ఆరోగ్యం హరీ | NTR Vaidya Seva not working properly in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం హరీ

Published Tue, Nov 1 2016 8:23 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

ఆరోగ్యం హరీ

ఆరోగ్యం హరీ

పథకం అమలుకు నిధులివ్వకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం
రూ. 910.77 కోట్లు అడిగితే.. బడ్జెట్ కేటాయింపులు రూ.500 కోట్లే
పాత బకాయిలే రూ. 250 కోట్లు.. మిగిలిన రూ. 250 కోట్లతో
చికిత్సలు ఎలాగో చెప్పాల్సింది ప్రభుత్వ పెద్దలే
మొత్తం రూ. 500 కోట్లకుపైగా బకాయిలు చెల్లిస్తేనే సేవలందిస్తాం
ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన నెట్‌వర్క్ ఆసుపత్రులు
సర్కారు దగ్గర నిధుల్లేవు.. ఇష్టమైతే చేయండి, లేదంటే మానేయండి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టీకరణ
ముఖ్యమంత్రి వద్దే తేల్చుకోవాలని ‘ఆశా’ ప్రతినిధుల నిర్ణయం
సానుకూల స్పందన రాకుంటే పథకం నుంచి వైదొలగాలని యోచన
వైద్యసేవ వ్యయంపై సర్కారు పరిమితి.. రోగులకు ముప్పుతిప్పలు

 
 
సాక్షి, అమరావతి
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పాతరేస్తోంది. పేద రోగుల పాలిట సంజీవని లాంటి పథకాన్ని క్రమంగా కనుమరుగు చేసేందుకు పన్నాగాలు పన్నుతోంది. శంకుస్థాపనలు, శిలాఫలకాలు, ప్రత్యేక  విమానాల్లో విదేశీ యాత్రలకు ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెడుతున్న ప్రభుత్వ పెద్దలకు బక్క ప్రాణాల ఆరోగ్యమంటే లెక్కలేకుండా పోతోంది. ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం అమలుకు సరిపడా నిధులివ్వకుండా పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పథకం అమలుకు రూ.910.77 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదిస్తే ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది అక్షరాలా రూ.500 కోట్లే.

బకాయిలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు రోగులకు వైద్య సేవలందించేందుకు నిరాకరిస్తున్నాయి. ‘మా దగ్గర నిధులు లేవు. మీకు ఇష్టమైతేనే ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం చేయండి. లేదంటే మానెయ్యండి’ అని సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రే తేల్చిచెప్పడం గమనార్హం. ఈ పథకం కింద నిధుల వ్యయంపై ప్రభుత్వం పరిమితి విధించింది. రోగులకు చికిత్సకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. సకాలంలో వైద్యం అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఆరోగ్యశ్రీ కేసులు స్వీకరించం...
ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. బకాయిలు చెల్లిస్తేగానీ రోగులకు వైద్య సేవలు అందించలేమని నెట్‌వర్క్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఈ మేరకు రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. బకాయిల చెల్లింపులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఆశా(ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్) ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని, అక్కడో తాడేపేడో తేల్చుకుంటామని వారు మంత్రి కామినేనితో అన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 200 వరకూ ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌మెంట్‌లో ఉన్నాయి.

మరో 150 వరకూ ప్రభుత్వ హాస్పిటళ్లు ఉన్నాయి. ఈ మొత్తం ఆసుపత్రులకు కలిపి రూ.500 కోట్లకుపైగానే బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. సర్కారు ఆసుపత్రుల్లో వైద్యులు ఇప్పటికే ఆరోగ్యశ్రీ కేసులను స్వీకరించడం లేదు. వారంలోగా బకాయిలను పూర్తిగా చెల్లిస్తేనే ఈ పథకం కింద రోగులకు వైద్యం అందిస్తామని, లేదంటే నిలిపివేస్తామని నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి.  చిన్న చిన్న నర్సింగ్‌హోంలు వ్యాపారం లేక కొద్దో గొప్పో కేసులను స్వీకరిస్తున్నాయి. పెద్ద పెద్ద రోగాలకు చికిత్స చేయాల్సిన ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కేసులపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.910.77 కోట్లు కావాలంటూ అధికారులు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదన
 


ప్యాకేజీల పెంపునకు మంత్రి విముఖత
‘‘మా దగ్గర నిధులు లేవు. మీకు ఇష్టమైతేనే ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం చేయండి. లేదంటే మానెయ్యండి’’ అని మంత్రి కామినేని శ్రీనివాస్ తేల్చిచెప్పినట్లు ‘ఆశా’ ప్రతినిధులు వెల్లడించారు. కరెంటు బిల్లుల నుంచి సిబ్బంది వేతనాల వరకూ ఆసుపత్రుల నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిందని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద వివిధ చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము చాలా తక్కువ ఉందని, 2012లో 12 శాతం పెంచారని, ఆ తర్వాత పెంచలేదని, ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచాలని ప్రతినిధులు కోరగా మంత్రి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారం రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించాలని, సానుకూల స్పందన రాకపోతే ఎన్టీఆర్ వైద్యసేవల పథకం నుంచి వైదొలగాలని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రూ.250 కోట్లు సరిపోతాయా?
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చడంతోపాటు ప్రీమియంను రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. ప్యాకేజీల్లో 938 జబ్బులు ఉండగా, కొత్తగా మరో 100 చేర్చారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందాల్సిన జబ్బుల సంఖ్య 1,038కి చేరింది. దీంతో ఈ పథకానికి ఏటా అదనంగా రూ.200 కోట్లు అవసరం. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలుకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.910.77 కోట్లు కావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రూ.250 కోట్లు ఉన్నాయి. కానీ, ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.500 కోట్లే కేటాయించింది. పాత బకాయిలు పోను మిగిలింది రూ.250 కోట్లే. ఈ నిధులు ఏ మూలకూ సరిపోని పరిస్థితి. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే ప్రభుత్వం బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించలేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

చికిత్స అందక రోగుల దైన్యం
ఆరోగ్యశ్రీ కింద రోగుల నమోదు ప్రక్రియలో వేగం మందగించింది. అధికారులు రకరకాల కొర్రీలతో వేధిస్తున్నారు. 2010 వరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో రోజూ 2 వేలకుపైగా శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రభుత్వం నిత్యం గరిష్టంగా రూ.3 కోట్లు వ్యయం చేసేది. ప్రస్తుతం రోగుల నమోదు గణనీయంగా పడిపోయింది. రోజుకు 250 మందికి కూడా చికిత్సల కోసం అనుమతులు రావడం లేదు. ఎన్టీఆర్ వైద్యసేవ వెబ్‌సైట్ ప్రకారం... 2016 అక్టోబర్ 31న చికిత్సలు చేయించుకున్న వారి సంఖ్య 254 మాత్రమే. అంటే ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో కలిపి 300 వరకూ నెట్‌వర్క్ ఆసుపత్రులుండగా.. ఆస్పత్రికొకరు చొప్పున కూడా నమోదు కాలేదంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ప్రభుత్వం ఈ పథకం కింద నిధుల వినియోగానికి కోత వేస్తోంది. రోజుకు రూ.70 లక్షలు కూడా ఖర్చు చేయడం లేదు. నిధుల వినియోగంపై ప్రభుత్వం పరిమితి విధించింది. దీంతో రోగులకు వైద్య చికిత్సలకు గాను అనుమతులివ్వడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎన్టీఆర్ వైద్యసేవ  పథకంలో నెలకొన్న పరిణామాలను ట్రస్ట్ సీఈఓ పలుమార్లు ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
 
క్షతగాత్రులు అర్హులు కాదట!
ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద చికిత్స అందక రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. నరాల (న్యూరో), గుండె జబ్బులు, మూత్రపిండాలు, కాలేయం వంటి జబ్బులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సలు లేక, నెట్‌వర్క్ ఆసుపత్రులు స్పందించక రోగులు పడే యాతన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ప్రమాదాల్లో క్షతగాత్రులుగా మారిన వారి పరిస్థితి మరింత దారుణం. భారతదేశంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. రాష్ట్రంలో రోజూ 1,400కు పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బాధితులుఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందడానికి అర్హులు కారని ప్రైవేట్ ఆసుపత్రులు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల కోసం నిత్యం 2 వేల మందికిపైగా వస్తుండగా.. వీరిలో కనీసం 300 మందికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement