రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు తగ్గటమే ఇందుకు నిదర్శనం
గత ఆరు నెలలుగా తక్కువగానే జీఎస్టీ వసూళ్లు
డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా 8 శాతం పెరుగుదల
అదే మన రాష్ట్రంలో 6 శాతం తగ్గుదల
ఏపీకి సొంత పన్నుల ఆదాయం పడిపోయిందన్న కాగ్
సంక్షేమం నిలిపివేయడం, కమీషన్ల కోసం వేధించడమే ప్రధాన కారణం
సాక్షి, అమరావతి: గత ఆరు నెలలుగా సరైన ఆదాయం లేక రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. జీఎస్టీ వసూళ్లు తగ్గడమే ఇందుకు నిదర్శనం. జీఎస్టీని 2017లో ప్రవేశపెట్టినప్పటి నుంచి వసూళ్లలో భారీ వృద్ధి నమోదు చేసిన మన రాష్ట్రం.. గత 6 నెలల నుంచి తిరోగమనం బాటపట్టింది. ఒకవైపు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలను నియంత్రించలేకపోవడం... మరోవైపు పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయడం... ఇంకోవైపు కమీషన్ల కోసం మైనింగ్, పోర్టు, ఇతర కీలక కార్యకలాపాలను కూటమి నేతలు అడ్డుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పండుగ నెలల్లోనూ విలవిల!
సాధారణంగా వరుసగా పండుగలు ఉండే నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో వ్యాపారులతోపాటు రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురుస్తుంది. కానీ, ఈ ఏడాది ధరల పెరుగుదల, పనులు లేకపోవడం, గత ఐదేళ్లు కొనసాగిన సంక్షేమ పథకాలను ఏడు నెలలుగా నిలిపివేయడంతో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది. దీనికి నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 10 శాతం, డిసెంబర్‌లో 6 శాతం తగ్గడమే నిదర్శనం.
దేశవ్యాప్తంగా పెరిగినా... మన రాష్ట్రంలో తగ్గుదల
గత ఆరు నెలల్లో ఒక్క అక్టోబర్ నెల మినహా... మిగిలిన అన్ని నెలల జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే తగ్గినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి నెల విడుదల చేస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 8 శాతం పెరిగితే... మన రాష్ట్రంలో 6 శాతం తగ్గుదల నమోదైంది. గత ఏడాది
డిసెంబర్‌లో రూ.3,545 కోట్లుగా ఉన్న జీఎస్టీ
వసూళ్లు... ఈ ఏడాది రూ.3,315 కోట్లకే పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని పెద్ద రాష్ట్రాలు వృద్ధిరేటును నమోదు చేయగా, ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే క్షీణతను నమోదు చేయడం గమనార్హం. గత ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్లు చూస్తే 3.63 శాతం తగ్గి రూ.21,771 కోట్ల నుంచి రూ.20,979 కోట్లకు పడిపోయాయి.
నిలిచిపోయిన వాణిజ్య కార్యకలాపాలు.. తగ్గిన సొంత పన్ను ఆదాయం: కాగ్
రాష్ట్రంలో ఏడు నెలలుగా వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాయకులు కమీషన్ల కోసం మైనింగ్ వ్యాపారులను బెదిరించడం వల్ల కార్యకలాపాలు నిలిపివేశారు. దీంతో మైనింగ్ ప్రక్రియతోపాటు వీటి ఆధారంగా పనిచేసే పరిశ్రమలు మూతపడ్డాయి. ఉచిత ఇసుకను కాగితాలకే పరిమితం చేస్తూ కొందరు నేతలు సిండికేట్లుగా మారి ధరలను భారీగా పెంచేశారు. దీంతో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ఇవన్నీ జీఎస్టీ ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారద్శకంగా అమలు చేస్తూ ఎప్పటికప్పుడు లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేయడం (డీబీటీ)తోపాటు డ్వాక్రా మహిళలు, రైతులు, ఎంఎస్‌ఎంఈలకు తగిన సాయం క్రమం తప్పకుండా అందించడం వల్ల అన్ని వర్గాల ప్రజల కొనుగోలు శక్తిని పెంచిందని వారు గుర్తుచేస్తున్నారు.
కానీ, కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం, రైతులు, డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహకాలు అందించకపోవడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు. ఇది జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ముఖ్య కారణమని వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఆదాయ వనరులు నేలచూపులు చూస్తున్నాయని, ఏపీలో సొంత పన్ను ఆదాయం తగ్గిపోయిందని, ముఖ్యంగా అమ్మకపు పన్ను, రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పడిపోయిందన్న విషయాన్ని ‘కాగ్’ తాజా నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment