చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్‌': సుప్రీంకోర్టు | Supreme Court Fires On Chandrababu Govt About TTD Laddu Issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్‌': సుప్రీంకోర్టు

Published Tue, Oct 1 2024 4:44 AM | Last Updated on Tue, Oct 1 2024 4:44 AM

Supreme Court Fires On Chandrababu Govt About TTD Laddu Issue

చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర

కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా?

మీ రాజకీయాలకు దేవుడిని దూరంగా ఉంచండి

వాస్తవాలు నిర్ధారణ కాక ముందే రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు? 

అసలు ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా చెప్పారుగా? 

లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? 

ఆధారాల్లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం అలా ఎలా ప్రెస్‌ ముందు మాట్లాడతారు?.. ఒకపక్క విచారణ జరుగుతుండగా ఆ వ్యాఖ్యలతో ‘సిట్‌’ దర్యాప్తు ప్రభావితం కాదా?  

ఎన్‌డీడీబీ రిపోర్టులోనే తమ నివేదిక తప్పు కూడా కావచ్చని చెబుతోంది కదా? 

ఎన్‌డీడీబీ నివేదికపై సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదు? 

అదొక్కటే కాదు.. దేశంలో పేరుమోసిన ల్యాబ్‌లు ఎన్నో ఉన్నాయి 

సిట్‌ దర్యాప్తు కొనసాగించాలా? లేక స్వతంత్ర సంస్థకు అప్పగించాలా? 

ఏదో ఒక విషయం చెప్పండి.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం 

ప్రకటనల విషయంలో నియంత్రణ పాటించాలని మీ క్లయింట్‌లకు చెప్పండి 

సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రాకు ధర్మాసనం మౌఖిక ఆదేశం 

సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అక్టోబర్‌ 3 మధ్యాహ్నానికి వాయిదా  

ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా.. టీటీడీ ఈవో ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాల్లేవ్‌. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు.

ఎన్‌డీడీబీ నివేదిక జూలైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్‌లో ఎందుకు మాట్లాడినట్లు? జూలైలో వచ్చిన నివేదికపై అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? నెయ్యిలో జంతు కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసలు ఈ ప్రకటన చేయడానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి?
సీఎం చంద్రబాబునుద్దేశించి ‘సుప్రీం’ ఘాటు వ్యాఖ్యలు

ఆ లడ్డూలను పరీక్షల నిమిత్తం ఎందుకు పంపలేదు? ప్రెస్‌ ముందుకు వెళ్లే ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి?

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయవచ్చా? దాని వల్ల సిట్‌ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి. 
– చంద్రబాబునుద్దేశించి సుప్రీంకోర్టు

నివేదిక జూలైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్‌లో ఎందుకు మాట్లాడారు..?
ఎన్‌డీడీబీ నివేదిక జూలైలో వస్తే సీఎం సెప్టెంబర్‌లో ఎందుకు మాట్లాడినట్లని ధర్మాసనం ప్రశ్నించింది. జూలైలో వచ్చిన నివేదికపై అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? ఈ వ్యవహారంలో ప్రెస్‌ ముందుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి స్వయంగా దర్యాప్తునకు ఆదేశించినప్పుడు మళ్లీ ప్రెస్‌ ముందుకు వెళ్లడం ఏమిటి? నెయ్యిలో జంతు కొవ్వు కలిపారంటూ సీఎంప్రకటన చేశారు. 

అసలు ఈ ప్రకటన చేయడానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని చెబుతున్నప్పుడు ఆ లడ్డూలను పరీక్షల నిమిత్తం ఎందుకు పంపలేదు? ప్రెస్‌ ముందుకు వెళ్లే ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని మీరు (సీఎం) భావించలేదా?

జంతు కొవ్వు వాడారంటూ చేసిన ప్రకటన కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? ప్రెస్‌ ముందుకెళ్లి బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి. లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లేవు. దర్యాప్తు జరుగుతుండగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయవచ్చా? దాని వల్ల సిట్‌ దర్యాప్తు ప్రభావితం కాదా? అని ప్రశ్నించింది.

రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎం ప్రెస్‌ ముందు అలా ఎలా మాట్లాడతారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని వెనక్కిపంపించేశామని, అసలు ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనేలేదని టీటీడీ ఈవో చాలా స్పష్టంగా చెప్పారు. మరి అందుకు విరుద్ధంగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు?
    – సుప్రీంకోర్టు ధర్మాసనం

అసలు దేని ఆధారంగా నెయ్యి కల్తీ అయినట్లు చెబుతున్నారు? లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారనేందుకు ఆధారాలు ఏమిటి? శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు.
    – సుప్రీంకోర్టు ధర్మాసనం

నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది గానీ... తన నివేదికలో తప్పులు ఉండవచ్చని ఎన్‌డీడీబీ స్వయంగా చెప్పిన విషయం మాత్రం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు.    
    – సుప్రీంకోర్టు ధర్మాసనం

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ ఆరోపణల విషయంలో వాస్తవాలు నిర్ధారణ కాక ముందే కల్తీ జరిగినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రకటనలు చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉందని చెప్పేందుకు ముఖ్యమంత్రి వద్ద ఏం ఆధారాలున్నాయని సూటిగా ప్రశ్నించింది. 

రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ప్రెస్‌ ముందు అలా ఎలా మాట్లాడతారని నిలదీసింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని వెనక్కి పంపించేశామని, అసలు ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనేలేదని టీటీడీ ఈవో చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేసింది. మరి అందుకు విరుద్ధంగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. 

అసలు దేని ఆధారంగా నెయ్యి కల్తీ అయినట్లు చెబుతున్నారు? లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారనేందుకు ఆధారాలు ఏమిటి? అని ప్రశ్నించింది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని  అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు రాజ్యాంగపరమైన ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. 

అలాంటి ప్రకటనలు చేయడం వల్ల కోట్ల మంది ప్రజల మనోభావాలు ప్రభావితం అవుతాయని తేల్చి చెప్పింది. ‘కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి..!’ అని సీఎం చంద్రబాబు తదితరులను దృష్టిలో పెట్టుకుని ఘాటుగా వ్యాఖ్యానించింది. నెయ్యి కల్తీ జరిగిందంటూ రిపోర్టు ఇచ్చిన నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డే (ఎన్‌డీడీబీ) తన నివేదిక తప్పు కావొచ్చునని స్పష్టంగా పేర్కొందని ప్రస్తావించింది. 

నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది గానీ తన నివేదికలో తప్పులు ఉండవచ్చని ఎన్‌డీడీబీ స్వయంగా చెప్పిన విషయం మాత్రం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. కల్తీపై ఎన్‌డీడీబీ ఇచ్చిన నివేదికపై సెకండ్‌ ఒపీనియన్‌ (రెండో అభిప్రాయం) ఎందుకు తీసుకోలేదని టీటీడీని ప్రశ్నించింది. ఎన్‌డీడీబీ ఒక్కటే అత్యున్నత ల్యాబ్‌ కాదని, దేశంలో పేరు మోసిన ల్యాబ్‌లు ఎన్నో ఉన్నాయని టీటీడీకి గుర్తు చేసింది. 

ఎన్‌డీడీబీ నివేదికలో స్పష్టత లోపించిందని పేర్కొంది. నెయ్యి కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరగాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. అయితే దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) కొనసాగించాలా? లేక స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయాలా? అనే విషయంపై తమకు సహకరించాలని సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. 

ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెయ్యి కల్తీకి సంబంధించి ప్రకటనలు చేసే విషయంలో నియంత్రణ పాటించేలా మీ క్లయింట్‌లకు (రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఈవో) చెప్పాలని టీటీడీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకి ధర్మాసనం మౌఖికంగా స్పష్టం చేసింది. 

పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్‌ నేత, ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్‌ సుబ్రమణియన్‌ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 

అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్ధిస్తూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్, శ్రీధర్, సురేష్‌ చవంకే వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలపై జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమ­వారం మధ్యాహ్నం విచారణ జరిపింది. 

పిటిషనర్‌ సుబ్రమణియన్‌ స్వామి తరఫున సీనియర్‌ న్యాయవాది రాజశేఖర్‌రావు, సంపత్, శ్రీధర్‌ తరఫున రాఘవ్‌ అవస్తీ, సురేష్‌ చవంకే తరఫున సీనియర్‌ న్యాయవాది సోనియా మాథుర్, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, టీటీడీ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు ఇరుపక్షాల వాదనలు సాగాయి.  

చంద్రబాబు ప్రకటనతో నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు సాధ్యమేనా? 
ముందుగా రాజశేఖర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రకటన చేశారు. అయితే టీటీడీ ఈవో ఇందుకు విరుద్ధంగా ఆ నెయ్యిని అసలు లడ్డూ తయారీలో ఉపయోగించలేదని పత్రికా ముఖంగా చెప్పారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు ఎలాంటి ఆధారాలు లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రకటనలు చేస్తే దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. 

అవి ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది. సీఎంప్రకటనకు భిన్నంగా టీటీడీ ఈవో ప్రకటనలు ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పర్యవేక్షణతో కూడిన విచారణ అవసరం. శ్రీవారి ప్రసాదంపై ప్రశ్నలు తలెత్తినప్పుడు ఆ ఆరోపణలను పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు సాధ్యమేనా? ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ జోక్యాన్ని నిలువరించాలి. మా వ్యాజ్యంలో పలు కీలక ప్రశ్నలను లేవనెత్తాం’ అని నివేదించారు. 

ఆ వ్యాజ్యానికి విశ్వసనీయత లేదు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. సుబ్రమణియన్‌ స్వామి దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి విశ్వసనీయత లేదన్నారు.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని సమర్ధించేందుకే ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్నారు. స్వామి, వైవీ సుబ్బారెడ్డి వ్యాజ్యాల్లోని అంశాలు ఒకే రకంగా ఉన్నాయన్నారు. నెయ్యి సరఫరాదారులకు టీటీడీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసిందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అనంతరం టీటీడీ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ నెయ్యిని ఎప్పుడు సేకరించారు? ఎప్పుడు పరీక్షించారు? ఎప్పుడు వెనక్కి పంపారు? తదితర వివరాలను చదివి వినిపించారు. కల్తీ నెయ్యిని పరీక్షల నిమిత్తం ప్రఖ్యాత ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపామన్నారు. జూన్‌ నుంచి జూలై 4 వరకు సరఫరా చేసిన నెయ్యి శాంపిళ్లను ఎన్‌డీడీబీకి పంపలేదన్నారు. జూలై 6, జూలై 12న సరఫరా చేసిన నెయ్యి శాంపిళ్లనే ఎన్‌డీడీబీకి పంపామని లూథ్రా వెల్లడించారు.  

మా ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి..
తమ ప్రశ్నలకు లూథ్రా సూటిగా సమాధానం చెప్ప­కుండా దాటవేస్తుండటంతో ధర్మాసనం జోక్యం చేసుకుంది. తమ ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. 

⇒ ‘లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. ముఖ్యమంత్రి ప్రకటనకు విరుద్ధంగా టీటీడీ ఈవో ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో మీ (టీటీడీ) వైఖరి చాలా స్పష్టంగా ఉంది.

⇒ ముఖ్యమంత్రి చేసిన ప్రక­ట­నలకు ఎలాంటి ఆధారాల్లేవ్‌. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు...’ అని ధర్మాసనం ఘాటుగా స్పష్టం చేసింది. 

⇒ ఎన్‌డీడీబీ నివేదికలో అది తప్పు అయ్యే అవకాశం కూడా ఉందని స్పష్టంగా పేర్కొన్నారని, అలాంటప్పుడు సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదని ధర్మాసనం ప్రశ్నించింది. 

⇒ ఎన్‌డీడీబీ చాలా పేరున్న ల్యాబ్‌ అని లూథ్రా చెప్పగా.. అది ఒక్కటే కాదని, దేశంలో పేరు మోసిన ల్యాబ్‌లు చాలానే ఉన్నాయని ధర్మా­సనం స్పష్టం చేసింది. 

⇒ అసలు ఎంత మంది కాంట్రాక్టర్ల నుంచి నెయ్యిని సేకరిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఐదుగురు కాంట్రాక్టర్ల వద్ద నుంచని లూథ్రా పేర్కొనడంతో.. వారి నుంచి సేకరించిన నెయ్యి మొత్తాన్ని కలిపేస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కలిపేస్తా­మని లూథ్రా బదులివ్వడంతో మరి ఎవరు సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయిందో ఎలా నిర్ధారిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 

⇒ మొత్తం నెయ్యి నుంచి కల్తీ నెయ్యిని ఎలా వేరు చేస్తారని ప్రశ్నించింది. దీనికి లూథ్రా నేరుగా సమాధానం ఇవ్వకుండా..  50 ఏళ్లుగా  శ్రీవారి ప్రసాదాల కోసం కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని నెయ్యిని ఉపయోగిస్తూ వచ్చామని, గత ప్రభుత్వ హయాంలోనే కాంట్రాక్టర్‌ మారారని పేర్కొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే నెయ్యి నాణ్యతను పరిశీలించామన్నారు. దీంతో కల్తీ వ్యవహారం బయటపడిందన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానినే కొనసాగించాలా? లేక దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించాలా? అనే విషయంపై చెప్పాలని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 3న మధ్యాహ్నం 3.30 గంటలకు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఇకనైనా దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. ల్యాబ్‌ రిపోర్టులో అస్పష్టత ఉంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు రుజువు లేకుండా మీడియా ముందుఎందుకు హడావుడి చేశారంటూ నిలదీసింది. జూలైలో రిపోర్టు వెలువడితే ఇప్పుడెందుకు బయటపెట్టారంటూ ప్రశ్నించింది. ఇకనైనా మీరు దేవుణ్ని రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్‌ ఆస్కింగ్‌.   
 – ప్రకాశ్‌రాజ్, నటుడు

సుప్రీంకోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది 
తిరుమల లడ్డూ అంశంపై సరైన ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది 
– సుబ్రమణియన్‌స్వామి, మాజీ ఎంపీ

బాబు, పవన్‌ రాజీనామా చేయాలి
చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారు. తిరుమల దేవస్థానంపై విశ్వాసాన్ని దెబ్బ తీసినందుకు వీరే బాధ్యత వహించాలి. హిందువులను మోసం చేసినందుకు, అబద్ధాలు ఆడినందుకు పశ్చాత్తాప్పడి పదవులకు రాజీనామా చేయాలి.   
 – పీవీఎస్‌ శర్మ, ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి

దేవాలయాలను రాజకీయాల్లోకి లాగుతారా? 
ప్రత్యర్థులను టార్గెట్‌ చేసేందుకు రాజకీయాల్లోకి దేవాలయాలను లాగుతారా? ఓట్ల కోసం మన ప్రార్థనా స్థలాలను లాగడం ఎంతవరకు సమంజసం? లడ్డూ విషయంలో స్వయంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబే అసత్య ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం సబబేనా? రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని, బహిరంగంగా ఒకటి, రహస్యంగా మరొకటి.. బీజేపీ ఎందుకు ఆటలాడినట్టు? 
– ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ, రాజ్యసభ

బాబు మతపరమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నారు 
తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని మతపరమైన భావోద్వేగాలు ప్రేరేపించేందుకు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గతంలోనే ‘ఎక్స్‌’లో చెప్పాను. ఈరోజు సుప్రీంకోర్టు సరిగ్గా అదే చెప్పింది. 
– శ్రీధర్‌ రామస్వామి, ఏఐసీసీ సోషల్‌ మీడియా నేషనల్‌ కో–ఆర్డినేటర్‌

బాబు ప్రజలకు క్షమాపణ చెబుతారా! 
చంద్రబాబూ సిగ్గు సిగ్గు. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెబుతారా! 
– సుమంత్‌ రామన్, రాజకీయ విశ్లేషకులు

పవన్‌ అసలు రంగు బట్టబయలైంది 
తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం వ్యాఖ్యలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అసలు రంగు బట్టబయలైంది. ఇలాంటి కపట అవకాశవాదులకు మద్దతు ఇవ్వకండి 
    – వీణా జైన్‌ (సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌)

బాబు, పవన్‌ను చూస్తుంటే సిగ్గుగా ఉంది
చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లను చూస్తుంటే సిగ్గేస్తోంది.     
– గబ్బర్, ప్రముఖ మలయాళీ రచయిత

దేవాలయాలను రాజకీయాల్లోకి లాగుతారా? 
ప్రత్యర్థులను టార్గెట్‌ చేసేందుకు రాజకీయాల్లోకి దేవాలయాలను లాగుతారా? ఓట్ల కోసం మన ప్రార్థనా స్థలాలను లాగడం ఎంతవరకు సమంజసం? లడ్డూ విషయంలో స్వయంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబే అసత్య ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం సబబేనా? రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని, బహిరంగంగా ఒకటి, రహస్యంగా మరొకటి.. బీజేపీ ఎందుకు ఆటలాడినట్టు? 
– ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ, రాజ్యసభ

హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు
రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు. వీరిద్దరూ క్షమాపణ చెప్పాలి. పవన్‌ చాలా గొప్ప నటుడు. ఆయన నటనతో రాజకీయాల్లోనూ రాణించాలనుకుంటే అది పొరపాటే. 
– డాక్టర్‌ గిరిజా షెట్కార్, యూనివర్సల్‌ హెల్త్‌ రైట్స్‌ అడ్వొకేట్‌

భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం 
తిరుపతి లడ్డూ వ్యవహారం భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం.
నివేదికలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. ఒక ఆహార పదార్థంలో 
14 రకాల కల్తీలు చేయవచ్చా? ఇక మతవాదులకు చెప్పడానికి ఏముంది! 
– ధన్య రాజేంద్రన్‌ (ది న్యూస్‌ మినిట్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌)

ఇప్పుడేం చేస్తారు మీరందరూ 
అబ్బబ్బ.. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం ఎంత రచ్చ చేశారు? భక్తుల మనోభావాల్ని ఎంత హింసించేశారు? రాజకీయ నేతల్ని పక్కన పెడదాం.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఎంత ఓవరాక్షన్‌ చేశారు వీళ్లంతా. ప్రాయశి్చత్త శ్లోకాలట..! వాళ్లే కనిపెట్టేసి .. రామ రామా.. మీరు చేసింది మామూలు రచ్చనా.. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు మీరంతా! ఇప్పుడు ఏం చేస్తారు మీరందరూ? మీరు నిజంగా వేంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్‌ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి.. ఎంత మంది పెడతారో చూస్తాను.     
– వీణావాణి, వేణు స్వామి భార్య

వైఎస్‌ జగన్‌ను దెబ్బతీయడానికి వారు ఆడిన పెద్ద అబద్ధం 
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చాలా పెద్ద అబద్ధమాడారు. ఇది వారు రాజకీయ స్వార్ధంతో ఆడిన అబద్ధం. చాలా సిగ్గు చేటు.    
 –హర్ష్‌ తివారి  

దేవుళ్లను రాజకీయాలకు దూరంగా పెట్టండి 
కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి  
    – పూనమ్‌కౌర్, నటి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement