గురు శిష్యుల కాకమ్మ కథలు | Kommineni Comments On Chandrababu And Revanth Reddy | Sakshi
Sakshi News home page

గురు శిష్యుల కాకమ్మ కథలు

Published Tue, Mar 25 2025 10:40 AM | Last Updated on Tue, Mar 25 2025 10:57 AM

Kommineni Comments On Chandrababu And Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రేవంత్‌ను చంద్రబాబు శిష్యుడుగానే  చాలామంది భావిస్తుంటారు. దానిని రేవంత్ ఒప్పుకున్నా, లేకున్నా జనాభిప్రాయం అలాగే ఉంది. పలు విషయాలలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు చంద్రబాబు తరహాలోనే కనిపిస్తుంటాయి. మార్గదర్శి అక్రమ డిపాజిట్లకు సంబంధించి హైకోర్టులో వీరిద్దరి ప్రభుత్వాలు దాదాపు ఒకే తరహాలో రామోజీ సంస్థకు  అనుకూలంగా అఫిడవిట్‌లు వేసిన సంగతి తెలిసిందే. అందులోనే కాదు అనేక అంశాలలో ఇదే ధోరణి కనిపిస్తుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిది ఒకటే తీరు. అప్పుల విషయంలో రేవంత్ గత కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

👉అలాగే చంద్రబాబు గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటారు. ఇది ఒకరకంగా చూస్తే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా అన్నమాట. రేవంత్ అధికారంలోకి వచ్చి అప్పుడే పదిహేను నెలలు గడిచిపోయింది. అయినా ఇంకా పట్టు రాలేదని ఆయనే చెబుతున్నారు. దానికి కూడా కేసీఆర్ కారణం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరమే అనిపిస్తుంది. అవినీతితో దోచుకుంటే పట్టు వచ్చినట్లవుతుందా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ కొద్ది రోజుల క్రితం ఒక విషయం చెప్పారు. అది ఆయన నిజాయితీతో చెప్పారా?లేక కేసీఆర్ ప్రభుత్వంపై బండ వేయడానికి చెప్పారా? అన్నది తేల్చజాలం కాని, వినడానికి మాత్రం సంచలనంగానే ఉంది. 

👉తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని అన్నారు. తెలంగాణ పేరు గొప్పగాని, అప్పుపుట్టకుంది అని ఆయన అన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. డబ్బు తనవద్ద ఉంటే గంటలో రుణమాఫీ చేసేవాడినని, 25 లక్షల ఇళ్లు  నిర్మించేవాడినని, ఎన్నో అద్భుతాలు చేసేవాడినని రేవంత్ అన్నారు. ఏపీలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. తాను ఇచ్చిన  హామీల ప్రకారం సూపర్ సిక్స్ సంక్షేమ స్కీములు  అమలు చేయాలని ఉందని, కాని నిధులు లేవని, గల్లా పెట్టే చూస్తే ఖాళీగా కనబడుతా ఉందని చంద్రబాబు సభలలో  అంటున్నారు.

👉తల్లికి వందనం స్కీము కింద ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయలు ఇచ్చే  స్కీమును ప్రస్తావిస్తూ అప్పులు దొరకడం లేదని అన్నారు. చంద్రబాబు, రేవంత్‌లు ఒకవైపు రాష్ట్రాలను గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేశాయని చెబుతూ, మరో వైపు అప్పటికన్నా అప్పులు  అధికంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరూ మనల్ని నమ్మడం లేదని రేవంత్‌ చెప్పడం సంచలనమే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నమ్మి ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చాయని ఎవరైనా అడిగితే రేవంత్ ఏమని సమాధానం ఇస్తారో తెలియదు.

👉కాళేశ్వరానికి అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని, ఆ వడ్డీరేటును తగ్గించడానికి యత్నిస్తున్నానని అన్నారు. మంచిదే. కాని అన్నిటికి ఒకే మంత్రం జపించినట్లు కేసీఆర్ వల్లే తాను ఏమి చేయలేకపోతున్నట్లుగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి?నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులపై రేవంత్ చాలా విమర్శలు చేశారు కదా! దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినట్లు కెసిఆర్ పై ఆరోపణలు చేశారు కదా?. కాని కాంగ్రెస్ బడ్జెట్‌లో అలా ఎందుకు చూపించలేకపోయారు. ఏపీలో కూడా ఇదే  తంతు. మరీ ఘోరంగా జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు  చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన వివరాల ప్రకారమే గత ఏడాది ప్రభుత్వం మారేనాటికి అన్ని రకాల అప్పులు కలిసి ఏడు లక్షల కోట్లే  ఉన్నాయి. ఇందులో చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పులు, రాష్ట్రం విభజన నాటి అప్పులు కలిసి సుమారు మూడు  లక్షలకోట్ల వరకు ఉన్నాయి.

👉అంతేకాక రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష ముప్పైవేల కోట్ల అప్పులు చేసింది. ఇవి చాలవన్నట్లుగా కేశవ్‌ను ఢిల్లీ పంపించి మరో 68 వేల కోట్ల అప్పుకోసం యత్నిస్తున్నారని ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. రేవంత్ ఒక మాట అన్నారు. ఎన్నిరోజులు దాచిపెట్టుకోను.. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా.. కాన్సర్ ఉంటే సిక్స్‌ఫ్యాక్  బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా అని ఆయన అన్నారు. ఇవి కొంచెం సీరియస్ వ్యాఖ్యలే. ఇలాంటి  కామెంట్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ పరపతి దెబ్బతింటుందని కొందరి అభిప్రాయం. అయితే వాస్తవ దృక్పధంతో రేవంత్ ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. ఇక్కడ ఒకదానికి బేసిక్‌గా సమాధానం చెప్పవలసి ఉంటుంది.

👉కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై కాని, ఇతరత్రా రుణాలపై కాని 2023 ఎన్నికల కంటే ముందుగానే  రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని తీవ్ర విమర్శలు చేశారు కదా?. రాష్ట్రం అప్పులకుప్ప అయిపోయిందని అన్నారు కదా!. అయినా ఆరు గ్యారంటీలు అంటూ ఎందుకు భారీ హామీలు గుప్పించారు? అన్నదానికి ఎన్నడైనా జవాబిచ్చారా? ఈ విషయంలో  చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా! ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్  ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని అంటే, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి కూడా విధ్వంస తెలంగాణ నుంచి వికసిత తెలంగాణవైపు నడిపిస్తున్నామని చెప్పారు. అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం  తెలంగాణ వికసించడం ఎలా అవుతుంది?

👉అంచనా వేసిన దానికన్నా 70 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గింది? ఏపీని రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబులు  పడిన హిరోషిమాతో కేశవ్ పోల్చితే, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కాన్సర్‌తో రేవంత్ పోల్చుతున్నారు. ఉద్యోగులకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, గత ప్రభుత్వం ఎనిమిదివేల కోట్ల బకాయిపెట్టి వెళ్లిందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, లేక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులయ్యో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కదా! ఎన్నికల సమయంలో ఎన్నడైనా చంద్రబాబుకాని, రేవంత్ కాని ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన  తర్వాత హామీలు అమలు చేస్తామని అన్నారా?లేదే!

👉రేవంత్ ఏమో తాము అధికారంలోకి రాగానే రైతు  బంధు డబ్బులు మరో ఐదువేలు  కలిపి ఇస్తామని, రెండు  లక్షల రూపాయల రుణ మాఫీ ఒకేసారి చేసి చూపిస్తామని ఎలా హామీ ఇచ్చారో  చెబుతారా?. అది కూడా రాహుల్‌ గాంధీతో ప్రకటింపచేశారే?. చంద్రబాబేమో తాను అప్పులు చేయనక్కర్లేదని, సంపద సృష్టించి పేదలకు పంచుతానని ప్రచారం చేసి,ఇప్పుడేమో సంపద ఎలా సృష్టించాలో తెలియదని, అదెలాగో  ప్రజలే  చెవిలో  చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి  నేర్పుతానని మరోసారి అంటున్నారు. ఒక్కోసారి ఒక్కరకంగా చెబుతూ డబ్బులు  లేవని కథలు చెబితే  ప్రజలను పిచ్చోళ్లను  చేసినట్లు కాదా?. ఇప్పుడు రేవంత్ ప్రయారిటీ ఫ్యూచర్ సిటీ అయితే, చంద్రబాబు  ప్రాధాన్యత  అమరావతి అన్నది అందరికి తెలిసిందే. అమరావతికి వేల కోట్ల అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం చేయలేనని చేతులెత్తేశారు.

👉రేవంత్ ప్రభుత్వం కొంతలో కొంత బెటర్. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొంతమేర అయినా అమలు చేసే యత్నం చేసింది.కాగా  ఏటా అప్పులకే 66 వేల కోట్లు మిత్తి కింద కట్టవలసి వస్తోందని రేవంత్ అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను దండుకోవడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గత ప్రభుత్వాల మీద కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల చెవిలో పూలు  పెట్టాలని చూడడం శోచనీయం. ఇవన్ని గమనించిన  తర్వాత చంద్రబాబు, రేవంత్‌లు గురు,శిష్యులే అనిపించదా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement