ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ధ్వజం
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు
వెంటనే ఐఆర్, మెరుగైన పీఆర్‌సీ హామీ ఎటు పోయింది?
మీటింగుల్లో తిట్టడం, మంత్రుల బెదిరింపులు ఎక్కువయ్యాయి
వందలాది మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ రెసిడెన్సీ హోటల్‌లో వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది ఉద్యోగులు, వివి«ద ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొని ఫెడరేషన్‌ను కాపాడుకుంటామని ఉద్యోగులు ముక్త కంఠంతో ప్రకటించారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు రాలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్, ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ ఇస్తామన్న హామీని నెరవేర్చ లేదన్నారు.
పెండింగ్ బకాయిలన్నీ చెల్లించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి అందరికీ ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరిస్తామన్న హామీని సీఎం చంద్రబాబు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. వలంటీర్ల వేతనం రూ.10 వేలుకు పెంచుతామన్న హామీని తుంగలోకి తొక్కి వారి ఉద్యోగాలను ఊడగొట్టారన్నారు. గత సర్కారు ఇచ్చిన జీవోలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. ప్రభుత్వ వేధింపులు తాళలేక ఐదుగురు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, వందలాది మందికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులిచ్చిందన్నారు. పెండింగ్ బకాయిలను ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై సీఎం దృష్టి సారించి సంఘాలను పిలిచి మాట్లాడాలని సూచించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వీఆర్‌ఏలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.
మహిళా ఉద్యోగులకు భద్రత కరువు..
గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎంను కోరిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడేవారని, నేరుగా సమస్యలు ఆయన దృష్టికి తెచ్చి చాలా వరకు పరిష్కరించామని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్ కరువైందని, అందువల్ల మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల సమస్యలు తెస్తున్నామని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు ఒక్క సమస్యనుగానీ, హామీనిగానీ అమలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు. ఉద్యోగులను మీటింగుల్లో తిట్టడం, మంత్రుల బెదిరింపులు ఎక్కువయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం సచివాలయ మహిళా ఉద్యోగులతో చీకట్లో పెన్షన్లు పంపిణీ చేయించడం దారుణమన్నారు. మహిళా ఉద్యోగులు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ప్రయాణాలు చేయాల్సి వస్తోందని, వారికి భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment