
ధర్నాలో సొమ్మసిల్లి పడిపోయిన అమ్మాజీ
సాక్షి, అమరావతి/మంగళగిరి/మంగళగిరి టౌన్: ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద 17 ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమకు కనీస వేతనం ఇవ్వాలని వైద్యసేవ ట్రస్ట్ సీఈఓ రవి పటాన్‌శెట్టిని వైద్యమిత్రలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ట్రస్ట్ కార్యాలయం ముందు గురువారం వైద్యసేవ క్షేత్రస్థాయి సిబ్బంది పెద్దఎత్తున ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న ఆరోగ్యమిత్రలు తరలివచ్చి ఆందోళన చేశారు.
బీమా విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం మిత్రల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీమా ప్రతిపాదనల నేపథ్యంలో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు సీఈఓను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వారి డిమాండ్లు..
⇒ వైద్యమిత్రలకు కేడర్ కల్పించాలి.. బీమా విధానాన్ని అమలుచేయాలి..
⇒ డిగ్రీ, పీజీలు చదివి ప్రభుత్వ సేవల్లో ఉన్న తమకు ఉద్యోగ భద్రతలేదు..
⇒ 17 సంవత్సరాలు దాటిన వారందరినీ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి డీపీఓ కేడర్ ఇచ్చి కనీస వేతనాలు ఇవ్వాలి..
⇒ ఉద్యోగి మృతిచెందితే రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.10 లక్షలు ఇవ్వాలి..
⇒ అందరికీ సర్వీసు వెయిటేజీ కల్పించాలి..
⇒ ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు ఇవ్వాలి.
ఆరోగ్యమిత్రల కుటుంబాలను ఆదుకోవాలి..
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అమలులో ఆరోగ్యమిత్రల పాత్ర కీలకం. మా సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు కనీస వేతనాలు అందజేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలను అమలుచేసి ఆరోగ్యమిత్రల కుటుంబాలను ఆదుకోవాలి.
– ఎం ప్రత్యూష, గుంటూరు
ఫీల్డ్ ఉద్యోగులకు కేడర్ కల్పించాలి..
ప్రభుత్వానికి, ఆస్పత్రులకు, రోగులకు అనుసంధానంగా వుండే ఆరోగ్యమిత్రల సమస్యలు పరిష్కరించడంతో పాటు కనీస వేతనం అమలుచేయాలి. ఫీల్డ్ ఉద్యోగులకు కేడర్ కల్పించాలి. ఇటీవల మృతిచెందిన ఆరోగ్యమిత్రల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి.
– జీ నాగరాజు, ఆసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఆస్పత్రులకు, రోగులకు వారధిగా ఉంటున్నాం
ఆరోగ్యమిత్రల సేవలను గుర్తించి ప్రభుత్వం కనీసం వేతనాలు అమలుచేయాలి. మేం ఆస్పత్రులకు, రోగులకు వారధిగా ఉండి ఆరోగ్యశ్రీ అమలులో ఎంతో సేవచేస్తున్నాం. రోగులను ఆస్పత్రుల్లో చేర్చడమే కాక వారికి ఆరోగ్యశ్రీ అమలులో కీలకపాత్ర పోషిస్తున్నాం.
– సత్యలక్ష్మి, ఆశ్రం ఆసుపత్రి, ఏలూరు