ఇద్దరు సీఎంల భేటీ.. పరువు పాయే.. అంతా తుస్సే.. | Ksr Comments On The Meeting Of Andhra Pradesh And Telangana Chief Ministers | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఎంల భేటీ.. పరువు పాయే.. అంతా తుస్సే..

Published Mon, Jul 8 2024 10:41 AM | Last Updated on Mon, Jul 8 2024 12:57 PM

Ksr Comments On The Meeting Of Andhra Pradesh And Telangana Chief Ministers

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు విభజన సమస్యలపై చర్చించుకోవడానికి సమావేశం అవడం ముదావహమే. వారిద్దరి భేటీతో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని చాలామంది ఆశించారు. తెలుగుదేశం మీడియా ఇచ్చిన హైప్ చూసినవారికి ఏదో జరిగిపోతుందన్న భావన కలిగింది. తీరా ఇద్దరు సీఎంల సమావేశం అయిన తర్వాత ఇంతేనా.. ఏదో అయిపోతుందనుకుంటే ఇలా తుస్సుమనిపించారేమిటా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పేరుకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్ల ప్రకటించినా అవి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చెప్పలేం. అధికారుల కమిటీ, మంత్రుల కమిటీలు స్వతంత్రంగా నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా ఉండదు. గత అనుభవం కూడా ఇదే చెబుతోంది. ఈ విభజన సమస్యలు రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఇద్దరు సీఎంలు దిశానిర్దేశం చేయనిదే కమిటీలు కూడా ఏమీ చేయజాలవు. గతంలో అప్పటి ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలు చర్చలు జరిపినప్పుడు కూడా ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు సంప్రదింపులు కొనసాగించాలని భావించినా, ఆ తర్వాత కాలంలో అవి పెద్దగా జరగకపోవడంతో సీరియస్ నెస్ పోయినట్లయింది.

ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగితే మంచిదే. విభజనలో కీలకమైన అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు దాటవేసే ధోరణినే అవలంబించినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఒకరికొకరు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చుకుంటున్నట్లు కనిపించడానికి ఈ సమావేశం జరిగినట్లు అనిపిస్తుంది. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ కు, రేవంత్ కు పరోక్షంగా మద్దతు ఇస్తుంటారు. అలాగే చంద్రబాబును రేవంత్ అప్పుడప్పుడు పొగుడుతుంటారు. చంద్రబాబుకు రేవంత్ అత్యంత సన్నిహితుడు అనే సంగతి బహిరంగ రహస్యమే. అయినా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి కోస్తా తీరంలో వాటా, టీడీపీలో షేర్ అడుగుతామంటూ లీక్ లు ఇచ్చి ఏపీ ప్రభుత్వం తన డిమాండ్లపై గట్టిగా పట్టుబట్టకుండా చేశారన్న భావన కలుగుతుంది.

ప్రత్యేకించి పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని ఆస్తులలో తమకు వాటా రావాలన్నది ఏపీ ప్రభుత్వ వాదన. ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలవారు కలిసి హైదరాబాద్ అభివృద్ది చేసుకున్నారు. అలాగే తెలంగాణతో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా చెల్లించిన పన్నులతో హైదరాబాద్ లో పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరిగిందని, వాటిలో షేర్ ఉంటుందన్నది ఏపీ వాదన. విభజన చట్టంలోని తొమ్మిది, పది షెడ్యూల్ ల లోని ఆస్తుల విభజన ద్వారా ఏపీకి న్యాయబద్దమైన వాటా వస్తుందని ఆశించినవారికి ఈ సమావేశం ఆశాభంగం కలిగించింది.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న ఆస్తులన్నీ తమవేనని ఉద్ఘాటిస్తోంది. హైదరాబాద్ లో సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు ఉంటే, అందులో జనాభా నిష్పత్తి ప్రకారం ఏభై ఎనిమిది శాతం వాటా ఏపీకి వస్తాయని అనుకున్నారు. గతంలో జనసేన అధినేత పవన్  కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల సమావేశం ఏపీకి 75 వేల కోట్ల రూపాయలు రావల్సి ఉందని అంచనా వేసింది. కానీ ఇవేవి చర్చకు వచ్చినట్లు అనిపించదు.

ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్  కల్యాణ్ ఇంత కీలకమైన రెండు రాష్ట్రాల సమావేశానికి రాకుండా తప్పించుకున్నారా? లేక చంద్రబాబు రమ్మనలేదో తెలియదు కానీ ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క ఈ భేటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే, పవన్  కల్యాణ్ అసలు పాల్గొనలేదు. ఈ మధ్యకాలంలో పవన్  కల్యాణ్ ప్రాధాన్యత తగ్గుతోందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రామోజీరావు సంస్మరణ సభలో కేవలం చంద్రబాబు పేరు మాత్రమే వేయడం, ఢిల్లీ టూర్ లో పవన్  కల్యాణ్ లేకుండానే ప్రధాని మోదీని, ఇతరకేంద్ర మంత్రులను చంద్రబాబు ఒక్కరే కలవడం, ఇప్పుడు హైదరాబాద్ లో రెండు రాష్ట్రాల కీలక చర్చలలో పవన్ కు అవకాశం ఇవ్వకపోవడం వంటివి కొన్ని సందేహాలకు అవకాశం ఇస్తున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రధానిని కలవడం గమనార్హం. పవన్  కల్యాణ్ ఇలాంటి అవమానకర ఘటనల విషయంలో పెద్దగా ఫీల్ కాకపోతుండవచ్చు. ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ భేటీ ఎజెండాను ఖరారు చేయడానికి సమావేశం పెట్టారుకానీ ఆయన ఎందువల్లనో పాల్గొనలేదు. ఈ సంగతి పక్కనబెడితే ఇద్దరు సీఎంలు కలిసిన తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడతారని అంతా ఊహిస్తారు. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ మీడియాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేది తెలిసిన సంగతే. కానీ వారు మంత్రులకు ఆ బాధ్యత అప్పగించి వెళ్లిపోయారంటేనే దాని అర్ధం ఈ సమావేశం ఫలప్రదం కాలేదని అనుకోవాలి.

ఒకవేళ ఏ ఒక్కదానిపైన అయినా అవగాహన కుదిరితే దాని గురించి అయినా ఘనంగా చెప్పుకునేవారు. విభజన సమస్యల వల్ల తెలంగాణకు పెద్దగా నష్టం ఏమీ లేదు. ఎటుతిరిగి ఏపీకే ఈ సమస్యల సత్వర పరిష్కారం అవసరం. తద్వారా నిర్దిష్ట మొత్తంలో నిధులు ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏమీ సాధించలేకపోయిందని అనిపిస్తుంది. హైదరాబాద్ ఉమ్మడి ఆస్తుల గురించి తేల్చలేకపోతే చంద్రబాబు అంతటి సీనియర్ నేత వల్ల ఏపీకి ఏమి ఒరిగిందన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ లో భవనాలు ఇవ్వబోమని, కావాలంటే స్థలాలు ఇస్తాం.. బిల్డింగులు కట్టుకోండని రేవంత్ స్పష్టం చేశారంటే అది ఏపీకి నష్టం చేయడానికే ఆయన వెనుకాడడం లేదని అర్దం. దానిని చంద్రబాబు ఖండించలేకపోవడం, ఏపీ వాటా గురించి పట్టుబట్టలేకపోవడం ఆయన బలహీనత అనిపిస్తుంది. లేదా రేవంత్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు గట్టిగా మాట్లాడలేకపోయారని అనుకోవాలి.

అలాగే తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి ఏడువేల కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఏపీ ఫిర్యాదు చేస్తోంది. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రధానికి, హోం మంత్రికి ఫిర్యాదు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు. ఆయా అంశాలపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రింకోర్టుకు కూడా వెళ్లింది. చంద్రబాబు దానిని కొనసాగిస్తారో, లేదో తెలియదు. ఇప్పుడు తెలంగాణ తమకే 24వేల కోట్ల మేర ఏపీ నుంచి రావాలని ఎదురుదాడి చేసింది. అయినా చంద్రబాబు దీనిపై నోరెత్తినట్లు కనిపించలేదు.

పోలవరం ప్రాజెక్టు కింద ముంపు మండలాలుగా ఉన్న ఏడింటిని ఏపీలో కలపడంపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. వాటిలో కనీసం ఐదు గ్రామాలనైనా తమకు తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరుతోంది. దీనికి ఈ చర్చలలో ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించినట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఏపీ అధికారులు అన్నారని కథనం వచ్చింది. దానిని సానుకూలంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఈ అంశంపై లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాదో లో ఉమ్మడి ఆస్తుల విషయంలో తెలంగాణ అంత గట్టిగా ఉన్నా, భద్రాచలం పక్కన ఉన్న గ్రామాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా ఉండడం విమర్శలకు దారితీసే అవకాశం ఉంది.

కృష్ణా జలాలలో తెలంగాణ ప్రభుత్వం అధిక వాటా కోరుతోంది. దానివల్ల ఏపీకి నష్టం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతానికి బాగా ఇబ్బంది వస్తుంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును గతంంల రేవంత్ తన మనుషుల ద్వారా అడ్డుకున్నారు. అలాంటి ముఖ్యమైన సమస్యలు అసలు చర్చకే వచ్చినట్లు లేదు. ఇద్దరు సీఎంల భేటీ ముందడుగు అంటూ టీడీపీ మీడియా ఊదరగొట్టింది కానీ అది ఏ రకంగానో చెప్పలేకపోయింది. పైగా డ్రగ్స్ అంశంలో ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీశారన్న వాదన వినవస్తోంది. డ్రగ్స్ అంశంలో ఇద్దరు డీజీపీలు సహకరించుకుని కఠినచర్యలు తీసుకుంటే అరికట్టవచ్చు. అది దేశ వ్యాప్త సమస్యగా ఉంది.

అయినా ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు అదేదో ఏపీలోనే ఎక్కువగా ఉన్నట్లు మాట్లాడడం దారుణంగా ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ తదితర నగరాలలో ఇది ఎంత పెద్ద సమస్యగా ఉందో చెప్పనక్కర్లేదు. కేవలం రాజకీయంగా వైఎస్సార్‌సీపీపై పిచ్చి ఆరోపణలు చేయడానికి ఇలా ప్రచారం చేసి ఏపీ మంత్రులే రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని చెడగొట్టడం శోచనీయం అని చెప్పాలి. 2017లో టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పట్లోనే ఏపీలో గంజాయి సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీడియాకే చెప్పారు. అయినా టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు గుప్పిస్తారు. ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియకుండా టీడీపీ మంత్రులు మాట్లాడితే రాష్ట్రానికి ఏమి ప్రయోజనం వస్తుంది?

ఏపీ డిమాండ్లకు ముకుతాడు వేయడానికి రేవంత్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొత్త లీకులు ఇచ్చినట్లు అనిపిస్తుంది. కోస్తా తీర ప్రాంతం, ఓడరేవులలో వాటా ఇవ్వాలని, తిరుమల, తిరుపతి దేవస్థానంలో వాటా ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నట్లు మీడియాలో వార్తలు ప్రచారం చేయించింది. అది సంచలనంగా మారింది. ఆ రకంగా ముందరికాళ్లకు బంధం వేయడంతో చంద్రబాబు అసలు కీలకమైన ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు మొదలైన అంశాల గురించి పూర్తి స్థాయిలో ప్రస్తావించలేకపోయారా? అనే సంశయం ఏర్పడుతోంది.

ఇటీవల తెలంగాణ కూడా తన ముఖ్యమే అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు. అందువల్లే ఏపీ డిమాండ్లపై చంద్రబాబు పట్టలేదనిపిస్తుంది. వీటిపై పట్టుబట్టి రేవంత్ ను ఒప్పించలేకపోతే ఏపీకి ఆయన చాలా నష్టం చేసినవారు అవుతారని వేరే చెప్పనవసరం లేదు. అయినా చంద్రబాబుకు ఎల్లో మీడియా అండగా ఉంది కనుక ముందడుగు అని, ఏదో సాధించేశారనో రాయవచ్చుకానీ, వాస్తవరూపంలో ఏపీకి ఒక్క అంశంలో కూడా మేలు జరిగినట్లు అనిపించదు. ఈ మొత్తం ప్రక్రియ చూస్తే రాష్ట్రాల సమస్యల పరిష్కారం కన్నా, వేర్వేరు కూటములకు చెందిన చంద్రబాబు, రేవంత్ లు తాము రాజకీయంగా కలిసే ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చినట్లు అనిపిస్తుంది.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement