పాడి రంగానికీ ఆర్బీకేల దన్ను | RBK Centres Distribution of fodder and whole mixed feed on subsidy | Sakshi
Sakshi News home page

పాడి రంగానికీ ఆర్బీకేల దన్ను

Published Mon, May 9 2022 5:37 AM | Last Updated on Mon, May 9 2022 6:20 PM

RBK Centres Distribution of fodder and whole mixed feed on subsidy - Sakshi

అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామానికి చెందిన ఇతడి పేరు ఉయ్యూరు రామనరేష్‌. రెండు గేదెలు, రెండు ఆవులున్నాయి. గతంలో మార్కెట్‌లో దొరికే నాసిరకం దాణా వినియోగించటం వల్ల ఆశించిన స్థాయిలో పాల దిగుబడి వచ్చేది కాదు. పైగా పశువులు తరచూ అనారోగ్యం బారిన పడేవి. దీంతో ఆర్బీకేల ద్వారా ఇస్తున్న నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్‌) తీసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతడి పశువులు రోజుకు 1–2 లీటర్ల పాలను అధికంగా ఇస్తున్నాయి. ఆ పాలలో వెన్న శాతం కూడా పెరగడంతో మంచి ఆదాయం వస్తోందని, తానిప్పటి వరకు కిలో రూ.6.50 చొప్పున 200 కిలోల టీఎంఆర్‌ తీసుకున్నానని రామనరేష్‌ ఆనందంతో చెబుతున్నారు.

సాక్షి, అమరావతి: పాడి పశువులకు నాణ్యమైన పశుగ్రాసం, దాణా అందిస్తే అధిక దిగుబడితోపాటు నాణ్యమైన పాలను ఇస్తాయి. మరోవైపు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయి. నాణ్యమైన పాల దిగుబడి వస్తే పాడి రైతుల ఆదాయానికి ఢోకా ఉండదు. ఇన్నాళ్లూ పశుగ్రాసం, దాణా కోసం పాడి రైతులు పాట్లు పడేవారు. వాటికి చెక్‌ పెడుతూ ఏడాదిగా ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్న పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్‌), నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమాలు, లివర్‌ టానిక్స్‌ తదితర పోషక మిశ్రమాలతోపాటు గడ్డి కత్తిరించే యంత్రాలు (చాప్‌ కట్టర్స్‌) వంటి వాటిని సబ్సిడీపై ఇస్తుండటంతో రైతుల వెతలు తీరుతున్నాయి. ఇందుకోసం పశు సంవర్ధక శాఖ 11ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుంది. 

సర్టిఫై చేసిన పశుగ్రాసం.. సంపూర్ణ మిశ్రమ దాణా 
పశుగ్రాసం కొరతకు చెక్‌ పెట్టేందుకు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన జొన్న (సీఎస్‌హెచ్‌–24 ఎంఎఫ్‌ రకం), మొక్కజొన్న (ఆఫ్రికన్‌ టాల్‌ రకం) పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదిలో 1.41 లక్షల మంది రైతులకు రూ.15.81 కోట్ల విలువైన 1,500 టన్నుల జొన్న, 489 టన్నుల మొక్కజొన్న పశుగ్రాస విత్తనాలు సరఫరా చేసింది. వీటిని 1,05,531 ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 4.21 లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసాన్ని రైతులు ఉత్పత్తి చేసుకుని పశుగ్రాసం కొరతను అధిగమించారు.

మరోవైపు అత్యంత పోషక విలువలు గల సంపూర్ణ మిశ్రమ దాణాæ(టీఎంఆర్‌)ను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తోంది. దీనిని వాడటం వల్ల పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఇతర దాణాలేవీ పెట్టాల్సిన అవసరం ఉండదు. సర్టిఫై చేసిన మిశ్రమ దాణా కిలో రూ.15.80 కాగా.. రైతులకు సబ్సిడీపై రూ.6.50కే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రతి పాడి రైతుకు రెండు నెలలకు ఒకసారి 60 శాతం సబ్సిడీపై గరిష్టంగా 1,800 కిలోల చొప్పున ఇస్తోంది.

ఇప్పటివరకు రూ.29.43 కోట్ల విలువైన 18,625 మెట్రిక్‌ టన్నుల టీఎంఆర్‌ దాణాను 46,563 మంది రైతులకు పంపిణీ చేసింది. మరోవైపు పశుగ్రాసం వృథాను అరికట్టేందుకు ఆర్బీకేల ద్వారా 40 శాతం రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాలు అందిస్తోంది. 2 హెచ్‌పీ 3 బ్లేడ్‌ చాప్‌ కట్టర్‌ ఖరీదు రూ.33,970 కాగా, సబ్సిడీ పోనూ రూ.20,382కే ఇస్తోంది. ఇప్పటివరకు రూ.4.52 కోట్ల విలువైన 2,173 చాప్‌ కట్టర్స్‌ను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది.

3 టన్నుల టీఎంఆర్‌ తీసుకున్నా
గతంలో నాణ్యమైన దాణా దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఆర్బీకే ద్వారా ఇప్పటివరకు 3 టన్నుల టీఎంఆర్‌ తీసుకున్నా. బుక్‌ చేసుకున్న వారం లోపే అందిస్తున్నారు. దీని వినియోగంతో పాల దిగుబడి, నాణ్యత కూడా పెరిగింది. 
– పద్మజా భాను, దేవికొక్కిరపల్లి, యలమంచిలి

పశుగ్రాసం వృథా కావడం లేదు
నాకు 12 గేదెలు, 3 ఆవులు, 4 దూడలు ఉన్నాయి. మాది కరువు ప్రాంతం కావడంతో పశుగ్రాసం కొరత ఎక్కువ. దూరప్రాంతాల నుంచి పశుగ్రాసం తెచ్చుకున్నా చాలావరకు వృథా అయ్యేది. 2 హెచ్‌పీ సామర్థ్యం గల చాప్‌ కట్టర్‌ కోసం ఆర్బీకేలో బుక్‌ చేశా. దీన్ని ఉపయోగించడం వల్ల పశుగ్రాసం వృథా కావడం లేదు. 
– డి.మోహన్‌దాస్, వీరుపాపురం, కర్నూలు జిల్లా

ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఇన్‌పుట్స్‌ సరఫరా
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం మేరకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన, సర్టిఫై చేసిన పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, ఖనిజ లవణ మిశ్రమాలతో పాటు గడ్డి కత్తిరించే యంత్రాలు సబ్సిడీపై అందిస్తున్నాం. వీటివల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. పాల దిగుబడితో పాటు నాణ్యత కూడా పెరిగిందని రైతులు చెబుతున్నారు.
– ఆర్‌.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement