నల్లగొండ టుటౌన్ : మెప్మా..కింద నిరుద్యోగులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన శిక్షణ సంస్థలు భంక్షణ సంస్థలుగా మారి అందినకాడికి వెనకేసుకున్నాయి. దీనిపై మెప్మా రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణ జరిపి 14 లక్షల రూపాయలు పక్కదారి పట్టినట్లు తేల్చారు. ఈ అక్రమాలకు ఓ రెగ్యులర్ ఉద్యోగి, ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 16 శిక్షణా సం స్థలు బాధ్యులని నివేదికలో చూపారు. వారికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది..ఆ తర్వాత చర్యలు తీసుకోవడం మానేశారు. నోటీసులు ఇచ్చి నాలుగు నెలలైంది. నేటికీ దాని ఊసే లేదు.
ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా మున్సిపల్ పట్టణాలు, నగర పంచాయతీలలో ఏర్పాటుచేసిన కొన్ని శిక్షణ సంస్థలు ఎలాంటి శిక్షణలు ఇవ్వకుండానే నిధులను బొక్కారనే ఆరోపణలు తీవ్రంగానే వచ్చాయి. దీంతో 2012-13 సంవత్సరంలో విచారణ జరిపారు. మొత్తం 16 సంస్థలకు అక్రమాలలో భాగస్వామ్యం ఉందని తేల్చారు. ఏకంగా 14లక్షల రూపాయల అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. వీటిపై సంబంధిత శిక్షణా సంస్థలకు మెప్మా అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే నోటీసులు ఇచ్చి నాలుగు నెలలైంది. కొన్ని సంస్థలు మాత్రమే వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మిగతావి చడీచప్పుడు లేకుండా ఉన్నాయి. కాగా, అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత సంస్థల నుంచి డబ్బులు రికవరీ చేయకుండా నోటీసులతోనే సరిపెట్టడం ఏమిటనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు నోరు మెదపడంలేదు. 14 లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడిన సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంత ర్యమేమిటో అధికారులకే తెలియాలి. కేవలం ఇద్దరిపైనే చర్యలు తీసుకోని మిగతా వారిని వదిలేయడంపై అనుమానాలకు తావిస్తోంది.
అధికారుల చోద్యం..
జిల్లాలోని నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సిన మెప్మా సిబ్బంది, శిక్షణా సంస్థలు అడ్డదారిలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయినా ఈ తతంగాన్ని కొంతకాలం పాటు మెప్మా పీడీలు తొక్కిపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ తరువాత వచ్చిన ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వర్తించిన అధికారి ఆ ద స్త్రం దుమ్ము దులిపి ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇటీవల విధుల నుంచి తప్పించారు. కానీ దుర్వినియోగం అయిన ప్రభుత్వ నిధులను రికవరీ చేయడంలో సంబంధితశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పై స్థాయి అధికారుల పాత్రపైనా..?
మెప్మా ద్వారా ఇచ్చే శిక్షణలో జరిగిన అవినీతి అక్రమాలలో కింది స్థాయి సిబ్బంది మాత్రమే ఉన్నారా.. లేక పై స్థాయి అధికారుల పాత్రలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అప్పడు ఇక్కడ పనిచేసిన (ఇప్పుడు బదిలీపై వెళ్లాడు) ఓ అధికారి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వచ్చినా దాని గురించి మాత్రం అంత లోతుగా వెళ్లనట్లు తెలుస్తోంది. 2011-12 సంవత్సరంలో ఇచ్చిన శిక్షణల మీద కూడా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయట బడే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. కాగా పై స్థాయి వారిని కాపాడడానికే ఇద్దరిని తొలగించి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికైనా దుర్వినియోగం అయిన డబ్బులను రికవరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సంస్థల నుంచి
సమాధానం రాలేదు
అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న సంస్థలకు నోటీసులు జారీ చేశాం. కానీ వారిలో కొంతమంది మాత్రమే సమాధానం ఇచ్చారు. మెజార్టీ వారు ఎలాంటి సమాధానం పంపలేదు. వీరిపై కలెక్టర్‌కు నివేదిక పంపిస్తాం. ఆ తరువాత వారిపై చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాసరాజు,
మెప్మా ఏఓ
నోటీసులతోనే సరా..!?
Published Sun, Jan 11 2015 2:02 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement