జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన యానాదులు
వేటపాలెం ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా
బాపట్ల, ప్రకాశం, పల్నాడు, హైదరాబాద్‌కు తరలింపు
తవ్వకాలు ఆపాలని పలుమార్లు కాలనీ వాసుల వినతి
తాగు నీటికి ఇబ్బందులు వస్తాయని వేడుకోలు
జిల్లా, మండల అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం నిల్
అధికార పార్టీ నేతలకే మద్దతు పలికిన అధికారులు
మాపైనే ఫిర్యాదు చేస్తారా.. అంటూ బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఇసుక దందా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి ఏకంగా జాతీయ స్థాయికి చేరింది. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటాయని, తాగునీటికి కటకట తప్పదని వేటపాలెం మండలం పుల్లరిపాలెంలోని సాయి ఎస్టీ కాలనీ వాసులు యానాది హక్కుల పరిరక్షణ సంఘం పేరున నవంబర్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
‘రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఎస్టీ కాలనీ సమీపంలోని ఇసుక దిబ్బల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పరిసర ప్రాంతాల్లోని అసైన్డ్ భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉండడంతో తవ్వకాల వ్యవహారాన్ని హైదరాబాద్‌కు చెందిన కొందరికి అప్పగించారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతకు పెద్దఎత్తున ముడుపులు ముడుతున్నట్లు సమాచారం.
వేటపాలెం ప్రాంతం నుంచి బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు సైతం ఇసుక భారీగా తరలిపోతోంద’ని వారు వివరించారు. ఈ విషయమై తక్షణం విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు అందాయి. అయితే అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులు నవంబర్ 27న తొలి విచారణ సందర్భంగా బాధితులనే బెదిరించారు.
ఈ విషయమై ఎస్టీలు మరోమారు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తహసీల్దార్, పోలీసు, ఇతర అధికారులతో కూడిన బృందం ద్వారా వీడియో రికార్డింగ్ చేస్తూ విచారించాలని ఆదేశించింది.
కాగా, తాము చెప్పినట్లు విచారణలో చెప్పాలని, ఇక్కడ ఎటువంటి ఇసుక తవ్వకాలు జరగడంలేదని అధికారులు రాసిన పేపర్లలో సంతకాలు పెట్టాలని అధికార పార్టీ నేతలు.. ఎస్టీలను బెదిరించినట్లు సమాచారం. మాపైనే ఫిర్యాదు చేస్తారా.. అని అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాము న్యాయవాదిని నియమించుకుని సమాధానం ఇస్తామని శుక్రవారం విచారణకు వచి్చన అధికారులకు బాధితులు తేల్చి చెప్పారు.
మామూళ్ల మత్తులో అధికారులు!
వేటపాలెం ప్రాంతంలో ఇప్పటికే కనుచూపు మేర రొయ్యల చెరువులు వెలిసి, కెమికల్స్ ప్రభావంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఇప్పుడు ఇసుక తవ్వకాల వల్ల వేసవిలో తాగునీటి కోసం తమ కుటుంబాలకు ఇబ్బందులు తప్పవని యానాది హక్కుల పరిరక్షణ సంఘం ప్రెసిడెంట్ ఇండ్ల స్వాతి, సెక్రటరి పోలయ్య, కాలనీ వాసులు వాపోతున్నారు.
ఈ విషయమై మండల, జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాల్సి వచి్చంది. అయినా కొందరు అధికారులు ఇసుక మాఫియా నుంచి నెల మామూళ్లు పుచ్చుకుంటుండటంతో ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment