గుదిబండలా మారిన జీఎస్టీ
ఎగుమతులు, కొనుగోళ్లు లేక పేరుకుపోయిన నిల్వలు
చీరాల: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేతలకు పుట్టినిల్లు చీరాల ప్రాంతం. చీరాలతోపాటు పొద్దుటూరు, జమ్మలమడుగు, పెడన, ఐలవరం, బద్వేలు, ఆత్మకూరు, తాటిపర్తి వంటి ప్రాంతాల నుంచి 40 ఏళ్ల కిందట వలసలు వచ్చిన కార్మికులు స్థానికంగా మాస్టర్ వీవర్లకు సంబంధించిన చేనేత షెడ్డుల్లోని మగ్గాలపై పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో మొత్తం 50 వేల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు.
జీఎస్టీ రద్దు హామీ అమలయ్యేనా..?
మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమపై జీఎస్టీ పెనుభారంగా మారింది. చేనేత వృత్తులు చేసే వారికి 29 శాతం జీఎస్టీ మినహాయింపు ఇస్తామని చెప్పినా అమలయ్యేలా లేదు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపుపై నేటికీ కూటమి సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు. చేనేతలు కూటమి సర్కారులో మేలు జరగకపోగా చేనేతలు కునారిల్లుతున్నారు. చేనేత వృత్తిలో రాణించలేక చివరకు కారి్మకులు ఇతర వృత్తుల వైపు తరలిపోతున్నారు.
కరువైన నేతన్న నేస్తం..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బడ్జెట్‌లో చేనేతలకు రూ.200 కోట్లు కేటాయింపుతోపాటుగా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24 వేలు అందించారు. చేనేతలకు పూర్వ వైభవం తీసుకువచ్చి నేతన్నల తలరాత మార్చేందుకు చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లలో చేనేత రంగానికి నామమాత్రంగా 0.066 శాతం కేటాయించారని కారి్మక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కలగానే చేనేత పార్కు..
చేనేతలు అధికంగా ఉన్న చీరాల ప్రాంతంలో 50 ఎకరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చీరాల వచ్చిన సందర్భంగా నమ్మబలికారు. నేటికీ ఆ ఊసే లేకుండా పోయింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలో నిర్వహించిన సదస్సుకు ఆ శాఖ మంత్రి సవిత హాజరై చేనేతల కోసం అనేక పథకాలు రచించామని చెప్పారే తప్ప టెక్స్‌టైల్స్ పార్కు గురించి ప్రస్తావించలేదు. చేనేత వృత్తి చేసే కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ నేటికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు లేవు.
కనీస వేతన చట్టానికి దిక్కేది?
కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలి ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్‌లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కారి్మకుడికి కూలి తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కారి్మకులకు ప్రయోజనం ఉంటుంది.
నిధులు విడుదలైతే పార్కు పనులు ప్రారంభిస్తాం
హ్యాండ్‌లూమ్ పార్కుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే పార్కు పనులు ప్రారంభిస్తాం. మగ్గం కార్మికులకు 200 విద్యుత్ యూనిట్లపై మార్గదర్శకాలు అందలేదు. నేతన్న నేస్తం ద్వారా ఒక్కో కార్మికుడికి అందాల్సిన రూ.24 వేలు కూడా ప్రభుత్వం విడుదల చేస్తే కార్మికుడికి అందిస్తాం. ఆప్కో ద్వారా కొంత మేర స్వయం సహకార సంఘాల ద్వారా కొనుగోలు ఇప్పుడే ఇప్పుడే మొదలుపెడుతున్నాం. – నాగమల్లేశ్వరరావు, హ్యాండ్‌లూమ్, ఏడీ
Comments
Please login to add a commentAdd a comment