సాక్షి, హైదరాబాద్: ప్రోగ్రెస్ రిపోర్టు స్కూల్ విద్యార్థులకే కాదు ప్రభుత్వ శాఖలకూ వచ్చేశాయ్. హాజరుశాతం, మార్కుల ఆధారంగా బడిపిల్లలకు ఖరారు చేసే ర్యాంకులను శాఖలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిభ, పనితీరు, వార్షిక నివేదికల మదింపు ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. 2018–19లో కనబరిచిన ప్రగతి.. 2019–20 ఆర్థిక సంవత్సరం కార్యాచరణ ప్రణాళికను పరిగణనలోకి తీసుకోవడంతో మహిళా, శిశుసంక్షేమ శాఖకు తొలి ర్యాంకును లభించింది. ఇక పనితీరులో బీసీ సంక్షేమ శాఖ వెనుకబడింది. కార్మికశాఖ రెండోస్థానంలో నిలవగా.. మూడో ర్యాంకును వ్యవసాయ, సహకార శాఖ కైవసం చేసుకుంది. నాణ్యతాప్రమాణాలు, పౌరసేవలు, శాఖల పనితీరును పరిగణనలోకి తీసుకున్న సర్కారు.. ఆయా శాఖలు అందజేసిన నివేదికలను సమీక్షించింది.
ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖ, గృహ నిర్మాణం, రెవెన్యూ, వాణిజ్య, ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు సారథ్యం వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ర్యాంకుల వడపోత ప్రక్రియ జరిగింది. సగటున 2 నుంచి 4 శాఖల పనితీరును మదింపు చేసిన ఈ అధికారులు.. మార్కులను ఖరారు చేశారు. సచివాలయంలోని 34 విభాగాలకుగానూ 20 శాఖలు వార్షిక నివేదికలు సమర్పించగా.. ఇందులో మహిళా, శిశుసంక్షేమం (9.84 మార్కులు), కార్మిక, ఉపాధి (9.42), వ్యవసాయ, సహకార (8.44), వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం (8.12), పశుసంవర్థకశాఖ (8.10)లు టాప్–5లో నిలిచినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ప్రకటించారు. కాగా, బీసీ సంక్షేమశాఖ అట్టడుగున నిలవగా.. జీఏడీ విభాగానికి 19వ ర్యాంకు రావడం గమనార్హం.
శిశు సంక్షేమం టాప్..
Published Sun, Sep 1 2019 3:43 AM | Last Updated on Sun, Sep 1 2019 3:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment