ఉద్యోగుల పోరు బాట | employees Against on Contributory Pension Scheme | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల పోరు బాట

Published Tue, Jan 9 2018 10:25 AM | Last Updated on Tue, Jan 9 2018 10:25 AM

శ్రీకాకుళం: తమకు తీవ్ర నష్టాన్ని కలిగించే కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌)పై సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న ద్వంద్వ సిద్ధాంతాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాన్ని పరిశీలిస్తామని ఎన్నికల ముందు చెప్పి.. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత.. సీపీఎస్‌ తమ పరిధిలో లేదని మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చి వేడుకున్నా కనీసం వాటిని పట్టించుకోని ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ధర్నాలు నిర్వహించాలని ఒక పూట సామూహిక సెలవుపెట్టాలని పిలుపునిచ్చాయి. దశల వారీగా ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు నిర్ణయించాయి.

అన్నీ నష్టాలే..
సీపీఎస్‌ విధానంలో ఉద్యోగి పదవీ విరమణ అనంతరం పెన్షన్‌ ఉండదు. పాత పెన్షన్‌ దారులకు ఉండేలా ఆరోగ్య కార్డులు, ఇతర సదుపాయాలు, డీఏ, పీఆర్‌సీ వంటి ప్రయోజనాలు ఉండవు. సీపీఎస్‌ విధానంలో ఉన్న ఒక ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకు ఇదివరకు ఒకరికి ఉద్యోగం, పెన్షన్‌ ఇచ్చేవారు. కానీ సీపీఎస్‌లో ఈ సౌకర్యాలు ఉండవు. పెన్షన్‌ నుంచి రుణాలు, అడ్వాన్స్‌లు పొందే సౌకర్యం కూడా ఉండదు. ఇలా ఎన్నో నష్టాలు ఉండడంతో పాత పెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఆ కంపెనీలు లాభాలు ఆర్జించడానికే..
ఉద్యోగుల జీతం నుంచి పది శాతం మినహాయించి వాటిని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ లైఫ్‌ వంటి వాటిల్లో పెట్టుబడి పెడతారు. ఇవి సీఆర్‌ఏ పరిధిలో పని చేస్తాయి. ఈ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఇతర దేశాల్లో నష్టాలు చవిచూసి.. ప్రస్తుతం మన దేశంలో వ్యాపారం చేసి విదేశాల్లో నష్టపోయిన వాటిని పూడ్చుకోవాలని చూస్తున్నాయని బాధిత సీపీఎస్‌ ఉద్యోగులు వివరిస్తున్నారు. వారి నష్టాలు పూర్తయితే గాని లాభాలు చూపించరని, అప్పటివరకు తమ జీతం నుంచి మినహాయించిన మొత్తాలు పెట్టుబడిగా పెట్టినా ఆ మొత్తమంతా నష్టపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

దశల వారీగా చెల్లింపు
ఉద్యోగి పదవీ విరమణ చేసిన వెంటనే తమ జీతం నుంచి మినహాయించిన మొత్తం, ప్రభుత్వం జత చేసిన పదిశాతం మొత్తం ఒకేసారి చెల్లించరని, పదవీ విరమణ చేసిన రోజున 60 శాతం మాత్రమే ఇస్తారని.. ఉద్యోగికి 70 ఏళ్లు నిండిన తరువాత మరో 20 శాతం, 80 ఏళ్లు నిండిన తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తారు. ఏ కారణంగానైనా 60 ఏళ్ల తరువాత 70 ఏళ్లలోపు సీపీఎస్‌ ఉద్యోగి మరణిస్తే 40 శాతాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చడం మాని ప్రభుత్వమే ఆ మొత్తాన్ని తమ వద్ద ఉంచుకొని భద్రత కల్పించాలని డిమాండ్‌ చేసినా పట్టించుకోకపోవడంతో ఆందోళన బాట పట్టామని స్పష్టం చేస్తున్నారు.

తప్పు కేంద్రంపై నెట్టేసేందుకే..
సీపీఎస్‌ విధానం రద్దు కేంద్రం పరిధిలో ఉందని సీఎం చెప్పడం కేవలం సాకు మాత్రమేనని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 2002లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి.. దీనిని రాష్ట్రాల్లో అమలు ఆయా ప్రభుత్వాలకు కేంద్రం వదిలేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు.. ఈ విధానం వైపు మొగ్గు చూపి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో 2004, సెప్టెంబర్‌ 1 నుంచి ఈ విధానం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఇటీవల ఛత్తీస్‌గడ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉద్యోగులు ఆందోళన చేయడంతో వీటిని పరిశీలించేందుకు కమిటీని నియమించాయి. ఈ నివేదిక ఆధారంగా శాసనసభలో తీర్మానించి కేంద్రానికి నివేదించేందుకు కూడా ఆయా ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చాయి. రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్యలే చేపట్టాలని కోరినా ఫలితం లేకపోయింది.

రూ.120 కోట్లకు పైనే ఆదాయం
ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్, జెడ్పీ ఉద్యోగులకు జెడ్పీ పీఎఫ్, ప్రైవేటు ఉద్యోగులకు ఈపీఎఫ్‌ వంటి సంస్థలు ఉండడం వల్ల భద్రత ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎస్‌ ఉద్యోగుల ద్వారా సంవత్సరానికి రూ.120 కోట్లకు పైగా సమకూరుతోందని, వడ్డీతో కలుపుకొంటే ఇది రూ.150 కోట్లకు పైబడుతుందని సీపీఎస్‌ ఉద్యోగులు వివరిస్తున్నారు.

జగన్‌ హామీతో భరోసా
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి ప్రకటించడంపై సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏదైనా హామీ ప్రకటించే మనస్తత్వం గల ఆయన.. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పడాన్ని స్వాగతిస్తున్నారు. జగన్‌కు సాధ్యమైనప్పుడు చంద్రబాబుకు ఎందుకు సాధ్యపడడం లేదని నిలదీస్తున్నారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని జన్మభూమిలో వినతి పత్రాలు ఇస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యేలు ఆదేశించడంపై బాధిత ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement