ntr vaidya seva
-
విషమ‘పరీక్ష’
కర్నూలు(హాస్పిటల్): పాలకుల మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగులను తొలగించేలా వ్యవహరిస్తుండటమే ఇందుకు ఉదాహరణ. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం నిర్వహణలో కీలకంగా ఉన్న వైద్యమిత్రలపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జీవో నెం.28తో తొలగించాలని చూసినా హైకోర్టు, సుప్రీంకోర్టులు అడ్డుకున్నాయి. అయితే సుప్రీం కోర్టు ఇ చ్చిన తీర్పులో ఉన్న ఒక లైన్ ఆధారంగా ఇప్పుడు ఆన్లైన్ పరీక్ష నిర్వహించబోతోంది. ఇందులో 65 శాతం మార్కులు తెచ్చుకుంటేనే ఉద్యోగంలో కొనసాగిస్తామని చెబుతోంది. ప్రభుత్వ తీరుతో మిత్రల్లో ఆందోళన నెలకొంది. విధుల్లోకి చేరిన పదేళ్ల తర్వాత పరీక్ష రాయాలనడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. 2008లో నియామకం.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణకు గానూ జిల్లాలో 2008లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెట్వర్క్ ఆసుపత్రుల్లో నెట్వర్క్ మిత్రలు 50 మంది, పీహెచ్సీలలో పీహెచ్సీ మిత్రలు 83మందిని నియమించారు. వీరితో పాటు నలుగురు టీం లీడర్లు, ఒక జిల్లా మేనేజర్‌ను ఇలా వీరందరని ఔట్సోర్సింగ్ ద్వారా నియమించారు. పీహెచ్సీ వైద్యమిత్రలకు రూ.5,900లు, నెట్వర్క్ వైద్యమిత్రలకు రూ.7,288 ప్రకారం చెల్లిస్తున్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ పరీక్షా! ఉద్యోగంలో చేరిన పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైద్యమిత్రలకు మే 13న ఇంగ్లిష్‌లో ఆన్లైన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల కో ఆర్డినేటర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. తాము 2008లోనే పరీక్ష రాసి విధుల్లో చేరామని, తిరిగి ఇప్పుడు పరీక్ష పెట్టడమేమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు వచ్చాక జాబు ఊడుతోంది.. బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారంతో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులే లక్ష్యంగా విద్య, డ్వామా, వెలుగు, సంక్షేమ శాఖ, వైద్యశాఖల్లో ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. ప్రస్తుతం వైద్యమిత్రల వంతు వచ్చింది. వైఎస్సార్ హయాంలో చేరిన వారిని తొలగించి తమ కార్యకర్తలను నియమించుకోవాలనే ఎత్తుగడలో భాగంగా జీవో నెం.28 విడుదల చేసింది. దీనిపై వైద్యమిత్రలు హైకోర్టును ఆశ్రయించగా మిత్రలకు అనుకూలంగా తీర్పు రావంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయితే అవసరమైతే పరీక్ష నిర్వహించుకోవచ్చని సుప్రీం కోర్టు సూచించింది. దీని ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తోంది. పొమ్మనకుండా పొగబెడుతున్నారు పదేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాం. జీతం తక్కువగా ఇస్తున్నా ఎప్పటికైనా రెగ్యులరైజ్ చేయకపోతారా అనే ఆశతో కొనసాగుతున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం పొమ్మనలేక పొగబెడుతోంది. ఇందులో భాగంగానే ఆన్లైన్ పరీక్ష పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న వారిలో అధిక శాతం 40 ఏళ్లు పైబడిన వారే. వారంతా మళ్లీ పరీక్షకు సిద్ధం కావాలంటే ఇబ్బందే. –నాగరాజు, వైద్యమిత్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు న్యాయపోరాటం చేస్తాం తమను తొలగించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తోంది. హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నా తమను ఇబ్బందులకు గురిచేయాలని ప్రభుత్వం వ్యవహరి స్తోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. – రాజశేఖరరెడ్డి, వైద్యమిత్రల సంఘం జిల్లా కార్యదర్శి -
ఆరోగ్య ‘సిరి’కి మంగళం
ఒకప్పుడు ఏ జబ్బు చేసినా పేదలు భయపడేవారు కాదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఉందన్న భరోసాతో బతికేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ పథకానికి తూట్లు పొడిచిన తెలుగుదేశం పార్టీ సర్కారు ఎన్టీఆర్ వైద్యసేవగా పేరుమార్చి దానిని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోంది. నిధుల విడుదలలో అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా పేద రోగులు అల్లాడుతున్నారు. దీంతో ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ గళం విప్పనుంది. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్టీఆర్ వైద్యసేవగా మారుమార్చినా.. ఆ పథకం ఇప్పటికీ ఆరోగ్యశ్రీగానే జనం గుండెల్లో నిలిచిపోయింది. ఇది పేదలను ఆ పథకం ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తోంది. అలాంటి పథకం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సర్కారు నిర్వాకం వల్ల నిర్భాగ్యులకు అందకుండా పోతోంది. ఫలితంగా పేదలు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన హయాంలో ఆరోగ్యశ్రీ కార్డుతో దర్జాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స అనంతరం ఆరోగ్య సిరితో తిరిగి వచ్చిన రోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ పథకం వివరాలు ఆరోగ్యమిత్రల వద్ద కూడా అందుబాటులో లేవంటే ఆ పథకం ఎంతగా నిరుగారిపోయిందో అర్థమవుతోంది. ప్రభుత్వం నిధులు తగ్గించడమే ఈ దుస్థితికి కారణం. దీనివల్ల ప్రైవేటు వైద్యశాలలు వైద్యసేవ ద్వారా శస్త్రచికిత్సలు చేయడానికి జంకుతున్నాయి. పేద రోగులను అవస్థల పాలే్జస్తున్నాయి. పక్షవాతం వంటి జబ్బులు వస్తే మంచి వైద్యం కోసం కార్పొరేటు ఆసుపత్రులకు వెళ్లే అవకాశం ప్రస్తుతం పేదలకు ఉండటం లేదు. కేవలం ప్రభుత్వ వైద్యశాలల్లోనే చికిత్స తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతినెలా మండల కేంద్రం లేదా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, ఈ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎవరిని సంప్రదించాలనే విషయాలను వివరించేవారు. ప్రముఖ వైద్యులు పేదలకు సేవలు అందించేవారు. అయితే ఏడాదిగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వైద్యశిబిరాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆరోగ్యశ్రీకి రూకల్పన ఇలా.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని దివగంత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2007 జూలై 7న ప్రారంభించారు. తెల్ల కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకం ద్వారా లబ్ధిపొందేందుకు అర్హమైందిగా నిర్ణయించారు. ఈ సేవలకు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా రూపకల్పన చేశారు. 125 రకాల శస్త్రచికిత్సల అనంతరం ఏడాదిపాటు మందులు వాడాల్సి ఉండడంతో ఆ ఖర్చునూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయించారు. రోగులను ఇ¯ŒSపేషెంట్లుగా చేర్చుకునే ప్రక్రియలో ఆరోగ్యశ్రీ ట్రస్టు పకడ్బందీగా వ్యవహరించేది. అప్పట్లో కేవలం 12 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే పద్ధతిని ట్రస్టు అమలు చేసింది. దీంతో పేదలకు సత్వరం వైద్యం అందేది. కానీ ఇప్పుడలా లేదు. కార్డుల పంపిణీ కూడా పెండింగ్‌లోనే .... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చి ఆ పార్టీ రంగు కనబడేలా కొత్తగా హెల్త్‌కార్డులను రూపొందించారు. వీటిని లబ్ధిదారులకు అందించే బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల ద్వారా ఈ కార్డులను లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది. అయితే పౌర సరఫరాల శాఖ అధికారుల వద్దే ఈ కార్డులు మూలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో ఈ కార్డుల ముద్రణ పూర్తి చేశారు. ముద్రణలో లబ్ధిదారుల ఫొటోలు అదృశ్యమయ్యాయి. కొన్నింటిపై మాత్రమే ఫొటోలు ఉన్నాయి. జిల్లాలో కొన్నివేల కార్డులు పంపిణీ కాకుండా ఉండిపోయినట్లు సమాచారం. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు హెల్త్ కార్డులు లేక ఖరీదైన వైద్య సేవల కోసం కార్పొరేట్ హాస్పిటల్స్‌లో అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకునే దుస్థితి నెలకొంది. నడుం కట్టిన వైఎస్సార్ సీపీ ఆరోగ్యశ్రీ నిర్వీర్యంతో జనం పడుతున్న అవస్థలను గమనించిన వైఎస్సార్ సీపీ వారి తరఫున పోరాటానికి సిద్ధమైంది. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమైంది. ఈ ధర్నాకు పార్టీ శ్రేణులు భారీ సన్నాహాలు చేస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం రాకతో అనారోగ్యం తెలుగుదేశం ప్రభుత్వం రాకతో ఆరోగ్యశ్రీ ఆనారోగ్యం బారిన పడింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరిన రోగులకు శస్త్రచికిత్సలు అవసరమైతే అనుమతులకే వారం నుంచి పదిరోజుల సమయం పడుతోంది. దీంతో పేదలు వైద్యం సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగుల బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వ తీరుతో వైద్యసేవ నెట్వర్క్ వైద్యశాలల్లో అత్యవసర శస్త్ర చికిత్సలను దాదాపుగా నిలిపివేశారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చిన తర్వాత మరో వంద జబ్బులను పథకంలో కలపడమే కాకుండా రూ.2 లక్షల పరిమితిని రూ.2.50లక్షలకు పెంచిన సర్కారు అనుమతుల మంజూరులో మాత్రం జాప్యం చేస్తోంది. నిధుల విడుదల్లో అలసత్వం ప్రదర్శిస్తోంది. దీనివల్ల చాలామంది పేదలు సొంత డబ్బుతోనే వైద్యం చేయించుకుంటున్నారు. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోంది. దీనికితోడు ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు మూడు నెలలుగా బిల్లులు అందలేదు. దీంతో ఖరీదైన శస్త్రచికిత్సలకు ఆయా ఆసుపత్రులు వెనుకాడుతున్నాయి. చేద్దాములే అనే ధోరణిలో ఉన్నాయి. కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు ముందు డబ్బు పెట్టి వైద్యం చేయించేసుకోవాలని రోగులకు సూచిస్తున్నాయి. ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్, లేదా ఆపద్బంధు వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు కూడా సర్కారు బిల్లులు మంజూరు చేయడం లేదు. పెద్దమొత్తంలో బకాయి పెట్టింది. ఓ రోగికి ఆపరేష¯ŒS చేయాలంటే కనీసం పదిరోజులపైనే పడుతోంది. నరసాపురం వంటి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవ ద్వారా ఆపరేషన్లు చేయకుండా ఏలూరు, కాకినాడలకు రిఫర్ చేస్తున్నారు. -
ఆరోగ్యశ్రీకి నిధులివ్వకుండా రోగులకు ముప్పుతిప్పలు
-
ఆరోగ్యం హరీ
⇒ పథకం అమలుకు నిధులివ్వకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం ⇒ రూ. 910.77 కోట్లు అడిగితే.. బడ్జెట్ కేటాయింపులు రూ.500 కోట్లే ⇒ పాత బకాయిలే రూ. 250 కోట్లు.. మిగిలిన రూ. 250 కోట్లతో ⇒ చికిత్సలు ఎలాగో చెప్పాల్సింది ప్రభుత్వ పెద్దలే ⇒ మొత్తం రూ. 500 కోట్లకుపైగా బకాయిలు చెల్లిస్తేనే సేవలందిస్తాం ⇒ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన నెట్వర్క్ ఆసుపత్రులు ⇒ సర్కారు దగ్గర నిధుల్లేవు.. ఇష్టమైతే చేయండి, లేదంటే మానేయండి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టీకరణ ⇒ ముఖ్యమంత్రి వద్దే తేల్చుకోవాలని ‘ఆశా’ ప్రతినిధుల నిర్ణయం ⇒ సానుకూల స్పందన రాకుంటే పథకం నుంచి వైదొలగాలని యోచన ⇒ వైద్యసేవ వ్యయంపై సర్కారు పరిమితి.. రోగులకు ముప్పుతిప్పలు సాక్షి, అమరావతి రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పాతరేస్తోంది. పేద రోగుల పాలిట సంజీవని లాంటి పథకాన్ని క్రమంగా కనుమరుగు చేసేందుకు పన్నాగాలు పన్నుతోంది. శంకుస్థాపనలు, శిలాఫలకాలు, ప్రత్యేక విమానాల్లో విదేశీ యాత్రలకు ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెడుతున్న ప్రభుత్వ పెద్దలకు బక్క ప్రాణాల ఆరోగ్యమంటే లెక్కలేకుండా పోతోంది. ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం అమలుకు సరిపడా నిధులివ్వకుండా పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పథకం అమలుకు రూ.910.77 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదిస్తే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది అక్షరాలా రూ.500 కోట్లే. బకాయిలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు రోగులకు వైద్య సేవలందించేందుకు నిరాకరిస్తున్నాయి. ‘మా దగ్గర నిధులు లేవు. మీకు ఇష్టమైతేనే ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం చేయండి. లేదంటే మానెయ్యండి’ అని సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రే తేల్చిచెప్పడం గమనార్హం. ఈ పథకం కింద నిధుల వ్యయంపై ప్రభుత్వం పరిమితి విధించింది. రోగులకు చికిత్సకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. సకాలంలో వైద్యం అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ కేసులు స్వీకరించం... ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. బకాయిలు చెల్లిస్తేగానీ రోగులకు వైద్య సేవలు అందించలేమని నెట్వర్క్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఈ మేరకు రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. బకాయిల చెల్లింపులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఆశా(ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్) ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని, అక్కడో తాడేపేడో తేల్చుకుంటామని వారు మంత్రి కామినేనితో అన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 200 వరకూ ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌మెంట్‌లో ఉన్నాయి. మరో 150 వరకూ ప్రభుత్వ హాస్పిటళ్లు ఉన్నాయి. ఈ మొత్తం ఆసుపత్రులకు కలిపి రూ.500 కోట్లకుపైగానే బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. సర్కారు ఆసుపత్రుల్లో వైద్యులు ఇప్పటికే ఆరోగ్యశ్రీ కేసులను స్వీకరించడం లేదు. వారంలోగా బకాయిలను పూర్తిగా చెల్లిస్తేనే ఈ పథకం కింద రోగులకు వైద్యం అందిస్తామని, లేదంటే నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. చిన్న చిన్న నర్సింగ్‌హోంలు వ్యాపారం లేక కొద్దో గొప్పో కేసులను స్వీకరిస్తున్నాయి. పెద్ద పెద్ద రోగాలకు చికిత్స చేయాల్సిన ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కేసులపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.910.77 కోట్లు కావాలంటూ అధికారులు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదన ప్యాకేజీల పెంపునకు మంత్రి విముఖత ‘‘మా దగ్గర నిధులు లేవు. మీకు ఇష్టమైతేనే ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం చేయండి. లేదంటే మానెయ్యండి’’ అని మంత్రి కామినేని శ్రీనివాస్ తేల్చిచెప్పినట్లు ‘ఆశా’ ప్రతినిధులు వెల్లడించారు. కరెంటు బిల్లుల నుంచి సిబ్బంది వేతనాల వరకూ ఆసుపత్రుల నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిందని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద వివిధ చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము చాలా తక్కువ ఉందని, 2012లో 12 శాతం పెంచారని, ఆ తర్వాత పెంచలేదని, ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచాలని ప్రతినిధులు కోరగా మంత్రి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారం రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించాలని, సానుకూల స్పందన రాకపోతే ఎన్టీఆర్ వైద్యసేవల పథకం నుంచి వైదొలగాలని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.250 కోట్లు సరిపోతాయా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చడంతోపాటు ప్రీమియంను రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. ప్యాకేజీల్లో 938 జబ్బులు ఉండగా, కొత్తగా మరో 100 చేర్చారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందాల్సిన జబ్బుల సంఖ్య 1,038కి చేరింది. దీంతో ఈ పథకానికి ఏటా అదనంగా రూ.200 కోట్లు అవసరం. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలుకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.910.77 కోట్లు కావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రూ.250 కోట్లు ఉన్నాయి. కానీ, ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.500 కోట్లే కేటాయించింది. పాత బకాయిలు పోను మిగిలింది రూ.250 కోట్లే. ఈ నిధులు ఏ మూలకూ సరిపోని పరిస్థితి. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే ప్రభుత్వం బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించలేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. చికిత్స అందక రోగుల దైన్యం ఆరోగ్యశ్రీ కింద రోగుల నమోదు ప్రక్రియలో వేగం మందగించింది. అధికారులు రకరకాల కొర్రీలతో వేధిస్తున్నారు. 2010 వరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో రోజూ 2 వేలకుపైగా శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రభుత్వం నిత్యం గరిష్టంగా రూ.3 కోట్లు వ్యయం చేసేది. ప్రస్తుతం రోగుల నమోదు గణనీయంగా పడిపోయింది. రోజుకు 250 మందికి కూడా చికిత్సల కోసం అనుమతులు రావడం లేదు. ఎన్టీఆర్ వైద్యసేవ వెబ్సైట్ ప్రకారం... 2016 అక్టోబర్ 31న చికిత్సలు చేయించుకున్న వారి సంఖ్య 254 మాత్రమే. అంటే ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో కలిపి 300 వరకూ నెట్వర్క్ ఆసుపత్రులుండగా.. ఆస్పత్రికొకరు చొప్పున కూడా నమోదు కాలేదంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ప్రభుత్వం ఈ పథకం కింద నిధుల వినియోగానికి కోత వేస్తోంది. రోజుకు రూ.70 లక్షలు కూడా ఖర్చు చేయడం లేదు. నిధుల వినియోగంపై ప్రభుత్వం పరిమితి విధించింది. దీంతో రోగులకు వైద్య చికిత్సలకు గాను అనుమతులివ్వడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో నెలకొన్న పరిణామాలను ట్రస్ట్ సీఈఓ పలుమార్లు ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. క్షతగాత్రులు అర్హులు కాదట! ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద చికిత్స అందక రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. నరాల (న్యూరో), గుండె జబ్బులు, మూత్రపిండాలు, కాలేయం వంటి జబ్బులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సలు లేక, నెట్వర్క్ ఆసుపత్రులు స్పందించక రోగులు పడే యాతన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ప్రమాదాల్లో క్షతగాత్రులుగా మారిన వారి పరిస్థితి మరింత దారుణం. భారతదేశంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. రాష్ట్రంలో రోజూ 1,400కు పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బాధితులుఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందడానికి అర్హులు కారని ప్రైవేట్ ఆసుపత్రులు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల కోసం నిత్యం 2 వేల మందికిపైగా వస్తుండగా.. వీరిలో కనీసం 300 మందికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కడం లేదు. -
ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్పు
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐదుగంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇసుక తవ్వకాలు, పింఛన్లు, గనుల లీజు అంశాలపై ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కేబినెట్ నిర్ణయాలు * ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుకు ఆమోదం * ఎన్టీఆర్ వైద్య సేవలో వ్యాధుల సంఖ్య 938 నుంచి 1038కు పెంపు * ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చు పరిమితి రూ. 2.5 లక్షలకు పెంపు * గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల రద్దు * మంగంపేటలో 250 హెక్లార్లలో గనుల లీజు రద్దు * రాజధాని ప్రాంతంలోకి 29 గ్రామాలను తీసుకురావాలని నిర్ణయం * అనంతపురం జిల్లా సజ్జలదిన్నెలో పవన విద్యుత్ ప్లాంట్ కు 35 ఎకరాల భూమి కేటాయింపు * వ్యవసాయ రంగానికి ఇక్రిశాట్ ను అనుసంధానం చేయాలని నిర్ణయం * ప్రతి కళాశాలలోనూ, ప్రతి జిల్లాలో నైపుణ్యాభివృద్ధి యూనిట్ల ఏర్పాటు * బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్ల చెల్లించాలని నిర్ణయం