Labor department
-
నేతన్న కంట కన్నీళ్లు
చీరాల: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేతలకు పుట్టినిల్లు చీరాల ప్రాంతం. చీరాలతోపాటు పొద్దుటూరు, జమ్మలమడుగు, పెడన, ఐలవరం, బద్వేలు, ఆత్మకూరు, తాటిపర్తి వంటి ప్రాంతాల నుంచి 40 ఏళ్ల కిందట వలసలు వచ్చిన కార్మికులు స్థానికంగా మాస్టర్ వీవర్లకు సంబంధించిన చేనేత షెడ్డుల్లోని మగ్గాలపై పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో మొత్తం 50 వేల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. జీఎస్టీ రద్దు హామీ అమలయ్యేనా..? మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమపై జీఎస్టీ పెనుభారంగా మారింది. చేనేత వృత్తులు చేసే వారికి 29 శాతం జీఎస్టీ మినహాయింపు ఇస్తామని చెప్పినా అమలయ్యేలా లేదు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపుపై నేటికీ కూటమి సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు. చేనేతలు కూటమి సర్కారులో మేలు జరగకపోగా చేనేతలు కునారిల్లుతున్నారు. చేనేత వృత్తిలో రాణించలేక చివరకు కారి్మకులు ఇతర వృత్తుల వైపు తరలిపోతున్నారు. కరువైన నేతన్న నేస్తం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బడ్జెట్లో చేనేతలకు రూ.200 కోట్లు కేటాయింపుతోపాటుగా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24 వేలు అందించారు. చేనేతలకు పూర్వ వైభవం తీసుకువచ్చి నేతన్నల తలరాత మార్చేందుకు చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లలో చేనేత రంగానికి నామమాత్రంగా 0.066 శాతం కేటాయించారని కారి్మక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కలగానే చేనేత పార్కు.. చేనేతలు అధికంగా ఉన్న చీరాల ప్రాంతంలో 50 ఎకరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చీరాల వచ్చిన సందర్భంగా నమ్మబలికారు. నేటికీ ఆ ఊసే లేకుండా పోయింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలో నిర్వహించిన సదస్సుకు ఆ శాఖ మంత్రి సవిత హాజరై చేనేతల కోసం అనేక పథకాలు రచించామని చెప్పారే తప్ప టెక్స్టైల్స్ పార్కు గురించి ప్రస్తావించలేదు. చేనేత వృత్తి చేసే కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ నేటికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు లేవు. కనీస వేతన చట్టానికి దిక్కేది? కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలి ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కారి్మకుడికి కూలి తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కారి్మకులకు ప్రయోజనం ఉంటుంది. నిధులు విడుదలైతే పార్కు పనులు ప్రారంభిస్తాం హ్యాండ్లూమ్ పార్కుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే పార్కు పనులు ప్రారంభిస్తాం. మగ్గం కార్మికులకు 200 విద్యుత్ యూనిట్లపై మార్గదర్శకాలు అందలేదు. నేతన్న నేస్తం ద్వారా ఒక్కో కార్మికుడికి అందాల్సిన రూ.24 వేలు కూడా ప్రభుత్వం విడుదల చేస్తే కార్మికుడికి అందిస్తాం. ఆప్కో ద్వారా కొంత మేర స్వయం సహకార సంఘాల ద్వారా కొనుగోలు ఇప్పుడే ఇప్పుడే మొదలుపెడుతున్నాం. – నాగమల్లేశ్వరరావు, హ్యాండ్లూమ్, ఏడీ -
ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌కు కార్మిక శాఖ నోటీసు
పలమనేరు(చిత్తూరు జిల్లా): తాను ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానెల్లో 20 ఏళ్లు విలేకరిగా వెట్టిచాకిరి చేశానని, కనీసం జీతం కూడా ఇవ్వకుండా తనను తొలగించారని, ఈ మేరకు సంస్థపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేశానని ఆర్ఎస్ లోకనాథం అనే వ్యక్తి శుక్రవారం తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పలమనేరు పట్టణానికి చెందిన ఆర్ఎస్ లోకనాథం 20 ఏళ్లు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్లో పనిచేశారు. ఇటీవల చానల్‌లోని పలువురిని కుదించి పలమనేరు రిపోర్టరే మూడు నియోజకవర్గాలను కవర్ చేయాలని ఆదేశించారు. దీంతో లోకనాథం కారు అద్దెకు తీసుకుని ముఖ్యమైన కార్యక్రమాలను కవర్ చేశారు. ఇందుకు సంబంధించిన అద్దె బిల్లులను బ్రాంచ్ మేనేజర్ పెట్టుకుని డబ్బు డ్రా చేసుకోవడంతో కడుపుమండిన బాధితుడు తమ యాజమాన్యం పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే లోకనాథంపైనే ఆగ్రహం వ్యక్తంచేసి ఆయన్ను విధుల నుంచి తొలగించారు. దీనిపై బాధితుడు తిరుపతిలోని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీఎల్) బాబూనాయక్కు గత నెల 22న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీసీఎల్ గత నెల 30వ తేదీన ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. -
నేడు వేతనంతో కూడిన సెలవు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 30న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్‌స్రూ్టమెంట్ యాక్ట్ 1881 కింద ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గత అక్టోబర్ 16న ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1974 కింద అన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఇతర ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులు, కూలీలు, ఇండ్రస్టియల్ అండర్‌టేకింగ్స్, ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ ఈనెల 15న రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీకుముదిని ఉత్తర్వులు జారీచేశారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వని పక్షంలో కార్మిక, ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలుఏర్పాటు చేస్తే సెలవులు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏవైనా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల భవనాల్లో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆయా కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించే అధికారాన్ని స్థానిక జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. నవంబర్ 29న పోలింగ్‌కు ముందు రోజు, 30న పోలింగ్ రోజు, డిసెంబర్ 3న కౌంటింగ్ రోజు అక్కడి ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలని సూచించింది. అన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఇతర ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులు, కూలీలకు గురువారం వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈమేరకు సంబంధిత సంస్థల యాజమాన్యాలకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
సమ్మెకు దిగితే బర్తరఫ్
సాక్షి, హైదరాబాద్: సమ్మెకు దిగిన ఆర్టీ జన్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇతర ఆర్టీ జన్లను సమ్మెకు పురిగొల్పినా లేక సమ్మెకు ఆర్థిక సాయం అందించినా ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు, ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి. రఘుమారెడ్డి శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్, ఇతెహద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సమ్మెకు సమయం దగ్గర పడడంతో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తీవ్ర చర్యలకు ఉపక్రమించాయి. విద్యుత్ ఉద్యోగుల తో పాటు ఆర్టీ జన్లకు7 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు తోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల తో కార్మిక శాఖ సమక్షంలో పారిశ్రామిక వివాద పరిష్కార చట్టం లోని సెక్షన్ 12(3) కింద ఒప్పందం చేసుకున్నామని, దీనికి విరుద్ధంగా పైన పేర్కొన్న రెండు సంఘాలు సమ్మెకు వెళ్తుండడం చట్ట విరుద్ధమని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశాయి. -
నిధులు సీసీఎస్‌లో జమ చేయండి.. తెలంగాణ ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిబ్బంది వేతనం నుంచి ప్రతి నెలా తీసుకున్న నిధులను ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి (సీసీఎస్) జమ చేయాలని.. యాజమాన్యం వాటిని తన సొంత అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. సొసైటీ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటోందని, కోలుకోలేని నష్టాల్లో ఉందని గుర్తుంచుకోవాలని ఆర్టీసీ ఎండీ, చీఫ్ మేనేజర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. సీసీఎస్‌కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన రుణాలు ఆగిపోయాయి. దీంతో బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా స్పందన రాలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రతినెలా జీతాల నుంచి కట్ చేస్తున్నా.. సీసీఎస్ తరఫున న్యాయవాది ఏకే జయప్రకాశ్‌రావు వాదనలు వినిపించారు. ‘ఉద్యోగుల నుంచి ప్రతి నెలా నిధులు సేకరిస్తున్నారు. సిబ్బంది జీతాల నుంచి కట్ చేసిన మొత్తాన్ని సీసీఎస్ ఖాతాలో జమ చేయాల్సి ఉంది. కానీ ఆర్టీసీ వాటిని సొంతానికి వాడుకుంటోంది. ఇది సరికాదు. ఆ నిధులన్నీ సీసీఎస్ ఖాతాలో జమ చేసేలా ఆదేశాలు జారీ చేయాలి..’అని కోరారు. ఆర్టీసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిధుల విడుదల విషయంలో ప్రభుత్వంతో సంస్థ ఎండీ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రతినెలా సీసీఎస్ ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆదేశించారు. కార్మిక శాఖకు నోటీసులు ఆర్టీసీ గుర్తింపు సంఘానికి ఎన్నికల నిర్వహణపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కార్మిక అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీతో పాటు పలువురిని ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా మంగళవారం విచారణ చేపట్టారు. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు. -
కరెంటోళ్ల సమ్మెపై జోక్యం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసుపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖను తెలంగాణ ట్రాన్స్‌కో కోరింది. ఈ మేరకు పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలతో చర్చలకు సంయుక్త సమావేశానికి ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌కు గురువారం లేఖ రాశారు. వేతన సవరణ, ఇతర డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈ నెల 17న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ తెలంగా ణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఇటీవల యాజ మాన్యాలకు నోటిసులు అందజేసిన విషయం తెలి సిందే. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రజలు తీవ్ర అసౌకర్యాలకి గురి అవుతారని, సమ్మెకు వెళ్లకుండా వారితో రాజీ కుదర్చాలని కార్మిక శాఖ కమిషనర్‌ను తాజా లేఖలో ట్రాన్స్‌కో సీఎండీ కోరారు. మళ్లీ చర్చలకు సిద్ధం.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీలతో ఇప్పటికే ఐదు దఫాలుగా చర్చలు జరిపి 6శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలుకు హామీ ఇచ్చామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో వరుసగా 30శాతం, 35శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయడం, సర్విసు వెయిటేజీ, ఇతర ప్రయోజనాలను కల్పించడంతో ఉద్యోగుల వ్యయం గణనీయంగా పెరిగిందన్న అంశాన్ని సైతం జేఏసీలకు తెలియజేశామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలతో పోల్చితే రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రయోజనాలు అధికంగా ఉన్నట్టు జేఏసీలకు వివరించినట్టు పేర్కొన్నారు. యాసంగి పంటల సాగు, పదో తరగతి వార్షిక పరీక్షలు, టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయని జేఏసీలకు వివరించామన్నారు. తదుపరి చర్చలకు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇటీవల తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీకి లేఖ సైతం రాసినట్టు ప్రభాకర్‌రావు వెల్లడించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితికి లోబడి డిమాండ్ల పరిష్కారానికి మళ్లీ చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఏర్పాట్లు చేయాలని కార్మికశాఖ కమిషనర్‌ను కోరారు. విద్యుత్ సమ్మె తథ్యం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ స్పష్టికరణ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు ఆత్మస్థైర్యంతో ఈ నెల 17 నుంచి సమ్మెకు సిద్ధం కా వాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, కన్వీనర్లు సాయిబాబు, రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు. సమ్మెలపై నిషేధాలు, చట్టాల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఎదురుదాడికి దిగాయని దుయ్యబట్టారు. సమ్మె తథ్యమని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని హెచ్చరిస్తూ జేఏసీకి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాయ డాన్ని ఖండిస్తూ గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అత్యవసర సేవలైనందున విద్యుత్ సంస్థల్లో ప్రతి 6 నెలలకోసారి సమ్మెలపై నిషేధాన్ని పొడిగించడం ఆనవాయితీ అని, ఏ రోజూ ఈ ఉత్తర్వులను ఉద్యోగులు అతిక్రమించలేదని గుర్తుచేశారు. పీఆర్సీ అమలుపై ఏడాదిగా కాలయాపన చేస్తూ ఇప్పుడు పరీక్షా సమయం, యాసంగి కాలం అని పేర్కొనడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ అని యాజమాన్యాలు పేర్కొనడం అన్యాయ మన్నారు. గుజరాత్లో ఉద్యోగుల జీతాలు ఇక్కడి కంటే అధికమని పేర్కొన్నారు. 23 వేల మంది ఆర్టీజన్లు తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వారికికూడా న్యా యం చేయాలన్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, ఆ ర్టీజన్లు, పెన్షనర్లకు మెరుగైన పీఆర్సీ వర్తింపజేయాలని, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సదుపాయం, ఆ ర్టీజన్ల సమస్యలను పరిష్క రించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో 17 నుంచి సమ్మె తథ్యమన్నారు. సమ్మెతో వినియోగదారులు, రైతులు, పరిశ్రమలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. -
దరఖాస్తు గడువు నేడు.. కాంట్రాక్టు ముగిసేది ఎల్లుండి!
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్విసెస్ (ఐఎంఎస్) డైరెక్టరేట్ పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఉద్యోగ ప్రకటననుంచి దరఖాస్తు ప్రక్రియ వరకు అపోహలు తలెత్తుతుండటం..దీనిపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఐఎంఎస్ ఆ«ద్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రుల్లో 231 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అత్యవసర కేటగిరీకి చెందిన ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలంటూ కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం ఐఎంఎస్.. జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిని జిల్లా స్థాయి కమిటీల ద్వారా భర్తీ చేస్తారు. కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, ఐఎంఎస్ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడుకన్వీనర్గా, డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, ఈఎస్ఐ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్లు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తు ప్రక్రియలో లోపాలు దరఖాస్తులను మాన్యువల్ పద్ధతిలోనే స్వీకరించనున్నట్లు ఐఎంఎస్ నోటిఫికేషన్లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు ఐఎంఎస్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా మాన్యువల్ పద్ధతిలో దరఖాస్తు తీసుకున్నాక.. దరఖాస్తుకు జతచేసిన పత్రాలకు సంబంధించిన చెక్లిస్ట్ను అభ్యర్థికి రసీదు రూపంలో ఇవ్వాలి. అయితే, ఇక్కడ అలాంటిదేమీ జరగట్లేదు. దీంతో పోస్టుల భర్తీలో అవకతవకలకు ఆస్కారం ఉందంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు జిల్లాల వారీగా ఉద్యోగ ప్రకటనలో రోస్టర్, రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడాన్నీ తప్పుబడుతున్నారు. కాంట్రాక్టు ఎప్పటివరకు? కారి్మకశాఖ జారీచేసిన జీఓ 25 ప్రకారం ఐఎంఎస్‌లో 231 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించినఏడాది కాంట్రాక్టు గడువు ఈనెల 31తో ముగియనుంది. ఒకవైపు 31వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగియనుండగా.. 29 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుండటం గమనార్హం. ఈనెల 30కల్లా ఇంటర్వ్యూలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు వెనువెంటనే జారీచేసినా అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరే నాటికే కాంట్రాక్టు గడువు ముగుస్తుందని ఐఎంఎస్ అధికారులే చెబుతున్నారు. ఈ నిబంధన కూడా ఉద్యోగార్థుల్లో గందరగోళం రేకెత్తిస్తోంది. -
ఈఎస్ఐ డిస్పెన్సరీలకు శాశ్వత భవనాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ చందాదారులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ కార్యాచరణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న ఈఎస్ఐ డిస్పెన్సరీలకు అన్ని రకాల వసతులతో శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71 డిస్పెన్సరీలున్నాయి. ఇవిగాకుండా కొత్తగా 14 డిస్పెన్సరీలను ఈఎస్ఐ కార్పొరేషన్ మంజూరు చేసింది. ప్రస్తుతమున్న డిస్పెన్సరీల్లో 65 డిస్పెన్సరీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె కాంట్రాక్టు గడువు ముగియడంతో కొన్నింటిని పలుమార్లు మార్పు చేసిన సందర్భాలున్నాయి. డిస్పెన్సరీల మార్పులతో అటు రోగులకు, ఇటు వైద్యులు, సిబ్బందికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు శాశ్వత భవనాల నిర్మాణానికి కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి డిస్పెన్సరీకి శాశ్వత భవనంకోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు అనువైన స్థలాల గుర్తింపు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. స్థలాలు గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణం.. ప్రస్తుతం స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక శాఖ భావిస్తోంది. ఈ దిశగా చర్యలు వేగవంతం చేసింది. స్థలాలను గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణాలను చేపట్టేందుకు కార్మిక శాఖ సిద్ధంగా ఉంది. గతవారం ఈఎస్ఐసీ ప్రాంతీయ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిస్పెన్సరీలకు శాశ్వత నిర్మాణాలపైనా చర్చించారు. ఈ క్రమంలో ఈఐఎస్‌ఐసీ ఉన్నతాధికారులు స్పందిస్తూ శాశ్వత భవనాలను నిర్మించేందుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు ఒక్కో భవనానికి రూ.50 లక్షలు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. ఈ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిసహాయ సహకారాలను తీసుకుంటామని వివరించారు. చందాదారుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. -
అమెరికాలో చదువుకున్న వారికే తొలి ప్రాధాన్యం
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ, ఎల్–1 వీసాల్లో కీలక సంస్కరణలకు తెర తీసింది. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడుతూనే ఆ దేశంలో చదువుకున్న విదేశీ యువతకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా బిల్లును రూపొందించారు. ‘‘హెచ్–1బీ, ఎల్–1 వీసా సంస్కరణల చట్టం’’ పేరుతో ఈ బిల్లును రెండు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం చట్ట సభల్లో ప్రవేశపెట్టింది. అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించేవారికి హెచ్–1బీ మంజూరులో ప్రాధాన్యతనిస్తారు. అంతే కాకుండా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్లు, అధిక వేతనాలకు పనిచేసే నైపుణ్యం ఉన్నవారికి వీసా మంజూరు చేసేలా సంస్కరణలు చేశారు. సెనేట్‌లో చుక్ గ్రాస్లీ, డిక్ డర్బిన్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో పాస్క్రెల్, పాల్ గోసర్ తదితర ప్రజాప్రతినిధులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చర్య వల్ల అమెరికాలో ప్రస్తుతం చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత స్థానం మనదే. భారత్‌కు చెందిన 2 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రస్తుతం అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్నారు. లేబర్ శాఖకు మరిన్ని అధికారాలు ఈ బిల్లు లేబర్ శాఖకు మరిన్ని అధికారాల్ని కట్టబెట్టింది. కంపెనీ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిని శిక్షించే అధికారం కూడా లేబర్ శాఖకు ఉంటుంది. వివిధ కంపెనీలను పర్యవేక్షించడం ఏ వీసాపై ఎందరు ఉద్యోగులున్నారు , వారికిస్తున్న జీతభత్యాలు, వారు అభ్యసించిన విద్య వంటి గణాంకాలను సేకరిస్తే ఆయా కంపెనీల్లో జరిగే అక్రమాలు వెలుగు చూసే అవకాశాలుంటాయి. ఇక ఎల్–1 వీసాల నిబంధనల అమలుపై పర్యవేక్షించే అధికారం హోంల్యాండ్ సెక్యూరిటీకి అప్పగించింది. బిల్లులో ఏం ఉందంటే.. ► అమెరికాలో విద్యనభ్యసించే విదేశీ యువతలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేవారికి తొలి ప్రాధాన్యం ఇస్తూనే అమెరికన్ల ప్రయోజన్ల కాపాడడం ► ఉన్నత విద్యనభ్యసించిన వారు, అత్యధిక వేతనాలు తీసుకునే నిపుణులైన పనివారికి ప్రాధాన్యం ► అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్–1బీ, ఎల్–1 వీసాదారులతో భర్తీ చేయడంపై నిషేధం ► హెచ్1బీ వీసాదారులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనుల్లోనూ, వారు పనిచేసే కార్యాలయాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు పడకుండా చర్యలు ► తక్కువ వేతనాలు ఇస్తూ ఔట్ సోర్సింగ్ ఇచ్చే ఉద్యోగులపై .హెచ్1–బీ, ఎల్–1 వీసాలపై తాత్కాలికంగా భారీ సంఖ్యలో విదేశాల నుంచి తీసుకువచ్చి వారికి శిక్షణ ఇచ్చాక, తిరిగి వారి దేశానికి అదే పనిచేయడానికి పంపే కంపెనీలపై ఆంక్షలు ► 50 మందికంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కంపెనీల్లో సగం మంది వరకు హెచ్–1బీ లేదంటే ఎల్–1 వీసా వినియోగదారులు పని చేస్తుంటే అదనంగా హెచ్–1బీ వినియోగదారుల నియామకాలపై నిషేధం. అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇస్తాం. మార్కెట్లో విదేశీ నిపుణులకు డిమాండ్ ఉంటే అమెరికా కాలేజీలు, యూనివర్సిటీల్లో చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తాం. చట్టంలో లొసుగుల్ని ఆధారంగా చేసుకొని ఔట్ సోర్సింగ్ కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలకు కోత పెట్టి చీప్ లేబర్ని నియమించుకుంటున్నారు. ఇక నుంచి అలాంటివి కుదరవు. ఈ బిల్లు అమెరికన్ల ప్రయోజనాలను కాపాడడమే కాకుండా నిపుణులైన విదేశీయుల్ని తక్కువ వేతనానికి తీసుకొచ్చి పనిచేయిస్తున్న యాజమాన్యాల దోపిడీని కూడా అరికడుతుంది’ –గ్రాస్లీ, కాంగ్రెస్ సభ్యుడు -
అమెరికాలో నిరుద్యోగ భృతికి 3.9 కోట్ల దరఖాస్తులు
వాషింగ్టన్ : అమెరికాను నిరుద్యోగ సమస్య అతలాకుతలం చేస్తోంది. వరుసగా తొమ్మిదో వారం నిరుద్యోగ భృతి కోసం లక్షలాది అమెరికన్లు దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనా ఇంకా, ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గత వారంలో 24 లక్షలమంది తొలిసారిగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని లేబర్ డిపార్ట్మెంట్ గురువారం ప్రకటించింది. ఇక కరోనా మహమ్మారితో లాక్డౌన్ ప్రారంభమైన మార్చి మధ్యలో నుంచి ఇప్పటి వరకు మొత్తం 3.86 కోట్ల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.(టార్గెట్ చైనా : కీలక బిల్లుకు సెనేట్ ఆమోదం) ప్రపంచంలోనే ఏ దేశంలో లేనన్ని కరోనా కేసులు అమెరికాలో నమోదయ్యాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా అనేక కంపెనీలు మూతపడటంతో వేలాది మంది ఉద్యోగులు ఇళ్లలకే పరిమితమయ్యారు. అమెరికాలో ఉద్యోగుల తప్పు లేకుండా వారిని ఉద్యోగం నుంచి తీసేస్తే, ప్రభుత్వం వారికి ప్రతి వారం నిరుద్యోగ భృతి చెల్లిస్తుంది. నిరుద్యోగ భృతికి ఎవరు అర్హులనేది వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితుల కారణంగా ట్రంప్ ప్రభుత్వం ఉద్యోగం పోయిన వాళ్లే కాకుండా.. సొంత వ్యాపారం చేసుకునే వారిని, ఫ్రీ లాన్సర్లను కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది. దీంతో ఉద్యోగం పోయిన వారు, ఉద్యోగం లేని వారు ఇలా అనేక మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు.(అందుకే నాపై దుష్ప్రచారం: చైనాపై ట్రంప్ ఆగ్రహం) మే9 వారంతంలో నమోదైన 30 లక్షల దరఖాస్తులతో పోలీస్తే, గత వారంతపు దరఖాస్తుల సంఖ్య 27 లక్షలతో తగ్గుదల కనిపించింది. ఇక మార్చి చివరి వారంలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య 69లక్షలతో పోలిస్తే, తొలిసారి నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుంటున్నవారి సంఖ్య వరుసగా 7 వారాలుగా తగ్గుతూ వస్తోంది. అయితే వరుసగా (రెండు వారాలకు మించి) నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య మాత్రం 2.5 కోట్లకు పెరిగింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి ఎంతమేర కోలుకుంటుందో అర్థం చేసుకోవడానికి దీర్ఘకాలంలో నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్యను ఆర్థిక నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు.(హెచ్1బీతో అమెరికన్లకు నష్టం లేదు!) -
పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటు కొనసాగింపు!!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20)లో ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 5న జరిగే ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2018–19లో కూడా ఇదే రేటు ఉంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని 8.5 శాతానికి తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. పోస్టాఫీస్ పొదుపు పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మొదలైన ఇతరత్రా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల స్థాయికి ఈపీఎఫ్ వడ్డీ రేటును కూడా సవరించాలంటూ కార్మిక శాఖపై ఆర్థిక శాఖ ఒత్తిడి తెస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా ప్రతీ ఆర్థిక సంవత్సరం వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో ఆర్థిక శాఖ అభిప్రాయాలను కూడా కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
వెట్టి చాకిరి కేసులో 17 ఏళ్ల జైలు
యాకుత్‌పురా: బాలలతో వెట్టి చాకిరి చేయించిన కేసులో బిహార్‌కు చెందిన నిందితుడికి 17 ఏళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాంపల్లిలోని 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డి.హేమంత్ కుమార్ బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. భవానీ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. బిహార్‌కు చెందిన షంషీర్ ఖాన్ (38) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి నషేమాన్‌నగర్ ఒవైసీ పాఠశాల ప్రాంతంలో గాజుల తయారీ కార్ఖానా నిర్వహిస్తున్నాడు. బిహార్‌కు చెందిన మైనర్ బాలలను నగరానికి తీసుకొచ్చి తన కార్ఖానా లో పనిచేయించాడు. 2016 జనవరి 2న అప్పటి భవానీ నగర్ ఎస్ఐ ప్రసాద్‌రావు, కార్మిక శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో గాజుల కార్ఖానాలో 11 మంది మైనర్ బాలలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అప్పటినుంచి కోర్టులో కొనసాగుతున్న కేసుపై ఈ మేరకు తీర్పు వెలువడింది. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు. -
3 రోజుల్లో తేల్చకుంటే సమ్మెబాట
సాక్షి, హైదరాబాద్: దసరాకు సొంతూళ్ల బాటపట్టేందుకు లక్షలాది మంది ప్రజలు సిద్ధమవుతున్న వేళ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘంతో కూడిన జేఏసీ సమ్మెబాటపై కార్మికశాఖకు అల్టిమేటం ఇచ్చింది. తమ డిమాండ్లపై 3 రోజుల్లోగా స్పందించకుంటే ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని స్పష్టంచేస్తూ మంగళవారం లేఖ అందజే సింది. ‘మేము సమ్మె నోటీసు ఇచ్చి 14 రోజులు గడిచింది. నోటీసు ఇచ్చిన 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మె చేయొచ్చు. మీ సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించే తేదీ ప్రకటించలేదు. 3 రోజుల్లో ఆ తేదీని ప్రకటిస్తే సరి. లేదంటే ఇక ఆ సమావేశం ఉండదని భావించి 3 రోజుల తర్వాత సమ్మె ప్రారంభిస్తాం’అంటూ పేర్కొంది. టీజేఎంయూతో కూడిన మరో జేఏసీ కూడా సమ్మె సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సరవణ, పెండింగ్ బకాయిల చెల్లింపు తదితర డిమాండ్లతో ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఇప్పటికే సమ్మె నోటీసు ఇవ్వగా కొన్ని సంఘాలు విడివిడిగా 2 జేఏసీలు ఏర్పాటు చేసుకొని సమ్మె కు సమాయత్తం అవుతున్నాయి. ఏ జేఏసీలో లేని ఎన్ఎంయూ గుర్తింపు కార్మిక సంఘం టీఎం యూ చేసే సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో సమ్మె ప్రారంభిస్తే తమ ప్రయాణాలేంటనే భయం ప్రజల్లో నెలకొంది. ఇప్పుడు టీఎంయూ–ఈయూలతో కూడిన జేఏసీ చర్య దీన్ని మరింత పెంచింది. సాధారణంగా సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలతో కార్మికశాఖ సంప్రదింపుల సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే గత సోమవారమే ఈ సమావేశం ఉంటుందని నోట్ జారీ చేసిన కార్మికశాఖ... ఆ వెంటనే దాన్ని రద్దు చేసుకుంది. తదుపరి తేదీని కూడా ప్రకటించలేదు. దీంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెండు రోజుల్లో నిర్ణయం: ఇన్చార్జి ఎండీ కార్మిక సంఘాలతో ఇప్పటివరకు చర్చలకు అధికారులు సిద్ధం కాలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో అధికారుల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఆర్టీసీలో సమ్మెలపై నిషేధం ఉంది. నిషేధ కాలంలో సమ్మెకు దిగడం, కార్మికశాఖ సంప్రదింపుల సమావేశం ఏర్పాటు కాకుండానే సమ్మె చేయడం చట్టపరంగా నేరమవుతుంది. కానీ కార్మికులు బస్సులు ఆపేస్తే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే పరిస్థితి లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మను సంప్రదించగా దసరాకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని, సమ్మె నోటీసుల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. అధికారుల మాట ఎలా ఉన్నా తాము మాత్రం సమ్మెకు సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. దసరా సమయంలో సమ్మె చేస్తే ప్రయాణికులకు ఇబ్బందులు కలగడం వాస్తవమేనని, కానీ వాటిని దూరం చేసే అంశం ప్రభుత్వం చేతిలోనే ఉందని చెబుతున్నాయి. -
శిశు సంక్షేమం టాప్..
సాక్షి, హైదరాబాద్: ప్రోగ్రెస్ రిపోర్టు స్కూల్ విద్యార్థులకే కాదు ప్రభుత్వ శాఖలకూ వచ్చేశాయ్. హాజరుశాతం, మార్కుల ఆధారంగా బడిపిల్లలకు ఖరారు చేసే ర్యాంకులను శాఖలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిభ, పనితీరు, వార్షిక నివేదికల మదింపు ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. 2018–19లో కనబరిచిన ప్రగతి.. 2019–20 ఆర్థిక సంవత్సరం కార్యాచరణ ప్రణాళికను పరిగణనలోకి తీసుకోవడంతో మహిళా, శిశుసంక్షేమ శాఖకు తొలి ర్యాంకును లభించింది. ఇక పనితీరులో బీసీ సంక్షేమ శాఖ వెనుకబడింది. కార్మికశాఖ రెండోస్థానంలో నిలవగా.. మూడో ర్యాంకును వ్యవసాయ, సహకార శాఖ కైవసం చేసుకుంది. నాణ్యతాప్రమాణాలు, పౌరసేవలు, శాఖల పనితీరును పరిగణనలోకి తీసుకున్న సర్కారు.. ఆయా శాఖలు అందజేసిన నివేదికలను సమీక్షించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖ, గృహ నిర్మాణం, రెవెన్యూ, వాణిజ్య, ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు సారథ్యం వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ర్యాంకుల వడపోత ప్రక్రియ జరిగింది. సగటున 2 నుంచి 4 శాఖల పనితీరును మదింపు చేసిన ఈ అధికారులు.. మార్కులను ఖరారు చేశారు. సచివాలయంలోని 34 విభాగాలకుగానూ 20 శాఖలు వార్షిక నివేదికలు సమర్పించగా.. ఇందులో మహిళా, శిశుసంక్షేమం (9.84 మార్కులు), కార్మిక, ఉపాధి (9.42), వ్యవసాయ, సహకార (8.44), వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం (8.12), పశుసంవర్థకశాఖ (8.10)లు టాప్–5లో నిలిచినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రకటించారు. కాగా, బీసీ సంక్షేమశాఖ అట్టడుగున నిలవగా.. జీఏడీ విభాగానికి 19వ ర్యాంకు రావడం గమనార్హం. -
పెండింగ్ పనులు పూర్తి చేయండి: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కార్మిక శాఖలో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి సీహెచ్.మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. కార్మిక, పరిశ్రమ, ఉపాధి కల్పన శాఖ అధికా రులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శాఖాపరంగా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పూర్తి చేసిన పెండింగ్ పనులను వెబ్సైట్లో పొందుపర్చాలని ఆదేశించారు. -
‘ఉద్యోగులను తొలగిస్తామనడం సరికాదు’
హైదరాబాద్: సమ్మె చేస్తున్న 108 అంబులెన్స్ ఉద్యోగులను తొలగిస్తామనడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తెలంగాణ స్టేట్ 108 ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట 108 ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. 108 ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా నిలుస్తామని కృష్ణయ్య తెలిపారు. అనంతరం జంటనగరాల సం యుక్త కార్మిక శాఖ కమిషనర్ గంగాధర్ హామీతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. ఆందోళనలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, పల్లె అశోక్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల అమలేది? కాళోజీ హెల్త్ వర్సిటీ రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు సక్రమంగా అమ లు చేయటం లేదని కృష్ణయ్య ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలని కోరారు. -
నేటి నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో సమ్మె సైరన్ మోగింది. డిమాండ్ల సాధన కోసం నేటి నుంచి విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్(ఆర్టిజన్లు) కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. విద్యుత్ శాఖలో తమను విలీనం చేసుకోవాలనే ప్రధానమైన డిమాండ్‌తో పాటు 16 రకాల డిమాండ్లపై తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గత నెలలో సమ్మె నోటీస్ ఇచ్చింది. శుక్రవారం ఈ డిమాండ్లపై యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ గౌడ్, సాయిలుతో కార్మిక శాఖ అధికారులు చర్చలు జరిపారు. కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి గంగాధర్ సమక్షంలో జరిగిన చర్చలకు ట్రాన్స్‌కో సంయుక్త కార్యదర్శి శోభరాణి , ఎస్పీడీసీఎల్ ప్రతినిధి లోక్యానాయక్లు హాజరయ్యారు. డిమాండ్లు పరిష్కరించలేం... కోర్టులో ఈ వివాదం ఉన్నందున డిమాండ్లను ఆమోదించడం కోర్డు ధిక్కారమే అవుతుందని, న్యాయ వివాదం తేలేదాకా డిమాండ్లను పరిష్కరించలేమని డిస్కమ్‌ల ప్రతినిధులు స్పష్టం చేశారు. డిమాండ్లేవీ పరిష్కారం కాకపోవడంతో శనివారం నుంచి ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్లలోని 18 వేల మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్తారని, సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనే బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టం–1947 ప్రకారం ఆర్టిజన్లకు సమ్మె చేసే అధికారం లేదని చేప్పే అధికారులు, ఆ చట్టంలోని ఎస్మా ఏ విధంగా అమలవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. సమ్మె చట్ట విరుద్ధం:ట్రాన్స్‌కో జేఎండీ జెన్కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్లో ఆర్నెల్ల పాటు సమ్మెపై నిషేధం ఉందని, కార్మికులు సమ్మెలో పాల్గొంటే ఎస్మా అమలు చేస్తామని ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు హెచ్చరించారు. 18 వేల మంది సమ్మెలోకి... డిస్కమ్‌లలో 23 వేల మంది ఉండగా, 18 వేల మంది సమ్మెలోకి వస్తున్నారని, సబ్స్టేషన్లలో విధులు, కరెంట్ స్తంభాలు, ఎమర్జెన్సీ సర్వీసులకు దూరంగా ఉంటా మన్నామని అధ్యక్షడు శ్రీధర్‌గౌడ్ తెలిపారు. డిమాండ్లను పరిష్కరించే దాకా సమ్మె కొనసాగుతుందన్నారు. కార్మికులను శాంతింపచేయడానికి శనివారం రాత్రి ఎస్పీడీసీఎల్ సీంఎడీ రఘుమారెడ్డి రంగంలోకి దిగారు. డిమాండ్లు పరిష్కరించలేని అనివార్య స్థితిలో ఉన్నామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. డిస్కమ్‌లో గ్రేడ్–4 ఆర్టిజన్లు సాంకేతిక విధులు నిర్వహిస్తుంటే వారి విదార్హతల ఆధారంగా ప్రత్యేక అలవెన్సు వర్తింపచేస్తామని హామీ ఇవ్వగా.. విలీనంపై స్పష్టత ఇచ్చేదాకా సమ్మె కొనసాగుతుందని కార్మికులు తేల్చి చెప్పారు. -
లీజు రెన్యువల్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: తన స్థలంలో ఉన్న ప్రభుత్వ డిస్పెన్సరీ లీజు పునరుద్ధరణ(రెన్యువల్)కు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వడానికి కార్మిక శాఖ నిరాకరించడంపై ప్రధాని మోదీ ఆంటీగా చెప్పుకుంటున్న 90 ఏళ్ల మహిళ అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించింది. గుజరాత్‌లోని వాద్నగర్లో దహిబెన్ నరోత్తమ్‌దాస్ మోదీ నివసిస్తున్నారు. ఆమెకు చెందిన స్థలంలో బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ నడుస్తోంది. 1983లో రూ. 600 అద్దె ఇవ్వగా.. అనంతరం రూ.1,500కు పెంచారు. అప్పటి నుంచి అద్దె పెంచకపోవడంతో గత ఏడాది డిసెంబర్లో లీజు వివరాలు, పునరుద్ధరించక పోవడానికి కారణాలు చెప్పాలంటూ కార్మిక శాఖకు సమాచార హక్కు చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. సరైన సమాధానం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)కి దహిబెన్ ఫిర్యాదు చేశారు. గత వారం సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు వద్దకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. లీజును రెన్యువల్ చేయకపోవడంతో ఆ మొత్తంతో జీవించడం కష్టంగా మారిందని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఆమె మొదట దాఖలు చేసిన పిటిషన్‌కు సరైన సమాధానం రాకపోవడంతో.. 2018 జనవరి 9న ఆమె రెండో అప్పీలు దాఖలు చేశారు. అందులో తాను ప్రధాని మోదీ ఆంటీనని, తనకు న్యాయం జరగకపోతే ప్రధానికే ఈ విషయం తెలియజేస్తానని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో బంధుత్వం గురించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆమె అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ ఎందుకు సమాధానం ఇవ్వలేదని, ఆమె ఆర్టీఐ పిటిషన్‌ను విచారించిన అధికారులపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలపాలని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు ప్రశ్నించారు. -
జిల్లాకో ఈఎస్ఐసీ డిస్పెన్సరీ, బ్రాంచి ఆఫీస్
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) డిస్పెన్సరీ కమ్ బ్రాంచి కార్యాలయాలను జిల్లాకొకటి చొప్పున దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కార్మికశాఖ నిర్ణయించింది. ఆ శాఖ మంత్రి గంగ్వార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ప్రారంభించే ఈఎస్ఐసీ డిస్పెన్సరీ కమ్ బ్రాంచి ఆఫీసు(డీసీబీవో)లు ప్రాథమిక వైద్యంతోపాటు రెఫరెల్ సేవలు, బిల్లుల పరిశీలన, మందుల పంపిణీ వంటి సేవలను అందిస్తాయి. డీసీబీవోల నిర్వహణ బాధ్యతను ఈఎస్ఐసీ చూస్తుంది. ఈఎస్ఐసీ ఆస్పత్రుల్లో నర్సింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను ప్రారంభించాలని కూడా కార్మికశాఖ నిర్ణయించింది. ఇంటర్న్‌షిప్ కాలంలో నర్సులకు రూ.22వేల స్టైపెండ్‌ను కూడా అందించనుంది. కొన్ని ఈఎస్ఐసీ ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచటంతోపాటు కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి కూడా ఈ సమావేశం ఆమోదం తెలిపింది. -
పీఎఫ్‌పై వడ్డీ 8.55 శాతం
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్‌పై 8.55 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్మిక శాఖ త్వరలోనే ప్రకటన చేయనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) అత్యున్నత నిర్ణాయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) చందాదారులకు చెల్లించాల్సిన వడ్డీని నిర్ణయించి ఫిబ్రవరిలోనే ఆర్థిక శాఖ ఆమోదానికి పంపించింది. అయితే, ఆర్థిక శాఖ ఆమోదం ఆలస్యం కావటంతోపాటు ఈనెల 12న కర్ణాటకలో ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల నియమావళి అడ్డుగా నిలిచింది. వచ్చే వారంలో ఎన్నికల సంఘం అనుమతి రాగానే కార్మిక శాఖ ప్రకటన చేస్తుందనీ, ఆ వెంటనే సభ్యుల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ అవుతుందని ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి. గత ఐదేళ్లలో ఈపీఎఫ్‌వో చందాదారులకు చెల్లిస్తున్న అతి తక్కువ వడ్డీ ఇదే కావటం గమనార్హం. -
ఇప్పుడు సమ్మెలు లేవు
సాక్షి, అమరావతి: ఒకప్పుడు శ్రమ దోపిడీ వల్ల కార్మికులు రోడ్లెక్కి ధర్నాలు, సమ్మెలు చేసేవారని, మారుతున్న కాలానికి అనుగుణంగా యాజమాన్యాలు కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవడంతో ఇప్పుడు ధర్నాలు, సమ్మెలు లేవని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మే డే సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది అసంఘటిత కార్మికులుగానే ఉన్నారని, వీరంతా భవనాల నిర్మాణం, ఫ్యాక్టరీలు, ఇళ్లల్లో పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికులతో సరిగా పనిచేయించేవారే ఉత్తమ యాజమానులని, పరిశ్రమల అభివృద్ధికి పనిచేస్తూ సహకరించేవారే ఉత్తమ కార్మికులని తెలిపారు. చట్టాలు, తనిఖీలు ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో 2.13 కోట్ల మంది చంద్రన్న బీమాలో అసంఘటిత కార్మికులుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. కార్మిక చట్టాలను ఆన్లైన్ చేశామని, తనిఖీలను కూడా ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమలో ఎక్కువ మంది పనిచేస్తున్నారని, 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ. 1,140 కోట్లను చంద్రన్న బీమా కింద ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆస్పత్రులకు రూ. 80 కోట్లతో వసతులు కల్పిస్తున్నామని, 79 ఐటీఐలను ఆధునికంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలో కార్మికులు అశాంతిగా ఉండకూడదని, కార్మిక అశాంతి ఉంటే పరిశ్రమలు రావని చెప్పారు. మూడు ఈఎస్ఐ ఆస్పత్రుల ప్రారంభం.. కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికుల కోసం 25 ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటుచేయగా అందులో మూడు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2018కి సంబంధించిన శ్రమశక్తి, బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డులను బహూకరించారు. -
రైతు కూలీలకూ వ్యక్తిగత బీమా
సాక్షి, హైదరాబాద్: రైతులకు రూ.ఐదు లక్షల వ్యక్తిగత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా భూమి లేని రైతు కూలీలకూ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో వ్యవసాయశాఖ దీనికి సంబంధించి అధ్యయనం మొదలు పెట్టింది. భూమి కలిగిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం బీమా సదుపాయాన్ని ప్రకటించడమే కాకుండా బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే రైతు బీమాతో గ్రామాల్లో భూమి లేని కౌలు రైతులు, రైతు కూలీల్లో సర్కారుపై వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంలో వారందరికీ బీమా సదుపాయం కల్పించాలని ఆలోచిస్తోంది. సెర్ప్, రవాణాశాఖ, గిరిజన సంక్షేమశాఖ, మైనారిటీ సంక్షేమ సంస్థ, కార్మికశాఖ, పౌరసరఫరాల సంస్థ తదితర వాటిల్లో అమలవుతున్న బీమా పథకాలను అధ్యయనం చేస్తుంది. ఆ సంస్థలు, శాఖలు బీమా పథకాలను ఎలా అమలు చేస్తున్నాయో వివరాలు సమర్పించాల్సిందిగా వ్యవసాయశాఖ కోరింది. 50 లక్షల మందికి ప్రయోజనం రైతు బీమాను, రైతు కూలీ బీమాను వేర్వేరుగానే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. రైతు బీమా కింద అన్నదాతలు ఎవరైనా ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య లేదా సాధారణ మరణం పొందినా రూ.5 లక్షలు బీమా కింద పరిహారం అందనుంది. అందుకోసం ప్రభుత్వం ప్రతీ రైతు పేరు మీద రూ.వెయ్యి వరకు బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించనుంది. అయితే రైతు కూలీలు, భూమిలేని కౌలుదార్లకు కూడా రూ.5 లక్షల బీమా వర్తింప చేస్తారా? లేకుంటే తక్కువ ఉంటుందా అన్న దానిపై మేధోమథనం జరుగుతోంది. రాష్ట్రంలో ఒక అంచనా ప్రకారం 40 లక్షల మంది రైతు కూలీలున్నారు. అలాగే బ్యాంకర్ల లెక్కల ప్రకారం కౌలురైతులు 12 లక్షల మంది వరకు ఉన్నారు. కౌలు రైతుల్లో ఎవరైనా భూమి ఉన్న రైతులు కొందరిని తీసేస్తే సుమారు 50 లక్షల మంది వరకు ఈ కొత్త పథకం కింద బీమా కల్పించాల్సి ఉంటుంది. అయితే వీరిలో ఎవరైనా ఇతరత్రా పద్ధతుల్లో బీమా కిందకు వచ్చే వారుంటారా లేదా అన్న దానిపైనా వ్యవసాయశాఖ ఆరా తీస్తుంది. అందువల్ల వివిధ శాఖలు చేపడుతున్న బీమా పథకాల లబ్ధిదారులు, వారి ఆధార్ నంబర్లను కూడా తమకు ఇవ్వాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేసింది. -
అదే జట్టు.. ఐదో బడ్జెట్టు
సాక్షి, హైదరాబాద్: వరుసగా అయిదోసారి రాష్ట్ర బడ్జెట్ తయారీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు కీలక భూమిక నిర్వర్తించారు. తొలి రెండేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శి (ఐఎఫ్) హోదాలో బడ్జెట్ రూపకల్పన చేసిన రామకృష్ణారావు రెండేళ్లుగా అదే శాఖలో ముఖ్య కార్యదర్శిగా పదోన్నతి పొందారు. బడ్జెట్ తయారీలో ఆర్థిక శాఖతోపాటు కీలక పాత్ర పోషించే ప్రణాళిక శాఖకు సైతం ఆయనే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈసారి బడ్జెట్ తయారీలో రామకృష్ణారావు రేయింబవళ్లు శ్రమించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశంతో వరుసగా అయిదు బడ్జెట్ల తయారీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించటం విశేషం. సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ కావటంతో, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయత్నించటంతో పాటు ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతలను సమపాళ్లలో పొందుపరిచేందుకు భారీగా కసరత్తు చేయాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సలహాదారులు జీఆర్ రెడ్డి, ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి బడ్జెట్‌తో పాటు సామాజిక ఆర్థిక సర్వేను తయారు చేయటంలో ప్రధాన భూమిక నిర్వహించారు. బడ్జెట్ తయారీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక సమయం వెచ్చించటంతో పాటు ప్రతి పద్దును స్వయంగా పరిశీలించారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్ని శాఖలతో బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించటంతో పాటు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ నుంచి ఇదే జట్టు వరుసగా బడ్జెట్ రూపకల్పన కసరత్తును నిర్వహించటం విశేషం. ఉపాధి కల్పన, కార్మికశాఖకు తక్కువే.. కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు కేటాయింపులు భారీగా తగ్గాయి. గతేడాది ఈ శాఖకు రూ. 625.58 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 596.32 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ. 332.40 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 263.92 కోట్లు కేటాయించింది. ఈ శాఖ ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ కార్డుల పునరుద్ధరణతో పాటు ఐటీఐ ప్రవేశాలు తదితరాల్లో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా పలు ఐటీఐలను కార్పొరేట్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుని ఉద్యోగావకాశాల కల్పనను వేగవంతం చేసింది. స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో కేటాయింపులు తగ్గడంతో ఆ శాఖ కార్యక్రమాలపై ప్రభావం పడనుంది. మహిళా, శిశు సంక్షేమానికి దక్కని ప్రాధాన్యత మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి తాజా బడ్జెట్లో ప్రాధాన్యత అంతంత మాత్రంగానే దక్కింది. గతేడాది రూ. 1,731.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ. 1,798.82 కోట్లు ఇచ్చింది. కొత్త పథకాలు లేనప్పటికీ ప్రగతి పద్దు భారీగా పెరిగినా ఈ శాఖకు ప్రాధాన్యత దక్కలేదు. తాజా బడ్జెట్లో నిర్వహణ పద్దు కింద రూ. 859.43 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 939.39 కోట్ల చొప్పున ఇచ్చింది. ఈసారి బడ్జెట్లో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థకు రూ. 70.14కోట్లు కేటాయించింది. గతేడాది రూ.6 కోట్లు మాత్రమే ఇవ్వగా ఈసారి భారీగా పెంచడంతో మహిళలకు ఆర్థిక చేయూత కార్యక్రమాలకు ఊతమిచ్చినట్లయింది. పౌష్టికాహార పథకాలకు రూ. 240.95 కోట్లు, సబల కార్యక్రమానికి రూ. 34.68 కోట్లు, ఆరోగ్యలక్ష్మికి రూ. 153.79 కోట్లు కేటాయించింది. -
మూడు నెలల్లో 1.36 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: తయారీ, ఐటీ, రవాణా సహా ఎనిమిది కీలక రంగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ కాలంలో నికరంగా 1.36 లక్షల ఉద్యోగాలు అదనంగా ఏర్పడినట్టు కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో నిర్వహించిన త్రైమాసిక వారి సర్వేలో వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఉద్యోగాలు నష్టపోయినది నిర్మాణ రంగం ఒక్కటే. ఈ రంగంలో 22,000 ఉద్యోగాలు తగ్గిపోయాయి. తయారీ రంగంలో 89,000, విద్యా రంగంలో 21,000, రవాణా రంగంలో 20,000, వర్తకంలో 14,000, ఆరోగ్య రంగంలో 11,000 ఉద్యోగాలు పెరిగాయని ఈ సర్వే పేర్కొంది. -
సెస్ సొమ్ము కార్మికుడి ఖాతాలోకి!
సాక్షి, హైదరాబాద్: దేశంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షే మం కోసం వసూలు చేసే సెస్ దుర్వినియోగం అవుతోంది. సుమారు రూ.28 వేల కోట్లు వృథాగా పడిఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తెలిపింది. సరైన వైద్య సేవలు, రక్షణ అందక నిర్మాణ కార్మికుడు పూర్తి నిస్సహాయ స్థితిలో ఉన్నాడని.. ఇకనైనా కేంద్రం దృష్టి సారించాలని సూచించింది. 1996 భవన, ఇతర నిర్మాణ కార్మికుల ఉపాధి, రక్షణ, ఆరోగ్యం, సంక్షేమ చట్టాన్ని రూపొందించారు. నిర్మాణ వ్యయంలో 1% సెస్ రూపంలో కట్టాల్సి ఉంటు ంది. గతేడాది డిసెంబర్ నాటికి దేశంలో కార్మిక శాఖ వద్ద నమోదైన నిర్మాణ కార్మికుల సంఖ్య 2.8 కోట్లు. తెలంగాణలో కార్మిక శాఖ వద్ద నమోదైన సంఖ్య 10 లక్షలు. అదనంగా మరో 7 లక్షల వరకుంటారని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు మెంబర్ గంధం అంజన్న తెలిపారు. అవగాహన లేకే చాలా మంది నిర్మాణ కార్మికులు నమోదు చేయించుకోవట్లేదు. 2022 నాటికి దేశంలో భవన నిర్మాణ రంగంలో 76.5 మిలియన్ మంది కార్మికుల అవసరం ఉంటుందని అన్‌రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ చైర్మన్ అనూజ్పురి తెలిపారు. నిర్మాణ కార్మికుల్లో ఎక్కువ మంది వలసదారులే ఉంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వలసలెక్కువగా ఉంటుంటాయి. వలస నిర్మాణ కార్మికులు కనీస వేతనాలు, ఓవర్ టైం చెల్లింపులు, సెలవులు వంటి గృహ, సాంఘిక భద్రత ప్రయోజనాలకు అర్హులు. కానీ, వాస్తవానికి దేశంలో కార్మిక చట్టం అమలు సవ్యంగా జరగట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంలో కార్మికులు అత్యంత కీలకం. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే వీళ్ల రక్షణ, వైద్య సేవలు దీర్ఘకాలంగా నిర్లక్ష్యంగా చేయబడ్డాయి. దీనికి పరిష్కారం చూపించేందుకే భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) దృష్టిసారించిందని క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు ఎస్. రాంరెడ్డి తెలిపారు. దుర్వినియోగమవుతున్న లేబర్ సెస్ సద్వినియోగానికి ప్రత్యేకంగా ఒక పథకం ఉండాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ‘‘సెస్ సొమ్మును నేరుగా కార్మికుని బ్యాంక్ ఖాతాలో జమ చేయవచ్చు. లేకపోతే ఆరోగ్యశ్రీ లాగానే లేబర్ వైద్య పథకం వంటి దాన్ని ఏర్పాటు చేసి సెస్ సొమ్మును అందులో జమ చేస్తే.. కార్మికునితో పాటూ కుటుంబంలోని ఇతర సభ్యుల వైద్య సేవల సమయంలోనూ వినియోగించుకునే వీలుంటుందని’’ ఆయన వివరించారు. దీంతో మరింత మంది నిర్మాణ కార్మికులు నమోదయ్యే అవకాశంతో పాటూ వారి ఆరోగ్యం, సంక్షేమం కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాలపై క్రెడాయ్ సభ్యులతో చర్చించి.. 2 నెలల్లో కార్మిక శాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతామని ఆయన తెలియజేశారు. మే 1 నుంచి కొత్త పథకాలు.. నిర్మాణ పనుల్లో కాళ్లు, చేతులు విరిగి వికలాంగులైన కార్మికులకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.1,500 పెన్షన్ ఇస్తోంది. దీనికి అదనంగా మరో రూ.3,000 ఇవ్వనున్నట్లు సమాచారం. కార్మిక దినోత్సవం (మే1)న దీన్ని సీఎం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదు చేసుకున్న కార్మికుల్లో వికలాంగులుగా ఉన్న వాళ్లు 225 మందిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటూ వలస కార్మికుల పిల్లలను బడికి పంపిస్తే 1–6వ తరగతి వరకు ఏడాదికి రూ.2 వేలు, 7–10 వరకు రూ.3 వేల ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు తెలిసింది.