Department of Animal Husbandry
-
అంతుచిక్కని లక్షణాలతో.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు
సాక్షి, భీమవరం/పెరవలి: ఏపీ పౌల్ట్రీల్లో కోళ్ల మృత్యువాత కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్‌తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండటం కలవరపెడుతోంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. గత 15 రోజుల్లో సుమారు 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు అంచనా. డిసెంబర్లోనే మొదలైన అంతుచిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీలో ఇప్పటికే 1.60 లక్షల కోళ్లు మరణించాయి. ఆరోగ్యంగానే ఉన్నా క్షణాల్లో మరణం అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతుచిక్కని వైరస్ చాపకింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు 200 పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.30 కోట్ల వరకు ఉండగా.. రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 245 షెడ్లలో 1.35 కోట్ల కోళ్లు ఉండగా.. వీటిని 245 షెడ్లలో పెంచుతున్నారు. ఈ జిల్లాలో నిత్యం 1.08 కోట్ల వరకు గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. మొత్తంగా రెండు జిల్లాల్లో గుడ్లు పెట్టే కోళ్లు 2.65 కోట్ల వరకు ఉండగా.. నిత్యం 2.13 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి, నిడదవోలు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, కడియం ప్రాంతాల్లో పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవేకాకుండా మాంసానికి వినియోగించే బ్రాయిలర్ కోళ్లను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకు 12 లక్షలకు పైగా పెంచుతున్నారు. వీటి సంఖ్య ప్రతి 40 రోజులకు మారిపోతుంటుంది. ఊహించని రీతిలో మరణాలు సాధారణంగా డిసెంబర్, జనవరి మాసాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కొరైజా, సీఆర్డీ (క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్), రానికెట్ వంటి ఊపిరితిత్తుల సంబంధిత వైరస్లు వ్యాపిస్తుంటాయి. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05 శాతం లోపు కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. కొద్దిరోజుల క్రితం నాటు కోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లకు వ్యాపించాయి. నాటు కోళ్లతో పోలిస్తే లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోడికి 20 వారాల వయసు వచ్చేనాటికి ఐ డ్రాప్స్, నీటిద్వారా, ఇంజెక్షన్ రూపంలో దాదాపు 23 వరకు వ్యాక్సిన్లు వేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు అంతుచిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ వర్గాలను కలవరపరుస్తోంది. కొన్ని పౌల్ట్రీల్లో అసాధారణ రీతిలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి. లక్ష కోళ్లు ఉంటే రోజుకు 3వేల నుంచి 4వేల వరకు చనిపోతున్నాయి. మూడు లక్షల కోళ్లు ఉన్న ఒక పౌల్ట్రీలో వారం రోజులుగా రోజుకు 13 వేల నుంచి 14 వేల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు ఉంగుటూరు మండలానికి చెందిన రైతు ఒకరు చెప్పారు. బర్డ్‌ఫ్లూ తరహాలోనే.. బర్డ్‌ఫ్లూ తరహాలోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది వారాల క్రితం కృష్ణా జిల్లాలో అక్కడకక్కడా కనిపించిన ఈ వైరస్ లక్షణాలు తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరించినట్టు తెలుస్తోంది. గతంలో బర్డ్‌ప్లూ వచ్చినప్పుడు కోళ్లను పూడ్చిపెట్టిన తరహాలోనే ఇప్పుడు చనిపోయిన కోళ్లను భారీ గోతులు తీసి సున్నం, బ్లీచింగ్, ఉప్పు వేసి పూడ్చిపెడుతున్నారు. పౌల్ట్రీల వద్ద ఫార్మాలిన్ ద్రావణంతో సిబ్బంది కాళ్లు, వాహనాల టైర్లు శుభ్రపరచిన తరువాత మాత్రమే లోపలికి అనుమతిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పతనమవుతున్న గుడ్డు ధర శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకుని డిసెంబర్లో ఫామ్ గేట్ వద్ద రూ.6.30కి అమ్ముడైన గుడ్డు ధర ఎండలు ముదురుతుండటంతో తిరోగమనం బాట పట్టాయి. ప్రస్తుతం ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.4.62కు చేరింది. ఓ వైపు గుడ్డు ధర పతనమవుతుంటే మరోపక్క అధిక సంఖ్యలో కోళ్ల మరణాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక కోడి చనిపోతే రైతుకు రూ.300 నష్టం వస్తుంది. ఈ మేరకు ఎన్ని కోళ్లు చనిపోతే అంత నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, అమ్మకాలు తగ్గిపోతాయన్న ఆందోళనతో పౌల్ట్రీ వర్గాలు వీటిపై నోరుమెదపని పరిస్థితి నెలకొంది. స్పష్టత ఇవ్వలేకపోతున్న పశు సంవర్థక శాఖ కోళ్ల ఆకస్మిక మరణాలపై పశు సంవర్థక శాఖ పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదికలు రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ ఏలూరు జిల్లా ఇన్చార్జి జేడీ టి.గోవిందరాజు తెలిపారు. ప్రస్తుతం హైలీ వైరల్డ్ ఆర్డీగా భావించి పౌల్ట్రీల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతూ.. మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముందుజాగ్రత్తలే నివారణ కోళ్లకు సోకుతున్న వైరస్‌లకు మందులు లేవు. ముందుజాగ్రత్తలతోనే నివారణ సాధ్యం. వైరస్ సోకిన కోళ్లు గంటల వ్యవధిలోనే మృత్యువాత పడతాయి. ఒక కోడికి వైరస్ సోకిన నిమిషాల్లోనే మిగిలిన కోళ్లకు వ్యాపిస్తుంది. దీని నివారణకు వైరస్ సోకిన కోళ్లను వేరు చేయటం ఒక్కటే మార్గం. ముందస్తు టీకాలు వేయటం ద్వారానే అరికట్టాలి. కోళ్లలో వ్యాధి నిరోదక శక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలి. – చరణ్, పశువైద్యాధికారి, పెరవలి -
బిగుస్తున్న ‘గొర్రెల’ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులు కేంద్రంగా ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు కొనసాగిస్తుండగా..మరోవైపు మనీలాండరింగ్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. కొనుగోలు చేసిన గొర్రెలనే మళ్లీ మళ్లీ కొన్నట్టు చూపడంతో పాటు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై అప్పటి మంత్రి పేషీ కేంద్రంగా జరిగిన ఈ గోల్‌మాల్‌లో రూ.700 కోట్ల వరకు నిధులు దారి మళ్లినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం విదితమే. ఈ మొత్తం కుంభకోణంలో ఇప్పటివరకు ఏసీబీ అరెస్టు చేసిన అధికారుల విచారణతో పాటు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతమైతే, ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? నిబంధనలు తుంగలోతొక్కి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నదెవరనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీఎంఎల్ఏ చట్టం కింద లేఖ గొర్రెల పంపిణీ పథకంలో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టుగా ఏసీబీ దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో.. ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేశారు. వెంటనే కేసు దర్యాప్తు కోసం అవసరమైన వివరాలు ఇవ్వాలంటూ తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ (టీజీఎస్జీడీసీఎఫ్ఎల్) ఎండీకి లేఖ రాశారు. మొత్తం తొమ్మిది అంశాలకు సంబంధించిన సమాచారం కోరారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 54 కింద లేఖ రాసిన ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ మాగిమై అరోకియారాజ్.. కోరిన సమాచారాన్ని అత్యవసరంగా పరిగణించి అందజేయాలని సూచించారు. ఈ కుంభకోణంపై కేసు నమోదు చేయడం, ఆ వెంటనే వివరాలు కోరుతూ సంబంధిత శాఖకు లేఖ రాయడంతో ఈ కేసులో ఈడీ దూకుడు మీద ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లబ్ధిదారుల పేర్ల నుంచి చెక్కుల దాకా.. తెలంగాణలో ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 11 మధ్యకాలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు కోరారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు, టీఎస్జీడీసీఎఫ్ఎల్ ద్వారా పంపిణీ అయిన చెక్కుల పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం కుంభకోణంలో కీలకమైన గొర్రెల రవాణా కాంట్రాక్టుదారుల వివరాలు, వారికి జరిగిన చెల్లింపులు, గొర్రెల దాణా కొనుగోలు వివరాలు కూడా ఈడీ కోరింది. అంతర్గతంగా జరిగిన అవినీతికి సంబంధించి అదనపు వివరాలు ఏమైనా ఉంటే ఇవ్వాలని లేఖలో సూచించారు. ఆ ఇద్దరూ చెప్పే విషయాలే కీలకం! గత ప్రభుత్వ హయాంలో అమలైన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు. గొర్రెలను విక్రయించినా తమకు డబ్బులు ఇవ్వలేదని, తమ పేరిట ఎవరో డబ్బులు తీసుకున్నారంటూ ఏపీ రైతుల ఫిర్యాదు చేయడంతో మొదటిసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డా.రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతిరెడ్డి, నల్లగొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్‌లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మార్చిలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ పి.కృష్ణయ్యలను అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్ధ శాఖ మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్కుమార్ల అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. రాంచందర్, కల్యాణ్‌కుమార్‌లను కస్టడీకి తీసుకుని ఈ నెల 10 నుంచి 13 వరకు ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో వారు ఏసీబీకి ఏం చెప్పారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఎవరెవరున్నారనే దిశగా దర్యాప్తు ఈ మొత్తం కుంభకోణంలో ఈ ఇద్దరే కీలకంగా పనిచేశారా? ఇంకా ఎవరైనా వీరిద్దరికీ ఆదేశాలు ఇచ్చారా? అప్పటి మంత్రి పేషీలో ఇంకెవరెవరు ఉన్నారు? గొర్రెల కొనుగోలుకు ఎంతమంది బ్రోకర్లు పనిచేశారు? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా గొర్రెల పంపిణీ పథకం కొనుగోల్ మాల్ వ్యవహారాలకు సంబంధించి బ్రోకర్లు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం, ఒక్కో యూనిట్‌కు రూ.20 వేలు చేతులు మారినట్టు, ఒకసారి కొనుగోలు చేసిన గొర్రెల యూనిట్నే మళ్లీ మళ్లీ కొనుగోలు చేసినట్టు చూపిస్తూ బిల్లులు పెట్టడం..గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి గొర్రెల కొనుగోలు చేయడంలో జరిగిన అక్రమాలు, పశుసంవర్ధకశాఖ లోని ఉద్యోగ సంఘాల నాయకులకు ఇందులో ఉన్న పాత్ర తదితర వివరాలు బహిర్గతం కావచ్చని అంటున్నారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతడి కుమారుడు ఇక్రమ్ పట్టుబడితే మరికొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. -
TS: మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం?
సాక్షి, హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యమైనట్లు సమాచారం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయం కావడంపై కలకలం రేగుతోంది. కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేష్, ప్రశాంత్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు సమాచారం. నిన్ననే ఫైల్స్ మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు అధికారులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను డీసీపీ సేకరించారు. ఆ శాఖ డైరెక్టర్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ.. ప్రశ్నించగా, ఫైల్స్ మాయంపై ఎలాంటి సమాచారం లేదంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఫైల్స్ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కాగా, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సచివాలయం ప్రారంభమై 9 నెలలు కావొస్తుందని, మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయాన్ని నూతన సచివాలయంలోని రెండో అంతస్తులోకి తరలించి కార్యకలాపాలు నిర్వహించామని తెలిపారు. మంత్రి ఆమోదం కోసం వచ్చిన ఫైల్స్‌ను నిర్దిష్టమైన విధానంలో ఎప్పటికప్పుడు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందజేయడం జరిగిందని వివరించారు. శాఖాపరమైన ఫైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయంలోనే ఉంటాయని తెలిపారు. ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న ఆరోపణలు, వార్తలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని కళ్యాణ్ తెలిపారు. ఇదీ చదవండి: TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో.. -
రైతు ముంగిట పశు వైద్యసేవలు
సాక్షి, అమరావతి: గత సర్కారు పాడి పరిశ్రమను గాలికొదిలేసింది. పశు సంవర్ధక శాఖను నిర్వీర్యం చేసి.. పశువులకు కనీస వైద్యం కూడా అందించలేని స్థితికి నెట్టేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక.. పంటలు పండించే రైతులతోపాటు పాడి రైతులకు పెద్దపీట వేస్తోంది. పశు పాలకులకు చేయూత అందిస్తుండటంతోపాటు పశువులకు 24 గంటలూ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. 340 సంచార పశువైద్య ఆరోగ్య సేవారథాలను రంగంలోకి దించింది. 7,396 ఆర్బీకే క్లస్టర్లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పశు వైద్య నిపుణులను నియమించి పశువులకు అన్నిరకాల వైద్య సేవలు అందిస్తోంది. అయినా.. ‘ఈనాడు’కు ఇవేమీ కనిపించడం లేదు. తన సహజ నైజంలో పశువుల పైనా విషం చిమ్మింది. ‘పశువులూ అల్లాడుతున్నాయ్’ శీర్షికన రామోజీ మార్కు జర్నలిజంతో మంగళవారం నాటి సంచికలో అబద్ధపు కథనాన్ని వండి వార్చింది. ఆ కథనం పూర్తిగా సత్యదూరం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ ఖండించారు. కథనంలో పేర్కొన్న అంశాలన్నీ పూర్తి సత్యదూరంగా ఉన్నాయన్నారు. మూగజీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. వైద్య సేవలు అందక పశువులు చనిపోతున్న ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా చోటుచేసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో 1,577 పశు వైద్యశాలలు, 323 ప్రాంతీయ పశు వైద్యశాలలు, 12 వెటర్నరీ పాలీ క్లినిక్స్ ద్వారా పశు పోషకులకు అత్యంత చేరువలో నాణ్యమైన, మెరుగైన అత్యాధునిక పశు వైద్యాన్ని అందిస్తున్నామని వివరించారు. క్లిష్టమైన శస్త్ర చికిత్సలను సైతం ఉచితంగా చేస్తూ పశువులను ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో 2 సూపర్ స్పెషాలిటీ పశు వైద్యశాలల ద్వారా మనుషుల తరహాలో పశువులకూ 24 గంటల వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో 1.66 కోట్ల పశుగణ యూనిట్లు ఉండగా.. 1,527 పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. నియోజకవర్గ స్థాయిలో రూ.240.69 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 340 సంచార పశు వైద్య ఆరోగ్య సేవారథాల్లో మరో 701 మంది పశు వైద్యులు సేవలందిస్తున్నారని చెప్పారు. గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా.. వాటిలో 7,396 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పశు వైద్య నిపుణులు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా ప్రాథమిక పశువైద్య సేవలతోపాటు కృత్రిమ గర్భధారణ సేవలు, పశు యాజమాన్యం, పశుగ్రాసాల పంపిణీ, పశు పోషణకు కావలసిన సేవలన్నీ అందిస్తున్నామని వివరించారు. ఆర్బీకేల్లో రెండు విడతల్లో నియమించిన 4,652 మంది గ్రాడ్యుయేట్స్ సేవలందిస్తుండగా.. తాజాగా మరో 1,896 ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా.. దేశంలో మరెక్కడా లేనివిధంగా నియోజకవర్గ స్థాయిలో రూ.24.14 కోట్లతో 154 పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. ప్రతి ల్యాబ్‌లో ఒక ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్ని నియమించారని చెప్పారు. ల్యాబ్‌ల ద్వారా పేడ పరీక్షలు, రక్త పరీక్షలు, పాల పరీక్షలు, మూత్ర పరీక్షలు, చర్మ సంబంధ వ్యాధి పరీక్షలు, యాంటీ బయోటిక్ సెన్సిటివిటీ, జీవక్రియ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారని చెప్పారు. వీటి ఫలితాల ఆధారంగా సత్వర, కచ్చితమైన పశు వ్యాధులను నిర్ధారించి, నాణ్యమైన, మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. పశ్చిమ బెంగాల్లో 51,772, గుజరాత్లో 36,540, బిహార్‌లో 32,138, తెలంగాణలో 32,127, ఉత్తరప్రదేశ్‌లో 27,480, రాజస్థాన్‌లో 20,821 జీవాలకు ఒక పశువైద్యుడు చొప్పున సేవలు అందిస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం ప్రతి 17,808 జీవాలకు ఒక పశు వైద్యుడు సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. పశు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదన్నారు. -
పశువుల రీసైక్లింగ్‌కు ఆస్కారమే లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పశువుల రీ సైక్లింగ్‌కు ఏమాత్రం ఆస్కారంలేదని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పష్టంచేశారు. జగనన్న పాల వెల్లువ పథకం కింద వైఎస్సార్ చేయూత లబ్ధిదారులు చేసిన పశువుల కొనుగోళ్లలో ఎలాంటి కుంభకోణాలు జరగలేదని గురువారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ స్కీంపై అవగాహనలేకుండా కొన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రకటనలు ఇవ్వడం.. వాటి ఆధారంగా కొన్ని పత్రికలు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుని కనీసం క్రాస్‌చెక్ కూడా చేసుకోకుండా దుష్ప్రచారం చేయడం సరికాదని ఆయనన్నారు. చేయూత పథకం ద్వారా లబ్ధిపొందిన వారిలో ఎవరైతే పాడి పశువుల యూనిట్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారో, వారికి మాత్రమే పశువుల కొనుగోలు కోసం రుణాలు మంజూరు చేశారన్నారు. ఎస్ఎల్బీసీ సమావేశాల్లో ప్రభుత్వపరంగా చేసిన విజ్ఞప్తి మేరకు బ్యాంకర్లు ముందుకొచ్చి అర్హులైన ప్రతీ ఒక్కరికీ రుణాలు మంజూరు చేశారన్నారు. ఈ సమావేశాల్లో కానీ, మరెక్కడా కానీ పశువుల రీసైక్లింగ్ చేస్తున్నట్లుగా ఏ ఒక్కరూ ఆరోపించలేదని అమరేంద్రకుమార్ తెలిపారు. ప్రభుత్వ ప్రమేయమేమీలేదు.. ఇక లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నారే తప్ప ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీలేదని స్పష్టంచేశారు. ఒక్కో యూనిట్ ఖరీదు రూ.75వేలు కాగా.. చేయూత పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన మొదటి విడత సొమ్ము రూ.18,750ను నేరుగా బ్యాంకు ఖాతాకు జమచేయగా, మిగిలిన 56,250ను బ్యాంకులు రుణాలుగా మంజూరు చేశాయన్నారు. ఈ మొత్తాన్ని తిరిగి వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇక ఏటా చేయూత పథకం కింద ప్రభుత్వం జమచేసే మొత్తాన్ని రుణవాయిదాల రూపంలో లబ్ధిదారులు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పశువుల ఎంపిక, కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఇష్ట్రపకారమే రైతుల నుంచి రైతు పశువులను నేరుగా కొనుగోలు చేసుకున్నారని, ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సబ్సిడీ రూపంలోగానీ, గ్రాంట్ రూపంలోగానీ సబ్సిడీ విడుదల చేయలేనప్పుడు కుంభకోణాలు, స్కాంలు జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. పాడి పశువుల కొనుగోలు పూర్తిగా స్థానికంగానే జరుగుతున్నందున కొత్తగా పాడి సంపద పెరిగిన దాఖలాల్లేవన్నారు. ఇనాఫ్ ట్యాగ్స్‌తో రీసైక్లింగ్‌కు ఆస్కారంలేదు.. పథకంలో లబ్ధిదారులు కొనుగోలు చేసిన ప్రతీ పశువుకూ ఇనాఫ్ ట్యాగ్స్ ఉన్నాయని, అలాంటప్పుడు పాడి పశువుల రీసైక్లింగ్‌కు ఆస్కారం ఎక్కడ ఉంటుందని అమరేంద్రకుమార్ ప్రశ్నించారు. పథకంలో లబ్ధిదారులు పాడి పశువులను ఇతర రాష్ట్రాల నుంచికాకుండా, రాష్ట్ర పరిధిలోనే తమకు నచ్చిన పశువును నేరుగా రైతు నుండే కొనుగోలు చేశారన్నారు. కాబట్టి పాడి పశువుల సంఖ్యలోగానీ, పాడిలో కానీ ఎలాంటి వ్యత్యాసం కానీ, స్థూల పాల దిగుబడిలో ఎటువంటి పెరుగుదల ఉండదని స్పష్టంచేశారు. -
Fact Check: పశుబీమా పక్కాగానే.. నిజాలకు ముసుగేసి రామోజీ క్షుద్ర రాతలు
సాక్షి, అమరావతి: ఒకరోజు భోజనం చేయకుండా లేదా నిద్రలేకుండా అయినా ఈనాడు రామోజీరావు ఉండగలరేమోగానీ సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కకుండా మాత్రం ఉండలేరు. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకున్న ఆయన తాజాగా తన క్షుద్ర పత్రికలో పశుబీమాపై తన పైత్యాన్ని ప్రదర్శించారు. వైపరీత్యాలు, ప్రమాదాల్లో మూగ, సన్నజీవాలు మృత్యువాతపడినప్పుడు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే పశుపోషకులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పశువుల బీమా పథకాన్ని అమలుచేస్తోంది. ఇది సమర్థవంతంగా అమలవుతుంటే వాస్తవాలకు ముసుగేసి ‘పశుబీమా పడకేసింద’ంటూ ఆ రైతులను తప్పుదారి పట్టించేలా ఈనాడు రోత రాతలు రాస్తోంది. బాబు హయాంలో బీమాకు మంగళం.. నిజానికి.. గతంలో కేంద్ర ప్రాయోజిత పథకం కింద పశువులు, సన్నజీవాల కోసం అమలుచేసిన బీమా పథకానికి నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉండగా, మిగిలిన 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 2015 తర్వాత కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ నిలిపివేయడంతో చంద్రబాబు హయాంలో ఈ బీమా పథకాన్ని పూర్తిగా అటకెక్కించేశారు. అప్పట్లో కేవలం 1.20 లక్షల పశువులకు మాత్రమే బీమాను వర్తింపజేశారు. వరదలు, తుపానులు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధల మేరకు అరకొరగా అతికొద్ది మందికి మాత్రమే పరిహారం ఇచ్చేవారు. మిగిలిన సమయాల్లో రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాలు, వడగాడ్పులు, పిడుగుపాటుకు, అడవి జంతువులు, విషప్రయోగాలు, పాముకాట్లు వంటి వాటివల్ల చనిపోయే జీవాలకు పైసా పరిహారం కూడా దక్కేది కాదు. కనీసం బీమా చేయించాలన్న ఆలోచన కూడా గత టీడీపీ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు పశుపోషకులకు భరోసా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వైపరీత్యాలు, ప్రమాదాల్లో చనిపోయిన మూగ, సన్నజీవాలవల్ల జీవనోపాధి కోల్పోయిన పశు పోషకులకు నష్టపరిహారం చెల్లించారు. వ్యక్తిగతంగా బీమా చేయించుకునే పశుపోషకులకు భరోసా కల్పించారు. ఇలా నాలుగేళ్లుగా ఈ పథకం కింద ఏకంగా 77వేల మంది పశుపోషకులకు వైఎస్సార్ పశు నష్టపరిహారం పథకం కింద నేరుగా వారి ఖాతాలకు రూ.176.68 కోట్లు జమచేశారు. మరింత మందికి లబ్ధిచేకూర్చాలన్న సంకల్పంతో 2022–23 నుంచి వైఎస్సార్ పశుబీమా పథకం తీసుకొచ్చారు. దీనికింద.. దారిద్య్రరేఖకు దిగువనున్న వారితో పాటు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన పశుపోషకులకు తమ జీవాలకు మూడేళ్ల కాలపరిమితికి నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 80 శాతం ప్రభుత్వ రాయితీగా భరిస్తోంది. లబ్ధిదారులు తమ వాటా కింద 20 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఏటా రెన్యువల్ చేసుకునే ఇబ్బందిలేకుండా మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించేలా పథకాన్ని రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మూడేళ్లకు సాధారాణ ప్రాంతాల్లో ప్రీమియం 11 శాతంగా నిర్ధారించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 6.40 శాతానికే అందిస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత తక్కువ ప్రీమియంలేదు. పాడి రైతులు కావాలనుకుంటే తమ పశువులకు రూ.30వేల నుంచి రూ.1.20లక్షల వరకు బీమా చేయించుకోవచ్చు. ప్రభుత్వ రాయితీ మాత్రం రూ.30 వేలకే వర్తిస్తుంది. మిగిలిన ప్రీమియం మొత్తం చెల్లించుకుంటే సరిపోతుంది. 80శాతం రాయితీ వర్తింపు.. ఇక పశు పోషకులలో ఎక్కువమంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారే. వీరిలో ఎస్సీ, ఎస్టీలతో పాటు దారిద్య్రరేఖకు దిగువనున్న బీసీలందరికీ 80శాతం రాయితీ వర్తిస్తుంది. ఇప్పటివరకు ఈ పథకంలో 1,72,815 మంది పశు పోషకులు నమోదు చేసుకున్నారు. వీరికోసం రూ.16.43 కోట్లను ప్రభుత్వం ప్రీమియం రూపంలో చెల్లించింది. వైపరీత్యాలు, ప్రమాదాల్లో పశువులను కోల్పోయిన 1,076 మంది పశుపోషకులకు రూ.2.12 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఇవేవీ కనిపించని రామోజీ రోజూ క్షుద్ర వార్తలను వండి తన పాఠకుల మీద రుద్దుతున్నారు. పశు బీమాకు ఢోకాలేదు.. రాష్ట్రంలో వైఎస్సార్ పశుబీమా పథకానికి ఢోకాలేదు. గతంలో ఎన్నడూలేని విధంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ నిర్దేశిత గడువులోగా పరిహారం ఇస్తున్నాం. ఈ పథకం ఆపలేదు.. ఆగలేదు. దీనికి ప్రభుత్వం రూ.55 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తంలో లబ్ధిదారులు తమ వాటాగా రూ.15 కోట్లు చెల్లిస్తుండగా, కేంద్రం రూ.20కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.20కోట్లు సర్దుబాటు చేస్తోంది. కేంద్రం చెల్లించాల్సిన వాటాకు సంబంధించి రూ.63.12 కోట్లు రావాల్సి ఉంది. అవి అందిన వెంటనే మరింత వేగంగా అమలుచేస్తాం. – డాక్టర్ అమరేంద్రకుమార్,డైరెక్టర్, పశుసంవర్థక శాఖ -
ఏపీయే స్ఫూర్తి.. దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఏపీ తరహాలోనే దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ అమలుచేస్తున్న సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టింది. పశు పోషకులకు నాణ్యమైన బ్రాండెడ్ మందులను కారుచౌకగా అందించడం ద్వారా వా రికి ఆర్థిక భారం తగ్గించడం, మరోవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. అన్ని ప్రాథమిక పశు వైద్యశాలలు, పాలిక్లినిక్స్, డిస్పెన్సరీ ప్రాంగణాల్లో ఈ వైఎస్సార్ జనరిక్ పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటుచేయాలని సంకల్పించి జనరిక్ మందుల తయారీదారులతో పశుసంవర్ధక శాఖ అవగాహనా ఒప్పందం చేసుకుంది. విజయవాడలో తొలిసారిగా.. పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రాన్ని ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రూ.4.63 లక్షల అంచనా వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా, యూనిట్ కాస్ట్లో కేవలం 25 శాతాన్ని లబ్ది దారులు భరిస్తే చాలు.. రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీని భరిస్తోంది. వీటి ద్వారా నిర్వాహకులతో పాటు కనీసం ముగ్గురు నుంచి నలుగురికి ఉపాధి లభిస్తుంది. ఈ ఔట్లెట్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిన 70కు పైగా జీఎంపీ క్వాలిటీ బ్రాండెడ్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్ ధరల కంటే 35–85% తక్కు వగా ఇక్కడ లభిస్తుండడంతో పశు పోషకులతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వారి నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రతీరోజూ 300 మందికి పైగా వినియోగదారులు ఈ కేంద్రం సేవలను వినియో గించుకుంటుండగా, రోజుకు రూ.20 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టు విజ యవంతం కావడంతో మలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దశల వారీగా రూ.14.17 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 ప్రాథమిక పశు వైద్యశాల (పీవీసీ) ప్రాంగణాల్లో ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవల రాష్ట్రాల పశుసంవర్థక శాఖ మంత్రులతో జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పశుసంవర్ధక శాఖ వర్కుషాపులో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్లు ఏపీలో సీఎం జగన్ ఆలోచనల మేరకు పశుపోషకులకు ఆర్థిక భారం తగ్గించేందుకు దేశంలోనే తొలిసారి జనరిక్ పశుఔషధ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. రాష్ట్రస్థాయిలో వీటిని విస్తరించేందుకు ఆర్థిక చేయూతనివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ కృషికి కేంద్ర బృందం కితాబు సదస్సులో పాల్గొన్న కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలాతో పాటు కేంద్ర అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వ కృషిని, సీఎం జగన్ చొరవను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తి తో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని అధికారులను కేంద్రమంత్రి ఆదేశించడమే కాక.. ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లగా ఆ యన కూడా అంగీకారం తెలిపారు. దీంతో కేంద్ర బృందం శుక్రవారం మరోసారి భేటీ అయింది. కేంద్రం ఆహ్వానంతో అమరేంద్రకుమార్ వైఎస్సార్ పశు ఔషధ నేస్తం పథకం లక్ష్యాలను వివరించారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో విధి విధానాల రూపకల్పనకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో మలి విడతలో ఏర్పాటుచేయ తలపెట్టిన జనరిక్ పశు ఔషధ కేంద్రాలకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు అంగీకరించింది. -
ఆర్బీకేలు ఓ వినూత్నమైన ఆలోచన
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం (మైలవరం): ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా గ్రామ స్థాయిలో పశుపోషకులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని కేరళ రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి జె. చించురాణి అన్నారు. ఆర్బీకేలే ఓ వినూత్నమైన ఆలోచన అని, వీటి ద్వారా గ్రామ స్థాయిలో సేవలందించడం నిజంగా గొప్ప విషయమని ప్రశంసించారు. ఏపీ పశు దాణా చట్టం – 2020 అమలుపై అధ్యయనం చేసేందుకు మంత్రి చించురాణి నేతృత్వంలోని కేరళ ప్రభుత్వ సెలక్ట్ కమిటీ బృందం బుధవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి ఆర్బీకేను సందర్శించింది. ఆర్బీకే ద్వారా పశుపోషకులకు అందిస్తున్న సేవలను బృందం సభ్యులు పరిశీలించారు. కియోస్క్ ద్వారా సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్)ను పాడి రైతులు స్వయంగా బుక్ చేసుకొనే విధానాన్ని పరిశీలించారు. డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. అంబులెన్స్ ద్వారా మూగ, సన్న జీవాలకు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. హైడ్రాలిక్ లిఫ్ట్‌తో పశువును వాహనంలోకి ఎక్కించడం, ఆస్పత్రికి తరలించడాన్ని పరిశీలించారు. వెల్నెస్ సెంటర్లో అందుతున్న వైద్యం, మందులు, 104 సేవలు తెలుసుకున్నారు. మంత్రి చించురాణి, ఇతర సభ్యులు నట్టల నివారణ మందును పశువులకు తాగించారు. అనంతరం కంచికచర్ల మండలం పరకాలపాడులోని డాక్టర్ వైఎస్సార్ దేశీయ గో జాతుల పెంపక కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఉత్పత్తి చేసే పాల పదార్థాలు, గో మూత్రం, పేడ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచి దేవమాత వారిని సత్కరించారు. అనంతరం మంత్రి చించురాణి మాట్లాడుతూ రాష్ట్రం పశుపోషణకు పెద్ద పీట వేస్తూ గ్రామ స్థాయిలో పశుసంవర్ధక అధికారి ద్వారా రైతు ముంగిటే సేవలందిస్తున్న తీరు అద్భుతమన్నారు. నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణాను 60 శాతం సబ్సిడీపై అందించడం మంచి విధానమని చెప్పారు. సంచార పశు ఆరోగ్య సేవా రథం డిజైన్ చాలా బాగుందని, ఇలాంటి సౌకర్యాలు తమ రాష్ట్రంలోని అంబులెన్స్‌లో లేవన్నారు. ఏపీని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. ఈ బృందంలో కేరళ ఎమ్మెల్యేలు సీకే ఆశా, జాబ్మైచిల్, సీహెచ్ కుంబంబు, కేపీ కున్హమ్మద్ కుట్టీ, డాక్టర్ మాథ్యూ కుజల్ నాదన్, కురుక్కోలి మొయిద్దీన్, డీకే మురళి, మోన్స్ జోసఫ్, కేపీ మోహన్, యూ ప్రతిభ, కేడీ ప్రసేనన్, ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏక కౌసిగన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఏపీ పసుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ ఎస్.వెంకట్రావు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
కల్తీ చేస్తే జైలు‘పాలు’.. ఏపీలో కీలక చట్టం.. త్వరలో అమలు
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల సందర్భంగా కల్తీలు, మోసాలకు పాల్పడితే డెయిరీల నిర్వాహకులు, సంబంధిత వ్యాపారులు ఇకపై కటకటాల ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేనివిధంగా పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలులోకి తీసుకురాబోతోంది. ఇటీవలే అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ చట్టం అమలుకు సంబంధించి ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన కోసం పశు సంవర్థక శాఖ కసరత్తు చేస్తోంది. గతంలోనూ చట్టాలున్నా.. గతంలో తూనికలు, కొలతలు శాఖ, మునిసిపాలిటీల ఆధ్వర్యంలోని ప్రజారోగ్య విభాగాలు మాత్రమే పాల విక్రయాల్లో జరిగే లోపాలపై అడపాదడపా దృష్టి సారించేవి. ఆ రెండు విభాగాలకూ ఇతర పనులు సైతం ఉండటంతో పాల విక్రయాలపై పెద్దగా దృష్టి సారించేవి కాదు. దీనివల్ల యథేచ్ఛగా అక్రమాలు సాగిపోయేవి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖ అధికారులను సైతం రంగంలోకి దించింది. పాల సేకరణ సందర్భంగా మిల్క్ అనలైజర్స్, వేయింగ్ మెషిన్స్ను డెయిరీల నిర్వాహకులు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతుండటంతో తూనికలు, కొలతల చట్టం ప్రకారం వాటిని తనిఖీ చేసే అధికారాలను 2021 నవంబర్ నుంచి ప్రభుత్వం పశు వైద్యులకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన పశు వైద్య బృందాలు ఏడాదిన్నర కాలంలో 3,704 దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాయి. 151 ఉల్లంఘనలపై జరిమానాలు విధించడం ద్వారా అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు. అయితే, మోసాలకు కారణమైన అనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం పశు సంవర్థక శాఖకు లేకుండాపోయింది. అక్రమాలకు చెక్ పెట్టేలా కొత్త చట్టం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా మోసాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియమ, నిబంధనలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలన్న సంకల్పంతో పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగం చట్టం–2023ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మిల్క్ అనలైజర్స్తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల (ఏఎంసీయూ)పై పశు సంవర్థక శాఖ పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం మిల్క్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులను పశు సంవర్థక శాఖ నియమిస్తుంది. మిల్క్ అనలైజర్స్ నిర్వహించే వ్యక్తులు కచ్చితంగా పశు సంవర్థక శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. నాణ్యత ప్రమాణాలు పాటించని మిల్క్ అనలైజర్స్‌ను జప్తు చేస్తారు. పాల నాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మోసాలకు పాల్పడితే జరిమానాలు, శిక్షలు ఇలా.. ♦ అనుమతి లేకుండా మిల్క్ అనలైజర్స్ కలిగిన వ్యక్తికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలల జైలుశిక్ష విధిస్తారు. అనుమతి లేకుండా బీఎంసీయూలు, ఏఎంసీయూలు అనలైజర్స్ వాడితే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి ఏడాదిపాటు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ♦ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, డెయిరీలు మిల్క్ అనలైజర్లను అనధికారికంగా, అనుమతి లేకుండా పొంది ఉంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తదుపరి నేరానికి రెండేళ్ల కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ♦ మిల్క్ అనలైజర్లను దుర్వినియోగపరిచే వారికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలలకు తగ్గకుండా జైలుశిక్ష విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ♦ లైసెన్స్ లేకుండా పాలను సేకరిస్తే రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష వరకు జరిమానా, 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు. ♦ లైసెన్సు లేకుండా మిల్క్ అనలైజర్ల సర్వీసింగ్ సెంటర్లు నిర్వహించే వారికి రూ.25 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.50 వేల వరకు జరిమానా లేదా ఏడాది కారాగార శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది. ♦ పాడి రైతుకు నిర్దేశిత ధర చెల్లించకపోయినా.. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను తక్కువగా చూపించి మోసానికి పాల్పడినా రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష జరిమానా లేదా 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు. రైతులు, వినియోగదారుల రక్షణ కోసమే.. పాల సేకరణలో దళారులు, వ్యాపారులు పాల్పడే మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పాలను సరఫరా చేయడమే లక్ష్యంగా దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పాడి రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. – సీదిరి అప్పలరాజు, పశు సంవర్థక శాఖ మంత్రి -
రుణమెప్పుడొస్తది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను రుణం కింద సమకూర్చుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వెంటనే సబ్సిడీ గొర్రెల పంపిణీ చేపట్టాలని సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశాలిచ్చారు. ఆ మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా ఏర్పాట్లు కూడా చకచకా చేస్తున్నారు. కానీ, ఈ పథకం రెండో దఫా రాష్ట్రంలో అమలు చేయాలంటే రూ.4,565 కోట్ల రుణం కావాలి. ఈ రుణాన్నిచ్చేందుకు జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ఆమోదం తెలిపి కూడా ఆరునెలలు దాటిపోయింది. కానీ, ప్రభుత్వ పూచీకత్తు లభించకపోవడంతో ఆ ఆమోదం కాగితాలకే పరిమితం అయింది. ఇప్పుడు కేబినెట్ ఆమోదంతో ఆ రుణం ఎప్పుడు వస్తుందా అని పశుసంవర్ధక శాఖ అధికారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటివరకు గొర్రెల కొనుగోలు కోసం తమ వద్ద ఉన్న రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టగలమని, ఆ తర్వాత ఎన్సీడీసీ రుణంపైనే ఆధారపడాల్సి ఉంటుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు రుణం వస్తుందనే ఆశతో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నగదు బదిలీతో కాదు.. వాస్తవానికి, ఈ పథకం కింద గొర్రెల పంపిణీని నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించినా ఆ తర్వాత వెనక్కు తగ్గింది. పైలట్‌గా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమచేసి గొర్రెలు కొనుగోలు చేపట్టింది. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురుకావడంతో మళ్లీ పాత తరహాలోనే ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సన్నాహాలు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన గొర్రెలను లబ్దిదారుల వద్దకు చేర్చేందుకు అవసరమైన రవాణా కాంట్రాక్టు టెండర్లను జిల్లా స్థాయిలో పిలవగా, ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతోంది. ఈ టెండర్ల ఖరారయిన తర్వాత గొర్రెల కొనుగోలు, పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెపుతున్నారు. కొనుగోలు బాధ్యత జిల్లా అధికారులకు.. కొనుగోలు కోసం జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పజెపుతున్నారు. గతంలో మండల స్థాయిలో పశుసంవర్ధక శాఖ అధికారులతో కొనుగోళ్లు జరిపించగా, ఈసారి మాత్రం జిల్లా స్థాయి అధికారులతో (డీఆర్వో, ఆర్డీవో, పీడీ డీఆర్డీఏ, జిల్లా వ్యవసాయాధికారులు, ఇతర శాఖలకు చెందిన జిల్లా అధికారులు) కొనుగోలు ప్రక్రియ చేపట్టనున్నారు. గొర్రెల కోసం ఇప్పటివరకు 30వేల మందిలోపు లబ్దిదారులే డీడీలు తీయగా, మిగిలిన వారి చేత కూడా డీడీలు కట్టించే పనిలో స్థానిక అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం మీద ఏప్రిల్ 14 తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ పథకం అమలు చేపడతామని, ఏప్రిల్ నెలాఖరు కల్లా ఎన్సీడీసీ రుణం వస్తుందని ఆశిస్తున్నామని పశుసంవర్ధక శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు. -
పశుసంవర్ధక శాఖకు స్కోచ్ అవార్డుల పంట
సాక్షి, అమరావతి: రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు 2023–24 సంవత్సరానికి సంబంధించి స్కోచ్ అవార్డుల పంట పండింది. ఈ శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలకు సిల్వర్ స్కోచ్ దక్కగా, వెటర్నరీ టెలి మెడిసిన్ కాల్ సెంటర్, పశువుల వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌్సతో పాటు ఆంధ్ర గోపుష్టి కేంద్రానికి స్కోచ్ మెరిట్ అవార్డులు వరించాయి. దేశంలోనే వినూత్నంగా నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్రంలో తొలిసారిగా రూ.240 కోట్లతో 340 సంచార పశు ఆరోగ్యసేవా రథాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ద్వారా ఇప్పటివరకు 3,298 ఆర్బీకేల పరిధిలో 2.25 లక్షల పశువులకు వైద్యసేవలందించగా, 2.02 లక్షల మంది రైతులు లబ్ధిపొందారు. అలాగే, దేశంలోనే తొలిసారి రూ.7 కోట్లతో టెలిమెడిసిన్ కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా రైతుల నుంచి వచ్చిన 1.46 లక్షల ఫోన్‌కాల్స్‌ను అటెండ్ చేశారు. శాస్త్రవేత్తలు, సంబంధిత వైద్యాధికారుల ద్వారా సలహాలు సూచనలు అందిస్తున్నారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించాలన్న సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటుచేసిన 154 వైఎస్సార్ వెటర్నరీ ల్యాబ్స్ ద్వారా ఇప్పటివరకు 3.09 లక్షల శాంపిల్స్ పరీక్షించి సకాలంలో అవసరమైన వైద్య సేవలు అందించగలిగారు. అదే విధంగా రూ.17.40 కోట్లతో 58 వైఎస్సార్ దేశవాళీ గో జాతులపెంపకం కేంద్రాలను ఏర్పాటుచేసారు. ఒక్కో కేంద్రానికి 20 దేశీ ఆవులు, ఓ ఆంబోతును అందించారు. వీటినుంచి సేకరించే పాల ద్వారా తయారుచేసే ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్టి పేరిట విక్రయించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా గో పుష్టి కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో దీనిని ఏర్పాటుచేయగా ఇందుకు విశేష ఆదరణ లభిస్తోంది. త్వరలో విశాఖ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రిలలో ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమాలకే స్కోచ్ సంస్థ 2023 సంవత్సరానికి సిల్వర్, మెరిట్ సర్టిఫికెట్లకు ఎంపిక చేసింది. వరుసగా అవార్డులే అవార్డులు ఇక పాడి పరిశ్రమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు గతంలో ఎన్నడూలేని రీతిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కగా, పెద్దఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటికే ఈ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు రూపొందించిన పశుసంరక్షక్ యాప్‌కు 2021–22లో స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కింది. గతేడాది బెస్ట్ స్టేట్ ఇన్ ఏహెచ్ మేనేజ్మెంట్ కేటగిరిలో ఇండియా యానిమల్ హెల్త్ అవార్డ్–2022 దక్కగా, యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు–2022, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి 2020లో అవార్డు ఆఫ్ ఎక్స్‌లెన్స్ దక్కింది. సీఎం విజన్‌కు ఇది గుర్తింపు.. మా శాఖకు గతంలో ఎన్నడూ ఇంతలా గుర్తింపు లభించలేదు. ఇన్ని అవార్డులు కూడా దక్కలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్‌తో గడిచిన 44 నెలల్లో ఎన్నో రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. వాటి ద్వారా రైతులకు మరింత నాణ్యమైన సేవలు అందించగలుగుతున్నాం. ఒకే ఏడాది నాలుగు స్కోచ్ అవార్డులు దక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్నా. – డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
షాకింగ్! టీఎస్పీఎస్సీకి హ్యాకింగ్ బెడద.. పరీక్షలు వాయిదా!
సాక్షి, హైదరాబాద్: టౌన్‌ప్లానింగ్, పశు సంవర్థక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈవారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన అర్హత పరీక్షలు ఆకస్మికంగా వాయిదాపడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కిందనే అనుమానంతో కమిషన్ ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు ముందే దానికి సంబంధించిన సమాచారాన్ని, పరీక్ష తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ క్రమంలో కమిషన్ అధికారుల కంటే ముందుగా ఈ వివరాలను ఎవరో పరిశీలించినట్లు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో ముందుజాగ్రత్తగా పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థులకు సంక్షిప్త సమాచార రూపంలో రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లకు ఆదివారంనాటి పరీక్ష రద్దు సమాచారాన్ని అందించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు శనివారం రాత్రి కమిషన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పోలీసు కేసు నమోదు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహణలో హ్యాకింగ్ జరిగినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు అనుమానిస్తున్నారు. కమిషన్‌కు సంబంధించిన అత్యంత గోప్యతతో కూడిన ఫైళ్లు కంప్యూటర్లో తెరిచి ఉన్నట్లు అనుమానించిన అధికారులు తక్షణ చర్యల్లో భాగంగా పరీక్షను వాయిదా వేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసు అధికారులు, సైబర్ సెక్యూరిటీస్ విభాగం అధికారులతో కలిసి విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహించిన తర్వాత సమస్య వెలుగు చూసే కంటే ముందస్తుగా దానిని వాయిదా వేయడం మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ అధికారులు చెబుతున్నారు. అంతర్గత విచారణ షురూ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన సమాచారం లీకైందనే అనుమానాలపై కమిషన్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు పోలీసులు సైతం ఈ అంశాన్ని సవాలుగా తీసుకున్నట్లు తెలిసింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర అంశాల్లో దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిన టీఎస్పీఎస్సీలో ఇలాంటి అపశ్రుతులు రావడంతో పరపతి దెబ్బతింటుందనే భావనతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే సంకల్పంతోనే పరీక్షల వాయిదా వేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
పాడి సంపద అభివృద్ధికి...పెద్దపీట
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాడి రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా పాడి సంపద అభివృద్ధికి చర్యలు చేపట్టింది. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణతో పాటు మేలు జాతి పునరుత్పత్తి పథకం ప్రారంభించింది. నెల్లిమర్ల: పాడి సంపద అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. పశువులు, జీవాల ఆరోగ్య సంరక్షణకు ఇప్పటికే 1962 సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూగజీవాలకు సరైన రోగ నిర్దారణ చేసి, మరణాలను అరికట్టేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. ఆవులు, గేదెలు మేలు రకం ఆడ దూడలకు జన్మనివ్వడానికి, పాల ఉత్పత్తని పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మేలు జాతి పునరుత్పత్తి పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పాడి రైతులకు సబ్సిడీపై లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్లను అందజేస్తారు. తద్వారా పాల ఉత్పత్తిని, మేలు రకం ఆడ దూడల పునరుత్పత్తిని పెంచుతారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పథకాన్ని ప్రస్తుతం చురుగ్గా అమలు చేస్తున్నారు. మొత్తం 8వేల పశువులకు ఇంజక్షన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పథకం ఉద్దేశం ఇదే... విజయనగరం జిల్లాలోని 27 మండలాల్లో పాడి సంపదను పెంచడం పథకం ఉద్దేశం. ఆవులు, గేదెలకు మేలు జాతి లింగ నిర్దారిత వీర్యం ఉపయోగించి, ఆడ(పెయ్య) దూడలను ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కచ్చితంగా 90 శాతం ఆడ దూడలనే పుట్టించడం, సదరు సాంకేతికతను రైతుల చెంతకు తీసుకెళ్లడం ఉద్దేశం. తద్వారా భవిష్యత్తులో అధిక శాతం మేలు జాతి పశువుల సంఖ్యను పెంచాలని సంబంధిత అధికారులు యోచిస్తున్నారు. అంతేగాకుండా ఈ పథకం ద్వారా పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు, పాడి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మేలు జాతి ఆడ దూడలను ఉత్పత్తి చేసే వీర్య కణాలను పశువులకు అందిస్తున్నారు. ఈ ఏడాది 8 వేల పశువులకు సదరు ఇంజక్షన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లింగ నిర్దారిత వీర్య కణాల రకాలివే రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా పశువులకు అందించడానికి ప్రభుత్వం కొన్ని రకాల మేలు జాతి వీర్య కణాలను ఎంపిక చేసింది. విదేశీ గోజాతులైన జెర్సీ, హెచ్ఎఫ్, వాటి క్రాస్ బ్రీడ్, స్వదేశీ జాతులైన గిర్, సాహివాల్ తదితర రకాలు అందుబాటులో ఉన్నాయి. గేదెల్లో ముర్రా జాతికి చెందిన వీర్య నాళికలు అందుబాటులో ఉన్నాయి. లింగ నిర్దారిత వీర్యంపై ఆసక్తి కలిగిన ఔత్సాహిక రైతులందరికీ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇటీవల కాలంలోనే ఈనిన పశువులు, 1 నుంచి 3 ఈతల మధ్య క్రమం తప్పకుండా ఎదకు వచ్చే పశువులు, ఎటువంటి గర్భకోశ వ్యాధులు లేనటువంటి పశువులను పథకానికి ఎంపిక చేస్తున్నారు. గ్రామాల ఎంపిక పథకం అమలుకు జిల్లా వ్యాప్తంగా మేలైన పశు సంపద, ఔత్సాహిక పశు పోషకులున్న గ్రామాలను పశు సంవర్ధకశాఖ అధికారులు ఎంపిక చేశారు. మొదటి దశలో జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రెండేసి చొప్పున గ్రామాల్లో పథకం అమలు చేస్తునారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 35 నుంచి 40 పశువులను గుర్తించి, రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ఆసక్తి కలిగిన రైతులకు అవగాహన కల్పించి, పథకాన్ని విస్తరింపజేస్తున్నారు. తద్వారా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పాడి సంపదను అభివృద్ధి చేస్తారు. పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఆడ దూడల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా ఆడ దూడల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా లింగ నిర్దారిత మేలు జాతి వీర్య కణాలను సబ్సిడీపై రైతులకు అందిస్తున్నాం. గ్రామాల్లోని పాడి రైతులకు సబ్సిడీపై వీర్య కణాల ఇంజక్షన్లు అందజేస్తున్నాం. రూ.1350 విలువ చేసే రెండు వీర్య కణాలను రూ.500కే అందిస్తున్నాం. మొదటి దశ పథకం అమలుకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాల్లో ఈ ఏడాది మొత్తం 8 వేల ఇంజక్షన్లను పశువులకు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆసక్తి కలిగిన రైతులు సంబంధిత పశుసంవర్ధక శాఖాధికారులను సంప్రదించాలి. – డాక్టర్ వైవి.రమణ, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి సబ్సిడీపై రెండు వీర్య నాళికలు ఈ పథకం ద్వారా ప్రభుత్వం పశువుల కృత్రిమ గర్భధారణకు అవసరమైన వీర్య నాళికలను సబ్సిడీపై పాడి రైతులకు అందజేస్తుంది. రెండు వీర్య నాళికల ధర రూ.1350 కాగా రైతు కేవలం రూ 500 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.850 ప్రభుత్వమే సబ్సిడీగా అందజేస్తుంది. ఒకవేళ రెండు పర్యాయాలు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్ చేసిన తర్వాత కూడా పశువు గర్భం దాల్చకపోతే రైతు చెల్లించిన మొత్తం రూ.500 ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. మొదటిసారి గర్భం దాల్చిన పశువుకు మగ దూడ పుట్టినట్లయితే ఎటువంటి మొత్తం తిరిగి చెల్లించరు. రెండోసారి గనుక మగ దూడ పుట్టినట్లయితే రూ.250 తిరిగి రైతుకు చెల్లిస్తారు. -
మూగ జీవాలకు కొండంత భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పశువుల ఆరోగ్య సంరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ కింద రెండో దశలో రూ.111.62 కోట్ల వ్యయంతో 165 పశు అంబులెన్స్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ఈ అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనంలోకి వెళ్లి.. వాటి పనితీరు, సేవలను స్వయంగా పరిశీలించారు. అంబులెన్స్‌లో కల్పించిన సౌకర్యాలతో పాటు తొలి దశలో ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా అందించిన సేవలను పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్ర కుమార్ సీఎంకు వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ 1962కు ఫోన్ రాగానే వాహనం నేరుగా ఆ గ్రామానికి చేరుకొని రైతు ఇంటి ముంగిటే సేవలందిస్తుందని చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమైతే సమీప పశు వైద్యశాలకు తరలించి వైద్య సేవలనంతరం పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఉచితంగా అదే అంబులెన్స్‌లో రైతు ఇంటికి భద్రంగా చేరుస్తున్నారన్నారు. పంజాబ్, చత్తీస్‌గఢ్, కేరళ తదితర రాష్ట్రాల బృందాలు ఇప్పటికే ఏపీలో పర్యటించి, మన అంబులెన్స్‌లను, వీటి ద్వారా అందిస్తోన్న సేవలను పరిశీలించి వెళ్లారని.. ఆయా రాష్ట్రాల్లో మన మోడల్లోనే అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అంబులెన్స్‌లో కల్పించిన సౌకర్యాలు, అందిస్తోన్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. సకాలంలో వైద్యం అందని పరిస్థితి రాష్ట్రంలో ఉండకూడదని సూచించారు. మూగ జీవాలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. పశు సంచార అంబులెన్స్ డ్రైవర్లకు నమస్కరిస్తున్న సీఎం జగన్ అందుబాటులో 340 అంబులెన్స్‌లు తొలిదశలో రూ.129.07 కోట్లతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 పశు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయగా, తాజాగా రెండో దశలో మరో 165 పశు అంబులెన్స్‌లను ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తెచ్చింది. మొత్తంగా రూ.240.69 కోట్లతో 340 పశు అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటి కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ (1962)ను ఏర్పాటు చేసింది. ఈ కాల్ సెంటర్ 3.71 లక్షల కాల్స్‌ను అటెండ్ చేయగా, అంబులెన్స్‌లు 1,28,625 ట్రిప్‌లు తిరిగాయి. 1,81,791 పశువులు, సన్న జీవాలు, పెంపుడు జంతువులను ప్రాణాపాయం నుంచి రక్షించి 1,26,559 మంది పశు పోషకులకు లబ్ధి చేకూర్చాయి. బుధవారం నాటి కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, స్పెషల్ సీఎస్ వై.మధుసూదనరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం.హనుమంతరావు, లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్దాల గిరి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పశు వైద్యానికీ పటిష్ట వ్యవస్థ
వైద్య ఆరోగ్య శాఖలో ఒక సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. అదే రీతిలో పశు సంవర్థక శాఖలో కూడా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగా గ్రామ స్థాయిలో పశు సంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలి. ఆర్బీకేల్లో పని చేస్తోన్న పశు సంవర్థక సహాయకుల సమర్థతను మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ స్థాయిలో పనిచేసే ఒకరిద్దరు వలంటీర్లను ఈ సేవల్లో భాగస్వాములను చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘నాణ్యమైన, మెరుగైన పశు వైద్య సేవలు అందించేందుకు సమర్థవంతంగా పనిచేసే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలి. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పని చేసేలా హేతుబద్ధమైన వ్యవస్థ ఉండాలి. తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. యూనిఫార్మిటీ తీసుకురావడం ద్వారా నాణ్యమైన సేవలు అందుబాటులోకి తీసుకు రావచ్చు. ఇందుకోసం తగిన మార్గదర్శక ప్రణాళిక తయారు చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలపై బుధవారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూగ జీవాలకు అందిస్తోన్న సేవల్లో దేశానికి మనం మార్గనిర్దేశంగా నిలిచామని, దాన్ని ఇదే రీతిన కొనసాగించాలన్నారు. మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్థ నుంచి ఆర్బీకేల్లో ఉన్న పశు సంవర్థక సహాయకులకు పూర్తి స్థాయి మద్దతు, సహకారం ఉండేలా చూడాలని చెప్పారు. దీనివల్ల సంతృప్త స్థాయిలో పశువులకు తగిన వైద్య సేవలుు అందించడానికి వీలవుతుందన్నారు. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) తయారు చేయాలని ఆదేశించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు విషయంలో ఏం చేయాలో నిర్ధిష్టమైన విధానాన్ని నిర్ధేశించుకున్న తర్వాత నాడు – నేడు కింద మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పర్యవేక్షణ కోసం హెల్త్ కార్డు ► ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకూ హెల్త్ కార్డు జారీ చేయాలి. వాటి ఆరోగ్య పరిస్థితి, పోషకుల వివరాలు ఆ కార్డులో పొందుపర్చాలి. ఈ కార్డుల జారీ వల్ల వాటికి అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుంది. ► పశువులకు నూరు శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలి. నెలవారీ లక్ష్యాలు నిర్దేశించుకుని పని చేయాలి. పశువులకు పంపిణీ చేసిన మందులను నిల్వ చేయడానికి ప్రతి ఆర్బీకేలో ఫ్రిజ్ సహా అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. ► పశు సంవర్థక శాఖలో అన్ని రకాల సేవల కోసం ఒకే నంబరు వినియోగించాలి. పశు పోషకుల వద్ద కాల్ సెంటర్ నెంబర్ ఉండాలి. పశువుల అంబులెన్స్‌ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎస్ఓపీ రూపొందించాలి. పశు సంవర్థక శాఖ ద్వారా అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ వివక్ష లేకుండా అర్హులందరికీ అందేలా చూడాలి. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేసే దిశగా కృషి చేయాలి. పాడి రైతుల జీవనోపాధిపై దృష్టి ► గడిచిన రెండేళ్లుగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున ఇచ్చాం. ఈ డబ్బు వారి జీవనోపాధి మార్గాలను మెరుగు పరచడానికి, ఆ మార్గాలను బలోపేతం చేయడానికి ఉపయోగ పడుతుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పనపై దృష్టి సారించాలి. ► పశుపోషణ సహా ఇతర జీవనోపాధి మార్గాల కోసం అవసరమైన రుణాలు మంజూరు విషయంలో అధికారులు దృష్టి సారించాలి. పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. పాల నాణ్యత పెరిగేలా శ్రద్ధ వహించాలి. రసాయనాలకు తావులేని పశు పోషణ విధానలపై అవగాహన పెంచాలి. ఆ దిశగా పాడి రైతులకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన మిల్క్ సొసైటీల వద్ద అమూల్ భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలి. చిత్తూరు డెయిరీని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలి. డెయిరీ పునరుద్దరణకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు ► ఆక్వా రైతులకు మేలు చేసేందుకే ఫీడ్, సీడ్ రేట్లపై నియంత్రణ కోసం చట్టాలను తీసుకొచ్చాం. వీటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఎలా తీసేశామో అదే రీతిలో ఆక్వా ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలి. – ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా ఆర్బీకే వ్యవస్థను బలోపేతం చేయాలి. అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకోవాలి. సహకార రంగంలో డెయిరీలు ఏర్పాటు చేస్తున్నట్టుగానే ఆక్వా రంగంలో కూడా సహకార పద్ధతిలోనే కొత్త ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుపై తగిన ఆలోచన చేయాలి. ఆక్వా సాగయ్యే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలి. ► ఫిషింగ్ హార్బర్ల పనులు వేగవంతం చేయాలి. నిర్ధేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తయ్యేలా చూడాలి. అప్పుడే మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. మత్స్యకారుల ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది. ప్రతి ఫిషింగ్ హార్బర్ నుంచి ఏటా కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇది పరోక్షంగా ఆర్థికాభివృద్ధికి దోహద పడుతుంది. ఉపాధి కోసం మన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండదు. ► ఈ సమావేశంలో పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, పశు సంవర్థక, పాడి పరిశ్రామిభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.మధుసూదనరెడ్డి, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్, మత్స్య శాఖ కమిషనర్ కే.కన్నబాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహ్మద్ బాబు తదితరులు పాల్గొన్నారు. రెండో ఫేజ్ హార్బర్లకు పర్యావరణ అనుమతులు ► రెండవ ఫేజ్‌లో నిర్మించనున్న వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ సహా అన్ని రకాల అనుమతులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ► మొదటి ఫేజ్‌లో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 92.5 శాతం పూర్తయ్యాయని, ఫిబ్రవరి 15 నాటికి మిగిలిన పనులు పూర్తవుతాయని చెప్పారు. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో కూడా పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. ప్రతి 3 నెలలకొకటి చొప్పున డిసెంబర్‌కల్లా మొదటి ఫేజ్ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ.3,520.57 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ► ఏపీలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్ విధానంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కేరళకు చెందిన అధికారులు రాష్ట్రాన్ని సందర్శించి వెళ్లారని, ఆయా రాష్ట్రాల్లో ఏపీ మోడల్లోనే పశు అంబులెన్స్‌ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని వివరించారు. ► ఆర్బీకే స్థాయిలో ఖాళీగా ఉన్న 4,765 పశు సంవర్థక సహాయకుల పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జగనన్న పాల వెల్లువ కింద 2.6 లక్షల మంది రైతులు సభ్యులుగా చేరారని, వారి నుంచి ఇప్పటి వరకు 6.06 కోట్ల లీటర్ల పాలను సేకరించామన్నారు. వచ్చే 2 నెలల్లో మరో 1,422 గ్రామాల్లోకి జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. -
పశుఆరోగ్య సేవా రథాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల్లో పశు వైద్యులు, పారా వెట్లు, డ్రైవర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని అంబులెన్స్‌ల ప్రాంతీయ పర్యవేక్షకుడు అనిల్ కుమార్ ఓ ప్రకటనలో కోరారు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పనిచేసేందుకు సిబ్బంది కావాలని తెలిపారు. ప్రతీ జిల్లాలో ఎనిమిది మంది పశువైద్యులు, ఎనిమిది మంది పారా వెట్(వెటర్నరీ టెక్నీషియన్)లు, ఎనిమిది మంది పైలట్ల(డ్రైవర్లు) చొప్పున మొత్తం 144 మంది సిబ్బంది అవసరమన్నారు. వెటర్నరీ వైద్యుల పోస్టులకు బ్యాచలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ విద్యార్హత కలిగి ఉండాలని, కొత్తగా పట్టా పొందిన వారితో పాటు రిటైర్డ్ డాక్టర్లు కూడా అర్హులే అన్నారు. పారా వెట్ పోస్టులకు డిప్లమో ఆఫ్ వెటర్నరీ సైన్స్ విద్యార్హత కలిగి 30 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. ఇక పైలట్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి, హెచ్ఎంవీ లైసెన్సుతో కనీసం 2–3 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలని, 35 ఏళ్ల లోపు వారై ఉండాలని తెలిపారు. ఆసక్తి గల వారు విజయవాడలోని ముత్యాలంపాడు వీధిలోని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9154984484లో సంప్రదించాలన్నారు. -
రాష్ట్రంలో లంపీస్కిన్ వ్యాధి తగ్గింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లంపీస్కిన్ వ్యాధి స్థిరంగా ఉందని, వ్యాధి వ్యాప్తి తగ్గిందని పశుసంవర్థక శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 8,263 గోజాతి పశువులు ఈ వ్యాధి బారిన పడగా.. 7,543 పశువుల్లో రికవరీ అయిందని తెలిపాయి. మొత్తం 54 పశువులు ఈ వ్యాధి సోకి మరణించాయని అధికారికంగా నిర్ధారించారు. ప్రస్తుతం 703 పశువుల్లో లంపీస్కిన్ వ్యాధిని కలుగజేసే వైరస్ ఉందని, రాష్ట్రంలోని మొత్తం 1,635 గ్రామాల్లోని పశువులకు వ్యాధి సోకిందని పశుసంవర్థక శాఖ అధికారులు చెపుతున్నారు. ఈ వ్యాధిని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 19,53,955 డోసుల గోట్‌పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చామని, అయితే మరణాల రేటు కొంత ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. పశుసంవర్థక శాఖ గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటివరకు అత్యధికంగా వనపర్తి జిల్లాలో 1,709 పశువులకు ఈ వ్యాధి సోకింది. ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాలోని 1,502 పశువులకు ఈ వ్యాధి సోకగా, నల్లగొండ జిల్లాలోని 920 పశువులు ఈ వైరస్ బారిన పడ్డాయి. అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 2, మెదక్‌లో 12, కరీంనగర్లో 18 పశువులకు ఈ వైరస్ సోకింది. కాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నామని, రాష్ట్రంలోని అన్ని గోజాతి పశువులకు మరో వారం, పది రోజుల్లో వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని పశుసంవర్థక శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ వ్యాధి బారిన పడిన పశువులకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు పశుసంవర్థక పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు సంసిద్ధత వ్యక్తంచేశారు. తమకు మందులు సరఫరా చేస్తే వీలైనన్ని గ్రామాలకు వెళ్లి గోజాతి పశువులకు ఈ వ్యాధి సోకకుండా, సోకిన పశువులు కోలుకునేలా సేవలందిస్తామని డిప్లొమా హోల్డర్ల సంఘం ప్రభుత్వానికి వెల్లడించింది. -
విజృంభిస్తున్న ‘లంపీస్కిన్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెల్లజాతి ఆవులు, ఎద్దులకు సోకుతున్న లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 5,219 పశువులు ఈ వ్యాధి బారినపడగా వాటిలో 24 ఆవులు మృతి చెందాయి. 2,484 పశువులు ఇప్పటికీ వ్యాధితో బాధపడుతున్నాయని పశుసంవర్ధక శాఖ తెలిపింది. 32 జిల్లాల్లో లక్షణాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లోని పశువులకు ఈ వ్యాధి సోకిందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షలకుపైగా తెల్లజాతి పశువులుంటాయని అంచనా వేస్తుండగా ఇప్పటివరకు మొత్తం పశుసంపదలో 0.27 శాతానికి ఈ వ్యాధి సోకింది. గత వారం, పది రోజులుగా ఈ వ్యాధికారక క్యాప్రిపాక్స్ వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 150 పశువులకు ఈ వ్యాధి సోకిందని అధికారులు వివరించారు. వ్యాధి సోకిన పశువులను ఐసొలేషన్‌లో ఉంచడంతోపాటు ఇప్పటివరకు 5,34,273 పశువులకు వ్యాక్సిన్లు వేశారు. వాతావరణ సానుకూలతతో ఉత్తరాదిలో ఐదారు నెలల కిందటి నుంచే ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని వేలాది పశువులు లంపీస్కిన్ కారణంగా చనిపోయాయి. అయితే సెప్టెంబర్ మధ్య వరకు రాష్ట్రంలో లంపీస్కిన్ ఆనవాళ్లు కనిపించలేదు. ఆ తర్వాత అక్కడక్కడా కనిపించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ వ్యాధి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే నష్టనివారణ చర్యలు చేపట్టడంతో రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండదని పశుసంవర్ధక శాఖ అధికారులు భావించారు. కానీ ఉన్నట్టుండి లంపీస్కిన్ వ్యాధి తీవ్రరూపం దాలుస్తోంది. దోమలు, ఈగలు, గోమార్ల ద్వారా సంక్రమించే క్యాప్రిపాక్స్ వైరస్‌కు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, చలి వాతావరణం కూడా తోడైందని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి రాష్ట్రంలోని 20 శాతం పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేంద్రం హెచ్చరికలు.. దేశంలో లంపీస్కిన్ వ్యాధి విజృంభిస్తున్న తీరుపై కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. పశువులకు వ్యాక్సినేషన్‌ను ఉధృతం చేయాలని శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించింది. లంపీస్కిన్ లక్షణాలు కనిపించిన పశువులున్న 5 కి.మీ. పరిధిలోని అన్ని గ్రామాల్లోగల పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్న పశుసంవర్ధక శాఖ... ఇకపై రాష్ట్రంలో అన్ని తెల్లజాతి పశువులకు టీకాలు వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 15 రోజుల కార్యాచరణను రూపొందించింది. యుద్ధప్రాతిపదికన పశువులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. లంపీస్కిన్ లక్షణాలివే.. ►పశువులకు తీవ్రమైన జ్వరం ►కంటి నుంచి నీరు కారడం ►చర్మంపై పెద్దపెద్ద గడ్డలు ►తీవ్రమైన ఒళ్లు నొప్పులు ►చర్మమంతా పొలుసులుగా మారడం ►పశువు మేత తినదు... పాలివ్వదు వ్యాధిబారినపడ్డ ఆవుల పాలు తాగొద్దు పశువుల్లో లంపీస్కిన్ లక్షణాలు కనిపిస్తే రైతులు వెంటనే స్థానిక పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. ముందుగా జ్వరం నియంత్రణకు వైద్యులు మందులు వాడతారు. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరం చేయాలి. ఆ పశువులు తిన్న గడ్డి ఇతర పశు వులకు వేయొద్దు. వాటి పాలు తాగొద్దు. ఈ వ్యాధి కారణంగా గొడ్డుమోతు తనం కూడా వచ్చే అవకాశముంది. – డాక్టర్ ఎస్. రాంచందర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రోగం గురించి చెప్పేవారే లేరు పశువులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ మందులు వాడాలి వంటి విషయాలు చెప్పే వారు మాకు అందుబాటులో లేరు. – బొక్కల మల్లారెడ్డి, హుజూరాబాద్ వ్యాక్సిన్ ఇచ్చారు.. లంపీస్కిన్ వ్యాధి నుంచి ఆవులను కాపాడేందుకు పశువైద్యులు మా ఆవులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆవులను మందలోకి వదలకుండా నేనే మేతకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నా. – కరుణాకర్‌రావు, మెట్పల్లి, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా రెండు ఎడ్లకు సోకింది మా రెండు ఎడ్లకు లంపీస్కిన్ వ్యాధి సోకింది. ఎడ్ల శరీరంపై దద్దుర్లు వచ్చాయి. పశు వైద్యాధికారికి చెబితే వచ్చి టీకాలు వేశారు. జాగ్రత్తలు చెప్పారు. – రాతిపల్లి మల్లేశ్, సుబ్బరాంపల్లి, చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా -
వైఎస్సార్ పశు బీమా.. రైతులకు ధీమా!
సాక్షి, అమరావతి: విపత్తులు, కరువు కాటకా లు, రోడ్డు, రైలు ప్రమాదాలు, విద్యుద్ఘాతా లతో ఏటా వేలాది మూగ, సన్నజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని కన్నబిడ్డల్లా సాకే యజమానుల బాధ వర్ణణాతీతం. తమ కుటుంబ పోషణకు వీటిపైనే ఆధారపడి జీవించేవారు ఆ జీవాలు మరణిస్తే తల్లడిల్లిపోతారు. ఈ నేపథ్యంలో వివిధ ఘటనల్లో మూగ జీవాలను కోల్పోతున్నవారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వైఎస్సార్ పశు బీమా పథకం ద్వారా వారికి అండగా నిలవ నుంది. ఈ మేరకు పశు సంవర్ధక శాఖ ప్రతిపా దనలను రూపొందిస్తోంది. అక్టోబర్ నెలాఖరు లో శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం కార్యాచ రణ సిద్ధం చేస్తోంది. పశువులు, మేకలు, గొర్రెలకు బీమాను వర్తింపజేయనుంది. చదవండి: దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్ మరింత మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో.. వివిధ ఘటనల్లో తమ పశువులు, సన్నజీవాలను కోల్పోతున్నవారిని ఆదుకోవడానికి ఇప్పటివరకు ప్రభుత్వపరంగా బీమా పథకం అంటూ ఏమీలేదు. గతంలో బీమా పథకాలపై కాస్త అవగాహన ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగినవారు మాత్రమే సొంతంగా తమ జీవాలకు బీమా చేయించుకునే వారు. అవి చనిపోయినæ ఏడాదికో రెండేళ్లకో.. అదీ బీమా కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే కానీ అరకొరగా పరిహారం దక్కేది కాదు. నూటికి 95 శాతం మంది అవగాహన లేక, ఆర్థికభారం కారణంగా బీమాకు దూరంగా ఉండేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా వైఎస్సార్ పశు నష్టపరిహారం కింద 1.12 లక్షల జీవాలకు రూ.58.02 కోట్ల పరిహారం అందించింది. ఇప్పుడు మరింత మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తీసుకొస్తోంది. 50 జీవాలకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు.. వైఎస్సార్ పశు బీమా పథకం కింద నాటు ఆవులు, గేదెలకు రూ.15 వేలు, మేలు జాతి గేదెలు, ఆవులకు రూ.30 వేల చొప్పున, సన్న జీవాలకు ఒక్కో దానికి రూ.6 వేలు చొప్పున పరిహారం ఇస్తారు. ఏడాదిలో ఒక రైతుకు గరిష్టంగా ఐదు పశువులకు మాత్రమే బీమా వర్తిస్తుంది. గతంలో ఏదైనా విపత్తు బారినపడి చనిపోతే ఒక్కో కుటుంబం పరిధిలో 20 సన్నజీవాలకు రూ.1.20 లక్షలకు మించకుండా పరిహారం చెల్లించేవారు. ఇప్పుడు దాన్ని 50 జీవాలకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు పరిహారం పొందేలా విస్తరిస్తున్నారు. గతంలో మూడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో మర ణిస్తేనే సన్నజీవాలకు పరిహారం ఇచ్చేవారు. ఇక నుంచి ఒక్క జీవి మరణించినా పరిహారం అందిస్త్రాు. అంతేకాదు తొలిసారి ఎద్దులు, దున్నపోతులతో పాటు కరువు బారిన పడిన పశువులకు కూడా బీమా వర్తింప చేయను న్నారు. అలాగే క్లైమ్ సెటిల్మెంట్లో జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పరిహారం చెల్లిం చేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మూగ, సన్నజీవాలకు పూర్తి స్థాయిలో బీమా కల్పించే లక్ష్యంతో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తెస్తు న్నాం. రాష్ట్రంలోని ప్రతి పాడి పశువుతో పాటు మూగ జీవాలు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్లకు కూడా బీమా కల్పిం చాలని సంకల్పించాం. ఇందుకోసం ప్రభుత్వం 80 శాతం ప్రీమియం భరి స్తోంది. ఈ పథకం కోసం మార్గదర్శ కాలు రూపొందిస్తున్నాం. అక్టోబర్ నెలాఖరులో ఈ పథకానికి శ్రీకారం చుట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. –డాక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ మొత్తం ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వానిదే.. వైఎస్సార్ పశు బీమా పథకం కింద చెల్లించే మొత్తం ప్రీమియంలో 80 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. 20 శాతం మాత్రమే సన్న, చిన్నకారు రైతులు భరించాల్సి ఉంటుంది. దేశీయ ఆవులు, గేదెలకు ఒక్కోదానికి ప్రభుత్వం రూ.924 ప్రీమియం భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.231, ఎద్దులు, దున్నపోతులకు ప్రభుత్వం ఒక్కోదానికి రూ.578 భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.116, మేకలు, గొర్రెలకు ప్రభుత్వం ఒక్కోదానికి రూ.185 భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.46 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద రైతుల తరఫున 80 శాతం ప్రీమియం రూపంలో ఏటా సుమారు రూ.110 కోట్లు వరకు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రైతులకు బాసటగా నిలిచే సిబ్బందికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని సంకల్పించింది. బీమా చేయించినందుకు రూ.50, పోస్టుమార్టంకు రూ.125 చొప్పున ఇవ్వనుంది. -
వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన
అది 2005, జూన్ 2. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పశుసంవర్థక శాఖపై ఉన్నతస్థాయి సమావేశం. ఏపీ డెయిరీ ఉద్యోగి రామదాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు రెడీ చేసుకున్నాడు. నిర్ణీత సమయం కంటే ఓ రెండు నిమిషాల ముందే వైఎస్ హాల్లోకి వచ్చారు. అధికారులెవరూ అప్పటికి రాకపోవటంతో రామదాసు భయపడుతూనే వైఎస్ వద్దకు వెళ్లి నిలుచున్నాడు. ఆయన ఏంటీ అనగానే.. సర్ నాకో ఆవు కావాలి అన్నాడు. దీంతో.. ఏమయ్యా అందరూ ఏదో పదవి కావాలనో, పోస్టింగ్ కావాలనో అడుగుతారు..నువ్వేంటి ఆవు కావాలంటున్నావు? అంటూ పకపకా నవ్వారు వైఎస్. అయినా నాకు పుంగనూరు ఆవు, కోడె ఇప్పించండి అని రామదాసు ధైర్యంగా అడిగాడు. ఇంతలో అధికారులు రావడంతో రామదాసు ఆశ వదులుకున్నాడు. కానీ భేటీ ముగిసిన తర్వాత సీఎస్ మోహన్‌కందాను పిలిచిన సీఎం వైఎస్..ఇతనికి ఒక పుంగనూరు ఆవు, కోడె ఇవ్వండి అంటూ రామదాసును చూపించారు. అలా పుంగనూరు ఆవు, కోడె రామదాసుకు దక్కాయి. తొలుత హైదరాబాద్ ఉప్పల్‌లోని తన ఇంట్లోనే వాటిని పెంచాడు. ఇప్పుడు వాటి సంతానం నలభైకి చేరింది. రామదాసు గోశాల యాదాద్రి జిల్లా మర్యాలకు మారింది. ఈ విధంగా పుంగనూరు గోవును రేపటి తరానికి అందించే కార్యాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు రామదాసు చెప్పాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం పుంగనూరు ఆవు పాలతో అభిషేకం జరుగుతున్న రీతిలో.. యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామికి కూడా పుంగనూరు పాలతో నిత్యాభిషేకం చేయాలన్నది తన ఆకాంక్ష అని తెలిపాడు. -
ఫ్యామిలీ డాక్టర్లా క్యాటిల్ డాక్టర్
గ్రామ స్థాయిలో రైతుల ముంగిటే పశువులకు క్రమం తప్పకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వివరాలను యానిమల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాలి. తద్వారా పశువు ఆరోగ్యం ఎలా ఉంది? టీకాలు ఎప్పుడివ్వాలి? చూలు సమయం ఎప్పుడు? లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ తరహాలో గ్రామాల్లో పశువులకు వైద్యసేవల కోసం క్యాటిల్ డాక్టర్ వ్యవస్థ తెచ్చేందుకు మండలం యూనిట్‌గా కార్యాచరణ రూపొందించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రతి ఆర్బీకేలో పశు సంవర్ధక శాఖ సహాయకులను నియమించి ఖాళీగా ఉన్న 5,160 పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వెటర్నరీ డాక్టర్లుగా పట్టాలు పొంది 1,200 మంది నిరీక్షిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పశు వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల, జిల్లా, డివిజన్ స్థాయిలో స్టాఫింగ్ ప్యాట్రన్ ఒకే రీతిలో ఉండేలా రేషనలైజేషన్ చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి తగిన కార్యాచరణతో తనకు నివేదించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. పశుసంవర్ధక శాఖపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆ వివరాలివీ.. సేంద్రీయ పాల ఉత్పత్తులు పురుగు మందులు, రసాయనాలను మితిమీరి వాడటంతో ఆహారం ద్వారా జంతువుల్లో చేరుతున్నాయి. పాలల్లో వాటి అవశేషాల కారణంగా క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే స్వచ్ఛమైన పాల ఉత్పత్తులపై రైతులను చైతన్యం చేయాలి. స్వచ్ఛమైన, నాణ్యమైన పాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ప్రధానంగా సేంద్రీయ పాల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. తక్కువ పెట్టుబడితో సేంద్రీయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించడంపై విస్తృత పరిశోధనలు జరగాలి. ఆ ఫలితాలను రైతులకు అందించే చర్యలు చేపట్టాలి. అమూల్ æద్వారా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి. భావి తరాల కోసం.. పాలు, గుడ్లు తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాటిని వినియోగిస్తాం. కానీ పాలల్లో రసాయన అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్న పరిస్థితులను చూస్తున్నాం. ఆరోగ్యవంతమైన పిల్లల ద్వారానే మంచి భావి తరాలు నిర్మాణం అవుతాయి. ఇందుకోసం నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించాలి. ఆ దిశగా పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులు పాటించేలా అమూల్ ద్వారా రైతులకు నిరంతర అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలి. పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో గ్రామ స్థాయిల్లో రైతులను చైతన్యపర్చాలి. అక్టోబర్‌లో పశువుల బీమా పథకం పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి. ఇందుకోసం ప్రత్యేక పథకానికి అక్టోబర్ నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రమాదవశాత్తూ, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా పశువులను కొనుగోలు చేస్తున్నారు. ఆ పశువులన్నింటికీ బీమా ఉందా? లేదా? అనేది మరోసారి పర్యవేక్షించాలి. ఆడిట్ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. బీమా ప్రీమియంలో 80 శాతం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం పశుపోషణ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం లభించేలా చూడాలి. పశుపోషణ విషయంలో వారికి అండగా నిలవాలి. దీనివల్ల వ్యవసాయంతో పాటు పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం ఆర్జించే అవకాశం కలుగుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. వైఎస్సార్ ఆసరా, చేయూత లబి్ధదారులైన మహిళలకు పశువుల పెంపకం విషయంలో తోడుగా నిలవాలి. బ్యాంకర్లతో మాట్లాడి వారికి ఉదారంగా రుణాలిచ్చేలా కృషి చేయాలి. ప్రతి ఆర్బీకేలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి. ‘లంపీ స్కిన్’పై జాగ్రత్త తాజాగా పశువుల్లో లంపీ స్కిన్ వ్యాధి వ్యాపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అడ్డుకట్ట వేసేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఆరోగ్యకరమైన పశువులకు ఈ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరిపడా మందులు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలి. అవసరమైన మేరకు టీకాలివ్వాలి. సమీక్షలో పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాడు – నేడుతో పశువుల ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలి పశువుల ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేయాలి. పాఠశాలలు, పీహెచ్‌సీల తరహాలోనే నాడు–నేడు కార్యక్రమం కింద వీటిని చేపట్టాలి. ప్రతి పశువుల ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలి. అధునాతన పరికరాలు అందుబాటులోకి తేవాలి. మండలం యూనిట్‌గా ప్రతి చోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలి. రెండో విడతలో మంజూరు చేసిన వాహనాలను అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేయాలి. -
ఆర్గానిక్ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పశు సంవర్ధక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పశువుల ఆస్పత్రుల్లో నాడు– నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్ తరహాలో పశువులకు వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛమైన పాల ఉత్పత్తికోసం అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫెస్టిసైడ్స్, రసాయనాలు ఎక్కువగా వాడుతున్నందున అవి జంతువుల్లోకి ఆహారం, వివిధ రూపాల్లో చేరి, తద్వారా పాలల్లో వాటి అవశేషాలకు దారితీస్తున్నాయని, అందుకనే స్వచ్ఛమైన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెంచాలని పేర్కొన్నారు. ఆర్గానిక్ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని సీఎం జగన్ తెలిపారు. దీని మీద సమగ్ర పద్ధతుల్లో ముందుకు వెళ్లాలన్నారు. అమూల్ ద్వారా రైతులకు మంచి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తక్కువ పెట్టుబడి, సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించే అంశంపై పరిశోధనలు, ఆ పరిశోధనల ఫలితాలను రైతులకు అందించే చర్యలు చేపట్టాలన్నారు. అమూల్ ద్వారా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఆలోచన చేయాలని పేర్కొన్నారు. పాలు, గుడ్లు వాడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, కానీ అవే పాలలో రసాయనాల అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందనే పరిస్థితులను చూస్తున్నామని సీఎం అన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలు ద్వారానే మంచి భవిష్యత్తు తరాలు నిర్మాణం అవుతాయని పేర్కొన్నారు. పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ పోస్టులను భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►వైయస్సార్ చేయూత, ఆసరా ద్వారా కొనుగోలు చేసిన పశువులన్నింటికీ కూడా బీమా ఉందా? లేదా? అనేది మరోసారి పర్యవేక్షించాలి. ►పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి. ►ఆడిట్ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. ►ప్రమాదవశాత్తూ, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు వస్తాయి. ►ఇలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. ►80శాతం ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుంది కేటిల్ డాక్టర్ కాన్సెప్ట్ ►పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో కూడా రైతులకు తగిన అవగాహన కల్పించాలి. ►సాయిల్ డాక్టర్ మాదిరిగా కేటిల్ డాక్టర్ కాన్సెప్ట్ కూడా అమలు చేయాలి. ►ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా పశువుల ఆరోగ్యాలను పరిశీలించి, పరీక్షించి వాటి వివరాలను పశు ఆరోగ్య కార్డుల్లో అప్‌గ్రేడ్ చేయాలి. వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు-నేడు ►వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద పనులు చేపట్టాలి. ►ఆ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ►మండలం ఒక యూనిట్‌గా తీసుకుని ప్రతిచోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక అమలు చేలి. ►వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలి. ►సెకండ్ ఫేజ్ కింద అక్టోబరులో మరిన్ని పశు అంబులెన్స్‌లు ప్రారంభానికి సిద్ధంచేస్తున్నట్టు వెల్లడించిన అధికారులు. ►ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి. ►ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే గ్రామాల్లోని పశువులకూ వైద్య సేవలు అందాలి. ►ఈమేరకు మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆమేరకు కార్యాచరణ రూపొందించాలి. సిబ్బందిని కూడా నియమించుకోవాలి ►వచ్చే సమావేశంలో దీనికి సంబంధించిన కార్యాచరణను నివేదించాలి గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతంపై దృష్టి ►రైతులకు ప్రత్యామ్నాయం ఆదాయాలు పశుపోషణ ద్వారా వచ్చేలా చూడాలి. ►పశుపోషణ విషయంలో వారికి అండగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ►దీనివల్ల వ్యవసాయంతోపాటు, పశుపోషణ ద్వారా అదనపు ఆదాయాలు లభిస్తాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ►ఆసరా, చేయూత కింద లబ్ధిదారులైన మహిళలకు పశువుల పెంపకంపై వారికి తోడుగా నిలవాలి. ►బ్యాంకర్లతో మాట్లాడి వారికి రుణాలు వచ్చేలా కృషిచేయాలి. ►ఆర్బీకేలలో, కమ్యూనిటి హైరింగ్ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచాలి. లంపీ వైరస్‌పై ముందు జాగ్రత్త చర్యలు ►జంతువుల్లో లంపీ వైరస్ వ్యాపిస్తుందన్న సమాచారం వస్తోంది ►దీనిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలి. ►వైరస్ జంతువులకు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ►సరిపడా మందులను, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలి. ఈ సమావేశంలో పశు సంవర్ధక, పాడి అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పశు సంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్. అమరేంద్ర కుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
చేపలు వదిలారు... గొర్రెలెప్పుడో?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలుపై ప్రభుత్వ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సమయంలో ఆ నియోజకవర్గంలో హడావుడి చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసిన పశుసంవర్థక శాఖ అధికారులు ఇప్పుడు గప్‌చుప్ కావడం చర్చనీయాంశమైంది. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అక్కడ 7,200 యూనిట్ల గొర్రెల కోసం లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు చెల్లించగా, వారికి గొర్రెలు ఎప్పుడివ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. అసలు ఈసారి గొర్రెల పంపిణీ ఉంటుందా లేదా అన్నదానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని, తామైతే లబ్ధిదారుల వివరాలను సేకరించామని చెబుతున్నారు. గొర్రెల కొనుగోలుకు అవసరమైన రూ.90 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందో తేలాల్సి ఉంది. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా..: రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో గొర్రెలు పంపిణీ చేశారు. అయితే, మునుగోడు విషయంలో ప్రభుత్వం భిన్నంగా ఆలోచిస్తోందనే చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనా మా వల్లనే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు అందుతున్నాయనే చర్చకు తావులేకుండా ఆచితూ చి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంకా గొర్రెల పంపిణీపై నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే, బుధవా రం మునుగోడు మండలంలోని కిష్టాపూర్ పెద్ద చెరువులో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వ హించింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, గొర్రెల సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్లు హాజరై అక్కడి చెరువులో చేపపిల్లలను వదిలారు. అలాగే, గొర్రెలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గొర్రెల పంపిణీ త్వరలో జరుగుతుందా? ఈసారి ప్రభుత్వ వ్యూహం ఏంటి? రెండో విడతలో భాగంగా అందరితోపాటే ఈ నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ ఉంటుందా? లేదా ఉప ఎన్నిక సమయంలోనే పంపిణీ జరుగుతుందా? అన్నది వేచిచూడాల్సిందే. -
పశురక్షణకు ఏపీ సర్కారు దీక్ష.. 94 బృందాలు 20 రోజులుగా సేవలు
సాక్షి, అమరావతి: ‘ఏమ్మా.. మిమ్మల్నే కాదు.. మీ పశువులను కూడా బాగా చూసుకున్నారు కదా..’ అంటూ ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరాతీస్తే అక్కడున్న ప్రతి పాడి రైతు ఆనందంతో అవునంటూ బదులివ్వడం గోదావరి వరదల సందర్భంగా మూగజీవాల రక్షణ విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుకు అద్దంపట్టింది. సాధారణంగా వైపరీత్యాల వేళ పెద్దసంఖ్యలో మృత్యువాతకు గురయ్యేవి మూగజీవాలే. ప్రభుత్వం ఈసారి ఆ పరిస్థితి రానివ్వలేదు. దాదాపు 26 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినప్పటికీ ఈసారి వేళ్లమీద లెక్కపెట్టదగినన్ని పశువులే ప్రాణాలు కోల్పోయాయంటే.. వాటి రక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం. 509 మంది సిబ్బందితో ఏర్పాటు చేసిన 94 బృందాలు 20 రోజులుగా సేవలందిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు సహాయ, పునరావాస చర్యలు కొనసాగించాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో యంత్రాంగం అహరహం శ్రమిస్తోంది. పాడి రైతులకు అండగా.. వరద ప్రభావానికి గురైన అల్లూరి సీతారామరాజు, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న 32 వేల పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీటికోసం 102 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. మృత్యువుతో పోరాడుతున్న 7,574 పశువులకు సకాలంలో వైద్యసేవలందించి వాటి ప్రాణాలను రక్షించారు. 243 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 7,945 పశువులకు అత్యవసర చికిత్స చేశారు. రూ.11.82 లక్షల విలువైన మందులను ఉచితంగా అందించారు. పశుపోషకులకు రూ.3.84 కోట్ల విలువైన 2,430 మెట్రిక్ టన్నుల సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్)తో పాటు రూ.1.96 లక్షల విలువైన మినరల్ మిక్చర్, ఇతర పోషకాలను ఉచితంగా పంపిణీ చేశారు. 30,770 పశువులకు వ్యాక్సిన్ వేశారు. ఈ ఐదు జిల్లాల పరిధిలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన వైఎస్సార్ సంచార పశువైద్య సేవారథాలు వరద సహాయక చర్యల్లో విశేష సేవలందించాయి. మారుమూల వల్లెల్లో సైతం వీటిద్వారా వ్యాక్సినేషన్, అత్యవసర వైద్యసేవలు అందించగలిగారు. 700 పశువుల ప్రాణాలను కాపాడాం వరదల సందర్భంగా మూగజీవాల రక్షణ కోసం ప్రభుత్వం çస్పందించిన తీరు నిజంగా ప్రశంసనీయం. రాజమహేంద్రవరం–కొవ్వూరు మధ్య గోదావరి నదీగర్భంలోని లంకభూముల్లో 700కు పైగా పశువులు చిక్కుకున్నాయని సమాచారం ఇవ్వగానే పశుసంవర్ధకశాఖ తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. లేగదూడలు, పాలిచ్చే గేదెలు, ఆవులను ప్రత్యేక బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చి అక్కడినుంచి బొబ్బర్లంక గోశాలకు తరలించింది. మిగిలిన వాటికి పశుగ్రాసం, తాగునీరు, వైద్యసహాయం అందించింది. ఈసారి లంకల్లో చిక్కుకున్న ఏ ఒక్క పశువు మృత్యువాతపడలేదు. – తేజోవంత్, రాష్ట్ర జంతుసంక్షేమ బోర్డు సభ్యుడు నిజంగా అభినందనీయం లంకభూముల్లో దూడలు మేపుకొంటాం. 1986లో గోదావరి వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. చాలా పశువులు చనిపోయాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వరదలకు ముందుగానే ప్రభుత్వం మమ్మల్ని అప్రమత్తం చేయడంతో మా పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పదిరోజుల ముందుగానే పశువులకు వ్యాక్సిన్ వేశారు. సంపూర్ణ మిశ్రమ దాణా అందిస్తున్నారు. మనుషులతో సమానంగా మూగజీవాల పరిరక్షణ కోసం ప్రభుత్వం పనిచేసిన విధానం నిజంగా అభినందనీయం. – పుచ్చకాయల నరసింహమూర్తి, పి.గన్నవరం సీఎం ఆదేశాల మేరకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సహాయ, పునరావాస కార్యక్రమాలను నేటికీ కొనసాగిస్తున్నాం. వరద ప్రభావిత గ్రామాల్లోని పశువులకు నూరుశాతం వ్యాక్సిన్ వేశాం. అవసరమైన దాణా, పశుగ్రాసం ఉచితంగా అందిస్తున్నాం. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్ పశుసంవర్ధకశాఖ -
మూగ జీవాలకూ అండగా..
సాక్షి, అమరావతి: మూగ జీవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.278 కోట్లతో 340 పశువుల అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి విడతగా రూ.143 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జెండా ఊపి ప్రారంభించారు.108,104 అంబులెన్స్‌ల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ మొబైల్ అంబులేటరీ క్లినిక్స్‌ను తీర్చిదిద్దారు. అంబులెన్స్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను వ్యవసాయ, పశు సంవర్థక శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్‌లు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. సౌకర్యాల పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూ మూగ జీవాలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. రెండో విడతలో రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సౌకర్యాలు ఇలా.. ► ప్రతి అంబులెన్స్‌లో ట్రావిస్‌తో పాటు వెయ్యి కిలోల బరువున్న మూగ జీవాన్ని తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం. ► 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రో స్కోప్‌తో కూడిన లేబరేటరీ. ► ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు. అందుబాటులో సీజన్ వారీగా అవసరమైన వ్యాక్సిన్లు, అన్ని రకాల మందులు. ► ప్రతి వాహనంలో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్. ► టోల్ ఫ్రీ నంబర్ 1962కు ఫోన్ చేసి పశువు అనారోగ్య సమాచారం తెలియజేస్తే చాలు రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. అవసరమైతే సమీప పశు వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం చేయిస్తారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఉచితంగా అదే అంబులెన్స్‌లో రైతు ఇంటికి భద్రంగా చేరుస్తారు. -
పాడి రంగానికీ ఆర్బీకేల దన్ను
అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామానికి చెందిన ఇతడి పేరు ఉయ్యూరు రామనరేష్. రెండు గేదెలు, రెండు ఆవులున్నాయి. గతంలో మార్కెట్లో దొరికే నాసిరకం దాణా వినియోగించటం వల్ల ఆశించిన స్థాయిలో పాల దిగుబడి వచ్చేది కాదు. పైగా పశువులు తరచూ అనారోగ్యం బారిన పడేవి. దీంతో ఆర్బీకేల ద్వారా ఇస్తున్న నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్) తీసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతడి పశువులు రోజుకు 1–2 లీటర్ల పాలను అధికంగా ఇస్తున్నాయి. ఆ పాలలో వెన్న శాతం కూడా పెరగడంతో మంచి ఆదాయం వస్తోందని, తానిప్పటి వరకు కిలో రూ.6.50 చొప్పున 200 కిలోల టీఎంఆర్ తీసుకున్నానని రామనరేష్ ఆనందంతో చెబుతున్నారు. సాక్షి, అమరావతి: పాడి పశువులకు నాణ్యమైన పశుగ్రాసం, దాణా అందిస్తే అధిక దిగుబడితోపాటు నాణ్యమైన పాలను ఇస్తాయి. మరోవైపు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయి. నాణ్యమైన పాల దిగుబడి వస్తే పాడి రైతుల ఆదాయానికి ఢోకా ఉండదు. ఇన్నాళ్లూ పశుగ్రాసం, దాణా కోసం పాడి రైతులు పాట్లు పడేవారు. వాటికి చెక్ పెడుతూ ఏడాదిగా ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్న పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్), నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమాలు, లివర్ టానిక్స్ తదితర పోషక మిశ్రమాలతోపాటు గడ్డి కత్తిరించే యంత్రాలు (చాప్ కట్టర్స్) వంటి వాటిని సబ్సిడీపై ఇస్తుండటంతో రైతుల వెతలు తీరుతున్నాయి. ఇందుకోసం పశు సంవర్ధక శాఖ 11ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుంది. సర్టిఫై చేసిన పశుగ్రాసం.. సంపూర్ణ మిశ్రమ దాణా పశుగ్రాసం కొరతకు చెక్ పెట్టేందుకు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన జొన్న (సీఎస్హెచ్–24 ఎంఎఫ్ రకం), మొక్కజొన్న (ఆఫ్రికన్ టాల్ రకం) పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదిలో 1.41 లక్షల మంది రైతులకు రూ.15.81 కోట్ల విలువైన 1,500 టన్నుల జొన్న, 489 టన్నుల మొక్కజొన్న పశుగ్రాస విత్తనాలు సరఫరా చేసింది. వీటిని 1,05,531 ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 4.21 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని రైతులు ఉత్పత్తి చేసుకుని పశుగ్రాసం కొరతను అధిగమించారు. మరోవైపు అత్యంత పోషక విలువలు గల సంపూర్ణ మిశ్రమ దాణాæ(టీఎంఆర్)ను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తోంది. దీనిని వాడటం వల్ల పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఇతర దాణాలేవీ పెట్టాల్సిన అవసరం ఉండదు. సర్టిఫై చేసిన మిశ్రమ దాణా కిలో రూ.15.80 కాగా.. రైతులకు సబ్సిడీపై రూ.6.50కే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రతి పాడి రైతుకు రెండు నెలలకు ఒకసారి 60 శాతం సబ్సిడీపై గరిష్టంగా 1,800 కిలోల చొప్పున ఇస్తోంది. ఇప్పటివరకు రూ.29.43 కోట్ల విలువైన 18,625 మెట్రిక్ టన్నుల టీఎంఆర్ దాణాను 46,563 మంది రైతులకు పంపిణీ చేసింది. మరోవైపు పశుగ్రాసం వృథాను అరికట్టేందుకు ఆర్బీకేల ద్వారా 40 శాతం రాయితీపై గడ్డి కత్తిరించే యంత్రాలు అందిస్తోంది. 2 హెచ్‌పీ 3 బ్లేడ్ చాప్ కట్టర్ ఖరీదు రూ.33,970 కాగా, సబ్సిడీ పోనూ రూ.20,382కే ఇస్తోంది. ఇప్పటివరకు రూ.4.52 కోట్ల విలువైన 2,173 చాప్ కట్టర్స్‌ను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. 3 టన్నుల టీఎంఆర్ తీసుకున్నా గతంలో నాణ్యమైన దాణా దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్లం. ఆర్బీకే ద్వారా ఇప్పటివరకు 3 టన్నుల టీఎంఆర్ తీసుకున్నా. బుక్ చేసుకున్న వారం లోపే అందిస్తున్నారు. దీని వినియోగంతో పాల దిగుబడి, నాణ్యత కూడా పెరిగింది. – పద్మజా భాను, దేవికొక్కిరపల్లి, యలమంచిలి పశుగ్రాసం వృథా కావడం లేదు నాకు 12 గేదెలు, 3 ఆవులు, 4 దూడలు ఉన్నాయి. మాది కరువు ప్రాంతం కావడంతో పశుగ్రాసం కొరత ఎక్కువ. దూరప్రాంతాల నుంచి పశుగ్రాసం తెచ్చుకున్నా చాలావరకు వృథా అయ్యేది. 2 హెచ్‌పీ సామర్థ్యం గల చాప్ కట్టర్ కోసం ఆర్బీకేలో బుక్ చేశా. దీన్ని ఉపయోగించడం వల్ల పశుగ్రాసం వృథా కావడం లేదు. – డి.మోహన్‌దాస్, వీరుపాపురం, కర్నూలు జిల్లా ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఇన్పుట్స్ సరఫరా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయం మేరకు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన, సర్టిఫై చేసిన పశుగ్రాసం విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, ఖనిజ లవణ మిశ్రమాలతో పాటు గడ్డి కత్తిరించే యంత్రాలు సబ్సిడీపై అందిస్తున్నాం. వీటివల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. పాల దిగుబడితో పాటు నాణ్యత కూడా పెరిగిందని రైతులు చెబుతున్నారు. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ -
వెటర్నరీ ల్యాబ్‌ల ఏర్పాటు ఘనత సీఎం జగన్‌దే
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మూగజీవాలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో వెటర్నరీ ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని పశు సంవర్ధక శాఖ ల్యాబ్ టెక్నీషియన్ల అసోసియేషన్ అధ్యక్షుడు డి.అశోక్‌కుమార్ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ల ఆత్మీయ సదస్సు విజయవాడలో ఆదివారం జరిగింది. అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికో వెటర్నరీ ల్యాబ్ ఏర్పాటు చేసి డీఎంఎల్టీ అర్హత కలిగిన తమలాంటి వారికి ల్యాబ్ టెక్నీషియన్లుగా నియమించారన్నారు. ఈ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు తామంతా రుణపడి ఉంటామన్నారు. పశు సంవర్ధక శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ల కాంట్రాక్ట్‌ను మరో రెండు సంవత్సరాలు పొడిగించిన సీఎం వైఎస్ జగన్, మంత్రి సీదిరి అప్పలరాజు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సదస్సులో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.రవీంద్రనాథ్, కార్యదర్శి కె.రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రంగస్వామి, సంయుక్త కార్యదర్శి ఇజ్రాయేల్ పాల్గొన్నారు. -
పశు సంవర్ధక ల్యాబ్‌లకు అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోని 60 డాక్టర్ వైఎస్సార్ పశు సంవర్ధక వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలకు ఒకేసారి ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్) గుర్తింపుతో పాటు ఐఎస్ఒ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) సర్టిఫికెట్ లభించింది. వీటి ద్వారా సేవల్లో నాణ్యత పెరగడంతో పాటు ధ్రువీకరించిన నాణ్యమైన ఇన్పుట్స్ అందించేందుకు వీలవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాడి రైతులకు నాణ్యమైన సేవలే లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేట్ రిఫరల్ ల్యాబ్‌ను, డాక్టర్ వైఎస్సార్ పశు సంవర్ధక ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ప్రాంతీయ స్థాయిలో 4, జిల్లా స్థాయిలో 10, నియోజకవర్గ స్థాయిలో 154 ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌కు అనుబంధంగా ఇవి పనిచేస్తాయి. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి ల్యాబ్‌లు ఉన్నాయి. ఇటీవలే 65 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలినవి కూడా త్వరలో రానున్నాయి. వీటిలో 20 రకాల పరీక్షలు చేస్తారు. వీటిలో 60 ల్యాబ్‌లకు ఐఎస్ఒ–9001:2015 సర్టిఫికేషన్‌తో పాటు ఎన్ఏబీఎల్ గుర్తింపు కూడా లభించింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 11, కర్నూలులో 7, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఆరేసి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఐదేసి, శ్రీకాకుళంలో 4, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో రెండేసి, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ల్యాబ్‌లకు ఈ గుర్తింపు లభించింది. గుర్తింపుతో ప్రయోజనాలెన్నో.. ఈ గుర్తింపుతో ల్యాబ్‌ల సామర్థ్యం పెరుగుతుంది. మరింత నాణ్యమైన సేవలకు అవకాశం ఏర్పడుతుంది. ధ్రువీకరించిన నాణ్యమైన దాణాను అందించవచ్చు. పాడి రైతులకు సరఫరా చేసే ఇన్పుట్స్ నాణ్యతను పరీక్షించి, ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొచ్చు. రాష్ట్రంతోపాటు దక్షిణ భారత దేశంలోని ఇతర రాష్ట్రాల పాడి రైతుల అవసరాలను తీర్చ గలిగే స్థాయికి మన ల్యాబ్‌ల సామర్థ్యం పెరుగుతుంది. కేంద్ర కార్యదర్శి ప్రశంసలు దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నియోజకవర్గ స్థాయిలో పశు సంవర్ధక వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారని కేంద్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అతుల్ చతుర్వేది ప్రశంసించారు. ఒకేసారి 60 ల్యాబ్‌లకు ఐఎస్ఓ, ఎన్‌ఎబీఎల్ గుర్తింపు లభించిన సందర్భంగా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ముఖ్యమంత్రి కృషి ఫలితమే నాణ్యమైన ఇన్పుట్స్ అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు వ్యవసాయ, పాడి, ఆక్వా రైతుల కోసం ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్‌లున్న ఏకైక రాష్ట్రం మనదే. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని ఏర్పాటు చేశాం. అత్యుత్తమ సేవలందిస్తున్నాం. ఒకేసారి 60 ల్యాబ్‌లకు ఐఎస్ఓ, ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించడం ముఖ్యమంత్రి కృషి ఫలితమే. మిగిలిన ల్యాబ్‌లకు కూడా త్వరలోనే గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి -
పాడి కోసం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్
సాక్షి, అమరావతి: అన్నివేళలా అన్నదాతలకు అండగా నిలిచేందుకు గన్నవరంలోని ‘సమీకృత రైతు సమాచార కేంద్రం’ మాదిరిగానే పాడి రైతుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని మూగజీవాలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలందించాలన్న సంకల్పంతో రూ.7.53 కోట్లతో దేశంలోనే తొలిసారి ఏర్పాటవుతున్న ఈ కాల్‌సెంటర్ నిర్వహణకు మార్గదర్శకాలను జారీచేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ ద్వారా పాడిరైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు టెలిమెడిసిన్ సేవలు కూడా అందిస్తారు. ఉదయం 9.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది. -
దేశీ ఆవుకు యమ డిమాండ్
సాక్షి, అమరావతి: దేశీయ నాటు ఆవుల సంతతిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్వదేశీ నాటు ఆవుల క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ ఒంగోలు, పుంగనూరు జాతి ఆవులతోపాటు దేశీయంగా లభించే గిర్, సాహివాల్, రెడ్ సింధి, రాటి జాతి ఆవుల పరిరక్షణ ధ్యేయంగా ‘వైఎస్సార్ దేశీయ గో పెంపక కేంద్రాల’ పేరిట ఇప్పటికే రూ.17.40 కోట్లతో 58 చోట్ల యూనిట్లు ఏర్పాటు చేసింది. వీటికి రైతుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో కొత్తగా రూ.15.60 కోట్లతో మరో 52 పెంపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో స్వదేశీ ఆవులను పునరుత్పత్తి చేస్తూ వాటి సంతతిని పెంపొందించడం, ఏ–2 పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలన్న సంకల్పంతో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే జిల్లాకు నాలుగు చొప్పున పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేయగా, తాజాగా మరో నాలుగు చొప్పున ఏర్పాటు చేయబోతుంది. ఒక్కో యూనిట్‌కు రూ.30 లక్షలు వీటి ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటైన జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీల ద్వారా పాడి రైతులతో ఏర్పాటైన జాయింట్ లయబిలిటీ గ్రూపుల(జేఎల్‌జీ)ను ఎంపిక చేస్తారు. ఒక్కొక్క గ్రూపునకు రూ.30 లక్షల అంచనా వ్యయంతో ఒక్కో యూనిట్ మంజూరు చేస్తారు. ఈ మొత్తంలో 50 శాతం (రూ.15 లక్షలు) సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన మొత్తంలో రూ.6 లక్షలు జేఎల్‌జీ గ్రూపు భరించాల్సి ఉండగా, రూ.9 లక్షలను బ్యాంక్ రుణంగా అందిస్తారు. ఒకవేళ సబ్సిడీ పోను మిగిలిన 50 శాతం తామే భరించేందుకు ముందుకొస్తే ఆ గ్రూపునకు బ్యాంక్ రుణంతో సంబంధం లేకుండా యూనిట్ మంజూరు చేస్తారు. ఒక్కో యూనిట్ కింద ఒక్కొక్కటీ రూ.75 వేల నుంచి రూ.లక్ష విలువైన 20 దేశీ ఆవులు, ఓ ఆబోతును అందజేస్తారు. మిగిలిన మొత్తంతో పాల ఉత్పత్తి కోసం ప్రత్యేక పరికరాలు, సంరక్షణకు ప్రత్యేకంగా షెడ్లు నిర్మించుకోవాలి. ప్రతి క్షేత్రానికి అనుసంధానంగా ఐదెకరాల్లో సేంద్రియ పశుగ్రాసం సాగు చేపట్టాల్సి ఉంటుంది. విజయనగరం జిల్లాలో వైఎస్సార్ స్వదేశీ గోపెంపకం కేంద్రంలోని ఒంగోలు జాతి గోవులు ‘ఆంధ్రా గో పుష్టి’ పేరిట బ్రాండింగ్ నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ఎస్ఓపీ) ప్రమాణాలతో ఏర్పాటయ్యే ఈ క్షేత్రాలకు అదితి ఆర్గానిక్ సర్టిఫికేషన్ (బెంగళూరు) ద్వారా సేంద్రియ ధ్రువీకరణ చేస్తారు. ఇక్కడ ఉత్పత్తయ్యే ఏ–2 పాలతో పాటు ఆవుల పేడ, గో మూత్రం, పంచగవ్య, జీవామృతం వంటి ఉప ఉత్పత్తులకు ‘ఆంధ్రా గో పుష్టి’ పేరిట బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. పాల సేకరణకు ప్రత్యేకంగా అమూల్ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తారు. పాల ఉప ఉత్పత్తులు, పునరుత్పత్తి ద్వారా వృద్ధి చేసిన స్వదేశీ ఆవులు, ఆబోతులను ఆర్బీకేల ద్వారా విక్రయించుకోవచ్చు. పునరుత్పత్తి ద్వారా ఐదేళ్లలో వాటి సంతతిని ఒక్కో క్షేత్రంలో 50 ఆవులు, 31 ఎద్దులను వృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదనపు ఆదాయం.. అంతరించిపోతున్న అరుదైన దేశీ ఆవుల సంతతిని పరిరక్షించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఏ–2 పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఏర్పాటు చేసిన 58 గో క్షేత్రాలను త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి నాటు ఆవుల పరిరక్షణే.. దేశీ నాటు ఆవులను సంరక్షించడమే లక్ష్యంగా కొత్తగా మరో 52 క్షేత్రాలను ఏర్పాటు చేయబోతున్నాం. వీటికోసం జేఎల్‌జీ గ్రూపుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. – డాక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ -
50 శాతం సబ్సిడీతో ‘ఐస్‌క్రీం సైకిళ్లు’
సాక్షి, హైదరాబాద్: విజయ పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ఐస్ క్రీం పుష్ కార్ట్ (ట్రై సైకిల్)లను రాష్ట్రవ్యా ప్తంగా 50 శాతం సబ్సిడీతో అందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో విజయ తెలంగాణ బోర్డు 14వ సమావేశం చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటర్ పాలకు రూ.4 ఇన్సెంటివ్‌తో పాటు అదనంగా పాడి రైతుల పిల్లలను విద్యలో ప్రోత్సహించే విధంగా విద్యాకానుక, ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సహాయం కింద రూ. 5 వేలు, సబ్సిడీపై దాణా, ఉచిత పశువైద్య శిబిరాలు, పాడి పశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం, మిల్క్‌షెడ్‌లకు అవార్డులు, ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాలను విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. మేలుజాతి పశుసంపద అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న స హకారం గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వారు విజయ డెయిరీకే పాలు పోసేవిధంగా చూడాలని మంత్రి సూ చించారు. పాడి రైతులకు ప్రతి 7 రోజుల కు ఒకసారి బిల్లులను చెల్లించాలని సమావేశం తీర్మానించింది. పాల సేకరణ, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం అవసరమైన సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ని యమించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రధాన పర్యాటక ప్రాంతా లు, ప్రముఖ దేవాలయాల వద్ద విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, సమ్మక్క సారక్క, కొమురెల్లి జాతర వంటి ప్రధాన జాతరలలో తాత్కాలిక ఔట్లెట్లను ఏర్పాటుచేసి విజయ డెయిరీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని మంత్రి తెలిపారు. -
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా రాంచందర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధిపతిగా డాక్టర్ ఎస్.రాంచందర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీగా ఉన్న ఆయనకు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘వైఎస్సార్ పశుసంజీవని’కి శ్రీకారం
సాక్షి, అమరావతి: స్పెషలిస్ట్ వైద్యులతో నాణ్యమైన వైద్యసేవలను పశుపోషకుల గడప వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పశుసంజీవని పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు బుధవారం ఆన్లైన్లో ప్రారంభించారు. స్పెషలిస్ట్ బృందాలకు ఈ పథకం కింద ప్రత్యేకంగా సర్జికల్, గైనిక్, మెడికల్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు స్పెషలిస్టు పశువైద్యులు తమ ఆస్పత్రి పరిధిలో మాత్రమే వైద్యసేవలు అందించేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ మారుమూల పల్లెల్లో సైతం స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైఎస్సార్ పశుసంజీవని పథకం ప్రారంభించారు. స్పెషలిస్ట్ డాక్టర్లతో ఏర్పాటు చేసిన వైద్య బృందాల ద్వారా ఆర్బీకే స్థాయిలో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో పశుపోషకుల ఇంటివద్ద పారా సిబ్బంది, పశుసంవర్ధక సహాయకుల సహకారంతో వైద్యసేవలందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలు. డివిజన్‌కు ఒకటి చొప్పున రూ.1.20లక్షల విలువైన కాల్పోస్కోప్‌ను అందజేశారు. ప్రతి వైద్య బృందానికి రూ.లక్ష విలువైన శస్త్ర చికిత్సలు చేయతగ్గ పరికరాలతో కూడిన కిట్లతో పాటు రూ.10వేల విలువైన మందుల కిట్లను కూడా అందజేస్తున్నారు. ఇక వైద్యసేవలందించే స్పెషలిస్ట్ వైద్యులకు శిబిరాలకు వెళ్లే సమయంలో రవాణా చార్జీల కోసం ఒక్కో వైద్యునికి రూ.10వేలు అందజేస్తారు. వీటి కోసం రానున్న రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1.74కోట్లు ఖర్చు చేయనుంది. త్వరలో 340 సంచార పశువైద్యశాలలు ఆరోగ్యకరమైన పశుసంపద ద్వారా పశుపోషణ లాభదాయకంగా మార్చాలన్న లక్ష్యంతో ‘వైఎస్సార్ పశు సంజీవని’ పథకాన్ని ప్రారంభించాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు త్వరలో 340 సంచార పశు వైద్యశాలలను ప్రారంభిస్తాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి -
‘జగనన్న పాల వెల్లువ’ పథకంతో పుంజుకున్న పాడి పరిశ్రమ
ప్రకాశం జిల్లాలో గత పాలకుల నిర్లక్ష్యంతో ఒట్టిపోయిన పాలధారలు ‘జగనన్న పాల వెల్లువ’ పథకంతో మళ్లీ పుంజుకున్నాయి. పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ సహకార పాల డెయిరీలను అమూల్‌తో భాగస్వామ్యం చేయడం ద్వారా పాడి రైతుకు గిట్టుబాటు ధరతో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. తొలి విడతగా 242 గ్రామాల్లో పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 10 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. తద్వారా పాడి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా పాలవెల్లువ సృష్టించనున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. టీడీపీ హయాంలో నిలువునా మోసపోయిన పాడి రైతుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఉనికి కోల్పోయిన ఒంగోలు డెయిరీకి అమూల్ భాగస్వామ్యం కల్పించి డెయిరీ రంగానికి జవసత్వాలు అందిస్తోంది. టీడీపీ హయాంలోని డెయిరీ పాలక మండలి సహకార రంగంలో ఉన్న ఒంగోలు డెయిరీని కంపెనీ యాక్ట్‌లోకి మార్చింది. ఒక పథకం ప్రకారం అప్పుల ఊబిలోకి నెట్టి ఒట్టిపోయిన గేదెలా తయారు చేసింది. ఇదే అదునుగా హెరిటేజ్ డెయిరీతో పాటు ఇతర ప్రైవేట్ డెయిరీలు జిల్లా పాడి రైతులకు సరైన ధర ఇవ్వకుండా నిలువు దోపిడీ చేశాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంగోలు డెయిరీ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమూల్‌ను రంగంలోకి దించి పాడి రైతులకు పూర్వ వైభవాన్ని సంతరించిపెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. ఆర్థిక పురోభివృద్ధి దిశగా.. జగనన్న పాల వెల్లువతో మహిళలు ఆర్థిక పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. 2020 నవంబరులో ఈ పథకాన్ని జిల్లాలో ప్రారంభించారు. తొలి విడతగా 201 గ్రామాల్లో పాలకేంద్రాలు ప్రారంభించారు. అనంతరం మరో 41 కేంద్రాలను విస్తరింపజేశారు. 242 గ్రామాల్లోని పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 10 వేల లీటర్ల పాలు సేకరించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో 37.12 లక్షల లీటర్ల పాలు సేకరించారు. అందుకుగాను రూ.19.18 కోట్లు మహిళా పాడి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. పాడి గేదెల ద్వారా ప్రోత్సాహం పాలుపోసే రైతులకు పాడి గేదెల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా చేయూతనిస్తున్నారు. అలాగే ఎక్కువ మోతాదులో పాలు ఇచ్చే ముర్రా జాతి గేదెలతో పాటు ఇతర మేలు రకం జాతి గేదెల కొనుగోలు చేపట్టారు. వర్కింగ్ కాపిటల్ కింద ఒక్కొక్క గేదెకు ప్రధాన మంత్రి పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.30 వేలు చొప్పున, మరో రూ.70 వేలు బ్యాంకు ద్వారా అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 178 మంది మహిళా రైతులకు రూ.1.52 కోట్లు రుణాల రూపంలో ఇచ్చారు. సహకార బ్యాంకుతో పాటు కమర్షియల్ బ్యాంకుల ద్వారా 194 మంది మహిళా పాడి రైతులకు రూ.2.02 కోట్లు, అదేవిధంగా సెర్ప్ ద్వారా 792 మందికి రూ.7.33 కోట్లు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తంగా జిల్లాలో మహిళా పాడి రైతులు 1,164 మందికి రూ.10.53 కోట్లు ఇచ్చారు. వలంటీర్లతో సర్వే జగనన్న పాల వెల్లువ కేంద్రాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జగనన్న పాల వెల్లువకు పాలుపోసే మహిళా రైతుల పశుగణాభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా 210 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, 201 మెట్రిక్ టన్నుల దాణామృతం (టీఎంఆర్) అందించనున్నారు. అలాగే 40 శాతం రాయితీపై పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసే ఛాప్ కట్టర్స్‌ను రైతులకు ఇస్తున్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి మేలుజాతి పశువుల ఉత్పత్తి కోసం 2020–21 సంవత్సరంలో 110 శాతం లక్ష్య సాధనతో జిల్లాలో 4.50 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో కనీసం 10 దేశీయ పశువులు కలిగి కృత్రిమ గర్భధారణ సౌకర్యంలేని రైతులకు జిల్లాలో 55 ఆబోతు దూడలను ఉచితంగా అందజేయనున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పిస్తున్నాం. ఎలాంటి షూరిటీలు లేకుండా మహిళా పాడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాం. గ్రామాల్లో పాడి పరిశ్రమకు గత వైభవాన్ని తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాం. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతి రోజు జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తున్నారు. అమూల్ సంస్థ ద్వారా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ప్రతి ఇంటిలో పాడి పరిశ్రమ ఉండేలా చూస్తున్నాం. – డాక్టర్ కొప్పరపు బేబీరాణి, జాయింట్ డైరెక్టర్, జిల్లా పశుసంవర్థక శాఖ -
మటన్ మార్ట్ల ప్రతిపాదన లేదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మటన్ మార్ట్ల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఒక ప్రకటనలో విమర్శించారు. సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఇప్పటికే ఆక్వాహబ్‌లు, స్పోక్స్, మినీ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేరీతిలో అపరిశుభ్ర వాతావరణంలో అమ్మకాలు జరుగుతున్న మాంసపు ఉత్పత్తులను సర్టిఫై చేసి పరిశుభ్ర వాతావరణంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని శాఖాపరంగా ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి ద్వారానే హైజినిక్ కండిషన్లో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన మినీ రిటైల్ అవుట్లెట్ల ద్వారా నాణ్యమైన మాంసపు ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించినట్లు తెలిపారు. వీటిద్వారా ఈ రంగంలోనే స్థిరపడిన యువతకు సబ్సిడీపై ఆర్థిక చేయూత ఇవ్వడం ద్వారా వారిని సమర్థులైన వ్యాపారులుగా తీర్చిదిద్దాలని ఆలోచించినట్లు తెలిపారు. ఇది శాఖాపరంగా పరిశీలనలో ఉందే తప్ప ప్రతిపాదనస్థాయిలోగానీ, ప్రభుత్వ పరిశీలనలోగానీ లేదని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటివరకు ప్రభుత్వంగానీ, సీఎం వైఎస్ జగన్‌గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ఆక్వాహబ్‌ల తరహాలోనే నాణ్యమైన మాంసపు ఉత్పత్తుల విక్రయాల ద్వారా వాటికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని ఆలోచించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. విపక్షాలతో పాటు సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని రాద్ధాంతం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. ధైర్యంగా ఉండండి బహ్రెయిన్ కార్మికులతో మాట్లాడిన మంత్రి అప్పలరాజు కాశీబుగ్గ: బహ్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులతో మంత్రి డాక్టర్ అప్పలరాజు కాశీబుగ్గలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ‘ఉపాధికోసం వెళితే.. చిత్రహింసలు’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏపీ నాన్ రెసిడెన్షియల్ తెలుగు అసోసియేషన్‌తో మాట్లాడి అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. పనిచేసే చోట ఇబ్బందుల దృష్ట్యా స్వదేశానికి, అందులో మన ప్రాంతానికి వచ్చేయాలని అనుకుంటే మాట్లాడతామని, మన ప్రభుత్వం తరఫున పూర్తి సాయం అందిస్తామని చెప్పారు. కార్మికులు, కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని, అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని సూచించారు. -
పశు వైద్యులే ఫీడ్ ఇన్స్పెక్టర్లు
సాక్షి, అమరావతి: పశుదాణా తయారీ, నాణ్యతా నియంత్రణ, అమ్మకం, పంపిణీ చట్టం–2020ను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ఫీడ్ ఇన్స్పెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం అమలు కోసం ఏర్పాటు చేసిన ‘కంట్రోలింగ్ అథారిటీ’గా పశు సంవర్థక శాఖ డైరెక్టర్ వ్యవహరిస్తుండగా.. జిల్లా స్థాయిలో కలెక్టర్/పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు లైసెన్సింగ్ అథారిటీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పశు దాణా నాణ్యతను తనిఖీ చేసే అధికారాన్ని రాష్ట్ర స్థాయిలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌కు, క్షేత్ర స్థాయిలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. వీరు ఫీడ్ ఇన్స్పెక్టర్లుగా వ్యవహరిస్తారు. క్షేత్ర స్థాయిలో పశు దాణా శాంపిల్స్ సేకరించి వాటి నాణ్యత పరిశీలన కోసం ప్రభుత్వం గుర్తించిన ప్రయోగశాలలకు పంపించొచ్చు. రాష్ట్రంలోను, దేశంలోను, ఇతర దేశాల్లో తయారైన పశుదాణా/ఖనిజ లవణ మిశ్రమాల దిగుమతి, విక్రయాలు జరిపేటప్పుడు నాణ్యతాపరంగా తనిఖీచేసే అధికారం వీరికి ఉంటుంది. నాణ్యత లోపాలను గుర్తిస్తే సంబంధిత వ్యాపారులు/ఉత్పత్తిదారులపై చర్యలు తీసుకోవచ్చు. దాణా తయారీలో నిర్దేశిత ప్రమాణాలను పాటించని, తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై ఈ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారికి కనీసం ఏడేళ్ల పాటు జైలు శిక్ష, తగిన జరిమానా విధించే అవకాశం కూడా ఈ చట్టం కల్పిస్తుంది. -
Kurnool: జీవాల పెంపకం ఇక శాస్త్రీయం
కర్నూలు (అగ్రికల్చర్) : గొర్రెలు, మేకల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. జీవాల పెంపకాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం పెంపకందారులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ప్యాపిలి మండలంలోని హుసేనాపురంలో పదెకరాల్లో శిక్షణ కేంద్రం భవన సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. భవనాలు పూర్తయ్యే వరకూ తాత్కాలికంగా డోన్ పట్టణంలోని పశుసంవర్థక శాఖ రైతు శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణ ఇస్తారు. విశాఖలోని స్టేట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అధికారులు రూపొందించిన మాడ్యూల్స్ ప్రకారం శిక్షణ ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద 2 కోట్లకు పైగా జీవాలుండగా, రాయలసీమ జిల్లాల్లోనే కోటి వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల కర్నూలులో రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. విత్తనపు పొట్టేళ్ల ఎంపిక, టీకాలు వేయించడం తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇస్తారు. వచ్చే నెల 1 నుంచి మూడు రోజుల పాటు.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి శిక్షణ తరగతులుంటాయి. గొర్రెల పెంపకందారులను బ్యాచ్‌లుగా విభజించి మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. రెండు రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ఒక్కరోజు అనంతపురం జిల్లాలోని గొర్రెల ఫామ్‌కు తీసుకెళ్లి ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తారు. గొర్రెల పెంపకందారులకు అదృష్టమే శాస్త్రీయ పద్ధతుల్లో గొర్రెల పెంపకాన్ని చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయం. మాకు 200 గొర్రెలున్నాయి. వీటిని పెంచడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇస్తే.. గొర్రెల పెంపకం లాభసాటిగా ఉంటుంది. – పరమేష్, గొర్రెల పెంపకందారు, యు.కొత్తపల్లి, డోన్ మండలం -
కొనుగోలు ప్రాంతంలోనే గొర్రెల బీమా
సాక్షి, హైదరాబాద్: రెండో విడతలో పంపిణీ చేసే గొర్రెలకు కొనుగోలు ప్రాంతంలోనే బీమా చేయించి సంబంధిత పత్రాలు లబ్ధిదారులకు అందజేయాలని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. ఒకవేళ గొర్రె చనిపోతే 10 రోజుల్లోగా బీమా క్లెయిమ్ చేసి లబ్ధిదారుడికి అందించేలా పథకాన్ని అమలు చేయాలన్నారు. శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో పశుసంవర్థక శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, రెండో విడత గొర్రెల పంపిణీపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్ర పశుసంవర్థక శాఖ పనితీరును కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందన్నారు. పెరిగిన జీవాలకనుగుణంగా గ్రాసం కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జీవాల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్లేలా సంచార పశు వైద్యశాలల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పెంపకందారులు గొర్రెలు అమ్మి, కొనుక్కునేందుకు త్వరలోనే ఖమ్మం, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో గొర్రెల మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈనెల 6 నుంచి 13 వరకు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గజ్వేల్ నుంచి ప్రారంభిస్తామని తలసాని వెల్లడించారు. జీవాలకు వైద్య సేవలు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల కోసం గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
నేడు 6 లక్షల రేబీస్ టీకాలు
సాక్షి, అమరావతి: సంక్రమిత వ్యాధుల దినోత్సవం (జూనోసిస్ డే) కోసం పశుసంవర్ధక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పశుపక్ష్యాదుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తారు. 200కు పైగా వ్యాధులు పశుపక్ష్యాదుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నాయని గుర్తించారు. వాటిలో ప్రధానంగా కుక్కల నుంచి రేబీస్, చిలుకల నుంచి సిట్టకోసిస్, పాడి పశువుల నుంచి క్షయ, అంత్రాక్స్, బ్రూసెల్లోసిస్, కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ, పందుల నుంచి మెదడు వాపు, స్వైన్ ఫ్లూ, ఎలుకలు, అడవి జంతువుల ద్వారా లెప్టోస్పైరోసిస్ వంటివి వ్యాపిస్తున్నాయి. సంక్రమిత వ్యాధుల్లో రేబీస్ ప్రాణాంతకమైనందున జూనోసిస్ డే నాడు కుక్కలకు ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు వేస్తారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పశువైద్యశాలలు, పాలీక్లినిక్‌లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కనీసం 6 లక్షల కుక్కలకు ఉచితంగా రేబీస్ టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాం.. జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు టీకాలు వేయించుకోవాలి. çసంక్రమిత వ్యాధులను ఏ విధంగా ఎదుర్కోవాలో పెద్ద ఎత్తున అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాం. –డాక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
గ్రామాల్లో వీధి కుక్కలన్నింటికీ టీకాలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో తిరుగాడే వీధి కుక్కలన్నింటికీ ర్యాబీస్ వ్యాధి వ్యాప్తి నిరోధక టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాబీస్ వ్యాధి నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా పశుసంవర్థక శాఖతో సమన్వయం చేసుకుంటూ పంచాయతీరాజ్‌శాఖ ఈ టీకాల కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో వీధి కుక్కలలో సంతానోత్పత్తిని నియంత్రించేందుకు ఆపరేషన్ చేయించడంతో పాటు కుక్క కరిచినా ర్యాబీస్ సోకకుండా శునకాలకు టీకాలు వేస్తారు. వీధి కుక్కల టీకాలు వేసే ప్రక్రియలో పశు సంవర్థక శాఖ సిబ్బందితో ఎక్కడికక్కడ సమన్వయం చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించింది. మండలంలో ప్రతి రోజూ కనీసం 10 వీధి కుక్కలకు, జిల్లాలో కనీసం 500 కుక్కలకు టీకాలు వేయాలని పేర్కొంది. జిల్లాల వారీగా వీధి కుక్కల టీకాల పురోగతిని ఎప్పటికప్పుడు కమిషనర్ కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించింది. కాగా, 2020 పూర్తి ఏడాదితో పాటు 2021లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల మంది కుక్క కాటుకు గురైనట్లు అంచనా. -
'దేశీ ఆవు'కు మహర్దశ
సాక్షి, అమరావతి: దేశీయ మేలు జాతి పాడి ఆవుల పెంపకం, పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వదేశీ నాటు ఆవుల పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ క్షేత్రాల ద్వారా అటు స్వదేశీ జాతి ఆవుల సంరక్షణ, ఇటు రైతుకు అదనపు ఆదాయం సమకూరేలా ప్రభుత్వం సంకల్పించింది. వీటి ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఎంపిక చేసింది. ఈ గ్రూపులు ఇప్పటికే తమ వాటా సొమ్మును జమ చేయగా, జూన్ నెలాఖరులోగా గ్రూపులకు బ్యాంకు నుంచి రుణం మంజూరుతో పాటు సబ్సిడీ సొమ్ములు విడుదల చేసి, జూలై నాటికల్లా క్షేత్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో యూనిట్ రూ.30 లక్షలతో.. రూ.17.40 కోట్ల అంచనాతో రాష్ట్ర వ్యాప్తంగా 58 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కటి రూ.75 వేల విలువైన 25 దేశీ నాటు ఆవులను ఒక్కో యూనిట్‌కు అందజేస్తారు. వీటి కోసం రూ.10.50 కోట్లు ఖర్చు కానుంది. గోవుల కోసం నిర్మించే షెడ్లు, ఫెన్సింగ్ కోసం ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున రూ.5.80 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ఒక్కో యూనిట్‌కు పాల ఉత్పత్తి కోసం ఉపయోగించే పరికరాల కోసం రూ.1,12,250 చొప్పున రూ.65.54 లక్షలు, నిర్వహణ కోసం రూ.1,37,250 చొప్పున రూ.79.46 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ విధంగా ఒక్కో యూనిట్‌కు రూ.30 లక్షల చొప్పున ఖర్చు కానుంది. ఈ మొత్తంలో రూ.3 లక్షలు (10 శాతం) జేఎల్‌జీ గ్రూపు భరించనుండగా, రాష్రీ్టయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై), నేషనల్ ఎడాప్షన్ ఫండ్ ఫర్ క్‌లెమైట్ చేంజ్ (ఎన్‌ఎఎఫ్‌సీఎస్) నిధుల నుంచి సబ్సిడీ రూపంలో రూ.18 లక్షలు (60 శాతం) అందించనున్నారు. మిగిలిన రూ.9 లక్షలు (30 శాతం) బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేయనున్నారు. జూలై నాటికి క్షేత్రాలు ప్రారంభం.. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీల ద్వారా ఎంపిక చేసిన జేఎల్‌జీ గ్రూపులు తమ వాటాగా రూ.3 లక్షలు ఇప్పటికే జమ చేశారు. ఈ నెలాఖరులోగా గ్రూపులకు బ్యాంకు రుణాలు మంజూరుతో పాటు పాల ఉత్పత్తుల కోసం అవసరమైన పరికరాల ఎంపిక పూర్తి చేస్తారు. ఎంపిక చేసుకున్న పరికరాలను జూన్ 15 నుంచి 30వ తేదీలోగా కొనుగోలు చేస్తారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ క్షేత్రాల కోసం షెడ్లు నిర్మించే ప్రక్రియను జూన్ 24వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. పశుగ్రాసం కొరత లేకుండా చేసేందుకు ఆర్గానిక్ మేనేజ్మెంట్ ప్లాన్ (ఓఎంపీ) ద్వారా పశుగ్రాసం సాగు చేసేందుకు బెంగుళూరుకు చెందిన అదితి ఆర్గానిక్ సరి్టఫికేషన్ ద్వారా జూన్ 1 నంచి 10వ తేదీ వరకు క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. జూన్ 10 నుంచి 30వ తేదీలోగా రుణంతో పాటు సబ్సిడీ మొత్తం జమ చేస్తారు. జూలై మొదటి వారంలో ఎంపిక చేసుకున్న దేశీ ఆవులు కొనుగోలు ప్రక్రియ చేపడతారు. రెండో వారంలో పాల ఉత్పత్తికి శ్రీకారం చుడతారు. ఏ–2 మిల్క్ కు జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ దేశీయ నాటు ఆవులుగా పిలిచే గిర్ (గుజరాత్), షాహివాలా (హరియాణా, పంజాబ్), ఒంగోలు, పుంగనూరు జాతి పశువుల పాలను ఏ–2 మిల్క్‌గా పిలుస్తారు. ఈ పాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో లీటర్ మన రాష్ట్రంలోనే రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో లీటర్ రూ.150 నుంచి రూ.180కి పైగా పలుకుతుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధి నివారణకు ఎంతో ఉపయోగపడే ఏ–2 పాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడంతో పాటు స్వదేశీ జాతులను సంరక్షించడం లక్ష్యంగా దేశీ నాటు ఆవు క్షేత్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పాలకు మంచి ధర.. మా గోశాలలో వివిధ జాతులకు చెందిన 112 ఆవులు, గేదెలు ఉన్నాయి. జేఎల్‌జీ గ్రూపుగా ఏర్పడి స్వదేశీ నాటు ఆవుల కోసం దరఖాస్తు చేసాం. మా వాటాగా రూ.3 లక్షలు చెల్లించాం. ఈ ప్రాజెక్టు కింద 25 నాటు ఆవులిస్తారు. ఒక్కో ఆవు 4 నుంచి 5 లీటర్ల పాలిస్తుంది. వీటికి విజయవాడ మార్కెట్లోనే లీటర్ రూ.100 ధర పలుకుతోంది. హైదరాబాద్‌లో ఏకంగా రూ.150 నుంచి రూ.180 వరకు ధర ఉంటోంది. – రవికుమార్, సురభి గోశాల. రైతుకు అదనపు ఆదాయం.. దేశీ నాటు ఆవులను సంరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఏ–2 పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ప్రభుత్వం సంకల్పం. ఇప్పటికే గ్రూపుల ఎంపిక పూర్తయ్యింది. వచ్చే నెలలో రుణాల మంజూరు, షెడ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసి, జూలై మొదటి వారంలో క్షేత్రాలను ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
పాడిరైతులకు 45 సీహెచ్‌సీలు
సాక్షి, అమరావతి: పాడిరైతులకు అద్దె ప్రాతిపదికన ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం పశుసంవర్ధకశాఖ డివిజన్‌స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ (యంత్ర సేవాకేంద్రాలు–సీహెచ్‌సీలు) ఏర్పాటు చేస్తోంది. ఈ నెలాఖరులోగా అర్హతగల జాయింట్ లయబుల్ గ్రూపు (జేఎల్‌జీ)లకు రుణాలు మంజూరు చేసి మే మొదటి వారంలో వీటిని ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 కోట్ల మేకలు, గొర్రెలు ఉన్నాయి. వీటికి నాణ్యమైన మేతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తోంది. పశుగ్రాసానికి అవసరమైన యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 45 పశుసంవర్ధక శాఖ డివిజన్లలో సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. నలుగురికి తక్కువ కాకుండా పాడి రైతులతో ఏర్పాటైన జేఎల్‌జీ గ్రూపుల్లో అర్హత ఉన్న గ్రూపుల ఎంపిక 39 డివిజన్లలో పూర్తయింది. ఈ కేంద్రాలను క్రమంగా ఏరియా వెటర్నరీ ఆస్పత్రి, డిస్పెన్సరీ స్థాయికి విస్తరిస్తారు. 40 శాతం సబ్సిడీ ఈ కేంద్రాలకు రూ.14.70 లక్షల విలువైన 8 రకాల యంత్రపరికరాలను సమకూర్చనున్నారు. వీటిలో గడ్డిని ముక్కలు చేసే యంత్రాలు, కట్టలు కట్టే యంత్రాలు తదితరాలున్నాయి. కంకిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీలో డెమో ప్రదర్శనకు ఉంచిన ఈ యంత్రాలను పరిశీలించి గ్రూపు సభ్యులు తమకు అవసరమైనవే కొనుక్కునే వెసులుబాటు కల్పించారు. ఈ మొత్తంలో 10 శాతం జేఎల్‌జీ భరించాలి. 40 శాతం సబ్సిడీ రూపంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగిలిన 50 శాతం మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతి యంత్ర పరికరానికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. యూనిట్ గ్రౌండ్ కాగానే సబ్సిడీ విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఆర్కేవీవై నిధుల నుంచి రూ.2.65 కోట్లు కేటాయించారు. నెలాఖరులోగా జేఎల్‌జీ గ్రూపుల ఎంపిక, రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిచేసి వచ్చేనెలలో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ డీడీ అమరేంద్రకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
గణనీయంగా పెరిగిన గుడ్లు, మాంసం ఉత్పత్తి
సాక్షి, అమరావతి: రాష్రంలో గుడ్లు, మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తి 15 శాతం, మాంసం ఉత్పత్తి 11.76 శాతం పెరిగాయి. 2019–20లో 8.50 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి కాగా 2020–21లో 9.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిందని పశుసంవర్ధకశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 2019–20లో 2,170.77 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా 2020–21లో 2,496.39 కోట్లు ఉత్పత్తి అయినట్లు అంచనా వేశారు. 2020–21లో 147.13 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ అంచనాలను రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కేంద్రానికి పంపించింది. కేంద్రం ఆమోదిస్తే వాటి విలువ ఎంత అనేది కూడా తేలనుందని అధికారులు తెలిపారు. మరోపక్క తాజా గణాంకాల మేరకు రాష్ట్రంలో మొత్తం 3,40,68,177 పశుసంపద ఉంది. ఇందులో అత్యధిక పశుసంపద అనంతపురం జిల్లాలో 66.06 లక్షలుండగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14.44 లక్షలు ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరగతి రైతుల వద్ద ఎక్కువగా పశుసంపద ఉంది. కరువు పరిస్థితుల్లో ఆ రైతులకు ప్రధాన ఆదాయవనరు పశుసంపదే. రాష్ట్రంలో మొత్తం 46,00,087 ఆవులు ఉండగా 62,19,499 గేదెలున్నాయి. 1,76,26,971 గొర్రెలుండగా 55,22,133 మేకలు ఉన్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో మేకలు, గొర్రెల సంపద గణనీయంగా పెరిగింది. గతంలో గొర్రెలు 135.60 లక్షలుంటే తాజా గణాంకాల ప్రకారం 176.26 లక్షలకు, మేకలు 44.96 లక్షల నుంచి 55.22 లక్షలకు పెరిగాయి. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలకు పాడిపశువులు రాష్ట్రంలో మరింత పాలు, మాంసం ఉత్పత్తి పెంచడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు జీవనోపాధి మెరుగుపరచడం ద్వారా ఆర్థికంగా వారి కాళ్లమీద వారే నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్థికసాయం అందించింది. వారు కోరుకున్న మేరకు పాడి పశువులు, మేకలు, గొర్రెలు కూడా సమకూర్చేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు జగనన్న పాలవెల్లువ కింద 1,12,008 యూనిట్లను అందజేయాలని, అలాగే జగనన్న జీవక్రాంతి ద్వారా 72,179 యూనిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 70 శాతం మేర యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. పాల ఉత్పత్తి పెంచేందుకు నాణ్యమైన దాణా రైతుభరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు నాణ్యమైన పశువుల దాణాను సబ్సిడీపై సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మినరల్, మిశ్రమ లవణాలు ఉన్న దాణాను సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద 20 వేల ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో పశుగ్రాసం పెంచేందుకు చర్యలను చేపట్టాం. ఈ చర్యలతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. చేయూత మహిళలకు జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను రాష్ట్రం నుంచే సరఫరా చేస్తున్నాం. – అమరేంద్రకుమార్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ -
సేంద్రీయ స్వదేశీ నాటు ఆవు పెంపకం క్షేత్రాలు
సాక్షి, అమరావతి: సేంద్రీయ ఏ2 పాల ఉత్పత్తి లక్ష్యంగా స్వదేశీ ఆవుల పెంపకం క్షేత్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఇందుకు సంబంధించి అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం రాత్రి జీవో జారీ చేశారు. గతంలో నేషనల్ ఎడాప్షన్ ఫండ్ ఫర్ క్లైమేమెట్ చేంజ్ (ఎన్‌ఏఎఫ్‌సీసీ) ప్రాజెక్టు కింద నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో రూ.5.40 కోట్ల అంచనాతో 18 యూనిట్లు, మిగిలిన పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రూ.12 కోట్ల అంచనాతో 40 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాగా, తాజా గైడ్‌లైన్స్‌లో ఆర్కేవీవై, ఎన్‌ఏఎఫ్‌సీసీ ఆర్థిక చేయూతతో అన్ని జిల్లాల్లోనూ ఒకే రీతిలో 58 యూనిట్లు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలను జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. 25 దేశీయ ఆవులు అందజేత ఈ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. వీరికి ఒక్కొక్కటి రూ.75 వేల అంచనాతో రూ.17.50 లక్షల అంచనాతో 25 దేశీయ ఆవులు (గిర్, సాహివాల్, ఒంగోలు, పుంగనూరు తదితర జాతులు) అందజేస్తారు. ఇలా 58 యూనిట్ల కోసం రూ.10.15 కోట్లు ఇవ్వనున్నారు. ఈ గోవుల కోసం నిర్మించే షెడ్లు, ఫెన్సింగ్ కోసం ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున రూ.5.80 కోట్లు, పాలు, పాల ఉత్పత్తిల తయారీ కోసం ఉపయోగించే పరికరాల కోసం ఒక్కో యూనిట్‌కు రూ.1,12,750 చొప్పున రూ.65.54 లక్షలు, నిర్వహణ ఖర్చుల కోసం ఒక్కో యూనిట్‌కు రూ.1,37,250 చొప్పున రూ.79.46 లక్షలు చెల్లించనున్నారు. ఈ విధంగా ఒక్కోయూనిట్ రూ.30 లక్షలుగా నిర్ణయించగా, దీంట్లో రూ.3 లక్షలు లబ్ధిదారులు భరించాల్సి ఉంది. రూ.18 లక్షలను ఆర్కేవీవై, ఎన్‌ఏఎఫ్‌సీసీ నిధుల నుంచి సమకూర్చనుండగా, రూ.9 లక్షలను వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేయనున్నారు. కన్సల్టెంట్‌గా సురభి గోశాల నిర్వాహకుడు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరకలపూడికి చెందిన సురభి గోశాల నిర్వాహకుడు వి.రవికుమార్‌ను కన్సల్టెంట్‌గా నియమించారు. లబ్ధిదారులకు శిక్షణనిచ్చే బాధ్యతను విశాఖపట్నం స్మైల్ అడిషనల్ డైరెక్టర్గు అప్పగించారు. ఈ ఆవులకు అవసరమైన ఇన్‌పుట్స్‌ను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. ఈ క్షేత్రాల నుంచి వచ్చే ఏ2 పాలు, పాల ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్టి బ్రాండ్ నేమ్‌తో మార్కెటింగ్ చేయనున్నారు. అలాగే అమూల్, ఫిషరీస్ అవుట్‌లెట్స్‌తో పాటు జనతా బజార్లు, ఈ–మార్కెటింగ్ ద్వారా విక్రయాలను ప్రోత్సహించనున్నారు. మార్కెటింగ్ విక్రయాల కోసం జైవిక్ భారత్, ఇండియా ఆర్గానిక్ అనే యూనిఫైడ్ లోగోలను గుర్తించారు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన ఎన్ఐఎన్ సంస్థతో పశుసంవర్థక శాఖ ఎంవోయూ చేసుకోనుంది. -
58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలు
సాక్షి, అమరావతి: దేశీయ ఆవుల పెంపకం, ఏ–2 పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో 58 స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను పశుసంవర్ధక, డెయిరీల అభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సోమవారం రాత్రి విడుదల చేశారు. ఏ–2 పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యం రాష్ట్రంలో 30.50 లక్షల మంది పాడిరైతులున్నారు. వారివద్ద 13,56,523 ఆవులు, 21,46,695 గేదెలు ఉన్నాయి. వీటి ద్వారా 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. జెర్సీ, హెచ్ఎఫ్ జాతి పశువుల పాలను ఏ–1 మిల్క్ గా పిలుస్తారు. గిర్ (గుజరాత్), షాహివాలా (హరియాణా, పంజాబ్), ఒంగోలు జాతి పశువుల పాలను ఏ–2 మిల్క్‌గా పిలుస్తారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధి నివారణకు ఎంతో ఉపయోగపడే ఏ–2 పాల ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచడం, స్వదేశీ జాతులను సంరక్షించడం, తద్వారా సేంద్రియ సాగును ప్రోత్సహించడం లక్ష్యాలుగా ప్రభుత్వం ఈ క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఎన్‌ఏఎఫ్‌సీసీ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లా నార్త్ ఆములూరు, బిరదవోలు, విజయనగరం జిల్లా పెరిమి, వీరసాగరం, అనంతపురం జిల్లా గొట్లూరు, వెంకటరాజుకాలువ ప్రాంతాల్లో రూ.5.40 కోట్లతో 18 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి లబి్ధదారులు రూ.7.50 లక్షలు భరించాలి. మిగిలిన రూ.22.50 లక్షల్ని ఎన్‌ఏఎఫ్‌సీసీ నుంచి సమకూరుస్తారు. లబ్ధిదారుల ఎంపిక ఇలా.. ఈ క్షేత్రాలు ఏర్పాటు చేయదలిచిన రైతులు, ఔత్సాహికులకు షెడ్ నిర్మాణానికి సొంతంగా లేదా కౌలుకు తీసుకున్న 2.5 ఎకరాల భూమి ఉండాలి. జాయింట్ లయబులిటీ గ్రూపు (జేఎల్‌జీ)లకు ప్రాధాన్యతనిస్తారు. జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ ద్వారా గ్రామసభల్లో అర్హులను ఎంపిక చేస్తారు. జాయింట్ కలెక్టర్ (ఆర్బీకే) చైర్మన్‌గా ఉండే ఈ కమిటీకి పశుసంవర్ధక శాఖ జేడీ మెంబర్ కన్వీనర్‌గా, నాబార్డు ఎజీఎం, లీడ్ బ్యాంక్ మేనేజర్, వ్యవసాయశాఖ జేడీ సభ్యులుగా ఉంటారు. -
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు: మంత్రి అప్పలరాజు
సాక్షి, అమరావతి: బర్డ్ ఫ్లూతో రాష్ట్రంలో ఏ ఒక్క కోడి చనిపోలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండడంతో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. ఈవ్యాధి పట్ల ప్రజల్లో నెలకొన్న సందేహాలను, భయాందోళనలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 829 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలతో పాటు జిల్లాకో టాస్క్ ఫోర్స్ కమిటీ, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
పాడి రైతుల కోసం సీహెచ్‌సీలు
సాక్షి, అమరావతి: సన్న, చిన్న కారు రైతులకు మాదిరిగానే, పాడి రైతులకు కూడా అవసరమైన యంత్రాలను అద్దె ప్రాతిపదికన అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీలు) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేస్తూ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 45 డివిజన్ల పరిధిలో 328 ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, 1,500కు పైగా వెటర్నరీ డిస్పెన్సరీలు ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత డివిజన్ స్థాయిలో సీహెచ్‌సీలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత ఏరియా వెటర్నరీ ఆస్పత్రి, డిస్పెన్సరీ స్థాయికి విస్తరించాలని సంకల్పించారు. సీహెచ్‌సీల ఏర్పాటు కోసం జాయింట్ కలెక్టర్ (ఆర్బీకే) చైర్మన్‌గా, పశుసంవర్ధక శాఖ జేడీ సభ్య కార్యదర్శిగా, నాబార్డు ఏజీఎం తదితరులు సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేశారు. సీహెచ్‌సీల నిర్వహణకు ఐదుగురికి తక్కువ కాకుండా పాడి రైతులతో గ్రూపులను (లబ్ధిదారులను) ఎంపిక చేసే బాధ్యతను జిల్లా స్థాయి కమిటీలకు అప్పగించారు. పాడిరైతులు ముందుకురాని చోట స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీలు), ఇతర గ్రూపులకు సీహెచ్‌సీల నిర్వహణా బాధ్యతలను అప్పగించనున్నారు. ఎంపికైన గ్రూపులకు వాణిజ్య బ్యాంకులు లేదా డీసీసీబీల ద్వారా అవసరమైన రుణ సహాయం అందించనున్నారు. పాడి రైతులతో ఏర్పడిన గ్రూపులు ఏపీ.ఏహెచ్డీఆన్లైన్.జీవోవీ.ఇన్ అనే పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సీహెచ్‌సీ పరిధిలో 8 రకాల పాడి రైతులకు ఉపయోగపడే యంత్రపరికరాలు అందుబాటులో ఉంచుతారు. వీటి కొనుగోలుకు గరిష్టంగా రూ.14.70 లక్షల రుణం ఇస్తారు. ఇందులో 50% బ్యాంకు రుణం కాగా, 40% రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక సాయం ఉంటుంది. 10% సంబంధిత గ్రూపు భరించాల్సి ఉంటుంది. ఒక్కో సీహెచ్‌సీలో ఉండేవి.. 1.గడ్డి కోసే యంత్రాలు –4 2.గడ్డిని ముక్కలు చేసే యంత్రాలు –2 3.గడ్డిని పొడి చేసే యంత్రాలు –2 4.గడ్డిని కట్టలు కట్టే యంత్రాలు – 2 5.దాణా తయారు చేసే యంత్రాలు –2 6.పచ్చగడ్డిని మాగుడి గడ్డిగా తయారు చేసి కట్టలు కట్టే యంత్రాలు (మినీ) –2 7.పశు పేడతో ముద్దల తయారీ యంత్రాలు –4 8.దోమల నివారణ యంత్రాలు –4 -
లబ్ధిదారుల ఇష్టం మేరకే పాడి పశువుల కొనుగోలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లోని మహిళా లబ్ధిదారులు పాడిపశువులను రాష్ట్రంలోగానీ, ఇతర రాష్ట్రాల్లోగానీ కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాడిపశువుల కొనుగోలుకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య విడుదల చేశారు. 45 నుంచి 60 సంవత్సరాల్లోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మహిళలకు వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలు అందజేసినట్లు తెలిపారు. పాల ఉత్పత్తిదారుల ఆదాయం పెంపు, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పాల ఉత్పత్తి పెరుగుదలకు ఆర్బీకేల్లో మేలిరకం పశువుల మేత, దాణా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. దాదాపు 5.63 లక్షల మంది మహిళలు ఆవులు, గేదెల కొనుగోలుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న మేరకు.. ► ముర్రా జాతి గేదెలు, జెర్సీ, హెచ్ఎఫ్ సంకరజాతి అవులు, గిరి, సహావాల్ దేశీయరకం ఆవులను పాడివైనా, చూడివైనా కొనుక్కోవచ్చు. ► ఇనాఫ్ ట్యాగ్ ఉన్న వాటినే సెర్ప్, పశుసంవర్ధకశాఖల సిబ్బంది పర్యవేక్షణలో రాష్ట్రంలోగానీ, ఇతర రాష్ట్రాల్లోగానీ కొనుగోలు చేసుకోవచ్చు. ► పాల దిగుబడి, పశువు వయసు, లక్షణాలను బట్టి ధర నిర్ణయించాలి. ► అమ్మకందారులు తమకు సమీపంలోని ఆర్బీకేల వద్దకుగానీ, పశువిక్రయ కేంద్రాలకుగానీ పశువులను తరలించాలి. ► పశుసంవర్ధకశాఖ వైద్యులు పరిశీలించి వ్యాధులు లేవని నిర్ధారించిన తరువాత లబ్ధిదారులు కొనుగోలు చేయాలి. ► మేలిరకం జాతి ఎంపిక, కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లబ్ధిదారులకు శిక్షణ ఇస్తారు. ► పశువుల రవాణా, బీమా తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ► పశువుల ధర రూ.75 వేలకు మించితే అదనపు మొత్తాన్ని లబ్ధిదారులే భరించాలి. ► పశువుల రవాణా ఖర్చులను ముందు లబ్ధిదారులు భరించాలి. వాటి రశీదులను బ్యాంకర్లకు ఇచ్చి ఆ ఖర్చులు పొందవచ్చు. -
మాంసం వినియోగంపై అధ్యయనం
సాక్షి, అమరావతి: మాంసం వినియోగంపై ఏపీ వ్యవసాయ మిషన్ అధ్యయనం చేస్తోంది. కొవిడ్–19 నేపథ్యంలో మాంసం వినియోగం పెరగాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ అందుకనుగుణంగా మాంసం ఉత్పత్తి లేకపోవడం, సమీప భవిష్యత్‌లో ఉత్పత్తి పెరిగే అవకాశాలు కనిపించకపోవడంతో ప్రభుత్వం దీనిపై దృష్టిని కేంద్రీకరించింది. మాంసం ఉత్పత్తి పెరగకపోవడానికి కారణాలు, పెంపకందారుల సమస్యలు, వారిని ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ మిషన్ ప్రతినిధులు, పశుసంవర్థక శాఖ సిబ్బంది వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇది పూర్తయ్యాక ప్రభుత్వానికి ఏపీ వ్యవసాయ మిషన్ నివేదిక సమర్పించనుంది. దేశంలో 6 కిలోలు.. రాష్ట్రంలో 6.5 కిలోలు రాష్ట్రంలో ప్రస్తుతం గొర్రెలు 176.26 లక్షలు, మేకలు 55.22 లక్షలు, పాడిపశువులు 46,00,087, దున్నలు 62,19,499, పందులు 91958, కోళ్లు 10.75 లక్షలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఏడాదికి 11 కిలోల మాంసం అందుబాటులో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచిస్తోంది. అయితే దేశంలో 6 కిలోలు, రాష్ట్రంలో 6.5 కిలోలు మాంసం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో మాంసం ఉత్పత్తి పెంపుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన, పెంపకందారుల సమస్యలు, వారిని ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో వివరాలను సేకరిస్తున్నారు. వారం నుంచి రాయలసీమలో అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం సీకె దిన్నెలోని సమీకృత గొర్రెల పెంపక కేంద్రం (గొర్రె పిల్ల పెంపకం నుంచి మాంసం ఎగుమతి వరకు)లో పరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే చిన్న రైతులకు నాటుకోడి పిల్లలను పంపిణీ చేసేందుకు ఊటుకూరులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రె పిల్లల కేంద్రాన్ని, బుక్కరాయ సముద్రంలోని లైవ్‌స్టాక్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించారు. పశుపోషకులకు మరింత లబ్ధి రాష్ట్రంలో మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటికే అల్లానా గ్రూప్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. విదేశాలకు మాంసాన్ని ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి పొందిన ఈ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. పశుపోషకులకు ఈ యూనిట్ ఏర్పాటుతో మరింత లబ్ధి చేకూరనుంది. జిల్లాల్లోని పశుపోషకుల నుంచి మేలురకం మాంసం కొనుగోలు చేసి, ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
పాడి పరిశ్రమ మౌలిక వసతులకు రూ.1,362 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాడిపరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,362.22 కోట్లు వెచ్చించనున్నట్లు మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఆయన శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాసంకల్ప యాత్రలో పాడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. సహకార రంగంలోని డెయిరీలను తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. పాడిరైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఈనెల 25న అమూల్ ద్వారా పాలసేకరణకు బిల్లులు చెల్లించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అమూల్ ప్రాథమికంగా ఎనిమిది జిల్లాలను (ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం) ఎంపిక చేసిందని చెప్పారు. ఈనెల 20 నుంచి మొదటగా ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో పాలసేకరణ ప్రారంభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 70 లక్షల లీటర్ల పాలసేకరణ జరుగుతుందని, ఇది పాల ఉత్పత్తిలో 26 శాతమేనని తెలిపారు. అమూల్ భాగస్వామ్యంతో రోజుకు 2 కోట్ల లీటర్ల పాలు సేకరించేందుకు అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో రూ.500 కోట్లతో 9,899 బల్క్ మిల్క్ చిల్లింగ్ (బీఎంసీ) యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. తొలిదశలో 2,774, రెండోదశలో 3,639, మూడోదశలో 3,486 బీఎంసీ యూనిట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా 7,125 పాలసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ బాబు ఏ పాల్గొన్నారు. -
పాడి రైతులకు బంపర్ ఆఫర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మూడు లక్షల మంది పాడి రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న రెండు నెలల్లోనే ఈ రుణాలు ఇవ్వడానికి పశు సంవర్థక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ శాఖ సహాయకులు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. అభ్యుదయ రైతులు.. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలనే దృక్పథం కలిగిన వారిని గుర్తించి హామీ లేకుండా రూ.1.60 లక్షలు ఇవ్వడానికి సిఫారసు చేస్తున్నారు. కరోనా కారణంగా పాడి రైతులు తీవ్రంగా నష్టపోవడంతో వీరిని ఆదుకునేందుకు కేంద్రం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే.. ► ఈ రుణాలతో రైతులు పశువులను కొనుగోలు చేయవచ్చు. ► పశువులున్న వారైతే పశుగ్రాస సాగుకు, యాంత్రిక పరికరాల కొనుగోలుకు వాడుకోవచ్చు. ► వారం రోజుల వ్యవధిలోనే ఆరు వేల దరఖాస్తులు తీసుకున్నారు. ► ఒక ప్రత్యేక కార్యక్రమంగా దీనిని తీసుకుని విజయవంతం చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతూ మార్గదర్శకాలను విడుదల చేసింది. 1.50 కోట్ల మందికి పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇదిలా ఉంటే.. దేశంలో 1.50 కోట్ల మంది పాడి రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ► ఈ కార్డు ద్వారా రైతులు రూ.3లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు తీసుకోవచ్చు. ► భూమి లేని రైతులకైతే ఎటువంటి హామీలేకుండా రూ.1.60 లక్షల వరకు ఇస్తారు. ► ఈ రుణాలపై కేంద్రం 9 శాతం వడ్డీరేటును నిర్ణయించింది. సకాలంలో రుణం చెల్లించే రైతులకు 5 శాతం రాయితీ ఇవ్వనుంది. మిగిలిన 4 శాతం (పావలా వడ్డీ) వడ్డీని కొన్ని రాష్ట్రాలు రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ► రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాయితీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు అంటున్నారు. ► రెండో దశలో మేకలు, గొర్రెల పెంపకందారులకు ఈ రుణాలు ఇస్తారు. కాగా, కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఈ పథకానికి గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తోందని ఆ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. -
గొర్రెల పెంపకంలో మనదే అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిపిన 20వ పశుగణన– 2019 ప్రకారం గొర్రెల పెంపకంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర పశుసంవర్థ్ధక శాఖ వెల్లడించింది. ఈ గణన ప్రకారం రాష్ట్రంలో మొత్తం జీవాల సంఖ్య 2.40 కోట్లు కాగా, అందులో 1.91 కోట్లు గొర్రెలు కాగా, మేకలు 49.48 లక్షలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి శని వారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గొర్రెల అభివృద్ధి పథకంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3.66 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,579.67 కోట్ల వ్యయంతో పొరుగు రాష్ట్రాల నుంచి 76.94 లక్షల గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేశామన్నారు. పంపిణీ చేసిన గొర్రెల ద్వారా 108.37 లక్షల పిల్లలు పుట్టాయని, వీటి ద్వారా గ్రామాల్లో రూ.4,877.01 కోట్ల విలువైన సంపద సృష్టిం చ బడిందని, వీటిద్వారా 75,865.82 మెట్రిక్ టన్నుల మాంస ఉత్పత్తి అంచనా వేస్తున్నట్టు తెలిపారు. గతం కంటే 48.52% పెరిగిన వృద్ధి 2012లో జరిగిన 19వ జాతీయ గణనలో రాష్ట్రంలోని గొర్రెల సంఖ్య 128.35 లక్షలు కా గా, ఇప్పుడు 190లక్షలని, అంటే గతం కన్నా 48.52% గొర్రెలు పెరిగాయని తెలిపారు. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రంలో వధించబడే గొర్రెల సంఖ్య పెరిగిందని తెలిపారు. గొర్రెల అభివృద్ధి పథకం అమలు తర్వాత రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిలో గణనీయమైన మార్పు వచ్చిందని, 2015–16లో గొర్రె మాంస ఉత్ప త్తి 1.35 లక్షల టన్నులుంటే 2019– 20లో 2.77 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. -
కరోనా కాలంలోనూ ‘క్షీర ధార’
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సమయంలోనూ పశు సంపదకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. మేపు మొదలు పాల ఉత్పత్తుల వరకు వేటికీ కొరత ఏర్పడలేదు. పైగా ఈ సమయంలో పాడి పరిశ్రమ వ్యవస్థీకృతమైంది. మార్కెట్ స్థిరీకరణకు తోడ్పడింది’ అని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ‘సాక్షి తో మాట్లాడుతూ.. లాక్డౌన్ తొలి నాళ్లలో పౌల్ట్రీ పరిశ్రమ కొంత ఇబ్బంది పడినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేద న్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... ► గత ఏడాదితో పోలిస్తే పాల సేకరణ ధర పెరిగింది. గత ఏడాది 10 శాతం వెన్న ఉన్న గేదె పాలు లీటర్ రూ.56 ఉంటే.. ఇప్పడు రూ.63 అయ్యింది. పాల సేకరణ కూడా పెరిగింది. ► టీ స్టాల్స్ మూత పడటంతో పాల వినియోగం తగ్గిన మాట వాస్తవమే. కానీ.. గతంలో బయట టీ సేవించే వారంతా ఇప్పుడు ఇళ్లల్లోనే ఒకటికి రెండుసార్లు తాగుతు న్నారు. అందువల్లే ఇళ్లల్లో పాల వినియోగం పెరిగింది. ► ఎప్పటిలానే లాక్డౌన్ వేళ కూడా 48 లక్షల నుంచి 50 లక్షల లీటర్ల పాలను డెయి రీలు సేకరిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో డెయిరీలు రైతులకు బోనస్ చెల్లించాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, హోటళ్లు లేకపోవడంతో బల్క్ కర్డ్ (పెరుగు బకెట్లు) విని యో గం తగ్గినా.. రిటైల్ విని యోగం బాగా పెరిగింది. ► వేసవి కనుక సహజంగానే పచ్చిగడ్డి తక్కువగా ఉం టుంది. ఎండు మేతకు, దాణాకు కొరత లేదు. ఈ ఏడాది రబీలో వాతావరణం అనుకూలించి రికార్డు స్థాయిలో పంటలు సాగవటంతో ఎండుగడ్డికి ఇబ్బంది లేదు. ► లాక్డౌన్ సాకుతో పశువుల మేతను ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉంటే కాల్ సెంటర్ నంబర్ 1962కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ► డెయిరీలు, డెయిరీ సంబంధిత కర్మాగారాల్లో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు జాయింట్ కలెక్టర్ నాయకత్వంలో కమిటీలు ప్రతి జిల్లాలో చురుగ్గా పని చేస్తున్నాయి. ► వేసవి తీవ్రమవుతున్నందున వడగాడ్పుల నుంచి పశువులను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలి. నీడ పట్టున ఉంచే మార్గాలు చూడాలి. ► ఎండ నుంచి వచ్చిన పశువుల్ని చన్నీటితో కడిగితే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. -
పశుసంవర్ధక శాఖ సెక్షన్ అధికారిపై సస్పెన్షన్ వేటు?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన విషయాన్ని దాచి సచివాలయంలో విధులకు హాజరయ్యారన్న ఆరోపణలపై పశుసంవర్ధక శాఖ సెక్షన్ అధికారి ఆయూబ్‌ఖాన్‌ను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఆ శాఖ ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం. త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఆయూబ్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా లేదని తేలింది. ప్రస్తుతం ఆయన నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్లో ఉన్నారు. -
కోడిని తింటే ‘కోవిడ్’ రాదు..
సాక్షి, అమరావతి బ్యూరో: కోడి మాంసం తింటే కరోనా (కోవిడ్) వైరస్ రాదని పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించింది. కరోనా వైరస్ ప్రచారంతో ఆందోళన చెందిన మాంసంప్రియులు చికెన్ తినడం భారీగా తగ్గించేశారు. దీంతో ధరలు పాతాళానికి పడిపోయి కోళ్ల పరిశ్రమ కకావికలమైపోతోంది. ఈ పరిశ్రమ యజమానులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో పశుసంవర్ధక శాఖ స్పందించింది.. - కోడి మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ సోకదన్న విషయం శాస్త్రీయంగా నిరూపణ అయిందని.. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ శాఖ సిబ్బందికి ఆదేశాలిచ్చింది. - పౌల్ట్రీ ఫెడరేషన్ల సహకారంతో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు.. ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్లు, సంబంధిత అధికారులకు సూచించింది. - పుకార్ల కారణంగా కోళ్ల సంఖ్య తగ్గిపోయి భవిష్యత్తులో చికెన్, కోడిగుడ్ల ధరలు అమాంతంగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. - కోళ్ల దాణాలో వాడే ముడి సరకులైన మొక్కజొన్న, సోయాల ధరలు దెబ్బతిని రైతులూ నష్టపోయే అవకాశం ఉంది. -
వైఎస్సార్ కాపరి బంధు
సాక్షి, అమరావతి: గొర్రెల కాపరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలులోకి తీసుకు వస్తోంది. ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేయనుంది. ఎన్సీడీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆర్థిక సాయంతో ‘వైఎస్సార్ కాపరి బంధు’ పథకాన్ని అమలు చేయనుంది. యూనిట్ల కొనుగోలుకు మంజూరు చేసే రుణంలో 30 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. గొర్రెల రేట్లు అధికంగా ఉండటంతో ఒక యూనిట్ (20 గొర్రెలు, ఒక పొట్టేలు) కొనుగోలుకు రూ.1.50 లక్షలు మంజూరు చేయనుంది. సంవత్సరానికి 12,500 మంది చొప్పున నాలుగు సంవత్సరాలకు 50 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఎన్సీడీసీ ఈ పథకానికి తొలుత రూ.200 కోట్లు కేటాయించేందుకు అంగీకరించిందని అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ – రాష్ట్రంలోని గొర్రెల కాపరులు, సొసైటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇటీవల కలిసి తమ జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఒక పథకాన్ని అమలు చేయాలని కోరారు. – ఎన్సీడీసీ ఆర్థిక సాయంతో ప్రస్తుతం గొర్రెలకాపరులు రుణంపై గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. – ఈ పథకం అమలులో నిబంధనలు కఠినంగా ఉండటంతో గొర్రెల కాపరులు రుణాలు పొందలేక పోతున్నారు. – ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో నిబంధనలు సరళీకృతం చేయడంతో పాటు, సబ్సిడీ పెంచే విధంగా పథకాన్ని రూపకల్పన చేయాలని ఆదేశించారు. – ఎన్సీడీసీ ఇస్తున్న సబ్సిడీని 20 శాతం నుంచి 30 శాతానికి పెంచుతున్నారు. – రుణం ఇచ్చేటప్పుడు గొర్రెల కాపరులు భూమిని తనఖా పెట్టే విధానం అమలులో ఉంటే.. అందులో కొన్ని మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. – ఈ మేరకు అధికారులు పథకాన్ని రూపకల్పన చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపారు. దీనిపై త్వరలో జరనున్న సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. నష్ట పరిహారం, పశు వైద్యంతో అండగా.. – రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైఎస్సార్ పశు నష్ట పరిహారం, రాజన్న పశు వైద్యం వంటి పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. వీటితోపాటు సబ్సిడీపై పశువుల దాణా, పరికరాలను అందిస్తోంది. – చనిపోయిన పశువులు, గొర్రెలు, మేకలకు ఎటువంటి ప్రీమియం చెల్లించక పోయినప్పటికీ నష్టపరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది. – ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయిన 9 వేల అవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు ప్రభుత్వం వాటి పోషకుల బ్యాంకు ఖాతాల్లో రూ.14 కోట్ల వరకు జమ చేసింది. – తొలి విడతగా ప్రభుత్వం పశు నష్టపరిహారం పథకానికి రూ.35 కోట్లు కేటాయించింది. – ఫిబ్రవరిలో ప్రారంభమైన రైతు భరోసా కేంద్రాల ద్వారా రాజన్న పశు వైద్యం పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. – గ్రామ సచివాలయాల్లో కొత్తగా నియమితులైన పశు సంవర్థక శాఖ సహాయకులు పశువులకు వైద్యసాయాన్ని అందిస్తున్నారు. -
పశువులకూ 'ఆధార్'
సాక్షి, అమరావతి: మనకు ఆధార్ కార్డు ఉన్నట్లే పశువులకూ రాష్ట్ర ప్రభుత్వం ఆ తరహా కార్డులు ఇవ్వనుంది. రాష్ట్రంలోని పశువులు, మేకలు, గొర్రెలకు సర్కారు 12 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయించబోతోంది. ఈ సంఖ్యతో పశువుల చెవులకు ప్రత్యేక ట్యాగ్ వేస్తారు. దీంతో భవిష్యత్‌లో ట్యాగ్ ఉన్న పశువులకే ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. అవిలేనివి ప్రమాదంలో చనిపోయినా రైతుకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వరు. రాయితీ పథకాలు కూడా మంజూరు కావు. ఏటా పశుసంవర్థక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తున్న రూ.వెయ్యి కోట్లలో నాలుగో వంతు నిధులు రాయితీ పథకాలకు ఇస్తోంది. ఇవి దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ‘ఇనాఫ్ ట్యాగ్’ (ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టవిటీ అండ్ హెల్త్)ను వేయనున్నారు. ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాను గత ఆగస్టులో ఎంపిక చేసింది. ఈనెల 16 నుంచి రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు వాక్సిన్‌తోపాటు ఇనాఫ్ ట్యాగ్‌ను వేయనున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.08 కోట్ల ఆవులు, గేదెలు ఉన్నాయి. రెండు నెలల వ్యవధిలో వీటన్నింటికీ వాక్సిన్‌తోపాటు ట్యాగ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.31 కోట్లను కేటాయించింది. ఇందులో రూ.15 కోట్లు ఇనాఫ్ ట్యాగ్‌లకు పోగా.. మిగిలిన నిధులను వాక్సిన్ కొనుగోలు, వాటిని భద్రపరచడానికి రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు ఖర్చు చేశారు. -
ఫిబ్రవరిలో రాజన్న పశువైద్యం ప్రారంభం
సాక్షి, అమరావతి: రాజన్న పశువైద్యం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత ప్రారంభించనున్న 3,300 రైతు భరోసా కేంద్రాల్లో ఇది అందుబాటులోకొస్తుంది. మొదట రైతు భరోసా కేంద్రాలను ఫిబ్రవరి 1న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాజన్న పశువైద్యాన్ని కూడా అప్పటి నుంచే మొదలుపెట్టాలని పశు సంవర్థక శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే.. రైతు భరోసా కేంద్రాలను ఫిబ్రవరి 28న ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడంతో అప్పటి నుంచే రాజన్న పశువైద్యం కూడా అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో 3,200 పశు వైద్యశాలలే ఉండటంతో పశువులకు, ఇతర జీవాలకు వైద్యం అందించడానికి పోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 నుంచి 30 కిలోమీటర్ల నిడివిలో కొన్ని ప్రాంతాల్లో పశు వైద్యశాలలు ఉండటంతో వ్యాధులకు గురైన పశువులకు చికిత్స అందించడానికి, ఆస్పత్రులకుతరలించడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి గ్రామంలోనూ పశువైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, ఈ మేరకు రానున్న రెండేళ్లలో ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలు, ప్రస్తుతమున్న పశువైద్యశాలల్లో రాజన్న పశువైద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడత 3,300 రైతు భరోసా కేంద్రాల్లో.. తొలి విడత ప్రారంభం కానున్న 3,300 రైతు భరోసా కేంద్రాల్లో రాజన్న పశువైద్యాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం రూ.50 కోట్లను విడుదల చేసింది. పశువులకు చికిత్స అందించడానికి షెడ్లు, మందులు, మెడికల్ కిట్స్, పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలు, చాఫ్ కట్టర్లు, పాలు పితికే యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఖాళీగా ఉన్న 9,886 మంది పశు వైద్య సహాయకులను నియమించేందుకు ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షకు 5,612 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 2,944 మంది ఉత్తీర్ణులు కావడంతో వారిని ఉద్యోగాల్లో నియమించింది. వీరితోపాటు ప్రస్తుతం పనిచేస్తున్నవారిని 3300 రైతు భరోసా కేంద్రాల్లో నియమించారు. వీరు వైద్యసేవలు అందించడంతోపాటు పశువులకు సమతుల పోషకాహార కార్యక్రమాలు, పశుఆరోగ్య సంరక్షణ కార్డులు, కిసాన్ కార్డులు, పశుగ్రాస లభ్యత, పశు నష్టపరిహారం పథకాన్ని అమలు చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. -
అరుపులుండవ్.. మెరుపు దాడులే
అవి సాదాసీదా శునకాలుగానే ఉంటాయి. అంతకుమించి విశ్వాసమూ ప్రదర్శిస్తాయి. అరుపులు వాటికి చేతకావు. అనుమానమొస్తే అమాంతం దాడి చేసి.. ప్రతాపం చూపిస్తాయ్. గ్రామ సింహాల మాదిరిగా కనిపిస్తూ.. చిరుత రాజసాన్ని ప్రదర్శించే పందికోన శునకాలకు చాలా ప్రత్యేకతలున్నాయి. చిరుత పులితో క్రాస్ బ్రీడింగ్ వల్ల కలిగిన సంతానంగా చెప్పే ఈ శునకాలు పోలీస్ శాఖలో నూ సేవలందిస్తున్నాయి. పత్తికొండ: కర్నూలు జిల్లా పందికోన శునకాల ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. మూగజీవాలకు రక్షణగా.. పంటలకు కాపలాగా ఉంటూ క్రూర మృగాలను సైతం తరిమేస్తాయి. పౌరుషానికి మారుపేరుగా నిలిచే ఈ శునకాలు పోలీస్ శాఖలో చేరి పలు కేసులను కూడా ఛేదించాయి. పౌరుషం, గాంభీర్యం, వేటాడే తత్వం వీటి సొంతం. పాలెగాళ్ల కాలంలో.. పత్తికొండకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికోన గ్రామాన్ని బ్రిటిష్ కాలంలో పాలెగాళ్లు పాలించేవారు. అప్పట్లో భారీ కొండల మధ్య ఉండే దట్టమైన అరణ్యం నుంచి చిరుతలు గ్రామంలోకి వస్తుండేవి. ఆ క్రమంలో గ్రామంలోని సత్రంలో ఓ చిరుత పులి ప్రసవించగా.. దానికి పుట్టిన మగ చిరుత ఆడ కుక్కలతో కలిసి సంచరించేదట. తదనంతర కాలంలో ఆ చిరుత, గ్రామ సింహాల సంపర్కం వల్ల ఆడ శునకాలకు చిరుత లాంటి కుక్క పిల్లలు పుట్టాయని.. ఆ సంతానం వృద్ధి చెంది పందికోన శునకాలుగా పేరొచ్చిందని గ్రామానికి చెందిన రంగప్పరాజు, గువ్వల రంగస్వామి చెప్పారు. దొంగల్ని ఇట్టే పట్టేస్తాయి పశువులు, మేకలు, గొర్రెల మందలకు రక్షణగా గ్రామస్తులు పందికోన శునకాలను వినియోగిస్తున్నారు. మృగాల వాసన పసిగట్టి వాటి బారినుంచి ఈ శునకాలే పశువుల్ని రక్షిస్తాయని, అవసరమైతే మృగాలను వేటాడతాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొత్త వ్యక్తులను గుర్తించి నిలువరించడం.. దొంగలను ముట్టడించి దాడి చేయడం వీటి ప్రత్యేకత. ఈ శునకాలు హైదరాబాద్, అమరావతి, ఢిల్లీ తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, ఇతర దేశాలకూ ఎగుమతి అయ్యాయి. వీటి విశిష్టతను గుర్తించిన అమెరికాకు చెందిన ఓ బృందం 37 సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని సందర్శించి వీటికి షెల్టర్, వసతి సౌకర్యాల కోసం నిధులు ఇస్తామని చెప్పగా.. గ్రామస్తులు నిరాకరించారు. కొన్నేళ్లుగా కేంద్ర రక్షణ శాఖ, పోలీసు అధికారులు వీటిని తీసుకెళ్లి పౌర, రక్షణ సేవలకు వినియోగిస్తున్నారు. వైద్యాధికారులు, కొందరు గృహ యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరచూ గ్రామానికి వచ్చి వీటిని తీసుకెళుతుంటారని గ్రామస్తులు తెలిపారు. పేర్లు పెట్టి.. వాతలు వేస్తారు పందికోన గ్రామంలో సుమారు 700 కుటుంబాలు ఉండగా.. 1,500కు పైగా శునకాలను పెంచుతున్నారు. ప్రతి ఇంట్లో ఒక శునకం కనిపిస్తుంది. కొందరైతే రెండు, మూడింటిని పెంచుతుంటారు. వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఆడ కుక్కలకు ఇందిరమ్మ, ఇందిరమ్మబీ, మగ కుక్కలకు రాముడు, భీముడు, రాజు వంటి పేర్లుంటాయి. చిన్న వయసులోనే వీటి దేహంపై రెండు వైపులా వాతలు పెడతారు. రాత్రి వేళ కంటిమీద కునుకు లేకుండా పంట ఉత్పత్తులు, గొర్రెలకు ఇవి కాపలాగా ఉంటాయని గ్రామానికి చెందిన సిద్ధప్ప, బుల్లేని ఆదినారాయణ చెప్పారు. ఈ శునకాలు యజమానులు భుజించే ఆహారాన్నే తింటాయి. పప్పుతో కలిపిన అన్నం ఆరగిస్తాయి. జొన్న రొట్టెలు, చికెన్, మటన్ ఎంతో ప్రీతిగా తింటాయి. పంటల్ని నాశనం చేయడానికొచ్చే అడవి పందుల్ని వేటాడి భుజిస్తాయి. వీటి ప్రత్యేకత తెలుసు గానీ.. పందికోన కుక్కల గురించి కొన్నేళ్లుగా వింటున్నాను. వీటి ప్రత్యేకతలు తెలుసు. చిరుత పులి, కుక్కల సంపర్కం వల్ల చిరుత లాంటి ఈ శునకాలు జన్మించాయనే ప్రచారం ఉంది. ఇందులో నిజమెంత అనేది చెప్పలేం. వీటికి పౌరుషం ఎక్కువ. మొరగకుండా దొంగల్ని పట్టేస్తాయ్. – లక్ష్మీప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ గొర్రెలకు ఇవే కాపలా నాకు 180 గొర్రెలున్నాయి. ఎప్పుడు అడవి పందులు దాడి చేస్తాయో తెలీదు. అలాంటప్పుడు ఈ కుక్కలే నాకు సహాయంగా ఉంటాయి. నేను భోజనానికి వెళ్తే ఇవే కాపలా ఉంటాయి. కొత్త వ్యక్తులు, దొంగలు, అడవి పందులను దరిదాపుల్లోకి రానివ్వవు. – కోదండ రాముడు, గొర్రెల యజమాని డిస్కవరీ ప్రతినిధులు వస్తుంటారు ఏటా ఢిల్లీ నుంచి డిస్కవరీ చానల్ ప్రతినిధులు మా గ్రామానికొచ్చి శునకాలను పరిశీలించి వెళుతుంటారు. వీటి పనితీరును పరిశీలించడానికి ఓసారి అమెరికన్లు మా పొలానికి వచ్చి రాత్రంతా పొలంలోనే ఉన్నారు. అదే సమయంలో అడవి పంది రావడంతో మా కుక్క దానిని వెంటాడి.. వేటాడి చంపేయడం చూసి ఆశ్చర్యపోయారు. – బోయ ఆదినారాయణ, రైతు -
పాడి ప్రోత్సాహకం వచ్చేదెన్నడు?
సాక్షి, హైదరాబాద్: పై ఫొటోలో కన్పిస్తోన్న పాడి రైతు పేరు పర్నె నర్సిరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం. ఇతనికి రెండు గేదెలు, ఒక ఆవు ఉన్నాయి. గేదెల లో ఒకదానిని ప్రభుత్వం ఇచ్చిన 50% రాయితీతో కొనుగోలు చేశాడు. వీటి పోషణ కోసం తన పొలంలో లభించే ఎండుగడ్డి, పచ్చిగడ్డి, తవుడుతోపాటు నెలకు ఒక బస్తా పచ్చిచెక్క (రూ.1800), అరబస్తా కొబ్బరిపిట్టు (రూ. 2100), బస్తా దాణా (రూ.710) అవసరమవుతుంది. తన వద్ద ఉన్న పాడి సంపదతో రోజుకు సరాసరి 10 లీటర్ల పాలను గ్రామంలోనే ఉన్న సెంటర్‌కు పోస్తాడు. నెలకు 300 లీటర్ల చొప్పున 18 నెలలకు సంబంధించి 5,400 లీటర్లకు గాను రూ.21,600 ఈ రైతుకు ప్రోత్సాహకంగా రావాల్సి ఉంది. ఆ డబ్బులు వస్తే తన వద్ద ఉన్న గేదెలు, ఆవుకు కావాల్సిన దాణా కొనుగోలుకు వెసులుబాటు కలుగుతుందనే అభిప్రాయం ఆ రైతుది. కానీ, 18 నెలలు గా ఆ రైతుకు నిరీక్షణే మిగులుతోంది. ఇదే వెల్లంకి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘంలో 120 మంది రైతులున్నారు. ఈ కేంద్రం ద్వారా ఆవు, గేదె పాలు కలిపి రోజుకు 350 లీటర్ల పాలు సేకరిస్తారు. వీటిని మదర్ డెయిరీకి పంపుతారు. ఈ సంఘానికి 2018 ఏప్రిల్ వరకు ప్రభుత్వం ప్రకటించిన లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం వచ్చింది. ఆ తర్వాత నిలిచిపోయింది. మే 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు 1.83 లక్షల లీటర్ల పాలను ఈ సంఘం సభ్యులు సేకరించారు. వీటికి గాను రూ.7.32 లక్షలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా రావా ల్సి ఉంది. ఈ మొత్తం వస్తే పాడి రైతుకు ఊరట లభించనుంది. ఈ సమస్య ఒక్క పర్నె నర్సిరెడ్డి, వెల్లంకి పాల ఉత్పత్తిదారుల సంఘానిదే కాదు..రాష్ట్రంలోని 3 లక్షల మంది పాడిరైతులు ఈ ప్రోత్సాహకం కోసమే ఎదురుచూస్తున్నారు. 18 నెలలుగా రూ.120 కోట్లకు పైగా రావాల్సిన ప్రోత్సాహక బకాయిలు ఎప్పుడొస్తాయా అని నిరీక్షిస్తున్నారు. అసలీ ప్రోత్సాహకం ఎందుకు? విజయ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, రంగారెడ్డి–నల్లగొండ డెయిరీ, కరీంనగర్ డెయిరీల పరిధిలోని పాడి రైతులకు, పాల సంఘాల సభ్యులకు లీటరుకు రూ.4 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తోంది. ఈ ప్రోత్సా హకం వల్ల పాడి రైతులు ఆయా డెయిరీలకే పాలు పోస్తారన్న భావనతో ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. మొదట్లో కేవలం విజయ డెయిరీకే పరిమితమైన ఈ పథకం, రెండేళ్ల నుంచి మిగిలిన మూడు డెయిరీలకూ వర్తింపజేసింది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 2018 మే నుంచి ప్రోత్సాహకం చెల్లింపులు జరగడం లేదు. ఈ ప్రోత్సాహక బకాయిలు వస్తే పశువుల దాణాకు, ఇతర కుటుంబ ఖర్చులకు అవసరం అవుతాయని పాడి రైతులు చెబుతున్నారు. సగటున ఒక్కో రైతుకు కనీసం రూ. ఐదారువేలు వస్తే ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుందని, ప్రభుత్వ డెయిరీలకే పాలు పోయాలన్న భావన మెరుగవుతుందంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? నిధుల లేమితోనే ప్రభుత్వం ఈ ప్రోత్సాహక నిధులు ఇవ్వడం లేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నిధుల విడుదల కోసం ప్రయత్నాలు ప్రారంభించామని, ప్రభుత్వం కూడా ఈ నిధుల విడుదలకు అనుమతినిచ్చిందని నేడో, రేపో ప్రస్తుతమున్న బకాయిల్లో 40% డబ్బులు వచ్చే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. గతేడాది డిసెంబర్ వరకు ఉన్న బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. 2018 ఏప్రిల్ నెలలో చివరిసారి ప్రోత్సాహకం చెల్లించగా, అప్పటికే బకాయి ఉన్న నాలుగు నెలల ప్రోత్సాహకాలు ఒకేసారి ఇచ్చారని, అప్పుడు కూడా రావాల్సిన మొత్తంలో కొంతమాత్రమే ఇచ్చారని పాడి రైతులంటున్నారు. 2018 జనవరి–ఏప్రిల్ వరకు ఒక్కో రైతుకు రావాల్సిన దాంట్లో ఇంకా పెండింగ్ ఉందని, ఇప్పుడు మళ్లీ 18 నెలల బకాయిలున్నాయని, వీలున్నంత ఎక్కువ నిధులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ప్రభుత్వం పాల ప్రోత్సాహకాన్ని ఏం చేస్తుందో... ఎన్ని నిధులిస్తుందో నేడో, రేపో తేలనుంది. -
శిశు సంక్షేమం టాప్..
సాక్షి, హైదరాబాద్: ప్రోగ్రెస్ రిపోర్టు స్కూల్ విద్యార్థులకే కాదు ప్రభుత్వ శాఖలకూ వచ్చేశాయ్. హాజరుశాతం, మార్కుల ఆధారంగా బడిపిల్లలకు ఖరారు చేసే ర్యాంకులను శాఖలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిభ, పనితీరు, వార్షిక నివేదికల మదింపు ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. 2018–19లో కనబరిచిన ప్రగతి.. 2019–20 ఆర్థిక సంవత్సరం కార్యాచరణ ప్రణాళికను పరిగణనలోకి తీసుకోవడంతో మహిళా, శిశుసంక్షేమ శాఖకు తొలి ర్యాంకును లభించింది. ఇక పనితీరులో బీసీ సంక్షేమ శాఖ వెనుకబడింది. కార్మికశాఖ రెండోస్థానంలో నిలవగా.. మూడో ర్యాంకును వ్యవసాయ, సహకార శాఖ కైవసం చేసుకుంది. నాణ్యతాప్రమాణాలు, పౌరసేవలు, శాఖల పనితీరును పరిగణనలోకి తీసుకున్న సర్కారు.. ఆయా శాఖలు అందజేసిన నివేదికలను సమీక్షించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖ, గృహ నిర్మాణం, రెవెన్యూ, వాణిజ్య, ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు సారథ్యం వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ర్యాంకుల వడపోత ప్రక్రియ జరిగింది. సగటున 2 నుంచి 4 శాఖల పనితీరును మదింపు చేసిన ఈ అధికారులు.. మార్కులను ఖరారు చేశారు. సచివాలయంలోని 34 విభాగాలకుగానూ 20 శాఖలు వార్షిక నివేదికలు సమర్పించగా.. ఇందులో మహిళా, శిశుసంక్షేమం (9.84 మార్కులు), కార్మిక, ఉపాధి (9.42), వ్యవసాయ, సహకార (8.44), వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం (8.12), పశుసంవర్థకశాఖ (8.10)లు టాప్–5లో నిలిచినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రకటించారు. కాగా, బీసీ సంక్షేమశాఖ అట్టడుగున నిలవగా.. జీఏడీ విభాగానికి 19వ ర్యాంకు రావడం గమనార్హం. -
గొర్రెల పంపిణీకి బ్రేక్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గొర్రెల పంచాయితీ రచ్చకెక్కింది. అధికారుల సహాయ నిరాకరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన గొర్రెల పంపిణీకి అర్ధంతరంగా బ్రేక్ పడింది. ఇప్పటికే అధిక ధరలు, రీ సైక్లింగ్, సంతలకు తరలిస్తున్నారనే ఆరోపణలతో తలబొప్పి కట్టిన సర్కారుకు తాజాగా పశుసంవర్థకశాఖ యంత్రాంగం షాక్ ఇచ్చింది. జీవాల కొనుగోళ్లు మొదలు రాష్ట్రానికి తరలించే వరకు బాధ్యత వహించాలని స్పష్టం చేసిన ప్రభుత్వం.. సిరిసిల్ల జిల్లాలో జరిగిన అవకతవకలపై ఇద్దరు అధికారులపై వేటు వేసింది. ఈ నిర్ణయమే వెటర్నరీ ఉద్యోగుల సహాయ నిరాకరణకు దారితీసింది. దీంతో వారంరోజులుగా గొర్రెల పంపిణీ పథకం నిలిచిపోయింది. గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలకు చేయూతనివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆయా వర్గాలకు సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తోంది. జూలైలో ప్రారంభమైంది. జీవాల కొనుగోలు, జిల్లాకు తరలించడం అధికారులకు తలనొప్పిగా మారింది. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో వీటికి డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు తగ్గ జీవాల లభ్యత లేకపోవడం.. ఆ జీవాలను తరలించడం అధికారులకు కత్తిమీద సాముగా మారింది. సగటున రోజుకు 2025 యూనిట్లు లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్టుగా గొర్రెల లభ్యత లేకపోవడంతో.. ప్రతి రోజు సగటున 20 నుంచి 25 యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. జీవాల పంపిణీలో చోటుచేసుకుంటున్న చిన్న తప్పిదాలకు తమను బాధ్యులను చేస్తున్నా రని ఆగ్రహించిన పశుసంవర్థకశాఖ అధికారులు గొర్రెల సేకరణకు దూరంగా ఉన్నారు. ఎదురుచూపుల్లో 400 మంది! గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలన్న సదాశయంతో ప్రభుత్వం గొర్రెల పంపిణీకి జూలైలో శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్ ధర రూ.1.25 లక్షలుగా నిర్ధారించిన సర్కారు.. యూనిట్ విలువలో 75 శాతం అనగా రూ.93,750 సబ్సిడీ అందజేస్తోంది. మిగిలిన 25 శాతం (రూ.31,250) లబ్ధిదారులు భరించాలి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది దాదాపు 20 వేలమంది లబ్ధిదారులకు డిసెంబర్‌లోగా అందజేయాలి. కానీ, ఇప్పటి వరకు జిల్లాలో 3,407 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. గొర్రెల కొనుగోలుకు కర్ణాటక వెళ్లేందుకు పశువైద్యాధికారులు ముందుకు రావడం లేదు. ఫలితంగా వారం రోజులుగా ఒక్క యూనిట్ కూడా లబ్ధిదారునికి చేరలేదు. ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసిన తర్వాతే గొర్రెలను తెచ్చేందుకు ముందుకు సాగుతామని అధికారులు అంటున్నారు. గొర్రెల పంపిణీని సమర్థంగా నిర్వహించండి అధికారులకు మంత్రి తలసాని ఆదేశం.. సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని ఆయన తన చాంబర్లో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై పశుసంవర్థకశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, పశువైద్యాధికారుల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.28 లక్షల యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. గొర్రెల కొనుగోళ్లలో జరుగుతున్న పొరపాట్లను నివారించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గొర్రెల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు అధికారులను పంపించి సమాచారం సేకరించాలని మంత్రి డైరెక్టర్‌ను ఆదేశించారు. అలాగే గొర్రెల లభ్యత తగ్గడానికి గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరముందన్నారు. ఇటీవల ప్రారంభించిన మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ల పనితీరును గురించి కూడా ఈ సమావేశంలో తలసాని సమీక్షించారు. -
పశువైద్యశాలలకు పక్కా భవనాలు
హైదరాబాద్: పశు వైద్యశాలలకు ప్రభుత్వ పక్కా భవనాలు నిర్మిస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పశు సంపద ఆరోగ్య రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పశు సంపద ఆరోగ్య రక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,117 పశు వైద్యశాలలు పని చేస్తున్నాయని చెప్పారు. త్వరలోనే సంచార పశు వైద్యశాలలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏప్రిల్ చివరి నాటికి వచ్చే ఈ వాహనాలు పశువులకు అత్యవసర సేవలను అందిస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయిస్తామని చెప్పారు. జీవాల మీద ఆధారపడిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పశు సంవర్ధక శాఖలో 161 పోస్టులను పబ్లిక్ కమిషన్ ద్వారా భర్తీ చేశామని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. -
రాష్ట్ర రుణాల్లో సగం పంట రుణాలే
2017–18 రుణ ప్రణాళిక విడుదల చేసిన నాబార్డు మొత్తం రాష్ట్ర రుణ ప్రణాళిక రూ. 65,590 కోట్లు అందులో వ్యవసాయ రుణాలు రూ. 32,830 కోట్లు సాక్షి, హైదరాబాద్: 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాలపై నాబార్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రుణాల్లో సగ భాగం పంట రుణాలకే కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్ పేపర్‌ను విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రుణ ప్రణాళిక లక్ష్యం రూ. 65,590.61 కోట్లుగా నాబార్డు అంచనా వేసింది. 2016–17తో పోలిస్తే 17 శాతం రుణాలు అధికమని స్పష్టం చేసింది. అందులో వ్యవసాయ పంట రుణాలే ఏకంగా సగం ఉండటం గమనార్హం. మొత్తం రుణ ప్రణాళికలో పంట రుణాలు రూ. 32,830.44 కోట్లుగా నిర్ధారించింది. దీర్ఘకాలిక, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ. 14,116 కోట్లుగా నాబార్డు పేర్కొంది. ఈ రెండూ కలిపి వ్యవసాయ పంట, దీర్ఘకాలిక అనుబంధ రుణాలన్నీ రూ.46,946.98 కోట్లుగా ఉండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఈ రుణ ప్రణాళిక తయారు చేసినట్లు నాబార్డు వెల్లడించింది. చేపల పెంపకం, ఉద్యాన, పశు సంవర్ధకశాఖల అభివృద్ధి ప్రాధాన్యాలుగా దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.2,088 కోట్లు దీర్ఘకాలిక, వ్యవసాయ అనుబంధ రుణాలకు రూ. 14,116 కోట్లు కేటాయించగా... అందులో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతులకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు రూ.2,087.67 కోట్లు కేటాయించింది. పశుసంవర్ధకశాఖలో భాగమైన డెయిరీ అభివృద్ధి కోసం రూ. 1737.59 కోట్లు కేటాయించింది. కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 647.17 కోట్లు రుణంగా ఇవ్వాలని నిర్ణయించింది. గోదాములు, మార్కెట్ యార్డుల కోసం రూ.801.89 కోట్లు రుణంగా ప్రకటించింది. గృహ రుణాలకు రూ. 3,577 కోట్లు గృహ రుణాలకు రూ. 3,577.57 కోట్లు కేటాయించాలని నాబార్డు నిర్ణయించింది. విద్యా రుణాల కోసం రూ.1661.64 కోట్లు లక్ష్యంగా ప్రకటించింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల రంగానికి రూ. 9,241.24 కోట్లు రుణాలు ఇవ్వాలని వెల్లడించింది. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు దిశగా... కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా తన రుణ ప్రణాళిక లక్ష్యం ఉందని నాబార్డు వెల్లడించింది. అందుకు అనుగుణంగా రుణ ప్రణాళిక తీర్చిదిద్దినట్లు వివరించింది. -
గొర్రెల పంపిణీకి రూ.1,400 కోట్లు
► 21లక్షల గొర్రెల పంపిణీకి ఎన్సీడీసీ నుంచి రుణం ► ప్రభుత్వానికి పశు సంవర్ధక శాఖ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీకి పశు సంవర్ధకశాఖ సన్నాహాలు చేస్తోంది. రూ. 1,400 కోట్లతో 21 లక్షల గొర్రెలను గొర్రెల పెంపకందారులకు సరఫరా చేయాలని నిర్ణ యించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపింది. ఇందులో రూ.280 కోట్లు లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాలి. మిగిలిన సొమ్మును జాతీయ సహకార అభి వృద్ధి సంస్థ (ఎన్ సీడీసీ) నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. అందుకోసం ప్రభుత్వ గ్యారంటీ కోరాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా భావిస్తున్నారు. మొత్తం లక్ష యూనిట్లు లక్ష మందికి అందజేస్తారు. ఒక్కో యూనిట్లో 21 గొర్రెలుంటాయి. పావులా వడ్డీ కింద ఈ గొర్రెలను సరఫరా చేస్తారు. సామాజిక వర్గంతో సంబంధం లేకుండా సొసైటీల్లో సభ్యత్వం ఉంటేనే వారికి గొర్రెలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే వారు 5 గొర్రెలను కలిగి ఉండటం ప్రధాన అర్హత. ఆ తర్వాత సొసైటీలో సభ్యత్వం కలిగి ఉండాలి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 150 రిటైల్ చేపల మార్కెట్లను ఏర్పాటు చేయాలని పశు సంవర్ధక శాఖ నిర్ణయించింది. వాటిని చేపల సొసైటీలకు అప్పగిస్తారు. ఒక్కో చేపల మార్కెట్‌కు రూ.7.5 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. -
పశుసంవర్ధక శాఖకు పనేదీ?
బీవీపాళెం(తడ): బీవీపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో ఉన్న ఏడు శాఖల్లో మిగిలిన ఆరు శాఖలకు అంతో ఇంతో పని ఉన్నా పశుసంవర్ధక శాఖకు మాత్రం ప్రస్తుతం ఎలాంటి పనులూ లేక నిరుపయోగంగా మారింది. ఇక్కడ ప్రధానంగా వాణిజ్య, రవాణా శాఖలు విధులు నిర్వర్తిస్తుండగా మైనింగ్, అటవీ శాఖల సేవలు కొంత వరకు అవసరం అవుతున్నాయి. ఎక్సైజ్, మార్కెటింగ్ శాఖలకు అప్పుడప్పుడు పనులు ఉంటుండగా పశుసంవర్ధక శాఖ మాత్రం తామూ ఉన్నామనేందుకు మినహా ఎలాంటి పనులకూ పనికిరావడం లేదు. గతంలో అవసరం గతంలో రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు పశువులను తరలించే వాహనంలో దాణా, నీరు, గాలి వంటి సరైన వసతులు ఉన్నాయా? లేదా? అని పరిశీలించేవారు. పెద్ద లారీలో 10, 12 పశువులు మాత్రమే తరలించాల్సి ఉంటుంది. కానీ 25 నుంచి 30 వరకు పశువులను తీసుకువెళ్లడం జరుగుతుంది. దీనిని నివారించేందుకు కూడా తనిఖీలు అవసరమయ్యేవి. ఇక్కడి నుంచి వెళుతున్న పశువులకు వ్యాధులు ఉండి అవి ఇతర రాష్ట్రాల పశువులకు సోకకుండా ఉండేలా వ్యాక్సిన్ వేశారా? లేదా? అనే వివరాలను నమోదు చేశారు. తగ్గిన రవాణా ప్రస్తుతం పశువుల రవాణా తగ్గింది. గతంలో రోజుకు 70 నుంచి 80 లారీలు వస్తుండగా ప్రస్తుతం 20 నుంచి 25 లారీలు మాత్రమే కేరళ వెళుతున్నాయి. అవి కూడా నాయుడుపేట మీదుగా వెళుతుండటంతో ఒకటి, రెండు మాత్రమే చెక్‌పోస్టు మీదుగా వెళుతున్నాయి. ఏ వ్యాపారీ తగిన పత్రాలతో రాకపోవడంతో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు, చిల్లర సమర్పణతోపాటు తమిళనాడులోనూ పోలీసులతో, ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బంది నెలకొంటోంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు రూటు మార్చి నాయుడపేట మీదుగా కేరళ చేరుకుంటున్నారు. పాయింట్ మార్చితే ప్రయోజనం చెక్‌పోస్టు మీదుగా రవాణా ఆగిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న పాయింట్‌ను నాయుడుపేట సమీపంలోని పండ్లూరు గేటు వద్ద లేదా మనుబోలు వద్ద ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది. -
ఆపసోపాలు
► జిల్లాలో తీవ్రమైన పాల కొరత ► రోజుకు 10లక్షల లీటర్లు అవసరం ► ప్రస్తుతం ఉత్పత్తి 6 లక్షల లీటర్లే.. ► పశుగ్రాసం, నీటి సమస్యతో తగ్గిన ఉత్పత్తి ► డెయిరీల్లో పాల పొడి వినియోగం? ► భారంగా మారిన పశువుల పెంపకం ప్రతి ఒక్కరూ రోజుకు 220 మిల్లీలీటర్ల పాలు తీసుకున్నప్పుడే తగిన పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటారని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ చెబుతోంది. ప్రస్తుతం జిల్లా జనాభా 45లక్షలు. ఈ ప్రకారం దాదాపు 10 లక్షల లీటర్ల పాలు అవసరం. అయితే జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు 6లక్షల లీటర్లు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో పాల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. పాల పొడి వినియోగం పాల కొరతను అధిగమించేందుకు డెయిరీల్లో పాల పొడి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. శీతాకాలం, వానాకాలంలో పాల ఉత్పత్తి అధికంగా ఉన్నపుడు పాల పొడి తయారుచేసుకోవడం సర్వసాధారణం. కొరత ఏర్పడినప్పుడు అదే పొడిని ఉపయోగించి పాలు తయారు చేస్తారు. కరువు, వేసవి కారణంగా ప్రస్తుతం పాల కొరత ఉత్పన్నం కావడంతో డెయిరీల్లో పాల పొడి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నెలకొన్న కరువు పాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి సమస్య.. పశుగ్రాసం కొరత పశు పోషణను ప్రశ్నార్థకం చేస్తోంది. పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో పాడి పశువులు దాదాపు 8 లక్షలు. కరువు కారణంగా గత రెండు నెలల్లో దాదాపు 2లక్షల పాడి పశువులను అమ్మేసినట్లు తెలుస్తోంది. మరో 4లక్షల పశువులు ఒట్టిపోవడంతో.. పచ్చిమేత దొరక్క, నీటి సమస్యతో పాల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. మనుషులు తాగేందుకే నీళ్లు దొరకని పరిస్థితుల్లో పశువుల దాహార్తి తీర్చడం రైతులకు భారంగా మారుతోంది. శీతా కాలం, వానా కాలంలో సగటున ఒక పాడి పశువు 6 లీటర్ల వరకు పాలు ఇస్తుండగా.. ప్రస్తుతం 3 లీటర్లకు పడిపోయింది. అంటే రోజుకు జిల్లా వ్యాప్తంగా 6లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. గత డిసెంబర్ నెలలో 8.50 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేయడం చూస్తే.. కొరత ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుస్తోంది. తగ్గిన పాల ఉత్పత్తి ఇటీవల కాలంలో పాడి పరిశ్రమ పట్ల యువత ఆసక్తి చూపుతోంది. పట్టణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ఊపందుకుంది. వేసవిలోనూ నిర్వాహకులు పాల ఉత్పత్తి తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పశుగ్రాసం కొరత.. నీటి సమస్య.. దాణా కారణంగా పాల ఉత్పత్తి 10 నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు ఉష్ణోగ్రతలు పెరగడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10 ఆపై పాడి పశువులు కలిగిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో సాధారణ రైతుల పరిస్థితి ఘోరంగా ఉంటోంది. వసతుల కల్పనలో అధికారుల వైఫల్యం గ్రామాల్లో పాల ఉత్పత్తి తగ్గకుండా పశు సంవర్ధక శాఖ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయింది. పశువుల దాహర్తి తీర్చేందుకు గ్రామాల్లో తోట్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు నీటితో నింపాల్సి ఉన్నా 80 శాతం గ్రామాల్లో వీటి ఊసే కరువైంది. దాదాపు 3 నెలలుగా నీటితొట్ల పేరిట హడావుడి చేయడం తప్పిస్తే కార్యరూపం దాల్చని పరిస్థితి. ఇక పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రమే. సైలేజి గడ్డి సబ్సిడీపై పంపిణీ చేస్తున్నా పశువులు తినకపోవడం వల్ల రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాగితాల్లోనే కొత్త పాడి కొత్త పాడి కాగితాలకే పరిమితం అవుతోంది. డీఆర్డీఏ-వెలుగులో 2015-16లో 10వేలకు పైగా పాడి పశువులు కొని స్వయం సహాయక సంఘల మహిళలకు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇతర జిల్లాల నుంచి గ్రేడెడ్ ముర్రా గేదెలను తెచ్చి పంపిణీ చేయాల్సి ఉన్నా.. స్థానికంగానే ఇతరుల పశువులు చూపి మమ అనిపించినట్లు తెలుస్తోంది. పాల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు జిల్లాలో పశుగ్రాసం కొరతను అధిగమించి పాల దిగుబడి పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సబ్సిడీపై రైతులకు సైలేజి గడ్డి పంచుతున్నాం. సబ్సిడీ పోను రైతులు కిలోకు రూ.2 ప్రకారం చెల్లించాలి. ముఖ్యంగా వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా రైతులకు 75 శాతం సబ్సిడీపై మొలకగడ్డి యూనిట్లు పంపిణీ చేస్తున్నాం. ఇళ్లలోనే ప్టాస్టిక్ ట్రేల్లో ఉత్పత్తి చేసుకోవచ్చు. అజొల్లా యూనిట్లను 75 శాతం సబ్సిడీపై పాడి రైతులకు అందిస్తున్నాం. దాణాకు అజొల్లాను ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు. నీటి వసతి కలిగిన రైతులకు పశుగ్రాసాల సాగుకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. అవసరమైన రైతులు సంబంధిత పశువైద్యులను సంప్రదించవచ్చు. - డాక్టర్ సుదర్శన్ కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ -
‘నాన్‌వెజ్ మిల్క్’పై తేల్చండి
♦ 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు పశుసంవర్థక శాఖ ఆదేశం ♦ రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తనిఖీలు ♦ ఏజెంట్ల సూచనలతో హోటల్ వ్యర్థాలు కనబడకుండా చేసిన రైతులు ♦ పాలను ప్రయోగశాలలో పరీక్షించేందుకు సిద్ధమైన అధికారులు ♦ పాలు తాగిన బాలలకు అనారోగ్యం అంటూ సుమోటోగా నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాడైపోయిన కూరలు, కుళ్లిపోయిన కూరగాయలు, కంపుకొట్టే మాంసాహార వ్యర్థాలు, సాంబారును గేదెలకు ఆహారంగా ఇవ్వడంపై పశుసంవర్థక శాఖ తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్ శివార్లు సహా రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో హోటల్ వ్యర్థాలను వినియోగిస్తున్న ప్రాంతాల్లో తనిఖీ చేసి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గేదెలకు హోటళ్లలోని వ్యర్థాలను ఆహారంగా పెడుతుండడంపై బుధవారం ‘నాన్‌వెజ్ మిల్క్’ పేరిట ‘సాక్షి’ పతాక శీర్షికన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో హోటల్ వేస్ట్ తరలించే ఏజెంట్లు అప్రమత్తమై వ్యర్థ పదార్థాలను కనపడకుండా చేయాలని రైతులకు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో అధికారులు తనిఖీలు చేయగా.. హోటల్ వ్యర్థాలు దొరకకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, హోటల్ వ్యర్థ పదార్థాలు తింటున్న గేదె నుంచి వచ్చే పాలను ప్రయోగశాలకు పంపి పరీక్షలు చేయించాలని పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా ఆధికారులను ఆదేశించినట్లు తెలిసింది. చర్యలు తీసుకుంటాం: అధికారులు వ్యర్థాలను తరలించే ఏజెంట్లు, వాటిని నిల్వ చేసి విక్రయిస్తున్న హోటళ్లను గుర్తించి చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ శానిటరీ విభాగం అధికారులు వెల్లడించారు. సైఫాబాద్ ప్రాంతంలో ఇలా పాడైన ఆహార పదార్థాలను నిల్వ చేసి తరలిస్తున్న రెండు హోటళ్లను గుర్తించారు. పటాన్చెరు, కీసర ప్రాంతాల్లో దాదాపు 50 మంది రైతులు వెయ్యి పాడి గేదెలకు హోటల్ వ్యర్థాలను ఇస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. గేదెలకు పచ్చగడ్డి, ఎండు గడ్డి, తవుడును మాత్రమే ఇవ్వాలని అధికారులు ఈ సందర్భంగా రైతులకు సూచించారు. హోటల్లో మిగిలిన వ్యర్థ పదార్థాలను వినియోగిస్తే పశువుల ఆయుఃప్రమాణం తగ్గుతుందని వివరించారు. లూసన్ గడ్డి పెంచండి.. పాడి గేదెల కోసం 18 రోజుల్లో కోతకు వచ్చే లూసన్ గడ్డి పెంచాలని అధికారులు సూచిస్తున్నారు. కిలో లూసన్ విత్తనాలకు రూ.750 ఖర్చు అవుతుందని, గుజరాత్లో నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయని తెలిపారు. విత్తనాలు వేసిన 18వ రోజు నుంచే కోసి గేదెలకు ఆహారంగా వేయొచ్చని, ఒక్కో గేదెకు రోజూ ఐదు లేదా ఆరు కిలోల గడ్డిని మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఒకసారి విత్తనాలు వేస్తే మూడేళ్ల పాటు ప్రతి 18 లేదా 20 రోజులకోసారి కోసి గేదెలకు ఆహారంగా ఇవ్వొచ్చు. పెద్దగా నీటితో పని లేకుండానే ఈ గడ్డిని పెంచవచ్చు. గుజరాత్లో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఇదే ముఖ్యమని చెబుతుంటారు. ఈ విత్తనాలు ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రగతిశీల రైతు పాడి సమాఖ్య అధ్యక్షుడు కందాల బాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్ హోటళ్లలో మిగిలిపోయిన వ్యర్థాలను పాడి పశువులకు మేతగా ఇవ్వడంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ఈ అంశంపై వచ్చేనెల 5కల్లా నివేదిక అందజేయాలని పశుసంవర్థక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. హోటల్ వ్యర్థాలను తినే గేదెల పాలు తాగితే పిల్లల ఆరోగ్యంపైనా ప్రభావం ఉంటుందని కమిషన్ సభ్యుడు అచ్యుతరావు పేర్కొన్నారు. -
డెయిరీ రైతుల ప్రోత్సాహకానికి నిధుల కొరత
అదనంగా రూ. 48 కోట్ల కోసం సర్కారుకు పశుసంవర్ధకశాఖ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకానికి నిధుల కొరత ఏర్పడింది. ఏడాదిగా ఇస్తున్న ఈ ప్రోత్సాహకానికి నిధుల కటకటతో రైతులకు విజయ డెయిరీ బకాయి పడింది. దీంతో రైతులకు ప్రోత్సాహకానికి మరో రూ. 48 కోట్లు మంజూరు చేయాలని పశు సంవర్ధకశాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకంగా ఒక్కో లీటరుకు ప్రభుత్వం రూ. 4 చెల్లిస్తోంది. దీంతో ఒకవైపు రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం.. మరోవైపు కొన్ని ప్రైవేటు డెయిరీలకు కూడా ప్రోత్సాహకం అక్రమంగా వెళ్తుండటంతో ప్రభుత్వం కేటాయించిన రూ. 12 కోట్ల బడ్జెట్ సరిపోవడంలేదు. ఇప్పటికే ఆ బడ్జెట్ నిధులన్నీ అయిపోగా... విజయ డెయిరీ తన వద్ద నిల్వ ఉన్న నిధుల నుంచి కూడా అదనంగా రూ. 12 కోట్ల మేరకు ఖర్చుచేసినట్లు సమాచారం. అయినా రైతులకు బకాయి ఉన్నట్లు తెలిసింది. రూ. 50 కోట్లు కావాలని విజయ డెయిరీ ప్రతిపాదించగా ప్రభుత్వం రూ. 12 కోట్లే కేటాయించింది. -
మేధా టవర్స్‌లోనే సచివాలయం
-
మేధా టవర్స్‌లోనే సచివాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధానిలో తాత్కాలిక సచివాలయాన్ని కృష్ణా జిల్లా గన్నవరంలోని మేధా టవర్స్‌లోనే ఏర్పాటు చేయాలని జవహర్‌రెడ్డి నేతృత్వంలోని రాజధాని తరలింపు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సచివాలయం అంతా ఒకే ఆవరణలో ఉండాలని పేర్కొంది. సచివాలయ విభాగాలు వేర్వేరు చోట్ల ఉంటే పరిపాలనకు విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం 5.65 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలంలో ఉంది. మేధా టవర్స్ ప్రస్తుతం 1.75 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలంలో ఉంది. ఈ స్థలం సరిపోకపోతే మేధా టవర్స్ ఆవరణలో ఖాళీగా ఉన్న 30 ఎకరాల స్థలంలో తాత్కాలిక షెడ్లను నిర్మించి, అందులో సచివాలయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని జవహర్‌రెడ్డి కమిటీ సూచించింది. పోలీసు విభాగానికి సమస్య ఇప్పటికే పాఠశాల విద్య, ఉన్నత విద్య, వ్యవసాయ, రెవెన్యూ, పశు సంవర్థక శాఖలు విజయవాడలో కార్యాలయ వసతులను చూసుకున్నాయి. పోలీసు విభాగానికి వసతి సమస్యగా తయారైంది. పోలీసు విభాగానికి భవనాల్లో వసతిని గుర్తిస్తామని, అయితే పోలీసుల శిక్షణకు గ్రౌండ్‌తోపాటు జాగిలాలకు అవసరమైన స్థలం, వసతిని గుర్తించడం తమ వల్ల కాదని జవహర్‌రెడ్డి కమిటీ స్పష్టం చేసింది. గొల్లపూడిలో మూతపడిన ఇంజనీరింగ్ కళాశాల భవనంలోకి వెళ్లాలని వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ విభాగాలు భావిస్తున్నాయి. అయితే, ఆ భవన పటిష్టతను పరిశీలించిన తరువాతే వెళ్లాలని జవహర్‌రెడ్డి కమిటీ సూచించింది. వైద్య ఆరోగ్యం, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖాధిపతులతో జవహర్‌రెడ్డి కమిటీ త్వరలో సమావేశం కానుంది. స్కూళ్లలో అడ్మిషన్లు దొరుకుతాయా? నూతన రాజధానిలోని తాత్కాలిక కార్యాలయాల్లో మార్పులు చేర్పులతోపాటు ఇతర సౌకర్యాల కల్పనకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక కార్యాలయాల అద్దె చెల్లింపునకు ఏడాదికి రూ.50 కోట్లు అవసరమని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంత్రులు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస వసతిని రెయిన్ ట్రీ పార్కులో చూసింది. అయితే, నూతన రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగులకు, ఇతర అధికారులకు మాత్రం నివాస వసతిని ప్రభుత్వం చూడబోదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగులు, అధికారులు ఎవరి నివాస వసతిని వారే చూసుకోవాలని చెప్పారు. రాజధానికి తరలివెళ్తే వసతితోపాటు తమ పిల్లలందరికీ అక్కడి పాఠశాలల్లో ప్రవేశాలు దొరుకుతాయా? అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆచితూచి వ్యవహరిస్తున్న కేంద్రం మరోవైపు గన్నవరంలోని మేధా టవర్స్‌ను ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్) పరిధి నుంచి డీ నోటిఫై చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇందుకు ప్రధాన కారణం తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఎస్ఈజెడ్ల నుంచి డీ నోటిఫికేషన్‌ను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. మేధా టవర్స్‌ను ఎస్ఈజెడ్ పరిధి నుంచి డీ నోటిఫై చేస్తే మిగతా రాష్ట్రాలు కూడా ఇదే ప్రాతిపదికన డీ నోటిఫై కోసం పట్టుపడతాయనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేధా టవర్స్ డీ నోటిఫై వ్యవహారంలో జాప్యం జరుగుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎస్ఈజెడ్ పరిధిలో ఉన్న మేధా టవర్స్‌ను కేంద్రం టీనోటిఫై చేస్తేనే అందులో రాష్ట్ర సచివాలయాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. -
జూలు ‘కోడి’
సాధారణంగా కుక్కలకు జూలు ఉంటుంది. ఇక్కడ మాత్రం కోడికి ఉంది. అదే విచిత్రం. కళ్లు, కాళ్లు కూడా కనపడకుండా మొత్తం ఒళ్లంతా ఈకలతో ఉండే ఈ కోడిపిల్లను బొబ్బిలి పట్టణంలోని సిరుగుడువీధిలో కోరుకొండ దుర్గాప్రసాద్ పెంచుతున్నారు. రెండు నెలల కిందట రోజుల వయసులో ఉన్న ఈ కోడి పిల్లను దుర్గాప్రసాద్ కొన్నారు. చుట్టుపక్కల వారందరికీ ఇప్పుడు ఇదో సెలబ్రిటీలా అయిపోయింది. హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఇలాంటి కోళ్లు జన్మిస్తాయని పశుసంవర్థక శాఖ అసిస్టెంటు డెరైక్టరు డాక్టరు మురళీధర్ పేర్కొన్నారు. -బొబ్బిలి -
అమృతాహారం.. విషతుల్యం!
పశువుల దాణాలో రసాయనాలు, మద్యం వ్యర్థాలు దిగుబడి పెంచేందుకు వ్యాపారుల ఎత్తుగడ ఫలితంగా పాలలో కలుస్తున్న ఆల్కహాల్ పిల్లల ఆరోగ్యంపై పెనుప్రభావం పాడిపశువులకు ప్రాణాంతకంగా మారుతున్న వైనం సాక్షి, రంగారెడ్డి జిల్లా : పౌష్టికాహారమైన పాలు ప్రస్తుతం కలుషితమవుతున్నాయి. పాల దిగుబడి పెంచి భారీ లాభాలు మూటగట్టుకునేందుకు కొందరు సరికొత్త పద్ధతికి తెరలేపారు. బ్రెవరేజెస్ కంపెనీల వ్యర్థాలను పశువుల దాణాలో కలిపి వాటికి అందిస్తున్నారు. ఈ ప్రక్రియతో రోజుకు సగటున నాలుగు లీటర్ల పాలిచ్చే గేదె.. ఈ పద్ధతితో ఏకంగా ఏడు లీటర్ల పాలిస్తోంది. దిగుబడి పెరిగి లాభాలందుకుంటున్న నేపథ్యంలో ఈ విధానాన్ని ఇతర రైతులూ అనుసరిస్తున్నారు. అయితే.. కొత్త పద్ధతితో పాల దిగుబడి పెరుగుతున్నప్పటికీ.. ఆ పాలు ఎంతవరకు శ్రేష్టమనే సంగతినే మర్చిపోయారు. ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ రాజధాని చుట్టూ విస్తరించి ఉండడంతో జిల్లాలో పాడిపరిశ్రమకు విపరీతమైన డిమాండ్ ఉంది. నగరానికి రోజుకు సగటున 25లక్షల లీటర్ల పాలు అవసరం. ఈ స్థాయిలో ఉత్పత్తి లేనప్పటికీ.. రవాణా, ఇతర ఖర్చులు తగ్గే అవకాశం ఉండడంతో జిల్లా పాడి రైతులకు బాగా కలిసివస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 3.1 లక్షల ఆవులు, 2.6 లక్షల గేదెలున్నట్లు పశుసంవర్ధక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు జిల్లానుంచి మూడున్నర లక్షల లీటర్ల పాలు నగరానికి సరఫరా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. న గరంలోని డిమాండ్‌ను ఆసరా చేసుకుని కొందరు దాణా వ్యాపారులు కొత్త పద్ధతికి తెరలేపారు. బ్రెవరేజెస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆయా కంపెనీల వ్యర్థాలను రైతులకు విక్రయిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లోని రైతులకు విజయవాడ సమీపంలోని ఓ బ్రెవరేజెస్ కంపెనీ పక్షం రోజులకోసారి ఈ వ్యర్థ ద్రావణాన్ని ట్యాంకర్ల ద్వారా లీటరుకు సగటున రూ.7 వసూలు చేస్తూ విక్రయిస్తోంది. చేవెళ్ల, శంషాబాద్, పరిగి రైతులకు కరీంనగర్‌కు చెందిన ఓ కంపెనీ ఈ వ్యర్థ ద్రావణాన్ని సరఫరా చేస్తోంది. ఈ పద్ధతితో పాడి రైతుకు ఫీడ్ ఖర్చు భారీగా తగ్గుతుండగా.. దిగుబడితో అధిక లాభాలొస్తున్నాయి. మద్యం 10 శాతం పైమాటే.. పశువులకు దాణాలో భాగంగా పలు గింజల పొడిని నీటితో కలిపి ఇస్తారు. అయితే తాజాగా పలు చోట్ల ఈ మిశ్రమంలో రసాయనాలతో కూడిన మద్యం వ్యర్థాన్ని కలుపుతున్నారు. వీటిని తీసుకున్న పశువులు మత్తుగా.. సాధారణం కంటే భిన్నంగా ప్రవర్తిస్తాయి. ఈ సమయంలో పాలు అధికంగా ఇస్తున్నప్పటికీ.. అందులో మద్యంతో పాటు ఇతర రసాయనాలు కూడా నమోదవుతున్నాయి. ఇవి పిల్లలకివ్వడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మద్యం వ్యర్థాలు పశువుల ఆరోగ్యాన్ని సైతం పూర్తిగా దెబ్బతిస్తాయని పరిశోధనలో తేలింది. ఇటీవల ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ రైతు మద్యం వ్యర్థాల్ని దాణాలో కలిపి ఇవ్వడంతో వాటి కాలేయం చెడిపోవడం, మూత్రపిండాలు పాడవ్వడంతో ఏకంగా రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానిక పశు వైధ్యాధికారి సూచన మేరకు కొత్త పద్ధతికి స్వస్తి చెప్పాడు. ఉత్ప్రేరకాల ద్వారా.. మద్యం వ్యర్థాల్ని కలిపే పద్ధతితో పాటు కొన్నిచోట్ల రసాయనాలను ఉత్ప్రేరకాలుగా వాడుతున్నారు. వీటిని పశువులకు నేరుగా ఇంజక్షన్ రూపంలో ఎక్కిస్తున్నారు. ఈ పద్ధతితో పశువులు ఎక్కువ ఉత్తేజితమవుతున్నాయి. తాండూరు, వికారాబాద్‌లలోని కొందరు రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో అవిచ్చే పాలు పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రవేత్తల పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణం కంటే మితిమీరిన ఎదుగుదల ప్రమాదమేనని పశుసంవర్ధక శాఖ అధికారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నో బీ(ధీ)మా
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : మేత కోసం బయటికి వదిలిన పశువులు సాయంత్రం వరకు ఇంటి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఏ కరెంటు తీగనో.. ఏ అటవీ జంతువో వాటి పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. ఫలితంగా రైతులకు తీరని నష్టం మిగులుతోంది. పశువులకు బీమా సౌకర్యం లేక ఆర్థిక ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు న్యూఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో చేసుకున్న గడువు ముగియడం.. ఏడు నెలలకు పైగా గడుస్తున్నా ప్రీమియం సౌకర్యం లేకపోవడంతో చనిపోయిన మూగజీవాలకు పరిహారం దక్కడం లేదు. ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. ఈ గడువు కాస్త మార్చితో ముగిసింది. పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1,09,175 ఆవులు, ఎడ్లు, 3,36,654 పాడిగేదెలు, 6,95,110 గొర్రెలు, 5,88,303 మేకలు ఉన్నాయి. జిల్లాలో విద్యుత్ఘాతంతో, రోడ్డు ప్రమాదంలో, ఇతరత్రా కారణాలతో రోజుకు 2 నుంచి 5 వరకు ఏదో రకంగా ప్రమాదంలో మూగజీవాలు మృతిచెందుతూనే ఉన్నాయి. ఆరు నెలల్లో 230 వరకు పశువులు బలి అయ్యాయి. రెండు నెలల క్రితం భైంసా, కడెం మండల పరిధిలో ఐదు పశువులు మృతిచెందాయి. ఈ నేపథ్యంలో బీమా చెల్లింపు గడువు ముగియడంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. మరికొందరికేమో అసలు బీమా సౌకర్యం గురించి అవగాహన లేకుండాపోయింది. గతేడాది న్యూఇండియా బీమా కంపెనీ వద్ద 1210 పశువులకు మాత్రమే బీమా చేయించారు. ఈ బీమా ఒక్క ఏడాదికి మాత్రమే రైతులు ప్రీమియం చెల్లించారు. దాంతో మృతిచెందిన 17 పశువులకు పరిహారం అందింది. ఈ ఏడాది ఇంతవరకు బీమా కంపెనీ ప్రభుత్వంతో కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇప్పటికే బీమా సౌకర్యం కోల్పోయి ఏడు నెలలకు పైగా అవుతోంది. ఏటా అవగాహన కరువు.. జిల్లాలో 52 మండలాలకు గాను 101 పశుైవె ద్యశాలలు ఉన్నాయి. గ్రామాల్లోని చాలా మంది రైతులకు, పెంపకం దారులకు పశువుల బీమా సౌకర్యం అందుబాటులో ఉన్న విషయమే తెలీదు. గ్రామాల్లో పశుమిత్రలు, గోపాలమిత్రలు పనిచేస్తున్నా అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. బీమా సంస్థలు చొరవ తీసుకోకపోవడం.. బీమా పరిహారం చెల్లింపుల్లో జాప్యంతో రైతులు కూడా ముందుకు రావడం లేదు. బీమా సౌకర్యం ఇలా.. పశువులకు బీమా చేయించే రైతులు 50 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగితా 50 శాతం ప్రభుత్వం భరిస్తుంది. పాడి గేదెలు, ఆవులు, గేదేలు, మేకలు, గొర్రెలకు బీమా చేయించుకోవచ్చు. రూ.10 వేల విలువైన పశువుకు బీమా ఏడాదికి రూ.202.67 పైసలు, ప్రభుత్వం రూ.202.67 పైసలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి మూడేళ్లకు బీమా చేయించే అవకాశం కూడా మూడేళ్లకు కలిపి రూ.516 చెల్లించాల్సి ఉంటుంది. పశువు బీమా చేయాలనుకుంటే మండల పశు వైద్యాధికారులను, పశుమిత్రలను, గోపాలమిత్రలను సంప్రదించాలి. వారు బీమా కంపెనీల వివరాలు ఇస్తారు. బీమా చేయించిన పశువు చెవికి ట్యాగ్ వేస్తారు. అది ఉంటేనే బీమా వర్తిస్తుంది. బీమా చేయించిన పశువును అమ్ముకోవాల్సి వస్తే పశు వైద్యాధికారికి సమాచారం అందించి ధ్రువీకరణ పత్రం పొంది బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. అప్పుడు రూ.100 చెల్లించి కొనుగోలు చేసిన రైతు పేర మార్చుకోవచ్చు. పశువులు, జీవాలు ప్రమాదవశాత్తు మృతిచెందినా.. ప్రకృతి వైపరీత్యాలతో.. వ్యాధులతో మరణించినా పెంపకం దారులకు పరిహారం అందుతుంది. ప్రమాదవశాత్తు మరణించిన రైతుకు కూడా రూ.50 వేల వరకు బీమా మొత్తం లభిస్తుంది. దీని కోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. నాలుగేళ్లలో బీమా చేసిన పశువులు.. అందిన పరిహారం సంవత్సరం పశువులు పరిహారం 2010-2011 1,115 15 2011-2012 1,047 13 2012-2013 6,75 18 2013-2014 1,210 17 -
పాడి పశువుల పోషణలో శాస్త్రీయ పద్ధతులు అవసరం
శంషాబాద్ రూరల్ : శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పశు పోషణ చేపడితే అధిక పాల దిగుబడి సాధించవచ్చని పశుసంవర్ధక శాఖ ఏడీ వీరనంది తెలిపారు. గురువారం మండలంలోని చిన్నగోల్కొండలో పాడి పశువుల పోషణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ వీరనంది మాట్లాడుతూ.. పాడి పశువులకు తగిన మోతాదులో పోషకాలతో కూడిన దాణా, మేతను అందిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషణ చేపడితే ఆర్థికంగా నిలదొక్కుకుంటారని తెలిపారు. యాజమాన్య పద్ధతులతో పాడిని లాభసాటిగా మార్చుకోవచ్చని తెలిపారు. బహువార్షిక గడ్డి సాగుతో పశువులకు మేత కొరత తీరుతుందని పేర్కొన్నారు. దూడలకు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. చాలా మంది రైతులు దూడల పోషణపై దృష్టి పెట్టకపోవడంతో పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. పశువులకు, దూడలకు సకాలంలో టీకాలు, సీజన్‌వారీగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ఉమాకాంత్, వైద్యులు రవిచంద్ర, వంశీకృష్ణ పాల్గొన్నారు. -
పాలలో వెన్న శాతం పెంచండిలా..
వర్గల్: పాలలోని వెన్న శాతాన్ని బట్టి డెయిరీ నిర్వాహకులు ధరను నిర్ణయిస్తారు. సాధారణంగా పాడి గేదెలతో (బర్రెలు) పోల్చినపుడు ఆవు పాలలో వెన్న శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బర్రె పాలకు ధర ఎక్కువగా ఉంటుంది. పాడి పశువుల మేతలో జాగ్రత్తలు తీసుకుంటే పాలలో సరైన వెన్న శాతం వస్తుందని వర్గల్ మండల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్‌బాబు, 9849457404 అన్నారు. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పశువుల మేతలో 30 నుంచి 50 శాతం పప్పుజాతి పశుగ్రాసాలు ఉండేలా చూడాలి. ఇందుకోసం పూతదశలో ఉన్న గ్రాసం వినియోగించాలి. గ్రాసాన్ని పెద్ద సైజు ముక్కలుగా కోసి పశువులకు అందించాలి. మేతలో పచ్చగడ్డితోపాటు ఎండు గడ్డి ఉండేలా చూసుకోవాలి. దీంతో నమలడం, నెమరు వేసే సమయం పెరిగి లాలాజలం వృద్ధిచెందుతుంది. ఎండుగడ్డి ఎక్కువగా ఇవ్వాల్సివస్తే పత్తి చెక్కను రాత్రి నానపెట్టి ఉదయం అందించాలి. తద్వారా ప్రొటీన్లు బాగా లభ్యమవుతాయి. కొబ్బరి, వేరుశెనగ, పొద్దుతిరుగుడు చెక్కతో వెన్న శాతం బాగా వృద్ధి చెందుతుంది. దాణాను ఉదయం, సాయంత్రం రెండు సార్లు కాకుండా కొద్దికొద్దిగా రోజుకు 4,5 పర్యాయాలు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.