ఎనిమిది రంగాల్లో పెరిగిన ఉపాధి
* 2014-15పై ప్రభుత్వ నివేదిక
* 5.21 లక్షల మందికి ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఉపాధి కల్పన గడచిన ఆర్థిక సంవత్సరం (2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి వరకూ) గణనీయంగా పెరిగింది. ఇందుకు సంబంధించి ప్రధానంగా ఎనిమిది రంగాల వివరాలను తెలుపుతూ కార్మిక విభాగం మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది. ‘ఉపాధి సంబంధ అంశాల్లో మార్పులపై 25వ త్రైమాసిక నివేదిక’ పేరుతో విడుదలైన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే..
* ఐటీ/బీపీఓ, ఆటోమొబైల్, రత్నాలు- ఆభరణాలు, జౌళి, నేత, తోలు, రవాణా, మెటల్ రంగాల్లో కొత్త ఉద్యోగాలు గతేడాది 5.21 లక్షలు పెరిగాయి.
* ఈ 8 రంగాల్లో చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో కొత్త ఉద్యోగాల సంఖ్య కేవలం 64,000. అయితే మూడు త్రైమాసికాలనూ తీసుకుంటే... ఉపాధి కల్పన 1.82 లక్షలు, 1.58 లక్షలు, 1.17 లక్షల మేర పెరిగింది. (అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికాలతో పోల్చిచూస్తే).
* మరో ముఖ్య విషయం ఏమిటంటే... చివరి త్రైమాసికంలో ఐటీ-బీపీఓ, జౌళి, ఆటోమొబైల్, మెటల్స్ నియామకాలు కొంత మెరుగుపడితే... తోలు, రత్నాలు-ఆభరణాలు, రవాణా, నేత రంగాల్లో ఉపాధి కల్పనలో అసలు వృద్ధిలేకపోగా క్షీణిత నమోదయ్యింది.
* 2013-14లో మొత్తంమీద ఉపాధి కల్పన సంఖ్య 2.76 లక్షలు. 2012-13లో మాత్రం 5.21 లక్షలు. 2008 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం నుంచీ కార్మిక విభాగం త్రైమాసికం ప్రాతిపదికన ఉపాధికి సంబంధించి సర్వే నిర్వహిస్తోంది.