ఈ ఆవు కడపలోని ఒక హోటల్ యజమానిది. ఆ యజమాని ప్రతి రోజూపోషక విలువలు గల మేతతో పాటు కూరగాయలు, దాణా కూడా మేపే వారు. అయితే, ఒక రోజు ఆవు మేత తినటం మానేసింది. నీళ్లు కూడా తక్కువగా తాగుతున్నదని పశువుల ఆసుపత్రికి తోలుకొచ్చారు. మేం రోగ నిర్ధారణ పరీక్షలు చేశాం. లోపల పెద్దపొట్ట ఎన్నిసార్లు తిరుగుతున్నది? పొట్టలోని ద్రావణం పి.హెచ్. ఏ స్థాయిలో ఉంది? పొట్టలో సూక్ష్మజీవులు ఉత్తేజిత స్థాయిలో ఉన్నాయా లేవా? ఈ పరీక్షలు చేశాం. పొట్ట కదలికలు, పిహెచ్, సూక్ష్మజీవులు అన్నీ సాధారణంగానే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దాంతో కాలేయ సంబంధిత టానిక్‌లు, ఇంజెక్షన్లు, ఆయుర్వేదిక్ పొడులతో పొట్టకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేశాం.
పది రోజులైనా మార్పులేదు. ఆ పది రోజులు కేవలం నార్మల్ సెలైన్ బాటిల్‌తోనే బతికిందని చెప్పవచ్చు. అల్లోపతి, ఆయుర్వేదిక్ చికిత్సలు చేసినా మార్పు లేదు కదా.. హోమియోపతి మందులు ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని ఆలోచన వచ్చింది. నక్స్ వామికా 200, రూస్‌టాక్స్ 200 గుళికల మందులు రోజుకు 3 సార్లు చొప్పున మూడు రోజులు ఇచ్చాం. వీటిని దాణాలో కలిపి పెట్టొచ్చు లేదా నేరుగా పశువు పెదానికి, దంతాలకు మధ్యలో హోమియో గుళికలు వేస్తే చాలు. ఈ మందులు వేసిన రెండో రోజే ఆవు మేత మేయటం మొదలు పెట్టిందని ఆవు యజమాని ఆశ్చర్యపడుతూ ఆసుపత్రికి వచ్చి మాతో చెప్పారు. పది రోజులు దాదాపుగా రూ. 2 వేలు ఖర్చు చేసినా రాని ఫలితం రూ. 30ల హోమియోపతి మందులతో రావటం సంతృప్తిని కలిగించింది.
పశువైద్యంలో అల్లోపతి, ఆయుర్వేదిక్ ఔషధాలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. తక్కువ ఖర్చుతో పశువులకు మంచి చికిత్స, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, అందించవచ్చని మాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. పాడి రైతులకు తెలియజేస్తున్న విషయమేమిటంటే ప్రథమ చికిత్సగా తక్కువ ఖర్చుతో కూడిన ఆయుర్వేద, హోమియోపతి చికిత్సలు చేయటం నేర్చుకోవటం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా పశువైద్యులను సంప్రదించి అల్లోపతి చికిత్సలు తీసుకోవచ్చు.
– డాక్టర్. జి.రాంబాబు (94945 88885),
పశువైధ్యాధికారి, కడప
Comments
Please login to add a commentAdd a comment