జస్టిస్ జె. చలమేశ్వర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న దేవులపల్లి అమర్. చిత్రంలో కల్లూరి భాస్కరం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో రాజ్యాంగ విలువలు లోపించాయని, అధికారం వచ్చాక తాము ఏది చేసినా చెల్లుతుందనే ధోరణి కొనసాగుతోందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా గురువారం ప్రముఖ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.. దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబునాయుడు గురించి రచించిన ‘మూడు దారులు’పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జస్టిస్ జె.చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పరంగా విధివిధానాలు వేరైనా.. ముగ్గురి గమ్యం ఒక్కటేనని అన్నారు. పాదయాత్ర అనంతరం వై.ఎస్. రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. ఒక సందర్భంలో వైఎస్‌ను కలసినప్పుడు ఈ విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నానని తెలిపారు. నేరుగా ప్రజల చెంతకు వెళ్లి, వారికి నమ్మకం కల్పించిన నాయకుడే అధికారాన్ని పొందగలుగుతాడని ఆయన పేర్కొన్నారు. వైఎస్ తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పించి జననేతగా నిలిచారన్నారు.
చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కాడు..
ఒక పాత్రికేయునిగా తాను చూసిన వాస్తవ సంఘటనలను తన అభిప్రాయాలుగా మూడు దారలుగా తీసుకువచ్చానని రచయిత దేవులపల్లి అమర్ అన్నారు. ఉత్తరాది రాజకీయ నాయకులకు దక్షణాదిలో కొనసాగుతున్న వాస్తవ రాజకీయ పరిణామాలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఇదే పుస్తకాన్ని ‘డక్కన్ పవర్ ప్లే’పేరుతో ఇంగ్లిష్‌లో కూడా తీసుకువచ్చానని చెప్పారు.
కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో అసమ్మతి నేతగా కొనసాగి, ప్రజల మొప్పుతో ఆ పార్టీనే తనపైన ఆధారపడేలా ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ఆయన అభిప్రాయపడ్డారు. పొత్తులతోనే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారుకానీ, చంద్రబాబు స్వయం ప్రకాశితుడు కారని చెప్పారు.
ఒంటరిగా పోటీ చేసిన ప్రతీసారి బాబు ఓడిపోయారన్నారు. 1993లో ఎన్‌టీఆర్ తనకు జరిగిన మోసాన్ని తిప్పికొట్టి 1994లో మళ్లీ ముఖ్యమంత్రిగా నిలిచారని, కానీ కొద్ది రోజుల్లోనే ఆయనకు వెన్నుపోటు పోడిచి చంద్రబాబు సీఎంగా మారారని అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రికి భిన్నంగా ప్రయాణం చేశారని, ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ నిరాకరిస్తే ఆ పార్టీనే వదిలి ప్రజల చెంతకు చేరారని అన్నారు.
కక్షసాధింపుతో ఆ పార్టీ ప్రభుత్వం కేసులు పెట్టినా 16 మాసాలు జైల్లో ఉండి, అనంతరరం ప్రజల మెప్పుతో 2019లో ఏపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారని కొనియాడారు. సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరం, చక్రధర్, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment