హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ సంస్థను రక్షణ రంగానికి సంబంధించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌లో కలపాలని ఆ సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
* హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ ఉద్యోగుల డిమాండ్
* ఢిల్లీలో ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ సంస్థను రక్షణ రంగానికి సంబంధించిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌లో కలపాలని ఆ సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సోమవారం హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్‌తోపాటు హైదరాబాద్ పబ్లిక్ రంగ సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ‘సేవ్ పబ్లిక్ సెక్టార్- సేవ్ ఇండియా’ నినాదంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాం ఏచూరి, డి.రాజా ధర్నా వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. హిందుస్థాన్ కేబుల్స్‌ను డిఫెన్స్‌లో కలిపే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో హిందుస్థాన్ కేబుల్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు జె.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి జి.దామోదర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కె.శరత్‌బాబు, బుచ్చిరెడ్డి, యాదగిరిరావు పాల్గొన్నారు.