కర్నూలు(అగ్రికల్చర్) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీలను ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా నమోదు చేసి బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2013-14 సంవత్సరంలో ఉపాధి పనులకు హాజరైన కూలీల్లో 50 రోజులు ఆపైబడి పనిచేసిన వారికే బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ వివరాలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ పుల్లారెడ్డి విలేకరులకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 రోజుల కంటే పైబడి పనిచేసినవారు జిల్లాలో 46,235 మంది ఉన్నారని, వీరిని కార్మిక శాఖ సంక్షేమ బోర్డులో సభ్యులుగా నమోదు చేయనున్నామన్నారు. ఇందువల్ల కార్మికులకు అనేక ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. సభ్యులుగా నమోదు అయినవారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు, శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.2 లక్షలు పరిహారం లభిస్తుందని తెలిపారు. సాధారణంగా మరణిస్తే రూ.30 వేలు పరిహారం లభిస్తుందని వివరించారు.
మెటర్నరీ బెన్‌ఫిట్ కింద రూ.10 వేలు, మ్యారేజ్ గిఫ్ట్ కింద రూ.5 వేలు, ప్రమాదాల్లో గాయపడి పనిచేయలేకపోతే రూ.4,500, దహన సంస్కారాలకు రూ.10 వేలు ప్రకారం లభిస్తాయని తెలిపారు. ఉపాధి కూలీలు నైపుణ్యతను పెంచుకోవడానికి అవసరమైన శిక్షణ పొందేందుకు ఒక్కొక్కరిపై రూ.8 వేలు కార్మిక శాఖ వ్యయం చేయనుందని వివరించారు. కార్మిక శాఖ సంక్షేమ బోర్డులో నమోదు కానివారికి రూ.50 వేలకు ఉచిత ప్రమాద బీమా, అంగవైకల్యం ఏర్పడితే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పరిహారం లభిస్తుందని వివరించారు. ఉపాధి కూలీలకు కార్మిక శాఖ పెన్షన్ స్కీమ్ కూడా ప్రవేశపెడుతోందని వివరించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కూలీలకు కార్మిక శాఖ కల్పిస్తున్న ప్రయోజనాలపై ఇంకా పూర్తిస్థాయిలో వివరాలు రావాల్సి ఉందన్నారు.
ఉపాధి కూలీలకు ఉచిత బీమా సౌకర్యం
Published Tue, Feb 10 2015 2:52 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM
Advertisement
Advertisement