రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేస్తున్న 108 సిబ్బంది
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు
విధుల్లోకి తీసుకుని రూ.10 వేలు జీతమివ్వాలని వలంటీర్ల డిమాండ్
ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగుల ధర్నా
సీఎం ఇంటివద్ద గిరిజన ఔట్‌సోర్సింగ్ టీచర్ల ఆందోళన
పిడికిలి బిగించిన ఆశ కార్యకర్తలు.. ఆకలి కేకలతో ఆయాల నిరసన
వెల్లువెత్తిన వివిధ వర్గాల ప్రజల ఆందోళనలు
సాక్షి, నెట్‌వర్క్: కూటమి సర్కారు తీరుపై రాష్ట్రం నలుచెరుగులా అసహనం కట్టలు తెంచుకుంది. గిరిజన గురుకులాల టీచర్లు సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట బైఠాయించారు.. విధుల్లోకి తీసుకోవాలంటూ వలంటీర్లు ధర్నాలు చేపట్టారు.. సమ్మె సైరన్ మోగించిన 108 ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు.. సమస్యలు పరిష్కరించాలంటూ పిడికిలి బిగించి ఆశా వర్కర్లు భారీ ధర్నాకు దిగారు.. ఆకలి కేకలతో అలమటిస్తున్న ఆయాలు పెండింగ్ జీతాల కోసం పొలికేక పెట్టారు.. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఎక్కడికక్కడ రోడ్లెక్కితే.. ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు.. పారిశుధ్య కార్మీకులు.. వీవోఏలు.. మధ్యాహ్న భోజన కార్మీకులు.. పాఠశాల ఆయాలు.. సీహెచ్‌సీ వైద్యులు.. వెలుగు యానిమేటర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు.. నిరసనలు చేపట్టారు. మొత్తంగా వీరందరి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది.
108 ఉద్యోగుల భారీ ధర్నా
సకాలంలో జీతాలు చెల్లించడంతోపాటు 104, 108 వ్యవస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో 108 అంబులెన్స్ ఉద్యోగులు సోమవారం మహాధర్నా చేపట్టారు. ఏపీ 108 సేవల కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ గౌరవాధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 25 నుంచి సమ్మె చేపడతామని నోటీసిచ్చినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్చల పేరిట ఈనెల 22న వైద్యశాఖ ఉన్నతాధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోనూ 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు.
కలెక్టరేట్ల వద్ద వలంటీర్ల నిరసన
ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లు సోమవారం గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య జిల్లా రాయచోటి, పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్లు, రాజంపేట సబ్ కలెక్టరేట్ వద్ద, విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ ధర్నాలు, ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఇందులో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తలకిందులుగా నిలబడి నిరసన తెలియజేశారు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు కలెక్టరేట్ల వద్ద సంఘ నేతలు మాట్లాడుతూ తమను ఉద్యోగాల్లోకి తీసుకొని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఔట్‌సోర్సింగ్ అధ్యాపకుల ధర్నా
రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లోని ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు తమను మెగా డీఎస్సీ నుంచి మినహాయించాలని, ఔట్‌సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ కలెక్టరేట్ వద్ద ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ధర్నా చేపట్టారు.
దద్దరిల్లిన విశాఖ కలెక్టరేట్
చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ చేసిన ధర్నాలతో విశాఖపట్నం కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మీకులు, సామాజిక కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వీవోఏలతో పాటు మధ్యాహ్న భోజన పథకం కార్మీకులకు 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేసి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.
⇒ విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో 30 మంది హౌస్‌కీపింగ్ కార్మీకులను తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
⇒ ఇసుక విధానం ఎంతోమంది జీవితాల్ని రోడ్డున పడేసిందంటూ క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కలెక్టరేట్ ఎదుట భారీఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది. అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. ఇసుక రీచుల్లో దళారులు దోచేస్తున్నారనీ.. టన్నుకు అదనంగా రూ. 300 వరకూ వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయాల ఆందోళన
చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఆయాలకు 5 నెలలుగా జీతాలు మంజూరు చేయలేదని సోమవారం ఆయాలు చిత్తూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఆయాలకు చీపురుకట్టలు, ఫినాయిల్, గ్లౌజు, సోపులు ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పెండింగ్ జీతాలు ఇవ్వాలని పాఠశాలలో పని చేసే ఆయాలు ధర్నాకు దిగారు.
పంటకు పరిహారం ఇవ్వాలని ధర్నా
విజయనగరం జిల్లాలో కోత దశలో ఉన్న వరి పంటను కత్తెర, కొమ్ము పురుగు ఆశించి కంకులన్నీ రాలిపోతున్నాయని, పరిహారం అందజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సభ్యులు సోమవారం ధర్నా చేశారు.
సమగ్ర కులగణన చేపట్టాలి
సమగ్ర కులగణన చేపట్టాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కల్లూరి నాగరాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఇదే విషయంపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్‌కు వినతిపత్రం అందించారు.
తక్షణం బ్లాస్టింగ్‌లు ఆపండి..
అపరిమిత బ్లాస్టింగ్‌లతో మార్టూరు బీటలు వారుతోందని, సర్వే నంబర్ 1 కొండపై ఖనిజాన్ని దోచేస్తూ ప్రజలను కాలుష్యంలోకి నెట్టేస్తున్న క్వారీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం మార్టూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టి.. కిడ్నీ బాధితులుగా మారుతున్న ప్రజలను కాపాడాలంటూ కలెక్టరేట్‌లో ఫిర్యాదు ఇచ్చారు.
చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా
విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిసేందుకు గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్‌సోర్సింగ్ టీచర్ల ప్రయత్నానికి పోలీసులు సోమవారం అడ్డుతగిలారు. మెగా డీఎస్సీతో తమకు అన్యాయం జరుగుతోందని, కనీసం తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్(సీఆర్‌టీ)గా మార్చాలనే డిమాండ్‌పై 1,656 మంది ఔట్‌సోర్సింగ్ టీచర్లు ఈ నెల 16 నుంచి సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే.
ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్‌సోర్సింగ్ టీచర్లు
అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఉండవల్లిలోని ప్రజాదర్బార్ వేదిక వద్ద లోకేశ్‌ను కలిసేందుకు ఔట్‌సోర్సింగ్ టీచర్లు తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందిస్తామని టీచర్లు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పోలీసులు, టీచర్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో సీఎం ఇంటి వద్దే టీచర్లు బైఠాయించారు.
పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో గిరిజన గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి సదా భార్గవి వచ్చి వారితో చర్చలు జరిపారు. ప్రభుత్వం దృష్టికి మీ విషయాన్ని తీసుకెళ్తామని, విధుల్లో చేరాలని కోరారు. ఇప్పటికే ఒకసారి ఆందోళన చేశామని, తమ డిమాండ్‌ను పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చి ఇంత వరకు పరిష్కరించలేదని టీచర్లు మండిపడ్డారు.
ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. దీంతో సదాభార్గవి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ధృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లోకేశ్ సమావేశంలో బిజీగా ఉన్నారంటూ లోకేశ్ ఓఎస్‌డీ వరప్రసాద్ ఔట్‌సోర్సింగ్ టీచర్లతో మాట్లాడారు. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లుగా పరిగణించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి మూడు రోజుల్లో ఏ విషయాన్ని చెబుతామని వరప్రసాద్ చెప్పడంతో ఔట్‌సోర్సింగ్ టీచర్లు ధర్నాను విరమించి వెనుదిరిగారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించే వరకు సమ్మె విరమించేది లేదని గిరిజన గురుకులాల ఔట్‌సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ తేల్చిచెప్పారు. 15 ఏళ్లకుపైగా గురుకులాల్లో కేవలం రూ.10,500 నుంచి రూ.18,000 చాలీచాలని జీతాలతో సేవలు అందిస్తున్న తమకు డీఎస్సీ కారణంగా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు.
పిడికిలి బిగించిన ఆశా వర్కర్లు..
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో ఆశాలు భారీ ధర్నా నిర్వహించారు. తమను ప్రభుత్వం కార్మీకులుగా గుర్తించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్‌మెంట్ వయసును పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సహజ మరణానికి రూ. 2లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పీహెచ్‌సీ వైద్యుల ధర్నా
విజయవాడ ధర్నా చౌక్‌లో పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు ధర్నా చేశారు. పీజీ కోటా తగ్గింపుపై ఆందోళన చేపట్టారు. బుడమేరు వరదల వల్ల నష్టపోయిన తమకు పరిహారం అందించాలని కోరుతూ బాధితులు ధర్నా చేపట్టారు.
భవన నిర్మాణ కార్మికుల ఆందోళన
ప్రభుత్వం ఉచిత ఇసుక అందించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు విజయవాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పనులు లేక అల్లాడుతున్న 40లక్షల మంది కార్మీకులను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఏపీ వెలుగు యానిమేటర్ల ధర్నా
విజయవాడలో కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. రాజకీయ కక్షలతో తొలగించిన వీఓఏలను విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జీలు రద్దు చేయాల్సిందే
విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ శ్రీకాకుళం జిల్లా హిరమండలం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలతో బెంబెలేత్తిపోతున్న సామాన్యులపై విద్యుత్ చార్జీల పేరుతో మరింత భారం మోపడం సరికాదన్నారు. విజయవాడలోనూ విద్యుత్ ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారులపై భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment