
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏమైంది?ఆమె పూర్తిగా బాలెన్స్ కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఆమె టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొంత ప్రత్యక్షంగా, మరికొంత పరోక్షంగా మద్దతు ఇస్తున్న తీరు రాజకీయంగా దివాళాకోరుతనాన్ని తెలియచేస్తుంది. చంద్రబాబును పొగిడితే పొగుడుకోవచ్చు. కాని తన అన్న ,మాజీ ముఖ్యమంత్రిని, వైఎస్సార్ కాంగ్రెస్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్దతిగా లేదు. తాను తెలంగాణలో రాజకీయం చేస్తానంటూ బయల్దేరి ,చివరికి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన వైనం సిగ్గుచేటైన విషయంగా ఆమె భావిస్తున్నట్లు లేదు.
తెలంగాణ రాజకీయాలలో ఉండడానికి వీలు లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరిమేసిన మాట నిజమా?కాదా?ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మట్టి చేబూని ప్రమాణం చేసి ,ఈ గడ్డపైనే రాజకీయం చేస్తానని చెప్పారా? లేదా? కాని ఆ తర్వాత నాలుక మడతేసి అక్కడ నుంచి ఎందుకు వచ్చారో ప్రజలకు తెలియదా? ఆమె ఆత్మకు తెలియదా? దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన ప్రత్యర్దులతో చేతులు కలిపి ఆమె ఆంధ్ర రాజకీయాలలోకి ఎంటర్ అయిన విషయం అబద్దమా?ఆమెకు టీడీపీ మీడియా ప్రముఖుడు సలహాలు ఇచ్చే మాట నిజం కాదా? కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తో చంద్రబాబు నాయుడు జరిపిన మంతనాలు దేనికోసమో తెలియదా? తన అన్నపై పెట్టిన అక్రమ కేసులలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును కూడా చేర్చడం ద్వారా కాంగ్రెస్ అవమానకరంగా వ్యవహరిస్తే, తగుదునమ్మా ..అంటూ అదే పార్టీలో చేరి ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేసిన చరిత్రను షర్మిల సొంతం చేసుకున్నట్లు అనిపిస్తుంది.
కేసులు పెట్టడం, ఆ చార్జీషీట్లలో రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించడం తప్పు అని కాంగ్రెస్ అధిష్టానం చెబితే,అప్పుడు ఆమె ఆ పార్టీలో చేరితే ఫర్వాలేదు. కాని వైఎస్సార్‌కు ప్రజలలో ఉన్న అభిమానంలో వాటాను పొందే దురుద్దేశంతో షర్మిలను కేవలం ఒక పావుగానే కాంగ్రెస్ వాడుకుంటున్న విషయం తెలియనిదా?ఇదే కాంగ్రెస్ ను ఆమె ఎంత తీవ్రంగా గతంలో విమర్శించారో గుర్తు లేదా? పైగా రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్ అనేవారని, అందుకే కాంగ్రెస్ లో చేరారని ఆమె బొంకినంత మాత్రాన జనం నమ్ముతారా? కడప జిల్లాలో ఓటమి ఎరుగని వైఎస్ ఆర్ కుటుంబం నుంచి పోటీచేసి షర్మిల ఓటమిపాలై అపకీర్తి పొందారా?లేదా? రాజకీయాల కన్నా ఇంటిలో ఉన్న తగాదాలను రోడ్డుమీదకు తెచ్చి అందరి పరువు తీయడానికి వెనుకాడని షర్మిల మనస్తత్వం అర్ధం అవుతూనే ఉంది. టీడీపీతో కాంగ్రెస్ మాచ్ ఫిక్సింగ్ ఉందో ,లేదో కాంగ్రెస్ నేతలు ఎవరిని అడిగినా తెలుస్తుంది.
ఒకప్పుడు వైఎస్సార్ మరణంపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీకి తీసుకువెళ్లి సభ పెడితే వైఎస్సార్ కు నివాళి అర్పించినట్లే అవుతుందా?ఇదే రేవంత్ రెడ్డిని గతంలో షర్మిల ఏమని నిందించారో గుర్తు లేదా?కడప ఉప ఎన్నిక జరిగితే ఆయన వచ్చి గల్లి,గల్లీ తిరుగుతానని అంటే ప్రజలు పిచ్చివాళ్లా? షర్మిల సీఎం అవుతారని రేవంత్ ప్రకటిస్తే నిజమేనని పొంగిపోతే అంతకన్నా తెలివితక్కువతనం ఉంటుందా? షర్మిల కాంగ్రెస్ సీఎం. అవుతారని రేవంత్ అనడంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు కాని, ఆయన కేవలం టీడీపీకి ఉపయోగపడడానికే అలా అంటున్నారని ఆమెకు అర్ధం కాకపోవచ్చు. ఆంధ్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మృత పార్టీగానే ఉందని చెప్పక తప్పదు. అది కోలుకుంటుందా?అన్నది తేలడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ కాంగ్రెస్ కు షర్మిల నాయకత్వం వహించినందున వైఎస్ ఆర్ కాంగ్రెస్ వారు కొందరైనా వస్తారన్న ఆశ ఉండవచ్చు.గత ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో టిక్కెట్ రాని కొంతమంది కాంగ్రెస్ లో చేరినా వారికి ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికి తెలుసు.
షర్మిల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అధికారంలో ఉన్న చంద్రబాబుపై కన్నా విపక్షంలో ఉన్న జగన్ పైనే ఎక్కువ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.దానిని బట్టే ఆమె లక్ష్యం తెలిసిపోతుంది. ఏపీలో ఒకవైపు బీజేపీతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకుని, మరో వైపు కాంగ్రెస్ తో పరోక్ష పొత్తును పెట్టుకుని చంద్రబాబు తనదైన శైలిలో రాజకీయం చేశారా?లేదా? వైఎస్సార్‌సీపీ ఓట్లు ఒకటి,రెండు శాతం చీలినా తనకు రాజకీయంగా ఉపయోగమని చంద్రబాబు పన్నిన వ్యూహంలో షర్మిల కూడా ఒక పావు మాత్రమేనని రాజకీయవర్గాలలో బహిరంగ రహస్యమే.అదే ధోరణి ఇప్పటికీ షర్మిల కొనసాగిస్తున్నారు. బీజేపీకి వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తున్నదంటూ చేసిన వ్యాఖ్య అర్ధరహితం. వైఎస్సార్‌సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. కాని అంశాలవారీగా సపోర్టు చేసే విషయాన్ని రహస్యంగా చేయడం లేదు. షర్మిల మీడియాతో మాట్లాడుతూ చెప్పిన కొన్ని అసత్యాలు చూడండి. ఆమె సాక్షిని నడుపుతున్న జగన్ ను ప్రశ్నిస్తున్నారట. ఇందులోనే ఆమె ఎంత ద్వేషం వెళ్లగక్కుతోంది కనబడుతూనే ఉంది.
ఆయన నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత. ఐదేళ్లపాటు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయనను ఉద్దేశించిన తీరు కచ్చితంగా ఆమెలో అక్కసు తెలియచేస్తుంది. ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికి అమ్మ ఒడి పధకం అమలు చేస్తామని జగన్ 2019లో హామీ ఇచ్చారని ఆమె చెబుతున్నారు. అది పచ్చి అబద్దం . వైఎస్సార్‌సీపీ అమ్మ ఒడి స్కీమ్ కింద పిల్లల చదువుల నిమిత్తం తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది. ఆ మేరకు అమలు చేసింది. తెలుగుదేశం పార్టీ ,జనసేన పార్టీ కలిసి మానిఫెస్టో విడుదల చేసి ప్రతి కుటుంబంలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క విద్యార్ధికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందచేస్తామని ప్రకటించాయి. కాని ఇప్పుడు అలా చేయకుండా మడమ తిప్పుతున్నారు.అలా మోసం చేస్తున్నదన్న విమర్శను ప్రజలు టీడీపీపై చేస్తుంటే షర్మిల ఆ పార్టీని, చంద్రబాబును కాపాడడానికి జగన్ పై అబద్దపు ఆరోపణలతో రంగంలోకి దిగినట్లు అనిపిస్తుంది.
తల్లికి వందనం స్కీము పై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని అన్నారు తప్ప, ఏపీ ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని కాంగ్రెస్ నేతగా షర్మిల చెప్పలేకపోవడంలోని ఆంతర్యం ప్రజలు అర్దం చేసుకోలేరా?మొక్కుబడిగా బస్ లలో మహిళల ఉచిత ప్రయాణం గురించి టీడీపీని ప్రశ్నించారు . ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామన్న స్కీమ్ గురించికాని, మూడు గ్యాస్ బండల పంపిణీ .నిరుద్యోగ భృతి, వలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం, రైతు భరోసా ఇరవై వేల రూపాయలు వంటి హామీల గురించి చంద్రబాబును నిలదీయవలసి కాంగ్రెస్ అద్యక్షురాలు , ఆ పని చేయకుండా విపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీని ప్రశ్నించడం విడ్డూరంగానే కనిపిస్తుంది. వైఎస్సార్ విగ్రహాల ద్వంసంపై ఇన్నాళ్లకు కొద్దిగా స్పందిస్తూ, ఇంకోసారి విగ్రహాలను పగలకొడితే ఊరుకోం అని ఆమె అన్నారు. అంటే ఇన్నాళ్లూ చేసిన విద్వంసాన్ని ఆమె తప్పు పట్టడం లేదనుకోవాలి. కనీసం అలా విగ్రహాలను ధ్వంసం చేసినవారిపై కేసులు పెట్టాలని కూడా ఆమె డిమాండ్ చేయడం లేదు.
అది తండ్రిపై ఆమెకు ఉన్న ప్రేమ. టీడీపీకి కాంగ్రెస్ తోకపార్టీ కాదని ఆమె అంటున్నారు.మంచిదే. ఆ విషయాన్ని ఆచరణలో చూపించాలి కదా? టీడీపీవారి స్క్రిప్ట్ ప్రకారం వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తే ఎవరైనా ఏమంటారు?తమలపాకుతో టీడీపీని, తలుపుచెక్కతో వైఎస్సార్‌సీపీని కొట్టినట్లుగా విమర్శలు చేయడం ద్వారానే షర్మిల తన మనోగతాన్ని తెలియచేస్తున్నట్లు కనిపిస్తుంది. మరో కొత్త ప్రచారాన్ని ఆమె తెరపైకి తీసుకురావడం ద్వారా తాను చంద్రబాబు మద్దతుదారునని చెప్పకనే చెప్పారు. ఈ ఎన్నికలు చంద్రబాబు సీఎం.కావాలా? వద్దా?అన్న కోణంలో జరిగాయట.చంద్రబాబుకు అనుభవం ఉందట. సమర్దుడు అని ప్రజలు అవకాశం ఇచ్చారని ఆమె సర్టిఫికెట్ ఇచ్చారు.ఒకనెల రోజుల క్రితం ఈమెనే ఈ ఎన్నికలు జగన్ పై జరిగినవని అన్న సంగతి మర్చిపోయి ఉంటారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఆమె పరోక్ష మద్దతు ఇస్తున్నారు.అదే టైమ్ లో టీడీపీ, జనసేన,బీజేపీ కూటమితో పోరాడిన వైఎస్సార్‌సీపీ ని బీజేపీ తోకపార్టీ అని షర్మిల అనడం చిత్రంగానే ఉంది.వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు, వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధం లేదట.
ఇక్కడ సంబంధం గురించిన ప్రశ్న కాదు. వైఎస్సార్ మరణం తర్వాత ప్రజలలో ఆయన స్మృతిని నిలబెట్టింది..ప్రజలలో ఆయన పట్ల ఉన్న ఆదరణను బహిర్గతం చేసింది జగన్ అన్న ది ఆమెకు తెలియదా?ఏ తండ్రికి ఏ కొడుకు ఇవ్వలేనంతగా గొప్ప నివాళి అర్పించిన ఘనత జగన్ ది కాదా! జగన్ తన ప్రభుత్వంలో ఎన్ని స్కీములకు వైఎస్ ఆర్ పేరు పెట్టింది షర్మిలకు తెలియదా? హెల్త్ యూనివర్శిటీకి సైతం వైఎస్ ఆర్ పేరు పెట్టారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే కొందరు టీడీపీ కార్యకర్తలు యూనివర్శిటీ గోడకు ఉన్న వైఎస్ ఆర్ పేరును అవమానకరంగా తొలగిస్తే కనీసం ఖండించని షర్మిల ఆయనకు వారసురాలు అవుతుందట. వైఎస్సార్ పేరుతో ఉన్నదాదాపు అన్నిటిని మార్చేసిన టీడీపీని ఒక్క మాట అనకపోవడం ఆమె విజ్ఞత. వైఎస్సార్ మరణం తర్వాత ఆయనను అవమానించిన కాంగ్రెస్ లో చేరిన షర్మిల టీడీపీకి సేవ చేస్తున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు.ఏది ఏమైనా షర్మిల తన తండ్రి మాదిరి ఫెయిర్ రాజకీయం చేసి పేరు తెచ్చుకుంటారా?లేక కుట్ర రాజకీయంలో భాగం అయి తన అన్నపై అక్కసు తీర్చుకుంటారా?అన్నది ఆమె తేల్చుకోవాలి!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment