AP or TS.. రెండింటిలో ‘సోది బడ్జెట్‌’ ఏది? | KSR Comment On Telugu States 2025 Budgets | Sakshi
Sakshi News home page

AP or TS.. రెండింటిలో ‘సోది బడ్జెట్‌’ ఏది?

Published Sat, Mar 22 2025 12:37 PM | Last Updated on Sat, Mar 22 2025 12:37 PM

KSR Comment On Telugu States 2025 Budgets

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంలో మీడియాలో చాలా హడావుడి ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రికి తగిన ప్రాధాన్యమూ దక్కుతూంటుంది. ఆయా శాఖలకు కేటాయించిన నిధుల మొత్తం, తదితర వివరాలతో పత్రికలు పేజీలకు, పేజీలు వార్తలు, కథనాలు నింపేస్తుంటాయి. ఆ తర్వాత కాలంలో ఈ బడ్జెట్ గురించి కాని, తదుపరి ఆయా శాఖలు పెడుతున్న ఖర్చుల గురించి కాని పెద్దగా ఎవరూ పట్టించుకోరు!. 

కొన్ని రాష్ట్రాలు అసలు ఆచరణ సాధ్యం కాని పద్దులతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెట్టడానికి యత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఆ స్థాయిలో జనాన్ని మాయ చేయడానికి ప్రయత్నించినట్లు కనబడదు. ఉన్నంతలో తాము ఇచ్చిన హామీలకు అనుగుణంగా కొంతమేర అయినా నిధులు కేటాయించాలన్న ఉద్దేశంతో ఆర్థిక  శాఖ మంత్రి మల్లు  భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారనే భావన కలుగుతోంది.

👉ప్రజాకర్షక స్కీములు ఏ స్థాయిలో అమలు చేయాలన్న దానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. అది వేరే సంగతి. కానీ ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చే  వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్ ను పెట్టకపోతే అది మోసం చేసినట్లు అవుతుంది. లేదా అరకొర నిధులు కేటాయించి సరిపెడితే ప్రజలను మభ్య పెట్టడానికి అని అర్థమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రభుత్వాలు పెట్టిన బడ్జెట్‌ను యథాతథంగా అమలు చేయడం. ఎక్కువ సందర్భాలలో బడ్జెట్ లో పేర్కొన్న విధంగా ఖర్చు చేయలేకపోతున్నాయి. దానికి కారణం అవసరమైన నిధులు అందుబాటులో లేకపోవడమే. 

బడ్జెట్ అంచనాలు ఒకరకంగా ఉంటే.. వాస్తవం ఇంకోలా అన్నమాట. ఉదాహరణకు తెలంగాణ బడ్జెట్లో గత ఏడాది రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ అందులో ఆశించిన ఆదాయం కన్నా రూ.70 వేల కోట్లు తక్కువగా వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిరోజులుగా చెబుతున్నారు. అలాంటప్పుడు మళ్లీ గత బడ్జెట్ కన్నా ఐదు శాతం అధికంగా రూ.3.04 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఎలా పెట్టారంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. 

👉ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలకు మాత్రమే సుమారు రూ.80 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయించవలసి ఉండగా, కేవలం రూ.17 వేల కోట్లే కేటాయించారు. తెలంగాణ బడ్జెట్లో వారు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సుమారు రూ.56 వేల కోట్లు, మిగిలిన హామీలకు రూ.34 వేల కోట్లు పెట్టారు. ఇవన్ని అమలు అవవుతాయా? లేదా? అన్న చర్చ కూడా ఉంటుంది. అయినప్పటికీ కనీసం భట్టి బడ్జెట్లో అధిక  కేటాయింపులు చేయడం ద్వారా తమకు చిత్తశుద్ది ఉందనిపించుకునే యత్నం చేశారు. అయినా మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇచ్చే స్కీమ్ వంటి వాటిని బడ్జెట్లో పెట్టలేకపోయారు. అలాగే వృద్దాప్య ఫించన్‌ రూ.నాలుగు వేలు చేస్తామన్న హామీ గురించి కూడా చెప్పలేదు. 

సహజంగానే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు వీటిని ఎత్తి చూపాయి. కాగా ఆరు గ్యారంటీలలో రైతు భరోసా కింద రూ.18 వేల కోట్లు, మహాలక్ష్మి స్కీమ్‌కు రూ.4300 కోట్లు, గృహజ్యోతి, సన్నబియ్యం, కళ్యాణ లక్ష్మి వంటి వాటికి నిధులు కేటాయించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీ ఇప్పటికే నెరవేరిన విషయం తెలిసిందే. ఏపీలో కూడా కూటమి సర్కార్ ఈ ఉచిత బస్ హామీ ఇచ్చింది కానీ బడ్జెట్‌లో దాని ఊసేలేదు. 

👉తెలంగాణలో గత ఏడాది సంక్షేమ పథకాలకు రూ. 47 వేల కోట్లు కేటాయిస్తే, ఈసారి మరో రూ.ఎనిమిది వేల కోట్లు అదనంగా ఇస్తామని చెబుతున్నారు. అప్పులపై రెండు  రాష్ట్రాలు గత ప్రభుత్వాలపై ఆరోపణలు గుప్పిస్తూనే అప్పటికన్నా అధికంగా అప్పులు చేయడానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 70 వేల కోట్ల అప్పులకు ప్రతిపాదిస్తే ఏపీ ఏకంగా రూ.97 వేల కోట్లు అప్పుగా తీసుకోవాలని యోచిస్తోంది. ఏపీలో చంద్రబాబు సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్ల అప్పుతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ స్థాయిలో కాకపోయినా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ కంటే ఎక్కువ అప్పులు చేస్తోందని అంకెలు చెబుతున్నాయి. ఇక ద్రవ్య లోటు రూ. 54 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. మొత్తం బడ్జెట్లో సంక్షేమానికి 34 శాతం పైగా నిధులు కేటాయించారు. ఇక ఆదాయానికి సంబంధించి ప్రభుత్వ భూముల అమ్మకం, మద్యం అమ్మకాలపై వచ్చే పన్నులు, భూముల రెగ్యులరైజేషన్ స్కీమ్ వంటివాటి ద్వారా అధిక మొత్తాలను రాబట్టుకోవాలని ప్రభుత్వం యత్నిస్తోంది. భూముల అమ్మకం ద్వారా రూ.20 వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.

👉గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం కూడా భూముల వేలం పాటలు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకు వెళ్లక తప్పలేదు. హైదరాబాద్ అభివృద్దికి రూ. పదివేల కోట్లు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి, ఇతరత్రా సాగునీటి పథకాలకు రూ.24 వేల కోట్లు కేటాయించడం బాగానే ఉంది. అయితే ఆ నిధులను ప్రభుత్వం అదే రీతిలో ఖర్చు చేసి ఆశించిన ఫలితాలు రాబట్టగలిగితేనే ఉపయోగం. ఫ్యూచర్ సిటీపై కూడా తెలంగాణ  ప్రభుత్వం ఎక్కువ ఆశలు పెట్టుకుంది.  ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ సిటీని రూపొందించడానికి రూ.200 కోట్లు కేటాయించడం కూడా బాగానే ఉంది. 

👉ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా గత ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ స్పీచ్‌లో రాయడం బాగోలేదు. ఏమి విధ్వంసమో చెప్పకుండా, కేవలం డైలాగుల కోసం ప్రభుత్వాలు ఇలా రాస్తున్నట్లు అనిపిస్తుంది. పోనీ అది విధ్వంసం అయితే గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ హామీలు ఎలా ఇచ్చారో చెప్పాలి. అలాగే అప్పటి కన్నా ఇంకా ఎక్కువ అప్పులు తీసుకు రావడాన్ని ఎలా సమర్ధించుకుంటారో అర్థం కాదు. ఏది ఏమైనా ఓవరాల్ గా చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంతలో కొంత ఆయా వర్గాలను సంతృప్తిపరచడానికి యత్నించినట్లు కనిపిస్తుంది. అయినా ఈసారి కూడా అంచనాలకు, వాస్తవ  గణాంకాలకు ఎంతవరకు పొంతన ఉంటుందన్నది సందేహమే.

ఒకప్పుడు బడ్జెట్ పత్రాలను ఎంతో పవిత్రంగా పరిగణించేవారు. కాని రానురాను అవి అంకెల గారడీ పత్రాలుగా మారిపోతున్నాయి. ఏపీ బడ్జెట్ అయితే మరీ సోది పత్రంగా కనిపించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణ బడ్జెట్  ఏపీ కన్నా కొంత బెటర్‌గా ఉంది. 

ఒక కుటుంబమైనా, రాష్ట్రమైనా వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత పెట్టాలి?ఎంత రుణం తీసుకోవాలి? మొదలైన వాటిపై ఒక అవగాహనతో ఉండాలి. కుటుంబంలో యజమాని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అప్పుల పాలైపోవడమో, లేక వృథా వ్యయం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పద్దతిగా వ్యవహరించకపోతే దాని ప్రభావం ప్రజలందరిపై పడుతుంది.  ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మీడియా విశ్లేషిస్తే బాగుంటుంది. 

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement