న్యూఢిల్లీ, సాక్షి: తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేటి సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. సోలిసిటర్ జనరల్ అభ్యర్థనతో చివరి నిమిషంలో విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు.
గత విచారణ సమయంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర దర్యాప్తు జరిపించాలా? అనే అంశంపై కేంద్రాన్ని స్పష్టత కోరింది సర్వోన్నత న్యాయస్థానం. ఇందుకు ఇవాళ్టి లోపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పమని కోరింది.
అయితే ఇవాళ 3గం.30ని. విచారణ జరగాల్సి ఉండగా.. రేపటి వరకు సమయం కావాలని సోలిసిటర్ జనరల్ అభ్యర్థించారు. దీంతో రేపు సుదీర్ఘంగా విచారిస్తామని, ఇరువైపుల వాదనలు వింటామని చెబుతూ విచారణను చివరినిమిషంలో వాయిదా వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
నాలుగు పిటిషన్లపై విచారణ..
ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యితో అపవిత్రం అయ్యిందంటూ చేసిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్ధిస్తూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సంపత్, శ్రీధర్, సురేష్ చవంకేలు వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలను కలిపి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
కిందటి నెల 30వ తేదీన విచారణ జరగ్గా.. సీఎం హోదాలో బాధ్యతారాహిత్యంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్‌రావు, సంపత్, శ్రీధర్ తరఫున రాఘవ్ అవస్తీ, సురేష్ చవంకే తరఫున సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్.. అలాగే ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు ఇరుపక్షాల వాదనలు సాగగా.. వాటిని కోర్టు రికార్డు చేసింది.
ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment