తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి పేరుతోనూ ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య వచనాలు పలికి అపచారం చేశారా? సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని మిడి మిడి జ్ఞానంతో వ్యాఖ్యానించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరువు పోగొట్టుకున్నారా? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఈ విషయం నిర్ధారణ అయినట్లేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాయకత్వం వహిస్తున్న వీరిద్దరూ అపభ్రంశపు వ్యాఖ్యలు చేసి వారి ప్రతిష్టను వారే తీసుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా హిందు భక్తుల ఛీత్కారాలకు గురయ్యే పరిస్థితి తెచ్చుకున్నారా? శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న చంద్రబాబు ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇవన్నీ నిజమేనని స్పష్టమవుతోంది.
రాజకీయాల్లో ఉన్నవారు అబద్ధాలు ఆడడం అన్నది పెద్ద విషయం కాకపోవచ్చు. చంద్రబాబు వంటివారు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులూ కావచ్చు. కానీ ఏ నాయకుడైనా దైవాన్ని అడ్డం పెట్టుకొని అసత్యాలు చెప్పడానికి భయపడతాడు. కానీ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల చెంతనే తాను జన్మించానని, ఆయన్ను స్మరించుకోకుండా ఏ పనీ చేయనని చెప్పుకునే అత్యంత సీనియర్ రాజకీయ నేత, చంద్రబాబు ఎంత తప్పు చేశారో చూడండి... తిరుమల లడ్డులో జంతు కొవ్వును కలిపారనే తన వాదనను సమర్థించుకోవడానకి చంద్రబాబు సెప్టెంబర్ 21న ఒక సంచలన వ్యాఖ్య చేశారు.’’వెంకటేశ్వరస్వామే నాతో నిజాలు చెప్పించారు’’ అని చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అది విన్న ప్రతి హిందువు, తిరుమలేశుని భక్తుడు చంద్రబాబు సత్యమే చెబుతున్నారేమో అన్న భ్రమ పడ్డారు. స్వామివారి మీద భక్తి ఉండే ఎవరూ ఇంతటి సాహసం చేయరు.కానీ చంద్రబాబు మాత్రం అంతకు తెగించారు.
నిజానికి కొందరు మతోన్మాదులు, పూనకం వచ్చేవారు, జాతరవంటి కార్యక్రమాల్లో భవిష్యవాణి అంటూ తెలిసీ తెలియని మాటలు చెప్పేవారు మాత్రమే తనతో దేవుడే పలికిస్తున్నారని అంటారు. కానీ చంద్రబాబు కూడా వారి తరహాలోనే మాట్లాడారు. వీటిని దృష్టిలో ఉంచుకునే స్వామి వారే సుప్రీంకోర్టు రూపంలో చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయించారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను, వైఎస్సార్ సీపీ వారిని ఉద్దేశించి ’’తప్పులు, పాపాలు చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా? ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతోంది’’ అని తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో చంద్రబాబు మాటల దాడి చేశారు. సీన్ కట్ చేస్తే సెప్టెంబర్ 27న మళ్లీ మీడియాతో మాట్లాడుతూ కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు? అనేది అప్రస్తుతం అని ముక్తాయించారు.
అంటే దాని అర్థం అప్పటివరకూ తాను ప్రచారం చేసినట్టుగా జంతు కొవ్వుతో కలిసిన నేతితో లడ్డూ తయారు చేశారన్న తన మాటలు తప్పనే కదా. నిజంగానే ఆయన మొదట చెప్పిన అబిప్రాయంతోనే ఉంటే జంతు కొవ్వు వ్యవహారంపై తన వాదనకు కట్టుబడి ఉండాలి. అలా కాకుండా ’’కల్తీ జరిగిన నెయ్యిని ఎక్కడ వాడారనేది అప్రస్తుతం‘ అని చెప్పి తప్పించుకున్నారు. తమిళనాడుకు చెందిన ఏ ఆర్ డెయిరీ మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి పంపితే నాలుగు ట్యాంకర్లు వినియోగించామని మరో నాలుగు ట్యాంకర్ల నేతి శాంపిల్స్ ఎన్డీడీబికి పంపితే ఆ నివేదిక ఆధారంగా వాటిని తిరస్కరించామని అన్నారు. తొలుత వినియోగించిన ట్యాంకర్లలో నేతిలో కల్తీ జరిగిందా అని అడిగితే ఆ తర్వాత నాలుగు ట్యాంకర్లలో జరిగింది కదా అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. తిరుమలలో ఎటువంటి ల్యాబులు లేవని అప్పటివరకూ ప్రచారం చేసిన చంద్రబాబు ఆ తర్వాత కేవలం నాణ్యతా ప్రమాణాలు పరిశీలించే ల్యాబులే ఉన్నాయని, కల్తీ జరిగిందా లేదా అని నిర్దేశించే అడల్ట్రేషన్ ల్యాబులు లేవని చెప్పుకొచ్చారు.
ఆపైన ఇంక ఏవేవో మాట్లాడారు. అంతే తప్ప జంతు కొవ్వు నేతిలో కలిసిందన్న తన వ్యాఖ్యను నేరుగా ఉపసంహరించుకోకుండా అలవాటు ప్రకారం మాటమార్చే యత్నం చేశారు. ఇక్కడే ఆయనకు శ్రీ వెంకటేశ్వరస్వామి మీద నిజంగానే భక్తి ఉందా? అనే సందేహం వస్తుంది. దానికి తగినట్లుగానే సుప్రీం కోర్టు సామాన్యులకు వచ్చిన అన్ని సందేహాలను ప్రశ్నల రూపంలో సంధించింది. వాటికి చంద్రబాబు వద్ద సమాధానం లేదు. అందుకే దేవుళ్లను రాజకీయాలలోకి లాగవద్దని న్యాయమూర్తులు ఆయనకు హితవు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్ది రోజుల క్రితం మాట్లాడినప్పుడు, స్వామివారి సాక్షిగా చంద్రబాబు అబద్ధాలాడారని స్పష్టం చేశారు. ఒక వైపు ప్రమాణాలు లేని నేతి ట్యాంకర్లను వెనక్కి పంపామని ఈవో శ్యామలరావు కూడా చెప్పినా, ఒకటికి రెండుసార్లు జంతు కొవ్వు ప్రస్తావన తెచ్చి చంద్రబాబు స్వామివారి పట్ల అపచారం చేశారనేది భక్తుల ఆవేదన.
తెలిసో తెలియక ఒక అబద్ధం ఆడితే, పొరపాటున అన్నానని సర్దుకుంటే ఒక మాటతో పోతుంది. అలా కాకుండా మరిన్ని అబద్ధాలు ఆడి తప్పుమీద తప్పు చేయడం సరైనదా? కాదా? అన్నది ఆయనే తేల్చుకోవాలి. అంటే వెంకటేశ్వరస్వామి తనతో నిజాలు చెప్పించారని అన్నారు గానీ, ఇప్పుడవన్నీ అబద్ధాలని తేలడంతో మొదట అసత్యాల్ని దేవుడే పలికించాడా? అన్న ప్రశ్న వస్తే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఇదేనా ఆయనకు స్వామివారి మీద ఉన్న భక్తి, నమ్మకం? ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు చంద్రబాబును ఎండగట్టింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనడానికి ఆధారాలు ఏవి అని ప్రశ్నించింది. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కథ మరింత ఆశ్చర్యంగా ఉంటుంది.
బీజేపీ వారి మెప్పు కోసమో లేక చంద్రబాబు కన్నా తానే పెద్ద హిందువు అని చెప్పుకోవడానికో, ఏ కారణం వల్లనన్నా కానీ ఆయన కాషాయం దుస్తులు ధరించి మరీ హడావిడీ చేశారు. జరగకూడనిది ఏదో జరిగిందన్నట్టుగా చంద్రబాబు మాదిరే అబద్ధాలాడేశారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదంటూ అదే చర్చిలోనో, మసీదులోనో ఇలా జరిగితే ఊరుకుంటారా ? అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు సోషల్ మీడియా ప్రముఖులుగానీ వైఎస్సార్ సీపీ నేత పేర్నినాని వంటి వారు గానీ అనేక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి పవన్ కల్యాణ్ గాలి తీసేశారు. సనాతన ధర్మమంటే ఏంటో తెలియక పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడేశారు. సనాతన ధర్మం ప్రకారం నాలుగు వర్ణాలుంటాయి.
అందులో బ్రాహ్మణులు మొదటిస్థానంలో, క్షత్రియులు రెండో స్థానంలో, వైశ్యులు మూడో స్థానంలో ఉంటారని మను ధర్మం చెబుతుంది. నాలుగో స్థానంలో ఉన్న శూద్రులు పై మూడు వర్ణాలకు విధిగా సేవ చేయాల్సి ఉంటుందట. శూద్రులకు ఆస్తి హక్తు, వేదజ్ఞానం ఉండొద్దట. ఉద్యోగం, వ్యాపారం చేయకూడదట. శూద్ర మహిళల్ని పై మూడు వర్ణాలవారు లైంగికంగా అనుభవించవచ్చట. ఇలా అనేక అశాస్త్రీయమైన అంశాలతో కూడిన సనాతన ధర్మాన్ని పవన్ ఇప్పుడు జనం మీద రుద్దుతారా? పోనీ నిజంగానే ఈయన అచ్చమైన హిందువు అయితే వ్యక్తిగత జీవితంలో అన్ని అధర్మ వ్యవహారాలు చేస్తారా? అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు అసలు విడాకులు తీసుకోవడమనేది సనాతన ధర్మంలో ఉండనే ఉండదని చెప్పిన వీడియో ఇప్పుడు విస్తారంగా తిరుగుతోంది.
ఎందుకంటే పవన్ కల్యాణ్ ఎన్నిసార్ల విడాకులు తీసుకున్నది తెలిసిందే కదా. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అయితే నేరుగా ఒక భార్య ఉండగా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం సనాతన ధర్మం అవుతుందా? అని ప్రశ్నించారు. క్రైస్తవ సమావేశంలో తాను బాప్టిజం తీసుకున్నానని, తన భార్య క్రైస్తవురాలని, తన పిల్లలు క్రైస్తవులని చెప్పిన పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారు? జనం చెవిలో పువ్వులు పెట్టడానికి ఇలాంటి వేషాలు వేస్తే సరిపోతుందా? దీక్ష పేరుతో కాషాయ వస్త్రాలు, ఆ వెంటనే షూటింగుల పేరుతో అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం ఏ పాటి హిందూ ధర్మం? సనాతన ధర్మం? అని పేర్నినాని ప్రశ్నించారు. తన తండ్రి దీపారాధన జ్యోతితో సిగరెట్ట వెలిగించారని పవన్ కళ్యాణే చెప్పారు. బీఫ్ తింటే మంచిదే అంటారు. అయినా సనాతన ధర్మాన్ని తానే పరిరక్షిస్తా అని అంటారు.
చెప్పులేసుకొని దీక్ష చేస్తారు, అంటూ రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలు సోషల్ మీడయాలో వచ్చాయి. మరి వీటన్నటికీ సమాధానం చెప్పే ధైర్యం, నైతిక ధర్మం పవన్ కల్యాణ్ కు వున్నాయా?సుప్రింకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబుకు అతి విధేయత ప్రదర్శించబోయి తాను కూడా గబ్బు పట్టినట్లయిందన్న విషయాన్ని పవన్ గుర్తిస్తారో?లేదో? రాజకీయాలకోసం హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూపట్ల అపచారం చేయడమే కాకుండా స్వామివారిని కూడా ఇందులోకి లాగారు. స్వామివారే తనతో మాట్లాడించారంటూ పచ్చి అబద్దాన్ని చంద్రబాబు చెప్పడం పాపమో ?కాదో? ఆయనే తేల్చుకోవాలి.ఆయన పాపంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వాటా ఎంతో అవే తేల్చుకోవాలి. తనది అజ్ఞానమో ?కాదో పవన్ కళ్యాణే నిర్ణయించుకోవాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment