![Ap And Telangana Chief Ministers Meet On July 6](/styles/webp/s3/article_images/2024/07/6/cms.jpg.webp?itok=GChcx1Kz)
ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశం
షెడ్యూల్ 9, 10లోని అంశాలతో పాటు పలు అపరిష్కృత సమస్యలు, అంశాలు చర్చకు వచ్చే చాన్స్
తెలంగాణ తరఫున హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై శనివా రం సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కీలక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్‌రెడ్డి, కందుల దుర్గే‹Ù, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు.
కీలక అంశాలపై చర్చలు
విభజన సమస్యలపై గతంలో అధికారుల స్థాయిలో దాదాపు 30 సమావేశాలు జరిగినా పెద్దగా ముందడుగు పడలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీఠ వేయడంతో సమస్యలు, అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. తాజా సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, వాటి ఆస్తులు, నగదు నిల్వల పంపకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ మాత్రం అలా కుదరదని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేలకోట్లతో హైదరాబాద్‌లో ఆస్తులు ఏర్పడ్డాయని, వాటిలో వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ మాత్రం తమ భూభాగంలోని స్ధిరాస్తుల్లో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని వాదిస్తోంది. ఇక ఆర్టీసీ బస్‌భవన్, రాష్ట్ర ఆర్థికసంస్థ, ఉన్నత విద్యా మండలి, స్పోర్ట్స్ అథారిటీ ఆస్తులు, దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఉద్యోగుల పరస్పరం బదిలీ అంశాలు కూడా ప్రస్తుత భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి.
విద్యుత్ బకాయిల అంశం కూడా..
ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశం కూడా ప్రధానంగా మారింది. తెలంగాణకు రావాల్సిన సీలేరును ఏపీకి కేటాయించడం వల్ల, అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేయడం వల్ల.. వేల కోట్ల రూపాయల భారం రాష్ట్రంపై పడిందని, ఆ మొత్తాన్ని ఏపీ చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే.. తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందున అందుకు చెల్లించాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఏపీ చెబుతోంది.
![](/sites/default/files/inline-images/3_6.png)
దీనితో పాటు కృష్ణా జలాల పంపకంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గతంలో తాత్కాలిక పద్ధతిలో పంపిణీ చేసిన కృష్ణా జలాలను ఇప్పుడు 50 :50 చొప్పున పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. మరోవైపు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు చెందిన నిధుల వివాదం కూడా పరిష్కారానికి నోచుకోలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ డిమాండ్లు
1.రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి.
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 కి.మీ మేర విస్తారమైన తీరప్రాంతం ఉంది. తెలంగాణకు ఈ తీర ప్రాంతంలో భాగం కావాలి.
3. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి. టీటీడీలో కూడా తెలంగాణకు భాగం కావాలి.
4. కృష్ణా నదిలో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాలి.
5. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.24 వేల కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లించడం జరుగుతుంది.
6. తెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం రేవుల్లో వాటా కావాలి.
Comments
Please login to add a commentAdd a comment