పాత వాక్సిన్లతో సొమ్ము చేసుకుంటున్న డీలర్లు
జోరుగా మాస్క్‌ల వ్యాపారం
హోమియో మందులకు గిరాకీ
చోద్యం చూస్తున్న యంత్రాంగం
విశాఖ మెడికల్: ప్రజల భయాన్ని, బలహీనతలను కొంతమంది మెడికల్ షాపుల యజమానులు, డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పదిరోజులుగా విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ మహమ్మారితో ఒక పక్క ప్రజలను భయాందోళనలకు గురవుతుంటే ఇదే అదనుగా కొంతమంది స్వార్ధపరులు కాసుల పంట పండించుకుంటున్నారు. వ్యాక్సిన్లు, మాస్క్‌ల వ్యాపారాన్ని జోరుగా సాగిస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఎమ్మార్పీకి రెండు మూడు రెట్లకు విక్రయిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ కారకమైన వైరస్ ఏటా తన రూపును మార్చుకుని మరింత బలపడుతుంటుంది. అందుకు తగ్గట్టుగా అడ్వాన్స్ వ్యాక్సిన్‌గా తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ మహమ్మారి విరుచుకుపడడంతో కొత్త వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. రెండు మూడేళ్ల క్రితం తయారు చేసిన పాత వ్యాక్సిన్లను ఎమ్మార్పీ కంటే రెండు రెట్లకు విక్రయిస్తూ అందినకాడకి దోచుకుంటున్నారు. స్వైన్‌ఫ్లూ నిర్ధారణయితే కానీ వ్యాక్సిన్ వాడకూడదని వైద్యనిపుణులు చెబుతుంటే ఈ లక్షణాలతో ఉన్న వారికి సైతం వ్యాక్సిన్ వేస్తే ఈ వ్యాధి దరిచేరదంటూ కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు వ్యాక్సిన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుండడంతో వీటికి ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. స్థానిక హోల్‌సేల్ డీలర్లు పెద్ద ఎత్తున నిల్వ చేసిన పాత వ్యాక్సిన్లు కూడా ప్రస్తుతం అయిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎమ్మార్పీ రూ.550లు ఉంటే డిమాండ్‌ను బట్టి రూ.1500ల నుంచి రూ.2వేల వరకు విక్రయిస్తున్నారు. ఇటీవలే ఒక్కొక్కటి రూ.500 చొప్పున 100 వైల్స్(వాక్సిన్స్) కొనుగోలుచేసిన కేజీహెచ్ పిల్లలు, ప్రసూతి, మెడికల్, స్వైన్‌ప్లూ వార్డుల్లో పనిచేసే సిబ్బందికి ముందుజాగ్రత్త చర్యగా వేసేందుకు నిల్వ చేశారు.
పెద్ద ఎత్తున మాస్క్‌ల విక్రయాలు
మరొక పక్క మాస్క్‌ల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు వీటి వినియోగాన్ని ప్రోత్సహించడంతో విక్రయాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ఈ వ్యాధి తొందరగా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యగా వారు మాస్కులు ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగిల్ లేయర్ మాస్క్ అయితే రూ.5, డబుల్ లేయర్ రూ.15, త్రిబుల్ లేయర్ రూ.25లు కాగా, రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా వీటిని ప్రోత్సహించడంతో తమ పిల్లలను మాస్క్‌లతోనే పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మాస్క్‌ల వ్యాపారం నగరంలో ఊపందుకుంది. జిల్లా యంత్రాంగం వీటి విక్రయాలపై దృష్టి పెట్టడం లేదు. వారి దృష్టి వ్యాధి నివారణా చర్యలకే పరిమితం చేస్తున్నారు తప్ప ప్రజలు నిలువుదోపిడీకి గురవుతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదు.హోమియోపతి మందులు వాడితే ఈ వ్యాధి రాకుండా బయటపడవచ్చుననే ప్రచారం ఉండడంతో వీటికి కూడా యమగిరాకీ ఉంది.
ప్రభుత్వం కూడా ఆయుష్ డిపార్టుమెంట్ ద్వారా 3 లక్షల హోమియో మాత్రలను సిద్ధంగా ఉంచినట్టుగా ప్రకటించినప్పటికీ నగర పరిధిలోని డిస్పన్సరీలో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు హోమియో మందుల వ్యాపారం ఊపందుకుంది. ముందు జాగ్రత్త చర్యలు, అవగాహన తోనే వ్యాధిని ఎదుర్కోగలమని వైద్యులు చెబుతున్నప్పటికీ జనం మాత్రం వ్యాధి భయంతో జేబులు గుల్లచేసుకుంటున్నారు.
కాసులు కురిపిస్తున్న స్వైన్‌ఫ్లూ
Published Tue, Feb 3 2015 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM
Advertisement