
రైతు భరోసా కేంద్రం స్థానంలో ఏర్పాటు చేసిన కాళ్ల పోలీస్ స్టేషన్
రైతు భరోసా కేంద్రాలను పోలీస్‌స్టేషన్లుగా మార్చుతున్న వైనం
రైతన్నకు అన్యాయం.. కూటమి సర్కార్ నిర్వాకం
విత్తు నుంచి విక్రయం వరకు అండగా నిలిచిన ఆర్బీకేలు ఇక కనుమరుగు
ఉండి, కాళ్లలో ఆర్బీకేల స్థానంలో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు
ఆకివీడు సీఐ కార్యాలయంగా ఆర్బీకే నూతన భవనం
డిప్యూటీ స్పీకర్ ఒత్తిడితో ఇచ్చామంటున్న అధికార యంత్రాంగం
ఇతర జిల్లాల్లోనూ ఆర్బీకేలపై కూటమి ప్రజాప్రతినిధుల కన్ను
ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమై అన్నదాతల అగచాట్లు
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో పౌరులకు సేవలందించిన సచివాలయాలను నీరుగార్చడంతో పాటు వలంటీర్ల వ్యవస్థకు ఉద్వాసన పలికిన టీడీపీ కూటమి సర్కారు... డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల భవనాలను (రైతు సేవా కేంద్రాలు) సైతం ఆక్రమిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచి పల్లె దాటాల్సిన అవసరం లేకుండా భరోసా కల్పించిన ఆర్బీకేలను దర్జాగా కబ్జా చేస్తోంది.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడితో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి, కాళ్ల, ఆకివీడు ఆర్బీకేలను ఇప్పటికే పోలీస్‌స్టేషన్లుగా మార్చేశారు. ఇదే రీతిలో మిగిలిన జిల్లాల్లోనూ కూటమి నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసిన సీఎం చంద్రబాబు.. వాటి ఉనికే లేకుండా చేయాలనే కుట్రతో ఆ భవనాలను వివిధ శాఖలకు కేటాయిస్తుండటంపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
జగన్ ముద్ర చెరిపేయడమే లక్ష్యం..!
సచివాలయాలు.. వలంటీర్లు... ఆర్బీకేల పేరు చెబితే చాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తుకొస్తారు! ప్రజల ముంగిటే పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో ప్రతి రెండువేల జనాభాకు ఓ సచివాలయం.. వాటికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలో ఒకేసారి 10,778 ఆర్బీకేలను నెలకొల్పి వాటి ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందించేందుకు పట్టభద్రులైన 15,667 మంది వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మత్స్య, వెటర్నరీ సçహాయకులను నియమించారు. రైతులకు ఎనలేని సేవలందిస్తున్న వీటిని నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్ జగన్ ముద్రను చెరిపేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది.
రైతన్న ఇక ఎటు వెళ్లాలి..?
గతంలో రైతన్నలు గ్రామ చావిడి, కూడలి లేదా కాలువ గట్లపై కూర్చొని కష్టసుఖాలు చెప్పుకునే వారు. ఆర్బీకేల ఏర్పాటుతో అన్నదాతలు వాటిని తమ సొంత ఇంటి మాదిరిగా భావించారు. తమ కోసం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థను ఎంతో ఆదరించారు. రైతన్నలు ఉదయం పొలానికి వెళ్లే ముందు.. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఆర్బీకేలో అడుగు పెట్టడం ఆనవాయితీగా మారింది.
విత్తనాలు, ఎరువులు, ఈ–క్రాప్, రైతు భరోసా, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా ప్రతి ఒక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. వివిధ రకాల వ్యవసాయ సంబంధిత మేగజైన్స్తోపాటు స్మార్ట్ టీవీ ద్వారా పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు అందేవి.
డిజిటల్ కియోస్క్‌ల ద్వారా తమకు కావాల్సిన ఉత్పాదకాలను బుక్ చేసుకుని వాతావరణ, మార్కెట్ ధరల సమాచారాన్ని తెలుసుకునేవారు. అన్నదాతలకు గ్రామాల్లో సేవలందించేందుకు రూ.2,260 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో 10,252 ఆర్బీకేల నూతన భవన నిర్మాణాలను కూడా గత ప్రభుత్వం చేపట్టింది.
ఇప్పటికే రూ.1,165 కోట్ల వ్యయంతో 4,865 భవనాలు పూర్తయి కొన్ని చోట్ల ఆర్బీకేల కార్యకలాపాలు కొనసాగుతుండగా, మరికొన్ని భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 5,387 భవనాల్లో నిర్మాణాలు దాదాపు 80 – 90 శాతం పూర్తి అయ్యాయి. కొద్దిపాటి నిధులిస్తే చాలు పూర్తయ్యే దశలో ఉండగా కూటమి ప్రభుత్వం రావడంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment