
62 ఏళ్ల సర్వీసు రెగ్యులర్ ఉద్యోగులకే..!
కాంట్రాక్టు, ఇతర ఉద్యోగులకు వర్తించదు
సాక్షి, అమరావతి: ‘మేం అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసు కాలాన్ని 62 ఏళ్లకు పెంచుతాం..’’ –ఎన్నికల సమయంలో కూటమి పార్టీల వాగ్దానం ఇది. కానీ, ఇప్పుడు ఈ నిబంధన రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ప్రకటించి ఝలక్ ఇచ్చింది. ఎన్నో ఏళ్లుగా పురపాలక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని మోసం చేసింది. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాన్ని ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమే.
ఇలా నియమితులైనవారు ఎన్నో ఏళ్లుగా వివిధ శాఖల్లో సేవలందిస్తున్నారు. అయితే, అత్యధికంగా మున్సిపల్ శాఖలోనే దాదాపు 98 వేల మంది ఉన్నారు. వీరిలో 70 శాతం మంది పైగా 10 ఏళ్లకు మించి సర్వీసు ఉన్నవారే. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వయసు 58, 60 ఏళ్లకు పెంచిన సందర్భంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికీ వర్తింపజేసింది. ప్రస్తుతం వీరి సర్వీసు వయసు 60 ఏళ్ల వద్ద ఉంది. దీనిని 62కు పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో ఎన్నికల సమయంలో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ మేరకు హామీ ఇచ్చారు.
సర్వీసు పెంచలేమన్న ప్రభుత్వం
మున్నిపాలిటీల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సేవలందిస్తున్నారు. కానీ, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కానీ, , గ్రాట్యుటీ, పెన్షన్ వంటివి కానీ లేవు. తమకు ఈ సదుపాయాలు కల్పించాలంటూ 2024 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో చేరి 10 ఏళ్ల సర్వీసు దాటినవారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్‌గా రూ.75 వేలు, ఆపై ఏడాదికి రూ.3 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించి అమలు ప్రక్రియ ప్రారంభించింది.
ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్, కోడ్ రావడంతో సాధ్యం కాలేదు. ఇక ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు తాము అధికారంలోకి రాగానే ఈ సదుపాయాలతోపాటు సర్వీసు కాలాన్ని 62 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. పది నెలలుగా దీని అమలుపై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు సర్వీసు కాలం పెంపు సాధ్యం కాదని ఉత్తర్వులిచ్చింది.
ఇది కూటమి ప్రభుత్వ వంచన
ఆప్కాస్ ద్వారా వేతనాలు పొందుతున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ, కార్మీకుల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాల పొడిగింపు గొంతెమ్మ కోరిక కాదు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరే సేవలందిస్తున్నారు కాబట్టి అదే నిబంధనలు వీరికీ వర్తింపచేయాలి. ఇదే అంశంపై గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే అమలుకు అంగీకరించింది. ఎన్నికల ప్రచారంలో విరమణ వయసును 62కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వానికి పలు దఫాలుగా విన్నవిస్తే ‘పరిశీలిస్తాం’ అంటూ కాలయాపన చేసి ఇప్పుడు సాధ్యం కాదని వంచించారు. గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా సర్వీసు కాలాన్ని 60 ఏళ్లకే కుదించడాన్ని ఖండిస్తున్నాం. ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే తిరిగి ఉద్యమిస్తాం. వైఎస్ జగన్ ప్రభుత్వం మున్సిపల్ కార్మీకులకు రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ కొంత మొత్తం ఇవ్వడానికి అగ్రిమెంట్ చేస్తే.. ఈ ప్రభుత్వం కార్మీకుల సంక్షేమాన్ని పట్టించుకోకపోగా, ఉన్న వాటికే ఉద్వాసన పలికే విధానాలు అనుసరిస్తోంది.
– పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి