Homeopathic medicines
-
మేయని ఆవుకు హోమియో చికిత్స
ఈ ఆవు కడపలోని ఒక హోటల్ యజమానిది. ఆ యజమాని ప్రతి రోజూపోషక విలువలు గల మేతతో పాటు కూరగాయలు, దాణా కూడా మేపే వారు. అయితే, ఒక రోజు ఆవు మేత తినటం మానేసింది. నీళ్లు కూడా తక్కువగా తాగుతున్నదని పశువుల ఆసుపత్రికి తోలుకొచ్చారు. మేం రోగ నిర్ధారణ పరీక్షలు చేశాం. లోపల పెద్దపొట్ట ఎన్నిసార్లు తిరుగుతున్నది? పొట్టలోని ద్రావణం పి.హెచ్. ఏ స్థాయిలో ఉంది? పొట్టలో సూక్ష్మజీవులు ఉత్తేజిత స్థాయిలో ఉన్నాయా లేవా? ఈ పరీక్షలు చేశాం. పొట్ట కదలికలు, పిహెచ్, సూక్ష్మజీవులు అన్నీ సాధారణంగానే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దాంతో కాలేయ సంబంధిత టానిక్‌లు, ఇంజెక్షన్లు, ఆయుర్వేదిక్ పొడులతో పొట్టకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేశాం. పది రోజులైనా మార్పులేదు. ఆ పది రోజులు కేవలం నార్మల్ సెలైన్ బాటిల్‌తోనే బతికిందని చెప్పవచ్చు. అల్లోపతి, ఆయుర్వేదిక్ చికిత్సలు చేసినా మార్పు లేదు కదా.. హోమియోపతి మందులు ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని ఆలోచన వచ్చింది. నక్స్ వామికా 200, రూస్టాక్స్ 200 గుళికల మందులు రోజుకు 3 సార్లు చొప్పున మూడు రోజులు ఇచ్చాం. వీటిని దాణాలో కలిపి పెట్టొచ్చు లేదా నేరుగా పశువు పెదానికి, దంతాలకు మధ్యలో హోమియో గుళికలు వేస్తే చాలు. ఈ మందులు వేసిన రెండో రోజే ఆవు మేత మేయటం మొదలు పెట్టిందని ఆవు యజమాని ఆశ్చర్యపడుతూ ఆసుపత్రికి వచ్చి మాతో చెప్పారు. పది రోజులు దాదాపుగా రూ. 2 వేలు ఖర్చు చేసినా రాని ఫలితం రూ. 30ల హోమియోపతి మందులతో రావటం సంతృప్తిని కలిగించింది. పశువైద్యంలో అల్లోపతి, ఆయుర్వేదిక్ ఔషధాలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. తక్కువ ఖర్చుతో పశువులకు మంచి చికిత్స, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, అందించవచ్చని మాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. పాడి రైతులకు తెలియజేస్తున్న విషయమేమిటంటే ప్రథమ చికిత్సగా తక్కువ ఖర్చుతో కూడిన ఆయుర్వేద, హోమియోపతి చికిత్సలు చేయటం నేర్చుకోవటం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా పశువైద్యులను సంప్రదించి అల్లోపతి చికిత్సలు తీసుకోవచ్చు. – డాక్టర్. జి.రాంబాబు (94945 88885),పశువైధ్యాధికారి, కడప -
కరోనా నిరోధకానికి హోమియో మందులు!
సాక్షి, హైదరాబాద్: కరోనా జెఎన్1 వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి బారిన పడకుండా రెండు హోమియో ఔషధాలు వాడి ఎవరికి వారు రక్షించుకోవచ్చని ప్రముఖ హోమియో వైద్యులు డా. అంబటి సురేంద్ర రాజు ‘సాక్షి’కి తెలిపారు. అర్సెనిక్ ఆల్బం 30 (Arsenic Album 30)ను వరుసగా 3 రోజులు, ఇన్ఫ్లుయెంజినమ్ 30 (Influenzinum 30)ను వరుసగా 3 రోజులు వాడాలి. ఉదయం 7 గంటలకు పరగడుపున నాలుకపై ఒకటి లేదా రెండు చుక్కలు వేసుకుంటే చాలు. ఇలా ఒకొక్క మందును వరుసగా 3 రోజులు, రోజుకు ఒకసారి మాత్రమే.. మొత్తం వరుసగా 6 రోజులు వాడాలి. ప్రామాణిక జర్మనీ కంపెనీ మదర్ టింక్చర్లు వాడితే ఫలితం బాగుంటుందని డా. సురేంద్ర రాజు వివరించారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఈ మందులు ఒక విడత వాడితే రోగనిరోధక శక్తి ఇనుమడించి సురక్షితంగా జీవించ వచ్చన్నారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?) -
హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు..
పాట్నా: 72 మంది చనిపోయన బిహార్ కల్తీ మద్యం ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు హోమియోపతి మందులను ఉపయోగించి విషపూరిత లిక్కర్‌ను తయారు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో తేలింది. ప్రధాన సూత్రదారి సహా మొత్తం ఐదుగుర్ని సిట్ పోలీసు బృందం శుక్రవారం అరెస్టు చేసింది. ఈ ఐదుగురిలో ప్రధాన నిందితుడు రాజేశ్ సింగ్ సహా శైలేంద్ర రాయ్, సోనుకుమార్, అర్జున్ మహ్తో, సంజయ్ మహ్తో ఉన్నారు. వీరంతా చాలా కాలంగా కల్తీమద్యం దందా నడుపుతున్నారు. ముఖ్యంగా రాజేశ్ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లి 90 శాతం ఆల్కహాల్ ఉన్న హోమియోపతి మందులను భారీగా కొనుగోలు చేసి, వాటిని కల్తీ మద్యం తయారీకి ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. నకిలీ కస్టమర్ల పేర్లను ఉపయోగించి మందులను తీసుకొచ్చాడని వెల్లడించారు. ఈ కల్తీమద్యాన్ని తాగి నిందితుల్లోనే ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని పోలీసులు వివరించారు. కల్తీమద్యం సరఫరా కేసులో రాజేశ్ గతంలోనూ జైలుకు వెళ్లి వచ్చాడని చెప్పారు. బిహార్ ఛప్రా జిల్లాలో కల్తీమద్యం తాగి వారాల వ్యవధిలోనే 72 మంది చనిపోయారు. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారమే చెలరేగింది. సీఎం నితీశ్ కుమార్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కల్తీమద్యం తాగి చనిపోయిన వారికి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని నితీశ్ తేల్చిచెప్పారు. తాగితే చస్తారని ప్రజలను హెచ్చరించారు. చదవండి: శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. 8 మంది భక్తులు దుర్మరణం -
హోమియోతో చీడపీడలకు చెక్!
మనుషులు, జంతువులకే కాదు పంటలకూ హోమియో ఔషధాలు తక్కువ ఖర్చుతో రైతులకు ఎక్కువ ఫలితం వరిలో అగ్గి, కాటుక తెగుళ్లకు.. ఉరకెత్తిన మెట్ట పంటల రక్షణకు హోమియో ఔషధాలు వివిధ పంటలపై గత కొన్నేళ్లుగా హోమియో ఔషధాలు వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్న వైనం రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి సూచనలు మారిన వాతావరణ పరిస్థితిలో వరి పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కాటుక తెగులు, అగ్గి తెగులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ తెగుళ్లు తీవ్రంగా ఉన్నాయి. తెగుళ్లకు రసాయనిక మందులు పిచికారీ చేసే రైతు సోదరులు మరణించిన దృష్టాంతాలున్నాయి. చేతికొచ్చిన పంట చేజారుతుంటే పంట కాపాడుకోవటానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అందినకాడికి అప్పులు చేస్తున్నారు. అయినా, ఫలితం లేక చివరాఖరికి పంటకు అగ్గిపెడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ప్రత్యామ్నాయ విధానం రైతులకు తోడునిలుస్తుంది. అగ్గి తెగులుకు మారేడు తులసి కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కలు కనుమరుగైన పరిస్థితిలో మారేడాకులు శివరాత్రి నాడు శివయ్యకు పెట్టడానికి దొరకవు. ఇక కషాయాలు చేసుకోవడానికేడయితది. ఇగ రైతుకున్న మరో ప్రత్యామ్నాయం హోమియో ఔషధం. అగ్గి తెగులు నివారణకు రైతు సోదరులు ‘బెల్లడోనా 200’, దాని కొనసాగింపుగా ‘కల్కేరియా కార్బ్ 200’ పిచికారీ చేసుకుంటే పంటను నిక్షేపంగా కాపాడుకోవచ్చు. దీనికి ఖర్చు కూడా అతి స్వల్పమే అవుతుంది. ఇక తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న కాటుక తెగులుకు ‘తూజా 200’ పిచికారీ చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. మిర్చి, కూరగాయ పంటలకు.. ఇటీవల కురిసిన వర్షాల ధాటికి రైతు బతుకు అతలాకుతలమైంది. మాగాణి పంటలు పూర్తిగా దెబ్బతినిపోయాయి. మెట్ట పంటలు, మిర్చి, కూరగాయ పంటలు నీట మునిగి తేలి నీరు చిచ్చు పట్టి (ఉరకెత్తి) వడలిపోతున్నాయి. నీరు చిచ్చుతో దెబ్బతిన్న పంట చేలను కాపాడుకోవచ్చు. ఈ మందులకు ఖర్చు కూడా అతి తక్కువ. రూ. వేలు ఖర్చు చేసినా సాధించలేని ఫలితాన్ని కేవలం రూ. వందల ఖర్చుతో పొందవచ్చు. వరద తాకిడికి గురై నీట మునిగి తేలిన పంటలకు మొదట ‘ఫెర్రమ్ మెటాలికం 30’ పిచికారీ చేయండి. రెండు రోజుల గడువుతో ‘కార్బోవెజ్ 30’ పిచికారీ చేయండి. పంట ఊపిరి పోసుకుంటుంది. కాస్త తేరుకున్న వెంటనే ‘మ్యాగ్ఫాస్ 30’ని పిచికారీ చేసుకుంటే పంట పూర్తిగా శక్తిని సంతరించుకుంటుంది. తదుపరి పంట పోషణకు అవసరమైన పోషకాలు మీ మీ పద్ధతిలో అందించండి. ఈ హోమియో ఔషధాలను ఉపయోగిస్తే ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఫలసాయం అందుకోగలుగుతారు. హోమియో ఔషధాలు వాడే విధానం ద్రవరూపంలో ఉండే హోమియో మదర్ టించర్లను పంటలకు ఉపయోగించాలి. 20 లీటర్ల నీటికి 2.5 మిల్లీ లీటర్ల చొప్పున హోమియో ఔషధం కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలి. ముందుగా లీటరు సీసాను తీసుకొని.. అందులో సగం వరకు నీటిని తీసుకొని, దానిలో 2.5 ఎం.ఎల్. హోమియో మందు కలుపుకోవాలి. సీసా మూత బిగించి, 50 సార్లు గట్టిగా కుదుపుతూ ఊపాలి. ఆ మందును పూర్తిగా శుభ్రం చేసుకున్న స్రేయర్లో పోసుకోవాలి. ఇప్పుడు స్ప్రేయర్లో దాని సామర్థ్యాన్ని బట్టి మిగతా నీరు నింపుకొని పిచికారీ చేసుకోవాలి. ఏ పంట మీదైనా ఏ హోమియో ఔషధాన్నయినా పిచికారీ చేసుకునేందుకు ఇదే పద్ధతిని అనుసరించాలి. – జిట్టా బాల్‌రెడ్డి (89782 21966), రైతు శాస్త్రవేత్త, అమేయ కృషి వికాస కేంద్రం, రామకృష్ణాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా ఆరెకరాల్లో వరి సాగు చేస్తున్నా. రసాయనిక ఎరువులు వాడుతున్నా. రసాయనిక పురుగుమందులు వాడటం ఆపేసి.. వాటికి బదులు మూడేళ్లుగా హోమియో మందులను వాడుతున్నా. అగ్గితెగులుకు బెల్లడోనా30 పిచికారీ చేస్తే చాలు. మొగి పురుగు, ఆకుచుట్టు తెగులు, పోషకాల లోపంతో పండాకు సమస్యకు తూజా30 పిచికారీ చేస్తే సరిపోతుంది. కాండం కుళ్లు వస్తే బావిస్టా 30 చల్లితే చాలు. ఇటువంటి మూడు, నాలుగు మందులు ఉంటే చాలు.. వరి పంటను ఏ చీడపీడలూ దెబ్బతీయకుండా కాపాడుకొని మంచి దిగుబడి పొందవచ్చు అని జిట్టా బాల్‌రెడ్డి సూచన మేరకు అమలు పరచి నా అనుభవంలో గ్రహించా. వరికి ఇతర రైతులు వర్షాకాలంలో ఎకరానికి రూ.3,500–4,000 వరకు రసాయనిక పురుగుమందులకే ఖర్చు పెడుతున్నారు. రబీలో అయితే వీళ్లకు రూ. 2,500 నుంచి 3,000 వరకు కేవలం పురుగుమందుల ఖర్చు వస్తుంది. నాకైతే ఏ కాలంలో అయినా ఎకరానికి అవుతున్న హోమియో మందుల ఖర్చు రూ. 200 లోపే! వేపనూనె, ఇతరత్రా కషాయాలు చల్లాల్సిన అవసరమే లేదు. అయితే, రైతు పంటను గమనించుకుంటూ ఉండి.. పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్న తొలి దశలోనే గుర్తించి, పంట మొక్కలు నిలువెల్లా తడిచేలా జాగ్రత్తగా చల్లుకోవాలి. అంతే! హోమియో మందులంత మేలైన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. – గోడదాటి దశరథ్ (93980 49169), రత్నాపురం, సూర్యాపేట మండలం/జిల్లా పంటలకు పదేళ్లుగా హోమియో వాడుతున్నా! ఐదెకరాల్లో వరి (మొలగొలుకులు 3 రకాలు, నెల్లూరు 40054 రకాలు) సాగు చేస్తున్నా. రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగుమందులు వాడకుండా పదేళ్లుగా వరి సాగు చేస్తున్నా. పచ్చిరొట్టను కలియదున్ని దమ్ము చేయటం, పుంగనూరు ఆవుల పేడ ఎరువు వేస్తుంటా. చీడపీడలకు హోమియో మందులు వాడుతున్నా. 22–23 బస్తాల దిగుబడి వస్తుంటుంది. తొలుత విజయవాడ వన్‌టౌన్‌లోని రామకృష్ణ హోమియో స్టోర్‌లో డా. వెలివల రాజేంద్రప్రసాద్ సూచన మేరకు పంటలకు, పశువులకూ హోమియో మందులు వాడటం ప్రారంభించాను. వ్యవసాయంలో హోమియోకు డా. వైకుంఠనాథ్ రచించిన పుస్తకం ప్రామాణికం. దీని ఆధారంగా జిట్టా బాల్‌రెడ్డి సూచనల ప్రకారం హోమియో మందుల ద్వారా అతి తక్కువ ఖర్చుతో పిచికారీలను పూర్తి చేసుకుంటున్నాం. రూ. 30ల ఖర్చుతో ‘తూజా’ మందు చల్లి మొలగొలుకుల్లో కాండం తొలిచే పురుగును అరికట్టా. పంట ఎర్రబడినప్పుడు మెగ్నీషియా ఫాస్ వాడుతున్నా. దోమ మా పొలంలో ఎప్పుడూ కనపడలేదు. సరైన కంపెనీ మందును, సరైన సమయం (ఉ.8 గం. లోపు లేదా సా. 4 గం. తర్వాత)లో, సరైన మోతాదులో, సరిగ్గా పంట మొక్కలు పూర్తిగా తడిచేలా హోమియో మందులును చల్లుకోవటం అవసరం. మా పొలంలో కలుపు కూడా తియ్యం. ఎలుకల సమస్య తప్ప మరే సమస్యా లేదు. జీవామృతం పిచికారీకి పిలిస్తే వాసన అని కూలీలు రాని పరిస్థితులున్నాయి. హోమియో మందులు వాసన రావు. కాబట్టి ఆ బాధ కూడా లేదు. వీటి అవశేషాలు కూడా పంట దిగుబడుల్లో ఉండవు. ఖర్చు కూడా బాగా తక్కువ. – పంచకర్ల విష్ణువర్థనరావు (94405 02130), అరిసేపల్లి, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా -
బాబుకు ఆటిజమ్... చికిత్స ఉందా?
మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ►అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ►నలుగురిలో కలవలేకపోవడం ►ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ►వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
హైపో థైరాయిడిజమ్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో మందులు ఉన్నాయా? – శకుంతల, రాజమండ్రి మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్ వస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు: ∙బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్ నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స: హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ గాల్‌బ్లాడర్‌లో రాళ్లు... ఆపరేషన్ తప్పదా? గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నేను నెల రోజుల క్రితం హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నారు. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వగలరు. – ఉష, కొత్తగూడెం మీరు చెప్పినదాని ప్రకారం మీకు అసింప్టమాటిక్ గాల్‌స్టోన్ డిసీజ్ ఉన్నదని చెప్పవచ్చు. ఇలా గాల్బ్లాడ్ర్లో రాళ్లు ఉండి వ్యాధి లక్షణాలు లేనివారిలో నూటికి ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. కాబట్టి మీరు ఒకసారి మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి, మీ రిపోర్టులు చూపిస్తే సరైన సలహా ఇవ్వగలరు. నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. – మనోహరరావు, కోదాడ మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. మీ లేఖలో మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా తెలియజేయలేదు. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. మీకు వస్తున్న కడుపులో నొప్పి ఎడమవైపు ఛాతీ కింది భాగంలో వస్తోంది కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. నా వయసు 43 ఏళ్లు. నేను చాలా ఏళ్లుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాను. మూడు నెలల నుంచి మందులు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి తగ్గడం లేదు. దీనికి తోడు మలబద్ధకం, తలనొప్పి సమస్యలు కూడా ఉన్నాయి. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – దామోదర్‌రావు, కాకినాడ మీ లేఖలో మీరు ఎండోస్కోపీ చేయించారా లేదా అన్న విషయం రాయలేదు. ఇక రెండో అంశం మలబద్ధకం పాటు కడుపునొప్పి ఉంటోందని రాశారు. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కావచ్చని అనిపిస్తోంది. ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, యాంగై్జటీ, ఒత్తిడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. మీ సమస్య అదుపులోకి వస్తుంది. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
కాసులు కురిపిస్తున్న స్వైన్‌ఫ్లూ
పాత వాక్సిన్లతో సొమ్ము చేసుకుంటున్న డీలర్లు జోరుగా మాస్క్‌ల వ్యాపారం హోమియో మందులకు గిరాకీ చోద్యం చూస్తున్న యంత్రాంగం విశాఖ మెడికల్: ప్రజల భయాన్ని, బలహీనతలను కొంతమంది మెడికల్ షాపుల యజమానులు, డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పదిరోజులుగా విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ మహమ్మారితో ఒక పక్క ప్రజలను భయాందోళనలకు గురవుతుంటే ఇదే అదనుగా కొంతమంది స్వార్ధపరులు కాసుల పంట పండించుకుంటున్నారు. వ్యాక్సిన్లు, మాస్క్‌ల వ్యాపారాన్ని జోరుగా సాగిస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఎమ్మార్పీకి రెండు మూడు రెట్లకు విక్రయిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ కారకమైన వైరస్ ఏటా తన రూపును మార్చుకుని మరింత బలపడుతుంటుంది. అందుకు తగ్గట్టుగా అడ్వాన్స్ వ్యాక్సిన్‌గా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ మహమ్మారి విరుచుకుపడడంతో కొత్త వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. రెండు మూడేళ్ల క్రితం తయారు చేసిన పాత వ్యాక్సిన్లను ఎమ్మార్పీ కంటే రెండు రెట్లకు విక్రయిస్తూ అందినకాడకి దోచుకుంటున్నారు. స్వైన్‌ఫ్లూ నిర్ధారణయితే కానీ వ్యాక్సిన్ వాడకూడదని వైద్యనిపుణులు చెబుతుంటే ఈ లక్షణాలతో ఉన్న వారికి సైతం వ్యాక్సిన్ వేస్తే ఈ వ్యాధి దరిచేరదంటూ కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుండడంతో వీటికి ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. స్థానిక హోల్‌సేల్ డీలర్లు పెద్ద ఎత్తున నిల్వ చేసిన పాత వ్యాక్సిన్లు కూడా ప్రస్తుతం అయిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎమ్మార్పీ రూ.550లు ఉంటే డిమాండ్‌ను బట్టి రూ.1500ల నుంచి రూ.2వేల వరకు విక్రయిస్తున్నారు. ఇటీవలే ఒక్కొక్కటి రూ.500 చొప్పున 100 వైల్స్(వాక్సిన్స్) కొనుగోలుచేసిన కేజీహెచ్ పిల్లలు, ప్రసూతి, మెడికల్, స్వైన్‌ప్లూ వార్డుల్లో పనిచేసే సిబ్బందికి ముందుజాగ్రత్త చర్యగా వేసేందుకు నిల్వ చేశారు. పెద్ద ఎత్తున మాస్క్‌ల విక్రయాలు మరొక పక్క మాస్క్‌ల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు వీటి వినియోగాన్ని ప్రోత్సహించడంతో విక్రయాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ఈ వ్యాధి తొందరగా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యగా వారు మాస్కులు ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగిల్ లేయర్ మాస్క్ అయితే రూ.5, డబుల్ లేయర్ రూ.15, త్రిబుల్ లేయర్ రూ.25లు కాగా, రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా వీటిని ప్రోత్సహించడంతో తమ పిల్లలను మాస్క్‌లతోనే పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మాస్క్‌ల వ్యాపారం నగరంలో ఊపందుకుంది. జిల్లా యంత్రాంగం వీటి విక్రయాలపై దృష్టి పెట్టడం లేదు. వారి దృష్టి వ్యాధి నివారణా చర్యలకే పరిమితం చేస్తున్నారు తప్ప ప్రజలు నిలువుదోపిడీకి గురవుతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదు.హోమియోపతి మందులు వాడితే ఈ వ్యాధి రాకుండా బయటపడవచ్చుననే ప్రచారం ఉండడంతో వీటికి కూడా యమగిరాకీ ఉంది. ప్రభుత్వం కూడా ఆయుష్ డిపార్టుమెంట్ ద్వారా 3 లక్షల హోమియో మాత్రలను సిద్ధంగా ఉంచినట్టుగా ప్రకటించినప్పటికీ నగర పరిధిలోని డిస్పన్సరీలో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు హోమియో మందుల వ్యాపారం ఊపందుకుంది. ముందు జాగ్రత్త చర్యలు, అవగాహన తోనే వ్యాధిని ఎదుర్కోగలమని వైద్యులు చెబుతున్నప్పటికీ జనం మాత్రం వ్యాధి భయంతో జేబులు గుల్లచేసుకుంటున్నారు.