కర్నూలు(హాస్పిటల్): పాలకుల మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగులను తొలగించేలా వ్యవహరిస్తుండటమే ఇందుకు ఉదాహరణ. ఎన్‌టీఆర్ వైద్యసేవ పథకం నిర్వహణలో కీలకంగా ఉన్న వైద్యమిత్రలపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జీవో నెం.28తో తొలగించాలని చూసినా హైకోర్టు, సుప్రీంకోర్టులు అడ్డుకున్నాయి. అయితే సుప్రీం కోర్టు ఇ చ్చిన తీర్పులో ఉన్న ఒక లైన్ ఆధారంగా ఇప్పుడు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించబోతోంది. ఇందులో 65 శాతం మార్కులు తెచ్చుకుంటేనే ఉద్యోగంలో కొనసాగిస్తామని చెబుతోంది. ప్రభుత్వ తీరుతో మిత్రల్లో ఆందోళన నెలకొంది. విధుల్లోకి చేరిన పదేళ్ల తర్వాత పరీక్ష రాయాలనడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు.
2008లో నియామకం..
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణకు గానూ జిల్లాలో 2008లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో నెట్‌వర్క్ మిత్రలు 50 మంది, పీహెచ్‌సీలలో పీహెచ్‌సీ మిత్రలు 83మందిని నియమించారు. వీరితో పాటు నలుగురు టీం లీడర్లు, ఒక జిల్లా మేనేజర్‌ను ఇలా వీరందరని ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించారు. పీహెచ్‌సీ వైద్యమిత్రలకు రూ.5,900లు, నెట్‌వర్క్ వైద్యమిత్రలకు రూ.7,288 ప్రకారం చెల్లిస్తున్నారు.
పదేళ్ల తర్వాత మళ్లీ పరీక్షా!
ఉద్యోగంలో చేరిన పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైద్యమిత్రలకు మే 13న ఇంగ్లిష్‌లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల కో ఆర్డినేటర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. తాము 2008లోనే పరీక్ష రాసి విధుల్లో చేరామని, తిరిగి ఇప్పుడు పరీక్ష పెట్టడమేమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాబు వచ్చాక జాబు ఊడుతోంది..
బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారంతో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే లక్ష్యంగా విద్య, డ్వామా, వెలుగు, సంక్షేమ శాఖ, వైద్యశాఖల్లో ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. ప్రస్తుతం వైద్యమిత్రల వంతు వచ్చింది. వైఎస్సార్ హయాంలో చేరిన వారిని తొలగించి తమ కార్యకర్తలను నియమించుకోవాలనే ఎత్తుగడలో భాగంగా జీవో నెం.28 విడుదల చేసింది. దీనిపై వైద్యమిత్రలు హైకోర్టును ఆశ్రయించగా మిత్రలకు అనుకూలంగా తీర్పు రావంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయితే అవసరమైతే పరీక్ష నిర్వహించుకోవచ్చని సుప్రీం కోర్టు సూచించింది. దీని ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తోంది.
పొమ్మనకుండా పొగబెడుతున్నారు
పదేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాం. జీతం తక్కువగా ఇస్తున్నా ఎప్పటికైనా రెగ్యులరైజ్ చేయకపోతారా అనే ఆశతో కొనసాగుతున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం పొమ్మనలేక పొగబెడుతోంది. ఇందులో భాగంగానే ఆన్‌లైన్ పరీక్ష పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న వారిలో అధిక శాతం 40 ఏళ్లు పైబడిన వారే. వారంతా మళ్లీ పరీక్షకు సిద్ధం కావాలంటే ఇబ్బందే.
–నాగరాజు, వైద్యమిత్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
న్యాయపోరాటం చేస్తాం
తమను తొలగించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తోంది. హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నా తమను ఇబ్బందులకు గురిచేయాలని ప్రభుత్వం వ్యవహరి స్తోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. – రాజశేఖరరెడ్డి, వైద్యమిత్రల సంఘం జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment