fodder
-
మేయని ఆవుకు హోమియో చికిత్స
ఈ ఆవు కడపలోని ఒక హోటల్ యజమానిది. ఆ యజమాని ప్రతి రోజూపోషక విలువలు గల మేతతో పాటు కూరగాయలు, దాణా కూడా మేపే వారు. అయితే, ఒక రోజు ఆవు మేత తినటం మానేసింది. నీళ్లు కూడా తక్కువగా తాగుతున్నదని పశువుల ఆసుపత్రికి తోలుకొచ్చారు. మేం రోగ నిర్ధారణ పరీక్షలు చేశాం. లోపల పెద్దపొట్ట ఎన్నిసార్లు తిరుగుతున్నది? పొట్టలోని ద్రావణం పి.హెచ్. ఏ స్థాయిలో ఉంది? పొట్టలో సూక్ష్మజీవులు ఉత్తేజిత స్థాయిలో ఉన్నాయా లేవా? ఈ పరీక్షలు చేశాం. పొట్ట కదలికలు, పిహెచ్, సూక్ష్మజీవులు అన్నీ సాధారణంగానే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దాంతో కాలేయ సంబంధిత టానిక్‌లు, ఇంజెక్షన్లు, ఆయుర్వేదిక్ పొడులతో పొట్టకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేశాం. పది రోజులైనా మార్పులేదు. ఆ పది రోజులు కేవలం నార్మల్ సెలైన్ బాటిల్‌తోనే బతికిందని చెప్పవచ్చు. అల్లోపతి, ఆయుర్వేదిక్ చికిత్సలు చేసినా మార్పు లేదు కదా.. హోమియోపతి మందులు ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని ఆలోచన వచ్చింది. నక్స్ వామికా 200, రూస్టాక్స్ 200 గుళికల మందులు రోజుకు 3 సార్లు చొప్పున మూడు రోజులు ఇచ్చాం. వీటిని దాణాలో కలిపి పెట్టొచ్చు లేదా నేరుగా పశువు పెదానికి, దంతాలకు మధ్యలో హోమియో గుళికలు వేస్తే చాలు. ఈ మందులు వేసిన రెండో రోజే ఆవు మేత మేయటం మొదలు పెట్టిందని ఆవు యజమాని ఆశ్చర్యపడుతూ ఆసుపత్రికి వచ్చి మాతో చెప్పారు. పది రోజులు దాదాపుగా రూ. 2 వేలు ఖర్చు చేసినా రాని ఫలితం రూ. 30ల హోమియోపతి మందులతో రావటం సంతృప్తిని కలిగించింది. పశువైద్యంలో అల్లోపతి, ఆయుర్వేదిక్ ఔషధాలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. తక్కువ ఖర్చుతో పశువులకు మంచి చికిత్స, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, అందించవచ్చని మాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. పాడి రైతులకు తెలియజేస్తున్న విషయమేమిటంటే ప్రథమ చికిత్సగా తక్కువ ఖర్చుతో కూడిన ఆయుర్వేద, హోమియోపతి చికిత్సలు చేయటం నేర్చుకోవటం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా పశువైద్యులను సంప్రదించి అల్లోపతి చికిత్సలు తీసుకోవచ్చు. – డాక్టర్. జి.రాంబాబు (94945 88885),పశువైధ్యాధికారి, కడప -
పాలు స్వచ్ఛంగా ఉన్నాయా?
ఆధునిక జీవితంలో పాలు తాగడం మంచిదని అనేకులు భావిస్తారు. ఆ మేరకు నిత్యం పాల అవసరం పెరిగింది. పాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల పరిమాణం, వైవిధ్యం కూడా పెరిగింది. అందుకే కొందరికే పాలు అందుతున్నాయి. పాలు, మజ్జిగ విరివిగా దొరికే పల్లెలలో ఉదయం 8 దాటితే పాలు ఉండటం లేదు. మరోవైపు పాల ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. సహజ పశువుల మేత తగ్గుతున్నది. పశువులు మేసే గడ్డి మైదానాలు దాదాపు లేనట్లే! పశువులకు కావాల్సిన నీరు, నీడ సహజంగా దొరికే పరిస్థితులు లేవు. ఇంకొక వైపు పాల నాణ్యత మీద అనుమానాలు పెరుగుతున్నాయి. పాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి.పాల కథ –1 పశువులు స్వేచ్ఛగా తిరగగలిగే ప్రదేశాలు దాదాపుగా లేవు. చెట్లు, కమ్యునిటీ స్థలాలు తగ్గినాయి. గుట్టలు కూడా ప్రైవేటు పరం అవుతున్నాయి. దానివల్ల పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్నది. పశు పోషకుల సంఖ్య తగ్గుతున్నది. పాడి పశువులను పోషించే జ్ఞానం, నైపుణ్యం తగ్గుతున్నది. వరి, జొన్న, మక్క లాంటి పంటల నుండి వచ్చే మేత కూడా లేదు. చొప్ప, ఎండు గడ్డి వంటివి రైతులు పొలంలోనే కాలబెడుతున్నారు. పశు గ్రాసం ప్రత్యేకంగా పండించాల్సి వస్తున్నది. పశు పోషకులకు భూమి లేదు. ఉన్నా ఆ భూమి ఇతర ఉపయోగాలకు వాడటం వల్ల పశుగ్రాసం మీద శ్రద్ధ లేదు. వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు పశు వులను పోషించడం లేదు. ఆ యా పంటలకు రసాయనాలు పిచికారీ చేయడం వల్ల పశువులు తినలేవు. తిన్నా అనారోగ్యం పాలు కావచ్చు. చనిపోవచ్చు కూడా. జన్యుమార్పిడి బీటీ ప్రత్తి చేలలో తిరిగిన పశు వులు, గొర్రెలకు చర్మవ్యాధులు వచ్చినాయి. ఆకులు తిన్న గొర్రెలు చనిపోయినాయి. దరిమిలా, పాశ్చాత్య దేశాల మాదిరి ‘స్టాల్ అని మల్స్’ పరిస్థితికి చేరుకుంటున్నాము. పెద్ద డెయిరీలతో కాలుష్యంపాడి పశువులను ఒకే దగ్గర కట్టేసి, పాలు పిండి అమ్మే వ్యాపార వ్యవస్థను డెయిరీ అని పిలుస్తారు. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో డెయిరీగా పిలిచే పశు పాలు, మాంసం ఉత్పత్తి కేంద్రాలు చాల పెద్దవి. వాటిని ఫ్యాక్టరీ ఫామ్స్ అంటారు. ప్రపంచంలో అతి పెద్ద 10 ఫ్యాక్టరీ ఫామ్స్‌లో పై రెండు చైనాలో ఉన్నాయి. తరువాత 8 ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అతి పెద్ద చైనా ఫామ్‌లో లక్ష ఆవులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఒక ఫ్యాక్టరీ ఫామ్‌లో కేవలం యాభై మంది 55 వేల పశువులను నిర్వహిస్తారు. ఇటువంటి ఫ్యాక్టరీ డెయిరీలు ప్రపంచ పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించాయి. వీటి నుంచి వచ్చే రసాయన, కాలుష్య జలాల వలన నీటి వనరులు కలు షితం అవుతున్నాయి. క్రిమి–కలుపు సంహారకాలు, హార్మోన్లు,యాంటీ బయాటిక్స్, ఫాస్ఫేట్ అధికంగా ఉండే ఎరువులు, బ్యాక్టీ రియా–సోకిన ఎరువులు దీనికి కారణం.అమెరికాలో 2022 నాటికి పాతిక వేల డైరీ ఫామ్‌లు ఉన్నాయి. 10,000 మంది డెయిరీ రైతులు ఉన్నారు. 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమిలో పాడి రైతుల సంఖ్య 1.34 లక్షలు. ఇక్కడ అత్యధికంగా పాడి ఆవులను పోషించే దేశాలు జర్మనీ, ఫ్రాన్ ్స, నెద ర్లాండ్స్. భారతదేశంలో పది పశువులు లేదా అంతకంటే తక్కువ ఉన్న డెయిరీ ఫామ్‌లు 7.5 కోట్లు. భారత్‌లోనే చాలావరకు డెయిరీ ఫామ్‌లు చిన్న–స్థాయి, కుటుంబ యాజమాన్యంతో నడిచేవి.అంత పెద్ద డెయిరీ ఫామ్‌లు భారతదేశంలో లేకున్నా పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో 24% వాటాను అందిస్తున్న ఈ ఉత్పత్తి దాదాపు 21 కోట్ల టన్నులు. అధిక పాల దిగుబడికి పేరుగాంచిన భారతదేశంలో బర్రెల జనాభా ఎక్కువ. అయినా పాడి పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. ప్రాథమిక పాడి రైతు లకు గిట్టుబాటు ధర రాని పరిస్థితులున్నాయి.పాలు ఇచ్చే పశువులు బర్రెలు, ఆవులు. ఇవి ఎక్కువగా భారత దేశంలో వాడతారు. పాలు ఇంకా వివిధ రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. గాడిద పాలు, మేక పాలు శ్రేష్ఠమైనవి అని భావించే వారు ఉన్నారు. బెంగళూరులో ఒక కుటుంబం గాడిదతో పాటు ఇంటింటికి తిరుగుతూ లీటర్ రూ.500లకు అమ్ముతున్న వైనం చూశాం. మొక్కలు, పండ్ల నుంచి వచ్చే పాలు కూడా ఈ మధ్య ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా పండించే సోయా నుంచి తీసే పాలు అనేక ఆహార పదార్థాలలో వాడుతున్నారు. అయితే పశువుల నుంచి పాలను సేకరించడం హింసగా భావించే వారు ఉన్నారు. పశువుల పాలు పడనివారు మొక్కల పాలను ఆశ్ర యిస్తున్నారు. ఇటీవల మొక్కల నుంచి తీసుకునే పాల వ్యాపారం విపరీతంగా పెరిగింది. 2019లో మొక్కల పాల మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు దాటిందని అంచనా.పశువు ఒక యంత్రమా?తరతరాల నుంచి పాలు సేకరించి జీవించే యాదవులు, ఇంకా ఇతర వృత్తుల వారు ఉన్నారు. పశువులకు రోగాలు రాకుండా చూసుకునే జ్ఞానం, నైపుణ్యం వీరికి సంప్రదాయంగా ఉండింది. వీరు చేసే వ్యాపారంలో పాడి పశువులను ప్రేమగా చూసుకోవడం కీలకం.అందినంత పిండుకునే తత్వం లేదు. లేగ దూడను తల్లి నుంచి వేరు చేయరు. ఫలితంగా, పాలు నిత్యం ఒకే పరిమాణంలో ఉండేవి కావు. ఉండవు కూడా. పాలు ప్రకృతి ఉత్పత్తి. ఒక మర యంత్రం నుంచి వచ్చినట్లు రోజు ఒకే పరిమాణంలో రావాలని లేదు.పశువులకు ఇవ్వాల్సిన గ్రాసం, దాణా, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగాయి. రాను రాను ఒక కుటుంబం ఆధారపడే పాడి పశువుల జీవ నోపాధి సమస్యలలో పడింది. ప్రభుత్వాలు పాడి పశువుల కొనుగోలుకు కొన్ని పథకాలు పెట్టాయి తప్పితే, పశు గ్రాసం కొరకు కావాల్సిన భూమి, పశు వుల నివాసానికి భూమి వగైరా వాటి మీద దృష్టి లేదు.పాశ్చ్యాత్య దేశాలు పాడి పశువును ఒక యంత్రంగా మార్చాయి. పాల ఉత్పత్తి పెంచడానికి ‘హైబ్రిడ్’ అవును తెచ్చారు. అది సరి పోలేదని ఆవుల పొదుగును రెండింతలు, మూడింతలు పెంచారు. ఆ పొడుగులతో అవి నడవలేక యాతన పడుతున్నా పట్టించుకోలేదు. దాణాలో మార్పులతో పాల ఉత్పత్తి పెరుగుతుందని భావించి అందులో మార్పులు చేస్తూనే ఉన్నారు. గడ్డి తినే ఆవులకు లేగ దూడల మాంసం తినిపించినందుకు బ్రిటన్‌లో పూర్వం ‘మ్యాడ్ కౌ’ వ్యాధి వచ్చి అనేక ఆవులు చనిపోయినాయి. పశువుల శరీరాన్ని ఒక పరిశోధన కేంద్రంగా మార్చేశారు. అనుచిత ఆహారం ఇవ్వడం వల్ల పశువులకు వ్యాధులు వస్తున్నాయి. అపాన వాయువు ఎక్కువ అవుతున్నది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తు న్నది అని చెప్పి, ఇప్పుడు పాడి పశువులలో ‘జన్యుమార్పిడి’ ప్రయ త్నాలు కూడా చేస్తున్నారు. ఈ రకమైన పరిశోధన మానవుల నైతిక తను ప్రశ్నిస్తున్నది. జన్యుమార్పిడి పాడి పశువుల ద్వారా ఔషధాలను ఉత్పత్తి చేయడం, పాల దిగుబడిని పెంచడం, వ్యాధులను నిరోధించాలని పరిశోధనలు చేస్తున్నారు. కొమ్ములు రాని జన్యు మార్పిడి పాడి పశువుల గురించిన పరిశోధన చేస్తున్నారు. కొమ్ములు ఉంటే ఇతర పశువులను, యజమానులను పొడుస్తున్నాయని ఈ రక మైన పరిశోధనలు చేస్తున్నారు. మేలు జాతి పశువుల కొరకు అవలంబిస్తున్న కృత్రిమ గర్భధారణ పద్ధతి కూడా ఫలించడం లేదు. ఫలించక పోగా, మేలు స్థానిక పశు జాతులను కలుషితం చేస్తున్నారు. పాల ద్వారా విషాలుపాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి. కొన్ని రకాల గడ్డి భార లోహాలను నేల తీసుకుంటుంది. ఆ గడ్డి ద్వార సీసం, ఇంకా ఇతర ప్రమాదకర భార లోహాలు పాలు తాగే వారికి చేరుతున్నాయి. పాడి పశువులకు ఇచ్చే దాణా ద్వారా కూడా మనుషులు తమను తామే కలుషితం చేసుకుంటున్నారు. పడేసిన చికెన్ బిరియాని, బ్రెడ్డు ముక్కలు వగైరా బర్రెలకు, ఆవులకు పెడుతున్నారు. పాడి పశువులకు ఇచ్చే ఆహారాన్ని బట్టి పాలు ఉంటాయని పశువుల యజమానులకు తెలుసు. వినియోగదారులకు తెలియదు. తెలిసినా ఏమి చేయలేక మిన్నకుంటారు. సహజ గ్రాసం తినని పశువు పాలలో పోషకాలు ఉండే అవకాశం తక్కువ. పాలలో తగ్గిపోతున్న పోషకాల మీద మన దేశంలో పరిశోధనలు లేవు. చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
ఎర్రజొన్న సీడ్.. కేరాఫ్ అంకాపూర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లోని అంకాపూర్ అనగానే రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ దేశీ చికెన్ గుర్తొస్తుంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు సైతంఈ దేశీ చికెన్ పార్సిళ్ల రూపంలో వెళుతోంది. అయితే ఇదే అంకాపూర్ పశుగ్రాసం కోసం పెంచే ఎర్రజొన్న విత్తనాల ఎగుమతిలోనూ ప్రత్యేకత పొందింది. ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌తోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాకు సైతం ఎర్రజొన్న విత్తనాలు ఎగుమతి చేస్తున్నారు. ఉత్తరాదిలో పశుగ్రాసానికి ఆధారం ఇదే.. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు ఏటా ఎర్రజొన్న సాగు చేస్తున్నారు. పక్కనే ఉన్న నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోనూ రైతులు మరో 30 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఉత్తరాదిలో పశుగ్రాసం పెంచేందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ఎర్రజొన్నలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్లో 40 చోట్ల ఎర్రజొన్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వాటిలో 10 యూనిట్లు చుట్టుపక్కల ఉండగా ఒక్క అంకాపూర్‌లోనే 30 ఎర్రజొన్న యూనిట్లు ఉన్నాయి. దీంతో ఎర్రజొన్న విత్తనాలకు కేరాఫ్‌గా అంకాపూర్ పేరుగాంచింది. ఏపీలో చూసొచ్చి.. 1983లో ఏపీలోని ఏలూరులో ఎర్రజొన్న విత్తనాల పంటలను పరిశీలించి వచ్చిన ఆర్మూర్ ప్రాంత రైతులు ఈ సాగు ప్రారంభించారు. రైతులు ఏటా అక్టోబర్, నవంబర్లలో ఒప్పందం ద్వారా విత్తన వ్యాపారుల నుంచి ఫౌండేషన్ సీడ్‌ను తీసుకుంటారు. ఫిబ్రవరిలో పంట చేతికి రాగానే ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చిన వ్యాపారులకే రైతులు అమ్ముతారు. రైతుల నుంచి సేకరించిన విత్తనాలను వ్యాపారులు ఆయా యూనిట్లలో శుద్ధిచేసి ప్యాక్ చేసి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నిజామాబాద్ భూములే సాగుకు అనుకూలం.. దేశం మొత్తంలో తెలంగాణలోని నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే భూములు ఎర్రజొన్న విత్తనాలు పండించేందుకు అనుకూలంగా ఉన్నాయి. కర్ణాటకలోని బళ్లారిలో 15 శాతం ఎర్రజొన్న విత్తనాలు పండిస్తుండగా నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో కలిపి 85 శాతం ఎర్రజొన్న విత్తనాలను పండిస్తున్నారు. రైతుల నుంచి కిలో రూ.45 చొప్పున ఎర్రజొన్నలను తీసుకుంటున్న వ్యాపారులు వాటిని శుద్ధిచేసి కిలో రూ.65 చొప్పున అమ్ముతున్నారు. ఏటా ఇక్కడి నుంచి 60 వేల మెట్రిక్ టన్నుల ఎర్రజొన్న విత్తనాలను శుద్ధిచేసి ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వం కొంటేనే మేలంటున్న రైతులు.. సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారుతుండడంతో ఏటా ధర విషయంలో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వమే విత్తన విధానాన్ని రూపొందించి రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకునే విధానాన్ని తయారుచేస్తే రైతులకు మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి ఎర్రగరప నేలలు అనుకూలం నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఎర్రగరప నేలలు ఎర్రజొన్న పంటకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే, పశువుల పెంట, చెరువు నల్లమట్టి ఈ భూముల్లో వేస్తారు. మరోవైపు ఈ మూడు జిల్లాల్లోని వాతావరణ పరిస్థితులు ఎర్రజొన్న సాగుకు కలిసివస్తున్నాయి. రైతులు పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్న పంటల మార్పిడి వ్యవసాయం చేస్తుండడంతో మరింత మేలు చేస్తోంది. ప్రైవేటు వ్యాపారులు అంకాపూర్‌లో యూనిట్లు ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహిస్తుండడంతో ఎర్రజొన్న సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. – హరికృష్ణ, వ్యవసాయాధికారి, ఆర్మూర్ -
పాడి రంగానికీ ఆర్బీకేల దన్ను
అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామానికి చెందిన ఇతడి పేరు ఉయ్యూరు రామనరేష్. రెండు గేదెలు, రెండు ఆవులున్నాయి. గతంలో మార్కెట్లో దొరికే నాసిరకం దాణా వినియోగించటం వల్ల ఆశించిన స్థాయిలో పాల దిగుబడి వచ్చేది కాదు. పైగా పశువులు తరచూ అనారోగ్యం బారిన పడేవి. దీంతో ఆర్బీకేల ద్వారా ఇస్తున్న నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్) తీసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతడి పశువులు రోజుకు 1–2 లీటర్ల పాలను అధికంగా ఇస్తున్నాయి. ఆ పాలలో వెన్న శాతం కూడా పెరగడంతో మంచి ఆదాయం వస్తోందని, తానిప్పటి వరకు కిలో రూ.6.50 చొప్పున 200 కిలోల టీఎంఆర్ తీసుకున్నానని రామనరేష్ ఆనందంతో చెబుతున్నారు. సాక్షి, అమరావతి: పాడి పశువులకు నాణ్యమైన పశుగ్రాసం, దాణా అందిస్తే అధిక దిగుబడితోపాటు నాణ్యమైన పాలను ఇస్తాయి. మరోవైపు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయి. నాణ్యమైన పాల దిగుబడి వస్తే పాడి రైతుల ఆదాయానికి ఢోకా ఉండదు. ఇన్నాళ్లూ పశుగ్రాసం, దాణా కోసం పాడి రైతులు పాట్లు పడేవారు. వాటికి చెక్ పెడుతూ ఏడాదిగా ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్న పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్), నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమాలు, లివర్ టానిక్స్ తదితర పోషక మిశ్రమాలతోపాటు గడ్డి కత్తిరించే యంత్రాలు (చాప్ కట్టర్స్) వంటి వాటిని సబ్సిడీపై ఇస్తుండటంతో రైతుల వెతలు తీరుతున్నాయి. ఇందుకోసం పశు సంవర్ధక శాఖ 11ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుంది. సర్టిఫై చేసిన పశుగ్రాసం.. సంపూర్ణ మిశ్రమ దాణా పశుగ్రాసం కొరతకు చెక్ పెట్టేందుకు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన జొన్న (సీఎస్హెచ్–24 ఎంఎఫ్ రకం), మొక్కజొన్న (ఆఫ్రికన్ టాల్ రకం) పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదిలో 1.41 లక్షల మంది రైతులకు రూ.15.81 కోట్ల విలువైన 1,500 టన్నుల జొన్న, 489 టన్నుల మొక్కజొన్న పశుగ్రాస విత్తనాలు సరఫరా చేసింది. వీటిని 1,05,531 ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 4.21 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని రైతులు ఉత్పత్తి చేసుకుని పశుగ్రాసం కొరతను అధిగమించారు. మరోవైపు అత్యంత పోషక విలువలు గల సంపూర్ణ మిశ్రమ దాణాæ(టీఎంఆర్)ను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తోంది. దీనిని వాడటం వల్ల పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఇతర దాణాలేవీ పెట్టాల్సిన అవసరం ఉండదు. సర్టిఫై చేసిన మిశ్రమ దాణా కిలో రూ.15.80 కాగా.. రైతులకు సబ్సిడీపై రూ.6.50కే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రతి పాడి రైతుకు రెండు నెలలకు ఒకసారి 60 శాతం సబ్సిడీపై గరిష్టంగా 1,800 కిలోల చొప్పున ఇస్తోంది. ఇప్పటివరకు రూ.29.43 కోట్ల విలువైన 18,625 మెట్రిక్ టన్నుల టీఎంఆర్ దాణాను 46,563 మంది రైతులకు పంపిణీ చేసింది. మరోవైపు పశుగ్రాసం వృథాను అరికట్టేందుకు ఆర్బీకేల ద్వారా 40 శాతం రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాలు అందిస్తోంది. 2 హెచ్‌పీ 3 బ్లేడ్ చాప్ కట్టర్ ఖరీదు రూ.33,970 కాగా, సబ్సిడీ పోనూ రూ.20,382కే ఇస్తోంది. ఇప్పటివరకు రూ.4.52 కోట్ల విలువైన 2,173 చాప్ కట్టర్స్‌ను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. 3 టన్నుల టీఎంఆర్ తీసుకున్నా గతంలో నాణ్యమైన దాణా దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఆర్బీకే ద్వారా ఇప్పటివరకు 3 టన్నుల టీఎంఆర్ తీసుకున్నా. బుక్ చేసుకున్న వారం లోపే అందిస్తున్నారు. దీని వినియోగంతో పాల దిగుబడి, నాణ్యత కూడా పెరిగింది. – పద్మజా భాను, దేవికొక్కిరపల్లి, యలమంచిలి పశుగ్రాసం వృథా కావడం లేదు నాకు 12 గేదెలు, 3 ఆవులు, 4 దూడలు ఉన్నాయి. మాది కరువు ప్రాంతం కావడంతో పశుగ్రాసం కొరత ఎక్కువ. దూరప్రాంతాల నుంచి పశుగ్రాసం తెచ్చుకున్నా చాలావరకు వృథా అయ్యేది. 2 హెచ్‌పీ సామర్థ్యం గల చాప్ కట్టర్ కోసం ఆర్బీకేలో బుక్ చేశా. దీన్ని ఉపయోగించడం వల్ల పశుగ్రాసం వృథా కావడం లేదు. – డి.మోహన్‌దాస్, వీరుపాపురం, కర్నూలు జిల్లా ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఇన్పుట్స్ సరఫరా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన, సర్టిఫై చేసిన పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, ఖనిజ లవణ మిశ్రమాలతో పాటు గడ్డి కత్తిరించే యంత్రాలు సబ్సిడీపై అందిస్తున్నాం. వీటివల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. పాల దిగుబడితో పాటు నాణ్యత కూడా పెరిగిందని రైతులు చెబుతున్నారు. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ -
మళ్లీ పులి కలకలం.. ట్రాకింగ్ కెమెరాల్లో దృశ్యాలు
కాళేశ్వరం: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా తూమునూర్–అరుడ ఫారెస్ట్ బీట్‌లో పెద్దపులి జాడ కన్పించింది. అంతేకాదు అడవిలో మేతకు వెళ్లిన ఎద్దుపై దాడి చేసి చంపేసింది. తూమునూర్ ఉప సర్పంచ్ వేముల కిరణ్, సిరొంచ అటవీ అధికారుల సమాచారం ప్రకారం.. తూమునూర్ గ్రామానికి చెందిన ఒక ఎద్దు ఈ నెల 12న అడవిలో మేతకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఉప సర్పంచ్‌తో పాటు మరికొందరు స్థానికులు 13న అడవిలోకి వెళ్లి గాలించగా ఎద్దు కళేబరం కన్పించింది. చుట్టుపక్కల పులి పాదముద్రలు కన్పించడంతో ఎద్దుపై పులి దాడి చేసిందని భావించారు. దీంతో వారు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సిరొంచ రేంజర్ కటుకు శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి అడవిలోకి వెళ్లి మూడుచోట్ల ట్రాకింగ్ కెమెరాలు అమర్చారు. కాగా అదేరోజు రాత్రి 9.30 గంటలకు ఎద్దు వద్దకు వచ్చిన పెద్దపులి కొంత మాంసాన్ని తినడం ఆ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పులి తిరుగుతోందని, ప్రజలు అడవుల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తూమునూర్ నుంచి తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, కుదురుపల్లి, ఎడపల్లి, బీరసాగర్, కాళేశ్వరం ప్రాంతాలకు 8–12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండగా మధ్యలో గోదావరి అడ్డుగా ఉంది. పులి ఈ ప్రాంతాల వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎస్–8 పనేనా? గతేడాది అక్టోబర్ చివరి వారంలో ఎస్–8గా పేరు పెట్టిన పెద్దపులి సుమారు నెలన్నరపాటు నాలుగు జిల్లాల్లో తిరిగింది. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో సంచరించి అక్కడక్కడా బీభత్సం సృష్టించింది. చివరకు కాటారం మండలం వీరాపూర్‌లో రెండు రోజులపాటు గడిపి డిసెంబర్ 13న మహదేవపూర్ మండలం అన్నారం మీదుగా కుంట్లం వద్ద గోదావరి దాటి మంచిర్యాల, కొమురంభీం జిల్లాలకు వెళ్లింది. కాగా అదే పులి ఇక్కడికి వచ్చి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. పులి తిరుగుతున్న సమాచారంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
పశుగ్రాసానికి 'ఉపాధి' ఊతం
సాక్షి, అమరావతి: పచ్చిమేత కొరతతో పాల దిగుబడి తక్కువగా వస్తున్న నేపథ్యంలో.. ఆ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పశువులకు అవసరమైన మేతలో కేవలం మూడో వంతు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొరతను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలు పచ్చిమేత సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశాయి. ఫలితంగా పచ్చిమేత సాగు చేసే రైతులు మూడేళ్ల పాటు రాయితీ పొందవచ్చు. పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.గంగునాయుడు పచ్చిమేత సాగుపై పలు విషయాలను వెల్లడించారు. ఖరీఫ్ సీజనే అనువు.. పచ్చిమేత సాగునకు ఖరీఫ్ సీజనే అనువైనది. పాడి రైతులు అధిక దిగుబడిని ఇచ్చే పచ్చిమేతల్లో సూపర్ నేపియర్‌తో పాటు అజొల్లా, హైడ్రోపోనిక్స్‌ను సాగు చేసుకోవచ్చు. వ్యవసాయ పంటల సాగుకు పనికిరాని భూమిని పచ్చిమేత కోసం ఉపయోగించుకోవచ్చు. పచ్చిమేత పుష్కలంగా ఉంటే ఐదు లీటర్ల పాలిచ్చే పశువుకు మరింకే దాణా వేయాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా పశు పోషణలో 70 శాతం ఖర్చు మేపుదే. అవిశ, సుబాబుల్ లాంటి చెట్లను నాటిన నాటి నుంచి 40, 50 రోజుల్లోపు పది కిలోల గడ్డి అందుబాటులోకి వస్తుంది. సూపర్ నేపియర్ అన్ని విధాలా మంచిది. ఎకరానికి సాలీనా వంద నుంచి 120 టన్నుల దిగుబడి సాధించవచ్చు. ఆరేడు కోతలు కోయవచ్చు. ఒకసారి నాటితే 6 ఏళ్ల వరకు ఢోకా ఉండదు. పాడిరైతులు నేపియర్ గడ్డి కణుపుల కోసం కృష్ణా జిల్లా గన్నవరం, తిరుపతిలోని పశువైద్య కళాశాల ఫారాలను, గరివిడి వ్యవసాయ క్షేత్రం అధికారులను సంప్రదించవచ్చు. భూమి తక్కువగా ఉన్న రైతులు ధాన్యపు, పప్పుజాతి పశుగ్రాసాలను 2:1 నిష్పత్తిలో మిశ్రమ పంటగా సాగు చేయవచ్చు. జొన్న, అలసందలతో కలిపి పశుగ్రాసాలను పెంచవచ్చు. ప్రభుత్వ సాయం ఇలా.. పాడి రైతులు పచ్చిమేతను పెంచుకోవడానికి ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ ఏడాది దాదాపు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి ప్రోత్సాహకాలు అందజేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. పశుసంవర్థక శాఖ లబ్ధిదారులను ఎంపిక చేస్తే గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. లబ్ధిదారులు నిర్ణీత ప్రాంతంలో మూడేళ్లు పచ్చిమేతను పెంచాలి. ఈ కాలంలో ఉపాధి హామీ నిధుల నుంచి ఎకరానికి రూ.77,204 వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. మూడేళ్లలో 18 కోతలపాటు పశుగ్రాసం పాడిరైతుకు అందుబాటులోకి వస్తుంది. తొలి విడతగా రూ.35,204, మిగతా రెండు విడతల్లో రూ.21 వేల చొప్పున లబ్ధిదారునికి ప్రభుత్వ సాయం అందుతుంది. -
పాఠశాలకు సరుకుల బదులు పశువుల దాణా..!
పుణె: సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మహారాష్ట్రలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పుణెలోని ఒక మున్సిపల్ పాఠశాలకు మధ్యాహ్నభోజన పథకంలో భాగంగా పశువుల దాణాను సరఫరా చేశారు. ఈ ఘటన గత వారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలకు సరుకులకు బదులు పశువుల దాణా వచ్చింది. దీంతో కంగుతిన్న పాఠశాల సిబ్బంది స్థానిక నాయకులు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు పంపిన పశువుల దాణాను స్వాధీనం చేసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు .. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, 58 మంది విద్యార్థులున్న ఈ పాఠశాల పుణె మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో నేరుగా మిడ్ డే మీల్స్ సరుకులను విద్యార్థుల ఇంటికి చేరవేయాలని కార్పోరేషన్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సరుకుల రవాణాలో పొరపాట్ల మూలంగా తాజా ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంపై పుణె నగర మేయర్ మాట్లాడుతూ.. ‘కార్పోరేషన్ పాఠశాల విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వస్తువులను సరఫరా చేయడమే మా బాధ్యత. పాఠశాలకు పశువుల దాణాను పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. (చదవండి: పుణేలో కోవిడ్ ఆంక్షలు) -
జొన్న విత్తు.. రికార్డు సొత్తు
సాక్షి, హైదరాబాద్: ఇక్రిశాట్ సహకారంతో అభివృద్ధి చేసిన జొన్నపంట దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. పాడి రైతులకు చౌకగా పశుగ్రాసం అందించేందుకు నమూనా వంగడంగా జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం దీన్ని గుర్తించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్), ఉత్తరాఖండ్‌లోని జీబీ పంత్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం జన్యు వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఇక్రిశాట్ వంగడం ఐసీఎస్ఏ 467, పంత్ చారి–6 రకాల వంగడాలు రెండింటినీ కలిపి సీఎస్హెచ్ 24 ఎంఎఫ్ పేరుతో దీన్ని అభివృద్ధి చేశారు. జొన్న చొప్పను పలుమార్లు కత్తిరించి వాడుకునే అవకాశముండటం దీని ప్రత్యేకత. అతితక్కువ నీటితోనే ఎక్కువ గ్రాసాన్ని ఇవ్వగలదు. వేసవిలో నీటి ఎద్దడి ఉన్నప్పుడు కూడా పశువులకు తగినంత పచ్చి ఆహారాన్ని అందించవచ్చని దీన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే దీనిని దేశవ్యాప్తంగా పలువురు రైతులు విజయవంతంగా వాడుతున్నారని చెప్పారు. ఈ పంట కేవలం పశుగ్రాసం కోసం మాత్రమే వాడతారని, జొన్న గింజలు రాకమునుపే కత్తిరించేస్తారని ఆయన స్పష్టం చేశారు. జొన్న పంటపై చేపట్టిన జాతీయ కార్యక్రమంలో దీనికి ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. కొత్త హైబ్రిడ్ జొన్న వంగడాలు తయారు చేయాలంటే.. సీఎస్హెచ్–24ఎంఎఫ్‌ను నమూనాగా ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్దేశించారు. దీనికి ఉన్న డిమాండ్ ఎంత అంటే.. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఏటా 10 నుంచి 12 కొత్త కంపెనీలకు గ్రాసం విత్తనాల సాగుకు లైసెన్స్ ఇచ్చేంత! పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారత్‌ను పశుగ్రాసం కొరత చాలా తీవ్రంగా వేధిస్తోంది. ఓ అంచనా ప్రకారం దేశంలో ఏటా దాదాపు 132.57 కోట్ల టన్నుల పశుగ్రాసం (పచ్చి, ఎండు) అవసరముండగా.. 35 శాతం తక్కువగా కేవలం 97.87 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. తాజా వంగడంతో పశుగ్రాసం కొరత తీరనుంది. -
మేత కరువు
కడప సెవెన్ రోడ్స్/రాయచోటి రూరల్ : జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో పశువుల మేత తీవ్ర సమస్యగా మారింది. వానలు పడక పచ్చిమేపు ఎలాగూ లేకపోయినా, రైతుల వద్ద ఒట్టిమేపు కూడా అయిపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారు. కడప, చెన్నూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు పెట్టి గ్రాసాన్ని తెచ్చుకుంటున్నారు. మేత తక్కువ కావడంతో పాల దిగుబడి కూడా తగ్గుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే అయినకాడికి పశువులను తెగనమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల ప్రత్యామ్నాయ ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. బాటనీ, జువాలజీ మంత్రులమంటూ చెప్పుకునే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి సొంత పనుల్లో నిమగ్నమై తమ గోడు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలలో ఏ రైతును కదిలించినా ప్రస్తుతం పశుగ్రాస కొరత గురించే చెబుతున్నారు. ఎందుకంటే చాలామంది చిన్న, సన్నకారు రైతులకు పాడి పశువులే ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. పాడి పశువులను పోషిస్తే అవి తమ కుటుంబాలను పోషిస్తాయని రైతులు అంటున్నారు. అందుకే కనీసం ఎకరా, అర ఎకరంలో పశుగ్రాసాన్ని సాగు చేస్తుంటారు. ఒక్కో ఆవుకు రోజుకు అర కిలో తవుడు, కిలో ఫీడ్, పచ్చి మేత, ఎండు మేత వేస్తారు. అంతా కలిపితే రూ.150లు ఖర్చు వస్తోంది. రోజుకు ఒక్కో ఆవు సగటున 16 లీటర్ల పాలు ఇస్తోంది. లీటరు ధర సగటున రూ.23ల నుంచి రూ.25లు ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ప్రకారం రూ.368లు వస్తోంది. అందులో ఖర్చు తీసేస్తే నికరంగా రోజుకు ఒక్కో ఆవు ద్వారా రూ.200లు ఆదాయం ఉంటుందని వివరిస్తున్నారు. ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో పచ్చి మేత ఎక్కడా లేదు. బోర్ల కింద ఎక్కడైనా ఇంకా అరకొరగా ఉంటే, రోజురోజుకు నీటి మట్టం అడుగంటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వట్టి మేత కూడా రైతుల వద్ద అయిపోయింది. దీంతో కడప, చెన్నూరు, వేంపల్లె తదితర ప్రాంతాలనుంచి తెచ్చుకుంటున్నారు. ఎకరా పొలంలో ఉండే ఎండు గడ్డి రూ.7 వేలు చెబుతున్నారని తెలుస్తోంది. ట్రాక్టర్‌కు గడ్డి ఎత్తే కూలీలకు రూ.1500లు, ట్రాక్టర్ బాడుగ రూ.3వేలు కలుపుకుంటే రూ.12వేలు ఖర్చు వస్తోందని రైతులు అంటున్నారు. అదే వేరుశనగ కట్టె అయితే సుమారు రూ.18వేలు అవుతోందని చెబుతున్నారు. ఈ ప్రాంతాలలోని రైతులకు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమ, ఉపాధి పనులు ప్రధాన జీవనాధారంగా ఉన్నాయి. ప్రభుత్వం తమ గోడును ఆలకించి పశుగ్రాసాన్ని సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. గతంలో మాదిరిగా క్యాటిల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో ఆవులు 59,580, ఎనుములు 50502, గొర్రెలు 4862, మేకలు 110422 ఉన్నాయి. ప్రస్తుతం 32,940 మెట్రిక్ టన్నుల గడ్డి కొరత ఏర్పడిందని పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ జయకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక కింద 1300 మెట్రిక్ టన్నుల దాణా, వెయ్యి బేళ్ల సైలేజీ (మాగుడు గడ్డి), 70 క్వింటాళ్ల గడ్డి విత్తనాలు, 390 మెట్రిక్ టన్నుల టీఎంఆర్ (దాణా మృతం) రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలకు అవసరమని పేర్కొన్నారు. గొర్రెలకు మేపు అందించండి నేను 3ఎకరాలు కౌలుకు పొలం తీసుకున్నాను. నారు కూడా వేశాను. వాన కోసం ఎదురుచూస్తున్నాను. ఇది కాకుండా 30 గొర్రెలు కూడా పెంచుకుంటున్నాను. ఎక్కడా మేత లేకపోవడంతో చాలా కష్టంగా ఉంది. మనుషులు తాగేందుకు నీరులేని పరిస్థితి వస్తోంది. దీంతో పశువులకు నీటిని తాపితే మనుషులకు తక్కువ వస్తున్నాయి. ఇంకా పది, 15రోజులు వర్షాలు పడకపోతే గొర్రెలు అమ్ముకోవాల్సిందే. 5ఏళ్ల క్రితం పశువుల ఆసుపత్రిలో రోజుకు 15కిలోల గడ్డి ఉచితంగా ఇచ్చారు. మళ్లీ అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే గొర్రెల కాపరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మేకలైతే ఆకులు, అలుములు తింటాయి. కానీ గొర్రెలు గడ్డి మాత్రమే తింటాయి. కనుక ప్రధానంగా మాకే సమస్య వస్తోంది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు ఎస్.రెడ్డప్ప. ఈయనది సంబేపల్లె మండలం బొగ్గులవారిపల్లె. ఇతనికి 50గొర్రెలు ఉన్నాయి. ఇవే ఆయనకు ఉన్న ఆస్తి. వీటి పెంపకమే ఆయన జీవనాధారం. ఇప్పటిదాకా చుక్క వాన లేదు. కను చూపుమేరలో ఎక్కడా గడ్డి పరకైనా లేదు. దీంతో జీవాలకు మేత కరువైంది. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా రైతుల వద్ద గ్రాసంలేదు. దీంతో చిత్తూరు జిల్లాకు వెళ్లి రూ.15వేలు ఖర్చు చేసి ఒక ట్రాక్టర్ వేరుశనగ కట్టె తీసుకొచ్చారు. పగటిపూట గొర్రెలను అలా బయటకు తోలుకెళుతాడు. బయట ఎక్కడా మేత మేయకపోయినా.. అవి తిరిగి వస్తాయి. సాయంత్రం ఇంటికి తోలుకు వస్తాడు. ఒకప్పుడు గంపలు.. గంపలు వేరుశనగ, ఉలువ పొట్టు వేసి మేపుతుండేవాడు. ట్రాక్టర్ మేపు నెల తిరగకముందే అయిపోయింది. ఇప్పుడేం చేయాలి భగవంతుడా అని బాధపడుతున్నాడు. పక్కనే ఉన్న దుర్గంబోయపల్లెకు చెందిన కొందరు గొర్రెల కాపరులు తమ మందలను తీసుకుని మైదుకూరుకు వెళ్లారు. ‘‘ఇంకా వారం, పది రోజులు దాటితే నేను కూడా ఏదో ఒక దిక్కుకు వెళ్లాల్సిందే.. మేత కోసం మూగ జీవాలు పడుతున్న అవస్థలు చూస్తుంటే మాకు ముద్ద దిగడంలేదు. జీవాలు బాగుంటేనే మేం బాగుంటాం.. ప్రభుత్వం దయ చూపి వేరుశనగ కట్టె, ఉలువ పొట్టు పంపిణీ చేస్తే చాలా మేలు చేసినట్లవుతుంది’’ అంటూ ఆయన సాక్షి వద్ద తన గోడు వెల్లబోసుకున్నాడు. నెత్తిపై గడ్డి మోపుతో కనిపిస్తున్న ఈ రైతు పేరు పాలేటి. చిన్నమండెం మండలం జల్లవాండ్లపల్లెకు చెందిన రైతు. ఈయనకు 2ఎకరాల వర్షాధార భూమి ఉంది. వేరుశనగ సాగు చేస్తాడు. విత్తనాలు కూడా సిద్ధం చేసుకున్నాడు. వర్షం లేకపోవడంతో పంట వేయలేదు. భూమిపైనే ఆధారపడకుండా రెండు జెర్సీ ఆవులు మేపుతున్నాడు. ఆవులే ఆయనకు ప్రధాన జీవనాధారమయ్యాయి. చుట్టు పక్కల ఎక్కడా మేపు లేకుండా పోయింది. ట్రాక్టర్ రూ.12వేలు ఖర్చుచేసి వరి గడ్డి కొనుగోలు చేశాను. ఇప్పుడు ఆ గడ్డి కూడా అయిపోవస్తోంది. ఇక ఏమి చేయాలో పాలుపోవడంలేదు. మేతలేక పాల దిగుబడి కూడా తగ్గిపోతోంది. ఇంకా కొన్ని రోజులు వానలు పడకపోతే ఉన్న ఆవులను అయిన కాడికి అమ్ముకోవాల్సిందే అంటూ తన ఆవేదనను వెలిబుచ్చాడు. -
బహువార్షిక పప్పుజాతి పశుగ్రాసం..స్టైలో
► బంజరు భూములు,పండ్లతోటల సాగుకు అనుకూలం ► ఎకరం సాగులో 50 గొర్రెలకు,ఏడాది పాటు మేత ► స్టైలో విత్తనాలకు 75 శాతం ప్రభుత్వ సబ్సిడీ కొందుర్గు(షాద్‌నగర్): స్టైలో బహువార్షిక పప్పుజాతి పశుగ్రాసం సాగు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బంజర భూములు, పండ్లతోటలు, తేలిక, ఇసుక నేలలు, వ్యవసాయానికి పనికిరాని పొలాల్లో దీన్ని సాగుచేసుకోవచ్చు. అత్యల్ప వర్షాలకు కూడా గడ్డి సాగు చేసుకోవచ్చు. బంజర భూములు, తోటలలో సాగుచేయడం వల్ల భూసారం పెరుగుతుంది. స్టైలో రకాలు.. సాగు పద్ధతి స్టైలో పప్పుజాతి గడ్డిలో స్టైలో హెమాటా, స్టైలో స్కబ్రా, స్టైలో జెనెసిన్ రకాలు ఉంటాయి. వర్షాధారం అయితే జూన్, జులై మాసాల్లో సాగు చేయాలి. నీటిపారుదలతో అయితే ఫిబ్రవరి, మార్చి మాసాల్లో సాగుచేసుకోవచ్చు. సాదారణ నేలలో అయితే ఎకరాకు 10 కిలోల విత్తనాలు, తోటలలో అయితే 4 నుంచి 5 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తనాలు విత్తేముందు 85 డిగ్రీ సెంటిగ్రేట్ వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి ఆరబెట్టాలి. దుక్కిని చదునుచేసి నేలలో ఒక సెంటీమీటర్ లోతులోనే విత్తనాలు పడేట్లుగా ఎదచల్లాలి. అనంతరం విత్తనాలపై మట్టి పడేలా చేయాలి. స్టైలో పశుగ్రాసం సాగు చేయడానికి ఎరువులు అవసరం లేదు. ఎకరం సాగు చేస్తే ఏడాది వరకు 50 గొర్రెల మేతకు సరిపోతుంది. ఏడాదిలో 8 నుంచి 10 కోతలు స్టైలో విత్తనాలు సాగుచేసిన అనంతరం 50 రోజుల్లో మొదటిసారిగా కోతకొస్తుంది. ఏడాదిలో 8 నుంచి 10 కోతలు కోసుకోవచ్చు.ఒకసారి సాగుచేస్తే నాలుగు నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. వర్షాకాలంలో విత్తనాలు పొలంలో రాలే విధంగా గడ్డిని కోసుకుంటే మరుసటి ఏడాది గడ్డి విస్తారంగా పెరిగే అవకాశం ఉంటుంది.పాడిపశువులకు ఈ పశుగ్రాసాన్ని రోజుకు 2 కిలోల చొప్పున ఇతర మేతలతో కలిపి వేయాలి. స్టైలో పశుగ్రాసంలో జీర్ణమయ్యే మాంసకృత్తులు 12.15 శాతం, శక్తినిచ్చే పోషకాలు 60 శాతం, కార్బోహైడ్రెట్స్ 2 శాతం ఉంటాయి. ఈ మేతతో గొర్రెలు, మేకలు, పాడిపశువులకు ఆరోగ్యకరంగా ఉంటుంది. పాడిపశువులు సమృద్ధిగా పాలిస్తాయి.ప్రభుత్వం స్టైలో విత్తనాలను 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. ఈ పశుగ్రాసం సాగు చేయడానికి ఇష్టపడుతున్న రైతుల వివరాలను నమోదు చేసుకుంటున్నాం. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, అటవీ భూములు, బంజరు భూముల వివరాలను సర్వే చేస్తున్నాం. – డాక్టర్ విష్ణువర్ధన్‌గౌడ్, చౌదరిగూడ పశువైద్యాధికారి -
మేత..మోత
► మూగజీవాల గ్రాసం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు ► వరిగడ్డి, కంది, వేరుశనగ పొట్టుకు డిమాండ్ పెంచిన వైనం ► ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుకు వెనకాడని పాడిరైతులు హన్వాడ : రోజురోజుకు ఉష్ణోగ్రతలు మారుతున్నకొద్దీ ఎండాకాలం ముంచుకొస్తుంది. పెనంలా మాడే ఎండల కారణంగా మూగజీవాలు రాబోయే రోజుల్లో మేతకు అలమటించనున్నాయి. ఈ పరిస్థితిని ముందే పసిగడుతున్న కాపరులు ముందస్తు మేతలను నిల్వ చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇందుకు ఆయా పొలాల రైతుల నుంచి పశువుల మేతకోసం వరి, జొన్నచొప్పలను తీసుకుంటున్నారు. వీటితోపాటు మేకలు, గొర్రెల మేతకోసం కంది, వేరుశనగ పొట్టులను కొనుగోలు చేస్తున్నారు. దీన్ని గుర్తించిన పలువురు రైతులు, మూగజీవాల రైతుల నుంచి అధిక మొత్తంలో ఆశించేందుకు అమాంతం రేట్లు పెంచేస్తున్నారు. దీంతో మూగజీవాల మేత కోసం ఎంతకైనా సరేనని పాడిరైతులు కొనుగోలుకు వెనుకాడటంలేదు. భారంగామారిన గ్రాసం: మూగజీవాల మేతకోసం పాడిరైతులు, మేకలు, గొర్రెల కాపర్లకు కష్టాలు మొదలయ్యాయి. మండలంలో పలువురు గొర్రెలకాపర్లు ఈపాటికే ఇతర ప్రాంతాలకు మేతల కోసం, గొర్రెల తరలింపు కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరు రైతులు ఇక్కడే ముందస్తు మేతను సమకూర్చుకుంటున్నారు. ఇందుకోసం వేరుశనగ పొట్టును ఎకరానికి రూ.8నుంచి రూ.10వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మండలంలో మొత్తం 30వేల గొర్రెలు, 10వేల వరకు మేకలున్నాయి. అయితే వీటన్నింటికీ ముందస్తు మేత సమకూర్చుకోవాలంటే ఈ రబీలో 800ఎకరాల్లో సాగైన వేరుశనగ పొట్టును కొనుగోలు చేసినా.. వాటికి సరిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఓ వైపు వేరుశనగకు సరైన నీరందక దిగుబడి కూడా తగ్గడంతో రైతులు కనీసం పొట్టుతోనైనా లోటును పూడ్చుకోవాలనే ఆలోచనతో ఎకరానికి రూ.8నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తుండటంతో.. కాపర్లు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయక తప్పడంలేదు. ఇదిలా ఉండగా పాడిరైతులకు మాత్రం ప్రభుత్వం 75శాతం రాయితీతో జొన్నవిత్తనాలు విక్రయిస్తోంది. మండలంలో మొత్తం 40వేలకు పైగా ఉన్న పాడి సంపదకు ఇప్పటివరకు పశువైద్య సిబ్బంది 1300ల కిలోల జొన్నవిత్తనాలను విక్రయించారు. మరికొందరు రైతులు 1010రకం వరిగడ్డిని ట్రాక్టర్‌లోడుకు రూ.7నుంచి 9వేలు వెచ్చిస్తున్నారు. హంసరకం వరిగడ్డిని పశువులు ఇష్టంగా తినడంతో దీనికి ట్రాక్టర్‌లోడుకు రూ.12వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. -
మేత లేక.. మేప లేక..
♦ కరువు కాటుకు పశువులు విలవిల ♦ దొరకని పశుగ్రాసం.. పెరిగిన గడ్డి ధర ♦ మేపలేక అమ్మకానికి మొగ్గు ♦ కొనుగోలు చేసేవారూ కరువు ♦ దక్కని ప్రభుత్వ చేయూత ఆందోళనలో రైతాంగం కరువు ధాటికి గొడ్డూగోదా విలవిల... రెండేళ్లుగా సరైన వర్షాలు లేక ఎండిపోయిన చెరువులు, కుంటలు... వట్టిపోయిన బోర్లు.. వరిసాగు లేక పశు గ్రాసం కరువు... పంటలు లేక కూలీలుగా మారిన రైతులు. పూటగడవడమే కష్టం... పశువులను మేపే పరిస్థితి లేదు. గ్రాసం అందక ప్రాణాలు పోయే పరిస్థితిలో పశువులు. వాటి గోస చూడలేక అమ్మేందుకు మొగ్గు చూపుతున్న దుస్థితి... అటు పశువులను కొనే వారూ కరువు... వాటిని మేపలేక.. అమ్మలేక తల్లడిల్లుతున్న రైతులు.. సర్కార్ చేయూత లేక దయనీయ స్థితిలో అన్నదాతలు. - నర్సాపూర్ గ్రాసం పెట్టలేక అమ్ముకుంటున్నా... నాకు ఆరెకరాల పొలం ఉంది. కరువుతో బోరు ఎండి వ్యవసాయం సాగడం లేదు. పొట్టకూటి కోసం ఉపాధి పనులకు పోతున్నాం. గడ్డి ధరలు కూడా పెరిగాయి. కొనుగోలు చేసి పశువులకు గడ్డి పెట్టే పరిస్థితి లేదు. తూర్పు కోడెలను అమ్మేందుకు నర్సాపూర్ అంగడికి తీసుకుపోతున్నా. మూడు గేదెలు ఉన్నాయి. వాటికీ గ్రాసం పెట్టనందున పాలు తక్కువ ఇస్తున్నా యి. ఎంతో ప్రేమతో పెంచుకు న్న ఎడ్లను అమ్మాల్సి వస్తుం ది. గతంలో సరైన ధర రాలేదు. ఇప్పుడు మళ్లీ ప్రయత్ని స్తున్నా. - అర్జున్, హత్నూర కరువు ప్రభావం పాడి పశువులపైనా పడింది. కరువు పరిస్థితులు రోజురోజుకు రైతన్నలను కుంగదీస్తున్నాయి. రైతులు తమ ప్రాణపదంగా పెంచుకునే పశువులకు సరిపడా పశుగ్రాసం పెట్టలేకపోతున్నారు. వాటి గోసను చూడలేక అమ్ముకుంటున్నారు. ఎక్కడ చూసినా అంగట్లో విక్రయానికొచ్చిన పశువులే కన్పిస్తున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు లేక... బోర్లు ఎండిపోవడంతో పంటలు పండలేదు. అదే సమయంలో పశువులకు గడ్డి సైతం దొరకని పరిస్థితి. ఒకప్పుడు బక్కచిక్కిన, వ్యవసాయ పనులకు పనికిరాని పశువులనే అంగట్లో అమ్మేవారు. తాజాగా పశువులకు మేత, నీటిని అందించే పరిస్థితి లేక రైతులు అమ్ముకుంటున్నారు. నర్సాపూర్ సంతకు జిల్లాలోని పలు మండలాల నుంచి రైతులు తూర్పు కోడెలు, పడమట కోడెలతోపాటు చిన్న వయస్సులో ఉన్న కోడెలను, ఇతర ఎడ్లను అమ్మేందుకు తీసుకొస్తున్నారు. గడ్డి కూడా భారమే... గడ్డి ధర విపరీతంగా పెరిగిందని, గడ్డి మోపు ధర రూ.వంద నుంచి రూ.125 వరకు పలుకుతుందని రైతులు అంటున్నారు. గడ్డి కొనలేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. వరి సాగు చేయనందున గడ్డి కరువైందని, అందుకే ధర విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. ధర పెరిగినా ప్రభుత్వం నుంచి పశుగ్రాసం సరఫరా చేసే విషయంలో తమకు ఎలాంటి మద్దతు లభించడం లేదని అంటున్నారు. తాము తినడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రాణపదంగా చూసుకునే పశువులకు గడ్డి, ఇతర గ్రాసం పెట్టలేకపోతున్నామని కన్నీరు కారుస్తున్నారు. వాటిని చంపుకోలేక అమ్ముకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు. కాగా పశువులను పోషించే స్థోమత లేక కొందరు రైతులు ఆరోగ్యంగా ఉన్న పశువులను సైతం అంగడికి తరలిస్తున్నారు. అంతటా కరవు ఉన్నందున వ్యవసాయం సాగక పశువుల వినియోగం తగ్గడం వల్ల వాటిని కొనేవారు కరువయ్యారు. -
రైతుకు రాయితీ.. పశువుకు గ్రాసం!
♦ కరువులో ఆలమందల పోషణకు ప్రత్యేక పథకం ♦ వందశాతం రాయితీతో సాగవుతున్న పశుగ్రాసం ♦ ఒక్కో రైతుకు రెండెకరాల విస్తీర్ణం వరకు ఉచితం ♦ సద్వినియోగంలో రాష్ట్రంలో జిల్లా మొదటిస్థానం కరువు దాటికి రైతన్నలు మూగజీవాలను సాకలేక బలవంతంగా వదిలించుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా సాగునీటి వనరులు పూర్తిగా అడుగంటడం.. వరుసగా ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో కష్టజీవి ఆర్థికంగా చితికిపోయి పశువులకు గ్రాసం కూడా అందించలేని దుస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పశుసంవర్ధక శాఖ వందశాతం రాయితీతో పశుగ్రాసం విత్తనాలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. కొద్ది మొత్తంలో నీటి సౌకర్యం ఉన్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ పశుగ్రాసం సమస్యను అధిగమిస్తున్నారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో పశుసంపద 5.82 లక్షలు. సాగునీటి వనరులు లేకపోవడంతో జిల్లాలో కరువు ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులు.. పశువులను సాకలేక అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథ కానికి అనుసంధానం చేస్తూ ‘రైసింగ్ ఆఫ్ ఫాడర్ ప్లాట్స్ ఫర్ డ్రౌట్ మిటిగేషన్’ పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా పశుగ్రాసం సాగుకు ఉచితంగా విత్తనాలు అందించడంతోపాటు సాగుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఆర్థిక చేయూత ఇస్తోంది. ఎకరా పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం రూ.11,434 ఖర్చు చేస్తోంది. ఈ అంశంపై అవగాహన కల్పించడంతో రైతులు జిల్లాలో ఇప్పటివరకు 1,082 ఎకరాల్లో పశుగ్రాసాన్ని సాగుచేశారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.1.237 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో పశుగ్రాసాన్ని సాగు చేసి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచే మొదలు. జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు వి.వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పశుగ్రాసం సాగుపై ఓ ప్రణాళిక తయారుచేసి ప్రభుత్వానికి నివేదించారు. తక్కువ నీటిని వినియోగించి జొన్నరకం గడ్డిని సాగుచేసే విధానాన్ని ఇందులో పొందుపరిచారు. దీన్ని పరిశీలించిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉచిత పశుగ్రాసం సాగుకు పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా గ్రాసం సాగును ప్రోత్సహించాలని సూచించింది. కొద్దిపాటి నీటి సౌకర్యంతోపాటు జాబ్‌కార్డు ఉన్న పాడిరైతుకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,702 ఎకరాల్లో పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.2 కోట్లు ఖర్చు చేసింది. పేద పాడిరైతులు ముందుకొస్తే సంఖ్యతో సంబంధంలేకుండా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుస్తామని, రైతులనుంచి డిమాండ్ కూడా పెరుగుతోందని రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. గడ్డి దొరకడం కష్టంగా ఉంది కరువు కాలంలో పాడిపశువులకు గడ్డి దొరకడం కష్టంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన గడ్డి విత్తనాలు తీసుకున్నా. ఉ పాధిహామీ కింద పశుగ్రాసాన్ని పెంచుతున్నా. నాకు పది గేదెలున్నాయి. పచ్చిగడ్డి వేయడంతో రోజుకు పొద్దు, మాపు 60 లీటర్ల పాలు ఇస్తున్నాయి. గడ్డి విత్తనాలు నాణ్యమైనవి కావడంతో దిగుబడి బాగుంది. - రమావత్ కృష్ణ, పాడి రైతు, కేవీ తండా, ఇబ్రహీంపట్నం వృథా నీటితో గడ్డి పెంచుతున్నా పశుసంవర్ధక శాఖ అధికారుల సలహా మేరకు వృథా నీటితో గడ్డి పెంచుతున్నా. ఎకరా పొలంలో గడ్డి వేసిన. ఆరు పాడి పశువులకు ఈ గడ్డి సరిపోతుంది. రోజుకు 30 లీటర్ల పాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం నేను సాగు చేస్తున్న గడ్డి రకం పేరు కేటు. - భిక్షపతి, పాడి రైతు, ఇబ్రహీంపట్నం -
పశువులమేతగా కుళ్లిన బిర్యాని
-
నిబంధనల ప్రకారమే నడుచుకుంటాం
కరువు బృందం ప్రకటన జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటన సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ఏర్పడిన కరువును పరిశీలించిన కేంద్ర బృందం నిబంధనల మేరకే నడుచుకుంటామని, ఆ పరిధుల్లోనే ఆదుకుంటామని ప్రకటించింది.కేంద్ర కరువు బృందం సభ్యులు పీఎస్ఎన్ చక్రవర్తి, పీజీఎస్ రావు, గోవర్ధన్‌లాల్‌లు గురువారం పొన్నలూరు, పీసీపల్లి, కనిగిరి, సీఎస్‌పురం, పామూరు మండలాల్లో పర్యటించారు.ముందుగా పొన్నలూరు మండలంలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పరిశీలించారు. ఆయకట్టు వివరాలు, సాగునీరు అందకపోవడానికి కారణాలను, కరవు వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పశుగ్రాసం, తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని, చెరువులో నీరు లేకపోవడంతో పశువులకు పశుగ్రాసం లేక పాల ఉత్పత్తి తగ్గిందని, గతంలో గేదెకు పది లీటర్లు పాలు ఇచ్చేవని, పశుగ్రాశం లేక ఇప్పడు మూడు లీటర్లే ఇస్తున్నాయని చెప్పారు. కదిరి మండలం గోపాలపురం రిజర్వాయర్‌ను పరిశీలించారు. గత రెండు సంవత్సరాలుగా వర్షాలు లేక రిజర్వాయర్ నిండలేదని స్థానికులు వివరించారు. అనంతరం పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయరును పరిశీలించింది. మోపాడు రిజర్వాయర్‌కు గత నాలుగు సంవత్సరాలుగా నీరు చేరడంలేదని దీంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఆప్పుల ఊబిలో కూరుకుపోవడంతోపాటు, పనులులేక 30 శాతానిపైగా వలసలు పోయారని బందం సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు విన్నవించారు. గత రెండేళ్లలో వందల ఎకరాల్లో బత్తాయి, నిమ్మతోటలు నిలువునా ఎండిపోయాయని, వేల ఎకరాల మాగాణి, మెట్ట భూములు బీడుభూములుగా మారాయని వెలిగొండ నీరువస్తే తప్ప మరో మార్గం లేదని పేర్కొన్నారు. కరువును కళ్లారాచూశాం కరువుపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర కరువు పరిశీలన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వెలిగండ్ల మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిన బత్తాయి తోటలను పరిశీలించారు. -
కబేళాలకు మూగజీవాలు
ప్యాపిలి, న్యూస్‌లైన్: వర్షాభావ పరిస్థితుల కారణంగా అడవుల్లో పచ్చగడ్డి జాడ కరువైంది. పాడి పశువులకు గ్రాసం కొరత ఏర్పడటంతో బక్కచిక్కి పోతున్నాయి. వేసవి ప్రారంభానికి ముందే చెరువులు ఎండిపోవడంతో పశువులకు నీటి కొరత ఏర్పడింది. ఎండలు భగభగ మండిపోతుండటంతో మూగజీవాలు పశుగ్రాసం లేక విలవిలలాడుతున్నాయి. మండల కేంద్రంతో పాటు కౌలుపల్లి, బూరుగల, రాచర్ల, బోంచెర్వుపల్లి, సీతమ్మతాండ, గార్లదిన్నె, పీఆర్ పల్లి, గుడిపాడు, కొమ్మేమర్రి, సిద్దనగట్టు, జలదుర్గం, చిన్నపూదెళ్ల, పెద్దపూదెళ్ల తదితర గ్రామాల్లో ఎక్కువ శాతం మంది రైతులు పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పశువులకు ప్రస్తుతం పశుగ్రాసం కొరత ఏర్పడటంతో పశుపోషకులు అందోళన కు గురవుతున్నారు. గతేడాది వర్షాలు అంతంత మాత్రంగానే కురవడంతో చెరువులు, కుంటలకు ఆశించిన నీరు చేరలేదు. పశుగ్రాసం కొనాలన్నా చేతిలో డబ్బులు లేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాక్టర్ వరి గడ్డి రూ. 7 నుంచి 10 వేలు పలుకుతోందని రైతులు వాపోతున్నారు. పశుగ్రాసం కొనలేక విధిలేని పరిస్థితుల్లో పశువులను కబేళాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.