outsourcing employees
-
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం నల్ల గొండ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభు త్వం వస్తే ఇక కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని, అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అవుతారని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించడంలో విఫలం కావడం వల్ల అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొ న్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ నాణ్యతలేక కూలిపోతున్నాయని, వాటి మీద విచారణ జరిపించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంద ని కోమటిరెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద విచారణ జరిపిస్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మిత్రపక్షాలు అయినందునే విచారణ చేపట్టడంలేదని ఆరోపించారు. రూ.9 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, దానిలో భాగమైన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. -
‘ఔట్ సోర్సింగ్’ను రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్/లింగోజిగూడ: రాష్ట్రంలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకున్న కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తూ, రాష్ట్రంలోని 2.5 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పొట్టకొట్టుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అరకొరగా వచ్చే జీతాలను సైతం మూడు, నాలుగు నెలలకోసారి చెల్లిస్తున్నారని, కొన్ని సార్లు ఆరేడు నెలలైనా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక అనేక మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లాల నుంచి వ చ్చిన ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పులి లక్ష్మయ్య, కె.సంతోష్, వినోద్, అరుణ్‌కుమార్, నారాయణ, బిందు తదితరులు మాట్లాడారు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్దికరించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పే–స్కేలు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల సర్విసు పూర్తి కాని ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేసి ఆదుకోవాలని అన్నారు. అలాగే 2023 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలు అన్యాయం చేస్తున్నాయి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా, మూడు, నాలుగు నెలలకోసారి ఒకటి, రెండు నెలల జీతాలు చెల్లిస్తున్నారని, మిగిలిన జీతాలను కాంట్రాక్టు ఏజెన్సీలు స్వాహా చేస్తున్నాయని జేఏసీ నేతలు ఆరోపించారు. కొత్త ఏజెన్సీలు వచ్చి అప్పటికే ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయని, రూ.లక్షలు వసూలు చేసి కొత్త వారిని నియమించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత వాళ్లు కొనసాగలంటే మళ్లీ కొత్త ఏజెన్సీలకు భారీ మొత్తంలో లంచాలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. వీఆర్ఏల కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు? వీఆర్ఏల క్రమబద్దికరణలో భాగంగా వారిని పెద్ద సంఖ్యలో తమ శాఖకు కేటాయించారని, దాంతో ఇకపై మీరు విధులకు రావాల్సిన అవసరం లేదని.. నాలుగైదు జిల్లాల్లో పశుసంవర్థక శాఖ ఆఫీస్ సబార్డినేట్లకు స్థానిక అధికారులు తేల్చి చెప్పారని ఈ సమావేశానికి హాజరైన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
జీతాల్లేవ్... రెన్యువల్ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం అల్లాడుతున్నారు. మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాలు మాత్రం అందడం లేదు. అందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 3,650 మంది పనిచేస్తున్నారు. డాక్టరు స్థాయి మొదలు స్టాఫ్ నర్సులు, రేడియోగ్రాఫర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఎల్రక్టీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్స్ తదితర కేడర్ల లో కాంట్రాక్టు ప్రాతిపదికన, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో విధు లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసును ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తారు. ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు సర్విసు కాల పరిమితి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి రెన్యువల్ చేస్తేనే నిధులు విడుదల చేస్తారు. పెండింగ్.. పెండింగ్... ఈ ఏడాది ఏప్రిల్‌లో వైద్య విధాన పరిషత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్విసు రెన్యువల్ ప్రతిపాదనలను ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. సాధారణంగా ఈ ప్రక్రియ వారం నుంచి పది రోజుల్లోగా పూర్తి కావాలి. కానీ ఏప్రిల్ నెలలో సమర్పించిన ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం రాలేదు. ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ఫైలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,650 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్విసు రెన్యువల్ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఏటా ఇదే తంతు... వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో ప్రతి సంవత్సరం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో వేతనాలు అందడంలో ఆలస్యం అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం సర్విసు పునరుద్ధరణే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చొరవ తీసుకోవాలని ఉద్యోగులు మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రాలు సమర్పించారు. -
ఔట్ సోర్సింగ్‌కు సర్దుబాటు షాక్!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఎన్నో ఏళ్లుగా సొసైటీల పరిధిలో పనిచేస్తున్న వారి ఉద్యోగాలకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో)ల సర్దుబాటు రూపంలో ప్రమాదం వచ్చిపడింది. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ.. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొందరిని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో సర్దుబాటు చేయాల్సిందిగా ఆదేశించింది. శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్యను నిర్దేశిస్తూ వారికి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించడంతో చర్యలకు దిగిన ఉన్నతాధికారులు ఖాళీలను బట్టి పోస్టింగులు ఇస్తున్నారు. అయితే ఖాళీగా ఉన్న పోస్టుల్లోనే నియమిస్తున్నారా? లేక తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేస్తున్నారా అనే అంశంపై స్పష్టత లేదు. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో 65 మందికి.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)లో 65 మంది వీఆర్వోలకు ఈ విధంగా పోస్టింగులిస్తూ సొసైటీ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోని వివిధ గురుకుల విద్యా సంస్థల్లో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితర పొస్టుల్లో వారిని సర్దుబాటు చేశారు. ఇలా సర్దుబాటు చేసిన పోస్టుల్లో చాలావరకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులుండడం గమనార్హం. కాగా మిగతా సొసైటీల్లోనూ ఈ విధంగా అతి త్వరలో వీఆర్వోలకు పోస్టింగులిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆందోళనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గురుకుల విద్యా సంస్థల్లో వీఆర్వోల సర్దుబాటుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు దాదాపు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీలో నియమితులైన 65 మంది వీఆర్వోలు శాశ్వత ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాల్సి రావచ్చు. తాజాగా సర్దుబాటైన వీఆర్వోలు తక్షణమే జిల్లా అధికారికి రిపోర్టు చేయాలని ఉత్పర్వుల్లో స్పష్టం చేయడంతో మెజార్టీ ఉద్యోగులు ఇప్పటికే విధుల్లో చేరారు. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా తయారైంది. పది నుంచి పదిహేనేళ్లుగా పనిచేస్తున్న తమను ఒక్కసారిగా విధుల్లోంచి తీసేస్తే భవిష్యత్తు ఏమిటనే ఆందోళన వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వయోభారం కారణంగా కొత్తగా తమకు ఉద్యోగావకాశాలు లభించే పరిస్థితి ఉండదని, అందువల్ల ఒకవేళ తమను ఉద్యోగం నుంచి తొలగించే పరిస్థితి వస్తే ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని వారు కోరుతున్నారు. అయితే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా మిగతా సొసైటీల్లో సైతం ఇదే తరహాలో వీఆర్వోల నియామకాలు చేపట్టే అవకాశం ఉండటంతో, ఆయా సొసైటీల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాం.. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా సొసైటీనే నమ్ముకుని ఉన్న వారిని తొలగిస్తే వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. మానవీయ కోణంలో ఆలోచించి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించకుండా.. వీఆర్వోలను సర్దుబాటు చేయాలి. ఈ అంశాన్ని ఇప్పటికే సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. – సీహెచ్ బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం -
ఔట్ సోర్సింగ్‌లకూ 30% వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీపై ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చేపట్టిన నియామకాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకే వెయి టేజీ కల్పించగా తాజా భర్తీల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ వర్తింపజేయాలని నిర్ణయించింది. డాక్టర్ పోస్టులకు రాత పరీక్ష ఉండకపోవడంతో వారికి వైద్యవిద్యలో వచ్చిన మార్కులకు 70 శాతం, మిగిలిన 30 శాతాన్ని వెయిటేజీగా ఇవ్వనుంది. నర్సులు, ఇతర పారామెడి కల్ సిబ్బంది రాత పరీక్షకు 70 శాతం, వెయిటేజీ 30 శాతం ఇవ్వాలని నిర్ణయిం చింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కొత్తగా చేరబో యే వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీసు రద్దుపైనా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలు స్తోంది. వీటిని ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ ఇటీవలే పంపింది. అనుమతి రాగా నే ఆ మార్గదర్శకాలపై ఉత్తర్వులు వెలువడతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సర్వీస్ నిబంధనల్లో భారీ మార్పులు: కొత్త పోస్టుల భర్తీ నేపథ్యంలో సర్వీస్ నిబంధనల్లో భారీగా మార్పులు చేర్పులు చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయిం చింది. గతంలో స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్ పోస్టుల సమయంలో తలెత్తిన న్యాయపరమైన చిక్కులు ఈసారి తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని భావిస్తోంది. దాదాపు 2 దశాబ్దాల క్రితం తయారైన సర్వీస్ నిబంధనలు నాటి పరిస్థితుల ప్రకారం ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ కోర్సులు, పోస్టుల్లో మార్పులు జరిగాయి. కొత్త కోర్సులు వచ్చాయి. పాత నిబంధనల ప్రకారం కొత్త కోర్సులు చేసినవారు అనర్హులయ్యే పరిస్థితులున్నాయి. దీంతో తాజా పరిస్థితుల ప్రకారం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, ఎవరూ కోర్టులకు వెళ్లే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై కసరత్తు జరుగుతోం దని, సర్కారు ఆదేశాల తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని వైద్య వర్గాలు తెలిపా యి. మరో రెండు వారాల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని అంటున్నారు. -
పర్యాటక రంగానికి ‘స్టార్’ హంగులు
సాక్షి, అమరావతి: విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి జిల్లాలో ఐదు నుంచి ఏడు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో 13 జిల్లాలకు చెందిన పర్యాటక, క్రీడా సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మూడుచోట్ల స్టార్ హోటళ్ల నిర్మాణాలకు పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్టు తెలి పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 50 శాతం హోటళ్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. థాయిలాండ్, మలేషియా, స్విట్జర్లాండ్ వంటి 40 శాతం దేశాలు కేవలం పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు. వీటి తరహాలోనే రాష్ట్ర ఆదాయ వనరుగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చి.. ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా ప్రచారం కల్పిస్తామని, ఇందుకోసం దసరాలోగా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడిం చారు. ఈ సమీక్షలో మంత్రి ఇంకా ఏమన్నారంటే.. పర్యాటకంపై ప్రత్యేక కార్యక్రమాలు ► పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యం అందరికీ తెలిసేలా నెలకు ఒక జిల్లాలో ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం. లోకల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా, రాయలసీమ పర్యాటక సర్క్యూట్లలో ఒక్కో మేనేజర్‌ను నియమించి.. ప్రత్యేక బస్సు నడుపుతూ ఒకటి, రెండు రోజుల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తాం. ► కోవిడ్‌కు ముందు రూ.120 కోట్లు పర్యాటక ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అది రూ.60 కోట్లకు పడిపోయింది. అది కూడా కోవిడ్ ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో భోజన సదుపాయం కల్పించడం వల్ల సమకూరింది. ► పర్యాటకశాఖలో కోవిడ్‌తో మృతిచెందిన 8 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో ఒకే చోట ఐదేళ్లకు మించి పని చేస్తున్న వారికి స్థాన చలనం తప్పదు. త్వరలోనే ఖాళీలు భర్తీ చేస్తాం. సీ ప్లెయిన్లను నడిపేందుకు చర్చలు ► బోట్ల నిర్వహణ సజావుగా సాగేందుకు ఏర్పాటు చేసిన తొమ్మిది కమాండ్ కంట్రోల్ సెంటర్ల మార్గదర్శకాలకు అనుగుణంగా 24 ప్రభుత్వ, 164 ప్రైవేటు బోటు సేవలు ప్రారంభిస్తాం. విశాఖపట్నం, విజయవాడ, నాగార్జునసాగర్, సూ ర్యలంక తదితర ప్రాంతాల్లో సీ ప్లెయిన్లను నడిపేందుకు ఆయా సంస్థలతో చర్చిస్తున్నాం. ► కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘ప్రసాద్’ (పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకం కింద టెంపుల్ టూరిజంలో భాగంగా రూ.50 కోట్లతో శ్రీశైలం ఆలయ అభివృద్ధి చేపట్టాం. మరో రూ.50 కోట్లతో సింహాచల దేవస్థానం అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం. నూతన క్రీడా పాలసీకి సన్నాహాలు గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు నూతన క్రీడా పాలసీని తీసుకొస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే ముసాయిదా సిద్ధమైందని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆమోద ముద్ర వేయిస్తామన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, క్రీడాకారులను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామన్నారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో క్రీడా ప్రాంగణాన్ని ఖేలో ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమీక్షలో ఏపీటీడీసీ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సీఈఓ ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘పొరుగు’ను పట్టించుకోండి సారూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. కార్మిక చట్టాల ప్రకారం అందాల్సిన లబ్ధికి వారు నోచుకోవడం లేదు. కొందరికైతే ప్రతి నెలా ఐదో తేదీలోపు అందాల్సిన జీతం డబ్బులు నెలలు గడుస్తున్నా అందడంలేదు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం, వీటిని అదుపు చేయడంలో యంత్రాంగం విఫలమవుతుండటంతో చివరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. నిర్దేశించిన పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి చేసే అన్ని రకాల పనులను వీరు నిర్వహిస్తారు. పేరుకు బాగానే ఉన్నా.. వేతనాలు, ఇతర సౌకర్యాల విషయంలో అధమమే. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వీరంతా నియమితులు కావడం.. వేతన చెల్లింపులు నేరుగా ఉద్యోగి ఖాతాకు కాకుండా ఏజెన్సీకి ప్రభుత్వం విడుదల చేయడంతో ప్రభుత్వానికి, ఉద్యోగికి మధ్య అంతరం ఎక్కువగా ఉంటోంది. సమస్యలు వస్తే వాటి పరిష్కారంపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టకపోవడం కూడా ఒక కారణమే.. ఏజెన్సీలతో ఇబ్బందులే.. తాత్కాలిక ఉద్యోగ నియామకాల విషయంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉద్యోగంలో చేరే సమయంలో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు సైతం వస్తుండగా.. నెలవారీగా ఇచ్చే వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేయడం, వేతనాల్లో కోతలు విధించడం, ఉద్యోగులకు చేకూరాల్సిన ప్రధాన లబ్ధి ఈఎస్ఐ, పీఎఫ్‌ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ఫలితం ఉండటంలేదు. మరోవైపు ఏజెన్సీలపై జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఫిర్యాదులిచ్చినప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇదివరకు ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగులను టామ్‌కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ) ద్వారా చేపట్టామని, కానీ కాంట్రాక్టు ఉద్యోగుల నిర్వహణ ఇబ్బందులతో ఆ ప్రక్రియను ప్రభుత్వం జిల్లాలకు అప్పగించింది. అయితే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలపై కార్మిక, ఉపాధి కల్పన శాఖకు అజమాయిషీ లేదని ఆ శాఖ సంచాలకుడు కేవై నాయక్ చెబుతున్నారు. యాదాద్రిలో టీమ్.. కరీంనగర్లో వారధి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిర్వహణ ప్రక్రియ యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాల్లో భిన్నంగా ఉంది. ఇందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేకంగా టీమ్ (తెలంగాణ ఎంప్లాయీస్ అసిస్టెన్స్ మిషన్) పనిచేస్తుండగా.. కరీంనగర్ జిల్లాలో వారధి అనే సొసైటీ ఉంది. వీటికి ఆయా జిల్లాల కలెక్టర్లు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇందులో ఉంటారు. ఆయా జిల్లాల పరిధిలో ఏ శాఖకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు అవసరమైనా.. ఈ సంస్థలు ఎంపిక చేస్తాయి. ఈ ఉద్యోగాల్లో కూడా మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేస్తున్నామని టీమ్ సంస్థ సభ్య కార్యదర్శి శ్రీనివాసుల వెంకట రంగయ్య చెబుతున్నారు. అలాగే వేతన చెల్లింపులు, పీఎఫ్, ఈఎస్ఐ ప్రక్రియంతా నిర్దేశించిన గడువు నాటికి కచ్చితంగా చెల్లించడమే తమ బాధ్యత అని వారధి సభ్య కార్యదర్శి గాదె ఆంజనేయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పద్ధతే పాటిస్తే బాగుంటుందని పలువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్‌గా ఉంటూ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఇప్పటికే ఉన్నా.. చాలాచోట్ల ఆ కమిటీలు యాక్టివ్‌గా లేవని సమాచారం. ఏపీలో ఇలా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ సర్వీసుల విషయంలో మరింత ముందుంది. నియామకాల్లో మధ్యవర్తిత్వం లేకుండా పూర్తి పారదర్శకత, వేతన చెల్లింపుల్లో కచ్చితత్వం, ఉద్యోగులకు కలగాల్సిన లబ్ధిని పక్కాగా అందించాలనే లక్ష్యంతో ఆప్కోస్ (ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సర్వీసెస్) పేరిట ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను ఈ కార్పొరేషన్ ద్వారా నియమిస్తున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. -
వచ్చే నెల 1నే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. వచ్చే నెల 1నే వారికి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెలా ఒకటినే వారికి జీతాలు ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డేటా సక్రమంగా ఉందా, లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ట్రెజరీ అధికారులను శనివారం ప్రభుత్వం ఆదేశించింది. ► ఇచ్చిన మాట మేరకు సీఎం వైఎస్ జగన్ ఈ నెల 3న ప్రత్యేకంగా ఔట్సోర్సింగ్ కార్పొరేషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ► ఈ నెల 3 నాటికి 50 వేలకు పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చారు. ► కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులకు వచ్చే నెల 1 నుంచి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా వేతనాలను చెల్లించనున్నారు. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించి కార్పొరేషన్ సమర్పించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డేటాను పే అండ్ అకౌంట్ ఆఫీసర్లు పరిశీలించాల్సిందిగా ట్రెజరీ, అకౌంట్స్ డైరెక్టర్ ఆదేశించారు. ► జిల్లా కార్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూషన్స్కు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డేటాను జిల్లా ట్రెజరీ అధికారులు పరిశీలించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ► ఆయా పోస్టులకు విద్యార్హతలతోపాటు కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలన్నారు. ఆర్థిక శాఖ అనుమతితోనే ఉద్యోగులను తీసుకున్నారా, లేదా, మంజూరైన పోస్టుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారా, లేదా చూడాలని సూచించారు. ► డేటాను పూర్తిగా పరిశీలించి జిల్లా ట్రెజరీల డిప్యూటీ డైరెక్టర్లు నివేదికను వచ్చే నెల 9లోగా ఆన్లైన్లో పంపించాలన్నారు. ఇక నియామకాలు కార్పొరేషన్ ద్వారానే.. ► ఇక ప్రభుత్వ రంగంలో ఏ శాఖ లేదా సంస్థకైనా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అవసరమైతే ఈ కార్పొరేషన్ ద్వారానే తీసుకోనున్నారు. దీని వల్ల ఏజెన్సీలు, దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు. ► గతంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కావాలంటే అభ్యర్థులు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అలాగే జీతాలకు ఆ ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు ఇచ్చేది. ఏజెన్సీలు ఉద్యోగులకు జీతం పూర్తిగా ఇవ్వకుండా మిగుల్చుకునేవి. ► ఇప్పుడు ఉద్యోగాలకు, జీతాలకు పైసా లంచం లేకుండా పూర్తి పారదర్శకంగా కార్పొరేషన్ నిర్వహించనుంది. ► వివక్షకు తావులేకుండా 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వడంతోపాటు, వాటన్నింటిలో 50 శాతం మహిళలకు ఇవ్వనున్నారు. ► అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఈఎస్ఐ, ఈపీఎఫ్‌ను కార్పొరేషన్ సక్రమంగా నిర్వహించనుంది. -
‘భగీరథ’ గుట్టపై కలకలం
గజ్వేల్: మిషన్ భగీరథ పథకానికి కేంద్ర బిందువుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ప్రాంతం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండ మిషన్ భగీరథ గుట్టపై సోమవారం కలకలం రేగింది. తమను విధుల నుంచి తొలగించారని ఆగ్రహంతో ఉన్న భగీరథ పథకం ఔట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లేలా తమ నిరసనకు వ్యూహాత్మకంగా గజ్వేల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 200 మందికిపైగా ఉద్యోగులు వివిధ దారుల్లో తరలివచ్చి ఒక్కసారిగా మిషన్ భగీరథ హెడ్‌వర్క్స్‌కు చేరుకొని మెరుపు ఆందోళనకు దిగారు. ఓవర్‌హెడ్ ట్యాంకులపైకి ఎక్కి తమను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. సుమారు ఏడు గంటలకుపైగా ఈ ఆందోళన కొనసాగడంతో పోలీసు, రెవెన్యూ, మిషన్ భగీరథ అధికారులు ఉరుకులు, పరుగులు పెటాల్సి వచ్చింది. రాత్రి 7 గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఆ తర్వాత పోలీసులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నచ్చజెప్పి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చూస్తామని, ఆందోళన చేపట్టినందుకు కేసులు ఉండవని హామీ ఇవ్వడంతో వారు స్వచ్ఛందంగా ట్యాంకుల పైనుంచి కిందకు దిగారు. ఆ తర్వాత వారందరినీ బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో.. మిషన్ భగీరథ పథకంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేయడానికి 2015లో రాష్ట్రవ్యాప్తంగా 709 మందిని ఎంపిక చేశారు. ఇందులో 662 మంది వర్క్ ఇన్స్పెక్టర్లుగా, 47 మంది జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. వీరి పోస్టులను ఏడాదికోసారి రెన్యువల్ చేస్తుంటారు. ఈసారి మార్చి 31న వీరిని రెన్యువల్ చేయాల్సి ఉండగా అది జరగలేదు. జూన్ 30 వరకు అలాగే విధుల్లో కొనసాగించారు. ఆ తర్వాత జూలై 1 నుంచి విధుల్లోకి రావొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ పరిణామంతో ఆందోళనకు గురైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ రూపాల్లో తమ నిరసనను కొనసాగిస్తున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. తమను యథాతథంగా విధుల్లో కొనసాగించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తే కనీసం ఈ ఏడాదైనా కొనసాగించి వచ్చే ఏడాది తొలగించాలని చెబుతూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి వీరికి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ సమస్యను తెలపాలన్న భావనతో వ్యూహాత్మకంగా గజ్వేల్‌ను ఆందోళనకోసం ఎంచుకున్నారు. -
నిమ్స్‌లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆస్పత్రిలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న అకౌంటెంట్లు, క్లర్కులు శుక్రవారం కోఠి పబ్లిక్ హెల్త్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కోవిడ్ కాలంలో తీవ్ర పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు. తమ జీతాలు పెంచకపోతే వచ్చే నెల నుంచి సమ్మెకు వెళతామని హెచ్చరించారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలోనూ తమకు సరిగా జీతాలు చెల్లించడం లేదని అక్కడి పారామెడికల్, టెక్నికల్ సిబ్బంది ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అటు గాంధీ ఆస్పత్రిలోనూ ఔట్ సోర్సింగ్ నర్సులు ఆందోళనకు దిగగా ప్రభుత్వం వారు కోరిన పలు డిమాండ్లు నెరవేర్చేందుకు అంగీకరించడంతో సమ్మె ఆలోచన విరమించి తిరిగి విధుల్లోకి చేరారు. (ఔట్ సోర్సింగ్ నర్సులకు రూ.25 వేల వేతనం) (కరోనా కోరల్లో నిమ్స్!) -
ఔట్ సోర్సింగ్ నర్సులకు రూ.25 వేల వేతనం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడ్డ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ నర్సుల వేతనాలను రూ.25 వేలకు పెంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అదేవిధంగా పనిచేసిన రోజున రూ.500 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని భావిస్తోంది. వేతనాల పెంపను కోరుతూ గాంధీ ఆస్పత్రిలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన సరికాదని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూనే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో స్పందించిన ప్రభుత్వం వేతన పెంపుతో పాటు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కోవిడ్–19 ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూడా పనిచేసిన రోజున రూ.300 ప్రోత్సాహకం ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం వెలువడే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ బాధితులకు ఇబ్బంది కలగకూడదని సమ్మె విరమిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. వెంటనే విధుల్లో చేరనున్నట్లు తెలిపింది. -
గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వం చేపట్టిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. నర్సులకు 17,500 నుంచి 25 వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కరోనా డ్యూటీ చేస్తున్న వారికి డైలీ ఇన్సెంటివ్‌ల కింద రూ.750 ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టులోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. నాల్గవ తరగతి ఉద్యోగులకు రోజుకు 300 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాటు ఇకపై వారికి 15 రోజులు మాత్రమే డ్యూటీ ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆందోళన విరమిస్తున్నట్లు నర్సులు ప్రకటించారు. (గాంధీలో నిరవధిక సమ్మె) చదవండి: ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం -
గాంధీలో కొనసాగుతున్న సమ్మె..
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వద్ద ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ధర్నా రెండో రోజు కొనసాగుతోంది. సెక్యూరిటీ, శానిటైజేషన్, ఫోర్త్ క్లాస్ పేషేంట్ కేర్ సిబ్బంది విధులు బహిష్కరించారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా నిరవధిక సమ్మెలో 600 మంది నర్సులు పాల్గొన్నారు. దీంతో కరోనా పేషెంట్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విధులకు హాజరు కావాలని, సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం కోరినా ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్లో చేరమని చెబుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి గాంధీలో నిరవధిక సమ్మె
గాంధీ ఆస్పత్రి: కోవిడ్–19 నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి నిరసన సెగ తగిలింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా ప్రభుత్వం, వైద్య ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, ఏఐటీయూసీ ప్రతినిధులతోపాటు గాంధీ సిబ్బంది జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో సమావేశం నిర్వహించి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల రెగ్యులరైజ్ ప్రధాన డిమాండ్‌తో పాటు సమాన పనికి సమాన వేతనం నినాదంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. ఇదిలాఉండగా మంగళవారం ఉదయం నుంచి ఆందోళనకారులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆస్పత్రి లోపల, బయట తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 212 మంది నర్సింగ్ సిబ్బంది గత 5 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మమ్మల్ని పట్టించుకోవట్లేదు..: ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు రూ.34 వేల వేతనం, ఇన్సెంటివ్స్, బీమా సౌకర్యం కల్పించాలని గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కాంట్రాక్టు నర్సింగ్ యూనియన్ ప్రతినిధులు సుజాతరెడ్డి, మేఘమాల, ఇందిర, సరళ, మధులతలు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ‘నాల్గవ తరగతి ఉద్యోగులను, 300 ఓసీఎస్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి. పారిశుధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్ల వేతనాలు రూ.20 వేలకు పెంచాలి’అని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఐఎన్టీయూసీ గాంధీ యూనిట్ అధ్యక్షుడు శివకుమార్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, నిరవధిక సమ్మె విషయం తన దృష్టికి రాలేదని గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. బెడ్లపైనే మృతదేహాలు.. డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆస్పత్రిలో పనిచేస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగులు, వార్డు బాయ్స్, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు, పేషెంట్ కేర్ టేకర్లు మంగళవారం మూకుమ్మడిగా విధులు బహిష్కరించడంతో చికిత్స పొందుతున్న సుమారు 900 మంది కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వార్డుల్లో పారిశుధ్య లోపంతో తీవ్ర దుర్వాసనల మధ్య వైద్యులు విధులు నిర్వహించారు. చికిత్స పొందుతూ మరణించిన రోగుల మృతదేహాలను మార్చురీకి తరలించేందుకు అవకాశం లేకపోవడంతో గంటల తరబడి బెడ్లపైనే పడున్నాయి. -
ఉద్యోగ భద్రత.. సర్కారు బాధ్యత
మహారాణిపేట(విశాఖ దక్షిణ): అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు దశాబ్దాలుగా ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నారని, వారి భద్రతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేశారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కార్పొరేషన్ ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆయన మాట్లాడారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు దళారీ వ్యవస్ధ కారణంగా ఎంతో మంది మోసపోయారని, అటువంటి అన్యాయాలు, అక్రమాలు భవిష్యత్తులో జరగకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 వేల మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారని, జిల్లా వ్యాప్తంగా 3617 మందికి మేలు కలుగుతుందని చెప్పారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని వివరించారు. రిజర్వేషన్లు, మెరిట్, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అన్ని బెనిఫిట్స్‌తో అవకాశం కల్పిస్తామన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా యువత హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. ఉద్యోగులు మరింత నిబద్ధతతో పని చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీ న జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. స్పందన కార్యక్రమానికి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే స్కిల్డ్, సెమి స్కిల్డ్, ఆన్‌స్కిల్డ్ అభ్యర్థులను ఎప్పటికప్పుడు కార్పొరేషన్‌కు రిఫర్ చేస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ సదుపాయాలు సక్రమంగా అమలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు యు.వి.రమణమూర్తిరాజు, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పెట్ల ఉమాశంకర్‌గణేష్, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సిహెచ్.సుబ్బిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పలువురు ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఇక కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ అవుట్ సోర్సింగ్ సరీ్వసెస్ కార్పొ రేషన్ ద్వారా ఇక నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ప్రభుత్వ శాఖ లకు అవసరమైన ఖాళీలను రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తాం. ఏపీసీవోఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోస్టుల భర్తీ కమిటీకి కలెక్టర్ ఎక్స్ అఫీషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గాను, మెంబర్ కనీ్వనర్‌గా జిల్లా జాయింట్ కలెక్టర్ ఉంటారు. – సిహెచ్.సుబ్బిరెడ్డి, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.. నాలుగేళ్లుగా లీగల్ మెట్రాలజీ శాఖలో పని చేస్తున్నా. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క సారి జీతాలు సక్రమంగా అందేవి కావు. గట్టిగా అడిగితే ఉద్యోగం పోతుందేమోనని భయం ఉండేది. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దయతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటైంది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతం వస్తుందన్న నమ్మకం కలిగింది. ముఖ్యమంత్రి నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – ఎస్.శివశంకర్, డ్రైవర్ జీతాలు పెరుగుతాయి.. జీతాలు పెంచాలని ఎన్నో సార్లు గతంలో వినతి పత్రాలు అందించాం. నాకు నెలకు రూ.13,500 జీతం వస్తోంది. నా కుటుంబ పోషణకు సరిపోడం లేదు. పని ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లింపులు చేయడం చాలా మంచిది. దీని వల్ల జీతాలు పెరుగుతాయన్న నమ్మకం కలుగుతోంది. సీఎం వైఎస్ జగన్‌ను అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. – బి.శ్రీనివాసరావు, రుషికొండ టూరిజం ఉద్యోగి -
చర్చలు విఫలం..
గాంధీఆస్పత్రి: గాంధీఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్‌నర్సులు బుధవారం వైద్యాధికారులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మెకొనసాగుతుందని, గురువారం వైద్య మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసిపరిస్థితిని వివరిస్తామని అవుట్ సోర్సింగ్ స్టాఫ్‌నర్సుల యూనియన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా పదమూడేళ్లుగా గాంధీ ఆస్పత్రిలో 212 మందిస్టాఫ్‌నర్సులు అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని కోవిడ్ నోడల్ కేంద్రంగా ప్రకటించడంతోవారంతా ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోరెగ్యులరైజ్ చేయాలని లేకుంటే ప్రభుత్వం తరపున కాంట్రాక్టు పద్ధతిలోనైనా తమను తీసుకోవాలని కోరుతూ బుధవారం బహిష్కరించారు. ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు మేఘమాల, లక్ష్మీ, ఇందిర, ప్రమీలలు డీఎంఈ రమేష్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌తో మాట్లాడారు. ఇటువంటి తరుణంలో విధులు బహిష్కరించడం తగదని, రెగ్యులరైజ్, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం తమ చేతుల్లోలేదని, ప్రభుత్వం నిర్ణయిస్తుందని అధికారులు స్పష్టం చేయడంతో యూనియన్ ప్రతినిధులు బయటకు వచ్చి చర్చలు విఫలం అయినట్లు ప్రకటించారు. విధులకు హాజరుకాకుంటే టెర్మినేట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు షిఫ్ట్‌ల్లో 150 మంది రెగ్యులర్ నర్సింగ్ సిబ్బంది గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 200మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించడంతో రెగ్యులర్ సిబ్బంది 150 మంది మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. బుధవారం 18 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్‌నర్సులు విధులకు హాజరయ్యారని, మిగిలిన వారంతా బహిష్కరించారని వివరించారు. కోవిడ్ బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామన్నారు. -
గాంధీ ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది సమ్మె
సాక్షి, సికింద్రాబాద్: కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో బుధవారం నుంచి విధులను బహిష్కరించనున్నట్లు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు మంగళవారం సమ్మె నోటీస్ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రెగ్యులరైజ్ చేయాలని లేదా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 13 ఏళ్లుగా 200 స్టాఫ్‌నర్సులు అవుట్ సోర్సింగ్ పద్ధతిని విధులు నిర్వహిస్తున్నారు. ప్రతినెల వేతనాలు కూడా సక్రమంగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రాణాలకు తెగించి కోవిడ్ విధులు నిర్వహిస్తున్న తమ సేవలను ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు గుర్తించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రూ.17,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు రూ.7,500 ఇన్సెంటివ్ ప్రకటించిన ప్రభుత్వం తమకు కంటితుడుపు చర్యగా కేవలం 10 శాతం ఇన్సెంటివ్ ప్రకటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ స్టాఫ్‌నర్సులకు రూ.23,000 ఇవ్వాల్సి ఉన్నా నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న కొందరికి మాత్రమే అది వర్తింపజేస్తున్నారని చెప్పారు. తక్షణమే తమను రెగ్యులరైజ్ చేయాలని లేదా కాంట్రాక్టు పద్దతిలో విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం గాంధీ ఆస్పత్రి ఇన్‌వార్డులో సమ్మె నోటీస్ అందించినట్లు అవుట్ సోర్సింగ్ స్టాఫ్‌నర్సుల యూనియన్ ప్రతిని ధులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్‌లో 200, రెగ్యులర్ స్టాఫ్‌నర్సులు 150 మంది విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది విధులు బహిష్కరిస్తే కోవి డ్ విధులకు తీవ్ర ఆటంకం కలగవచ్చని ఆస్పత్రికి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఇది చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం -
కరోనా దెబ్బతో ఊడిన ఉద్యోగాలు
సాక్షి, కరీంనగర్: అవును.. వారు రోడ్డునపడ్డారు. కరోనా ప్రభావం.. నిధుల లేమి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారింది. ఈ మేరకు ఉద్యాన శాఖలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే నుంచి విధుల్లోకి రావొద్దని స్పష్టం చేయగా, 15 ఏళ్లుగా సేవలందిస్తున్న సదరు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వయసు పైబడటం.. ఇతర మార్గాలు లేకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15 కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఉద్యానశాఖలో అమలయ్యే పథకాలకు సర్కారు ఇచ్చే వార్షిక బడ్జెట్లో 5 శాతం నిధులను ఉద్యోగుల జీతభత్యాలకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం.. ఏడాదిగా కొత్త పథకాలు లేకపోవడంతో వీరి సేవలు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. పైగా లాక్డౌన్ తోడవడంతో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మే 1 నుంచి విధులకు హాజరు కానక్కర్లేదని సదరు ఔట్‌సోరి్సంగ్ ఏజెన్సీకి జిల్లా అధికారులు సమాచారమిచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఉద్యాన విస్తరణాధికారులు, అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్ ఉద్యోగాలు పోయినట్లే. దశాబ్దానికిపైగా సేవలు.. ఉద్యాన పంటల సాగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తొలి 5 స్థానాల్లో ఉంది. సాధారణ పంటలకు సమీపంగా ఈ పంటలను పండిస్తున్నారు. ఏటా దాదాపు 75 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూలతోటలను సుమారు 53 వేల మంది రైతులు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత ఎక్కువ మొత్తంలో మామిడి దిగుబడి ఉమ్మడి జిల్లాలోనే ఉంది. ఇతర జిల్లాల ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతటి కీలకమైన విభాగంలో ఉద్యోగులను తొలగించడంతో ఉద్యాన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శాఖలో కరీంనగర్ జిల్లాలో జిల్లా అధికారి, ముగ్గురు ఉద్యాన అధికారులు మాత్రమే ఉన్నారు. ఉద్యాన అధికారులు ఒక్కొక్కరూ ఆరేడు మండలాల వ్యవహారాలను చూస్తున్నారు. సుమారు 15 ఏళ్ల కిందట ఉద్యాన విస్తరణా«ధికారులను ఔట్‌సోరి్సంగ్ విధానంలో విధుల్లోకి తీసుకున్నారు. వీరు ప్రస్తుతం ఒక్కొక్కరు మూడు, నాలుగు మండలాల పరిధిలో సేవలందిస్తున్నారు. ఉన్నపళంగా వీరిని తొలగించడంతో రైతులకు ఇబ్బందే. ఆరు నెలలుగా అందని వేతనాలు.. ఉద్యాన శాఖకు కేటాయించే నిధులతోనే ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంటారు. బిందు, తుంపర సేద్యం, పందిరి తోటలు, షెడ్‌నెట్ ఇతరత్ర పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం.. లబి్ధదారులకు సకాలంలో సేవలందేలా చూడటంలో వీరి బాధ్యత గత నవంబర్ నుంచి వీరికి వేతనాలు రాకపోగా ఉద్యోగాల నుంచి తొలగింపు ఉత్తర్వు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న రోజుల్లో నీటిని పొదుపుగా వాడుకునేలా.. ఉద్యాన పంటలను ప్రొత్సహించేలా చర్యలుంటాయన్న సమాచారంతో తమ ఉద్యోగాలకు భరోసా ఉంటుందని వేతనాల్లేకున్నా విధులు నిర్వహిస్తున్నామని ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని, మే నుంచి విధులకు రావొద్దని ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులకు చెప్పామని ఉద్యాన శాఖ అధికారి తెలిపారు. -
అంతా మా ఇష్టం
‘కరీంనగర్ నగరపాలక సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరిన ఓ ఒప్పంద ఉద్యోగి తరువాత కమిషనర్ సీసీగా వెళ్లాడు. ఇటీవల కార్యాలయంలో విధులను పక్కకుపెట్టి లైక్ వీడియోలు చేయడం వైరల్‌గా మారింది. దీంతో తనను బదిలీ చేస్తారని ముందుగానే గమనించిన సదరు ఉద్యోగి ‘కమిషనర్ పేషీ సీసీ’ అని ఓ కొత్త పోస్టును సృష్టించుకుని కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు. కాగా వీడియోల వ్యవహారంపై ఇంతవరకు శాఖాపరమైన చర్యలు కానరాలేదు. సాధారణంగా మున్సిపల్ కమిషనర్లకు ఒక్కరే సీసీ పనిచేస్తారు. కరీంనగర్ నగరపాలకలో మాత్రం ఇద్దరు సీసీలు ‘ఇష్టా’రాజ్యం ఏలుతున్నారు.’ సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, ప్రజాసమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు ఔట్‌సోరి్సంగ్ పద్ధతిన సిబ్బ ందిని నియమిస్తారు. కొన్నేళ్లపాటు కాలపరిమితిని ఏర్పరుచుకుని విధులు అప్పగిస్తారు. కాలపరిమితి పూర్తవ్వగానే తప్పుకోవాల్సి ఉంటుంది. కాగా కరీంనగర్ నగరపాలక సంస్థంలో ఔట్‌సోరి్సంగ్ సిబ్బంది రాజ్యమేలుతున్నారు. వీరిని కార్యాలయ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ‘అంతా మాఇష్టం’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇష్టారీతిన కొలువులు కేటాయించుకుంటున్నారు. అక్కడ ఇబ్బంది ఏర్పడితే తమకు నచ్చిన పోస్టింగ్‌లను వారే సృష్టించుకుని విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఒకశాఖలో ఉద్యోగులు పరిమితికి మించి ఉన్నా.. వారికి పదోన్నతి కల్పించాలన్నా.. బదిలీ చేయాలన్నా.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత ఉన్నతాధికారులు ఆయా సిబ్బందికి శాఖలు కేటాయించి విధులు అప్పగించాల్సి ఉంటుంది. అయితే కరీంనగర్ నగరపాలక సంస్థలో ఈ నిబంధనలు ఏమీ అమలు కావడం లేదు. అంతా ఔట్‌సోరి్సంగ్ రాజ్యమే నడుస్తోంది. ఫలితంగా సదరు ఉద్యోగుల కాలపరిమితి ముగుస్తుందని ముందుగానే గ్రహించి, అదే కార్యాలయంలో మరో పోస్టును సృష్టించుకుని కొత్తగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందిస్తున్నారా అంటే అదీ శూన్యమే. ఆడింది ఆట.. పాడింది పాట కరీంనగర్ కార్పొరేషన్లో ఎక్కువగా ఔట్‌సోరి్సంగ్ ఉద్యోగులే. వీరిలో కొందరు మాత్రమే నిబద్ధతతో పనిచేస్తే.. చాలా మంది ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమకు కేటాయించిన విధులు నిర్వహించకుండా ‘టైంపాస్’ ఉద్యోగం చేస్తున్నారనే ప్రచారం ఉంది. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో కనీస మర్యాద పాటించకుండా దురుసుగా వ్యవహరిస్తున్నానేది బహిరంగ రహస్యం. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులపై అజమాయిషి చెలాయిస్తూ.. కిందిస్థాయి సిబ్బందికి వీరే విధులు కేటాయించడం విశేషం. కార్పొరేషన్లో 249మంది ఉద్యోగులు.. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం పోస్టులు 497. 249మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 248పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఔట్‌సోరి్సంగ్ ద్వారా శానిటేషన్‌లో 857 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 260మంది, టౌన్ ప్లానింగ్‌లో 30 మంది, మెప్మాలో ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఏళ్లకాలంగా ఒకే విభాగంలో పాతుకుపోయారు. దీంతో బదిలీపై వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను వీరు కంట్రోల్ చేస్తున్నానే ప్రచారం సాగుతోంది. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు అంతర్గత బదిలీలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. సీసీల బదిలీలు మాకు తెలియకుండా జరగవు. కార్పొరేషన్ ఇతర విభాగాలపై విచారణ చేస్తాం. సిబ్బందిని అవసరమైన చోట వినియోగిస్తాం. కొన్ని విభాగాల్లో అధికంగా సిబ్బంది ఉన్న విషయంపై విచారణ చేస్తాం. – వల్లూరి క్రాంతి, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సొంతంగా ఏర్పరుచుకున్న పోస్టులు కొన్ని.. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ సీసీగా ఉన్న వ్యక్తి మొదట కంప్యూటర్ ఆపరేటర్‌గా ఔట్‌సోరి్సంగ్ విధానంలో ఉద్యోగంలో చేరాడు. ఆ పోస్టుకు కాలపరిమితి ముగుస్తుందని తెలిసి సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ అనేపోçస్టును సృష్టించుకుని చేరిపోయాడు. అయితే రాష్ట్రంలో ఎక్కడాకూడా సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు లేవు. అదీ ముగుస్తుందని తెలిసి ప్రస్తుతం కమిషనర్ సీసీగా చేరాడు. శానిటేషన్ విభాగంలో కీలకమైన ఎన్విరాల్మెంట్ ఇంజినీర్ పోస్టుకు డిప్యూటీ ఈఈ క్యాడర్ కేటాయించారు. తాత్కాలిక ఒప్పంద పద్ధతిలో ఓ ఉద్యోగిని తీసుకుని ఎన్విరాల్మెంట్ ఇంజినీర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఆ స్థానానికి రెగ్యులర్ ఉద్యోగిని కేటాయించారు. అదే పోస్టులో తాత్కాలిక ఉద్యోగి సైతం కొనసాగుతుండం విశేషం. డిప్యూటీ ఈఈ నామమాత్రంగా మారి టెండర్లు పిలవడానికి పరిమితమయ్యాడని ప్రచారం జరుగుతోంది. శానిటేషన్ విభాగంలో కీలకమైన పోస్టుకు అధికారి ఉండగా.. ఒప్పంద ఉద్యోగిని కొనసాగించడం మన కార్పొరేషన్‌కే చెల్లింది. కార్పొరేషన్ విద్యుత్ విభాగంలో వీధిలైట్లను ఓ ప్రైవేట్ కంపెనీ పర్యవేక్షిస్తోంది. వీధిదీపాల మేయింటనెన్స్‌కు ఏఈ, డీఈతో పాటు 13మంది ఔట్‌సోరి్సంగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగులు సూపర్వైజర్ పోస్టులు సృస్టించుకుని ‘లీడర్షిప్’ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఫిల్టర్‌బెడ్‌లో ఒక ఇన్చార్జితో పాటు ఐదుగురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేసేవారు. 15ఏళ్ల నుంచి ఫిల్టర్‌బెడ్ పనితీరులో ఎలాంటి మార్పులు రాలేదు. ఉద్యోగుల మాత్రం ఐదునుంచి 15కు పెరిగారు. వాటర్‌బెడ్‌లో నాలుగు నుంచి ఐదుగురు మాత్రమే విధులు నిర్వహించడానికి అవకాశముంది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 12 మంది ఔట్‌సోరి్సంగ్ సిబ్బంది విధులు నిర్వహించడం విశేషం. -
ఒకటో తేదీనే జీతం
కాంట్రాక్ట్.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన వెతలు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా శాశ్వత ఉద్యోగుల మాదిరి ఒకటో తేదీనే జీతం ఇచ్చేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్నాళ్లూ మూడు, నాలుగు నెలలకోసారి జీతం తీసుకునే చిరుద్యోగులు ఇకనుంచి ఒకటో తేదీనే వేతనం అందుకోనున్నారు. సాక్షి, అనంతపురం: ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి వేతన వెతలు తీరుస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో దాదాపు 21,250 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఏ ఒక్క శాఖలోనూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సక్రమంగా జీతాలు తీసుకోలేదు. రెండు నెలలు మొదలుకొని ఆరేడు నెలలకు కూడా జీతాలు మంజూరు కాని పరిస్థితి ఉండేది. దీంతో తక్కువ వేతనంతో పని చేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి బాధలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా ఒకటో తేదీనే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేశారు. గతంలో బడ్జెట్ ఉంటేనే జీతం గతంలో వివిధ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే ప్రత్యేక బడ్జెట్ రావాల్సి ఉండేది. బడ్జెట్ వచ్చినప్పుడే వారికి జీతాలు చెల్లించేవారు. దీంతో ఒక్కోసారి ఆరు నెలలైనా జీతం అందక చిరుద్యోగులు అల్లాడిపోయేవారు. కుటుంబ పోషణకు అప్పులు చేసి వాటిని తీర్చేందుకు నానా తిప్పలు పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆ పరిస్థితి ఉండదు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా జీతాలు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారమైతే ఒకటో తేదీ రాగానే జీతాలు చెల్లిస్తారు. బీసీ హాస్టళ్ల కార్మికులకు ఆరునెలల జీతాలు జమ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పని చేస్తున్న నాల్గో తరగతి (కుక్, కమాటి, వాచ్‌మన్) ఉద్యోగులు ఆరునెలల జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 128 మంది నాల్గో తరగతి ఉద్యోగులుగా పని పనిచేస్తుండగా.. మార్చి వరకు మాత్రమే జీతాలు పడ్డాయి. బడ్జెట్ లేక ఏప్రిల్ నుంచి బకాయిలు పేరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రెండు రోజుల కిందట ఆరునెలల జీతాల సొమ్మును చెల్లించారు. దాదాపు రూ. 96 లక్షల మేర ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు. చదవండి : కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ -
ఉద్యోగుల ‘వేదన’ బతుకులు
సాక్షి, చిత్తూరు : ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రైవేటు ఉద్యోగులనే తేడా ఉండదు. అందరూ సమానమే. ఎప్పుడు చూసినా వీడియో కాన్ఫరెన్సులు, టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తుంటారు. విజయవాడలోని ప్రధానశాఖ నుంచి రిపోర్టులు పంపమని ఆదేశాలు జారీచేస్తుంటారు. ప్రభుత్వ పథకాలను టీడీపీకి లబ్ధిచేకూర్చే పథకాలుగా మార్చేస్తుంటారు. వాటిపై ప్రచారాలు చేయాలంటూ చిరుద్యోగులపై ఒత్తిడి పెంచేస్తుంటారు. కాదన్న వారిని నిర్ధాక్షణ్యంగా తొలగించేస్తుంటారు. లేదంటే మానసిక క్షోభకు గురిచేయడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. జిల్లాలో ఈ ఐదేళ్లలో ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులు పడ్డ బాధలు అన్నీఇన్నీకావు. ఎవరిని కదిలించినా కష్టాలగాథలే. టీడీపీ పాలనలో చితికిపోయిన తమ బతుకుల గురించి కళ్లల్లో నీళ్లు పెట్టుకుని మరీ చెప్పడం కలచివేస్తోంది. కుటుంబ జీవితాలకు దూరం జిల్లాలో దాదాపు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే.. వీరికి సమానంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి ఉద్యోగికీ కనీస పనిగంటలనేవి లేవు. గడిచిన ఐదేళ్లలో ఉద్యోగులు ఎనిమిది గంటలు పనిచేసి ఇళ్లకు వెళ్లిన దాఖలాలులేవు. పైగా సెలవు రోజుల్లో కూడా కార్యాలయాల్లో కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి. వ్యక్తిగత జీవనంతో పాటు కుటుంబ జీవితానికి వారు దాదాపు దూరమైపోయారు. గొడ్డుచాకిరీ చేసినా కాంట్రాక్టు ఉద్యోగుల కనీస వేతనాలు సగటున రూ.15 వేలు కూడా రాలేదు. చాలీచాలని జీతాలతో మూడు పూటలు గడవని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయంటే అతిశయోక్తికాదేమో. ఓ ఆశా వర్కర్‌కు పారితోషికంతో కలిపి నెలకు రూ.6 వేలు వస్తే ఇద్దరు పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలో చదివించి, ఇల్లు గడపడానికి ఏటా రూ.50 వేల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితి. మరణమే శరణమా? జిల్లా వెలుగు శాఖలో పనిచేసే పది మంది వరకు ఈ ఐదేళ్లలో చనిపోయారు. మితిమీరిన పని ఒత్తిడే ఈ మరణాలకు కారణం. మృతుల్లో మొలకలచెరువుకు చెందిన ఏరియా కో–ఆర్డినేటర్ రమేష్, కార్వేటినగరం ఏరియా ప్రాజెక్టు మేనేజరు గిరిజ, క్లస్టర్ కో–ఆర్డినేటర్ భాస్కర్, చిన్నగొట్టిగల్లు క్లస్టర్ కో–ఆర్డినేటర్ చెంగల్రాయులు ఉన్నారు. ఇదేశాఖకు చెందిన గంగవరం క్లస్టర్ కో–ఆర్డినేటర్ గురుమూర్తి, గుడిపాలకు చెందిన వెంకటేశులు పక్షవాతంతో మంచాన పడ్డారు. మదనపల్లె మునిసిపాలిటీలో 2016లో శ్రీనాథ్ అనే కాంట్రాక్టు ఉద్యోగి చెప్పినపని చేయలేదంటూ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు విధుల్లో నుంచి తొలగించడం.. అతను ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సుల్లో సమాధానాలు చెప్పలేక పుత్తూరు మునిసిపల్ కమిషనర్‌గా పనిచేసిన సాంబశివరావు పక్షవాతంతో మంచంపట్టిన విషయం మరచిపోలేరు. వేతనాల్లేక విలవిల జిల్లా వైద్యశాఖలో పనిచేసే 3,250 మంది ఆశా వర్కర్లకు పారితోషికం రూ.5,600, గౌరవ వేతనం రూ.3 వేలు ఇస్తామంటూ గతేడాది ఆగస్టులో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వేతనాలు అందాలి. కానీ మూడు నెలలుగా రూపాయి వేతనం ఇవ్వలేదు. జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి చెల్లించాల్సిన జీతాలను ఇవ్వడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తోంది. చిత్తూరులో పనిచేసే 3 వేల మంది హోంగార్డులకు బడ్జెట్‌లేదనే సాకుతో ఐదు నెలలుగా జీతాలివ్వలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్న మహిళా సంఘాలకు మూడు నెలలుగా రూ.2.51 కోట్ల బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల వెతలు జిల్లా గృహనిర్మాణశాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న 400 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే (2014లో) తొలగించింది. ప్రతి మండలంలో ఐదుగురు ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ల స్థానంలో ప్రస్తుతం ఒక్కరే పనిచేయాల్సి వస్తోంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో 2005 నుంచి పనిచేస్తున్న 380 మంది ఫీల్డు అసిస్టెంట్లపై పనితీరు నివేదిక బాగాలేదని నాలుగేళ్ల క్రితం వేటు వేశారు. వ్యవశాయశాఖలో పనిచేసిన 2,800 మంది ఆదర్శరైతులు అవసరం లేదంటూ తీసేశారు. ఐదేళ్ల క్రితం వీరిని తొలగించే సమయానికి ఒక్కో ఆదర్శరైతుకు రూ.5 వేలు చొప్పున వేతనాలను ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం కూడా సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న రిసోర్సుపర్సన్లను, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిపి 3,800 మందిని ప్రభుత్వం తొలగించింది. -
‘ఓటు’ దెబ్బతో దిమ్మతిరగాలి
సాక్షి, అమరావతి: ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో రాజకీయ నాయకులతోపాటే ఉద్యోగ వర్గాలూ తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెంచాయి. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేముందు అనేక హామీలిచ్చిందని, మనం కూడా ఆ హామీలు నెరవేరతాయన్న ఆశతో ఓట్లేశాం...ఇప్పుడేమో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నాయి. ఉద్యోగం చేస్తున్నామేగానీ కనీస భద్రత లేకుండా పోయింది. మన పరిస్థితి ఈ నాలుగేళ్లలో మరీ దారుణంగా ఉంది. వేతనాలు పైసా పెంచకపోగా, ఉన్న ఉద్యోగానికీ ఇబ్బందులు తప్పలేదు, ఈ పరిస్థితుల్లో కలిసికట్టుగా ఓటు వేస్తేగానీ మనకు న్యాయం జరిగే పరిస్థితి లేదు.. అన్న ఆలోచనకు ఆయా ఉద్యోగులు వచ్చారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలు కీలకం కాబోతున్నాయని, ఏమాత్రం పొరపాటు చేసినా మళ్లీ మనకు అన్యాయం జరిగే అవకాశముందన్న భావనకు వారు వచ్చారు. ఇలాంటి అవకాశం మళ్లీ ఐదేళ్లకుగానీ మనకు రాదని, ఇప్పుడే జాగ్రత్త పడాలని చర్చించుకుంటున్నారు. హామీ ఇచ్చి మోసం చేసినందుకు కసి తీర్చుకోవాలన్న అభిప్రాయంతో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు యమునాతీరు కాకుండా ఈ ఏడాది కలసికట్టుగా ఓటు వేద్దామని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు లక్ష మంది వరకూ ఉన్నట్టు అంచనా. వీరిలో ఎక్కువగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వీళ్లలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక సంఘాలున్నాయి. ప్రతి జిల్లాలోనూ కార్యవర్గాలు ఉన్నాయి. దీని ఆధారంగా ఉద్యోగులు జిల్లాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉద్యోగులెవరైనా తెలియని వారుంటే చేర్చుకోవడం, వారికి అవగాహన కల్పించడం, జరిగిన మోసాన్ని వివరించడం వంటివి ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉద్యోగులతోపాటు బంధువులు, తెలిసిన వారికి కూడా ప్రచారం నిర్వహించి జరుగుతున్న పరిణామాలను వివరిస్తున్నామని పశ్చిమగోదావరికి చెందిన ఒక కాంట్రాక్టు ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు గానీ, మెసేజ్‌లుగానీ పెట్టకుండా ప్రధానంగా మనకు జరిగిన నష్టాన్ని తెలియజెప్పాలని, అధికారపార్టీ హామీ ఏమిచ్చింది, ఏం చేసింది అనే విషయాన్ని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాను వేదికగా చేసుకోవాలని ఆయా కార్యవర్గాల్లో నిర్ణయించారు. విధిగా అందరూ ఓటింగ్‌కు రావాలని వాట్సాప్ ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మోసాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి.. - 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా దశలవారీగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తామన్నారు. కానీ చెయ్యలేదు - నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేసి నాలుగున్నరేళ్లపాటు సమావేశాలు నిర్వహించి చివరకు క్రమబద్ధీకరణ కష్టమని చెప్పేశారు - 2010కి ముందు రెగ్యులర్ ఉద్యోగులకు లాగే వేతన సవరణ ఉండేది.. ఇప్పుడు దీన్ని తీసేశారు - కాంట్రాక్టు ఉద్యోగులను కూడా కన్సాలిడేటెడ్ ఉద్యోగులుగా మార్చేశారు - జీవో నంబర్ 27 ద్వారా ఉన్న డీఏ, హెచ్ఆర్ఏ, పీఆర్సీ వంటివన్నీ తొలగించారు - గడిచిన నాలుగున్నరేళ్లలో ఉద్యోగ భద్రత పూర్తిగా లేకుండా పోయింది -
పండుగ జేస్కోవాలంటే పైసలేవీ!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు తెలంగాణ అంతటా పండుగ వాతావరణం.. మరోవైపు ఇంటికొచ్చిన ఆడబిడ్డలను ఆదరించేదెట్లా అనే ఆందోళన. కొత్త బట్టల సంగతేమోగాని పండుగపూట కనీస మర్యాదలు కూడా చేయలేని పరిస్థితి. ఇదీ వైద్య, ఆరోగ్య శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దుస్థితి. కాంట్రాక్ట్ దక్కించుకున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీ యాజమాన్యం మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. కీలకమైన ఓపీ సమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి ధర్నాకు దిగుతుండటంతో ఓపీ సేవలే కాకుండా పలు సర్జరీలు సైతం వాయిదా పడుతున్నాయి. ఇంటి అద్దెలు.. కిరాణాషాపుల్లో బకాయిలు ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్ 470 మంది పని చేస్తున్నారు. నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రిలో 120 మంది నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పటికే మూడు నెలల నుంచి వేతనాలు లేక ఇంటి అద్దెలు, కిరాణా షాపుల్లో పెట్టిన బాకీలు భారీగా పెరిగిపోయాయని, పాత బాకీ చెల్లిస్తే కానీ వారు కూడా కిరాణం ఇవ్వడం లేదంటున్నారు. ప్రభుత్వం ఇచ్చినా.. ఇవ్వకపోయినా... నిబంధనల ప్రకారం ప్రభుత్వం బడ్జెట్ మంజూరు చేసినా.. చేయకపోయినా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏజెన్సీ నిర్వాహకులే ప్రతినెలా విధిగా ఆయా సిబ్బంది వేతనాలు చెల్లించాలి. కానీ, ఏజెన్సీ నిర్వాహకులు మూడునెలలుగా వేతనాలివ్వడం లేదు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద పని చేస్తున్న ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాలంటే నెలకు కనీసం రూ.70లక్షలపైనే అవుతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని తాము మాత్రం ఎక్కడి నుంచి తీసుకురాగలమని ఏజెన్సీల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలతో డీఎంఈ చర్చలు ఔట్ సోర్సింగ్ వైద్య సిబ్బంది ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలతో చర్చలు జరిపింది. ఏజెన్సీలకు బకాయి పడిన దాంట్లో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా రూ.4 కోట్లకు సంబంధించిన రిలీజింగ్ ఆర్డర్ కూడా ఇచ్చిందని, దసరా పండగ లోపే ఆయా కార్మికులందరికీ వేతనాలు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి చెప్పారు. -
ఉద్యోగులపై మళ్లీ నోరు పారేసుకున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు పరుష వ్యాఖ్యలు చేశారు. వారి పనితీరు బాగోలేదంటూ మండిపడ్డారు. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సంతృప్త స్థాయి పెంచడంలో దారుణంగా విఫలమయ్యారని ఆక్షేపించారు. మిమ్మల్ని మేము ఎందుకు మేపాలంటూ ఔట్సో ర్సింగ్ ఉద్యోగులను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కలెక్టర్లు, విభాగాధిపతులు, కార్యద ర్శులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. గృహ నిర్మాణాలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి తక్కువగా ఉందని, దీన్ని మరింత పెంచాలని సూచించారు. పరిష్కార వేదిక ద్వారా రియల్ టైమ్‌లో సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. అవసరమైనచోటల్లా పీపీపీ రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి దాకా ప్రజా సాధికార సర్వే నిర్వహించామని, భూ సమస్యల పరిష్కారానికి భూధార్ తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక పథకాలు చేపట్టామని, మునిసిపల్ పరిపాలనలో పీపీపీ పద్ధతిలో ముందుకెళ్లామన్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడ పీపీపీ విధానంలో ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యలొచ్చాయని చెప్పకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పౌర సరఫరాలు, వస్తువుల పంపిణీలో ప్రజల నుంచి మరింత సంతృప్తి వ్యక్తం కావాలన్నారు. 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని, జాతీయ స్థాయిలో ఏపీకి గుర్తింపు లభిస్తోందని చెప్పారు. నాలుగేళ్లుగా ప్రతి సోమవారం వ్యవసాయం, అనుబంధ రంగాలలపై టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మంగళవారం ఇ–ప్రగతి, ప్రతి బుధవారం రాజధాని, సంక్షేమంపై టెలికాన్ఫరెన్సులతో దిశానిర్దేశం చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఆర్నెల్లపాటు సర్కారు ప్రచారోద్యమం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూలై 15కి 1,500 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై వచ్చే ఆరు నెలల పాటు గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమాల ద్వారా ప్రచారోద్యమం చేపట్టాలని సీఎం సూచించారు. సంతృప్తి శాతం పెరగడంలో సర్వీసు ప్రొవైడర్లు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. అక్టోబర్‌లోగా ఈ ప్రగతి పూర్తి కావాలని ఆదేశించారు. అన్ని సర్వీసులను ఆన్లైన్లో చేర్చి శాఖాధిపతుల్లో కాగిత రహిత పాలన రావాలన్నారు. 75 లక్షలకుపైగా పేద కుటుంబాల ఎదురుచూపులు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం 75 లక్షలకు పైగా పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. నాలుగేళ్లుగా దరఖాస్తులు.. పరిశీలన దశ దాటి ముందుకు కదలడం లేదు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, మంచినీరు, పెన్షన్లు తదితర పథకాల మంజూరు కోసం అందిన 75,17,255 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయినా మంజూరు చేయాల్సి ఉందని వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడైంది. ఆర్థికేతర అంశాలతో కూడిన మరో 3,02,750 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. -
వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
జనగామ అర్బన్ : వైద్య, ఆరోగ్య సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని డీఎం హెచ్ఓ కార్యాలయం ఎదుట తెలంగాణ వైద్య, ఆరోగ్య సంయుక్త కార్యాచరణ సంఘం (జేఏసీ) ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి వైద్య సిబ్బందిని రెగ్యులర్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెల్త్‌కార్డులను ఇవ్వాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు ఎస్టీఓ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఈనెల 8వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ము ట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ ఏ.విష్ణువర్ధన్‌రెడ్డి, కాంట్రాక్ట్ ఎం పీహెచ్ఏ (ఎం) అధ్యక్షుడు పేర్వారం ప్రభాకర్, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు కేథరిన్, ఉమెన్ అసోసియేషన్ నాయకులు పూర్ణకుమారి, ఏరియా ఆస్పత్రి అధ్యక్షుడు లక్ష్మయ్య, సెక్రటరీ ప్రవీణ్, సహాదేవ్, సంపత్, శ్రీరాములు, పాండరి, మనోహర్ పాల్గొన్నారు. కాగా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల శ్రీనివాస్, ఆర్, రాజు, బి. గోపి, ప్రకాష్, ఇర్రి ఆహల్య సంఘీభావం ప్రకటించారు.