employees dharna
-
Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం
సాక్షి, నెట్వర్క్: కూటమి సర్కారు తీరుపై రాష్ట్రం నలుచెరుగులా అసహనం కట్టలు తెంచుకుంది. గిరిజన గురుకులాల టీచర్లు సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట బైఠాయించారు.. విధుల్లోకి తీసుకోవాలంటూ వలంటీర్లు ధర్నాలు చేపట్టారు.. సమ్మె సైరన్ మోగించిన 108 ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు.. సమస్యలు పరిష్కరించాలంటూ పిడికిలి బిగించి ఆశా వర్కర్లు భారీ ధర్నాకు దిగారు.. ఆకలి కేకలతో అలమటిస్తున్న ఆయాలు పెండింగ్ జీతాల కోసం పొలికేక పెట్టారు.. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఎక్కడికక్కడ రోడ్లెక్కితే.. ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు.. పారిశుధ్య కార్మీకులు.. వీవోఏలు.. మధ్యాహ్న భోజన కార్మీకులు.. పాఠశాల ఆయాలు.. సీహెచ్‌సీ వైద్యులు.. వెలుగు యానిమేటర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు.. నిరసనలు చేపట్టారు. మొత్తంగా వీరందరి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది. 108 ఉద్యోగుల భారీ ధర్నా సకాలంలో జీతాలు చెల్లించడంతోపాటు 104, 108 వ్యవస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో 108 అంబులెన్స్ ఉద్యోగులు సోమవారం మహాధర్నా చేపట్టారు. ఏపీ 108 సేవల కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ గౌరవాధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 25 నుంచి సమ్మె చేపడతామని నోటీసిచ్చినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరిట ఈనెల 22న వైద్యశాఖ ఉన్నతాధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోనూ 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కలెక్టరేట్ల వద్ద వలంటీర్ల నిరసన ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లు సోమవారం గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య జిల్లా రాయచోటి, పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్లు, రాజంపేట సబ్ కలెక్టరేట్ వద్ద, విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ ధర్నాలు, ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌లో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఇందులో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తలకిందులుగా నిలబడి నిరసన తెలియజేశారు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు కలెక్టరేట్ల వద్ద సంఘ నేతలు మాట్లాడుతూ తమను ఉద్యోగాల్లోకి తీసుకొని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ అధ్యాపకుల ధర్నా రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లోని ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తమను మెగా డీఎస్సీ నుంచి మినహాయించాలని, ఔట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ కలెక్టరేట్ వద్ద ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ధర్నా చేపట్టారు. దద్దరిల్లిన విశాఖ కలెక్టరేట్చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ చేసిన ధర్నాలతో విశాఖపట్నం కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మీకులు, సామాజిక కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వీవోఏలతో పాటు మధ్యాహ్న భోజన పథకం కార్మీకులకు 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేసి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ⇒ విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో 30 మంది హౌస్‌కీపింగ్ కార్మీకులను తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ⇒ ఇసుక విధానం ఎంతోమంది జీవితాల్ని రోడ్డున పడేసిందంటూ క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కలెక్టరేట్ ఎదుట భారీఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది. అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. ఇసుక రీచుల్లో దళారులు దోచేస్తున్నారనీ.. టన్నుకు అదనంగా రూ. 300 వరకూ వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయాల ఆందోళనచిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఆయాలకు 5 నెలలుగా జీతాలు మంజూరు చేయలేదని సోమవారం ఆయాలు చిత్తూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఆయాలకు చీపురుకట్టలు, ఫినాయిల్, గ్లౌజు, సోపులు ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పెండింగ్ జీతాలు ఇవ్వాలని పాఠశాలలో పని చేసే ఆయాలు ధర్నాకు దిగారు. పంటకు పరిహారం ఇవ్వాలని ధర్నావిజయనగరం జిల్లాలో కోత దశలో ఉన్న వరి పంటను కత్తెర, కొమ్ము పురుగు ఆశించి కంకులన్నీ రాలిపోతున్నాయని, పరిహారం అందజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సభ్యులు సోమవారం ధర్నా చేశారు. సమగ్ర కులగణన చేపట్టాలిసమగ్ర కులగణన చేపట్టాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కల్లూరి నాగరాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఇదే విషయంపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్‌కు వినతిపత్రం అందించారు. తక్షణం బ్లాస్టింగ్లు ఆపండి.. అపరిమిత బ్లాస్టింగ్లతో మార్టూరు బీటలు వారుతోందని, సర్వే నంబర్ 1 కొండపై ఖనిజాన్ని దోచేస్తూ ప్రజలను కాలుష్యంలోకి నెట్టేస్తున్న క్వారీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం మార్టూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టి.. కిడ్నీ బాధితులుగా మారుతున్న ప్రజలను కాపాడాలంటూ కలెక్టరేట్లో ఫిర్యాదు ఇచ్చారు.చంద్రబాబు ఇంటి వద్ద ధర్నావిద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిసేందుకు గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్ల ప్రయత్నానికి పోలీసులు సోమవారం అడ్డుతగిలారు. మెగా డీఎస్సీతో తమకు అన్యాయం జరుగుతోందని, కనీసం తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్(సీఆర్టీ)గా మార్చాలనే డిమాండ్‌పై 1,656 మంది ఔట్సోర్సింగ్ టీచర్లు ఈ నెల 16 నుంచి సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్లు అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఉండవల్లిలోని ప్రజాదర్బార్ వేదిక వద్ద లోకేశ్‌ను కలిసేందుకు ఔట్సోర్సింగ్ టీచర్లు తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందిస్తామని టీచర్లు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పోలీసులు, టీచర్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో సీఎం ఇంటి వద్దే టీచర్లు బైఠాయించారు. పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో గిరిజన గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి సదా భార్గవి వచ్చి వారితో చర్చలు జరిపారు. ప్రభుత్వం దృష్టికి మీ విషయాన్ని తీసుకెళ్తామని, విధుల్లో చేరాలని కోరారు. ఇప్పటికే ఒకసారి ఆందోళన చేశామని, తమ డిమాండ్‌ను పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చి ఇంత వరకు పరిష్కరించలేదని టీచర్లు మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. దీంతో సదాభార్గవి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ధృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లోకేశ్ సమావేశంలో బిజీగా ఉన్నారంటూ లోకేశ్ ఓఎస్డీ వరప్రసాద్ ఔట్సోర్సింగ్ టీచర్లతో మాట్లాడారు. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లుగా పరిగణించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి మూడు రోజుల్లో ఏ విషయాన్ని చెబుతామని వరప్రసాద్ చెప్పడంతో ఔట్సోర్సింగ్ టీచర్లు ధర్నాను విరమించి వెనుదిరిగారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించే వరకు సమ్మె విరమించేది లేదని గిరిజన గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ తేల్చిచెప్పారు. 15 ఏళ్లకుపైగా గురుకులాల్లో కేవలం రూ.10,500 నుంచి రూ.18,000 చాలీచాలని జీతాలతో సేవలు అందిస్తున్న తమకు డీఎస్సీ కారణంగా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. పిడికిలి బిగించిన ఆశా వర్కర్లు.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో ఆశాలు భారీ ధర్నా నిర్వహించారు. తమను ప్రభుత్వం కార్మీకులుగా గుర్తించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ వయసును పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సహజ మరణానికి రూ. 2లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీహెచ్సీ వైద్యుల ధర్నా విజయవాడ ధర్నా చౌక్‌లో పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు ధర్నా చేశారు. పీజీ కోటా తగ్గింపుపై ఆందోళన చేపట్టారు. బుడమేరు వరదల వల్ల నష్టపోయిన తమకు పరిహారం అందించాలని కోరుతూ బాధితులు ధర్నా చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల ఆందోళన ప్రభుత్వం ఉచిత ఇసుక అందించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు విజయవాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పనులు లేక అల్లాడుతున్న 40లక్షల మంది కార్మీకులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఏపీ వెలుగు యానిమేటర్ల ధర్నా విజయవాడలో కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. రాజకీయ కక్షలతో తొలగించిన వీఓఏలను విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు రద్దు చేయాల్సిందే విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ శ్రీకాకుళం జిల్లా హిరమండలం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలతో బెంబెలేత్తిపోతున్న సామాన్యులపై విద్యుత్ చార్జీల పేరుతో మరింత భారం మోపడం సరికాదన్నారు. విజయవాడలోనూ విద్యుత్ ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారులపై భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
ఉద్యోగుల పోరు బాట
శ్రీకాకుళం: తమకు తీవ్ర నష్టాన్ని కలిగించే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)పై సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న ద్వంద్వ సిద్ధాంతాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాన్ని పరిశీలిస్తామని ఎన్నికల ముందు చెప్పి.. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత.. సీపీఎస్ తమ పరిధిలో లేదని మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చి వేడుకున్నా కనీసం వాటిని పట్టించుకోని ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ధర్నాలు నిర్వహించాలని ఒక పూట సామూహిక సెలవుపెట్టాలని పిలుపునిచ్చాయి. దశల వారీగా ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు నిర్ణయించాయి. అన్నీ నష్టాలే.. సీపీఎస్ విధానంలో ఉద్యోగి పదవీ విరమణ అనంతరం పెన్షన్ ఉండదు. పాత పెన్షన్ దారులకు ఉండేలా ఆరోగ్య కార్డులు, ఇతర సదుపాయాలు, డీఏ, పీఆర్సీ వంటి ప్రయోజనాలు ఉండవు. సీపీఎస్ విధానంలో ఉన్న ఒక ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు ఇదివరకు ఒకరికి ఉద్యోగం, పెన్షన్ ఇచ్చేవారు. కానీ సీపీఎస్‌లో ఈ సౌకర్యాలు ఉండవు. పెన్షన్ నుంచి రుణాలు, అడ్వాన్స్‌లు పొందే సౌకర్యం కూడా ఉండదు. ఇలా ఎన్నో నష్టాలు ఉండడంతో పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ కంపెనీలు లాభాలు ఆర్జించడానికే.. ఉద్యోగుల జీతం నుంచి పది శాతం మినహాయించి వాటిని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ లైఫ్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడతారు. ఇవి సీఆర్ఏ పరిధిలో పని చేస్తాయి. ఈ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఇతర దేశాల్లో నష్టాలు చవిచూసి.. ప్రస్తుతం మన దేశంలో వ్యాపారం చేసి విదేశాల్లో నష్టపోయిన వాటిని పూడ్చుకోవాలని చూస్తున్నాయని బాధిత సీపీఎస్ ఉద్యోగులు వివరిస్తున్నారు. వారి నష్టాలు పూర్తయితే గాని లాభాలు చూపించరని, అప్పటివరకు తమ జీతం నుంచి మినహాయించిన మొత్తాలు పెట్టుబడిగా పెట్టినా ఆ మొత్తమంతా నష్టపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దశల వారీగా చెల్లింపు ఉద్యోగి పదవీ విరమణ చేసిన వెంటనే తమ జీతం నుంచి మినహాయించిన మొత్తం, ప్రభుత్వం జత చేసిన పదిశాతం మొత్తం ఒకేసారి చెల్లించరని, పదవీ విరమణ చేసిన రోజున 60 శాతం మాత్రమే ఇస్తారని.. ఉద్యోగికి 70 ఏళ్లు నిండిన తరువాత మరో 20 శాతం, 80 ఏళ్లు నిండిన తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తారు. ఏ కారణంగానైనా 60 ఏళ్ల తరువాత 70 ఏళ్లలోపు సీపీఎస్ ఉద్యోగి మరణిస్తే 40 శాతాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చడం మాని ప్రభుత్వమే ఆ మొత్తాన్ని తమ వద్ద ఉంచుకొని భద్రత కల్పించాలని డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడంతో ఆందోళన బాట పట్టామని స్పష్టం చేస్తున్నారు. తప్పు కేంద్రంపై నెట్టేసేందుకే.. సీపీఎస్ విధానం రద్దు కేంద్రం పరిధిలో ఉందని సీఎం చెప్పడం కేవలం సాకు మాత్రమేనని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 2002లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి.. దీనిని రాష్ట్రాల్లో అమలు ఆయా ప్రభుత్వాలకు కేంద్రం వదిలేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఈ విధానం వైపు మొగ్గు చూపి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో 2004, సెప్టెంబర్ 1 నుంచి ఈ విధానం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఇటీవల ఛత్తీస్గడ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉద్యోగులు ఆందోళన చేయడంతో వీటిని పరిశీలించేందుకు కమిటీని నియమించాయి. ఈ నివేదిక ఆధారంగా శాసనసభలో తీర్మానించి కేంద్రానికి నివేదించేందుకు కూడా ఆయా ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చాయి. రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్యలే చేపట్టాలని కోరినా ఫలితం లేకపోయింది. రూ.120 కోట్లకు పైనే ఆదాయం ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్, జెడ్పీ ఉద్యోగులకు జెడ్పీ పీఎఫ్, ప్రైవేటు ఉద్యోగులకు ఈపీఎఫ్ వంటి సంస్థలు ఉండడం వల్ల భద్రత ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎస్ ఉద్యోగుల ద్వారా సంవత్సరానికి రూ.120 కోట్లకు పైగా సమకూరుతోందని, వడ్డీతో కలుపుకొంటే ఇది రూ.150 కోట్లకు పైబడుతుందని సీపీఎస్ ఉద్యోగులు వివరిస్తున్నారు. జగన్ హామీతో భరోసా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రకటించడంపై సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏదైనా హామీ ప్రకటించే మనస్తత్వం గల ఆయన.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పడాన్ని స్వాగతిస్తున్నారు. జగన్‌కు సాధ్యమైనప్పుడు చంద్రబాబుకు ఎందుకు సాధ్యపడడం లేదని నిలదీస్తున్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని జన్మభూమిలో వినతి పత్రాలు ఇస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యేలు ఆదేశించడంపై బాధిత ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
వివాదంలో ఎస్వీబీసీ: ఛానల్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వివాదంలో చిక్కుకుంది. ఎస్వీబీసీ ఛానల్ సీఈవో నరసింహారావు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నరసింహారావు గురువారం అర్థరాత్రి కార్యాలయంలోని ఫైళ్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మేకప్‌మన్ వెంకటేశ్వర రెడ్డి అడ్డుకున్నారు. దీంతో తనపై నరసింహారావు దాడి చేసినట్టు వెంకటేశ్వర రెడ్డి అలిపిరి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మరో వైపు వెంకటేశ్వర రెడ్డిపై దాడికి నిరసనగా శుక్రవారం ఛానెల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఎస్వీబీసీ వద్ద ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిసెంబర్ 30 తో పదవీ కాలం ముగిసినా ఇంకా కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఉద్యోగులు ఆరోపించారు. తన అవినీతికి చెందిన ఫైళ్లను తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ సీఈవో నరసింహారావు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఎస్వీబీసీలో అవకతవకలు జరుగుతున్నట్టు ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఛానల్లో చోటు చేసుకున్న పరిణామాలు శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఛానల్ నిర్వహణ పేరుతో టీటీడీకి చెందిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని బలమైన ఆధారాలు ఉన్నాయి. సీఈవో నరసింహారావు టీడీపీ పెద్దల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నట్టు అభియోగాలున్నాయి. ఇప్పటికైనా అవినీతిపై కొరడా ఝుళిపించి శ్రీవారికి చెందిన ఛానల్ ను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
జూపార్కులో ఉద్యోగుల ధర్నా
హైదరాబాద్: ఎలాంటి కారణం లేకుండా ఇద్దరు జూపార్కు ఉద్యోగులను సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. బహదూర్ పురాలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు సిబ్బంది బిక్షపతి, శ్రీనివాస్ అనే వారు ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిని అకారణంగా శిక్షించారంటూ జూ ప్రాంగణంలో ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. సస్పెన్షన్‌ను వెంటనే తొలగించి వారిని విధుల్లోకి తీసుకోవాలని జూపార్కు జేఏసీ నాయకుడు దేవేందర్ డిమాండు చేశారు. ఆందోళన కారణంగా మూగ జీవులకు ఉదయం 10 గంటలకు అందాల్సిన ఆహారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందించారు. -
కొరబడిన ‘సహకారం’.. కదం తొక్కిన ఉద్యోగులు
– సహకారశాఖ రిజిస్ట్రార్, డీసీవో వైఖరి నశించాలని నినాదాలు – నారాయణస్వామి మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం – డీసీసీబీపై సెక్షన్ 51 విచారణ తక్షణం నిలిపేయాలని డిమాండ్ – మహా«ధర్నాకు మద్ధతు పలికిన పలు ట్రేడ్, రైతు సంఘం నేతలు – సంఘీభావం ప్రకటించిన డీసీసీబీ చైర్మన్ లింగాల శివశంకరరెడ్డి అనంతపురం అగ్రికల్చర్: సహకారశాఖ రిజిస్ట్రార్ మురళి, జిల్లా సహకార అధికారి (డీసీవో) ఇ.అరుణకుమారి, విచారణాధికారి నారాయణస్వామి వైఖరిని నిరసిస్తూ సహకార బ్యాంకు ఉద్యోగులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగులు, సిబ్బంది గురువారం కదంతొక్కారు. వారికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ యూనియన్, తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు, వివిధ జిల్లాల నాయకులు, బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, రైతు సంఘం నాయకులు మద్ధతు పలకడంతో స్థానిక డీసీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన మహా«ధర్నా విజయవంతమైంది. మొదట స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) నుంచి ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి డీసీవో ఆఫీస్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం జిల్లా అ«ధ్యక్షుడు డి.రుషేంద్రబాబు అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో సహకార బ్యాంకు ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్కే ప్రసాద్, తెలంగాణరాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జనార్ధన్, జాతీయ ఉపాధ్యక్షుడు ఏవీ కొండారెడ్డి, రాష్ట్ర సలహాదారుడు రంగబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, బాలాజీప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నప్రసాద్, ప్రత్యేక ఆహ్వానితుడు సుఖదేవబాబు, వైఎస్సార్ కడప, కర్నూలు, ప్రకాశం జిల్లా అ«ధ్యక్షులు ప్రతాపరెడ్డి, మూర్తి, రంగస్వామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకాశరామన్న ఉత్తరాలు, అనామక వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా డీసీసీబీ వ్యవహారాలపై సెక్షన్ 51 ప్రకారం విచారణ చేయాలని సహకార శాఖ రిజిస్ట్రార్ మురళీ ఉత్తర్వులు ఇవ్వడమే తప్పన్నారు. విచారణాధికారిగా నియమితులైన ఆ శాఖ అధికారి నారాయణస్వామి మోనార్క్‌లా వ్యవహరిస్తూ ఉద్యోగులను వేధించడం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నా డీసీవో అరుణకుమారి మౌనంగా ఉంటూ ప్రోత్సహించడం మంచిపరిణామం కాదన్నారు. దేనిపై విచారణ చేస్తున్నారనే విషయాలు చెప్పకుండా రికార్డులన్నీ స్వాధీనం చేయాలని విచారణాధికారి ఆదేశించడం చట్టవిరుద్ధమన్నారు. ఇది నిరంకుశ వైఖరికి అద్ధం పడుతోందన్నారు. ఏకపక్షంగా సాగిస్తున్న విచారణ వల్ల రైతులు, పేదలు, ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అంతా పారదర్శకం నష్టాల్లో ఉన్న డీసీసీబీ ఇప్పుడు లాభాల బాట పట్టిందంటే దానికి కారణం పారదర్శకంగా వ్యవహరించడమేనని చైర్మన్ లింగాల శివశంకరరెడ్డి తెలిపారు. దురుద్దేశంతో విచారణకు ఆదేశించడం వల్ల డీసీసీబీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందన్నారు. నాబార్డు, ఆప్కో నుంచి రుణాలు రాకపోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అనంతరం ఉద్యోగ సంఘం నాయకులు డీసీవో ఇ.అరుణకుమారిని కలిసి వినతి పత్రం అందజేశారు. మహాధర్నాలో యూనియన్ జిల్లా నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, జానకీరామరెడ్డి, మల్లికార్జునుడు, సోమశేఖర్, శ్రీధర్, కుసుమకుమారి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆనందరంగారెడ్డి, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు జయరామిరెడ్డి, పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు. -
విజయవాడలో ఉద్యోగుల ర్యాలీ
-
ద్రవిడ వర్సిటీలో ఉద్యోగుల ధర్నా
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని ద్రవిడ యూనివర్సిటీలో మంగళవారం ఉద్యోగులు ధర్నాకు దిగారు. దాదాపు 300 మంది భోదనేతర సిబ్బంది వర్సిటీ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. పేస్కేల్ పెంచాలని, పోస్టులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కొనసాగుతోంది. -
మా సంస్థను డిఫెన్స్‌లో కలపండి
* హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ ఉద్యోగుల డిమాండ్ * ఢిల్లీలో ధర్నా సాక్షి, న్యూఢిల్లీ: హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ సంస్థను రక్షణ రంగానికి సంబంధించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌లో కలపాలని ఆ సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్‌తోపాటు హైదరాబాద్ పబ్లిక్ రంగ సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ‘సేవ్ పబ్లిక్ సెక్టార్- సేవ్ ఇండియా’ నినాదంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాం ఏచూరి, డి.రాజా ధర్నా వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. హిందుస్థాన్ కేబుల్స్‌ను డిఫెన్స్‌లో కలిపే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో హిందుస్థాన్ కేబుల్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు జె.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి జి.దామోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కె.శరత్‌బాబు, బుచ్చిరెడ్డి, యాదగిరిరావు పాల్గొన్నారు.