![AP GST revenue down: Andhra pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/GST.jpg.webp?itok=drAPq5Tb)
జీఎస్టీలో కనిపించని సంక్రాంతి వెలుగులు
జనవరిలో బీహార్ జీఎస్టీ ఆదాయం 8 శాతం పెరిగితే ఏపీలో జీరో
పెద్ద రాష్ట్రాల్లో వృద్ధి నమోదు చేయని ఏకైక రాష్ట్రం ఏపీ
20 శాతం వృద్ధితో మొదటి స్థానంలో తమిళనాడు
ఏప్రిల్–జనవరి జీఎస్టీ ఆదాయం చూసినా అదే పరిస్థితి
10 నెలల్లో బీహార్ జీఎస్టీ ఆదాయం 9.8 శాతం వృద్ధి
ఇదే సమయంలో మన ఆదాయ వృద్ధి 1.2 శాతమే
ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోవడమే కారణం అంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించడం దేవుడెరుగు.. ఉన్న సంపదను కూడా నాశనం చేస్తోంది కూటమి సర్కారు. బీహార్ వంటి రాష్ట్రాలు కూడా సంపద సృష్టించడంలో దూసుకుపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ మాత్రం తిరోగమనంలో పయనిస్తోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ ఆదాయంలో నమోదవుతున్న క్షీణతలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. తాజాగా జనవరి నెల జీఎస్టీ ఆదాయంలో ఎటువంటి వృద్ధి లేకుండా స్థిరంగా ఉండగా, ఇదే సమయంలో దేశ జీడీపీ ఆదాయం 10 శాతం పెరిగితే.. బీహార్ మనకంటే అధికంగా 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024 జనవరిలో రూ.3,587 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది జనవరిలో రూ.3,604 కోట్లకు చేరింది.
జనవరి నెల రాష్ట్ర ప్రజలకు అత్యంత ఇష్టమైన నెల. ఈ నెలలో సంక్రాంతి పండుగను పేదలు, ధనికులు.. ఎవరి స్తోమత మేరకు వారు ఘనంగా చేసుకుంటారు. కొత్త పంట చేతికందడంతో రైతులు ఏదో ఒక కొత్త వస్తువును కొనుగోలు చేస్తారు. అందుకే ప్రతి ఏటా జనవరి నెల జీఎస్టీ ఆదాయంలో భారీ వృద్ధి రేటు ఉంటుంది.
కానీ ఈసారి దీనికి భిన్నంగా జీఎస్టీలో ఎక్కడా సంక్రాంతి వెలుగులు కనిపించ లేదు. ఇదే సమయంలో బీహార్ జీఎస్టీ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ.1,565 కోట్ల నుంచి రూ.1,684 కోట్లకు చేరింది. అదే మన పొరుగు రాష్ట్రం తమిళనాడు అయితే ఏకంగా 20 శాతం వృద్ధితో జీఎస్టీ ఆదాయం రూ.9,606 కోట్ల నుంచి రూ.11,496 కోట్లకు చేరింది. తెలంగాణ 10 శాతం, కర్ణాటక 8 శాతం, కేరళ 8 శాతం, ఓడిషా 7 శాతం చొప్పున వృద్ధి రేటు నమోదు చేస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ ఆదాయం మాత్రమే స్థిరంగా ఉంది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 10.04 శాతం పెరిగింది.
జనవరిలో ముఖ్య రాష్ట్రాల జీఎస్టీ పెరుగుదల
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/pattika_26.jpg)
ఏప్రిల్–జనవరి అదే తీరు
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు పది నెలల కాలంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం నేల చూపులు చూస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు జీఎస్టీ ఆదాయంలో వృద్ధి రేటును నమోదు చేస్తుంటే ఒక్క ఏపీలో మాత్రమే వృద్ధి నమోదు అంతంత మాత్రంగా ఉంది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం కేవలం 1.2 శాతం వృద్ధితో రూ.36,975 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో వెనుకబడిన బీహార్ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 9.9 శాతం పెరిగి రూ.15,965 కోట్లకు చేరింది.
దే సమయంలో కర్ణాటక 10.5 శాతం, తమిళనాడు 8, తెలంగాణ 6 శాతం వృద్ధితో దేశ వ్యాప్తంగా 10.1 శాతం వృద్ధి నమోదయ్యింది. జీఎస్టీ వచ్చినప్పటి నుంచి దేశ సగటు వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు అధికంగా ఉంటూ వచ్చేదని, కానీ తొలిసారిగా ఈ ఏడాది దానికి భిన్నంగా తిరోగమన దిశలో పయనిస్తోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఐదేళ్లు కొనసాగిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించడం, కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం తప్ప అభివృద్ధిపై దృష్టి సారించక పోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయింది.
అందువల్లే పండుగల నెలలైనప్పటికీ నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో జీఎస్టీ ఆదాయం క్షీణించిందని అధికారులు పేర్కొంటున్నారు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని, అందరినీ లక్షాధికారులను చేస్తానని ఎన్నికల ముందుచెప్పిన సీఎం చంద్రబాబుకు వాస్తవం బోధ పడుతున్నట్లు తెలుస్తోంది.
అందువల్లే ‘సంపద సృష్టించే సలహా ఉంటే నా చెవిలో చెప్పు తమ్ముడూ’ అనే పరిస్థితికి దిగజారిపోయాడని, సంపద సృష్టించిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ కొత్త రాగం తీస్తున్నాడంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోయాయని, చివరికి ఉద్యోగుల జీతాల కోసం మంగళవారం రిజర్వ్ బ్యాంకు అప్పు కోసం ఎదురు చూసే పరిస్థితికి తీసుకొచ్చారంటూ విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment