మారింది. మా వూళ్లో ఖాళీగా ఉన్న 250 గజాల మరో రెండు ఇంటి స్థలాలను కూడా తీసుకొని కూరగాయలు సాగు చేస్తున్నాం. ఒక స్థలంలో కాళీఫ్లవర్, క్యాబేజీ, వంగ తదితర అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలను పక్క పక్క సాళ్లలో సాగు చేస్తున్నాం. రెండో దాంట్లో అనేక రకాల 40 అరటి మొక్కలు నాటాం.
పేడ ద్రావణం
పశువుల/మేకల ఎరువు, పచ్చిరొట్టతో నేలను సిద్ధంచేసి విత్తనాలు/మొక్కలు నాటిన తర్వాత.. తరచుగా పేడ ద్రావణం, డీకంపోజర్ ద్రావణాలను ఇస్తున్నాం. 200 లీటర్ల డ్రమ్ములో 10 కిలోల ఆవు పేడ, 10 లీ. మూత్రం, 2 కిలోల బెల్లం, 5 కిలోల చెక్క (వేరుశనగ తదితర), లీటరు డీకంపోజర్ ద్రావణంతో పాటు డ్రమ్ము నిండుగా నీరు కలిపి.. రోజుకు రెండు సార్లు తిప్పుతాం. 5/6 రోజుల్లో పేడ ద్రావణం రెడీ. దీనిలో మళ్లీ నీరు కలపకుండానే మొక్కలకు మొదళ్లలో పోస్తాం, వడకట్టి వారం/పది రోజులకోసారి అన్ని పంటలకూ పిచికారీ చేస్తాం. మొక్కల పెరుగుదలకు కార్బోవెజ్ 30 పిచికారీ చేస్తున్నాం. వీటితోనే పంటలు బలంగా పెరుగుతున్నాయి. పోషక లోపం రావటం లేదు.
హోమియో పురుగుమందులు
పంటలను పురుగులు, తెగుళ్ల బెడద నుంచి కషాయాలతో కాకుండా కేవలం హోమియో మందులతోనే కాపాడుకుంటున్నాం. కాయతొలిచే పచ్చ పురుగు తీవ్రత ఎక్కువగా కనిపించే కాళీ ఫ్లవర్, క్యాబేజీ, వంగ తదితర కూరగాయ పంటలకు ‘తుజ 30’ హోమియో మందును 20 లీ. నీటికి 40 ఎం.ఎల్. చొప్పున కలిపి ప్రతి 5 రోజులకోసారి పిచికారీ చేస్తే అసలు పురుగే రాలేదు.
బీర, ఆనప వంటి తీగజాతి పంటల్లో పిందె పండుబారి రాలుతుంటే ‘బావిస్టా30’ మందును వారానికోసారి పిచికారీ చేస్తే సమస్య తీరింది. జామ ఆకులపై తెల్లమచ్చలు, తెల్లదోమల కనిపిస్తే ‘సోరినమ్30’ మందును 5,6 సార్లు పిచికారీ చేస్తే పోయాయి. 20 లీ. నీటికి 100 గ్రాములు ఇంగువ కలిపి మొదళ్ల దగ్గరపోసి, పిచికారీ చేస్తే శిలీంధ్ర తెగుళ్లు, వేరుకుళ్లు నియంత్రణలోకి వచ్చాయి. నా కృషికి తగిన ఫలితం దక్కింది.
పట్టుదలతో మనసుపెట్టి మక్కువతో చేస్తే... ఎవరైనా సరే పెరట్లో సేంద్రియ కూరగాయలు సులువుగా పండించుకోవచ్చు. మా పెరటి తోట చూసి పక్కింటి సుగుణమ్మ (60) 125 గజాల్లో టొమాటోలు పండించి అమ్ముతున్నారు.
సందేహాలుంటే నాకు ఫోన్ చెయ్యండి. నా నంబర్: 98665 59868.
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్